ఆ వెన్నెల రాత్రులు-14

Image design: Mallika Pulagurtha

వనలత, ప్రొఫెసరు వెళ్ళిపోయిన రోజే యాంత్రొపాలజిస్టు మిశ్రా నుంచి టెలిగ్రాం వచ్చింది. ఆయన ముందు అనుకున్నట్టుగా మార్చి పదిహేనుకి రాలేకపోతున్నాననీ, బహుశా మార్చి నెలాఖరుకిగాని, ఏప్రిల్ మొదటివారానికిగాని వస్తానని మెసేజి ఇచ్చాడు. ఆ టెలిగ్రాం నా పేరుమీదనే ఇవ్వడంతో  ఆ సంగతి తెలియచేస్తూ సేన్ గుప్తాకి కలకత్తా అడ్రెస్ కి నేను కూడా ఒక టెలిగ్రాం ఇచ్చాను. ప్రొఫెసరు, వనలత వెళ్ళాక రెండు రోజులదాకా నాకు చాలా బెంగగా అనిపించింది. వాళ్ళతో కలిసి విశాఖపట్టణందాకా వెళ్ళి ఉండవలసింది, దగ్గరుండి రైలు ఎక్కించి ఉండవలసింది అని ఎంతగానో అనుకున్నాను.  వాళ్ళు వెళ్ళినప్పుడు రాజు వూళ్ళో లేడు. సంక్రాంతి పండగ సెలవుల తర్వాత కాకినాడ వెళ్ళినవాడు మళ్ళా రాలేదు. ఆ ఊళ్ళో ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లలిద్దరూ తప్ప నాకు ఎవరూ స్నేహితులుకూడా లేరనిపించింది. అడవినుంచి నేను ఏరిన ఆకులూ, కొమ్మలూ ఆల్బమ్స్ ఎప్పటికప్పుడు ప్రొఫెసరు కలకత్తా పంపించేస్తోనే ఉన్నాడు. దాంతో ఆ పనికూడా లేదు. ఆయన మొదటిరోజే మొక్కల్తో నా సంభాషణలు నోట్సు రాస్తూ ఉండమన్నాడుగానీ, ఒక్కరోజు కూడా ఒక్క పేజీ కూడా రాయలేకపోయాను.

ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు ఆలోచిస్తే, అసలు ఆ ప్రాజెక్టులో నేను చేసింది చాలా చాలా ప్రాథమికమైన పని అని తెలుస్తూ ఉంది. ఆయన మల్టీ డిసిప్లినరీ ప్రాజెక్టు అని చెప్పినప్పటికీ నేను చేసింది జియో బోటనీ నో లేదా, బొటానికల్ జియాలజీనో కానే కాదు. జియో బోటనీ వర్క్ చేయాలంటే జియొలాజికల్ సబ్ స్ట్రేటా ని పట్టుకుని దాన్లో పెరుగుతున్న మొక్కల్ని అధ్యయనం చేయాలి. అది కూడా ఏదో ఒకసారి చేస్తే చాలదు. వరసగా రెండుమూడేళ్ళు అదే ప్రాంతానికి మళ్ళా మళ్ళా వెళ్ళి అధ్యయనం చెయ్యాలి. ప్రొఫెసరూ, వనలతా జియాలజీలో చేస్తున్న పరిశోధన ఉన్నతస్థాయి పరిశీలన, పరిశోధన అని నాకు అర్థమవుతూనే ఉంది. అసలు వాళ్ళతో కలిసి ఒక ప్రాజెక్టులో పనిచేసానని చెప్పుకోడానికి కూడా నా గ్రాడ్యుయేషన్ అర్హత ఏ మూలకీ సరిపోదని నాకు అర్థమయింది. అయినా కూడా ఎందుకు ప్రొఫెసరు నాకు ఆ పని అప్పగించాడు? తాను తిరిగిన కొండలమ్మట ఉన్న మొక్కల్నీ, వృక్షజాతుల్నీ, గడ్డిజాతుల్నీ మాపింగ్ చెయ్యడమనే మరీ ప్రాథమికమైన పని ఎందుకు చేయించాడు?

ఇప్పుడు  వ్యాప్తిలో ఉన్న చాలా పదాలు-బయో డైవర్సిటీ, ఇకో సిస్టమ్స్, మైక్రో వాటర్ షెడ్, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లాంటి పదాలు అప్పటికి ఇంకా పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన ఏదైనా ఒక బయో డైవర్సిటీ ప్రాజెక్టు రూపకల్పన కోసం ఒక ప్రపోజలు తయారు చేయడానికి అటువంటి బేసిక్ డాటా సేకరించాడా? ఆయన మనసులో ఏముంది? ఒక వేళ బయో డైవర్సిటీ ప్రాజెక్టే అనుకున్నా అది ఒక జియాలజిస్టు వైపు నుంచి ఊహించగల ప్రతిపాదన కాదు.

ప్రొఫెసరు ఆ రోజుల్లో అటువంటి అధ్యయనం చేపట్టడానికి నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆయన కాలం కన్నా ముందున్న వ్యక్తి. ఆయనలో ఒక జియాలజిస్టూ, ఒక నాచురలిస్టూ మాత్రమే కాక, ఒక యాంత్రొపాలజిస్టు కూడా ఉన్నాడు. కొండ అంటే అడవీ, అడవిలో ఉంటున్న ఆదివాసులూ కూడా అని ఆయన నమ్మకం. అదంతా ఒక అవిభక్తకుటుంబం అనే ఆయన విశ్వసించాడు. ఆ కుటుంబాన్ని ఎన్ని పార్శ్వాల్లో సమీపించగలిగితే అన్ని పార్శ్వాల్లో సమీపించాలని అనుకున్నాడు. ఇది నేను ఆయన్ని దగ్గరగా చూసినందువల్ల కలిగిన అభిప్రాయం. కానీ మరీ దగ్గరగా చూసినందువల్ల మరో అభిప్రాయం కూడా కలిగింది. ఆయనకి ఈ ప్రాజెక్టులన్నీ ఒక సాకు మాత్రమేననీ, ఆయన కోరుకున్నదల్లా, ఏదో ఒక నెపం మీద ఎప్పటికీ అడవికీ, కొండలకీ దగ్గరగా ఉండాలని మాత్రమేననీ, అందుకని ఏదో ఒక ఫండింగ్ కోసం ఏదో ఒక పేరుతో ప్రతిపాదనలు పంపిస్తూ ఉండేవాడేమో అని కూడా అనిపించింది.

ఇంతకీ నేను సేకరించిన సమాచారం ఆయన ప్రాజెక్టుకిగానీ లేదా ఏదో ఒక ప్రాజెక్టు కోసం ప్రపోజలు రాయడానికి గానీ ఎంతవరకూ ఉపకరిస్తుందో నాకు తెలియలేదు. కానీ నా వైపు నుంచి చూసుకున్నప్పుడు మాత్రం అది నాకు గొప్ప అవకాశం అనిపించింది. ఆ వంకన నేను అడవిని ఒక పాఠ్యపుస్తకంగా చదవగలిగాను. ప్రొఫెసరు మాటల్లో చెప్పాలంటే అనేక కాండలుగా, సర్గలుగా ఉండే మహాకావ్యంలో కనీసం కొన్ని సర్గలు చక్కటి గురువు సన్నిధిలో స్వాధ్యాయం చెయ్యగలిగాను. అన్నిటికన్నా ముఖ్యం, నాకు తెలీకుండానే నేను అడవితో ప్రేమలో పడిపోయేను.  వాళ్ళు వెళ్ళిన తర్వాత నాలుగైదు రోజులపాటు నేను గడపదాటకుండా ఇంట్లోనే గడపవలసి వచ్చినప్పుడుగానీ ఆ ప్రేమ ఎటువంటి ప్రేమనో నాకు తెలియరాలేదు.

చాలాసార్లు సేన్ గుప్తా తన ఎదట ఉన్న కొండల గురించీ, భూమి గురించీ, సముద్రాల గురించీ చాలా సరళంగా చెప్పాలని ప్రయత్నించేవాడు. ఒకరోజు నాతో మాట్లాడుతూ, ‘ఇంతకీ ఎర్త్ అంటే ఏమిటి? త్రీ మెటల్స్: కోర్ అంతా ఐరన్, మధ్యలో మాంటిల్ మొత్తం బసాల్ట్, క్రస్ట్ అంతా గ్రానైట్-అంతే కదా’ అని అన్నాడు. మరోసారి ‘జీవపదార్థం అంటే ఏమిటి? సోడియం, పొటాషియం, కాల్షియం అంతే కదా’ అని అన్నాడని ఇంతకు ముందే రాసాను. ఆయన ఒక్కొక్కప్పుడు తన ముందు కనిపిస్తున్న జీవవైవిధ్యాన్ని, వర్ణవైభవాన్ని, రూపసంపదని తట్టుకోలేక, తనకి తాను అట్లా ఓవర్ సింప్లిఫై చేసుకుని చెప్పుకుంటున్నాడా అనిపించేది. ఒకసారి నేను ఉండబట్టలేక అడిగాను, ‘ఈ ప్రపంచం, ఈ ఫిజికల్ వరల్డ్, ఈ నాచురల్ వరల్డ్ మీరు చూస్తున్నంత సరళమైన ఫార్ములాలా?’ అని.

‘గుడ్ క్వశ్చన్’ అన్నాడాయన.

అప్పుడు నింపాదిగా చెప్పుకొచ్చాడు.

‘పందొమ్మిదో శతాబ్దినుంచీ సైన్సులో రెండు దృక్పథాలు స్థిరపడ్డాయి. ఒకటి న్యూటన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరొకటి డార్విన్ పాయింట్ ఆఫ్ వ్యూ. న్యూటన్, ఆ మాటకొస్తే, ఫిజిసిస్టులంతా ఈ ప్రపంచం, ఈ ఖగోళం, ఈ విశ్వం నిశ్చితమైన సూత్రాలప్రకారం నడుస్తున్నాయి, వాటిని ఏ విధంగానూ ఉల్లంఘించలేం అంటారు. మరొకవైపు డార్విన్, అతనిలాంటి నాచురలిస్టులు, ఇవొల్యూషనిస్టులు- ఈ ప్రపంచంలో పరిణామం అన్నిటికన్నా కాదనలేని ప్రత్యక్ష సత్యం అంటారు. పరిణామంలో కూడా ఛాన్స్, అన్ సెర్టనిటీ, అన్ ప్రెడిక్టబిలిటీ ఉన్నాయంటారు. బోత్ ఆర్ కరెక్ట్. బోత్ ఆర్ నాట్ కరెక్ట్. ఇద్దరూ కూడా సత్యాన్ని ఓవర్ సింప్లిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫిజిసిస్టులు నా దృష్టిలో అద్వైతుల్లాంటివాళ్ళు. అంతిమసత్యం మార్పులేనిదీ, అది ఒక యూనివెర్సల్ రిథమ్, వేదకాలంలో చెప్పిన ఋతం లాంటిదని నమ్మేవాళ్ళు. నాచురలిస్టులు అంటే పరిణామవాదులు బౌద్ధుల్లాగా, శాక్తుల్లాగా ఈ ప్రపంచం ఇప్పుడున్నట్టు మరునిమిషంలో ఉండదని చెప్తారు. ఎవరది, హెరాక్లిటస్ కదా అన్నాడు, నువ్వు ఒకే నదిలో రెండుసార్లు స్నానం చెయ్యలేవని’ అన్నాడు ప్రొఫెసరు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు.

‘నా దృష్టిలో ఆ దర్శనాలూ రెండూ కలిస్తేనే పూర్ణసత్యం. ఈ యూనివెర్స్ నిశ్చల సూత్రాలప్రకారం నడుస్తోంది. కాని ఆ సూత్రాల్ని కనుగొంటున్నది ఎవరు? మానవుడు. ఆ మానవుడు ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూనే ఉన్నాడు. అందుకనే అతను తాను చూస్తున్న సత్యాన్ని కూడా ఎప్పుడు కప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకుంటూ ఉన్నాడు. క్రియేటివ్ ట్రూత్. కొత్తగా ఉంది కదూ ఈ మాట!’

‘ఇంతకీ నీ దర్శనం ఏమిటి?నువ్వేం చూస్తున్నావు అని నన్ను నిలదీసి అడిగావనుకో. నాకు ప్రకృతి కనిపిస్తూ ఉందనీ, దానిమధ్య ఏమీ అంటని పురుషుడు కూడా కనిపిస్తున్నాడనీ అంటాను. బేసికల్లీ ఐ యామ్ ఏ సాంఖ్యన్’ అని కూడా అన్నాడు. ‘కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. ఒకటిలేకపోతే రెండోది లేదు. వివేకానందా అన్నాడు. స్పిరిట్ ఆర్ మాటర్. ఉన్నది ఒకటే. కాని ఒకటి లేకుండా రెండోది కనబడదు, అదే మాయ’ అని అన్నాడు స్వామీజీ అని గట్టిగా నవ్వడం కూడా గుర్తుంది.

వనలత, ప్రొఫెసరు వెళ్ళాక, యాంత్రొపాలజిస్టు డా. మిశ్రా రావడం వాయిదా పడ్డాక, ఆ రెండు వారాల పాటు ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. రెండురోజులు చాలా గ్లూమిగానే గడిచాయి. ఆ తర్వాత మరొక నాలుగైదు రోజులు గడిచేటప్పటికి అడవి పిలుపు వినబడ్డటం మొదలయ్యింది. మేము రోజూ జీపులో వెళ్ళే ఆ దారి, ముందు ఆ చాపరాయి, ఆ తర్వాత రోడ్డుపక్కనుంచి అడవిలోకి దారితీసే మట్టిదారీ, ఆ దారిపక్క చిన్న కుంట, ఆ కుంట పక్కన వెలగచెట్టూ, ఒకపక్కంగా నేరేడు చెట్ల వనం, ఆ మట్టిబాటమ్మట ముందుకుపోయేక తేటనీళ్ళతో చిన్ని చిన్ని కూనిరాగాలూ తీస్తూ పారే కొండవాగూ, ఆ వాగు కూడా దాటేక, వరసగా కొండల వరస- ఆ పూర్వాహ్ణాలూ, ఆ హేమంతకాల ప్రభాతాలు, ఆ పుష్యమాసపు మంచుతెరలూ, ఆ మాఘమాసపు పల్చటి సాయంకాలపు నీడలు- నా చుట్టూ మూగినట్టుగానూ, నా కొంగుపట్టుకుని లాగుతున్నట్టుగానూ ఉండింది.

సేన్ గుప్తా వెళ్ళేటప్పుడు ఆ జీపు ఎప్పుడేనా వాడుకోవచ్చని చెప్పివెళ్ళాడుగాని, ఊరికే అడవి చూడటానికి ఆ జీపుతీసుకుని పోలేననిపించింది. అలాగని ఒక్కర్తినీ నా అంతటనేను ఆ అడవిదారిన పోలేను. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని తీసుకుని సాయంకాలం పూట ఏటి ఒడ్డుదాకా నడవగలనుగాని, వాళ్లని తీసుకుని అడవికి పోలేను. అదీకాక, అడవికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే ఏం చెప్పను? ఇంకా కొన్ని సాంపిల్స్ సేకరించవలసినవి మిగిలి ఉన్నాయి, అందుకోసం అని చెప్పవచ్చుగాని, తీరా అడవికి వెళ్ళాక, ఒక్కర్తినీ అక్కడ ఏ కొండదగ్గరికి పోగలను? పైగా ఆ రోజు ఆ కొండమీద ఒక్కరినీ చిక్కుపడ్డప్పటి ఆ భయమైతే నన్నింకా వదలనే లేదు.

వారం రోజులు గడిచాయి. అతి కష్టం మీద గడిచాయి. అలాగని నేను ఖాలీగా గడిపానని కాదు. ఇంట్లో పిన్నిగారికి వంటపనిలోనో, ఏదో ఒక పనిలో సాయం చేస్తోనే ఉన్నాను. పిల్లలిద్దరి చదువు ఎలా సాగుతోందో వివరంగా అడిగాను. వాళ్ల నోట్సులు చూసాను. ఒకటి రెండు సార్లు సూర్యనారాయణమూర్తిగారితో కూడా ఏదో ఒక సంభాషణ కొనసాగించే ప్రయత్నం కూడా చేసాను. కానీ, కాదు, అది సరిపోదు. నువ్వు మాట్లాడే మనుషులు రోజువారీ చిన్న చిన్న విషయాల్ని దాటి మరేదో ప్రగాఢమైన విషయం వైపు నీ దృష్టి మరల్చాలనీ, నువ్వు చూడలేకపోతున్న అందాల్ని చూపించాలనీ, కొత్త పాటలు, కొత్త మాటలు వినిపించాలనీ- మనలో ప్రతి ఒక్కరికీ తెలియకుండానే లోపల్లోపల ఒక బలమైన కోరిక ఉంటుందని ఆ వారం రోజుల్లో నాకు పూర్తిగా తెలిసొచ్చింది.

వారం రోజులు గడిచాక ఒక సాయంకాలం హటాత్తుగా ప్రత్యక్షమయ్యాడు రాజు. వస్తూనే ‘మొన్న ఫాల్గుణ పున్నమినాడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు?’ అనడిగాడు.

అసలు ముందు అతణ్ణి చూస్తేనే నాకు ప్రాణం లేచివచ్చినట్టనిపించింది. ఏదో చెప్పలేని సంతోషం ఒక తరంగంలాగా మనసులో ఎగిసిపడింది. ఎందుకని? ఏమో! నన్ను నేను ప్రశ్నించుకోడానికి బదులు-

‘పున్నమినా? ఎప్పుడు?’ అనడిగాను.

‘మొన్ననే. మేం ప్రేమాభిషేకం సినిమా సెకండ్ షోకి పోయి వస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు, చూడరా, పున్నమి ఎంత బావుందో అని. అప్పటికి కాకినాడ రోడ్లమీద సెకండ్ షో జనాలు కూడా వెళ్ళిపోయారు. వాడు ఆ మాట అనగానే నాకు మీరే గుర్తొచ్చారు. మీరంటే మీరొక్కరే కాదు, మీ గాంగ్ అంతా గుర్తొచ్చారు’ అని అన్నాడు.

అంటే ఆ పున్నమి నాకు తెలీకుండానే నేనింట్లో ఉండగానే వచ్చి వెళ్ళిపోయిందన్నమాట! ఆ చంద్రుడు అడవిదారిన కొండ ఎక్కి, మా ఇంటిమీంచే రాత్రంతా ప్రయాణించి వెళ్ళిపోయాడన్నమాట! నాకు చెప్పలేనంత బెంగ పుట్టింది. ఉక్రోషం కూడా తన్నుకొచ్చింది. కాని ఎవరి మీదని చూపించడం?

నెమ్మదిగా తేరుకుని ‘మీరు అని అంటున్నారు? ఇప్పుడు నేనొక్కర్తినే ఉన్నాను, ప్రొఫెసరు, వనలతా కలకత్తా వెళ్ళారు’ అన్నాను.

రాజుకి ఆ సంగతి తెలిసినట్టులేదు. అతనికి ఆ సంగతంతా వివరంగా చెప్పాను. డా.మిశ్రా రాడానికి మరో వారమో, రెండువారాలో పడుతుందేమో, అప్పటిదాకా, చెయ్యడానికి పనేమీ లేదని కూడా చెప్పాను.

‘అయ్యో? నాకు చెప్పి ఉండాల్సింది. వెంటనే వచ్చేసి ఉండేవాణ్ణి’ అని అన్నాడు. కాని ఎలా చెప్పడం? అది సరే, ఎందుకు చెప్పడం? అతనేమైనా మా ప్రాజెక్టులో మెంబరా? ఆ మాటే అడిగాను, నా గొంతులో నాకే తెలియని కొత్త కొంటెతనం.

‘దానికేముంది? నన్ను మీ ఫీల్డ్ అసిస్టెంట్ అనుకోండి’ అన్నాడు. ‘ఈ రోజే వచ్చాను, మా అమ్మ గారు చెప్పారు, మీరు అడిగారట కదా నా గురించి’ అని కూడా అన్నాడు.

ముందొక క్షణం నాకు అర్థం కాలేదు, అప్పుడు గుర్తొచ్చింది, మూడు నాలుగురోజుల కిందట ఆమె పిన్ని గారిని కలవడానికి వచ్చినప్పుడు, పలకరించాను. మాటలమధ్యలో రాజు గురించి కూడా అడిగాను. అది మామూలు కుశలప్రశ్ననే. కానీ, మామూలు కుశలప్రశ్ననేనా?

‘డన్. ఇంక ఇక్కడే ఉండిపోతాను. ఆ మిశ్రానో ఎవరో ఆయన వచ్చేదాకా మీకు నేనే కంపెనీ’ అన్నాడు.

‘మరి మీ చదువు? పరీక్షలు?’

‘పరీక్షలు ఏప్రిల్ రెండో వారం నుంచి. కాలేజీలో ప్రిపరేటరీ హాలిడేస్ మూడ్ నడుస్తోంది. అందుకనే వచ్చేసాను’ అన్నాడు.

అతను వెళ్ళిపోతాడేమో అనుకున్నాను, కానీ కదల్లేదు. చూడబోతే డా.మిశ్రా వచ్చేదాకా అతను అక్కడే కూచుండిపోయేటట్టే ఉన్నాడే అనుకున్నాను. పిన్నిగారు మధ్యలో ఒకటి రెండుసార్లు లోపలనుంచి తొంగిచూసారు. మాష్టారు స్కూలునుంచి ఇంటికి వచ్చి కూడా చాలాసేపే అయింది. కాని నేను ఆ ఇంటి వీథరుగుమీదా, అతను ఆ అరుగు పక్కన నులకమంచం మీదా కూచునే ఉన్నాం. అతనేదో మాట్లాడుతూనే ఉన్నాడు.

ఇంతలో మా ఇంటివీథి దాటుకుంటూ తియ్యని గాలి వీచింది.

‘వేపపూల గాలి! సీతమ్మ ఇంట్లోంచి అయ్యుంటుంది’ అన్నాడు రాజు. సీతమ్మ గిరిజనమహిళ. ఆమె ఇంటిముంగిట్లో పెద్ద వేపచెట్టు. ఆ చెట్టు మొత్తం ఫాల్గుణమాసాన్ని పూసినట్టుంది, ఒకదాని వెనక ఒకటి ఆగకుండా తీపిగాలితెమ్మెరలు మమ్మల్ని తాకిపోతూ ఉన్నాయి.

బహుశా రాత్రి ఎనిమిదై ఉంటుంది. ఆకాశంలో కృష్ణపక్ష చంద్రుడు ప్రవేశించాడు. ఎవరింట్లోంచో రేడియోలో సినిమా గీతాలు వినిపిస్తున్నాయి. బహుశా ప్రతి రాత్రీ ఆ వేళకి సినిమాపాటలు వేస్తారేమో! అన్ని నెలలుగా అక్కడ ఉన్నా, ఆ సాయంకాలంలాంటి తీరిక సాయంకాలం దొరకనందువల్ల ఆ పాటలు అప్పటిదాకా నా చెవినపడనేలేదు.

ఆ పాటలు ఇంట్లో అందరూ వింటున్నట్టుగా కొన్ని క్షణాల నిశ్శబ్దం అల్లుకుంది. బహుశా అప్పటికి రాత్రి వచ్చే చివరిబస్సు కూడా వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. మామూలుగా ఊరు ఏడూ, ఏడున్నరకే మాటుమణిగిపోతుంది. పిల్లలు వెన్నెలరాత్రుల్లో వీథుల్లో ఆటలాడుతూ ఉంటారు. చీకటి రాత్రులు మొదలయ్యాయి కాబట్టి పిల్లల ఆటలు కూడా సద్దుమణిగాయి. ఎక్కడో దూరంగా కొండవార అడవిలో ఏదో జంతువు అరుపు వినిపిస్తూ ఉంది.

‘అన్నం తిని కూచో అమ్మాయీ’ అన్నది పిన్నిగారు. మరి రాజు? అతని భోజనం? అతణ్ణి కూడా భోజనానికి కూచోమని ఆమె అనకుండా నేనెలా అడగ్గలను? కాని అతణ్ణి వీథిలో కూచోబెట్టి నేను భోజనానికి ఎలా లేవగలను? కాని ఆ పిల్లవాడి ధ్యాస మా మాటలమీద లేనే లేదు.

‘మీరు తినెయ్యండి. నేను తర్వాత తింటాను’ అన్నాను. పిల్లలు కూడా కొంతసేపు నా దగ్గర కూచున్నారుగాని, వాళ్ళు కూడా అన్నం తినడానికి వెళ్ళిపోయారు.

చంద్రుడు మా ఇంటిపక్క చింతచెట్టుదాకా వచ్చాడు. మా ఇంటి చూరుమీంచి వెన్నెల ఇంటివాకిట్లో పూర్తిగా పరుచుకుంది. ఇంట్లో కొంతసేపు అన్నాలు వడ్డిస్తున్న చప్పుళ్ళు, ఆ తర్వాత గిన్నెలు సర్దుకుంటున్న చప్పుళ్ళు. కొంతసేపటికి బల్బు కూడా ఆర్పేసారు. పువ్వు పూసినట్టున్న వెన్నెల తప్ప మరే వెలుగూ లేదు.

నాకు ఆ వెన్నెల్లో ఒక్కసారేనా అడవిలోకి వెళ్లిరావాలనిపించింది. కనీసం వకుళకుటిదాకా. ఆ వెన్నెల్లో ఆ కుటీరం దగ్గర మామిడిచెట్ల నీడలు ఒక సెలయేటినీ, ఒక పడవనీ తీసుకొచ్చి మనకోసం వేచి ఉన్నట్టు ఉంటాయని నాకు తెలుసు.

ఆ రాత్రి ఎందుకు ఆ పిల్లవాడితో అంతసేపు అలా కూచుండిపోయాను? అన్నం, నిద్ర కూడా పక్కనపెట్టి, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా వదిలిపెట్టి ఎందుకలా ఉండిపోయాను? తెలియదు. నిజానికి అప్పుడు నేను ఆ పిల్లవాడి ప్రెజెన్సుని ఫీలయ్యానా లేక ప్రొఫెసరు, వనలతల సన్నిధిని తలచుకుంటూ ఉన్నానా లేక ఇవేమీ కాక, ఆ వెన్నెలనీ ఆ వేపపూల తెమ్మెరనీ, ఆ అడవి నిశ్శబ్దాన్నే అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉన్నానా? రాజు మధ్యమధ్యలో ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు, నేను వింటూనే వున్నానుగానీ, ఆ మాటలు ఆ నిశ్శబ్దాన్ని మరింత చిక్కబరుస్తూనేఉన్నాయి. కొంతసేపటికి మా ఇంటికెదురుగా ఉన్న రామకోవెలల్లో నీళ్ళు వదిలినట్టుగా కటకటాల్లోంచి  వెన్నెల ధారలాగా పడటం మొదలయ్యింది. పక్కింటినుంచో మరెక్కడినుంచో వినబడుతున్న రేడియో కూడా ఆగిపోయింది.

నాకు ఆవులింతలు రావడం మొదలయ్యింది. చెయ్యి అడ్డుపెట్టుకుని ఆపుకుంటున్నాను. కాని ‘మంచిది రాజూ, గుడ్ నైట్’ అని మాత్రం చెప్పలేకపోయాను.

మరికొంతసేపటికి ఎక్కడినుంచో చిన్న చిన్న గంటల చప్పుడు లయబద్ధంగా వినబడటం మొదలయ్యింది.

ఏమిటది?

‘ఎడ్ల బళ్లు ఇప్పుడే ఏటివైపు నుంచి ఊళ్ళో అడుగుపెట్టినట్టున్నాయి. ఎక్కడికో వెళ్తున్నట్టున్నాయి’ అన్నాడు. అనుకోకుండానే నా మనసు ఆ గంటలచప్పుళ్ళో లీనమయ్యింది. ముందు దూరంగా, మంద్రంగా, నెమ్మదినెమ్మదిగా, దగ్గరగా, కొద్దిగా బిగ్గరగా వినబడుతూ వున్న ఆ ఎడ్లమెడలో గంటల చప్పుడు మా వీథి చివర రోడ్డుమీదకి వచ్చేటప్పటికి, ఒక నాట్యబృందం నడిచివెళ్తున్నంత సంరంభం వినిపించింది. మరికొన్ని క్షణాల్లో ఆ చప్పుడు మళ్ళా మంద్రంగా, దూరంగా, నెమ్మదిగా, మరింత దూరంగా జరిగిపోతూ ఉంది. ఇంకొంచెం సేపటికి అవి ఆ మామిడిచెట్ల నీడల్లోంచి, వకుళకుటిదాటి ముందుకు సాగిపోతున్నాయని తెలుస్తోంది. చివరికి మృదువుగా ఆ గంటల చప్పుడు ఒక ప్రకంపనగా మారి, ఆమీద వెన్నెల్లో కలిసిపోయింది.

ఆ ఎడ్లబళ్ళు ఆ ఊరికి ఉత్తరాన ఉన్న ఏరుదాటి దక్షిణాన ఉన్న చాపరాయిదాటడానికి అరగంటనో, ముప్పావుగంటనో పట్టి ఉంటుంది. బహుశా ఆ బండివాళ్లకి కునికిపాట్లు మొదలయ్యుంటాయి. వాళ్లు ఆ ఎడ్లని అదిలించడం మానేసి ఉంటారు. వాటి తోవ వాటికి తెలుసనీ, నెమ్మదిగా అవి తమ దారి తాము వెతుక్కుంటూ పోగలవన్న నిశ్చింత లో ఉండి ఉంటారు. లయబద్ధంగా వినబడ్డా ఆ గంటల చప్పుళ్ళో ఆ బండివాళ్ల నిశ్చింతనే ఎక్కువ వినబడింది నాకు.

అప్పటిదాకా మేమేదో వాద్యసంగీతం విన్నట్టుగా, ఆ కచేరీ పూర్తయినట్టుగా,  ‘ఇక వస్తాను’ అని లేచాడు రాజు. నేను కూడా అరుగు దిగి, కంచెదాకా వెళ్లాను. అతను తలుపు తీసుకుని బయటకి అడుగుపెట్టాడు.

ఒక యువతి, ఒక యువకుడు, చుట్టూ వెన్నెల. కాని ఆ ఇల్లు, ఆ వీథి, ఆ ఊరు ఎంత నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాయి!

18-4-2023

13 Replies to “ఆ వెన్నెల రాత్రులు-14”

  1. ఎన్నో విషయాలు from science to poetry to music to philosophy ఇంకా ఎన్నో incorporate చేస్తూ ఎంతో హృద్యంగా సాగుతోంది. చాలా నేర్చుకుంటున్నా.
    Thank you, sir!

    ట్రూత్ and creative truth ni సత్యం, ఋతం తో పోల్చవచ్చా, sir?
    Dictionary లో ఇలా వుంది, అందుకని అడుగుతున్నా.
    “ సత్యం అన్ని కాలాలలోనూ ఒక్కటే. అది మారదు. అందుకే అది త్రికాలఆబాధితం అన్నారు. ఋతం కూడా సత్యమేగాని, అది కాలానుగుణంగా మారవచ్చు”

    ఆ గంటల చప్పుడు వినిపించింది. 😊

  2. “మనుషులు రోజువారీ చిన్న చిన్న విషయాల్ని దాటి మరేదో ప్రగాఢమైన విషయం వైపు నీ దృష్టి మరల్చాలనీ, నువ్వు చూడలేకపోతున్న అందాల్ని చూపించాలనీ, కొత్త పాటలు, కొత్త మాటలు వినిపించాలనీ- మనలో ప్రతి ఒక్కరికీ తెలియకుండానే లోపల్లోపల ఒక బలమైన కోరిక ఉంటుందని ఆ వారం రోజుల్లో నాకు పూర్తిగా తెలిసొచ్చింది.”
    ఈ స్థితి రావడానికి ఇలాంటి రచనలు, అనుభవాలు వరాలు కావాలి.

    మసక వెలుతురు మాటలపర్వం అక్షరాలు అనుభూతి వెన్నెలలో మిలమిలలాడాయి. వివరించ శక్యము గాని అనుభవప్రాప్తి. ఆసక్తికరం

    న్యూటన్ , డార్విన్ల దృక్పథాల వివరణ ఒక స్టూడెంటుకు డెబ్బై ఏళ్లకు అందింది. అది పదహారేళ్లకే అందే విద్యావ్యవస్థ ఏనాటికి రూపొందేనో.
    ప్రతిరోజు ఉదయాన్ని ఇలా విజ్ఞాన భాసురంగా మార్చుతున్న మీకు నమస్సులు.

  3. ఏక కాలంలో ప్రకృతితో ముడిపడిన శాస్త్ర విశేషాల్ని , ఋతువుల వైభవాన్ని ,తత్వ శాస్త్ర సారాన్ని జోడిస్తూ తూరుపు కొండల విశేషాల్ని తెలుసుకుంటున్నాము.

  4. ఉన్నది ఒకటే. కాని ఒకటి లేకుండా రెండోది కనబడదు, అదే మాయ’ అది తెలిస్తే అచలపరిపూర్ణం

  5. ఎందుకో ఒక భావం మనస్సులో ఉత్పన్నమవుతుంది…అయినట్టు కూడా తెలియకుండా.అటువంటి వాటికి మీరు మాటల రూపాన్ని యిచ్చి ఎదురుగా స్పష్టంగా
    నిలబెడుతూ వుంటే ఆశ్చర్యానందాలతో మనస్సు ఉక్కిరిబిక్కిరి అవుతోందిసుమండీ!🙏

  6. అసలైన వెన్నెల అందం మీ మాటల్లోనే మనసు నిండా పరుచుకొంటుంది ….నమస్సులు మీకు

Leave a Reply

%d bloggers like this: