ఆ వెన్నెల రాత్రులు-13

Image design: Mallika Pulagurtha

ఫిబ్రవరి చివరి వారంలో యూనివెర్సిటీనుంచి ప్రొఫెసరుని అర్జంటుగా వెనక్కి రమ్మని పిలుపు వచ్చింది. ముందు అనుకున్న ప్లాను ప్రకారం ఆయన మే నెలాఖరుదాకా ఫీల్డ్ వర్క్ లో ఉండాలి. అందుకు యూనివెర్సిటీ పర్మిషన్ కూడా తీసుకున్నాడు. కాని ఏవో అనుకోని పరిణామాలు, బహుశా ఆ వైస్ ఛాన్సలర్ సెలవుమీద వెళ్ళడం లాంటిదేదో జరిగి, ఉన్నవాళ్ళల్లో సీనియర్ మోస్ట్ ప్రొఫెసరు ఈయనే కావడంతో ఈయన్ని వెనక్కి రమ్మని టెలిగ్రాములమీద టెలిగ్రాములిస్తూ ఉన్నారు.

ప్రొఫెసరుకి తిరిగి వెళ్ళక తప్పదని అర్థమయింది. అక్కడితో ఫీల్డ్ వర్క్ ఆపేద్దామనుకుంటే యాంత్రొపాలజిస్టు మార్చి పదిహేనుకల్లా వస్తాననీ, అప్పుడు వీలుకాకపోతే మళ్లా ఎప్పుడు వీలవుతుందో చెప్పలేననీ, ఉత్తరం రాసాడు. యూనివెర్సిటీని మరొక రెండు వారాల ఫీల్డ్ వర్క్ కి పర్మిషన్ అడిగి, మార్చి పదిహేనుకల్లా యాంత్రొపాలజిస్టు రాగానే తాము కలకత్తాకి బయల్దేరితే సరిపోతుందని ప్రొఫెసరు అనుకున్నాడు. వాళ్లతో పాటే నేను కూడా మా ఊరు వెళ్ళిపోవచ్చని అనుకున్నాం. కాని మార్చి మొదటివారంలో యాంత్రొపాలజిస్టు తనకి కూడా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు అవసరం అనీ, వాళ్ళు యాంత్రొపాలజీ నే చదివి ఉండనక్కర్లేదనీ రాసాడు. అంటే ఆయనొక ఫీల్డ్ అసిస్టెంట్ కోసం చూస్తున్నాడన్నమాట. ప్రొఫెసరు ఒక రోజంతా ఆలోచించినట్టున్నాడు, చివరికి సందేహిస్తూనే నన్నడిగాడు.

‘విమలా, వుడ్ యు మైండ్ అసిస్టింగ్ హిమ్?’ అని.

‘ఎన్నాళ్ళుండవచ్చు ఆ వర్క్’ అని అడిగాను.

‘మన ఒరిజినల్ ప్లాన్ ప్రకారమే. మే నెలాఖరుదాకా ఉంటుంది. మేము ఇప్పుడు వెళ్ళి మళ్ళా ఏప్రిల్ రెండోవారానికల్లా వచ్చేస్తాం. ఆ తర్వాత మే చివరిదాకా మనం మళ్ళా కలిసి పనిచేసుకోవచ్చు’ అన్నాడు.

‘ఈలోపు నువ్వు రెండువారాలు మీ ఇంటికి వెళ్లిరావచ్చు’ అని కూడా అన్నాడు.

నేను ఆలోచించాను. ఇక్కడికి వచ్చేటప్పుడే మే దాకా అనుకుని వచ్చాను కదా, ఉండిపోవడంలో ఇబ్బంది ఏమీ లేదనిపించింది. కాకపోతే మధ్యలో మళ్ళా రెండు వారాలు ఇంటికి పోయి రావడం మాత్రం అనవసరం అనిపించింది. ప్రతి వారం మా నాన్నకి ఉత్తరం రాస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు నా క్షేమసమాచారం తెలియచేస్తూనే ఉన్నాను. ఒకసారి ఇంటికివెళ్తే మళ్లా ఇంతదూరం రాబుద్ధి అవుతుందో లేదో అనుకున్నాను.

‘ఇక్కడే కంటిన్యూ అవుతాను. మీరు చెప్పినట్టే ఆయనకి వర్క్ లో నేను చెయ్యగల సాయం చేస్తాను’ అని చెప్పాను.

ఆ తర్వాత మార్చి పదిహేనున వాళ్ళు వెళ్ళిపోయేదాకా ప్రతి రోజూ వాళ్ళిద్దరూ నాకు మరింత ఆత్మీయులుగా మారిపోయారు. వాళ్ళు ఏప్రిల్లో మళ్ళా వస్తామని చెప్పినప్పటికీ, ఆ మధ్యలో నెళ్ళాల్ల విరామం ఉంటుందన్న ఊహనే నాకెంతో బెంగ పుట్టించింది.

ఆ రోజులంతటా ప్రతి ఒక్క రోజూ ఆ మాఘమాసపు అడవిలో మేం కలిసి తిరిగాం, కలిసి పని చేసాం. ప్రతిరోజు మా ఫీల్డ్ వర్క్ కి అదే చివరి రోజేమో అన్నట్లుగా, అంత ఇష్టంగా, అంత శ్రద్ధగా పని చేసాం.

నేనొకప్పుడు ఏటికొప్పాక గ్రామంలో కొయ్యబొమ్మలు తయారుచేసే కళాకారుల ఇంటికి వెళ్ళి చూసాను. ఆ ఇంట్లో బొమ్మలు చెక్కడానికి తెచ్చిన తెల్లపొలికి కట్టెలు పోగేసి ఉన్నాయి. కొన్ని కట్టెలు అడవినుంచి తెచ్చినవి తెచ్చినట్లే ఇంటిగోడకి ఆనించి ఉన్నాయి. కొన్ని ఒక పక్కన కట్టెల అడితీలో గుట్టలాగా పడేసినట్టున్నాయి. మరికొన్ని ముక్కలుగా నరికి పోగుపెట్టి ఉన్నాయి. ఇద్దరు పనివాళ్ళు మిషను రంపాలు పెట్టుకుని ఆ చిన్న చిన్న ముక్కల్ని తమకి కావలసిన సైజుల్లో చిత్రికపడుతూ ఉన్నారు. వాళ్ల చుట్టూ కిందనంతా ఆ రంపం పొట్టు పడి ఉంది. గాల్లో మరీ పలచని ఊక లాగా చిత్రికపడుతున్న దుమ్ము ఎగురుతూ ఉంది. మాఘమాసపు అడవి గుర్తొస్తే నాకు ఆ దృశ్యమే తలపుకొస్తూ ఉంది. ప్రకృతి చిత్రకారిణి ఆ బొమ్మలకు రంగులువెయ్యడానికి ఇంకా మరొక నెల ఆగాలి. ముందు ఆ అడవిలో అహర్నిశలు మాఘమాసపు రంపపుకోత నడవాలి.

ఒక పరిత్యాగ వ్రతదీక్షలో ఉన్నట్టుగా ఆకులన్నీ వదులుకుని రిక్త హస్తాల్తో కనిపించే జువ్వి, బిల్లుడు, నర్లింగ,  పాలగొట్టి, పిండ్రుగ, కుంకుడు, సండ్ర, నక్కెర, పొన్న, తుమికి, నెమలి లాంటి చెట్లూ, నవరత్నాలు, వెలుతురు చెట్టు, ఆలగొట్టి, చేకొరిస, భూతరాకాసి, ఆవు పుట్నాలు, తెల్లపులిచెరి, మంగ, పంచాంగం చెట్టు,బోయగాంధారి, ఉప్పి, సొప్పరి లాంటి పొదలూ,  ఊరు అలం, చిత్రం అలం, నల్ల అలం లాంటి అలాలూ, వెంపలి, నక్కగడ్డ, గునుగులాంటి తుప్పలూ, యాదితీగలూ, ఎండిపోయిన తాళ్ళల్లాగా వేలాడే అడ్డతీగలూ, పుల్లపుల్లని నల్లనల్లని పండ్లని విస్తారంగా కురిసి కురిసి వట్టిపోయిన పరిమ తీగలూ, ఎటూచూసినా బండలమీద పీచు ఎండబెట్టినట్టుండే గడ్డిదారులూ పరుచుకున్న రంగస్థలం మీద మొదటి బుట్టబొమ్మల్లాగా అడవి బూరుగచెట్లు కనబడ్డాయి.

పత్రహీన, హరితహీన, రసహీన జగత్తులో, ధూసర, ధూమ్రవర్ణాలు మాత్రమే రాజ్యమేలుతున్న దృక్పటంలో ఆ ఆ రక్తవర్ణాల బూరుగలు అడవిలో ఎవరో నాదస్వరం ఊదుతున్నట్టుగా కనబడ్డాయి.

ఆ మాఘమాస కాంతారంలో ఎక్కణ్ణుంచో ఎవరో ఒక సన్నని గొంతుతో మొదటిస్వరాలు పలుకుతున్నటుగా తొలిచిగుర్లు కనిపించగానే నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను. అన్నిటికన్నా ముందు ఆ తపసి వృక్షాలు. వాటికి నేను జీవితమంతా ఋణపడి ఉంటాను. ఎటుచూసినా లోపలకి ముడుచుకుపోయి మరుభూమిలాగా, పాషాణహృదయలాగా కనిపించే ఆ అడవిలో ఆ తెల్లటికాండాల మీద వనదేవత అభయహస్తాలు చాచినట్టుగా పెద్ద పెద్ద అరచేతుల్లాంటి ఆ కోవెల చెట్ల ఆకులు నామీద కరుణ కురిపించినట్టుగా ఉండేవి. అసలు ఆ చెట్లని చూస్తే, వనసామ్రాజ్ఞికి గొడుగులుపడుతున్నట్టుగా ఉండేవి.

అర్థరాత్రి చిమ్మచీకటిలో ఒక వెన్నెలరేఖలాగా ఉన్నట్టుండి ఒక రోజు పొద్దున్నే మాకు తెల్లటిమొగ్గలు విప్పారుతున్న చెట్టు కనిపించింది. పాలకొడిసె చెట్టు. అందరం ఆ చెట్టు చుట్టూ చేరాం. ఈ సృష్టిలో ఇక పత్రహరితమన్నమాటనే వినబడదేమో అనే ఆ శైశిరపూర్వాహ్ణాన ఆ తెల్లటిమొగ్గల్ని చూడగానే వనలత అక్కడే అప్రయత్నంగా గొంతెత్తింది.

గొభీర్ నిశిథే ఘూమ్ భేంగే జాయ్ కె జెనో అమారే డాకే

షె కి తుమి? షె కి తుమి?

(గంభీర నిశీథిలో ఎవరిదో స్వరం విని హటాత్తుగా మేల్కొన్నాను. అది నువ్వేనా? అది నువ్వేనా?)

ఆ పల్లవి వినగానే ప్రొఫెసరు సేన్ గుప్త చలించిపోయాడు. ఆయన ఆ పాలకొడిసె కొమ్మని కిందకు వంచి అప్పుడే రేకలు విప్పుకుంటున్న ఆ మొగ్గల్ని మృదువుగా కొనగోటితో తాకాడు.

‘ఎన్నాళ్ళయింది ఒరుణిమా ఈ నజ్రుల్ గీతి విని! ఎప్పుడో నా యవ్వనదినాల్లో కలకత్తా వచ్చిన కొత్తలో కమల్ దాస్ గుప్తా పాడగా విన్నాను. ఎప్పుడు నేర్చుకున్నావు ఈ పాట? ఇంతకుముందెప్పుడూ పాడగా వినలేదే!’ అని అన్నాడు.

వనలత చిరునవ్వింది. ఆయనకేమీ జవాబివ్వకుండా మళ్లా పల్లవి ఎత్తుకుంది.

గొభీర్ నిశిథే ఘూమ్ భేంగే జాయ్ కె జెనో అమారే డాకే

షె కి తుమి? షె కి తుమి?

(గంభీర నిశీథిలో ఎవరిదో స్వరం విని హటాత్తుగా మేల్కొన్నాను. అది నువ్వేనా? అది నువ్వేనా?)

ఆ తర్వాత చరణం వెనక చరణం పాడుతూనే ఉంది.

కార్ స్మృతి బుకే పశాణెర్ మతొ భా జాయే జెనొ థాకే

షె కి తుమి? షె కి తుమి?

(నా గుండెమీద బండలాగా బరువైన ఒక స్మృతి. అది నువ్వేనా? అది నువ్వేనా?)

కాహార్ క్షుధితొ ప్రేమ్ జెనో హాయ్ భీకా చాహియా కమియా బేడాయ్

కార్ సకొరుణ్ ఆంఖీ దుతి జెనో రాతేరొ తారార్ మొతో

ముఖొ పానే జే థకే

షె కి తుమి? షె కి తుమి?

(ఎవరిదో క్షుధిత ప్రేమ యాచిస్తో సంచరిస్తున్నది, ఎవరి కరుణామయ నేత్రాలో రాత్రి తారల్లాగా మెరుస్తున్నవి. వెతుక్కుంటున్న ఆ వదనం, అది నువ్వేనా? అది నువ్వేనా?)

నిశీర్ బాతాసే కహార్ హుతాశ్ దిరొఘొ నిశాస్ సమో

ఝర్ తోలే ఎసే అంతొరే మోర్ ఓగో దురంతో మమో

షె కి తుమి? షె కి తుమి?

(ఈ నిశీథపవనం ఎవరిదో దీర్ఘనిశ్వాసాన్ని మోసుకు తిరుగుతున్నది, నా హృదయాన్ని కలచివేస్తున్నది, ఓ దూరమిత్రమా! అది నువ్వేనా? అది నువ్వేనా?)

మొహాసాగొరేర్ ధేయు ఏర్ మొతో బుకే ఏసే బాజే కహార్ రోదొనొ

పియా పియా నాం జపే ఒభిరాం బొనేర్ పాపియా పాఖీ

ఆమారో చొంపా శాఖే

షె కి తుమి? షె కి తుమి?

(మహాసాగర ఘోషలాగా అది నా హృదయాన్ని కలతపెడుతున్నది, నా వనంలో సంపెంగ కొమ్మమీద పక్షి పాట వినిపిస్తున్నది. అది నువ్వేనా? అది నువ్వేనా?)

ఆమె పాడినంత సేపూ సేన్ గుప్త ఆ కొమ్మని వదల్లేదు. ఎక్కడో తరుకాండాల్లో నిద్రిస్తూ, నిశాంతం లాంటి వసంతంకోసం ఎదురుచూస్తున్న ప్రతి పత్రవృంతాన్నీ, ప్రతి పుష్పవృంతాన్నీ ఆ పాట వెళ్ళి తట్టిలేపినట్టుగా అనిపించింది.

చుట్టూ కలయచూసాను. ఇంకా వసంతం రాకముందే, వసంతాగమనాన్ని ప్రకటిస్తున్న తపసిచెట్లు, పాలకొడిసె చెట్లు- వాటిని చూస్తూ

‘షె కి తుమి? షె కి తుమి?’

అని నాలోనేనే ప్రశ్నించుకున్నాను. టాగోర్ పేరు విన్నానుగాని, నజ్రుల్ పేరు అప్పటిదాకా వినలేదు, ఆయన గీతం వినడం కూడా అదేమొదటిసారి. ఆ మాటే చెప్పాను సేన్ గుప్తతో.

‘నజ్రుల్ ని అందరూ రెబెల్ పొయెట్ గా గుర్తుపెట్టుకున్నారు. కాని ఆయన మధురకవి కూడా. భక్తి కవి కూడా. ఫాల్గుణం మీద, వసంతం మీద గురుదేవులు రాసిన పాటలకి ఏ మాత్రం తీసిపోని పాటలు రాసాడు. కాని ఇవ్వాళ మా ఒరుణిమ ఈ పాట పాడితే నాకెంత యాప్ట్ గా , అప్రాప్రియేట్ గా అనిపించిందో తెలుసా! విమలా, అంతా స్ప్రింగ్ సీజన్ గురించి మాట్లాడతారు. కాని మాఘమాసం చెట్లు నెమ్మదిగా నిద్రమేల్కొనే మాసం. ఫాల్గుణం వాటి ప్రభాతం. ఈ రెండు మాసాల్లోనే అడవి, చెట్లు, మొగ్గలు, పువ్వులు, పక్షులు, సమస్త ప్రకృతి మేల్కొనే వేళ. అందుకే నజ్రుల్ అడుగుతున్నాడు, నా తోటలో గొంతువిప్పిన ఆ పక్షివి నువ్వేనా?నువ్వేనా? అని’ అన్నాడు సేన్ గుప్త.

ఆ రాత్రి ఇంటికొచ్చి పడుకున్నాక కూడా ‘అది నువ్వేనా? అది నువ్వేనా’ అనే మాటలే నా హృదయంలో మోగుతూ ఉన్నాయి. బహుశా ఆ అర్థరాత్రి హటాత్తుగా మెలకువ వస్తే, గది తలుపు తెరుచుకుని, కంచె తలుపు తీసుకుని, ఆ నీరవనిశీథిలో నలుదిక్కులా చూస్తో ‘అది నువ్వేనా? అది నువ్వేనా?’ అని బెంగగా, ఆశగా అడుగుతానేమో, ఆ అడవి దారుల్లో అడ్డం పడిపోతానేమో అని భయమేసింది.

ఇప్పటికీ, ‘షె కి తుమి? షె కి తుమి?’ అనే మాటలు గుర్తొస్తే చాలు, ఎవరో మా వీథిలో ఆర్థరాత్రి మా ఇంటి అడ్రస్సు వెతుక్కుంటూ తిరుగుతున్నారనే అనిపిస్తుంది.

వేసవికి ఎండి నాలుక పిడచకట్టుకుపోయిన నేలమీద తొలి ఋతుపవన మేఘం చినుకులు రాలినట్టు, చీకటి గడిచి, ఇంకా తెల్లవారకముందు తూర్పుదిక్కున తెలినీలి రంగు తెరుచుకున్నట్టు, మాఘతప్త కాననంలోకి ఫాల్గుణం ప్రవేశించింది. అడవిలో నల్లజీడి చెట్లు పండ్లు పక్వం కావడం మొదలుపెట్టాయి. ఊరి అంచుల్లో పొలాల్లో జీడిమామిడి చెట్లు పిందెతొడగడం మొదలయ్యింది. కొండల్లో కొండమామిడిచెట్లమీదా, ఊళ్ళో అంటుమామిడి చెట్ల మీదా పిందెలు కాయలుగా ఎదగడం మొదలయ్యింది.

చూస్తూనే మార్చి మాసంలో రెండువారాలూ గడిచిపోయేయి. వాళ్లు వెళ్ళబోయే ముందు రోజు సాయంకాలం వకుళకుటికి వెళ్ళాను. ప్రొఫెసరు సేకరించిన రాక్ సాంపిళ్లలో ఒకటి ఇంట్లో పిల్లలకి చూపిద్దామని తీసుకువెళ్ళింది నా దగ్గరే ఉండిపోయిందని గుర్తొచ్చింది. అది తిరిగి ఇచ్చేద్దామని వెళ్ళాను. ప్రొఫెసరు తన గదిలో ఉన్నాడు. సామాను సర్దుకుంటూ ఉన్నాడు. ‘ఆ రాయి కోసం మళ్ళా ఇంతదూరం వచ్చావా’ అనడిగాడు. కాని వనలత ఆ రాతిని చేతుల్లోకి తీసుకుంది. చూస్తుండగానే ఆమె ముఖంలో భావోద్వేగాలు పొంగులెత్తాయి. ఆమెని అంతగా చలింపచేసింది ఆ రాక్ సాంపిల్ కాదనీ, అన్నాళ్ళుగా మేము అక్కడ కలిపి గడిపిన రోజులనీ నాకు అర్థమవుతూ ఉంది. వాళ్ళు మళ్లా వస్తారన్న ఊహ వల్ల కాబోలు నాకు అప్పటిదాకా ఎటువంటి బెంగా పుట్టలేదు. కాని వనలత మనసులో ఆ క్షణాన ఏ భావసంచలనం కదలాడిందో నాకు తెలియదుగాని ఆమె వెంటనే-

మొర ఝంఝార్ మతొ ఉద్దొమ్

మొర ఝరొనార్ మతొ చొంచల్

మొర బిధతార్ మతొ నిర్భయ్

మొర ప్రకృతీర్ మతొ సచ్చల్

అని అందుకుంది. సేన్ గుప్త లోపల నుంచే ‘థాంక్ యూ ఫర్ నజ్రుల్ అగైన్’ అని అరిచాడు.

వనలత ‘కాకూ, కమ్ ఆన్, జాయిన్ మీ’ అని ఇటునుంచి అరిచింది. ప్రొఫెసరు బయటకి వచ్చి ఆమె పక్కన చేతులు కట్టుకుని నిలబడి తను కూడా ఆ పల్లవికి గొంతుకలిపాడు.

మొర ఝంఝార్ మతొ ఉద్దొమ్

మొర ఝరనార్ మతొ చొంచల్

మొర బిధతార్ మతొ నిర్భయ్

మొర ప్రకృతీర్ మతొ సచ్చల్

(మేము ఉరుములాగా శక్తిమంతులం, ఊటకాల్వలాగా ఉరుకులెత్తుతాం. విధాత లాగా నిర్భయులం, ప్రకృతిలాగా స్వచ్ఛజీవులం)

మొర ఆకాశేర్ మతొ బధహీన్

మొర మొరు సంచర్ బెడుయీన్

మొర బంధనహీన్ జన్మస్ బధీన్

చిత్తముక్త శతదళ్

(మేము ఆకాశంలాగా బంధనరహితులం, ఎడారిలో సంచరించే బెడొయిన్లం, మేము స్వతంత్రులం, చిత్త ముక్త కమలాలం)

మొర సింధు జొవార్ కలొకల్ మొర పగల ఝొరార్ ఝొరజల్

కల కల్ కల్ చల చలచల్ కలకల్ కల్ చలచల్ చల్

కల కల్ కల్ చల చలచల్ కలకల్ కల్ చలచల్ చల్

(మేము సాగర కలకలనాదాలం, ఉన్మత్త ఝురీజలప్రవాహాలం, కలకల చల చల నాదాలం, నినాదాలం)

మొర దిల్ ఖొల ఖొల ప్రాంతర్

మొర శొక్తి అతల మొహిధర్

మొర హసి గానసొమ ఉచ్చల్

మొర బృష్టిర్ జొల్ బనఫల్ ఖాయి, స్వచ్ఛ శ్యొమల్ బనతల్

(మేము హృదయం తెరిచిపెట్టుకున్న విశాల మైదానాలం, అజేయ మహీధరాలం, సంతోషంగా పాడుకునే గీతాలం, మేము వర్షజలాలు ఆస్వాదిస్తూ, వనఫలాలు ఆరగిస్తాం, వనతలంలో స్వచ్ఛమైన పచ్చికబయళ్ళలో సంచరిస్తాం)

మొర ఝంఝార్ మతొ ఉద్దొమ్

మొర ఝరనార్ మతొ చొంచల్

మొర బిధతార్ మతొ నిర్భయ్

మొర ప్రకృతీర్ మతొ సచ్చల్

(మేము ఉరుములాగా శక్తిమంతులం, ఊటకాల్వలాగా ఉరుకులెత్తుతాం. విధాత లాగా నిర్భయులం, ప్రకృతిలాగా స్వచ్ఛజీవులం)

ఆ తండ్రీ కూతుళ్ళిద్దరూ అలా అరుగు మీద నిలబడి ఒక జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నంత శ్రద్ధగా, ఉత్సాహంతో, ఉద్వేగంతో, ఉచ్చైస్వరంతో ఆ గీతం ఆలపించారు. పాట ముగిసిపోగానే వనలత నన్ను అమాంతం కావలించుకుంది. బుగ్గమీద ముద్దులుపెట్టింది. ఆమె కళ్ళల్లోంచి కన్నీరు ఉబికిపోతూ ఉంది.

ఆ మర్నాడు పొద్దున్నే ప్రొఫెసరు సేన్ గుప్త, వనలత కలకత్తా బయల్దేరిపోయారు. వాళ్ళని ఎక్కించుకున్న జీపు కాలువదాటి, గ్రామదేవత గుడిదాటి, మలుపు తిరిగేదాకా రోడ్డుమీద నిలబడి ఆ దిక్కుకే చూస్తూండిపోయేను.

17-4-2023

17 Replies to “ఆ వెన్నెల రాత్రులు-13”

  1. సార్, ఈ వనయాత్ర ముగుస్తుందే మోనని ఆందోళనగా ఉంది.
    సేన్, వనలత, విమల గార్ల తో మేము ఆ అడవిని, ఆ రాళ్ళను, ఆ బెంగాలీ గీతాలను చూస్తున్నాం, వింటున్నాం.
    రసరమ్య జగత్తులో ఉన్నట్లుగా ఉంది.
    రసరమ్య సృజన చేస్తున్న మీకు మిక్కిలి ధన్యవాదాలు.

  2. ఎక్కడో ఏదో పనిలో పోలిక లేని ఒక బాహ్యప్రపంచంలో భౌతికంగా వున్నా, మీ ఆ వెన్నెలరాత్రులు చదువుతున్నప్పుడు మాత్రం ఆ మాఘమాసపు తొలిమొగ్గల మధ్య ఆ ఊళ్ళో, ఆ అడవిలో ఆ విమల నేనైనట్లు అనిపిస్తోంది అంతర్లోకంలో.
    What magic in your writing sir!! 🙏🏽🙏🏽🙏🏽

  3. మాఘమాసం మిమ్మల్ని మహోద్వేగ భరితుల్ని చేయటం తెలుసు. దాన్ని వివరించడం దానికి తగిన నజ్రుల్ గీతాలను సందర్భశుద్ధిగా ప్రస్తావించడం, మనసును మకరందం గ్రోలిన మధుపంగా మార్చింది. ఒక్కో ఋతువుకు ఒక్కో శోభ ఉంటుంది. అది పట్టుకుని ప్రస్తరించటం ప్రకృతిపై ప్రేమ పెంచడానికి పంచడం ఉత్తమ రచయితలకు
    ఉల్లాసం. పాఠకుడిని అలరించడం కావ్యకళ. కొత్త విషయం తెలుపడానికి అనువైన సన్నివేశం ఎంచుకోవడం కథకుడికి వలసిన నేర్పు. విశ్వకథా వాటికలో ఎన్ని మనసు తట్టిన మహామహుల కథలు చదివారో ఆ శిల్పచాతుర్యం కథనంలో కనులకు కడుతుంది. కాళిదాసు ఋతుసంహా రము , సినారెదనుకుంటా ఋతుచక్రము పేర్లు వినటమే తప్ప చదివే వీలు కలుగలేదు. ఇప్పుడవి చదివి ఋతువుల గురించి వారేం చెప్పారో తెలుసుకోవాలనే కుతూహలం కలిగించారు. దాదాపు నలభైయ్యేళ్లయ్యింద నుకుంటా ప్రబంధాలలో ప్రకృతి వర్ణనము అని ఒక పోలీసు శాఖకు చెందిన చెన్నకృష్ణయ్య అనుకుంటున్నా (ఇంటి పేరు గుర్తుకు రావడం లేదు కానీ) అది తలపుకు వచ్చింది. విశ్వనాథ లబలబలాడిన కావ్యానందం ఎందరు అందిస్తున్నారు.

    అబ్బో ఇక చాలు మీ వ్యాసం కంటే నా స్పందన ఎక్కువయ్యేట్టుంది. ఒక్కమాట. ఇప్పుడు విమల, సేన్, వనలత, రాజు ఆ కొండపల్లె మనసు మహల్లో వేలాడదీసిన పెయింటింగ్స్ అయ్యాయి.నమస్సులు.

  4. ‘”షె కి తుమి? షె కి తుమి?’………

    అనువాదమా? అనునాదమా!!!

    ఏమి శబ్దసృష్టి!!!

    అనువాద మాయాజాలం!!!

  5. ‘షె కి తుమి? షె కి తుమి?’

    Not trying to decipher any and just immersing in the flow making more sense to me now.

  6. సేన్ గారు, వనలత వెళ్తుంటే.. మాకు బెంగ మొదలైంది. విమలకు ఎలా ఉందో?
    అడవిలో హేమంత, శిశిర శోభ లను కన్నులకు గట్టి.. వసంతానికి తెచ్చారు. ఆ వన శోభ అక్షర చిత్రాన్ని..మానసికంగా అనుభవిస్తుంటే.. మధ్యలో అద్భుతమైన బెంగాలీ గీతాలతో..హృదయం రసరంజితం అవుతోంది.. ధన్యవాదాలు సర్.

  7. నజ్రుల్ ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సర్ .ఇదో కొత్త లోకం.

  8. అవును కదండీ….ఫాల్గుణమాసపు అద్భుతాలు… చూడవచ్చినవారిని ఎత్తుకోమని కాళ్ళూ,చేతులూ ఒకేసారి ఆత్రంగా గాలిలోకి లేపుతూ మూతిని సున్నాలా ముడిచే చంటిపాపాయిలా….

    ప్రకృతిని ఇంత గాఢంగా ప్రేమించటం
    సాధ్యమేనా!!!

Leave a Reply to సునీతCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading