ఆ వెన్నెల రాత్రులు-18

Image design: Mallika Pulagurtha

ప్రతి నావికుడూ ఒక రత్నాలదీవిని వెతుక్కుంటూనే బయల్దేరతాడు. నేను కోరుకుని బయల్దేరకపోయినా నేను చేరుకున్న ఆ గ్రామం ఒక రత్నాలదీవి. ఎక్కడెక్కడినుంచో ఎవరెవరో గురువులు వచ్చి ఆ తలుపులు యథేచ్ఛగా తెరిచి నన్ను ఆ గదులంతటా తిప్పి చూపించారు. కొన్ని నెలలు మాత్రమే ఉండివచ్చిన నాకే అన్ని రత్నాలు అందిస్తే, ఆ ఊరు, చిన్నప్పణ్ణుంచీ అక్కడే పుట్టి పెరిగిన రాజులాంటికి వాళ్లకి ఇంకా ఎంత భాండాగారం చూపించి ఉంటుంది! లేదా, ఆ రత్నాలన్నీ నాకోసమేనా? తరగతిలో ఎంతసేపు పాఠం చెప్తున్నా ఒక్క అక్షరమ్ముక్క కూడా రాయకుండా ఎంతసేపూ పలక గుండెకి హత్తుకుని కూచుండే బిడ్డమీదనే ఉపాధ్యాయుడి దృష్టి ఉండేటట్టు, ఆ పాఠాలన్నీ నాకోసమేనా?

ఆ మర్నాడు డా.మిశ్రా నేరుగా మా ఇంటికి వచ్చేసాడు. కూర్చోడానికి కూడా టైమ్ లేదన్నట్టుగా వస్తూనే మమ్మల్ని తన దగ్గర ఉన్న లిస్టులో ఒక హౌస్హోల్డ్ రాండమ్ గా సెలెక్ట్ చెయ్యమన్నాడు. మమ్మల్ని అంటే నన్ను. రాజుకి అక్కడవాళ్ళ పేర్లు ఎంతో కొంత తెలిసి ఉంటాయి కాబట్టి అతణ్ణి ఆ లిస్టు చూడనివ్వలేదు. నేను ఒక సాంపిల్ ఎంపికచేసాక, రాజుని ఆ ఇల్లు ఎక్కడుందో తెలుసా అని అడిగాడు. రాజు గుర్తుపట్టగలనన్నాడు. మేము నేరుగా ఆ ఇంటికి వెళ్లాం.

అది ముర్ల గంగమ్మ అనే ఒక కొండరెడ్డి మహిళ ఇల్లు. నేను అనాలోచితంగా ఎంచుకున్న సాంపిల్ మామూలు ఇల్లు కాదని మొదటి అయిదు నిమిషాల్లోనే మాకు తెలిసిపోయింది. ఆమె తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అన్న పెంచిపెద్దచేసాడు. వాళ్ళకి భూమి ఉందికాని, దాన్ని సాగుచేసే స్తోమతు లేదు. అందుకని అన్న కొండపోడు చేసేవాడు. గంగమ్మ చాలా చలాకీపిల్ల. అందగత్తె. ఇప్పుడామెకి నలభయ్యేళ్ళ వయసు ఉండొచ్చు. పాతికేళ్ళకిందట, ఆమె ఇంకా యవ్వనంలో అడుగుపెట్టీ పెట్టకుండానే ఆ ఊళ్ళో బాంబూ కూపులు నడుపుతున్న భూషణరావు కళ్ళల్లో పడింది. అతను ఏలేశ్వరానికి చెందిన గిరిజనేతరుడు. అతనికి అప్పటికి నలభయ్యేళ్ళ వయసు ఉంటుంది. పెళ్ళయింది. పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏలేశ్వరంలో ఉంటారు. వెదురు నరికించే పనిమీద అతను నెలల తరబడి ఈ ఊళ్ళో అడవిదగ్గరలో ఒక మకాం పెట్టుకుని ఉండిపోయేవాడు. ఆ మకాంలో తనకి వంటవండిపెట్టడానికీ, సాయం చెయ్యడానికీ ఒక మనిషి కోసం చూస్తూ ఉంటే ఎవరో గంగమ్మను పరిచయం చేసారు. కొన్నాళ్ళకే, ఆ పిల్ల యవ్వనాన్ని వాడు హరించాడు. ఆమెకి ఒక కొడుకు పుట్టాడు. అయినా వాడు ఆమెని పెళ్ళిచేసుకోలేదు. ఆమెని వాడు ఉంచుకున్నాడు అని నలుగురూ అనేవారు. ఆమెకి ప్రభుత్వం తరఫున పదెకరాలు పట్టా ఇప్పించాడు. అయిదెకరాల్లో జీడిమామిడి వేయించాడు. ఆమె అహర్నిశలు ఆ తోటనే చూసుకుంటూ ఉండేది. ఆ పంట చేతికందినప్పణ్ణుంచీ, ప్రతి ఏడాదీ, వాడు ఆ పంటని ముందే దళారులకి అమ్మేసేవాడు. వచ్చిన డబ్బులో తృణమో, పణమో మాత్రమే ఆమెకి దక్కేది. కొన్నాళ్ళకు బాంబూ కూపులు ఎత్తేసారు. వాడు ఏలేశ్వరం వెళ్ళిపోయాడు. ఎప్పుడేనా ఏడాదికోసారి పంట చూసుకోడానికి ఈ ఊరు వస్తూంటాడు. ఆమె తన కుర్రాణ్ణి చదివించుకోలేకపోయింది. ఐదెకరాలతో పాటు మరొక ఐదెకరాల్లో జీడితోట పెట్టింది. అది కొడుక్కి అప్పగించింది. ఆ పిల్లవాడికి పెళ్లి చేసింది. తనని ఉంచుకున్నవాడికి తన పొలమ్మీద హక్కుందేమోగాని, తన కొడుకు పొలంలో  ఒక్క మొక్క కూడా ముట్టుకునే అర్హత లేదని తెగేసి చెప్పింది.

ఆమె కథ వింటున్నంతసేపూ నేను కుతకుతా ఉడికిపోయాను. డా.మిశ్రా చెప్పిన వోల్కెనో సెగ నాకు చాలా దగ్గరగా తాకినట్టుగా అనిపించింది. రాజు అటువంటి కథలు చిన్న్నప్పణ్ణుంచీ ఎన్నో వింటూ ఉన్నవాడిలాగా, చాలా మాములుగా ఆమె మాటలు వింటూ, డా. మిశ్రాకోసం ఇంగ్లిషులో తిరిగి చెప్తూ ఉన్నాడు.

పాతికేళ్ళ రెక్కల కష్టం తర్వాత కూడా గంగమ్మ ఇంట్లో చెప్పుకోదగ్గ సామానేమీ చేరలేదు. రెండు నులకమంచాలు, ఒక నీళ్ల గోలెం, రెండు ఆవులు. లోపల  గదిలో గోడమ్మట పొడుగ్గా కర్రతో చిన్న అటకలాగా చేసి ఉంది. దాని మీద ఇత్తడి, సేవెండి గిన్నెలు, కంచాలు, గ్లాసులు బోర్లించి ఉన్నాయి. అవి ఒక్కటే ఆమె సామాజిక స్తోమతుని చెప్పే చిహ్నాలు. కష్టకాలంలో తాకట్టుపెట్టుకోడానికి పనికొస్తాయని, వాటిని చూస్తేనే ఎవరన్నా అప్పిస్తారని చెప్పాడు రాజు.

డా.మిశ్రా ఆమె కథ వింటున్నంతసేపూ ఏమీ మాట్లాడలేదు. అంతా అయిన తర్వాత ఆమెకి మనమలు ఉన్నారా, వాళ్ళని బడికి పంపిస్తోందా అని మాత్రం అడిగాడు. ఒక మనమడు, మనమరాలు ఉన్నారనీ, వాళ్ళకింకా బడి యీడు రాలేదని చెప్పిందామె.

అప్పుడు డా.మిశ్రా ‘ ఎన్ని గిరిజన ప్రాంతాలు చూసాను! ఎక్కడివెళ్ళు, టాల్ స్టాయి మాటలే నాకు గుర్తొస్తుంటాయి. అందుకనే ఎక్కడన్నా ట్రైబల్స్ గురించి మాట్లాడమంటే ఆ వాక్యాలతోటే మొదలుపెడతాను- ‘ అని నాకేసి చూసాడు. నా కళ్ళల్లో కుతూహలం కనిపిస్తోందని నిర్ధారించుకున్నాక, ‘అల్ హేపీ ఫామిలీస్ ఆర్ హేపీ అలైక్. ఆల్ అన్ హేపీ ఫామిలీస్ ఆర్ అన్ హేపీ ఇన్ దైర్ ఓన్ వే. ప్రతి ఒక్క గిరిజన గ్రామం, ప్రతి ఒక్క గిరిజన కుటుంబం, ప్రతి ఒక్క గిరిజనుడు- అన్ హేపీ ఇన్ హెర్ ఓన్ వే ‘ అని అన్నాడు.

కానీ నా దృష్టి ఆయన మాటలమీంచి పక్కకు జరిగి, గంగమ్మ ఇంటినే పరిశీలిస్తూ ఉంది. సంక్రాంతి పండగకి ఆమె ఇల్లు పూర్తిగా మెత్తుకుని వెల్లవేసి పెట్టుకుంది. అరుగుల్ని ఎర్రమట్టితో అలికి వాటిమీద తెల్లటి చుక్కల ముగ్గులు పెట్టుకుంది. ఇంటిముంగిట్లో చిన్న పందిరిమీద దొండపాదు తెల్లటిపూలతోనూ పూలతోకల పిందెల్తోనూ  కనిపిస్తోంది. గడపలకి పసుపురాసి ఎర్రటి రంగుతో అంచులు దిద్ది ఉంది. ఇంటివెనక రెండుమూడు నిమ్మచెట్లు ఉన్నట్టున్నాయి, వాటి పూతమీంచి తీపిగాలి ఆ ఇంటి చుట్టూ పేరుకుపోయింది.

‘ఈచ్ ట్రైబల్ ఫామిలీ ఈజ్ అల్సో హేపీ ఇన్ హర్ ఓన్ వే’ అని అనుకున్నాను. కాని డా. మిశ్రాతో ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమె గురించిన వివరాలతో ఆ హవుస్ హోల్డ్ ఫార్మాట్ ఎలా నింపాలో ఆయన వివరించాడుగాని, అదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు.

కానీ వెంటనే రామనవమి ఉత్సవాలు మొదలవడంతో నేను కూడా తక్కినవన్నీ మర్చిపోయాను. ఆ చిన్న ఊళ్ళో ఆ వేడుక కొండమీంచి ప్రవహించిన వరదలాగా ఆ ఊరంతటినీ వారం రోజుల పాటు ముంచెత్తింది.

అటువంటి ఉత్సవాలు నేనంతకు ముందెప్పుడూ చూసి ఉండలేదు. అక్కడ ఉన్నందుకు ఆ వేడుక ఒక కానుక కాగా, మరొక కానుక రోజాపుష్పం. రోజా గ్రేస్ మేడం గారి అక్క కూతురు. వరంగల్ లో ఆర్ ఇ సిలో ఇంజనీరింగ్ చదువుతోంది. థర్డ్ యియర్. ప్రతి వేసవికీ తన పిన్నిగారింటికి వస్తూంటుంది. మామూలుగా కుటుంబమంతా వస్తూంటారుగాని, ఈసారి తనే రెండువారాలు ముందే వచ్చింది. ఈస్టరూ, సమ్మరూ రెండూ కలిసివస్తున్నాయని ఆ పల్లెటూళ్ళో గడపడానికి వచ్చింది. వచ్చినరోజునే నా గురించి జోసెఫ్ గారూ, గ్రేస్ మేడం గారూ చెప్పగా విని వెంటనే చూడాలని మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసింది.

బార్బీ డాల్ కళ్లలాంటి కళ్ళూ, కనుపాపలూ, ఆ కళ్ళపైన నల్లటిదారంతో ఎంబ్రాయిడ్ చేసినట్టు ఒత్తుగా ఉండే కనుబొమలూ, అప్పుడే విచ్చుకుంటున్న రోజామొగ్గలాంటి నోరూ- ఆమె తలుపు తోసుకుని ఇంట్లోకి అడుగుపెడుతూ ఉంటే వనలత రూపు మార్చుకుని గాని వచ్చిందా అని క్షణంపాటు విభ్రాంతి చెందాను. కాని మొదటిచూపులోనే, మొదటిమాటల్లోనే ఆమె ఎప్పటినుంచో నాకు తెలిసినంత దగ్గరగా వచ్చేసింది. కొంతసేపయ్యాక అనుకున్నాను: వనలత పూలతీగె, ఈమెనో, అప్పుడే రేకలు విప్పుకుంటున్న పువ్వు అని.

రామనవమి పేరుమీద అయిదురోజుల పండగ చేసారు. రెండురోజులముందే పెద్ద పందిరి వేసారు. ఒకవైపు ఆ పందిరినీడన మా ఇల్లూ, రామకోవెలా కలిసిపోయాయి. ఆ పందిరి కింద అడుగుపెట్టగానే జలజల కురుస్తూ పచ్చటి తాటాకు సువాసన.  పందిరి నుంచి రోడ్డుపక్కకీ అటూ ఇటూ రెండు ఫర్లాంగులమేరకి సీరియల్ సెట్ దీపాలు. పైన రోడ్డు వేపుకి వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి, ఆంజనేయుడు బొమ్మలు సీరియల్ సెట్ల దీపాల్లో వెలుగుతూ,ఆరుతూ, వెలుగుతూ అందరి చూపులూ తమవైపు తిప్పుకుంటూ ఉన్నాయి. పందిరికి మామిడాకుల తోరణాలు కట్టారు. రంగురంగుల జెండాలు కట్టారు. కరెంటు మాటిమాటికీ పోతూ ఉంటుంది కాబట్టి ఒక జెనరేటరు కూడా ఏర్పాటుచేసారు. పండగ ముందురోజే గ్రామఫోను పెట్టివాడు మైకుల్తో దిగాడు. నాలుగు లౌడ్ స్పీకర్లు నాలుగువేపులా పెట్టారు. ఆ వారం రోజులూ వాడు వినిపించని సినిమా పాటల్లేవు. కాని మరీ మరీ వినిపించినవి, బహుశా పురజనుల కోరికమీద కాబోలు, ప్రేమాభిషేకం, శంకరాభరణం, సర్దార్ పాపారాయుడు లాంటి తెలుగు సినిమా పాటలూ, కుర్బాని, కర్జ్ లాంటి హిందీ సినిమా పాటలూ. ఆ పాటలు వినివిని కొన్ని పంక్తులు నా ఒంట్లోకి ఇంజెక్టయిపోయాయి.

మరులు పూచిన పూలపందిరిలో

మమతలల్లిన ప్రేమసుందరికీ

పట్టాభిషేకం, పట్టాభిషేకం…

ఆప్ జైసా కోయీ మేరీ జిందగీ మే ఆయే

తో బాత్ బన్ జాయే, హాఁ బాత్ బన్ జాయే..

హే తుమ్ నే కభీ కిసీసే ప్యార్ కియా?

కియా!

కభీ కిసీ కో దిల్ దియా?

దియా!

మైనే భీ దియా!..

పండగ ప్రోగ్రాం ఒక కాగితం అచ్చేసారు. పింక్ కలర్ పేపరు. దానిమీద ‘జానక్యాః కమలాంజలి పుటేయాః’ అనే శ్లోకం. దానికింద ఆ ఏడాది కల్యాణం ఎవరు చేయిస్తున్నారో వారి పేర్లు. చివరిరోజు అన్నదానం చేసే దాతల పేర్లు. అయిదు రోజులూ రాత్రి పూట సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు. కింద సమయానుకూలంగా ప్రోగ్రాములు మార్చబడును అనే క్లాజు కూడా.

మొదటిరోజు కల్యాణానికి ఊరంతా తరలి వచ్చింది. పొద్దున్నే చిరుజల్లు కూడా పడింది. వానకి తడిసిన తాటాకులనుంచి మరింత సురభిళం కమ్ముకుంది. మొదటి రాత్రి సత్యహరిశ్చంద్ర నాటకం. తెల్లవార్లూ నడిచింది. నేనూ, మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లల్తో పాటు రోజా కూడా రాత్రంతా నాటకం చూసాం. ఆ నాటకం ఎంత గుర్తుందో, ఆ నాటకం మొదలుపెట్టేముందు చేసిన రంగపూజ కూడా నా మనసులో అంత స్ఫుటంగానూ ముద్రపడిపోయింది.

రాత్రి తొమ్మిదైనా ఇంకా నాటకం మొదలుపెట్టలేదు. మేము ఎనిమిదన్నరకే అన్నాలు తినేసి కూచున్నాం. దాదాపు పదింటికి అనుకుంటాను, స్టేజి మీద కాషాయ రంగు తెరవెనక ఒక హారతి దీపం వెలుగుతూ ఉండగా, డ్రామాట్రూపు మొత్తం ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అంటో ప్రార్థన చేసారు. అప్పుడు కొబ్బరికాయ కొట్టిన చప్పుడు వినబడింది. ముందు తమ నాటకబృందానికి జై కొట్టుకున్నారు. తరవాత ఊళ్ళో పెద్దమనుషుల పేర్లు చెప్పి వాళ్ళకి కూడా జైకొట్టాక తెర పక్కకు జరిగింది. కిరీటధారిగా హరిశ్చంద్రుడు కనబడగానే కింద కూచున్న ప్రేక్షకులంతా చప్పట్లు కొట్టారు. ఒకరిద్దరు ఈలలు వేసారు. ఇక ఆ రాత్రంతా పద్యాల్తో, హార్మోనియం స్వరాలతో, గుక్కతిప్పుకోని రాగాల్తో ఆ స్టేజి, ఆ ఊరు, ఆ అడవి, ఆ కొండలు, చివరికి ఆ ఆకాశం కూడా మార్మ్రోగిపోయాయి. నాకైతే వేరే లోకంలోకి పోయి వచ్చినట్టే ఉంది తెల్లవారేసరికి. మర్నాడు ఊళ్ళో తమ్మారావు బృందం వారి కాంతామతి నాటకం. వాళ్లల్లో చాలామంది గిరిజనులు, ఒకరిద్దరు దళితులు. వాళ్ళు అంత చక్కగా పద్యాలు ధారణపట్టగలరనీ, అంత చక్కగా రాగాలు తియ్యగలరనీ ఊహించలేదు నేను. డిసెంబరునుండే రిహార్సలు మొదలుపెట్టడం వాళ్లకి బాగా కలిసొచ్చింది అనిపించింది.

మూడో రోజు మరేదో నాటకం వేసారు, గుర్తులేదు. ఎందుకంటే ఆ రాత్రి నేను ఇంట్లో పిన్నిగారికి సాయం చేస్తూ ఉండిపోయాను. నాలుగో రోజు యువకళాంజలి వారి నాటకం. అన్ని రోజుల పాటు రాత్రంతా రామకోవెల కప్పు చిల్లులు పడేలాగా చేసిన రిహార్సలు వాళ్లకేమీ కలిసివచ్చినట్టు లేదు. వాళ్ళ డైలాగులకన్నా తెరవెనక ప్రాంప్టింగే ఎక్కువ వినబడుతూ ఉంది. ముఖ్యంగా ‘విజయ్ విశాల ప్రపంచంలో అడుగుపెడుతున్నాడు’ అనే డైలాగు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా మొత్తం నాటకమంతా చూసాను. ఇంతకీ, అది నాటకంలో చివరి డైలాగు. విజయ్ విశాల ప్రపంచంలో అడుగుపెట్టడంతో నాటకానికి తెరపడింది. అయిదో రోజు మధ్యాహ్నం అన్న సంతర్పణ.  డా.మిశ్రా ఆ సంతర్పణకి మాత్రం హాజరయ్యాడు.  గ్రామస్తులందరితో కలిసి ఏకపంక్తిన భోజనం చేసే అవకాశం మళ్ళా మళ్ళా దొరకదు కదా అన్నాడు. ఆ రాత్రి రికార్డింగ్ డాన్సు. మేమెవ్వరం పోలేదుకాని, బాగా పొద్దుపోయిన దాకా లేటెస్టు సాంగ్స్ రికార్డులన్నీ ఆ గ్రామఫోను మీద ఊరంతా వినిపిస్తూనే ఉన్నాయి.

వసంత ఋతువు వస్తూ రామనవమిని తీసుకొచ్చిందో లేక రామనవమితో వసంతఋతువు పరిపూర్ణత సంతరించుకుందోగాని పండగ వేడుకలు ముగిసే సరికి ఊరంతా మారిపోయి కనబడింది. ఊళ్ళో కనిపించే చింతచెట్లు, వేపచెట్లు, మామిడిచెట్లు, రావిచెట్లు కొత్త శోభసంతరించుకున్నాయి. ఊరంతా కలిసి ఒక పెళ్ళి చేసినంత సంతోషం ప్రతి ఒక్క దిక్కునా కనిపిస్తూ ఉంది.

ఊళ్ళో ఉండే రెండు తురాయిచెట్లూ (కృష్ణచూర అని అనాలి అంటుందేమో వనలత) కవి చెప్పినట్టుగా ఒక్కసారిగా బాండుమేళం మోగినట్టుగా విరబూసాయి. రోడ్డుకి ఇవతలి పక్కనుండే వేపచెట్టు విరగబూసింది. అవతలివైపు బోగన్ విల్లియ కొత్త ఆకులు తొడుక్కుని నెత్తిన గులాబి రంగు కిరీటంతో ఆ వసంతకాలమంతా ధగధగలాడుతూనే ఉంది. ఒకప్పుడు నేనూ, డాక్టర్ మా పెళ్ళయిన కొత్తలో కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదీవిదాకా వెళ్ళాం. ఆ సంగమానికి చేరుకోడానికి దాదాపు ఇరవై ముప్ఫై కిలోమీటర్ల దూరం నుంచే ఆ నదిలో, ఆ నేలలో, అక్కడున్న గడ్డిలో, చివరికి అక్కడ తిరుగాడే పక్షుల్లో కూడా సముద్రస్పర్శ కనిపిస్తూ ఉండింది. సంగమం ఎక్కడో నది సముద్రంలో కలిసే తావులో మటుకే లేదనీ, ఆ అనుభవం కూడా ఆ నది ఒక్కదానికే సంబంధించింది కాదనీ ఆ రోజు నాకు అర్థమయింది. బహుశా కొన్నేళ్ళపాటు నువ్వు ఆ దారుల్లో సంచరిస్తే, నీ తలపుల్లో కూడా ఆ సంగమసంతోషం నీకు అనుభవానికొస్తూ ఉంటుందేమో అనుకున్నాను.

వసంతవేళ ఆ ఊళ్ళో నేను చూసిన వెలుగు కూడా అలాంటిదే. మంచుమబ్బులు విడిపోయి ధారాళంగా సూర్యకాంతి వర్షించే కొద్దీ, కొండలమీదా, ఆడవిలోనూ మాత్రమే కాదు, ఊళ్ళో ఉన్న చెట్లలో, మొక్కల్లో, చివరికి మనుషుల్లో కూడా ఏదో అజేయమైన ఒక తళతళ కనిపించడం మొదలయ్యింది. చెట్ల మొదటగా చిగురు తొడిగేది బంగారాన్ని అని ఒక కవి చెప్పగా విన్నాను. ఆ ఋతువంతటా అక్కడ చెట్లమీద నేను చూసింది బంగారం కూడా కాదు, అసలు ఆ రంగు, ఆ వర్ణశోభ మనకు తెలిసిన ఏ మూలకానికీ లేదని చెప్పగలను. అది ఆకాశానిదీ, భూమిదీ కూడా కాదు. అదొక కాలానిది. ఆ ఋతువుకి మాత్రమే సాధ్యమైన రసవిద్య అది. ఆ రోజుల్లో నువ్వు ఆ ఊళ్ళో ఊరికే అటు ఏటినుంచి ఇటు చాపరాయిదాకా అటూ ఇటూ ఒకటి రెండు సార్లు తిరిగినా చాలు, వికసించిన విద్యుత్తేజమేదో నీలోకి ప్రవహిస్తున్న అనుభూతి చెందుతావు. నువ్వు గాలిని కాక కాంతిని పీలుస్తున్నావనే స్పృహ కలుగుతుంది. అలాగని ఒక ఏప్రిల్లో నువ్వా ఊళ్ళో అడుగుపెడితే ఈ రాసాయనిక చర్య నీకు అర్థం కాదు. నువ్వు ఒక హేమంతకాలం నుంచీ అక్కడ ఉండాలి. అప్పటికే సీతాకోకచిలుకలూ, తుమ్మెదలూ అక్కణ్ణుంచి వలసపోయి ఉండాలి. అప్పటినుంచీ, ఆ అడవికీ, సూర్యుడికీ మధ్య ఎన్ని సంప్రదింపులు జరిగి ఉంటాయో అన్నీ కాకపోయినా కొన్నైనా నువ్వు విని ఉండాలి. ఆ రసచర్చల్లో పాలుపంచుకుని ఉండాలి. మళ్ళా తేనెటీగలు ఆ అడవిబాట పట్టడం కళ్ళారా చూడాలి. అప్పుడు ఆ హరితగంగావతరణం నీకు సాక్షాత్కరిస్తుంది. నిన్ను అనుగ్రహిస్తుంది.

రామనవమి అయిన మర్నాడే బడికి కుటీరం కట్టే పని కూడా మొదలయ్యింది. డా.మిశ్రా ఆ స్కూలు పిల్లల్లో ఒక గిరిజన బాలిక తల్లితో కొబ్బరికాయ కొట్టించి పని మొదలుపెట్టించాడు. మేము సర్వే పని కూడా మొదలుపెట్టాం. రోజా కూడా నాకు సాయంగా రావడం మొదలుపెట్టింది. రోజూ మరీ పొద్దున్నే ఇళ్ళకు వెళ్ళి సర్వే చేసేవాళ్ళం. ఎనిమిది దాటితే కొండరెడ్లు అడవికో, కొండకో మరేదో పనికో వెళ్ళిపోతారు. సాయంకాలాలు కూడా సర్వే చేద్దామనుకున్నాంగాని అది అంత వీలుపడేలా కనిపించలేదు. రోజూ సాయంకాలం నేనూ, రాజూ, రోజా మా ఇంటిదగ్గరో, జోసెఫ్ గారి ఇంటిదగ్గరో కలుసుకునేవాళ్ళం. బడిపని మొదలుపెట్టాక నాలుగైదు రోజులు డా. మిశ్రా కనిపించలేదు. ఆయన రకరకాల స్థాయిల్లో అధికారుల్ని కలవడానికి అడ్డతీగలనో, రంపచోడవరమో, కాకినాడనో వెళ్ళి ఉండవచ్చన్నాడు రాజు. ఆ తర్వాత ఒక సాయంకాలం రాజు కూడా కనిపించలేదు. మర్నాడు నేను జోసెఫ్ గారి ఇంటిదగ్గర రోజా తో మాట్లాడుకుంటూ వుంటే అక్కడికొచ్చాడు. చేతిలో కాగితాలూ, ఏదో పుస్తకం ఉన్నాయి. నేరుగా సర్వే నుంచి ఇటే వస్తున్నట్టుంది.

రాగానే నిన్నా మొన్నా ఏమైపోయావని అడిగితే  అడిగితే, డా.మిశ్రాతో కలిసి కొండరెడ్ల పండగ చూడ్డానికి వెళ్ళానని చెప్పాడు.

ఆ ముందురాత్రి చైత్రపూర్ణమి అని తెలిసాక రాజు మీద చాలా కోపం వచ్చింది. నాకు చెప్పి ఉంటే నేను కూడా వచ్చి ఉండేదాన్ని కదా అన్నాను.

‘ఎక్కడికొస్తావు? అది అడవిలో జరిగే పండగ. కొండరెడ్లు విల్లంబులు పట్టుకుని వేటకి వెళ్తారు. ఇప్పుడు వేట అంటే వేటాడటం లేదులే. ఊరికే అట్లా వేటాడినట్టు అటూ ఇటూ అడవిలో తిరుగుతారు, తాగుతారు, తింటారు, డాన్స్ చేస్తారు’ అని అన్నాడు. అతడు నన్ను మొదటిసారిగా ‘నువ్వు’ అని అన్నాడని తెలుస్తోందికాని, ఆ పండగ విశేషాల్లో ఆ స్ఫురణ పక్కకు పోయింది.

‘అయితే ఏం మేం రాకూడదా?’

‘రాకూడదంటే రాకూడదని కాదు. కాని డా. మిశ్రా వద్దన్నాడు’ అన్నాడు.

‘డా.మిశ్రాకి ట్రైబల్ రిచ్యువల్స్ మీదా కల్చర్ మీదా అంత శ్రద్ధ ఎప్పుడు పుట్టుకొచ్చింది?’ అనడిగాను వ్యంగ్యంగా.

‘నిన్న కూడా ఆయన వాళ్లల్తో ఆ పండగ గురించేమీ మాట్లాడలేదు. ఆయన చూసేదల్లా పదిమంది ట్రైబల్స్ ఎక్కడ కలిస్తే అక్కడికి పోవాలని. నిన్న కూడా అంతే, వాళ్లనేవో ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. భూమి సమస్యల గురించీ భూమి బదలాయింపు గురించీ. వాళ్ల ధ్యాస ఇక్కడ లేదు. కొంతసేపటికి వాళ్ళు విసుక్కోడం కూడా మొదలుపెట్టారు.’

‘కాని డా.మిశ్రా ఇలాంటి పండగలు ఎన్నో చూసాడని మాత్రం తెలుస్తోంది. నా చిన్నప్పుడు ఈ వెన్నెలరాత్రుల్లో రాత్రంతా పాటలు వినబడుతూనే ఉండేవి. కొండరెడ్ల వీథులు నిద్రపోయేవే కావు. అదంతా ఎందుకో ఇప్పుడు డా.మిశ్రా చెప్తుంటే అర్థమయింది. ఒకప్పుడు కొండరెడ్లు కొండపోడు చేసేటప్పుడు జనవరిలోనే అడవి నరికి తగలబెట్టేవారట. అలా నరికిన చెట్లూ, కాలినచెట్లూ, బూడిదా అక్కడే ఎరువుగా తయారయ్యేదిట. పల్లపు ప్రాంతాల్లో తొలివానలు జూన్ రెండవవారంలో మొదలవుతాయి. కాని మన్యంలో తొలివానలు చైత్రమాసంలోనే మొదలవుతాయి. అందుకని వాళ్ళు చైత్రమాసం గడిచే దాకా ఆగి, వైశాఖం రాగానే వ్యవసాయం పనులు మొదలుపెట్టేవారు. ఫాల్గుణమాసం చివరి రెండువారాల్లోనూ అన్ని సమకూర్చుకునేవారు. ఇక ఈ చైత్రమాసమంతా ఊరంతా పండగ తప్ప మరొకటేమీ ఉండదు. ఎవ్వరూ పనిచెయ్యరు. ఆట, పాట, వేట- అంతే. ఇప్పుడు కాలం మారిపోతూ ఉంది కాబట్టి, ఆ ఆచారాలు కొన్ని మిగిలాయి, కొన్ని పోయాయి. మనూళ్ళోనే చూడు, కొండకింద పొలాల్లో ఏరువాకపున్నమికే పొలం పనులు మొదలవుతాయి. కాని కొండమీద పోడుచేసే చోట భూదేవి పండగనే ఏరువాక అన్నమాట’ అని చెప్పాడు రాజు.

‘నా చిన్నప్పణ్ణుంచీ మనూరి పటంలో కొన్ని గాప్స్ ఉండిపోయేయి నా దృష్టిలో. డా.మిశ్రా తో మాట్లాడుతుంటే కొన్ని గాప్స్ ఫిలప్ అవుతూ ఉన్నాయి’ అని కూడా అన్నాడు.

నేను వింటూ ఉన్నాను. నేను కూడా ఒక మగపిల్లవాణ్ణి అయి ఉంటే నిన్న రాత్రి ఆ కొండరెడ్ల పండక్కి పోగలిగి ఉండేదాన్ని కదా అనుకున్నాను. అడవిలో ఆ గిరిజనులు పాటలు పాడుకుంటూ ఉండే దృశ్యం కళ్ళముందు ఊహించుకోడానికి ప్రయత్నించాను.

‘నేను కూడా చిన్నప్పణ్ణుంచీ వింటూ ఉన్నానుగాని, ఇదే మొదటిసారి ఆ పండగ చూడటం. వెన్నెలరాత్రి మగవాళ్ళంతా, అంటే ముసలాళ్ళు కాదు, కుర్రాళ్ళు ఒక గ్రూపు, వాళ్ళంతా ఒకవైపు పాటలు పాడుతూ ఉన్నారు. ఆడవాళ్ళు, కన్నెపడుచులన్నమాట మరొకవైపు పాటలు పాడుతూ ఉన్నారు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకుంటూ ఉన్నారు, కవ్వించుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అంతా వరస కట్టి నాట్యం చేసారు. ముందు ఒక యువకుడు. అతని పక్కన ఒక యువతి. ఆమె తన కుడిచెయ్యి అతని భుజం మీద వేసింది. తన ఎడమచెయ్యి తన ఎడమపక్కనున్న యువకుడి నడుం చుట్టూ వేసింది. ఆమె ఎడమపక్కనున్న యువకుడు తన కుడిచెయ్యి ఆమె భుజం చుట్టూ వేసాడు. తన ఎడమచెయ్యి తన ఎడమ పక్కనున్న యువతి నడుం చుట్టూ వేసాడు. అలా ఒక మగ, ఒక ఆడ, ఒక మగ, ఒక ఆడ- వాళ్ళు నడిచే కెరటంలాగా, చేతులే తాళ్లుగా కట్టుకున్న ఉయ్యాలలాగా ఒకటే డాన్సు చేస్తూ ఉన్నారు. తుళ్ళిపడుతూ ఉన్నారు. పాటపాటకీ ఓ అంటో కొండకోనల్ని రాగాల్తో నింపేస్తో ఉన్నారు.  దాన్ని దిమిసా డాన్సంటారని చెప్పాడు మిశ్రా.’

‘కొంత సేపటికి ఆ పాటల నిషా డా.మిశ్రాకి కూడా తలకెక్కింది. ఆయన కూడా వాళ్లతో కలిసి డాన్స్ చేసాడు. వాళ్లతో మాటలు కలిపాడు. నిజానికి అవి మాటలు కావు, సామెతలు. మీరు ఈ పండగ ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు మిశ్రా. అప్పటికి ఎన్నో సార్లు ఎందరో ట్రైబల్స్ ని ప్రతిసారీ కొత్తగా అడిగినట్టే వాళ్లనీ అడిగాడు. ఒకాయన ఏమన్నాడో తెలుసా? ‘దేవతలకి ఇచ్చి పెరగాలి, చుట్టాలకిచ్చి చెడిపోవాలి’ అన్నాడు. మనూళ్ళో లొద్దు ఉంది చూడూ-‘

‘ఎక్కడా?’

‘-ఈసారి నీకు చూపిస్తాలే. అక్కడ నడిచింది ఈ గానాబజానా అంతా.’

‘ఆ పాటలు దొరుకుతాయా? మళ్లా పాడమంటే పాడతారా?’

‘ఏమో! రాత్రి ఆ పాటలు నేను వినలేదు, చూసాను. నువ్వడిగినట్టే, డా. మిశ్రాని అడిగితే, ఆయన పొద్దున్న నాకీ పుస్తకం ఇచ్చాడు. ఇక్కడి పాటలు కాదుగాని, పాడేరు మన్యంలో ఇలాంటప్పుడు పాడుకునే పాటలట. అయితే ఇవి ఒరియాలో ఉన్నాయి. చూడు- ‘ అని పుస్తకం తెరిచి, ఒక పాట చదివి వినిపించాడు:

సిబి సిబి సిబి సిబి బబు దొనొ

రంగొని బిఢిరొ సిబి

గజ్ఞొ నిసనికె మనొకయ్ మంగిబి

సంకొడి కెలితొ జిబి

బాబు దొనొ కిందొరి కెలితొ జిబి

(సిబి సిబి సిబి సిబి అబ్బాయీ, అమ్మాయీ, రాళ్లవలపుల సిబి, మా ఊరి దేవతకు మనవి చేసుకుంటున్నాను, సంకిడి ఆడుతూ పోతాను. అబ్బాయి, అమ్మాయి, కిందోరి ఆటకు పోతాను)

అజి జిబి జిబి కలికె కయ్ జిబి

లగిల మొవసొ నొ చడె బెగి

అవు దొయ్ దినొ తిబి

(ఇవాళ పోతాను, పోతాను, రేపు తిని పోతాను, మళ్లా రెండురోజులుంటాను)

టొంట అంబొ లొంబొ లొంబొ బొలి

బారొ టొంట అంబొ లొంబొ లొంబొ

అజిసె దరిలి పొర్ తుమొ కయ్ నమొ

రొక్య కొరొ బిరొకొమొ

(గున్నమామిడి పొడుగు పొడుగు, గున్నమామిడి చాలా పొడుగు, ఈవాళే పట్టాను మొదటి పేరు, రక్షించు బ్రహ్మా రక్షించు)

రొకి జ రొకి జ రొయ్ కిల, కయ్

బెలె నొ మిలె సొబు కలె

(రక్షించు, రక్షించు, మించిపోతే మళ్లా రాదు ఈ రోజు)

అసిలిరె నువ కి బొలి నొ కువ

లాజొ ఎలె కజొ నయ్

లాజొ చడయ్ కి గితొ కయ్

గయిబు టొండె టొండే దెక నయ్

(వచ్చానురా కొత్తగా, ఏమీ అనకండి, సిగ్గుపడితే లాభం లేదు. సిగ్గువిడిచి నేను కూడా పాట పాడతాను. నా నోటికేసి చూడకండి)

గహ గహ దొనొ గాకు రొతొనొ

గహ తెభె సుని దెకు

ఉలొటొ పలొటొ పదొ పిటి గలె

పొదె పొదె గయ్ కెలు

(పాట పాడు అమ్మాయీ, పాడు, పాడితే వింటామందరం. ఎదురు బదురు పదాలు తప్పితే, సరిచేసుకుందాం, కలిసి పాడుకుందాం)

అతని చేతుల్లో పుస్తకం లాక్కుని చూసాను. ‘ఆదిబసి లొకొర్ పొరొబ్ కత’ ఆదివాసి ఒరియా-తెలుగు పుస్తకం. పేజీలు అటూ ఇటూ తిప్పాను.

‘ఆ పండగని ఇటిఞ్ పండగ అంటారని చెప్పాడు. చొయత్ పొరొబ్ అని కూడా అంటారని చెప్పాడు. ఒకప్పుడు నెల్లాళ్ళు నడిచేదనీ, ఇప్పుడు కూడా పాడేరు మన్యంలో నెల్లాళ్ళపాటూ పండగ చేసుకునే గ్రామాలున్నాయనీ, కానీ చాలాచోట్ల రెండువారాలకీ, వారం రోజులకీ, అయిదురోజులకీ కుదించేస్తున్నారనీ చెప్పాడు. అన్నట్టు, మరో ఇంటరెస్టింగ్ మాట కూడా చెప్పాడు. నువ్వు వినాల్సిన మాట. నాకు చెప్పాడు’ అన్నాడు.

‘నాకు చెప్పమన్నాడా?’ అనడిగాను. నాకు ఉక్రోషం పెరిగిపోతూ ఉంది.

‘అలాగే అనుకో. ఇంతకీ ఏం చెప్పాడంటే, ఇలాంటి పండగలకీ, రిచ్యువల్స్ కీ తాను ఎందుకు వెళ్ళడో చెప్పాడు. ఎందుకంటేటా, ఒకప్పటి గిరిజనదేవతలు ఇప్పుడు నెమ్మదిగా అదృశ్యమైపోతున్నారట. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా హృదయవిదారకమైన దృశ్యం, ఆయన మాటల్లో ‘ద మోస్ట్ అన్ సెట్లింగ్ ఎక్స్ పీరియెన్స్’, దేవతలు మరణించే దృశ్యమంట. అందుకనే ఆ దరిదాపులకి పోవాలన్నా తనకి భయమని చెప్పాడు.’

‘కానీ మరి నిన్న రాత్రి ఆయన దేవతల్ని చూసి ఉండాలే!’

‘ఆయనే కాదు, నేను కూడా చూసాను! ఆ చింత తోపులోట్రైబల్స్ డాన్స్ చేస్తుంటే అక్కడ కొండమీద ప్రతి బండమీదా దేవతలు వచ్చి కూర్చున్నట్టే ఉంది.’

నేను పుట్టిబుద్ధెరగాక ఎప్పుడూ ఎవరిపట్లా అసూయ పడి ఎరగను. కానీ ఆ రోజు రాజుపట్ల చెప్పలేనంత అసూయ కలిగింది. ఆ చైత్రపూర్ణిమ రాత్రి, ఆ కొండవారలోయలో, ఆ చింతచెట్లతోపులో, ఆ కొండరెడ్ల దిమిసా చూడడానికి వచ్చిన దేవతల్ని నేను చూడలేకపోయానే అన్న దిగులు బహుశా ఈ జన్మకి నన్ను వదలదు.

22-4-2023

12 Replies to “ఆ వెన్నెల రాత్రులు-18”

  1. కొత్త బంగారులోకం. చదువుతుంటేనే ఒక దృశ్యం రామనవమి నాటకంలాగా కనుల ముందు నుండి కదలి వెళ్లుతుంది. చదివిందంతా చూడలేని అసంతృప్తి విమల మనసులో ధిమిసా చూడని అసంతృప్తితో పఠిత కూడా చేరిపోతాడు. కథకుడు
    పల్లీయ సంస్కృతి మీది ప్రేమను పరిశీలనను ప్రభావాన్ని గుండెకు హత్తుకుని కథనం సాగించడం వల్లనే కథలో జీవం తొణికిసలాడుతుంది. దొండపందిరికి వేలాడుతున్న పూలతోకల పిందెలు అని రాయాలన్నంత నిశిత నిష్ఠ కథను కొండ అంచున నీలాకాశం వెలుగులో నిలబెడుతుంది. కథలో పెద్ద పెద్ద మెలోడ్రామాలు అవసరం లేదు. చిన్న చూడలేని కొండరెడ్ల యువజంటల కౌముదీనృత్యం సన్నివేశం చాలు. ఒకప్పటి గిరిజన దేవతలు ఇప్పుడు అదృశ్యమైపోతున్నారంట అనే కొసమెరుపులూ . కేవలం ఒకటి రెండు పొడి మాటలు మాత్రమే చెప్పి రాజు, మిశ్రా వంటి వారి సహజ స్వభావ తత్త్వాన్ని పాఠకుడికి చేరవేయగలగటం అనుభవ పరిణతితో చేకూరిన విద్య.

    1. కౌముదీ నృత్యం! ఎంత గొప్ప మాట! బంగారానికి పుటం పెట్టినట్టు రసజ్ఞుడు రచనకు ఊహించని శోభ సంతరిస్తాడు.

  2. మా పల్లెలో మా చిన్నప్పుడు జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలు గుర్తుకు తెచ్చారు.. తాటాకు పందిర్లు, బెల్లం పానకం, పులిహార.. ఊళ్లో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే పెళ్లయినట్టు హడావిడిగా తిరగడం.. మైకులు గ్రామ్ ఫోన్ రికార్డులు, నాటకాలు.. ఇక సీరియల్ సెట్ల దీపాల్లో వెలుగుతూ,ఆరుతూ, వెలుగుతూ “వెంకటేశ్వరస్వామి, లక్ష్మీదేవి”, బదులుగా..రాముడు, సీత.. ఇక ఆంజనేయుడు.. బొమ్మలు
    ధన్యవాదాలు.

  3. ఒక్క తుమ్మూరి వారి కోసం నువ్వు నవల ఏడాది పాటు రాయవచ్చు చినవీరభద్రుడూ

  4. “గిరిజనదేవతలు ఇప్పుడు నెమ్మదిగా అదృశ్యమైపోతున్నారు.
     ప్రపంచంలో అన్నిటికన్నా హృదయవిదారకమైన దృశ్యం, , దేవతలు మరణించే దృశ్యం, ,—-“”

  5. “కరెంటు మాటిమాటికీ పోతూ ఉంటుంది కాబట్టి ఒక జెనరేటరు కూడా ఏర్పాటుచేసారు.” ఇంత చిన్న చిన్న డిటెయిల్స్ కూడా జారిపోకుండా పట్టుకోవడం.. ఆ నవమి ఉత్సవాల్లో ఉన్నట్లే ఉంది

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading