ఆ వెన్నెల రాత్రులు-19

Image design: Mallika Pulagurtha

అనుకున్నట్టే పాఠశాల కుటీరం నిర్మాణం శరవేగంగా జరిగింది. దాదాపు అరవై డెబ్భై మంది గ్రామస్థులు ఆ పనిలో పాల్గొన్నారు. ముందునుంచీ చేస్తూ వచ్చిన ఏర్పాట్లు పక్కన పెడితే, మొత్తం కట్టడం మూడురోజుల్లో పూర్తి చేసేసారు. ‘మూడు పగళ్ళు, మూడు రాత్రుళ్ళల్లో ఏది కట్టినా అది దేవాలయమే’ అని గ్రేస్ మేడం తనతో అన్నదని రోజా చెప్పింది. కొండరెడ్లు ఇళ్ళు కట్టుకున్నట్టే బడి గోడల్నీ, అరుగుల్నీ ఎర్రమన్నుతో అలికారు. అరుగుల చుట్టూ తెల్లటి చుక్కల వరస ముగ్గు పెట్టారు. గోడలమీద పొడుగ్గా పూలతీగెల్లాగా తెల్లటిగీతలు గీసారు. ఆ పాకని నిజంగానే ఒక పొదరిల్లుగా మార్చేసారు.  పిల్లలు కువకువలాడటంకోసం తల్లిపక్షి గూడు కట్టుకున్నట్టుగా తమ పిల్లలకోసం ఆ ఊరంతా అందమైన పిచికగూడు కట్టుకుంది. నిజంగానే దేవుడిమందిరంలానే కట్టారు దాన్ని. ఒక వంటపాక కూడా కట్టారు. చుట్టూ కంచె పెట్టారు. రామనవమి పందిరిలో రామకోవెల ముందు కొంత భాగం వదిలిపెట్టి తక్కిన పందిరి మొత్తం అక్కడ నుంచి తీసి ఇక్కడ మళ్లా పందిరి వేసారు. రంగుకాగితాలు కట్టారు. తోరణాలు కట్టారు. గ్రామఫోను పెట్టే, సినిమాపాటలూ లేవు తప్ప మొత్తం మరోసారి రాముడి కల్యాణం చేసినట్టే ఉంది అవాళ.

వేసవి సెలవులు ఇచ్చేముందు చివరి పనిదినం కన్నా ఒకరోజు ముందే అంటే ఏప్రిల్ 22 నాడు ఆ బడి కుటీరానికి ప్రారంభోత్సవం జరిగింది. డా.మిశ్రా అదంతా పెద్ద వేడుకలాగా చేయించాడు. బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసరుని దగ్గరుండి తీసుకొచ్చాడు. ఊళ్ళో ఉన్న పెద్దమనుషులందరినీ ఆహ్వానించేడు. టీచర్లు పిల్లల్ని విలేజిచావడినుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కొత్త స్కూల్లో ప్రవేశం చేయించి కూచోబెట్టారు.

పెద్దమనుషులూ, బిడివో గారూ మాట్లాడేక డా.మిశ్రా కూడా క్లుప్తంగా ప్రసంగించాడు. గిరిజనుల అభ్యున్నతికి విద్యని మించిన ఆయుధం మరొకటిలేదనీ, చదువుకుంటేనే వాళ్ళకి సాధికారికత సిద్ధిస్తుందనీ చెప్పాడు. ఆ ఇంగ్లిషు ప్రసంగాన్ని తెలుగుచేసే అవకాశం నాకు లభించింది.

ఆ సాయంకాలం మళ్ళా మేమంతా బడి పాక దగ్గర మరో సారి కలుసుకున్నాం. మాలో ఏదో చెప్పలేని సంతోషం పొంగిపొర్లుతూ ఉంది. ఏదో ఒక చిన్న సాయం ఆ గ్రామానికీ, ఆ పిల్లలకీ మా వంతుమేము చెయ్యగలిగామన్న భావం మాకు కొత్తబలాన్నిస్తూ ఉంది. కాని మిశ్రా ముఖంలో ఏమంత సంతోషం లేదు.

‘ఇంతా చేసాం గాని, పిల్లలకి సిట్టింగు ప్లాంకులు అవసరమని తట్టలేదు చూడండి. ఎంత వయసొస్తే ఏం లాభం? ఎంత అనుభవముందని చెప్పుకుంటే ఏం లాభం’ అని మిశ్రా తనని తాను తిట్టుకుంటూ ఉన్నాడు.

‘దానికేముంది సార్! మనకి ఎవరో ఒక దాత దొరక్కపోడు’ అన్నాడు రాజు.

అతనా మాట అనగానే మిశ్రా కళ్ళల్లో ఆశకనిపించింది.

‘ఈ సమ్మర్ లో మనం ఇక్కడ మొక్కలు పెంచలేం గాని, కనీసం కంచె చుట్టూ టేక్ ప్లాంట్స్ వేయిస్తే బాగుంటుంది. జోసెఫ్ గారితో మాట్లాడాలి’ అన్నాడు మిశ్రా.

‘నేను బాబాయ్ కి ఇవాళే చెప్తాను’ అంది రోజా.

ఒక్క విద్యావంతుడు ఒక గ్రామంలో ఒక్క రోజు ఉన్నా ఆ గ్రామంలో మార్పు రాక తప్పదని డా.మిశ్రా అన్నాడు. కాని ఆ రోజు  మా నలుగురితో పాటు రాజు ‘గాంగ్ ‘మరో అయిదారుగురు యువకులున్నారు. నాగరాజు, తాతయ్యలు, బాబూరావు, సత్యనారాయణ, రాజన్నదొర, ఇంకొందరి పేర్లు నాకు గుర్తులేవు. మూడు రోజుల్లో మిరాకులస్ గా బడికి కుటీరాన్ని లేపిన చేతులు వాళ్ళవి.

‘మొన్న మేము చొయిత్ర పొరొబ్ డాన్స్ కి వెళ్ళాం. రాజు మీకు చెప్పే ఉంటాడు’ అన్నాడు మిశ్రా నాతో.

‘అవును సార్. చాలా జెలసీగా అనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే. మాకు చెప్తే మేము కూడా వచ్చి ఉండేవాళ్ళం కదా. అవునూ! మీరు ట్రైబల్స్ కి జరిగే ఇన్ జస్టిస్ గురించి కదా ఎక్కువ ఆలోచిస్తుంటారు, మరి ఆ రిచ్యువల్ చూడటానికి ఎందుకు వెళ్ళారు?’ అనడిగాను. కావాలనే. ఎందుకనో మిశ్రాని చూస్తుంటే కాలేజిలో నా సీనియర్ స్టూడెంట్ ని చూసిన భావమే కలుగుతూ ఉంది నాలో. ప్రొఫెసర్ సేన్ గుప్తతో ఇలా మాట్లాడగలనని అనుకోను.

మిశ్రా ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నాడు. బహుశా ఏదో ఆలోచిస్తూ ఉండవచ్చు. నేనే సంభాషణ మరికొంత పొడిగించాను.

‘మీరు ఈ ఊళ్ళో ప్రజలు రామకోవెల మీద చూపించిన శ్రద్ధ స్కూలు మీద చూపించలేదని అన్నారు. మీ మాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నాకు ఒక కారణం దొరికింది. మొన్న ఒక రోజు మా ఇంట్లో ఉన్న పిల్లల టెక్స్ట్ పుస్తకాలు మొత్తం చదివాను. అందులో ఈ గిరిజనుల గురించీ, ఈ అడవి గురించీ, ఈ కొండల గురించీ, మీరు చెప్తున్న భూమిసమస్యల గురించీ ఏమీ లేదు. కనీసం ఒక చింతచెట్టు గురించీ, లేదా మీరు వెళ్లారే ఆ ఇటిఞ్ పండగ గురించీ ఒక్క వాక్యం కూడా లేదు. నాకనిపించింది, ఈ గిరిజనులకి ఈ బడి గురించి ఏమీ తెలీదు. దీనికీ వాళ్ళకీ ఏమీ సంబంధం లేదు. ఒకవేళ ఈ బడిలో తమ గురించీ, తమ జీవితం గురించీ పిల్లలకి చెప్తారని తెలిస్తే, ఈ ఊళ్ళో వాళ్ళు ఎప్పుడో ఈ బడికి పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఉండేవారు కదా అనిపించింది’ అన్నాను.

మిశ్రా నా మాటలు శ్రద్ధగా విన్నాడు. వింటున్నంతసేపూ కన్నార్పకుండా నన్నే చూస్తూ ఉన్నాడు.

‘మొత్తం టెక్స్ట్ బుక్స్ చదివేరా! ఏ క్లాసులు?’

‘ఫిఫ్త్ క్లాసు, థర్డ్ క్లాస్. తెలుగు, లెక్కలు, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం అన్నీ చదివేను. ఒక్క బొమ్మగాని, చివరికి లెక్కల్లో ఒక్క ఎగ్జాంపుల్ కూడా గిరిజన జీవితానికి చెందింది లేదు’ అన్నాను.

డా.మిశ్రా తాను కూచున్నచోటునుంచి లేచి వచ్చి అభినందనపూర్వకంగా నాకు షేక్ హాండిచ్చాడు.

‘నౌ ఐ అండర్ స్టాండ్ వై ప్రొఫెసర్ వజ్ సో అప్రిషేయిటివ్ ఆఫ్ యూ’ అని అన్నాడు.

కాని నేను చెప్పాలనుకున్నది ఆపలేదు.

‘కాబట్టి నేను చెప్తున్నదేమిటంటే, ట్రైబల్ కల్చర్ ని పక్కన పెట్టి ట్రైబల్ ప్రోబ్లమ్స్ ని మనం అడ్రస్ చెయ్యలేం. ఆ పుస్తకాల్లో కనీసం కొన్ని పాఠాలేనా ట్రైబల్స్ గురించి ఉండి ఉంటే వాళ్ళు ఈ బడిని ఇంత పట్టించుకోకుండా వదిలిపెట్టేసి ఉండేవారు కాదు కదా! ‘ అన్నాను.

మిశ్రా చిరునవ్వాడు. ఒక మనిషి అంత ఆహ్లాదపూర్వకంగా చిరునవ్వు నవ్వగలడని నాకు తెలీదు.

‘ఓ! నౌ ఐ గెట్ యు. వచ్చినప్పణ్ణుంచీ నీ మనసులో నా మీద ఒక ముద్ర పడిపోయింది. నేను ట్రైబల్స్ గురించి మాట్లాడుతున్నానుగాని, వాళ్ళ కల్చర్ ని పట్టించుకోవడం లేదని. ఐ థింక్, ఐ షుడ్ హేవ్ ప్రెజెంటెడ్ మైసెల్ఫ్ ఇన్ బెటర్ లైట్. విమలా, స్కూల్ యాజ్ ఎ కాన్సెప్ట్, యాజ్ ఏన్ ఇన్ స్టిట్యూషన్ ఈజ్ ఎ టోటల్లీ మోడర్న్ అండ్ వెస్టెర్న్ కాన్సెప్ట్. కాని ఎడ్యుకేషన్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ ఆప్ నాలెడ్జి, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, నాట్ న్యూ టు ట్రైబల్ లైఫ్. మీరు చెప్తున్నదాంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆ మాటకొస్తే ఒకటి  రెండు పాఠాలేమిటి? మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ ట్రైబల్ రిలేటెడ్ గా ఉండాలంటాను. అసలు ఒక స్టాండర్డ్ యూనివర్సల్ టెక్స్ట్ బుక్ అల్వేస్ గోస్ అగెనెస్ట్ ద టెనెట్స్ ఆఫ్ ట్రైబల్ లెర్నింగ్. అందరూ చదువుకునే చదువు చదువుకోవడం వల్లనే కదా, ట్రైబల్ చిల్డ్రన్ అటు నాన్ ట్రైబల్ లైఫ్ కీ చెందడం లేదు, ఇటు ట్రైబల్ లైఫ్ కీ చెందడం లేదు. రూత్ బెనెడిక్ట్ ఒక మాటన్నది. ద పర్పస్ ఆఫ్ యాంత్రొపాలజి ఈజ్ టు మేక్ ద వరల్డ్ సేఫ్ ఫర్ హ్యూమన్ డిఫరెన్సెస్ అని ‘ అని ఆగాడు. తన చుట్టూ ఉన్న వాళ్ల వేపు చూసాడు. తన మాటలు మరీ వాళ్ళకి అర్థం కాకుండా పోతున్నాయేమో అని సందేహించాడు. మళ్ళీ ఇలా అన్నాడు:

‘కాబట్టి నేను కలగనే గిరిజన పాఠశాలలో లెసన్స్, సిలబి, అసలు కరికులం మొత్తం ట్రైబల్ పేరెంట్సే నిర్ణయించుకుంటారు. వాళ్ళూ, టీచర్లూ, పిల్లలూ కలిసి తమ టెక్స్ట్ బుక్స్ తామే రాసుకుంటారు. దిస్ ఈజ్ మై డ్రీమ్. బట్, ఆ రోజు రావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ముందు కనీసం పిల్లలు తలదాచుకోడానికి ఒక నీడా, కూచోడానికి నేలబల్లలూ కావాలి కదా. అందుకని కల్చర్ కన్నా ముందు ఇన్ జస్టిస్ గురించి మాట్లాడాలంటాను.  రాజు మీకు చెప్పే ఉంటాడు, యు మే నాట్ ఫైండ్ యాన్ ఆర్డెంట్ వర్షిపర్ ఆఫ్ ట్రైబల్ గాడ్స్ అండ్ గాడెసెస్  దేన్ మీ’ అని అన్నాడు.

అప్పుడు డా.మిశ్రా మళ్ళా అక్కడున్న యూత్ ని మరొకసారి మనసారా అభినందించాడు. అప్పుడొకరు ‘ మా ఊళ్ళో అన్నిటికన్నా పెద్ద సమస్య సారా దుకాణం. దాన్ని మూసెయ్యలేమా?’ అనడిగారు. రాజు ఆ ప్రశ్నని ఇంగ్లిషులో చెప్పేటప్పటికి డా.మిశ్రా ముఖంలో ఒకింత విచారం అలముకుంది.

డా.మిశ్రా ఏమి సమాధానం చెప్తాడా అని కుతూహలంగా ఎదురు చూసాను. ట్రైబల్స్  వాళ్ల సారా వాళ్ళు కాచుకోవచ్చంటాడా లేకపోతే ప్రభుత్వాధికారులకి చెప్పి సారా దుకాణం మూయించేమంటాడా?

మిశ్రా ఆ రెండూ చెప్పలేదు.

‘అందుకే నేను చదువు గురించి మాట్లాడుతున్నాను. సారా తాగడం వల్ల వచ్చే దుష్పరిణామాల్ని మనం మహిళలకు చెప్పగలిగితే వాళ్ళే తమ భర్తల్ని మార్చుకోగలుగుతారు. లేకపోతే, ఆ దుకాణం మూసెయ్యమని సత్యాగ్రహం చేస్తారు’ అన్నాడు.

‘ఆ సత్యాగ్రహం మనమే ఎందుకు చెయ్యకూడదు?’ అనడిగారు ఒకరు.

డా.మిశ్రా మళ్లా చిరునవ్వాడు.

‘గిరిజనుల విషయాలకు వచ్చేటప్పటికి అందరూ చేసే పొరపాటు ఇదే. వాళ్లని సోషల్ ఇన్ జస్టిస్ నుంచి కాపాడటానికి ప్రభుత్వమో, లేదా నక్సలైట్లో బాధ్యతపడాలనుకుంటారు. కాని నా దృష్టిలో అది గిరిజనుల్ని మరింత డిపెండెంట్ చెయ్యడం. అందుకే గాంధీగారు, ప్రజలదగ్గరకు వెళ్లండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్లని ట్రైన్ అప్ చెయ్యండి అని చెప్పారు. గిరిజనుల సమస్యల్ని గిరిజనులే హాండిల్ చేసుకోగలిగే స్థితికి రావాలి. దాన్నే స్వరాజ్ అంటారు’ అన్నాడు డా.మిశ్రా.

అర్థమయింది. మిశ్రా వచ్చేక గాంధీగార్ని కూడా మా గాంగ్ లో ఒక మెంబరుగా మారుస్తున్నాడు!

‘అవును సార్. మీరు చాలా ప్రాక్టికల్. అదే నాకు చాలా నచ్చింది మీలో ‘ అని అన్నాడు రాజు.

‘ప్రాక్టికల్’- ఆ పదం వినగానే నాకు వెంటనే సేన్ గుప్త గుర్తొచ్చాడు. డా.మిశ్రా ప్రాక్టికల్ అయితే సేన్ గుప్త ఏమిటట? బహుశా ఆయన్నొక డ్రీమర్ అంటాడేమో రాజు. కాని ఇప్పుడు ఆలోచిస్తే సేన్ గుప్తా మరింత ప్రాక్టికల్ ఏమో అనిపిస్తూ ఉంది. ఒక స్టోయిక్కులాగా ఆయన తన చేతుల్లో ఉన్నదేది, తన చేతుల్లో లేనిదేది స్పష్టంగా తెలిసినవాడనీ, తన చేతుల్లో లేనిదాని జోలికి పోకుండా, తాను ఏది చెయ్యగలడో దాన్ని చెయ్యడం మీదనే దృష్టిపెడుతూ వచ్చాడనీ ఎందుకనుకోకూడదు? నిజానికి డా.మిశ్రా కన్నా డ్రీమర్ ఎవరుంటారు? చాలా ప్రాక్టికల్ గా కనిపించే డ్రీమర్ కాదా? అతని కలలకీ, మెలకువలకీ విరామమంటూ ఉంటుందా? తల్లిదండ్రులూ, పిల్లలూ, ఉపాధ్యాయులూ కూచుని తమ పాఠశాల సిలబస్ తామే రాసుకుని, తమ వార్షిక ప్రణాళిక తామే రూపొందించుకునే ఆ దృశ్యం ఎంత అందమైన కల! డా.మిశ్రా తన జీవితకాలంలో ఆ కలని తప్పకుండా నెరవేర్చుకోగలడు. కానీ, ఆ కల నిజమైన రోజున, ఇదుగో, స్కూలు బిల్దింగు కట్టినందుకు సంతోషించడం మాని నేలబల్లల సంగతి మర్చిపోయేమే అని బాధపడుతున్నట్టే, ఇంకేదో మర్చిపోయానని బాధపడుతుంటాడు కూడా. ప్చ్! డా.మిశ్రా ఒక ఎటర్నల్ డ్రీమర్ అనుకున్నాను.

‘మనం కొంతసేపు నడుద్దామా?’ అనడిగాడు మిశ్రా.

అంతా స్కూల్లోంచి బయటికొచ్చాం. అప్పటికే చీకటి పడుతూ ఉంది. అంతా ఏటిదాకా నడిచాం. ఏటి దగ్గర వంతెన మీద కూచున్నాం. ఆ మసకచీకటిలో ఏటిపాయ తెల్లటి చారలాగా ఉంది. పక్కన ఇసకలో రెండు కొంగలు ధ్యానంలో ఉన్నాయి. మామిడిచెట్లు ఫలభారనమ్రాలుగా ఉన్నాయి. ఏటికవతల జీడిమామిడితోటల్లోంచి జీడిమామిడిపండ్ల వాసన గాల్లో తేలివస్తూ ఉంది.

‘ఈ ఊళ్ళో ఇంతమంది చదువుకున్న యువకులు, ఇంత మంది యనర్జిటిక్ యంగ్ మెన్ ఉంటారని ఊహించనే లేదు’ అన్నాడు మిశ్రా.

నేను కూడా ఆ యువకులవైపు చూసాను. వాళ్ళల్లో ఉత్సాహం పొంగిపొర్లుతూ ఉంది. వాళ్ళకి కావలసిందల్లా దారి చూపించే ఒక మనిషి. వాళ్ళ శక్తిసామర్థ్యాలకు బోదెలుకట్టి ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క కుటుంబపు పాదులోకీ ప్రవహింపచెయ్యగలిగిన మనిషి.

‘మీ మాటలు వింటుంటే నాకు ప్రొఫెసర్ సేన్ గుప్త చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి’ అన్నాను.

‘ఏమిటవి ?’- డా.మిశ్రా కళ్ళు ఆ చీకట్లో మెరుస్తున్నాయి.

‘ఇలాంటి ఒక కృష్ణపక్షపు రాత్రి మేము ఇలానే ఈ ఏటిదగ్గరకు వచ్చినప్పుడు పైన ఆకాశంలో కనిపిస్తున్న నక్షత్రాల్ని చూస్తూ ఆయన అన్నాడు  కదా: ఈ క్షణాన నేనే కనక యువకుడిగా మారిపోతే ప్లేటో లాగా ఈ ఊళ్ళో ఒక అకాడెమీ ప్రారంభిస్తాను. అందులో కొందరు రాళ్ళని పరిశీలిస్తారు. కొందరు చెట్లని. కొందరు పక్షుల్ని, కొందరు నక్షత్రాల్ని పరిశీలిస్తారు. అంతా కలిసి ఇక్కడి గిరిజనుల్తో కలిసి మమేకమై వారి జీవితంలో పాలుపంచుకుంటారు  అని అన్నాడు. ఎంత గొప్ప డ్రీమ్ అది’ అని అన్నాను.

‘ఇఫ్ యూ పర్మిట్ మీ, ఐ వుడ్ యాడ్ వన్ మోర్ కాంపొనెంట్ టు హిజ్ డ్రీమ్’ అన్నాడు డా.మిశ్రా  ‘మరేమీ లేదు. ఆ అకాడమీలో ప్రతి ఒక్కరూ ప్రతి సాయంకాలం పదేసి మంది గిరిజనులకి రాత్రిబడి నడుపుతుంటారు కూడా’ అన్నాడు, చిరునవ్వుతూ.

కృష్ణపక్షపు తదియ రాత్రి. చంద్రుడు ఈ పాటికి కొండమీదకు చేరి ఉంటాడు. మా అందరినీ ఒక నావలో ఎక్కించి నదిమీద ప్రయాణం మొదలుపెట్టించినట్టు వేసవికాలపు మొదటి మారుతం వీచింది. దక్షిణం వేపు కొండమలుపులో టేకు చెట్లు కొత్తచిగుర్లు తొడిగి ఉంటాయి. ఏటికి తూర్పువేపు యూకలిప్టస్ తోటల్లో ఆకుల్లో పత్రహరితం కాదు, సుగంధతైలం తయారవుతున్నట్టుంది, ఆ దారిన నడిచిన ప్రతి ఒక్కరికీ అయాచితంగా స్వస్థత చేకూర్చే గాలి వీస్తున్నది.

ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అంతా మౌనంగా ఉన్నారు. వంతెన కింద ఏటి అలలు చిన్న చిన్న రాళ్ళమీంచి విరిగిపడుతున్న చిరు గలగల తప్ప మరే చప్పుడూ లేదు. రోజంతా ఊరికీ, అడవికీ, అడవికీ, ఊరికి తిరిగింది తిరిగినట్టుగా పచార్లు చేసి పాటలు పాడిన కోయిల ఈ రాత్రికి ఇక గూటికి చేరుకుంది.

‘వనలత ఉండి ఉంటే ఇప్పుడొక పాట పాడి ఉండేది’ అన్నాడు రాజు.

‘వనలత పాటలు పాడతారా?’ అనడిగాడు మిశ్రా.

నేనేదో చెప్పే లోపు, ‘నేను కూడా పాడతాను’ అనే తీపిమాటలు వినబడ్డాయి.

బార్బీ కళ్ళతో నవ్వుతూ రోజా.

‘నువ్వు పాటలు పాడతావా!’అన్నాడు రాజు. వాళ్ళు ఎప్పుడంత దగ్గరైపోయారా అనుకుంటూ ఉన్నాను.

‘మా హైస్కూలు మ్యూజిక్ టీచరు సుగుణ నేర్పించారు. ఎప్పుడో గాని పాడాలనిపించదు. ఇప్పుడు ఈ ఏటినీ, ఈ చుక్కల వెలుగునీ, మిమ్మల్నీ చూస్తుంటే పాడాలని ఉంది’ అని గొంతు సవరించుకుని-

‘ఈ రేయి నన్నొల్లనేరవా రాజా’ అంటో ఎత్తుకుంది.

‘ఓహ్! ఎంకిపాటలు!’ అన్నాడు రాజు చప్పట్లు కొడుతూ.

ఎంకి పాటలంటే ఏమిటో నాకు తెలీదు. నేనెప్పుడూ వినలేదు. కుతూహలంగా రోజానే చూస్తున్నాను.

ఆమె చూపులు మా మీద లేవు. ఆ ఏటిమీద ఉన్నాయి. ఆమె పాడటం మొదలుపెట్టింది.

ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా

ఎన్నెలల సొగసంత ఏటిపాలేనటర!

ఆకాశమేమూలొ అణిగిపోయిన రేయి

ఏటి సెందురుడల్లె సాటుసూపుల కులికి-

ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా

ఎన్నెలల సొగసంత ఏటిపాలేనటర!

ఆకాశమోతీరు అడిలిపోయిన రేయి

మాటలెరుగని పాప- ఏటిగిలగిల సూపి-

ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా

ఎన్నెలల సొగసంత ఏటిపాలేనటర!

ఆకాశమావొరస ఆవులించిన రేయి

మిసమిసలతో ఏటి పసలతో ననుసుట్టి

ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా

ఎన్నెలల సొగసంత ఏటిపాలేనటర!

యెలుతురంతా మేసి ఏరు నెమరేసింది

కలవరపు నా బతుకు కలతనిదరయ్యింది-

ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా

ఎన్నెలల సొగసంత ఏటిపాలేనటర!

అని ఒక నిమిషం పాటు ఆగింది. చుట్టూ ఉన్న పిల్లలు పాట అయిపోయిందనుకుని చప్పట్లు కొట్టారు. అప్పుడు నెమ్మదిగా చివరి చరణం వినిపించింది.

ఒక్కతెను నాకేల ఓపజాలని సుకము

ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా

ఎన్నెలల సొగసంత ఏటిపాలేనటర!

నేను విభ్రాంతిగా ఆ అమ్మాయినే చూస్తూ ఉండిపోయాను. ఆ బార్బీ డాల్ కి తెలుసా తానేమి పాడిందో? బహుశా ఆ సుగుణ టీచర్ కి ఆ పాట ఏమేరకో అనుభవానికి వచ్చి ఉంటుంది. ఆమె తన హృదయావేదన అంతా ఆ పాటలో కుక్కిపెట్టి తన శిష్యురాలికి నేర్పి ఉంటుంది. ఎక్కడో ఏదో పండు చిట్లి ఒక విత్తనం ఏ పక్షి రెక్కలకో తగులుకుని ఎంతో దూరం ప్రయాణించేక ఏ ఏటి ఒడ్డునో సారవంతమైన నేలలో రాలిపడ్డట్టు ఆ పాట ఇన్నాళ్ళకు ఇక్కడ ఈ హృదయాల్లోకి వచ్చిపడింది. ఆ కవి వేదనా, ఆ మ్యూజిక్ టీచర్ వేదనా కలిసి ఆ గొంతులో భద్రంగా అంతదూరం ప్రయాణించేయన్నమాట.

‘ఎక్సలెంట్ ‘ అన్నాడు రాజు. అప్పుడు ఆ పాటని ఇంగ్లిషులో తర్జుమా చేసి మిశ్రాకి చెప్పబోయాడుగాని, అతనికి చాతకాలేదు. ‘ఏమిటి ఫస్ట్ లైన్ ? ఇంకోసారి చెప్పు’ అని రోజాని అడుగుతుంటే మిశ్రా అతణ్ణి వారించాడు. ‘ఐ గాట్ ఇట్. లెట్ ద సైలెన్స్ రిమైన్’ అన్నాడు.

కోకిల గూటికి వెళ్ళిపోలేదు. రోజా గొంతులోకి వచ్చి కూచుంది అనుకున్నాను.

చాలాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. డా.మిశ్రా కోరుకున్నట్టే ఒక ప్రశాంత నిశ్శబ్దం, పవిత్ర నిశ్శబ్దం అక్కడ అలముకున్నాయి.

నెమ్మదిగా ఊరు బాట పట్టాం. ముందు జోసెఫ్ గారి ఇంటిదగ్గర రోజాని వదిలిపెట్టాం. రాజూ, తక్కిన పిల్లలూ డా.మిశ్రాతో వకుళకుటికి వెళ్ళిపోయారు. నేను ఒక్కర్తినీ ఇంటివైపు అడుగులువేసాను.

అప్పటికి చంద్రుడు కొండమీంచి తొంగిచూస్తున్నాడు. ఇళ్ళకప్పులమీదా, చెట్ల కొమ్మలమీదా, రోడ్డుమీదా తెల్లటి గీతలు గీస్తున్నాడు. నా మనసు ఇంతకు ముందు ఎప్పుడూ ఎరగనంత మెత్తగా అయిపోయింది. సినిమా పాటలు తప్ప మరే కవిత్వమూ విని ఉండని నాకు ఆ ఊళ్ళో ఆ కొన్ని రోజుల్లోనే ఎంత గొప్ప కవిత్వం పరిచయమైంది! టాగోర్, నజ్రుల్, లాలన్, ఇప్పుడు ఎంకిపాటలు. ఆ పాటలో, ఆ మాటల్లో ఏదో ఉంది. వెన్నెల బయట కాస్తూ ఉంటే ఆ పాట లోపల వెన్నెల కాయిస్తున్నట్లుగా ఉంది.

ఇంటికి వెళ్ళాక, అన్నం తిన్నాక, పడుకున్నాక కూడా ఆ పాట నాతోటే ఉందనిపించింది. చిన్న పిట్ట ఒకటి అడవిలోంచి ఎగిరివచ్చి నా భుజం మీద వాలినట్టూ, నాతో పాటు ఇంటికి వచ్చి, నా పక్కనే పడుకున్నట్టూ అనిపించింది.

ఆకాశం ఏ మూలనో అణిగిపోయిన రేయి, ఆకాశం ఏ మూలనో ఆవులించిన రేయి- ఆ మాటలు నన్ను వదల్లేదు. ‘యెన్నెలంతా మేసి యేరు నెమరేసింది-‘ బహుశా ఆ పాట ఆ ఏటి ఒడ్డున వినడం నా జీవితంలోకెల్లా గొప్ప భాగ్యమనుకుంటాను.

ఆ పాట విని నలభయ్యేళ్ళ పైనే కాలం గడిచిపోయింది. కాని ఎప్పుడేనా ఆ మాటలు గుర్తొచ్చినప్పుడు, ఆ ఏరు, ఆ ఏటిమిసమిసలు, ఆ మామిడిచెట్లు, ఆ యూకలిప్టస్ తోట, రోడ్డు మలుపులో ఆ గ్రామదేవత గుడి, ఆ టేకు ప్లాంటేషనూ, ఆ బహుళపక్షపు తదియరాత్రి, కొండమీద చంద్రుడు దిగగానే మమ్మల్ని పలకరిస్తో తాకిపోయిన వసంతమారుతం-మరొక జన్మంటూ ఉంటే, ప్రతి రోజూ ఆ ఏటి ఒడ్డున కూచోగలిగే జీవితమే కావాలనుకుంటాను.

జీవితం పొడుగునా రకరకాల అనుభవాలు సంప్రాప్తమవుతుంటాయి. కొన్ని పూర్తిగా లభిస్తాయి.కొన్ని తెగిపోయినవి ఉంటాయి, కొన్ని విరిగిపోయుంటాయి. వాటన్నిట్లోనూ ఏరుకోగలిగినన్ని ఏరుకుని, ఆ పుల్లా, పుడకా తో మనం గూడు కట్టుకుంటాం. దాన్ని మన జీవితమని చెప్పుకుంటాం. కాని అందులో ఒక కోకిల చేరి కూజితం వినిపించినప్పుడు కదా ఆ గూడు గుడిగా మారేది. అప్పుడు ఈ జీవితం ఏమిటి, ఎందుకు, నేనెవర్ని, ఏం చెయ్యాలి, ఏమి తీసుకోవాలి, ఏది వదిలిపెట్టాలి లాంటి ప్రశ్నలన్నీ అదృశ్యమైపోతాయి. ఏదో కావాలన్న కోరికనుంచి, ఏదో పొందాలన్న ఆరాటం నుంచి, ఏదో పోగొట్టుకున్నామన్న వేదననుంచి ఒక్కసారిగా బయటపడిపోతాం. ఇక అప్పుడు-

ఒన్లీ ద సైలెన్స్ రిమైన్స్.

23-4-2023

18 Replies to “ఆ వెన్నెల రాత్రులు-19”

 1. మీరు గిరిజనులకు చేసిన కృషి గురించి లబ్ధిపొందిన గిరిజనులలో ఎవరో ఒకరు మీగురించి ఇలా రాస్తే చదవాలన్న ఆసక్తి కలుగుతున్నది.

   1. Satya Sai - Vissa Foundation సత్యసాయి - విస్సా ఫౌండేషన్ says:

    పై ప్రశ్నకు సమాధానం ఇదేనేమో భధ్రుడు గారూ “ఒన్లీ ద సైలెన్స్ రిమైన్స్”.

 2. జీవితం పొడుగునా రకరకాల అనుభవాలు సంప్రాప్తమవుతుంటాయి. కొన్ని పూర్తిగా లభిస్తాయి.కొన్ని తెగిపోయినవి ఉంటాయి, కొన్ని విరిగిపోయుంటాయి. వాటన్నిట్లోనూ ఏరుకోగలిగినన్ని ఏరుకుని, ఆ పుల్లా, పుడకా తో మనం గూడు కట్టుకుంటాం. దాన్ని మన జీవితమని చెప్పుకుంటాం. కాని అందులో ఒక కోకిల చేరి కూజితం వినిపించినప్పుడు కదా ఆ గూడు గుడిగా మారేది. అప్పుడు ఈ జీవితం ఏమిటి, ఎందుకు, నేనెవర్ని, ఏం చెయ్యాలి, ఏమి తీసుకోవాలి, ఏది వదిలిపెట్టాలి లాంటి ప్రశ్నలన్నీ అదృశ్యమైపోతాయి. ఏదో కావాలన్న కోరికనుంచి, ఏదో పొందాలన్న ఆరాటం నుంచి, ఏదో పోగొట్టుకున్నామన్న వేదననుంచి ఒక్కసారిగా బయటపడిపోతాం. ఇక అప్పుడు-

  ఒన్లీ ద సైలెన్స్ రిమైన్స్.
  ఈ భావ సారానికి వేవేల నమస్సులు ప్రభూ..

  భౌగోళిక నేపథ్యాన్ని మొదలు జీవితాన్ని అభ్యుదయ వాదాన్ని సమ్మిళితం చేసి మానవీకరించడం వంటి వ్యాఖ్యానం చదివానీరోజు. బహుశా మీరన్న ఆ మాట గిరిజన సంస్కృతి వారి చదువులో రావడం ఎంత అవసరమో..21 శతాబ్దం నిపుణత పేరిట మాతృభాష మాధుర్యాన్ని వారి వాస్తవ జీవిత సౌరభాన్ని పిల్లల అభ్యసన వాతావరణం నుండి బలవంతంగా పెకిలించివెస్తున్నామా అనిపిస్తోంది సర్…

 3. “ఎక్కడో ఏదో పండు చిట్లి ఒక విత్తనం ఏ పక్షి రెక్కలకో తగులుకుని ఎంతో దూరం ప్రయాణించేక ఏ ఏటి ఒడ్డునో సారవంతమైన నేలలో రాలిపడ్డట్టు   పాట, ఆ కవి వేదనా ,,  కలలకీ, మెలకువలకీ విరామం లేని డ్రీమర్  తపన, జనహృదయాల్లోకి వచ్చిపడాలి—పడితె—–ఎంత గొప్ప డ్రీమ్!!!!!”     —-టు మేక్ ద వరల్డ్ సేఫ్ ఫర్ హ్యూమన్ డిఫరెన్సెస్—-“

 4. “ఎక్కడో ఏదో పండు చిట్లి ఒక విత్తనం ఏ పక్షి రెక్కలకో తగులుకుని ఎంతో దూరం ప్రయాణించేక ఏ ఏటి ఒడ్డునో సారవంతమైన నేలలో రాలిపడ్డట్టు ఆ పాట ఇన్నాళ్ళకు ఇక్కడ ఈ హృదయాల్లోకి వచ్చిపడింది.”

  A moment of Epiphany, one we neglect to realize unless for experiencing some erudite writing.

  This story/bigstory/novella/novel or whatever you and reader might like to name, is becoming old wine by the day 🙏

 5. మీ రచన ద్వారా చెట్టు, కొండ, పూవు, కాయ, ఏరు, ఊరు, పాట, అడవి, పక్షులు, వెన్నెలా కొత్తగా పరిచయమవుతున్నాయి, సర్! 🙏🏽

 6. గిరిజన గ్రామాల వాస్తవ పరిస్థితి చిత్రిస్తూనే.. ఎలా ఉంటే బాగుండేదో “కలలు” గా వివరిస్తున్నారు. ఆ కలలు వాస్తవం కాకపోవడమే విషాదం. మన బడులలో చెప్పే పాఠాలు మన జీవితానికి ఎంత దూరం గా ఉంటాయో.. చక్కగా చెప్పారు.

 7. ఎక్కడో ఏదో పండు చిట్లి ఒక విత్తనం ఏ పక్షి రెక్కలకో తగులుకుని ఎంతో దూరం ప్రయాణించేక ఏ ఏటి ఒడ్డునో సారవంతమైన నేలలో రాలిపడ్డట్టు ఆ పాట ఇన్నాళ్ళకు ఇక్కడ ఈ హృదయాల్లోకి వచ్చిపడింది.”
  ఎంత హృద్యంగా ఉందో ఈ ఆలోచన.
  ఇలా మా హృదయాల్లోకి వచ్చి పడింది ఇన్నాళ్లకు

 8. మొదలంతా గిజూభాయ్ కల, చివరంట యెంకి మాయ.. ఎన్నల సొగసు ఏటి పాలు కాలేదిచ్చట

Leave a Reply

%d bloggers like this: