
Image design: Mallika Pulagurtha
డా.మిశ్రా ఉగాదివెళ్ళేక వచ్చాడు. అంతదాకా అడవినీ, కొండనీ పొలాల్నీ, ప్రకృతినీ మాత్రమే చూస్తూ వచ్చిన నాకు ఆ రెండువారాలూ ఆ ఊరు దగ్గరగా పరిచయమైంది. ఇంకా చెప్పాలంటే ఆ రెండు వారాలూ నేను ఆ ఊరికి అతిథిగా గడిపాను. అది ఎటువంటి ప్రపంచం కానివ్వు, చివరికి, నువ్వుండే సిటీలో, టౌనులో లేదా గ్రామంలో నువ్వు రోజూ జీవించే రోజువారీ జీవితమే కానివ్వు, నువ్వు అందులో భాగం అని కాకుండా, ఒక ఆగంతుకురాలిగా, ఒక అతిథిగా జీవించి చూడు. ఎంత కొత్త ప్రపంచం సాక్షాత్కరిస్తుందో ఊహించలేవు. మనుషులు దూరదేశాలకీ, తాము ఎన్నడూ చూసి ఉండని ప్రాంతాలకీ యాత్రలు చేయాలనుకోడానికీ, ప్రతి ఏడాదీ తీర్థయాత్రలకు బయల్దేరడానికీ కారణం ఇదే అనుకుంటాను. తమ హాబిట్ నుంచి, తమకి చిరపరిచితమైన హాబిటాట్ నుంచి బయటికి పోతే తప్ప తమ జీవితం కొత్తగా కనిపించదు. కానీ, ఆ రెండువారాల్లో ఆ ఊళ్లో నేను చూసిన ఇంద్రజాలం నా జీవితాన్నంతటినీ వెలిగించగల ఒక మంత్రాన్నిచ్చింది. అదేమంటే నువ్వెక్కడికీ పోనక్కర్లేదు. నీ మామూలు జీవితమే, కాని ప్రతి రోజూ కొత్త ప్రదేశంలో నిద్రలేచినట్టుగా నీ రుటీన్ లో అడుగుపెట్టు. రోజూ చూసే మనుషులే, కాని కొత్త మనుషుల్ని చూస్తున్నట్టుగా, ఆ వండర్ తో, ఆ క్యూరియాసిటీతో వాళ్ళకేసి చూడు, వాళ్ళు చెప్పే మాటలు విను. ప్రతి రోజూ పొద్దున్నే నీకు తారసపడే వదనాల్లో వాళ్ళు కితం రాత్రి కన్న కలలజాడల్ని పోల్చుకోడానికి ప్రయత్నించు అని చెప్పింది.
ఇదుగే, ఇన్నేళ్ళ తరువాత, ఇక్కడ ఈ నగరంలో కూచుని, నేనొకప్పుడు తిరుగాడిన ఆ అడవినీ, నివసించిన ఆ ఊరునీ, దర్శించిన ఆ కొండల్నీ గుర్తుచేసుకోబోతుంటే నా కిటికీ పక్క పసుపు తురాయి చెట్టు (రాధాచూర-అనాలి అంటుంది ఏమో వనలత) నా జ్ఞాపకాల్ని తను కూడా పంచుకుంటున్నట్టు కనిపిస్తోంది. పొద్దుణ్ణుంచీ ఆ చెట్టు మీద ఎన్ని పిట్టలు వచ్చి వాలతాయి! చూస్తుంటే, ఆ చెట్టు పక్షుల అభయారణ్యమా అనిపిస్తోంది. పొద్దున్నే ఎక్కణ్ణుంచో ఒక ఒరియోల్ వచ్చి వెళ్తుంది. ఆ తర్వాత నాలుగైదు చిలకలు చెట్టంతటినీ కొమ్మ, కొమ్మనీ పలకరించి వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఒక స్పాటెడ్ డోవ్. దాన్ని అడవిలో విన్నప్పుడల్లా అప్పుడే అడవి నిద్రమేల్కొంటున్నదా అనిపించేది. చివరికి మధ్యాహ్నాలవేళల్లో కూడా దాని కూత వినబడగానే అడవి దుప్పటి తొలగించి అదెక్కడుందో చూసుకుంటోందో అనిపించేది. ఆ తర్వాత రెడ్ వెంటెడ్ బుల్బుల్, బ్లాక్ బుల్బుల్, పిచికలు, పావురాలు ఆ చెట్టు తలుపులు నాలుగు వేపులా బార్లా తీసి వెళ్ళిపోతాయి. ఇక రోజంతా చిన్న చిన్న ప్రష్యన్ బ్లూ హైకూల్లాగా హనీ సకిల్స్ ఆ పూలగిన్నెల మూతలు తీస్తూనే ఉంటాయి. కొన్ని మూతలు కిందపడిపోతూ ఉంటాయి. ఆ చప్పుడు కళ్ళకి మాత్రమే వినబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆ అభయారణ్యంలో కొత్త అతిథి కాపర్ స్మిత్ బార్బెట్. అడవి ఒక కొలిమిగా అది చిగుళ్ళూ, పూలూ పోతపోసి కాంతిని చెక్కుతూ ఉంటుంది. దాని నుదుటిమీదా, వక్షస్థలమ్మీదా ఆ కొలిమి మంటలు సిందూరవర్ణాలై మెరుస్తాయి. అడవిమొత్తాన్ని ఒక్కసారిగా గొంతులోకి తీసుకున్నట్టుగా మింగేసి మళ్ళా పుక్కిలించి ఉమ్మినట్టుగా వినిపించే దాని కూజితం ఒక్కటి చాలు, ఈ రోజు మొత్తం వెలిగిపోయిందని నా డైరీలో రాసుకోడానికి.
ఆ రెండువారాలూ మరే పనిలేకుండా, పొద్దున్న లేచి ఒకరిదగ్గరకు వెళ్ళి నిలబడవలసిన అవసరం లేకుండా, సాయంకాలం అయ్యేటప్పటికి, ఆ రోజు చేసిన పని ఒకరికి రిపోర్టు చెయ్యవలసిన బరువుబాధ్యతలేమీ లేకుండా గడిపాను. చెట్లు ఎలా పెరుగుతున్నాయో, రోజూ ఎంత పెరుగుతున్నాయో మన కళ్ళకి కనిపించకుండానే, ప్రతి క్షణం పెరుగుతూనే వున్నట్టు, కొండలు యుగాల కాలమానంలో అంగుళాల దూరం జరిగినట్టు, ఆ పల్లెటూళ్ళో కూడా మనుషులు ముందుకు నడుస్తోనే ఉంటారు, పిల్లలు ఎదుగుతూ ఉంటారు, కన్యలు పెళ్ళీడుకు వస్తారు, నవవధువులు బాలెంతలుగా మారతారు, రైతులు వృద్ధులవుతారు, వాళ్ల పిల్లలు కొత్తగా మేడిపడతారు, ఇప్పుడే గిద్దలుగా కనిపిస్తున్నవి, ఇంతలోనే ఎడ్లుగా ఎదిగి మెడకు కాడి తగిలించుకుంటాయి. ఏమీ జరగనట్టుగా, ఎటూ కదలనట్టుగా, ఏమీ పట్టనట్టుగా, తనలో తను, తనకోసమే మాత్రమే తను అన్నట్టుగా ఉండే ఆ ఊళ్ళో, నువ్వు కళ్ళప్పగించి చూడాలే గాని, అనుక్షణం జీవితం ముందుకో, వెనక్కో, పక్కకో జరుగుతూనే ఉంటుంది. ఇంతలో సంతోషం, ఇంతలో విచారం, ఇంతలో కోపాలు, ఇంతలో శోకాలు, ఇంతలో తాపాలు, ఇంతలో ఓదార్పు- బహుశా ఒక మనిషి తనను తాను మర్చిపోడానికి ఒక గ్రామం కన్నా తగిన చోటు మరొకటి ఉండదేమో!
అంతకు ముందు పొద్దున్నే ఫీల్డ్ వర్క్ కి పరుగెత్తే తొందరలో మా ఇంటి ఎదురుగానే ఉన్న స్కూలు మీద నా దృష్టి పడనేలేదు. రామకోవెల్లో నడిచే ఆ స్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులు. ఒకరు పంతులమ్మగారు, పెద్దామె. మరొకరు ఉపాధ్యాయుడు, యువకుడు. ఆమె పెద్ద క్లాసులకి పాఠం చెప్పేవారు. ఆ క్లాసులు రామకోవెల లోపల జరిగేవి. ఆ మందిరానికి చుట్టూ ఇనపకటకటాలు. ఆమె చెప్పే పాఠాలూ, పిల్లలు అప్పచెప్పే పాఠాలూ కూడా ఊరంతా వినబడుతూనే ఉండేవి. ఆ ఉపాధ్యాయుడు చిన్న తరగతులకి చదువు చెప్పేవాడు. ఆ క్లాసులు రామమందిరం బయట అరుగుమీద నడిచేవి. గోడలూ, తలుపులూ లేని అరుగు అది. ఆ పిల్లలు అక్షరమాల, అంకెలు, ఎక్కాలు గట్టిగా చదివేవారు. లోపలా, బయటా ఆ పిల్లలు గట్టిగా అక్షరాలూ, లెక్కలూ, పద్యాలూ అప్పగిస్తుంటే ఊరంతా పాఠం చదువుకుంటున్నట్టు ఉండేది. రోజూ పొద్దున్న పది పదిహేను నిమిషాల పాటు హాజరు తీసుకునే రిచ్యువల్ నడుస్తూ ఉండేది. పంతులమ్మగారూ, పంతులయ్యా కూడా ఎవరికి వారు ఒకేసారి హాజరుపట్టీలోంచి పిల్లల పేర్లు గట్టిగా చదివేవారు. పేరు చదవగానే పిల్లలు ప్రెజంట్ సార్ అని అరిచేవారు. వారం రోజులు ఆ హాజరు పిలుపులు విన్నాక, ఆ పేర్లన్నీ నా నోటికి కూడా వచ్చేసాయి. అన్ని పేర్లూ అయిపోయాక, పంతులమ్మగారూ, ‘ఎస్. విమలా’ అని గట్టిగా పిలుస్తారని ఎదురుచూసేదాన్ని. నాలో నేనే మనసులో ‘ప్రెజంట్ టీచర్’ అని చెప్పుకునేదాన్ని. నేనక్కడ ఉండగానే ఆ స్కూలు రామకోవెల నుంచి కొత్తబళ్ళోకి వెళ్ళిపోయింది. ఆ ఉపాధ్యాయులు ఇప్పుడెక్కడున్నారో తెలీదు. నలభయ్యేళ్ళ కిందటి ఆ హాజరుపట్టీలు ఇంకా ఆ స్కూల్లో ఉండే అవకాశమే ఉండదు. కానీ, ఎవరేనా వెతికితే, బహుశా, ఆ పట్టీల్లో ఆ మార్చి నెలలో, ఆ పేర్లన్నిటి కిందా, ఒక అదృశ్యలిపిలో నా పేరు కూడా కనిపిస్తుందనే నా నమ్మకం.
పిల్లలు బడికి వెళ్ళే వేళకి అటూ ఇటూగా ఆవుల్నీ, మేకల్నీ మేతకు తోలుకుపోయే దృశ్యం కనిపిస్తుండేది. పిల్లలకు బడి, పశువులకు పచ్చిక ఉన్నంతకాలం ఆ ఊరుకి మరిదేంతోనూ పనిలేదన్నట్టే ఉండేది. అదే సమయానికి ఇళ్ళల్లో వంటలు మొదలయ్యేవి. ఆ ఇళ్ళగడ్డికప్పు మీంచీ, తాటాకు కప్పులమీంచీ వంటపొగ బరువుగా చుట్టలు చుట్టుకుంటూ పైకి లేచే దృశ్యం కళ్ళముందు నుంచి ఇప్పటికీ పక్కకి జరగడం లేదు. అనాది కాలం నుంచీ మనుషులు ఆకాశానికి అల్లిన తీగల్లాగా పొగ చింతచెట్లకీ, వేపచెట్లకీ, మామిడిచెట్లకీ నులితీగలు అల్లుకునేది.
పొద్దున్న బడి అయిపోయేలోపు ఇటునుంచి రెండు బస్సులూ, అటునుంచి రెండు బస్సులూ వచ్చి ఆగేవి. ఒకరో, ఇద్దరో దిగేవారు. ఒకరో, ఇద్దరో ఎక్కేవారు. మరో ఊరికి వెళ్ళవలసిన పనిలేకుండానే, మరొకరికి ఉత్తరం రాయవలసిన పనిపడకుండానే ఆ ఊళ్ళో చాలామందికి జీవితం నడిచిపోయేది.
మధ్యాహ్నం బడి విడిచిపెట్టాక ఊరంతా మాటుమణిగిన అర్థరాత్రిలాగా ఉండేది. ఆ అపరాహ్ణాలనిశ్శబ్దాన్ని భంగం చెయ్యడానికి ఎవరికీ ఇష్టం ఉండేది కాదనుకుంటాను. మళ్ళా రెండుగంటల తర్వాత స్కూలు గంటకొట్టగానే ఊళ్ళో నెమ్మదిగా చలనం మొదలయ్యేది. మూడింటికి అటూ ఇటూగా ఎవరో ఒకరు పక్కింటికి నిప్పు కోసం బయల్దేరేవారు. రేడియో సిలన్ లోంచి మీనాక్షి పొన్నుదొరై మృధుమధుర కంఠస్వరంలో అనౌన్స్ మెంట్లు మొదలుపెట్టేది. అప్పుడు వరసగా పాటలు వినిపించేవి. బళ్ళో పొద్దున్న వినిపించినంత గట్టిగా మధ్యాహ్నం పూట పాఠాలు వినిపించేవి కావు. సాయంకాలం బడి విడిచిపెట్టేటప్పుడు పిల్లలకి ఉప్మా పెట్టడం కోసం వంట ఏర్పాట్లు మొదలయ్యేవి. మూడున్నరకో, నాలిగింటికో ఆటలు ఆడించేవారు. పిల్లలకి ఉప్మా పెట్టి జనగణమన పాడించి పంతులమ్మగారూ, పంతులయ్యా వెళ్ళిపోయేవారు. కాని పిల్లలకి ఆటల్లోంచి బయటపడటం అంత సులువుగా ఉండేది కాదు. ఆ తర్వాత చాలాసేపటిదాకా, పిల్లలు వాళ్లకు తెలిసిన ఆటలు వాళ్ళు ఆడుకుంటూనే ఉండేవారు.
‘పులొచ్చే మేకా, దాంకో మేకా ..’
‘వచ్చొచ్చె గిల్లకోడి, పారిపో రామచిలక..’
‘డబ్బుకు రెండు ద్రాక్షపళ్ళు, చీనాపిల్ల, నీకేం తెలుసు, నాకేం తెలుసు, ఆఖరిపిల్లను పట్టుకోండోయ్..’
ఒక్కరోజేనా ఆ పిల్లల్తో ఒక్క ఆటేనా ఆడుకోలేకపోయాను అన్నదే ఈ జన్మకు నాకు తెలిసిన అతి పెద్ద లోటు.
ఇంకా సాయంకాలం కాకముందునుంచే చింతపండు గంపలూ, కావిళ్ళూ, బుట్టలూ పట్టుకుని గిరిజనులు గిరిజన కార్పొరేషన్ ముందు బారులు తీరేవారు. పిక్కతీసిన చింతపండూ, తియ్యనిదీ వేరువేరుగా కొనుగోలు నడిచేది. పొడుగ్గా రెండు వరసల్లో తమవంతు వచ్చేదాకా కొండరెడ్లు ఓపిగ్గా నిలబడేవారు.
సాయంకాలానికి మళ్లా ఆవులూ, మేకలూ ఊళ్ళో అడుగుపెట్టేవి. అవి నడిచినంతమేరా ఎర్రని దుమ్ము పైకి రేగేది. ఏదో వింత వాసన గాలంతా అల్లుకునేది. ఊరూరా అయిస్ ఫ్రూట్లు అమ్ముకునే ఐసు డబ్బా వాళ్ళు హారను మోగించుకుంటూ వెళ్ళిపోతూండేవారు. అప్పటిదాకా చెట్టుమీద చింతబొట్టలు రాళ్ళతో కొట్టికొట్టీ పిల్లలు పిడికెడు చింతపండు చేత్తోపట్టుకుని ఆ ఐస్ ప్రూట్లవాళ్లకోసం ఎదురుచూసేవాళ్లు. చెట్టుకి కాసిన పండుతో ఏ చెట్టుకీ కాయని పండ్లు కొనుక్కునేవారు. అప్పటికే కరిగిపోయిన ఐసుఫ్రూట్లలో తీపిదనం తగ్గిపోయి ఉండేది. ఆ పిడికెడు చింతపండుకి ఒకటో రెండో ఐస్ ఫ్రూట్లు దొరికేవి. పిల్లలు వాటిని జుర్రుకునేవారు. ఐసంతా కరిగిపోయి మిగిలిన పుల్లల్ని కూడా పీల్చుకునేవారు. ఏ సుగంధమో వాటినింకా అట్టిపెట్టుకుని ఉండిపోయిందనే సంతోషం వాళ్ల కళ్లల్లో కనిపించేది. రోడ్డుకి అవతల పక్క చింతచెట్లమీద కొంగలు తపసు మొదలుపెట్టేవి. ఆ చెట్లకింద ఇళ్ళముందు ఎర్రగా విప్పారిన బోగన్ విల్లియా మసకచీకటిలో కూడా మెరుస్తూ ఉండేది.
పగలంతా ఏదో ఒక పనికి వెళ్ళిన కొండరెడ్లు సాయంకాలం కిరాణా దుకాణం దగ్గర టీపాకెట్టు, బెల్లం పాకెట్టు, ఉప్పూ, మిరపకాయలూ కొనుక్కోడానికి మూగేవారు. కొంతసేపటికి వీథుల్లో పాదచారుల అడుగుల చప్పుళ్ళు పలచబడేవి. కొండరెడ్ల ఇళ్ళల్లో ఉడుకునీళ్ళతో స్నానం చేస్తున్న చప్పుడు వినిపించేది. ఆ ఆడవాళ్ళు తమ భర్తలకి దగ్గరుండి వీపురుద్ది మరీ స్నానం చేయించే దృశ్యాలు కనిపించేవి.
సాయంకాలం బస్సులు కూడా వెళ్ళిపోయాక కమ్యూనిటీ రేడియోలో వార్తలో, పొలం పనుల మాటలో వినిపించేవి. కొంతసేపటికి ఆ రేడియో కూడా కట్టేసేవారు. ఎవరింట్లోనో కోడిని కాలుస్తున్న వాసనో, లేదా మసాలా కూరలు వండుకుంటున్న వాసనో ఘాటుగా పలకరించేది. దినాంతం సంపూర్ణమయ్యాక అప్పుడు మళ్లా విజయవాడ, విశాఖపట్టణం, ఒక్కొక్కప్పుడు కడప రేడియో నుంచి కూడా పాటలు వినిపించేవి.
‘వగల రాణివి నీవే, సొగసుకాడను నేనే..’
‘పచ్చబొట్టూ చెరిగిపోదులే నా రాజా పడుచుజంటా చెదిరిపోదులే..’
‘కోడికూసే జాముదాకా తోడురారా చందురూడా..’
‘నీ కోసం వెలిసిందీ ప్రేమమందిరం నీ కోసం వెలిసిందీ హృదయనందనం..’
‘ఏ తీగ పూవునో, ఏ కొమ్మ తేటినో..’
‘చిన్న మాటా, ఒక చిన్న మాటా..’
అప్పుడు వేపచెట్లమీంచీ, పక్కింటి పందిరిమీద విరబూసిన రాధామనోహరం గుబుర్లలోంచీ పూలతావి గాల్లో అడుగుపెట్టేది. ఆ కృష్ణపక్షపు రాత్రుల్లో ముందు చుక్కలు ఉదయించేవి. నెమ్మదిగా ఏ రాత్రికో చంద్రుడు తీరిగ్గా వచ్చేవాడు.
దూరంగా కొండలమీద ఎండిపోయిన అడవులు మండిపోతూ కనిపించేవి. కానీ కొండమీద మంటలని గట్టిగా అనకూడదనే వారు. వేలితో చూపించకూడదనే వారు. రాత్రిపూట ఆకాశంలో వెలిగే చుక్కల్లాగా కొండలమీద ఆ మంటల వరసలు కూడా మౌనంగా చూస్తూ ఉండవలసిన దృశ్యంగానే కనిపించేవి.
దాదాపుగా ప్రతి సాయంకాలం రాజు వచ్చి పలకరించేవాడు. రాత్రి బాగా పొద్దుపోయేదాకా కూచుండిపోయేవాడు. అప్పటికి మా ఇంట్లో సాయంకాలం అన్నాలు పూర్తయిపోయేవి. ఏవేవో కబుర్లు చెప్తుండేవాడు. ఆ కబుర్లకి తలాతోకా ఉండేది కాదు. ఉండాలని కూడా నేను అనుకోలేదు. అతను వచ్చేక, అప్పటిదాకా నేనొక్కతినే ఆస్వాదిస్తూ ఉన్న నిశ్శబ్దం, అతని మాటల్తో మరింత మెత్తబడేది. ఆ నిశ్శబ్దంలో అడవి మీంచి వీచే కొండగాలి కలిసి ఉండేది. ఏటి ఒడ్డున విరిగిపడే చిన్నచిన్న అలల గలగల కలగలిసి ఉండేది. ఉండీ ఉండీ అడవిలోంచి వినిపించే ఏ జంతువు అరుపులో ఆ నిశ్శబ్దానికి వన్నెపెట్టేవి.
తర్వాత రోజుల్లో డా.మిశ్రా ఆ ఊరిని ఎంతేనా విమర్శించి ఉండవచ్చుగాక, నాకు మాత్రం ఆ ఊరు గుర్తురాగానే ఆ నిశ్శబ్దమే గుర్తొస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని వినడం నేను ప్రొఫెసర్ సేన్ గుప్త దగ్గరే నేర్చుకున్నాను. అడవిలానే, కొండలానే ఊరు కూడా నువ్వు దానిముందు ఏం పిలిస్తే అదే బదులిస్తుంది.
వసంత ఋతువు వెలుగు ముందు కనిపించేది ఫాల్గుణమాసపు చివరి రెండువారాల్లోనే. అది పెళ్ళి వేడుకకి ఎదురుసన్నాహంలాగా, పండగ ముందురోజు సాయంకాలంలాగా, జెండా పండగ ముందు రోజు రాత్రిలాగా, ఒక ఆగమనం కోసం ఎదురుచూడటంలో ఉండే సంతోషం. స్నేహితులూ, బంధువులూ వస్తారంటే ఇల్లు అలంకరించిపెట్టుకున్నట్టుగా, వసంతంకోసం ఊరూ, అడవీ కూడా ముస్తాబయ్యేవేళ అది. కొండరెడ్లకి చైత్రం చాలా పెద్ద పండగ. అందుకని ఫాల్గుణమాసపు చివరిదినాల్లోనే వాళ్ళు అన్ని ఏర్పాట్లూ చేసిపెట్టుకునేవారు. ఊరంతా కలకలంగా ఉండేది.
మా ఇంటిపక్క చింతచెట్టు కూడా చిగురించడం మొదలుపెట్టింది. లేతాకుపచ్చనీ, లేత ఎరుపునీ చిగురించే చింతచెట్టు పుడమినీళ్ళుపోసుకున్నట్టుండేది. అంతదాకా రామకోవెలకి ఆవతల పక్క ఒక రావిచెట్టు ఉన్నదే నేను గమనించలేదు. మాఘమాసమంతా ఒక్క కూడా మిగలకుండా రాల్చేసిన ఆ చెట్టు ప్రతి కొమ్మకీ, రెమ్మకీ చిన్న చిన్న జెండాలు తగిలించుకున్నట్టు, రంగురంగుల దీపాలు వెలిగించుకున్నట్టు చిగురించడం మొదలయ్యింది. రావిచెట్టు చిగురించే రోజుల్ని చూడటమే ఒక పండగ. ఆ చెట్టు చిగురించడం సప్తాహంలాగా, దశాహంలాగా నడిచింది. ఆ చెట్టు చిగురిస్తున్నంతకాలం ఊళ్ళో ప్రతి ఒక్కరూ తామే పనిలో ఉన్నా, మేలుకుని ఉన్నా, నిద్రపోతున్నా కూడా ఆ చెట్టువైపు ఒక చెవి వేసి ఉంచేవారనే అనిపించింది.
చిగురిస్తున్న రావిచెట్టునీ, చింతచెట్లనీ చూసాక నాకు అడవిమీద మరీ బెంగపుట్టింది. అప్పటికే రెండువారాలు గడిచిపోయింది. చేయి చాస్తే అందేటంత దూరంలో అడవి ఉండి కూడా అందుకోలేకపోతున్నానే బాధ మొదలయ్యింది. ఇక ఒకరోజు ఉండబట్టలేక రాజుని అడిగాను, ఒకసారి అడవిలోకి పోయి రావాలని ఉంది, వస్తావా అని.
ఇంట్లో ఏదో చెప్పాను. వాళ్ళు కూడా ఏమీ అడగలేదు. సరేనన్నారు. పొద్దున్నే ఏడుగంటలకల్లా ఊరుబయట చాపరాయి దాటి వెలగచెట్టుకీ, నేరేడు వనానికీ మధ్యనుండే మట్టిబాటకు చేరుకున్నాం. రాత్రంతా కురిసిన మంచుకి ఇంకా పచ్చిక మెత్తగానూ, తేమగానూ ఉంది. అప్పుడప్పుడే పరుచుకుంటున్న సూర్యకాంతికి అడవి నిద్రమేల్కొంటూ ఉంది. మేము మరికొంత దూరం నడిచేటప్పటికి, చుట్టూ కాలిబాటలుగాని, కరెంటు స్తంభాలుగాని, తారురోడ్లూ, బస్సుల, లారీల హారను మోతలూ లేని చోటుకి చేరుకునేసరికి అడవి నిర్మలసౌందర్యంతో ప్రత్యక్షమయింది.
రెండువారాల కింద ఆ అడవి నిండా పరుచుకున్న రాగిరంగు, బూడిదరంగు, జేగురురంగుల స్థానంలో ఇప్పుడు లేతపసుపు, బంగారం, నునులేత ఎరుపు, హరితం- కొత్త కొత్త రంగులు కనిపిస్తూ ఉన్నాయి. నిన్నటిదాకా ఎండిపోయి బోలుగా ఊళపెడుతున్నట్టుండే ఎండిన తరుకాండాల చుట్టూ ఇప్పుడు లేతాకుపచ్చని సంగీతం ప్రసరిస్తున్నట్టుంది. తల్లికన్నా ముందే నిద్రలేచి తల్లి కొంగుతో ఆడుకునే బిడ్డల్లాగా ఎన్నెన్నో పక్షులు ఆ అడవితో ఆడుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే పత్రవృంతాల్లో తలెత్తుతున్న లేతచిగుళ్ళ గుసగుస ఆ అడవిని సునాదభరితం చేస్తున్నది. కొండమామిడి చెట్ల పైనున్న కొమ్మల్లో లేత ఊదారంగు, ముదురు ఎరుపురంగు, లేతపసుపురంగు చివుళ్ళు జెండాల్లాగా కదలాడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆకులు విచ్చుకుంటున్న నల్లమద్ది, సండ్ర, రేల, మోదుగ చెట్లతో పాటు నెమలి చెట్లు తళుకుటద్దాల చీర ధరించినట్టుగా కొత్త చిగుళ్ళతో మిలమిలా మెరిసిపోతున్నాయి.
వానలు మొదలవగానే తూర్పుకనుమలనుంచి వలసపోయిన పక్షులు, సీతాకోకచిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు మళ్ళా అడవి బాటపట్టినట్టుంది. గుంపులుగుంపులుగా ప్రతిరోజూ పక్షిసమూహాలు ఆ అడవికి చేరుకుంటున్నట్టుగా ఆ రోజు పొద్దున్నంతా అడవి కోలాహలంగా ఉంది. పూసిన ప్రతి పువ్వు చుట్టూ తేనెటీగలు పరిభ్రమణాలు మొదలుపెట్టాయి. చెట్లబెరళ్ళమీంచి కారుతున్న తొలిపాల చారికలమీద కూడా చీమలు బారులు కట్టాయి. వడ్రంగిపిట్టలు చెట్లనీ, అడవినీ కూడా నిద్రపోనివ్వనట్టే ఉంది. ఊరికే మారాం పెట్టే పిల్లల్లాగా స్కైలార్క్ లు అడవిలో గీపెడుతున్నాయి. ఎక్కడో ఒక పక్షి ఆగీ ఆగీ నీటిబొట్లు పడుతున్నట్టుగా ఉండీ ఉండీ కూతపెడుతున్నది. ఒక బుల్బుల్ తెల్లవారింది రండహో అని ఎక్కడెక్కడి పిట్టల్నీ బాకా పెట్టి ఊదినట్టు మరీ పిలుస్తున్నంత హడావిడి చేస్తోంది. ఒక దర్జీ పిట్ట పండగరోజుల్లో సద్గురుమూర్తి మిషనులాగా రాత్రంతా కూడా గాలిని కాంతిపోగులుగా నేసినట్టుంది. ఎక్కడచూసినా సాలీడు దారాలకన్నా పలచని గోసమేర్లు. మరీలోపల అడవిలో ఒక పిట్ట తాను నేర్చుకున్న పురాతన గీతాన్ని ఎక్కడ మర్చిపోతుందో అన్నంత ఆత్రుతతో తొందర తొందరగా అప్పగిస్తున్నట్టుగా కూతపెడుతూ ఉంది. ఆ పక్షిరుతాలు రంగురంగుల గాలిబొంగరాల్ని గిరగిరాతిప్పినట్టుగా, రంగురంగుల గాజుల్ని ఏటవాలుగా గాల్లోంచి జార్చినట్టుగా కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మధ్యలో ఎక్కడో ఒక బుల్బుల్ కూజితం వినిపిస్తూ ఉంది. అది అరిచిన తర్వాత, ఆకాశం మళ్ళా మామూలు కాడానికి కొంతసేపు పట్టేటట్టే ఉంది. ఆ ప్రకంపన చెట్ల ఆకులమీంచి, మొదళ్ళదాకా, అక్కణ్ణుంచి వేర్లమ్మట భూగర్భంలోకీ ప్రసరిస్తున్నట్టుంది.
మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోడం కూడా మర్చిపోయి ఆ అడవిదారిన అలాగే ముందుకు నడుచుకుంటూపోయేం. కొండలమీదా, కొండల అంచుల్లోనూ మర్రి, జువ్వి, మేడి, బొడ్డ, రావిచెట్లు చిలకముక్కుల్లాంటి చిగుళ్ళు తొడుగుతుండటంతో ప్రతి కొమ్మమీదా చిలకలు వాలినట్టే ఉంది. మరికొంతదూరం పోయాక ఆ బాట కొండల్లోకి అదృశ్యమయ్యేచోట పెద్ద అడవిబూరుగచెట్టు. ఆ చెట్టు ఒక మహోద్యమంలాగా ఉంది. దాని కొమ్మకొమ్మనా ఎర్రటిపూలు, అప్పటికే పూసి, పండి కిందంతా రాలిపడ్డ పూలు గులాబిరంగు దుప్పటి పరిచినట్టు ఉంది. కొన్ని పూలు కొమ్మలమొదళ్ళలో ఇరుక్కుపోయి ఉన్నాయి. కొన్ని చెట్టు కింద ఉన్న పొదలమీద రాలిపడ్డాయి. కొన్ని పచ్చటితీగలకంపల్లో ఇరుక్కుని ఆ తీగలు కూడా ఆ పూలు పూస్తున్నాయా అన్నట్టున్నాయి. తక్కిన పూలు సుగంధాన్ని వెదజల్లితే బూరుగపూలు తేనెలు విరజిమ్ముతున్నాయి. ఆ తేనెలు కొమ్మకొమ్మమీంచీ కారుతూ చారికలు కట్టాయి. నేలమీద రాలిన పూలతేనెకి వేలాది కండచీమలు, చలిచీమలు స్పృహతప్పి పడిపోయి ఉన్నాయి. ఆ చెట్టుకింద కొన్ని క్షణాలు నిలబడ్డాను. ఆ దృశ్యంకోసమే, ఆ నీడ కోసమే, ఆ తేనెవాకలకోసమే నేను అంతలా కొట్టుకుపోయానని అర్థమయింది. చూడవలసింది చూసాను అనిపించింది. వెనక్కి వెళ్దామన్నాను రాజుతో.
ఆ ఫాల్గుణ పూర్వాహ్ణవేళ ఆ అడవిలో నేను చూసిందీ, విన్నదీ గుర్తుతెచ్చుకుని చెప్తున్నానుగానీ, నిజానికి ఆ రోజు అక్కడ నాకు అనుభవంలోకి వచ్చిందాన్ని సుగంధానుభవం అని చెప్పాలి. నాలుగైదు మైళ్ళపొడుగునా ఆ అడవిలో ఒక్క పూలే కాదు, లేతచిగుళ్ళు, లేతకొమ్మలు, కొమ్మలకి కారుతున్న పాలు, చిలకలు కొరికిన పిందెలు, పక్షులు ముట్టిన మొగ్గలు ప్రతి ఒక్కటీ సుగంధాన్నే వెదజల్లుతూ ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ కూచుని ఆ ప్రభాతాన్ని తలుచుకుంటూ ఉంటే, సూర్యకాంతికన్నా ముందు, అడవిలో చిగురిస్తున్న ఆకుపచ్చకన్నా ముందు, ఆ బూరుగపూల వాన కన్నా కూడా ముందు ఆ తేనెల వాసనలే నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ప్రతి మనిషీ తన జీవితంలో ఒకసారేనా, కనీసం ఒక రోజేనా ఒక కొండ పక్కనుంచి నడిచి వెళ్ళకుండా ఉండడు. ఒక కొండకింద పల్లెలోనో, పట్టణంలోనో బసచెయ్యకుండా ఉండడు. కానీ జీవితంలో ఒకసారేనా, కనీసం ఒక గంటసేపేనా ఫాల్గుణమాసపు అడవి దారిన నడిచివెళ్లినవాళ్ళ భాగ్యమే భాగ్యమని చెప్పగలను.
అక్కడున్నంతసేపూ తృప్తిగానూ, చూడవలసింది చూసినట్టుగానూ ఉండిందిగానీ, మళ్లా ఇంటికి రాగానే మరొకసారి మళ్లా ఆ అడవి దారిన నడవాలనిపించింది. సాయంకాలం పొద్దు కుంకేవేళల్లో పసిడికాంతి ఆ చెట్లమీద పడుతుంటే వాటినీడలు ఒకదానితో ఒకటి అల్లుకుంటూ ఉంటే ఆ దారిన నడిస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించింది.
రాత్రి మళ్ళా రాజు మా ఇంటికి వచ్చాడు. మాటలు మొదలుపెట్టాడు. ఇంతలో మా ఇంటి ఎదట ఉన్న రామకోవెల్లో హడావిడి వినబడింది. పదిమంది అక్కడ చేరి బిగ్గరగా మాట్లాడుకుంటున్న కలకలం. మధ్యలో బల్లలు, కుర్చీలు లాగిన చప్పుళ్ళు వినబడటం మొదలయ్యింది.
‘ఏమిటది?’ అనడిగాను రాజుని.
‘రామనవమికి మన ఊళ్ళో యూత్ కూడా ఒక నాటకం వేస్తున్నారు. రిహార్సళ్ళు మొదలుపెడుతున్నారు ఇవాళ్టినుంచీ’ అన్నాడు. ‘నన్ను కూడా రమ్మన్నారు’ అన్నాడు.
‘నువ్వు కూడా వేషం వేస్తున్నావా?’- మీరు అని పిలిచే పిలుపు హటాత్తుగా అనుకోకుండా నువ్వుగా ఎలా మారిపోయిందో నాకే అర్థం కాలేదు. కాని రాజు అదేమీ గమనించినట్టు లేదు.
‘వేషమా? అదేం లేదు. కాకపోతే ఊళ్ళో ఏమి జరిగినా, ఏమి చేసినా నన్ను కూడా ఉండమంటారు. నాక్కూడా చిన్న గాంగు ఉంది లెండి’ అన్నాడు.
ఏం నాటకం వేస్తున్నారు?’
‘ఏదో సాంఘిక నాటకం. మా చుట్టాలబ్బాయి భూపతిరాజు డైరక్టరు. గిరిజన కార్పొరేషన్ సేల్స్ మేనూ, ఫారెస్టు గార్డుగారి అబ్బాయి ప్రకాషూ, ఇంకా చాలామందే ఉన్నారు యాక్టర్లు. వీళ్ళు కాక మనం చూసిన కాంతామతి ట్రూపు వేరే ఉంది. వీళ్ళంతా యూత్ అన్నమాట’
కొంతసేపటికి హడావిడి తగ్గి రిహార్సులు మొదలైనట్టుంది. మొదటి డైలాగులు ప్రాక్టీసు మొదలుపెట్టారు. ఆ మాటలు మా ఇంట్లోకీ వినబడుతున్నాయి.
‘అమ్మా, నేటినుంచీ విజయ్ విశాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు’ అని ఒక గొంతు వినిపించింది.
‘అలాకాదు, ఇదిగో ఇలా’ అంటో మరో కంఠం. డైరక్టరు తానే స్వయంగా చేసి చూపిస్తున్నట్టున్నాడు.
‘ఇదిగో, ఇలా రెండు చేతులూ విశాలంగా చాపి, ఇలా చెప్పాలి: అమ్మా, నేటినుంచీ విజయ్ విశాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు.’
ఇంతలో ఎవరో ‘టీ వచ్చింది’ అంటో అరిచారు.
‘సరే, ముందు టీ తాగి చెప్పండి’ మళ్ళా డైరక్టరు వాయిస్.
‘కాదు సార్, ఫస్ట్ డైలాగ్. బ్రేక్ చెయ్యొద్దు. చెప్పనివ్వండి. ఇదిగో మీరు చెప్పినట్టే, చూడండి’-
‘అమ్మా నేటినుంచీ విజయ్ విశాలప్రపంచంలో అడుగుపెడుతున్నాడు..’
కానీ నా మనసింకా ఆ బూరుగపూల నిశ్శబ్దం దగ్గరే తచ్చాడుతూ ఉంది.
18-4-2023
పక్షులు పూలగిన్నెల మూతలు తీయడం, కింద పడిన మూతల చప్పుడు కళ్ళకి మాత్రమే వినబడడం, లేతాకుపచ్చని సంగీతం ప్రసరించడం, తల్లికన్నా ముందే నిద్రలేచి తల్లి కొంగుతో ఆడుకునే బిడ్డల్లాగా పక్షులు అడవితో ఆడుకోవడం — ఎంత అందమైన వర్ణన!!
🙏🏽
Thank you
ఎగువ సీలేరు లో గడిచిన నా బాల్యం లోకి వెళ్లిపోయాను ఈ రోజు.ఇవే ఆటలు,ఇవే పాటలు,ఇలాగే చదువు,అచ్చం ఇలాంటి మధ్యాహ్నాలే గడిపాం.అంతా కిందటి జన్మలో ఏమో అనిపిస్తోంది. హృదయ పూర్వక నమస్సులు మీకు🙏
ధన్యవాదాలు స్వాతి!
మీరు ఆ బూరుగుపూల చెట్టుని చూపించడం మాత్రం బాకీ ఉన్నట్టే రాసుకుంటాను 🙏 మహా సౌందర్యదర్శనం జరిగినట్టే వుంది ఈ రోజున…
కిందటేడాది మార్చిలో ఢిల్లీ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా విరబూసిన బూరుగ చెట్లూ, దారి పొడుగునా రాలిన పూలూనూ.
పల్లె ప్రపంచంలో దేన్నీ వదలకుండా.. అక్షరాలలో చిత్రీకరిస్తున్నారు.
బడిలో హాజరు పట్టీలు – పేర్లు పిలవడం,
పాఠాలు అప్పచెప్పడం,
సాయంత్రం ఆడించడం..
ఐస్ ఫ్రూట్ బండి కోసం ఎదురుచూపులు..
పశువులు వెళ్ళడం.. రావడం..
చిన్నప్పటి రోజులు.. ఆ పల్లె జ్ఞాపకాలు..
ఎక్కడో జ్ఞాపకాల అరలలో..
మరుగునపడిపోయి ఉన్నవన్నీ.. మళ్ళీ గుర్తు వస్తుంటే..
ఏదో మాటలకందని ఆనందం.
ధన్యవాదాలు.
చాలా సంతోషం అమ్మా! ధన్యవాదాలు.
అదృశ్య లిపి,తేనెవాక….తెలుగు పదాలు కృష్ణ శాస్త్రి గారి కలం నుండి జాలువారిన తర్వాత ఇంత నిరాఘాటంగా రావడం ఇదేనేమో! ధన్యవాదాలు మాష్టారు
“—–నువ్వు రోజూ జీవించే రోజువారీ జీవితమే— అందులో భాగం కాకుండా, ఒక ఆగంతుకునిగా, ఒక అతిథిగా జీవించి చూడు. ఎంత కొత్త ప్రపంచం సాక్షాత్కరిస్తుందో ఊహించలేవు.—ప్రతి రోజూ చూసే మనుషులే, కాని కొత్త మనుషుల్ని చూస్తున్నట్టుగా, ఆ వండర్ తో, ఆ క్యూరియాసిటీతో వాళ్ళకేసి చూడు, వాళ్ళు చెప్పే మాటలు విను. ప్రతి రోజూ పొద్దున్నే నీకు తారసపడే వదనాల్లో వాళ్ళు కితం రాత్రి కన్న కలలజాడల్ని పోల్చుకోడానికి ప్రయత్నించు —“
Thank you
అడవి వర్ణనలు చూస్తూవుంటే మీరు బొమ్మలు గీయడం ఎందుకు ఎంచుకున్నారో తెలుస్తూవుంది
ధన్యవాదాలు సార్