ఆ వెన్నెల రాత్రులు-17

మర్నాడు పొద్దున్నే పదింటికి రాజూ,నేనూ వకుళకుటికి వెళ్ళాం. మేం వెళ్ళేటప్పటికి చెట్లకింద పదిపదిహేనుమంది గిరిజనులున్నారు. మమంలని చూడగానే ఆయన రాజుతో ‘మీ కోసమే చూస్తున్నాను. ఇదిగో, నా మాటలు వీళ్ళకి తెలుగులో చెప్పు’ అని వాళ్ళతో ‘ కాబట్టి, మీరు నాన్ ట్రైబల్స్ కి బినామీగా ఉండకండి. మీ బంజరు మీరే దున్నుకోండి. మీకు కావలసిన ఎడ్లు, పనిముట్లు, విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం నుంచి వస్తాయి. ఐటిడి ఏ ఉన్నది మీకోసమే’ అని చెప్పాడు.

వాళ్ళు ఆయన్ని జీడిమామిడి మొక్కల గురించి అడిగారు. ‘మీరు హార్టికల్చర్ క్రాపు వేసుకుంటే మరీ మంచిది. కొన్నేళ్ళ పాటు ఆ మొక్కల మధ్య ఇంటర్ క్రాపింగ్ కూడా చెయ్యొచ్చు. మొదట్లో ఆరునెలలు మొక్కల్ని దగ్గరుండి చూసుకోవాలి. మొదటి సమ్మర్ మొక్కలకి నీళ్ళుపోసుకుని చూసుకుంటే ఆ తర్వాత మీరు కొండపనికి పోయినా పర్వాలేదు. ఆ మొక్కలు బతుకుతాయి. నాలుగేళ్ళల్లో మీకు ఫలసాయం రావడం మొదలవుతుంది’ అని చెప్పాడు.

ఆ సంభాషణ గంటసేపేనా సాగింది. ఆ గిరిజనులు ఆయన్ని రకరకాల ప్రశ్నలు అడిగారు. వ్యవసాయం గురించీ, ఎటువంటి పంటలు వేస్తే బాగుంటుందీ, వర్షాధారం మీద వరి పండిస్తే దిగుబడి పెరగాలంటే ఏమి చెయ్యాలి లాంటివేవో అడిగారు. ఆయన వాళ్ళకి ఓపిగ్గా జవాబిస్తూనే ఉన్నాడు. చూడబోతే ఆయన ఆ ప్రాంతానికి కొత్తగా ఉద్యోగంలో చేరిన అగ్రికల్చర్ డిమాన్స్ట్రేటర్లాగా కనబడ్డాడు.

వాళ్ళు వెళ్ళిపోయాక మాతో పాటు ఆ అరుగు మీద కూచున్నాడు. నేనింకా ఆ ముంగిలి దాటి బయటకు వెళ్తున్న గిరిజనుల్నే చూస్తూ ఉండటం గమనించి డా.మిశ్రా నాతో ‘ ఈ రెండుమూడు రోజుల్లో నాకు ఇక్కడ ఏం అర్థమయిందంటే, దీజ్ పీపుల్ ఆర్ సబ్జెక్ట్ టు టెరిబుల్ ఇన్ జస్టిస్. సోషల్ ఇన్ జస్టిస్. డు యు నో అబౌట్ ద కాన్ స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ద ట్రైబల్స్? ఫిప్త్ షెడ్యూలు గురించి విన్నారా? ఇక్కడ దారుణమైన పరిస్థితులు నడుస్తున్నాయి. నాన్ ట్రైబల్స్ రాజ్యం నడుస్తోంది. ఇదుగో, ఈయన సంగతే చూడండి-‘ అని రాజు కేసి చూపించి, వీళ్ళ నాన్నగారు వెస్ట్ గొడావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన క్షత్రియుడు. అంటే నాన్ ట్రైబల్. మరి ఇక్కడ ఆయనకి అంత భూమి, అరటితోట, చెరకుతోట ఎలా వచ్చేయో చెప్పగలరా? దీన్నే లాండ్ ఎలియనేషన్ అంటారు. అసలు ఈ భూమి అంతా ట్రైబల్స్ ది. ట్రైబల్స్ కే చెందాలి. కాని వీళ్లంతా ఏదో ఒక రూపంలో దాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళని తమ పొలాల్లో పనివాళ్ళుగా మార్చేసారు. అర్థమవుతోందా?’ అన్నాడు.

నేను చాలా కంగారు పడిపోయాను. నా ఎదురుగుండా రాజుని పట్టుకుని అతడి తండ్రినీ, కుటుంబాన్నీ నేరస్థులుగా చూపిస్తో అలా మాట్లాడుతుంటే నాకు కాళ్ళల్లో వొణుకు పుట్టింది. కాని రాజు కళ్ళల్లో అటువంటి భావమేదీ కనిపించడం లేదు. అతడు చాలా శ్రద్ధగా, తదేకంగా డా.మిశ్రా చెప్తున్న మాటలు వింటున్నాడు.

‘నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కాని మొత్తం ఈ ఊళ్ళన్నీ అలాగే ఉన్నాయి. యు నో. దిస్ విలేజ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఎ వోల్కెనో. ఎప్పుడు బర్స్ట్ అవుతుందో తెలీదు. వెస్ట్ బెంగాల్లో వచ్చినట్టు, పదేళ్ళ కిందట శ్రికాకుళంలో జరిగినట్టు, ఇక్కడ కూడా రెబెలియన్ రావచ్చు. బ్లడ్ షెడ్ తప్పకపోవచ్చు’ అన్నాడు.

‘ఇక్కడ కూడా సీతారామరాజు బ్రిటిష్ వాళ్లమీద తిరుగుబాటు చేసాడు సార్. ఆయనకన్నా ముందు గరిమెళ్ళ మంగరాజు, ద్వారబంధాల చంద్రయ్య అనేవాళ్ళు కూడా ఇక్కడ ప్రభుత్వం మీద తిరగబడ్డారు’ అన్నాడు రాజు.

‘యెస్. ఐ హెర్డ్ అబౌట్ దెమ్. మళ్లా అటువంటి పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఐ యామ్ డీప్లీ ట్రబుల్డ్, ఐ యామ్ వెరీ మచ్ కన్సర్న్ డ్ ‘ అని అన్నాడు మిశ్రా.

నాకు ఆ సంభాషణ విని తలతిరగడం మొదలుపెట్టింది. నేను ఇన్నాళ్ళూ చూస్తున్న ఆ సౌందర్యం, ఆ నిశ్శబ్దం- అవేమిటి? ఆ ఊరూ, ఈయన చెప్తున్న ఊరూ ఒకటేనా?

నేను ఆ కాగితాలు వివరంగా చూసాను. అదంతా నాకు కొత్త. ఆకులూ, కొమ్మలూ సేకరించి ఆల్బం రూపొందించడం మాత్రమే నేర్చుకున్నాను ఇప్పటిదాకా. కాని ఆయన చెప్తున్న పని బ్రహ్మవిద్య అనిపించలేదు. పైగా అదంతా చాలా ఆసక్తికరంగా కూడా అనిపించింది. కొత్త విషయాలు నేర్చుకోడంలో ఒక ఆనందం ఉందని అప్పటికే నాకు అనుభవానికి వచ్చింది. నువ్వు లెర్నర్ గా మారితే నీకు తన రహస్యాలు చెప్పటానికి ఈ ప్రకృతి మాత్రమే కాదు, ఈ ప్రపంచం కూడా సిద్ధంగా ఉంటుందని అప్పటికే గ్రహించాన్నేను.

‘ఎనీ థింగ్ ఎల్స్?’అనడిగాడు డా.మిశ్రా నావైపు చూస్తూ, అతని ముఖంలో ఒక ప్రసన్నభావం కనిపిస్తూ ఉంది.

ఆయన పరిచయమైన తర్వాత, ఇది రెండవసారి ఆయన్ని చూడటం. కాని ఇంత ఆహ్లాదకరమైన చూపులు చూడటం ఇదేమొదటిసారి. నాకు ఆయనతో ఏదైనా ఒక సంతోషకరమైన మాట మాట్లాడాలి అనిపించింది.

‘మీరు ఈ ఊళ్ళో కొత్త బడి కట్టించడానికి ప్రయత్నం మొదలుపెట్టారని రాజు చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఈ బడికే వెళ్తున్నారు. ఇద్దరూ గర్ల్ స్టూడెంట్స్.వాళ్లకి చెప్పాను, తొందరలోనే మీకు కొత్తబడి వస్తోందని’ అని అన్నాను.

డా.మిశ్రా వదనంలో ఒక గంభీరభావం గోచరించింది.

‘యెస్, మేడమ్. నేనేమనుకుంటానంటే, ఒక విద్యావంతుడు ఒక గ్రామానికి వెళ్ళిన తరువాత, అక్కడ ఒక రోజు ఉండనీ, వన్ యియర్ ఉండనీ, అతను అక్కణ్ణుంచి వెళ్ళిపోయేలోపు ఆ గ్రామనికి ఏదో ఒక మేలు జరగాలి. అతను వెళ్ళకముందు గ్రామానికీ, వెళ్లిన తరువాత గ్రామానికీ మధ్య డిసైడెడ్లీ ఒక టాంజిబుల్ బెనెఫిట్ సమకూరి ఉండాలి. లేకపోతే అతని చదువుకి అర్థమే లేదు. అందుకనే గాంధీగారు యువతీయువకుల్ని గ్రామాలకి వెళ్ళమని చెప్పారు. అక్కడ ఉండమని చెప్పారు. అండ్, లెట్ మీ టెల్ యూ, ఫర్ హిమ్, ఫ్రీడమ్ మూమెంట్ వజ్ నధింగ్ బట్ విలేజ్ రికన్స్ట్రక్షన్’ అని అన్నాడు.

‘సరే, లెట్ అజ్ కమ్ టు అవర్ సబ్జెక్ట్-‘ అని తనపక్కన మోడా మీద ఉన్న కాగితాలు చేతుల్లోకి తీసుకుని మాకు వివరించడం మొదలుపెట్టాడు.

‘మనం చెయ్యవలసిన పని ప్రొఫెసర్ సేన్ గుప్త ఐడెంటిఫై చేసిన కాచ్ మెంట్ ఏరియాలో ఉన్న హాబిటేషన్స్ తాలూకు సోషియో-ఇకనమిక్ ప్రొఫైల్ తయారు చెయ్యడం. ఈ కాచ్ మెంట్ లో నాలుగు గ్రామాలు, రెండు హాంలెట్లు, ఒక దళితవాడ ఉన్నాయి. డిసెన్నియల్ సెన్సస్ ఈ ఏడాది ఇంకా మొదలవలేదు. పాత సెన్సస్ డాటా పదేళ్ళ కిందటిది. కాబట్టి నేను తాలూక్ స్టాటిస్టికల్ అసిస్టెంట్ దగ్గరనుంచీ, సమితి ఆఫీసునుంచీ, ఎలొక్టరల్ లిస్టులనుంచీ కల్ ఔట్ చేసి ఒక ప్రిలిమినరీ డాటా తయారుచేసాను. దాని ప్రకారం ఈ ఏడు హాబిటేషన్స్ లో మొత్తం ఆరువందల నలభై మూడు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మనం ఆ హౌస్ హోల్డ్స్ కి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, ఇదుగో, ఈచ్ హౌస్ హోల్డ్ డాటా ఈ సర్వే ఫారంలో నింపాలి-‘ అని ఒక నమూనా సర్వే ఫారం చూపించాడు. ‘మనం ఒక్కొక్కళ్లం, అంటే, మీరిద్దరూ అనుకోండి, రోజుకి ఒక్కొక్కరూ పది కుటుంబాల సర్వే చెయ్యగలిగితే, మొత్తం నెల రోజుల పని. మరొకరిని కలుపుకోగలితే ఇరవై రోజుల పని. దాంతో పాటు, ఈ ఏడు హాబిటేషన్ల బేసిక్ డాటా కూడా ఈ ఫార్మాట్ ప్రకారం నింపాలి. చెయ్యగలుగుతాం కదా?’ అన్నాడు.

నేను ఆశ్చర్యపోయాను. ఎప్పుడు వచ్చాడు! ఎప్పుడు ఈ వివరాలన్నీ సేకరించాడు! ఇంత మెటిక్యులస్ గా ఎలా ప్లాన్ చెయ్యగలుగుతున్నాడు!

ఆయన నాకు ఆ ఫామిలీ సర్వే ఫార్మాట్ అందించాడు. ఆ స్పెసిమన్ కాపీ నేను తిప్పి చూసాను. మొత్తం ఆరుపేజీలు ఉంది. అందులో ఆ కుటుంబం తాలూకు బేసిక్ డాటా సేకరించడంతో పాటు, వాళ్ళ అవసరాలు, కంజంప్షన్ పాటర్న్ లాంటివన్నీ ఉన్నాయి.

‘నిజానికి ఇవాళే పని మొదలుపెడదాం అనుకున్నాను. కానీ మీ ఊళ్ళో రామ నవమి సెలబ్రేషన్స్ లో అంతా బిజీగా ఉంటారని రాజు చెప్పాడు. కాబట్టి రేపు ఒక హౌస్ హోల్డ్ విజిట్ చేసి వాళ్లని ఎలా ఇంటర్వ్యూ చెయ్యాలో, ఈ ఫార్మాట్ ఎలా నింపాలో మీకు చూపిస్తాను. మీరు పండగ అయిపోగానే పని మొదలుపెట్టండి. అంటే నా లెక్క ప్రకారం మాగ్జిమం, మే పదిహేనుకల్లా మన సర్వే పూర్తయిపోతుంది. అప్పుడు ఆ డాటాని టాబ్యులేట్ చేసి, అనలైజ్ చేయడానికి మరో పది రోజులు. ప్రొఫెసరు సేన్ గుప్త వచ్చేటప్పటికి మనం సర్వే మొదలుపెట్టేగలిగితే హి వుడ్ ఫీల్ కాన్ఫిడెంట్’ అని అన్నాడు.

ఆ మాటలు వింటుంటే నాలో కొత్త రక్తం ఎక్కినట్టుగా ఉంది. నా చిన్నప్పణ్ణుంచీ, స్కూల్లో, కాలేజిలో ఎవరూ ఇటువంటి మాటలు చెప్పడం వినలేదు. ఈ దేశంలో కొన్ని వేల ఉన్నతపాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రతి ఏడాది కనీసం కొన్ని వేలమంది విద్యార్థులైనా ఇలా గ్రామాలకి వెళ్ళి అక్కడ ఉండి, ఎంతో కొంత మార్పు తేగలిగితే, దేశం ఎలా ఉంటుందో అనిపించింది.

‘నేను బంగర్ వాడి అని ఒక నవల చదివాను. మరాఠీ నవల. అందులో ఇదే కథ. ఒక టీచరు ఒక గ్రామానికి వెళ్తాడు. అక్కడ బడి పాడుపడిపోయి ఉంటుంది. ఆ గ్రామస్థులకి చెప్పి వాళ్ళని ఉత్సాహపరిచి కొత్త బడి కట్టించడం మొదలుపెడతాడు. మీరు మన ఊళ్ళో కొత్తబడి కట్టాలని చెప్పినప్పుడు నాకు ఆ కథనే గుర్తొచ్చింది’ అన్నాడు రాజు.

డా.మిశ్రా రాజుని అభినందన పూర్వకంగా చూసాడు. మేమిద్దరం క్లాసులో బ్రైట్ స్టూడెంట్స్ లాగా, ఆయన మా కొత్త మాష్టారిలాగా కనిపించాడు. అప్పుడు మళ్లా నాకేసి తిరిగి, ‘మొన్న మీరు ట్రైబల్స్ గురించి పుస్తకాలున్నాయా అనడిగారు. ఐ వజ్ ప్రోబబ్లీ రూడ్ టు యు. తరువాత ఆలోచిస్తే అనిపించింది. మీకు కొంత వివరంగా చెప్పి ఉండవలసింది అని’ అని ఆ అరుగుమీంచి కిందకు దిగి, ఆ ఇంటివాకిట అటూ ఇటూ రెండుమూడు నిమిషాలు పచార్లు చేసాడు. అప్పుడు మళ్లా మా దగ్గరకొచ్చి నిలబడ్డాడు. మేము కూర్చునే ఉన్నాం.

‘విమలా, మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ట్రైబల్స్ గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. బట్ దోజ్ బుక్స్ ఆర్ అబౌట్ దెమ్. అబౌట్. అంటే అర్థమవుతోందా? వాళ్ళ గురించి రాసినవి. ఏదో చెట్లగురించీ, పక్షుల గురించీ, రకరకాల స్పీషిస్ గురించీ రాసినట్టు ట్రైబల్స్ గురించి కూడా రాసిన పుస్తకాలు. కలొనియల్ సివిల్ సర్వెంట్స్, ట్రావెలర్స్, మిషనరీస్- ఐ డోంట్ క్వశ్చన్ దైర్ ఇంటెన్షన్స్ ఆర్ ఇంటెగ్రిటీ- బట్, అవి వాళ్లవైపు నుంచి రాసినవి. ట్రైబల్స్ ని ఒక స్పెసిమన్ లాగా లాబరేటరీలో అబ్సర్వ్ చేసినట్టు, అబ్సర్వ్ చేసి రాసినవి. యు మే గెట్ లాట్ ఆఫ్ డాటా ఫ్రం దోజ్ బుక్స్. బట్ యు విల్ నెవర్ బి ఏబుల్ టు రీచ్ ద హార్ట్ ఆఫ్ ద ట్రైబల్ లైఫ్’ అని ముందుకు వంగి తన ముందు పడి ఉన్న ఒక మామిడికాయని పైకి తీసాడు. అది ఇంకా పిందెగా ఉన్నప్పుడే పగిలిపోయి కిందకు రాలిపోయింది. ఆయనా ఆ మామిడిపిందెను తదేకంగా చూసాడు. దాన్ని కొరికి చూసాడు.

‘డైరక్ట్ ఎక్స్ పీరియెన్స్. దానికి ఏదీ సమానం కాదు. చూడు, దీని గురించి ఎంత రాసినా, ఎంత చెప్పినా, ఇది కొరికి చూస్తే నీకు కలిగే ఇన్ సైట్ మరే రకంగానూ దొరకదు. అందుకే ట్రైబల్స్ గురించి తెలుసుకోవాలంటే, ట్రైబల్స్ దగ్గరికి వెళ్ళడమొక్కటే మార్గం. నీకు సేన్ గుప్తా చెప్పే ఉంటాడు. కొండ గురించి తెలుసుకోవాలంటే, కోండనే అడగాలని’ అన్నాడు నవ్వుతూ.

ఇంకా చెప్పడం కొనసాగించాడు.

‘మిషనరీలూ, సివిల్ సర్వెంట్లే కాదు, యాంత్రొపాలజిస్టులు కూడా చాలాసార్లు ట్రైబల్స్ ని కలుసుకున్నాక కూడా అదే తప్పు చేస్తారు. దే డోంట్ వెరిఫై దైర్ డాటా. ఒక యాంత్రొపాలజిస్టు మీ ఆంధ్రాలో ఒక ట్రైబల్ గ్రూప్ మీద ఒక పుస్తకం రాసాడు. పీపుల్ కన్సిడర్ దట్ ఎ క్లాసిక్. అందులో ఆయన రాస్తాడు, ఆ ట్రైబల్స్కి భగవంతుడు అనే దేవుడున్నాడని! వాట్ ఎ పిటీ!’ అని వ్యంగ్యంగా నవ్వాడు.

‘భగవంతుడు అంటే దేవుడికి మరో పేరని అతనికి తెలియదు. వాళ్ళు ఎవరిని కొలుస్తారో కనుక్కోమని తన ఇన్ఫార్మెంటుని అడిగి ఉంటాడు. వాడు ఆ ట్రైబల్స్ ని అడిగితే మేము భగవంతుణ్ణి కొలుస్తాం అని చెప్పి ఉంటారు. ఈ ఇన్ఫార్మెంటుకి అదెలా చెప్పాలో తెలిసి ఉండదు. అందుకని ఏదో చెప్పి ఉంటాడు. ఈ యాంత్రొపాలజిస్టు ‘దే వర్షిప్ ఎ గాడ్ కాల్డ్ భగవంతార్’ అని రాసేసాడు తన పుస్తకంలో!’ అని గట్టిగా నవ్వాడు.

కాని అక్కడితో ఆగలేదు. ఇంకా చెప్పడం కొనసాగించాడు.

‘ట్రైబల్స్ గురించి తెలుసుకోవడం అంటే వాళ్ల ఆచారవ్యవహారాలు, వాళ్ళ రిచ్యువల్స్, ఇంప్లిమెంట్స్ వాటి గురించి డాటా కలెక్ట్ చేయడం కాదు. ద క్రక్స్ ఈజ్ దైర్ వరల్డ్ వ్యూ. అది తెలుసుకోవాలి. అది వాళ్లంతటవాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు. వాళ్ళు ఇంగ్లిషో, తెలుగో, ఒరియానో నేర్చుకుని రాస్తే తప్ప మనకు తెలియదు. మీరు చినువా అచెబె పేరు విన్నారా? థింగ్స్ ఫాల్ అపార్ట్ అనే నవల చదివారా?’ అనడిగాడు.

ఇద్దరం కూడా తెలియదన్నట్టు తలాడించాం. కాని ఆయన అచెబె గురించి చెప్పలేదు. అది మా స్థాయికి అందదని అనుకుని ఉంటాడు.

‘లేదా, ఎవరేనా నాన్ ట్రైబల్ ట్రైబల్స్ గురించి మాట్లాడితే, అతను వాళ్లల్తో కలిసి మెలిసి జీవించినవాడై ఉంటే, దెన్ ఐ కెన్ సే, హిజ్ అకౌంట్ ఆఫ్ దెమ్ ఇస్ సమ్ థింగ్ నియరర్ టు ద ట్రూత్. గిడుగు రామ్మూర్తి పేరు విన్నారా?’ అనడిగాడు.

మళ్ళా తల అడ్డంగా ఆడించాం.

‘సో శాడ్. మరి మీ స్కూళ్ళల్లో ఏం చెప్తారు? ఎవరి గురించి చెప్తారు? గిడుగు రామ్మూర్తి మా కోరాపుట్ జిల్లాలో సవర చిల్డ్రన్ కోసం సవర మీడియంలో మొదటి స్కూల్ తెరిచినప్పటికి ఇండియాలో యాంత్రొపాలజీ అనే మాటనే పుట్టలేదు. అఫ్ కోర్స్, ఆయనకన్నా ముందు కొంత మంది మిషనరీస్ నార్త్ ఈస్ట్ లో స్కూల్స్ తెరిచారనుకో. కాని వాళ్ల ఎజెండా వేరు’ అని అన్నాడు.

ఇది, సరిగ్గా ఇటువంటి విశేషాలే కదా, ఈయన్నుంచి వినాలని అనుకున్నాది. మొన్న ఆయన్ని పుస్తకాల గురించి అడిగినప్పుడు నేను సరిగా చెప్పలేకపోయానుగాని, ఇలాంటి సంగతులు తెలుసుకోవాలనే  కదా అప్పుడు నా మనసులో ఉన్నది.

‘బట్ ఆనెస్ట్లీ, ఐ యామ్ నో లాంగర్ ఇంటరెస్టెడ్ ఇన్ దైర్ కల్చర్ అండ్ రిచ్యువల్స్. చూడండి. మీ ఊరే తీసుకోండి. ఇక్కడ పిల్లలకి చదువుకోడానికి సరైన నీడలేదు కాని ఊరంతా రామనవమి సెలబ్రేషన్స్ కి డబ్బులు కర్చుపెట్టడానికి సిద్దంగా ఉన్నారు. ట్రైబల్ లిటరసీ రేట్ ఎంతో తెలుసా? నా దగ్గర 71 సెన్సస్ డాటా మాత్రమే ఉంది. దాని ప్రకారం అయిదు శాతం. ఒన్లీ ఫైవ్ పెర్సంట్. ఐ యామ్ డీప్లీ డిస్టర్బ్డ్. ఫైవ్ పెర్సంట్. ఏం చేస్తే మనం లిటరసీ ఇంప్రూవ్ చెయ్యగలుగుతాం? ఆల్ మై థాట్స్ ఆర్ అరౌండ్ దట్ క్వశ్చన్ ఒన్లీ..’అని,

‘ఒకే, ఇప్పటికే చాలాసేపయింది. రేపు ఫీల్డ్ టెస్ట్ చేసాక ఏవైనా మాడిఫికేషన్స్ అవసరమైతే చూసుకుని ఫైనల్ ఫార్మాట్ ప్రింట్ కిస్తాను. నర్సీపట్నంలో ప్రింట్ చేయించవచ్చని దేవయ్య చెప్పాడు. మీ పండగ అయ్యేటప్పటికి ఆ ఫార్మాట్స్ కూడా రెడీగా ఉంటాయి. పండగ అయిపోగానే పని మొదలుపెడదాం’ అని అన్నాడు.

మేము కూడా లేచి సెలవుతీసుకున్నాం.

‘రేపు ఒక హౌస్ హోల్డ్ సాంపిల్ సర్వే చేద్దామన్నారు-‘ అని గుర్తు చేసాడు రాజు.

‘అవును, ఐ రిమెంబర్ దట్. లెట్ అజ్ మీట్ ఎట్ విమలాస్ ప్లేస్ టుమారో ‘ అని అన్నాడు డా. మిశ్రా, వీడ్కోలు పూర్వకంగా మాతో చేతులు కలుపుతూ.

బయటకు అడుగుపెట్టాం. నా మనసంతా బరువుగా అయిపోయింది. ఎన్నో విషయాలు, గుక్కతిప్పుకోడానికి వీల్లేనట్టుగా, ఆయన నా మనసులో కుక్కిపెట్టేసాడు. నేను విన్నది నెమ్మదిగా నెమరువేసుకుంటూ నడుస్తూ ఉండగా,

అప్పుడు వినిపించింది, ఆ మధ్యహ్న వేళ, మామిడిచెట్లమీంచో, లేక కోండకింద లోయలోంచో, లేదా దూరంగా పొలాలమీంచో-

కోకిల కూజితం.

ఆ కూత వినగానే హఠాత్తుగా ఒక మెరుపు మెరిసినట్టూ, అలా మెరిసిన చోట భళ్ళున కాంతివిచ్చినట్టూ అనిపించింది. పట్టపగలే, కాని పట్టలేనంత కాంతి.

21-4-2023

17 Replies to “ఆ వెన్నెల రాత్రులు-17”

  1. చిన్నప్పటి నుంచీ సత్యదర్శనం చేయడమే వ్యావృత్తిగా ఉన్న మీరు ఆ వెన్నెలని మాకు పంచుతున్నారు. మీరు రాసే ప్రతి అంశంలోనూ విలక్షణమైన అంతస్సౌందర్యం తొణికిసలాడుతుంది. అన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటున్నాయి.

  2. ఇవాల్టి వెన్నెల రాత్రుల భాగం చదువుతుంటే నేను పనిచేసిన పాఠశాలల్లో నేనేమి చేసాను అని ప్రశ్నించుకోవాలనిపించింది. నా మట్టుకు నాకు తృప్తికరమైన జవాబు వచ్చింది. నేను ఎంత చెయ్యగలనో అంత చేసానన్న ఆత్మ సంతృప్తి మిగిలింది. కాని అదే సమయంలో పైనుండి కిందిదాకా ఉన్న నిర్లక్ష్య ధోరణిని ఎదుర్కున్న విషయం గుర్తుకు వచ్చింది. మీకదినిత్యానుభవం.
    నేను రాసిన వాటిలో మా పార్థసారథి సారు మా ఊరిలో తెచ్చిన మార్పు గురించి రాసాను.
    నా ఉపాధ్యాయ(ఉద్యోగ పర్వంలో) నేనెదుర్కొన్న ఛాలెంజెస్ రాసాను.
    ఇవాళ ఇది చదువుతుంటే ఎంత ఉత్తేజకరంగా ఉందో చెప్పలేను.ఇది పూర్తైన తరువాత మనదేశంలోకి అన్ని భాషలలోనికి అనువదించబడి, అందరు వినయవంతులైన విద్యార్థులను చేరాలి.
    దేశం నీకేమిచ్చిందని కాదు దేశానికి నువ్వేమిచ్చావు
    అన్న వ్యాఖ్య గుర్తుకు వచ్చింది. అన్ని పాత్రల్లో
    మీరు స్ఫటికధూమంలాగా కనిపిస్తున్నారు.
    ఇది మీ సకలోహ సనాథమని చెప్పవచ్చునేమో.

      1. ఆయన విశ్వనాథ గృహనామ్నులు. మీరు విశ్వసాహిత్య విజ్ఞాతులు. నాటి కాలానికాయన . కాదనలేం. కాని నేటి కాలానికి మీ అమూల్య చింతన అక్షరేక్షణ గా రూపొంది వివేచనను పెంచుతుందని నా విశ్వాసం.విశ్వనాథకు సడలని అభిమానులున్నట్టే మీకు కూడా ఉన్నారు. అది దీపాన్ని వెలిగించే దీప సంస్కృతిగా మారుతుంది.
        అంతటి. గౌతమరావుగారే విశ్వనాథ సముద్రపు దిబ్బను ఆమోదించలేదు. కానీ ఆయన మీద గురి సడలలేదు. మీది విశ్వహిత జనార్దన సాహిత్యం .
        మీ సాహిత్యానికి విస్తృత ప్రచారం కావాలి. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా మీ రచనా ప్రస్థానాన్ని గమనిస్తున్నాను గనుక మీ విశ్వసాహిత్య పరిశీలన, విశ్లేషణ, సంయమన దృక్పథం అనేక మందికి చేరాలి. ద్రష్ట స్రష్ట సమతౌల్యం లో ఉన్న మీ రచనలు జాతికి చైతన్య ప్రబోధాలు.. విశ్వనాథ శార్వరి నుండి శార్వరి దాక కు కొన సాగింపు మీ శార్వరి నుండి శార్వరి దాకా. ఇది పూర్తయిన తరువాత సుదీర్ఘ వ్యాసం ఫేస్ బుక్ కోసం రాస్తాను.
        అది పాఠకుడిగా నా బాధ్యత. మిమ్మల్ని ప్రశంసించడం నా దృష్టిలో ఒక గొప్ప ప్రయోజనాన్ని ఆశించడమే. నమస్సులు.

  3. “సకలోహ వైభవ సనాథ” మంటే ఏమిటి సర్?
    Please pardon my ignorance. 🙏🏽

    1. సకల+ఊహ (సమస్త ఊహాశాలిత్వంతో కూడిన)

      విశ్వనాథసత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని తన సకలోహ వైభవ సనాథంగా రాస్తానని చెప్పుకున్నారు.

  4. Many thoughts remain as thoughts,some as words.henceforth change is incomplete….if at all change happened it augured a conversion to artificiality.Great going sir.Namaste.

  5. ఇవాళ్టి భాగం చదివాకా అనిపించిన మాట every individual adds some value in their unique way.

    థింగ్స్ ఫాల్ అపార్ట్ చదివినప్పుడు రాసిపెట్టుకున్న మాటలు.

    “థింగ్స్ ఫాల్ అపార్ట్’ లో చినువా అచేబే చెప్పిన గాథ మొత్తం ఒక ఎత్తూ పుస్తకం చివర రాసిన ఈ చిన్న పేరా ఇచ్చే ఇంపాక్ట్ ఒక ఎత్తూ నాకు అనిపించినంతలో. ఎంత గూడుకట్టుకున్న ఆవేదనా ధర్మాగ్రహమూ కలిస్తే ఇట్లాంటి వాక్యాలు పుడతాయో!? ఆ రాయబోయే పుస్తకానికి ఆ ఇంగ్లీషు మేజిస్ట్రేటాయన పెట్టుకున్న పేరు అల్టిమేట్ వ్యంగ్యం నా లెక్కయితే.

    “The Commissioner went away, taking three or four of the soldiers with him. In the many years in which he had toiled to bring civilization to different parts of Africa he had learnt a number of things. One of them was that a District Commissioner must never attend to such undignified details as cutting down a dead man from the tree. Such attention would give the natives a poor opinion of him. In the book which he planned to write he would stress that point. As he walked back to the court he thought about that book. Every day brought him some new material. The story of this man who had killed a messenger and hanged himself would make interesting reading. One could almost write a whole chapter on him. Perhaps not a whole chapter but a reasonable paragraph, at any rate. There was so much else to include, and one must be firm in cutting out details. He had already chosen the title of the book, after much thought: The Pacification of the Primitive Tribes of the Lower Niger.”

    – “Things Fall Apart” Chinua Achebe

  6. “నువ్వు లెర్నర్ గా మారితే నీకు తన రహస్యాలు చెప్పటానికి ఈ ప్రకృతి మాత్రమే కాదు, ఈ ప్రపంచం కూడా సిద్ధంగా ఉంటుంది.–“

  7. Satya Sai - Vissa Foundation సత్యసాయి - విస్సా ఫౌండేషన్ says:

    ‘”యెస్, మేడమ్. నేనేమనుకుంటానంటే, ఒక విద్యావంతుడు ఒక గ్రామానికి వెళ్ళిన తరువాత, అక్కడ ఒక రోజు ఉండనీ, వన్ యియర్ ఉండనీ, అతను అక్కణ్ణుంచి వెళ్ళిపోయేలోపు ఆ గ్రామనికి ఏదో ఒక మేలు జరగాలి. అతను వెళ్ళకముందు గ్రామానికీ, వెళ్లిన తరువాత గ్రామానికీ మధ్య డిసైడెడ్లీ ఒక టాంజిబుల్ బెనెఫిట్ సమకూరి ఉండాలి. లేకపోతే అతని చదువుకి అర్థమే లేదు. అందుకనే గాంధీగారు యువతీయువకుల్ని గ్రామాలకి వెళ్ళమని చెప్పారు. అక్కడ ఉండమని చెప్పారు. అండ్, లెట్ మీ టెల్ యూ, ఫర్ హిమ్, ఫ్రీడమ్ మూమెంట్ వజ్ నధింగ్ బట్ విలేజ్ రికన్స్ట్రక్షన్’ అని అన్నాడు.”

    ఈ వాక్యాలు ప్రతీ పుస్తకంలోనూ, ప్రతి ట్రయినింగ్ సెంటర్ లో గోడమీద రాసి ఉంచాల్సిన సూక్తులు, రాజ్యాంగం లో చేర్చాల్సిన సూత్రాలు మీ ప్రతిభకు సాష్టంగ దండ ప్రణామాలు!

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading