ఆ వెన్నెల రాత్రులు-16

Image design: Mallika Pulagurtha

ఉగాది వెళ్ళిన మర్నాడు పొద్దున్నే మా ఇంటిదగ్గర జీపు ఆగింది. దేవయ్య తలుపు తీసుకుని లోపలకి వస్తుంటే ఆయన వెనక ఒకాయన లోపల అడుగుపెడుతూ ఆ వాకిట్లో నిలబడి ఉన్న నా దగ్గరకొచ్చి ‘మీరేనా విమల, గ్లాడ్ టు సీయూ. మై సెల్ఫ్ మనోరంజన్ మిశ్ర. ప్రొఫెసరు సేన్ గుప్త ప్రాజెక్టులో యాంత్రొపాలజిస్టుని అని పరిచయం చేసుకున్నాడు.

మనిషి ముప్పై అయిదేళ్ళ వయసుండొచ్చు. కోలగా ఉన్న ముఖం, రిమ్ లెస్ కళ్ళద్దాలు, చక్కగా పాపిడి తీసి దువ్వుకున్న జుత్తు, జీన్సు పాంటుపైన ఫుల్ స్లీవ్స్ చొక్కా, ప్లెయిన్ షర్ట్. కానీ స్లీవ్స్ మోచేతులదాకా వెనక్కి మడుచుకోకుండా వదిలేశాడు. ఆ కళ్ళల్లో సూటిదనం తో పాటు ఒక అవిశ్రాంతికూడా కనిపిస్తోంది. అట్టే సమయం లేదన్నట్టూ, నన్ను పరిచయం చేసుకోగానే తక్కిన పనులమీద పోడానికి సిద్ధంగా ఉన్నట్టూ కనిపిస్తున్న వాలకం.

నేను నమస్కారం పెట్టి లోపలకి ఆహ్వానించాను.

‘నో, ఐ నీడ్ టు గెట్ గోయింగ్. చాలామందిని కలవాలి’ అన్నాడు నేను ఊహించినట్టే.

‘ప్లీజ్, ఇంటికి వచ్చారు కదా!మా వాళ్ళని పరిచయం చేస్తాను, రండి’ అని లోపలకి పిలిచి, అరుగు మీద కుర్చీ వేసాను. గోద్రెజ్ ఛైర్. అది అప్పటికే ఒక పక్క తుప్పు పడుతుతోంది. కాని ఒక గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటికి వచ్చి కుర్చీలో కూచుని మాటాడే అతిథులు ఎప్పుడోగాని రారు.

ఆయన లోపలకి వచ్చికూచున్నాడు. చేతిలో ఒక నోట్ పాడ్ ఉంది. ఆ పాడ్ వొళ్ళో పెట్టుకుని చుట్టూ కలయచూసాడు. సూర్యనారాయణమూర్తిగారూ, పిల్లలూ కూడా బడికి వెళ్ళిపోయారు.రామలక్ష్మిగారిని పరిచయం చేస్తాను రమ్మంటే ముందు ఆమె చాలా కంగారుపడిపోయింది. ఎట్టకేలకు తలుపు పక్కనే సగం దాక్కుని ఆ వచ్చిన అతిథికి నమస్కారం పెట్టి మంచినీళ్ళు తీసుకువస్తానని లోపలకి వెళ్ళిపోయింది.

డా. మిశ్రా నన్ను కూడా కూచోమన్నాడు. అక్కడ మరో కుర్చీ లేకపోడంతో, కిందనే అరుగుమీద కూచున్నాను. ఆయన నేరుగా తను చెప్పాలనుకున్న విషయంలోకి వచ్చేసాడు.

‘నేను పొద్దున్నే వచ్చాను. ఫారెస్టు ఆఫీసరు గారు ఏర్పాటు చేసిన అకామడేషన్ లోనే ఉంటాను. రేపూ, ఎల్లుండీ రెండు రోజుల పాటు ఇక్కడ ముఖ్యమైనవాళ్లని, సమితి ఆఫీసు అధికారుల్ని కలవాలి. వీలైతే ఒకసారి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కీ, ఐటి డి ఏ ఆఫీసుకీ కూడా వెళ్ళిరావాలనుకుంటున్నాను. మనం రెండుమూడు రోజుల తర్వాత మళ్ళా కలుద్దాం. నేను ఇక్కడికే మీ ఇంటికే వచ్చేస్తాను. లెట్ అజ్ చాక్ ఔట్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దెన్ ఇట్ సెల్ఫ్. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ’ అని లేచి షేక్ హాండిచ్చాడు. నేను మొహమాటంగానే చేయికలిపాను. ‘ప్రొఫెసర్ స్పోక్ వెరీ హై అబౌట్ యూ’ అని కూడా అన్నాడు.

నాకేమనాలో అర్థం కాలేదు. ప్రొఫెసర్ సేన్ గుప్త ఎక్కడ? నేనెక్కడ? అసలు అటువంటి మనిషితో కూచుని మాటాడటానికి కూడా నా అర్హత సరిపోదు. కానీ, ఆ మాటవినగానే ఎందుకో చాలా సంతోషమనిపించింది. ఆయన ఏమన్నాడో అడగాలని కూడా అనిపించింది.

‘బై ది బై, ఈ ఊళ్ళో ఎవరైనా యూత్ కనబడ్డారా? ఎనీ గ్రాడ్యుయేట్స్?’అనడిగాడు.

‘ఒకతను ఉన్నాడు. బి ఏ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. పేరు రాజు ‘ అని చెప్పాను.

‘దేవయ్యకు తెలుసా?’

తెలుసని చెప్పాను.

‘దట్స్ గుడ్.అతనికి కబురు చేస్తాను. వస్తాను’ అన్నాడు కుర్చీలోంచి లేస్తూ.

పిన్నిగారు ఆయనకి చిన్న స్టీలు గ్లాసులో కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ గ్లాసు అందుకుని మళ్లా కుర్చీలో కూచున్నాడు.

నేను నెమ్మదిగా గొంతు సవరించుకుని ‘నేను బోటనీ స్టూడెంట్ ని. యాంత్రొపాలజీ ఏమీ తెలియదు..’ అని అనబోతూండగా,

‘నో ఇస్స్యూస్. అదీ కాక,  ప్రొఫెసరు టోల్డ్ మీ దట్ యు ఆర్ ఎ స్మార్ట్ లెర్నర్ ‘ అన్నాడు కనిపించీ కనిపించకుండా చిరుమందహాసం చేస్తూ.

‘ఏవైనా పుస్తకాలు ఉన్నాయా?’ అనడిగాను, సందేహిస్తూనే.

‘ఏం పుస్తకాలు?’

‘ట్రైబల్స్ గురించి. ఈ ఊళ్ళో ఉన్నవాళ్లని కొండరెడ్లు అంటారని తెలిసింది. వాళ్ల గురించి తెలుసుకోడానికి ఏవైనా పుస్తకాలున్నాయా?’

డా.మిశ్రా ముఖంలో ఒకింత అసహనం తొంగిచూసింది.

‘మీ చుట్టూ ఉన్న ట్రైబల్స్ గురించి తెలుసుకోడానికి పుస్తకాలెందుకు? డైరక్టుగా వాళ్లనే పోయి కలుసుకుంటే తెలుస్తుంది కదా. వాళ్ళతో మాట్లాడినా తెలుస్తుంది’ అని అంటూ కుర్చీలోంచి లేచాడు.

‘నిజమే అనుకోండి, కాని యాంత్రొపాలజీ ఒక సైన్స్ కదా, హూమన్ సైన్స్. అందుకని ఎంతో కొంత మెథడాలజీ తెలిస్తే బాగుంటుందని అనుకున్నాను. ఏవైనా ఎత్నాలజీ పుస్తకాలు-‘ అంటూండగా

అతని కనుబొమలు ముడిపడ్డాయి. అసహనం పూర్తిగా ముఖమంతా ఆవరించింది.

‘ఎత్నాలజీ! ఎక్కడ విన్నారు ఆ మాట? ఇట్ ఈజ్ ఎ నైన్ టీన్త్ సెంచరీ వర్డ్. నన్నడిగితే ఆల్ ఎత్నాలజీ ఈజ్ మియర్ హియర్ సే ‘ అంటాను. ‘డోంట్ బాదర్ అబౌట్ బుక్స్ అండ్ సైన్స్. లెట్ అజ్ టాక్ అబౌట్ పీపుల్, వర్క్ ఆన్ దెమ్ అండ్ ఫర్ దెమ్ ఒన్లీ’ అని చకచకా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్లిపోయాడు. నేను వీథిదాకా వెళ్లాలన్న మర్యాద గుర్తొచ్చి బయటకి అడుగుపెట్టేటప్పటికే జీపు కదిలిపోయింది.

నేనడిగిన మాటలో అతనికి అంత కోపం రావలసిన  విషయం ఏముందో అర్థం కాలేదు. నాకు ఒకసంగతి గుర్తొచ్చింది. ఒకరోజు ప్రొఫెసరు సేన్ గుప్తా తో మాట్లాడుతుండగా, ఆయన గదిలో ‘ద టెస్టిమొని ఆఫ్ ద రాక్స్’ అనే పుస్తకం చూసాను. ఆ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉండటంతో ఆ పుస్తకం తీసుకుని పేజీలు తిరగేసాను. అందులో ఏముందో నాకంతగా అర్థం కాలేదు.

‘ఇందులో ఏమి రాసి ఉంది?’ అనడిగాను.

సేన్ గుప్తా తన నోట్సు రాసుకుంటున్నవాడు తలపైకెత్తి ఆ పుస్తకం కేసి చూసి ‘అదా, థియాలజీ ఆఫ్ జియాలజీ’ అన్నాడు. ఆ మాట మరింత ఆశ్చర్యకరంగా ఉండటమే కాక, నన్ను మరింత అయోమయానికి గురిచేసింది.

‘అంటే ఏమిటి?’అని మళ్ళీ అడిగాను.

ఆయనకి నా సమస్య అర్థమయినట్టుంది. ఒక చిరునవ్వు నవ్వాడు.

‘అది బైబిల్లో చెప్పిన భూమి వయస్సుకీ, సైన్సు ద్వారా తెలుస్తున్న జియొలాజికల్ టైమ్ కీ మధ్య సమన్వయం చేస్తూ ఒక జియాలజిస్టు ఇచ్చిన లెక్చెర్లు. ఒక స్కాటిష్ జియాలజిస్టు. చివరికి సూయిసైడ్ చేసుకున్నాడు. ఫైనల్ గా చెప్పాడనుకో, బైబిల్ సైన్సు కాదు అని. నైంటీన్త్ సెంచరీలో సైంటిస్టులు చాలామంది తమ మీద ఈ బాధ్యత ఒకటి ఉందనుకునేవారు. అంటే సైన్సూ, రెలిజియనూ రెండూ చెప్తున్నది ఒకటే అనో లేదా ఆ రెండింటి గమ్యమూ ఒకటే అనో, అలాంటిదే ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నించేవారు. ఈ రోజు సైన్సు ఆ అవసరం నుంచి చాలా దూరం వచ్చేసింది. ఇప్పుడెవరకీ అలాంటి ప్రయత్నాలు, కనీసం ఎర్త్ సైన్సెస్ వరకూ చేసే అవసరం కనిపించడం లేదు’ అని అన్నాడు.

‘అయితే మరి మీరెందుకు ఈ పుస్తకం దగ్గర పెట్టుకున్నారు?’

‘విమలా!’ ఆయన తన చేతిలో ఉన్న పెన్ను పక్కన పెట్టి తన నొసటిని చేత్తో రుద్దుకున్నాడు. ‘ఐ థింక్ ఐ నీడ్ టు ఎలాబొరేట్ ఏ బిట్’ అని చెప్పడం మొదలుపెట్టాడు.

‘సైన్సు లో ట్వెంటియెత్ సెంచరీలో గొప్ప ప్రొగ్రెస్ సంభవించింది. ముఖ్యంగా మన టూల్స్, మన సైంటిఫిక్ మెథడ్, మనం సేకరించుకుంటున్న డేటా, అంతర్జాతీయంగా సైంటిస్టులు తాము చూసిందీ, గ్రహిస్తున్నదీ ఎప్పటికప్పుడు పంచుకోగలిగిన సామర్థ్యం, మన కమ్యూనికేషన్ టెక్నాలజి- మనం చరిత్రలో ఎప్పుడూ లేనంత ప్రెసిషన్ తో దేన్నైనా పరిశీలించగలుగుతున్నాం, రికార్డు చేయగలుగుతున్నాం, ఒకరితో ఒకరం షేర్ చేసుకోగలుతున్నాం. కాని నైంటీన్త్ సెంచరీ లో ఇంత ప్రెసిషన్ లేదు, మన టూల్స్, మన డివైసెస్ మన అబ్సర్వేటరీస్ ఇంత పవర్ ఫుల్ కాదు. కాబట్టి ఆ రోజుల్లో శాస్త్రవేత్తలు తాము చూడగలిగింది చాలా స్వల్పమనే మెలకువలో ఉండేవారు. తాము చూడగలిగిన ఆ కొద్ది విషయాన్ని బట్టీ, చూడలేని దాన్ని ఊహాగానంతో పూరించాలనుకునేవారు. అంటే ఎంత అబ్సర్వేషన్ ఉండేదో, అంత ఇమాజినేషన్ కూడా ఉండేదన్నమాట. యు నో ప్రెటీ వెల్ దట్ ఐ లైక్ ఇమాజినేషన్. ఐ లైక్ పొయెట్రీ. ఇమాజినేషన్ ఈజ్ ఎ క్రియేటివ్ ప్రాసెస్. చాలాసార్లు సైంటిస్టులు చెప్పినదానికన్నా కూడా సైంటిఫిక్ ఫిక్షన్ రైటర్స్ ఊహించినవి ఎక్కువ నిజమవడం, అందుకనే, నాకు ఆశ్చర్యమనిపించదు. నిజానికి భాష మెటఫరికల్ గా ఉన్నప్పుడే చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటుంది. కాని సైంటిఫిక్ లాంగ్వేజి, లీగల్ లాంగ్వేజి మెటఫరికల్ గా ఉంటే కుదరదు. ఒకటి పట్టుకుంటే రెండోది వదిలెయ్యాలి. కాని ఐ యామ్ ఎ లిటిల్ బిట్ ఎరాటిక్. నా కళ్ళకి సైన్సు కావాలి, చెవులకి కవిత్వం కావాలి.’

ఆయన అక్కడితో ఆగబోయాడుకాని, మరొక రెండు మూడు మాటలు చెప్పాలనిపించినట్టుంది. మళ్ళా చెప్పడం మొదలుపెట్టాడు.

‘ఒకప్పుడు ఇంగ్లాండులో ఫ్రాన్సిస్ బేకన్ అనే తత్త్వవేత్త ఉండేవాడు. సెవెంటీన్త్ సెంచరీ మాన్. సైంటిఫిక్ మెథడ్ అనే దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడిగా ఆయన్ని గుర్తుపెట్టుకుంటారు. ఆయన అన్నాడట: నాట్ టు ఇమేజిన్ ఆర్ సపోజ్, బట్ టు డిస్కవర్ వాట్ నేచర్ డజ్ ఆర్ మే బి మేడ్ టు డు అని. ఆ మాటలు దాదాపుగా ప్రతి సైంటిస్టూ కోట్ చేస్తుంటాడు. కాని నాకు అర్థం కానిదేమిటంటే, ఇమాజినేషన్ కీ, డిస్కవరీకీ తేడా ఎక్కడుందని. కొలంబస్ తాను ఇండియా వెళ్తున్నాను అనుకుని ప్రయాణం చేసి ఉండకపోతే అమెరికాని డిస్కవర్ చేసి ఉండేవాడా? కానీ దాదాపుగా సైంటిస్టులంతా ఇమాజినేషన్ ఈజ్ ద డొమేన్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఆర్ట్ అనుకుంటారు. బట్, నా దగ్గర ఎంత ప్రిసైజ్ టూల్స్ ఉన్నా, నేను కలెక్ట్ చేసిన సాంపిల్స్ ని ఎంత కెమికల్ అనాలిసిస్ కి గురిచేసినా,  ఒక కొండ నాతో మాట్లాడే మాటల్ని సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఎప్పటికీ తక్కినవాళ్లకి తెలియచెయ్యలేను. జాన్ మూర్ అని ఒక మౌంటనీర్ ఉండేవాడు. పందొమ్మిదో శతాబ్దంలో అతను వెస్ట్ అమెరికాలో తిరగని కొండలేదు, చూడని అడవిలేదు. అతని ట్రావెలోగ్స్, ఉత్తరాలు, డైరీలు చదివితే కలిగే సంతోషం నాకు ఎన్ని జియాలజీ పుస్తకాలు చదివినా కలగదు. నా సూట్ కేసులోనో లేకపోతే ఒరుణిమ దగ్గరో అతని పుస్తకం ‘మై ఫస్ట్ సమ్మర్ ఇన్ ద సియెర్రా’ ఉండాలి, చూడు, చదివితే నీకే తెలుస్తుంది’ అని కూడా అన్నాడు.

ఇప్పుడు డా.మిశ్రా మొత్తం ఎత్నాలజీ అంతాకూడా చెప్పుడుమాటలకన్నా మించిందికాదని అనగానే ప్రొఫెసరు ఆ మాటలు వింటే ఏమనిఉండేవాడా అనిపించింది.

ఆ సాయంకాలం రాజు వస్తాడేమో అని ఎదురుచూసాను. ఈ రోజు డా.మిశ్రా రావడం, మా మధ్య సంభాషణ అన్నీ అతనికి చెప్పొచ్చనుకున్నాను. కాని రాజు రాలేదు. రాత్రి పొద్దుపోయేదాకా చూసాను. రామకోవెలలో డ్రామా ట్రూపు రిహార్సలు చాలాసేపు నడిచింది. రామనవమికోసమని రామకోవెలకి రంగులు వేయడానికీ, పందిరి వెయ్యడానికీ, తక్కిన ఏర్పాట్లకీ బడిని కొన్ని రోజులపాటు విలేజి చావిడికి షిఫ్టు చేసారు. దాంతో నాటకబృందం మరీ తొందరగానే రిహార్సలు మొదలుపెట్టి రాత్రి చాలాసేపటిదాకా ప్రాక్టీసు చేస్తూనే ఉన్నారు. గట్టిగా ఇంట్లోకీ వినబడుతున్నా ఆ డైలాగుల్ని బట్టి ఆ కథ ఏమిటో ఊహించాలని చూసానుగానీ, తలాతోకా తెలియలేదు. బహుశా ఆ నాటకంలో ఒకటి రెండు స్త్రీపాత్రలు కూడా ఉండిఉంటాయి, ఆ డైలాగుల వంతు వచ్చినప్పుడు, ఎవరో వాటిని చదువుకుంటూపోతున్నారు. నాటకం వేసే రోజున ఎవరో ప్రొఫెషనల్ నటిని బయట ఊరినుంచి తీసుకువస్తారని రాజు చెప్పడం గుర్తుంది. శుక్లపక్షపు రాత్రులు, అందునా వసంత నవరాత్రులు కావడంతో, గాలంతా తియ్యదనం మూటగట్టినట్టు ఉంది. ఆ తీపిగాలి తాగుతూ చందమామ రోజురోజుకీ మరింత లావెక్కుతున్నాడు.

మిశ్రా వచ్చి వెళ్ళిన మూడో రోజు సాయంకాలం రాజు మా ఇంటికి వచ్చాడు. అతణ్ని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టనిపించింది. అతణ్ణి చూసిన ఉత్సాహం నా వదనంలో దాగకపోవడం అతను కూడా చూసినట్టున్నాడు.

‘ఏమింత ఉల్లాసంగా ఉన్నారు ఇవాళ?’ అనడిగాడు.

‘ఉల్లాసమా? నీరసం. ఆ మిశ్రా మాటలు నాకేమీ అర్థం కాలేదు. అందుకే నీ కోసం చూస్తూ ఉన్నాను’ అన్నాను.

‘మిశ్రాగారు గ్రేట్ మాన్’ అన్నాడు రాజు. ఆ మాటలంటూ కళ్ళు పెద్దవిచేసాడు. ఏదో వండర్ గురించి చెప్పబోతున్నప్పుడు మనుషుల ముఖంలో కనిపిస్తుందే, అలాంటి భావం అతని ముఖమంతా వ్యాపించింది.

‘నువ్వు కలిసేవా ఆయన్ని?’

‘మీరు నా పేరు చెప్పారట కదా. వెంటనే దేవయ్యతో నాకు కబురుపెట్టాడు. సాయంకాలం వెళ్ళి కలిసాను. నన్ను పరిచయం చేసుకోగానే ‘మీరు చదువుకుంటున్నారు కదా, మీ ఊళ్ళో స్కూలు ఇంత డిప్లోరబుల్ గా ఉంటే ఏం చేస్తున్నారు?’ అనడిగాడు. బిత్తరపోయాను. నన్ను గ్రామసర్పంచ్ అనుకుంటున్నాడా అని అనుమానమొచ్చింది. ‘ఏం సార్?’ అనడిగాను. ఆయన వకుళకుటిలో దిగగానే మీ ఇంటికొచ్చాడట. మిమ్మల్ని కలిసి మళ్లా వెనక్కి వచ్చేటప్పటికి విలేజి చావిడిలో స్కూలు నడుస్తుండటం చూసి లోపలకి వెళ్లి చూసాడట. పాడైపోయి పడిపోడానికి సిద్ధంగా ఉన్న గోడలు, కింద కన్నాలు పొడి పగిలిపోయిన గచ్చు, ఊడిపోతున్న కిటికీలు, అన్నిటికన్నా ముందు, ఆ కొండవార, ఆ తుప్పల్లోంచీ డొంకల్లోంచీ పామూపుట్రా ఆ బడిలోకొచ్చి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ఆ టీచర్లని అడిగాడట. ఇక నేను కనబడేదాకా దేవయ్యతో పదే పదే ఆ స్కూలు గురించే మాట్లాడుతున్నాడట. నన్ను చూడగానే ఏమనుకున్నాడో ఏమో ఆ ఆవేశం అంతా నామీద వెళ్ళగక్కాడు’ అన్నాడు.

‘ఇంటరెస్టింగ్’ అన్నాను. నేను అతనితో చెప్పాలనుకున్న మాటలు మర్చిపోయేను.

‘అంతేనా? ఇంకా ఉంది వినండి. నన్ను సర్పంచి దగ్గరకు తీసుకువెళ్ళమన్నాడు. అప్పటికే సాయంకాలం అయ్యిందా మన సర్పంచిగారు గుర్రమెక్కేసాడు. ఇలా కాదని మర్నాడు సమితి ఆఫీసుకి నన్ను కూడా తీసుకుపోయాడు. బిడీఓ తో మాట్లాడేడు. మాట్లాడటం కాదు, యుద్ధం చేసినట్టుగా అరిచాడు. మీ పంచాయతీ సమితి ఎందుకుంది? అక్కడ పిల్లలకేదైనా అయితే ఎవరు బాధ్యులు? లాంటి ప్రశ్నలు కురిపించాడు. బీడీవో ఆయనేదో ట్రైనీ కలెక్టరేమో అనుకుని ఒకటే వణికిపోతూ ఉన్నాడు.’

‘ట్రెయినీ కలెక్టరా?మనవాణ్ణి చూస్తే, సివిల్ సర్వీసు ఇంటర్వ్యూ బోర్డుతో తగాదా పెట్టుకోడానికి షర్ట్ ఫుల్ స్లీవ్స్ వెనక్కి లాగినవాడిలాగా ఉన్నాడు’ అన్నాను.

‘అది కూడా చెప్పాడు. ఐయ్యేయెస్ ఎగ్జామ్ రెండు సార్లు రాసేట్ట ఇంటర్వ్యూదాకా వెళ్ళాడట. రాలేదట. ఇంక అది తన పని కాదులే అనుకున్నాడట. ‘

‘ఓహో’ అనుకున్నాను. ‘ఆ తర్వాత?”

‘ఏముంది? బిడీవో ఫండ్స్ లేవన్నాడు. మీ జనరల్ ఫండ్స్ ఉంటాయి కదా అన్నాడు ఈయన. సమితిమొత్తం మీద అన్ని స్కూళ్ళూ అలానే ఉన్నాయనీ, ఏ స్కూలుకని డబ్బులివ్వగలనని నీళ్ళు నమిలేడు బీడీవో. మీకు వీలైతే కలెక్టరుగారికి చెప్పి జిల్లా పరిషత్తు ఛైర్మన్ కి ఒక మాట చెప్పించండి అని నసిగాడు కూడా. మనవాడు బయటికొచ్చాక కాకినాడ వెళ్దామంటాడేమో అనుకున్నానుగానీ, జీపు వెనక్కి తిప్పమన్నాడు.’రాజూ, ఇదంతా టైమ్టేకింగ్ బిజినెస్. నేను ఐటిడిఏ కి ఎలాగూ వెళ్దామనుకుంటున్నాను, ప్రాజెక్టు ఆఫీసరుతో మాట్లాడతాను. కానీ ఈ లోపు మనూళ్ళో బడిబిల్డింగ్ మనమే కడదాం’ అన్నాడు. ‘బిల్డింగా! మనం కట్టడమా!’ అన్నాను. ‘బిల్డింగ్ అంటే బిల్డింగ్ అని కాదు. కనీసం ఒక తాటాకు పాక వెయ్యలేమా? మీ ఊళ్ళో ఇళ్ళ చుట్టూ కట్టుకున్నారే అలా కంచె పెడదాం. ఆ కంచె చుట్టూ పూలతీగెలు పెడదాం. లోపల కిచెన్ గార్డెన్ వేద్దాం. మీ స్కూల్లో స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రాం నడుస్తున్నట్టుంది. దానికి ఆ కూరగాయలు వాడుకుందాం’ అన్నాడు. విమలగారూ! చెప్పొద్దూ! ఆయనలా చెప్తున్నప్పుడు, ఇదేమిటి, ఈయన ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడు? టోటల్ గా ఇక్కడే ఉండిపోడుకదా, వచ్చి రెండో రోజు కాలేదు, అప్పుడే మన ఊరు, మన స్కూలు అంటాడేమిటి- ఇలాంటి ప్రశ్నలు కలిగాయిగాని, వాటికన్నా ముందు ఆయన ఆ మాటలు చెప్తుంటే వినడం భలేసంతోషంగా అనిపించింది. తిరిగి వస్తున్నంతసేపూ ఇవే మాటలు చెప్తూ ఉన్నాడు. జీపు మనూళ్ళోకి వస్తూండగా, ‘ఏం రాజూ? డోంట్ యూ థింక్ ఇటీజ్ పాజిబుల్?’ అనడిగాడు. ‘మనకి సాధ్యం కాకపోతే మరెవరికి సాధ్యమవుతుంది సార్!’ అన్నాను. గుడ్. అన్నాడు, నా భుజం తట్టాడు.

నేను ఆలోచనలో పడ్డాను. నిజమే కదా. ఆ ఊళ్ళో వాళ్ళు తలుచుకుంటే ఏది సాధ్యం కాదు? నాలుగైదు నెలలు ఉండివెళ్ళిపోయే మా కోసమే ఒక కుటీరాన్ని నిర్మించిన ఊరు అది.

‘ఇంక నిన్నంతా ఊళ్ళో పెద్దమనుషులందరి దగ్గరికీ తిరుగుతూ ఉన్నాం. సర్పంచ్ గారు, కరణంగారు, మునసబు గారు, వి ఎల్ డబ్ల్యు గారు, చివరికి, ఆర్ అండ్ బిలో ఒక మైలు కూలీ కూడా మనూళ్ళో ఉన్నాడంటే అతనిదగ్గరకి కూడా తీసుకుపొమ్మన్నాడు. అతని ద్వారా పి డబ్ల్యు డిలోనో, ఆర్ అండ్ బి లోనో ఇంజనీర్ల వివరాలు తెలుస్తాయనీ, వాళ్లని పట్టుకోవచ్చనీ.’

‘చివరికి ఏమయ్యింది?’

‘ఏమవుతుంది?మనవాడు పట్టు పడితే వదలడని అర్థమయింది. ఊళ్ళో వాళ్ళతో శ్రమదానం చేయించి కొత్త బడి కట్టాలనీ, అది కూడా ఈ ఏప్రిల్ నెలాఖరులోపు వేసవి సెలవులు మొదలవకముందే కొత్తబళ్ళోకి అడుగుపెట్టాలనీ పంచాయతీ తీర్మానం చేయించాడు. బడికి కావలసిన తాటిదూలాలు ఒకాయన విరాళమిస్తానన్నాడు. వెదుళ్ళూ, తాటాకూ అడవినుంచి తెచ్చుకోడానికి ఫారెస్టు ఆఫీసరుని ఒప్పించాడు. మట్టిపని, కట్టడం, ఆకునెయ్యడం లాంటిదంతా గ్రామస్థులు శ్రమదానం చెయ్యాలి. ఇప్పుడు బడి బిల్డింగు ఉందే దాని పక్కన కడదామని నిర్ణయించారు. కాని ఆ బిల్డింగుకీ, ఈ కొత్తబడికీ మధ్యలో ఒక కంచె కూడా కడతారన్నమాట. అదీ ప్లాను.’

‘ఇదంతా ఒక్కరోజులో జరిగిందా?’

‘అవును. ఒక్కరోజే. ఇంకో మాట కూడా అన్నాడు. అసలు ఈ రామకోవెలనే బడిబిల్డింగు గా మార్చేస్తే బావుంటుంది కదా. అప్పుడు మీరు ప్రతి ఏడాదీ రామనవమికోసం ఇన్ని డబ్బులు కర్చుపెట్టాల్సిన పని ఉండదు అని కూడా అన్నాడు. ఆయన ఆ మాటలు ఇంగ్లిషులో చెప్పడం, నేను తెలుగులో తిరిగి చెప్పడం. మనూళ్ళో వాళ్ళు ఆ మాటలు నేనే చెప్తున్నట్టు నన్ను మిర్రిమిర్రి చూసారు’ అని అన్నాడు గట్టిగా నవ్వుతూ.

‘మరి ఆయన భోజనం? కొండమ్మగారు వస్తున్నారా?’

‘లేదట. జోసెఫ్ గారిని అడిగాడట. ఈ ఊళ్ళో హోటల్ ఏదైనా ఉందా అని. చిన్న టీబడ్డీలాంటిది ఉందనీ, గారెలూ, పుణుకులూ మటుకే వేస్తుంటారని చెప్పాడట ఫారెస్టరుగారు. అయితే వాళ్ళనే ఏదో ఒకటి తినడానికి ఇంత వండించి పాక్ చేసి పంపించమని చెప్పండి’ అని చెప్పాడట. ‘ఐ యామ్ నాట్ పర్టిక్యులర్ ఆబౌట్ ఫూడ్’ అని అన్నాడట అన్నాడు రాజు ‘ఫూడ్’అనే మాటని దీర్ఘంతీసి పలుకుతూ.

నేను ఆ మాటలు వింటూ అరుగుమీంచి లోపలకి తొంగిచూసాను. పిల్లలిద్దరూ ఇంకా పడుకోకుండా ఉన్నట్టయితే వెంటనే వాళ్ళదగ్గరికి పోయి ‘అమ్మాయిలూ, మీకు కొత్త స్కూలు వస్తోంది’ అని చెప్పాలనిపించింది.

రాజు ఇంకా ఆ విశేషాలే చెప్తున్నాడు.

‘ఆయన ఉత్కళ్ యూనివెర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అట. ప్రొఫెసర్ సేన్ గుప్తా తో అయిదేళ్ళుగా పరిచయం అట. ఆయన తన టీములో పనిచేయడానికి ఇటువంటి వాళ్లకోసం వెతుకుతుంటే వీళ్ల ప్రొఫెసరు సేన్ గుప్తాకి పరిచయం చేసాడట. ఐ యామ్ ఏ బ్లూ ఐడ్ బాయ్ ఆఫ్ ప్రొఫెసర్ సేన్ గుప్తా అని చెప్పుకున్నాడు నాతో.’

ప్రొఫెసర్ సేన్ గుప్తా కి బ్లూ ఐడ్ ఛైల్డ్ కానిదెవరు అనుకున్నాను.

‘మీ గురించి కూడా ప్రొఫెసరుగారు చాలా గొప్పగా చెప్పారట ఆయనకి.’

‘అవును. ఆ మాట నాతో కూడా అన్నాడు. కాని నా గురించి గొప్పగా చెప్పడానికి ఏముంది రాజూ? నేను కూడా నీకులాగే ఇంకా స్టూడెంట్ నే కదా. అదీ కాక, ఆయన ప్రాజెక్టుకి నిజంగా నేనేమి చేసానో నాకిప్పటికీ తెలీదు’ అన్నాను.

కాని అంతలోనే, రాజు గురించి తలుచుకుంటూ సేన్ గుప్తా చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అటువంటి యువకుడితో తాను తక్షణమే ప్రేమలో పడితీరాలని ఆయన అన్నమాటలు కూడా గుర్తొచ్చాయి.

అప్పుడు తెలియలేదుగాని, ఇన్నేళ్ళ జీవితం తర్వాత, ఇంత ప్రపంచం చూసాక ఇప్పుడు తెలుస్తోంది- సేన్ గుప్తా లాంటి ఉదారులు ఈ ప్రపంచంలో చాలా చాలా అరుదు అని. వాళ్లు ప్రపంచంలో ప్రతి ఒక్కరితోనూ ప్రేమలో పడగలరు. ప్రతి ఒక్కరి గురించీ మరొకరిదగ్గర పెద్దగా చేసి చెప్పగలరు. నాకు గుండెలో కన్నీళ్ళు కదలాడినట్టయింది.

రామకోవెల్లో రిహార్సలు మొదలయ్యింది. మళ్లా బల్లల చప్పుళ్ళు, టీ, టీ అనే అరుపులు, ‘ఇదిగో, ఈ కేరక్టరు ఇటునుంచి ప్రవేశిస్తాడు’, ‘అదేమిటి, అది స్వగతం రా బాబూ, డైలాగు అనుకుని పైకే చదివేస్తున్నావు’-

చివరి బస్సు కూడా వెళ్ళిపోయింది. చుక్కలన్నీ పంచమి చంద్రుడి చుట్టూ సభమొదలుపెట్టాయి. సేన్ గుప్తా గురించిన తలపులు, మిశ్రా గురించి విన్న మాటలు నా అంతరంగాన్ని స్తిమితంగా ఉండనివ్వడం లేదు.

‘ఇంతకీ ఎందుకొచ్చానంటే, మిశ్రా గారు రేపు మనిద్దరినీ పదింటికి రమ్మన్నాడు. మొన్న మీతో చెప్పినప్పుడు డైరెక్ట్ గా మీ ఇంటికి వస్తాను అన్నాట్ట కదా. కాదు, రేపు మనల్నే తన దగ్గరికి రమ్మన్నాడు.మనం చెయ్యాల్సిన పని గురించి చెప్తాడట. అన్నట్టు, మీకు ఈ ప్రాజెక్టుకి యూనిఫాం ఏమీ లేదండోయ్. మీకు ఎలా వీలైతే అలానే డ్రెస్ చేసుకు రమ్మన్నాడు.’

‘అయ్యో! నువ్వు డ్రెస్ సంగతి కూడా చెప్పేసావా ఆయనతో?’

‘అన్నీ చెప్పేసాను.’

కొంటెగా నవ్వుతున్న ఆ పిల్లవాడి కేసి చూసాను. ఆ పిల్లవాడెవరు? ఆ ఊరేమిటి? ఆ డా.మిశ్రా ఎవరు? ఎక్కడ మొదలుపెట్టాను? ఎక్కడికి వెళ్తున్నాను? జీవితం అంతే. ఒక తలుపు తెరిస్తే చాలు, మరెన్నో తలుపులు తెరుచుకుంటూ పోతాయి.

20-4-2023

6 Replies to “ఆ వెన్నెల రాత్రులు-16”

 1. అంతే. ప్రపంచం సువిశాలమైంది. చూడాలి అంతే. 🙏

 2. మీ ఈ రచన చదువుతుంటే కూడా అలాగే అనిపిస్తోంది సర్. “ఆ వెన్నెల రాత్రులు” అనే ఒక్క తలుపు తెరవగానే ఎన్నెన్నో తలుపులు తెరుచుకుంటున్నాయి. తెలియని విషయాలెన్నో చెప్తున్నాయి. Thank you sir! 🙏🏽

 3. ఏరోజుకారోజ ఎలుగెత్తు వెన్నెలలు
  క్రొంగొత్త విషయాలు కొసరు బహుమానాలు
  ఎదపూలచెండుగా మార్చు విద్యకు పేరు
  పుష్పవేదంటాను వీరభద్రుడు గురువు

  An education and reformation through a heart touching story. Apart from that , the human relationship is elevated In a great way. Metaphorical language is meaningful language, Blue eyed child, Ethnology, Bacon essays -these are all beautifully studded in the story.side by side Drama rehearsal is described in quite natural way.

Leave a Reply

%d