
Image design: Mallika Pulagurtha
మాఘమాసం మొదలవుతూనే కొండగాలి నన్ను తాకింది. మరీ అంత వెచ్చగానూ, మరీ అంత చల్లగానూ లేని ఆ నునువెచ్చని తెమ్మెర లాంటిది నన్ను అంతకుముందు తాకింది లేదు, ఆ తర్వాత ఇప్పటిదాకా కూడా అటువంటి స్పర్శ నేను తిరిగి పొందింది లేదు.
నేను ఆ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడు అప్పుడే మహావర్షాలు ముగిసిపోయిన రోజులు. చిక్కటి, దట్టమైన అడవి. శరత్కాలంలో మొదటిసారి అడవిలో అడుగుపెట్టినప్పుడు ఇంకా చిత్తడి. అడవి అంతా గీపెట్టే చిమ్మెటల చప్పుడు. సూర్యకాంతిని జల్లెడపట్టడానికి కూడా చోటులేనంత దట్టంగా అల్లుకున్న శాఖోపశాఖలు. ఆకుపచ్చ, ముదురాకుపచ్చ, నీలం ఆకుపచ్చ, ముదురునీలం, లేతనీలం, పచ్చటినీలం- ఒక చిత్రకారుడన్నట్టుగా ఎన్ని రంగులు కలిపినా ఆ ఆకుపచ్చల్ని నువ్వు కాగితం మీదకు తేలేవు. కానీ చూస్తూండగానే, మేము రోజూ అడవికి వెళ్లి వస్తూండగానే, మాలో మేము మాట్లాడుకుంటూ ఉండగానే, ఆ ఆకులు పండి మా కళ్ళుముందే గాల్లో వరదలాగా ప్రవహించిపోయేయి. హటాత్తుగా ఒక మాఘమాస ప్రభాతాన ఆ అడవిలో నిలబడగానే బూడిదరంగు, ఇటుక రంగు, ముదురు పసుపు, రాగి పసుపు, నీలమూ, రాగీ కలగలిసిన కిలుం రంగు, తుప్పు రంగు కళ్ళముందు ప్రత్యక్షమయ్యాయి. సృష్టి చిత్రకారుడి పెట్టెలో అన్ని మట్టిరంగులు, అన్ని బూడిదరంగులు, అంత రాగి, అంత అభ్రకం, అంత గిరిజం, అంత మంజిష్టవర్ణం, ఆంత కాకిబంగారం ఉండగలవని మనం ఊహించలేం.
ఆకుల్నిపూర్తిగా ఊడ్చేసిన కొమ్మలమధ్యనుంచి ఎవరో ఊళ పెడుతున్నట్టు బోలుగా వీచే గాలి, ఎవరో ఒక పచ్చని లతని ఇంద్రజాలంచేసి పండుగడ్డిగా మార్చినట్టు తేమలేని అడవి. డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్ అంటే బొమ్మ గీసి మరీ వివరించినట్టుగా ఉంది అడవి.
శిశిరం అంటే మంచు అని విన్నాను. కాని టెంపరేట్, పోలార్ జోన్లలో శీతాకాలమంటే కాలమంటే అహర్నిశలు మంచు కురుస్తుండే దృశ్యాల్ని ఊహించవచ్చుగాని మనలాంటి ఉష్ణమండల అరణ్యాల్లో శిశిర ఋతువు అంటే చెట్లు బూడిదరంగులోకి మారిపోడమే అని అర్థం చేసుకున్నాను. ఎక్కడ కొండ అంచు అడవిగా మారిపోతున్నదో గుర్తుపట్టలేనట్టుగా చెట్లు బండల్లాగా, బండలు పొదల్లాగా కనిపించే కాలం. అంతదాకా పచ్చగా కలకల్లాడిన ఆ పత్రహరితం ఏమైపోయింది? ఆ చిగుళ్ళు ఎక్కడికివెళ్ళిపోయాయి? ఆ మొగ్గలు, ఆ పూలు ఏ తలుపుల వెనక దాక్కున్నాయి?
కాని మాఘమాసపు అడవిలో నడవడంలో కొత్త అందం అనుభవంలోకి వచ్చింది నాకు. అంతకుముందు సూర్యరశ్మి చల్లని నీడగా మాత్రమే తెలిసేది. హేమంతకాలమంతటా అడవిపూల వాసన ఘాటుగా చుట్టుముట్టేది. ఇప్పుడు పత్రహీన శాఖా, ప్రశాఖలమధ్యనుంచి నునువెచ్చని సూర్యకాంతి నీ మీద పడుతుంటే అదొక జలపాతపు నులివెచ్చని తుంపరలో నిలువెల్లా స్నానం చేసినట్టు ఉండేది. సాయంకాలం ఆ చెట్లమధ్యనుంచి ఏటవాలుగా సంధ్యకాంతి ప్రసరిస్తున్నప్పుడు పొడుగ్గా పరుచుకునే ఊదారంగు నీడలు పలచగా నీటిపాయల్లాగా కనిపించేవి.
అలాంటి మాఘమాసపు అడవిలో ఒక రోజు నేనొక విచిత్రమైన అనుభవానికి లోనయ్యాను. అప్పటిదాకా పెద్ద పెద్ద వృక్షజాతుల్నీ, లతల్నీ గుర్తిస్తూ వచ్చిన నాకు ప్రొఫెసరు చిన్న చిన్న పొదల్నీ, మూలికల్నీ, మోసెస్ లాంటి నాచు, పాచిమొక్కల్నీ, ఫెర్న్ లాంటి గడ్డిజాతుల్నీ గుర్తించమని చెప్పాడు. ఆ మొక్కల్ని వరసగా గుర్తుపడుతూ ఉండటంలో చాలాసేపే పట్టేది. ఈలోపు తక్కిన బృందం ముందుకు వెళ్ళిపోతూ ఉండేవారు. చెల్లన్నదొరనో లేకపోతే దారి చూపించడానికి నియమించుకున్నవాళ్ళల్లో ఎవరో ఒకరు నాకు తోడుగా ఉండేవారు. నా పని పూర్తయ్యేక వాళ్ళు నన్ను తక్కిన బృందం దగ్గరికి చేర్చేవారు.
అవాళ పొద్దున్నే పని మొదలుపెట్టినప్పుడు అంతా కలిసే ఉన్నాం. కాని ప్రొఫెసరు మార్క్ చేసిన గ్రిడ్ లో ఆయన సాంపిల్స్ సేకరించిన బండల పక్కనున్న పొదల్నీ, గడ్డినీ, మూలికల్నీ గుర్తుపడుతూ నాకు తెలీకుండానే నేను మరో కొండ ఎక్కి తక్కినవాళ్ళకి దూరంగా జరిగిపోయాను. అలా ఎంతసేపు గడిచిందో తెలీదుగాని, మధ్యలో ఒకసారి లేచి పక్కన చూస్తే ఎవరూ కనబడలేదు. చుట్టుపక్కల కూడా ఏ అలికిడీ లేదు. గట్టిగా ‘చెల్లన్నదొరా, చెల్లన్నదొరా’ అని అరిచాను గాని జవాబు లేదు. ‘వనలతా, వనలతా’ అని గట్టిగా కేకలుపెట్టాను గాని నా పిలుపులు వెనుదిరిగి మళ్ళా నాకే తగుల్తున్నాయి. ఒక్కసారిగా కాళ్ళల్లో నిస్సత్తువ వచ్చేసింది. చెప్పలేని భయం ఆవహించింది. చుట్టూ ఊళ పెడుతున్న అడవి. ఎండిపోయిన తరుకాండాల మధ్యనుంచి బొరోమంటూ వీస్తున్న గాలి. ఉన్నట్టుండి ఏ చప్పుడూ లేకుండా గాలి కూడా వీచనంతగా స్తబ్ధమైపోయిన అడవి. ఇంతలో ఎక్కణ్ణుంచో ఒక వడ్రంగిపిట్ట చెట్టు బెరడుని చెక్కుతున్న చప్పుడు వినిపించింది. అలా ఎంతసేపు నించున్నాను, అరగంటసేపా, గంటసేపా తెలీదు. అప్పుడు నన్ను ఆవహించిన భయం క్రూరమృగాల భయమా, లేక నిర్జనస్థలంలో ఒక్కత్తినీ ఉండిపోయానన్న భయమా లేక అక్కడే జీవితకాలం పాటు ఉండిపోతానేమోనన్న భయమా? ఆ భయానికి రూపం లేదు, కారణం లేదు. అత్యంత ఆదిమభయం, నాకెన్నడూ అనుభవంలోకి రాని ఒక అపరిచిత ప్రకంపన.
ఒంట్లో జవసత్త్వాలు ఎవరో లాగేసినట్టుగా అలాగే ఒక చెట్టువార కూచుండిపోయాను. నోరు తడారిపోయి గొంతుక ఎండిపోతూ ఉంది. నా బాక్ పాక్ లో వాటర్ బాటిల్ ఉందన్న విషయం కూడా గుర్తులేదు. ఇంతలో నన్ను వెతుక్కుంటూ ప్రొఫెసరు, వనలత, దేవయ్య, రాంబాబూ, పనివాళ్ళూ మొత్తమంతా అక్కడికి చేరుకున్నారు.
ప్రొఫెసరు ఆ రోజుకి తక్కిన పని కాన్సిల్ చేసేసాడు. ఇంటికి వచ్చేసాం. అక్కడే లంచ్ చేసి రెస్ట్ తీసుకోమన్నాడు. సాయంకాలం టీ తాగేవేళకి నేను తేరుకున్నాను. చెట్ల కింద కూచున్నాం. వకుళకుటి పక్కన చింతచెట్లమీద చింతకాయలు గుత్తులుగుత్తులుగా పండివేలాడుతున్నాయి. కిందరాలిన చింతబొట్టల్ని ఉడతలు కొరికి తింటున్నాయి.
‘నువ్వు బాగా భయపడ్డట్టున్నావు’ అంది వనలత.
అప్పుడు గుర్తొచ్చింది నాకు. గాంధారి పాప గురించి. నేను అడవిలో తిరుగుతున్నప్పుడు ఒకసారి చెల్లన్నదొర చెప్పాడు, దూరంగా ఒక కొండ చూపించి, ఆ కొండ మీద గాంధారి పాప ఉంటుందనీ, అక్కడికి ఎవరూ వెళ్లరనీ. గాంధారి పాప అనే పేరే విచిత్రంగా అనిపించింది. ఎవరామె? అక్కడ ఎందుకుంటుంది అని అతణ్ణి అడిగిందిగాని, అతనికి అంతకుమించి ఏమీ తెలీదు. గిరిజనులకు అదొక సరిహద్దు. నిషేధస్థలం. తమ ఊరు, అడవీ ముగిసిపోయే ఒక పెరిఫరీ. ఆ తర్వాత ఉన్నదంతా వాళ్ళకి చొరరాని చోటు, నడవరాని డొంక, చూడరాని పుంత.
‘గాంధారి పాప గుర్తొచ్చింది. నేనెక్కిన కొండ గాంధారిపాప కొండనే ఏమో అనుకున్నాను. అందుకే భయం వేసింది. అక్కడే అదృశ్యమైపోతానేమో అనిపించింది. బహుశా నేను కూడా ఒక బండగానో, ఎండుకొమ్మగానో మారిపోతానేమో అని కూడా భయపడ్డట్టున్నాను’ అన్నాను. గాంధారి పాప అంటే అంతకుముందు నేను విన్నది కూడా వాళ్ళకి చెప్పాను.
నేను చెప్తున్నంతసేపూ ప్రొఫెసరు తలవాల్చుకుని నిశ్శబ్దంగా విన్నాడు. టీ వచ్చింది. టీ ఒక గుక్క రుచి చూసి, అప్పుడు నాతో
‘విమలా, ఈ రోజునుంచీ నువ్వు కూడా కొండరెడ్లలో ఒక మెంబరుగా మారిపోయేవు. యు ఆర్ రియల్లీ ఫార్చునేట్ ‘ అని అన్నాడు.
నాకు అర్థం కాలేదు.
‘వాట్ ఐ మీన్- టుడే యు ఆర్ యాబుల్ టు షేర్ దైర్ మిత్. ఒక మనిషి తన తోటి మానవసమాజంతో కలిసి భోంచేస్తేనో, కలిసి కాలక్షేపం చేస్తేనో, వాళ్ళల్లో ఒకడు కాడు. వాళ్ళ మిత్స్ ని పంచుకున్నప్పుడు, పంచుకోడం కూడా కాదు, వెన్ వన్ కెన్ ట్రూలీ లివ్ థైర్ మిత్స్, యాజ్ వన్ అమాంగ్ దెమ్- అప్పుడు మాత్రమే, అతడు వాళ్లల్లో నిజంగా ఒకడైనట్టు. ఇవాళ నీకు కలిగిన ఎక్స్ పీరియెన్స్ అదే. ఈ రోజు నువ్వు అనుభవించావే, ఆ ఏకాకితనం, ఆ భయం, ఆ నిస్సహాయత్వం- ఆ ట్రైబ్ లో ఎవరో మొదటిసారి అనుభవించి ఆ భయానికి గాంధారిపాప అని పేరుపెట్టాడు. ఆ రోజునుంచీ ఎవర్నీ అక్కడికి వెళ్ళొద్దని గీత గీసాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎటువంటి భయం కలుగుతుందో అతడు అనుభవించి ఉంటాడు. దట్ ఫీలింగ్ ఆఫ్ అబాండన్ మెంట్, అది మరెవరికీ రాకూడదనే అతడా టాబూ ఫిక్స్ చేసాడు. నువ్వు నీకు తెలియకుండానే ఈ రోజు అ టాబూ వయొలేట్ చేసావు. నువ్వొకవేళ వాళ్ళల్లో ఇప్పటికే ఒక మెంబరు వి అయి ఉంటే ఈ వయొలేషన్ వల్ల నిన్ను బహిష్కరించి ఉండేవారు. కానీ నువ్వు ఒక ఔట్ సైడర్ గా ఈ ఎక్స్ పీరియెన్స్ కి లోనయ్యావు కాబట్టి ఈ రోజు నువ్వు ఆ సమాజంలో ఒక మెంబరువి కాగలిగే అర్హత సంపాదించుకున్నావు’ అన్నాడు.
‘ప్రొఫెసర్! మీరు ఆంత్రొపాలజీ కూడా చదువుకున్నారా?’అని అడిగాను. ఆయన మాటలు నాకు ఒక పట్టాన అర్థం కాలేదు.
‘యు నో విమలా’ ప్రొఫెసరు టీ కప్పు పక్కన పెట్టేసాడు. అరుగుమీద గోడకి జారగిలి కూచున్నాడు. నేను వెళ్ళి ఒక పిల్లో తెచ్చి ఆయన బాక్ రెస్ట్ గా పెట్టి ఆయన ఎదురుగా కూచున్నాను.
ప్రొఫెసరు చెప్పడం మొదలుపెట్టాడు.
‘యాంత్రొపాలజీ, బయాలజీ, జియాలజీ- ఈ పేర్లు పుట్టి మహా అయితే రెండు వందల ఏళ్ళు మించి ఉండదు. కాని నేను చెప్తున్నది లక్షల సంవత్సరాల మానవ అనుభవం గురించి. కోట్ల సంవత్సరాల ఇవొల్యూషన్ గురించి. డ్రిఫ్ట్, నాచురల్ సెలెక్షన్ ద్వారా మనం పూర్తిగా ఎక్స్ ప్లెయిన్ చేయలేకపోతున్న హూమన్ ఇంటలిజెన్స్ గురించి. ‘
‘నైంటీన్త్ సెంచరీలో డార్విన్ ఇవొల్యూషన్ గురించీ, నాచురల్ సెలక్షన్ గురించీ మాట్లాడుతున్నప్పుడు వాలేస్ అనే బయాలజిస్టు ఒక ప్రశ్న వేసాడు. ‘అసలు మానవుడి బ్రెయిన్ ఎలా ఏర్పడింది? ‘ అని. ఎందుకంటే అటువంటి బ్రెయిన్ ఇంతదాకా మనకు తెలిసిన ఏ స్పీషిష్ లోనూ, చివరికి తక్కిన మానవజాతులు అని చెప్పదగ్గ మరే హోమినిన్స్ లోనూ కూడా లేదు. నీకు తెలుసు కదా, తొలి మానవుడు ఇప్పటికి పాతిక లక్షల సంవత్సరాల కింద ప్రభవించాడనుకుంటే అయిస్ ఏజ్ లో తక్కిన అన్ని మానవజాతులూ అంతరించిపోయి చివరికి మన జాతి అంటే హోమో సేపియన్స్ మాత్రమే మిగిలారు. ఈస్ట్ ఆఫ్రికాలో పుట్టారని చెప్పే ఆస్ట్రలోపితికస్, యురేషియాలో కనిపించిన నియాండర్ తల్ మానవులు, ఆసియాలో పుట్టి పెరిగిన హోమో ఎరక్టస్, సౌత్ ఈస్ట్ ఏసియా లో హోమో సొలోన్సిస్, హోమో ఫ్లోరేసీన్సిస్, సైబీరియాలో సంచరించిన హోమో డెనిసోవా- వీళ్ళందరూ హిమయుగానికి తట్టుకోలేక అదృశ్యమైపోయారు. ఆ భయంకరమైన ప్రళయంలో బతికి బట్టకట్టింది, మన పూర్వీకులు, అంటే హోమో సేపియన్స్ మాత్రమే. ఈ సంగతి కూడా నీకు తెలుసు.’
ప్రొఫెసరు తన కాళ్ళు మళ్ళా దగ్గరగా లాక్కున్నాడు. తన వెనక ఉన్న పిల్లో చేతుల్లోకి తీసుకుని దాన్ని రెండుచేతుల్తోనూ దగ్గరగా లాక్కుని వళ్ళోపెట్టుకున్నాడు.
‘హోమో సేపియన్స్- అంటే వైజ్ హూమన్స్- వాళ్ళు వైజ్ ఎలా అయ్యారు? ఎందుకయ్యారు? అదే వాలేస్ అడిగిన ప్రశ్న. నాచురల్ సెలెక్షన్ ప్రకారం ఒక స్పీషిస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో గెలవడానికి దానికి తన నియరెస్ట్ రైవల్ కన్నా కొద్ది పాటి రిలేటివ్ సుపీరియారిటీ ఉంటే చాలు. కాని మనిషికి ఏప్ కన్నా ఎన్నో వేల రెట్లు ఈ అధిక సామర్థ్యం ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అఫ్ కోర్స్. వాలేస్ ఆ ప్రశ్న అడగడం వెనక, మనిషి వెనక ఒక భగవత్సంకల్పం ఉందని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యం అనుకో. అలాగని అతను థీరీ ఆఫ్ ఇవొల్యూషన్ ని తక్కువ చేయలేదు. కాని సైన్స్ అంటే ముందు ప్రశ్నించాలి కదా. అతను చేసిన పని అదే. 1870 లో ఒక సైంటిస్టు అడిగిన ఈ ప్రశ్నకి ఇప్పటిదాకా కూడా సరైన జవాబు రాలేదు. మరో సంగతి తెలుసా? హోమో సేపియన్స్ సాధించిన ఈ అపారమైన జ్ఞానం జియొలాజికల్ టైమ్‌లో చూస్తే ఒక్క క్షణంలో సాధించినట్టు. మనిషి బ్రెయిన్ సాధించిన ఈ డెవలప్ మెంట్ క్వాలిటీలోనే కాదు, టెంపో లో కూడా హేజ్ బీన్ ఎ మాటర్ ఆఫ్ గ్రేట్ వండర్. ఎలా? ఎలా సాధ్యమయింది ఇది?’
‘తక్కిన జాతులకు లేనిదీ, మనిషికి మాత్రమే యునీక్ అని చెప్పదగ్గ లక్షణాలు కొన్ని ఉన్నాయి. మొదటిది, మనిషి బ్రెయిన్ సైజ్. అది అతను పుట్టినప్పటి సైజ్ కన్నా మొదటి ఏడాదే మూడింతలు పెరుగుతుంది. అలాకాక పుట్టినప్పుడే అంత సైజ్ ఉందనుకుందాం, అప్పుడతను పుట్టడమే అసాధ్యం. ఎందుకంటే ఏ తల్లీ కూడా అంత పెద్దతలకాయని ప్రసవించడం సాధ్యం కాదు. ఆ బ్రెయిన్ పెరగడానికీ, వివిధ రకాల స్పందనల్నీ, ప్రతిస్పందనల్నీ అర్థం చేసుకోడానికీ, గుర్తుపెట్టుకోడానికీ, తన మనుగడకు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోడానికీ, మనిషికి చాలా సుదీర్ఘమైన చైల్డ్ హుడ్ అవసరమవుతోంది. చేపలు, పక్షులు, మొక్కలు, రెప్టైల్స్, తక్కిన మామల్స్- మరే జాతిలోనూ ఇంత సుదీర్ఘశైశవం లేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది, ఆ బిడ్డ పెరగడానికీ, నిలదొక్కుకోడానికీ, తనంతతానుగా జీవిక కొనసాగించడానికీ ఒక కుటుంబ రక్షణ. ఇంత స్ట్రాంగ్ ఫామిలీ బాండ్స్- మనకి మరే జీవిలోనూ కనిపించవు.’
ప్రొఫెసర్ ఒక క్షణం ఆగాడు. మళ్లా చెప్పడం మొదలుపెట్టాడు.
‘కాని ఈ లక్షణాలు దాదాపుగా నియాండర్ తల్ మానవుల్లో కూడా కనిపిస్తున్నాయి. బ్రెయిన్ సైజ్ గురించి చెప్పాలంటే సేపియన్స్ కన్నా నియాండర్ తల్ మనిషి బ్రెయిన్ సైజు మరింత పెద్దది. కాని మానవపరిణామంలో ఇప్పటికి నలభై వేల ఏళ్ల కిందటనే వాళ్ళు అదృశ్యమైపోయారు. సేపియన్స్ మాత్రమే ప్లీస్టోసీన్ మహాయుగం దాటి, ఇప్పటికి పది, పదకొండు వేల ఏళ్ళ కిందట హోలోసీన్ లోకి అడుగుపెట్టారు? ఎందుకు? వాటీజ్ దట్ యునీక్ ఫీచర్ ఆఫ్ ద సేపియన్స్?’
‘చాలా జవాబులు చెప్పారు. చెప్తూనే ఉన్నారు. పాలియాంటాలజిస్టులు ఒక పుర్రెనో, ఎముకనో, కొత్త ఫాజిల్ నో కనుక్కున్న ప్రతి సారీ, కొత్త జవాబులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ దాదాపుగా అందరూ అంగీకరిస్తున్న ఒక జవాబైతే ఉంది-‘
అని ఆగి ఇంకొంచెం టీ కావాలన్నాడు. నేను వెళ్ళి టీ కలిపి తీసుకొచ్చాను. అంతసేపూ ప్రొఫెసరు మౌనంగానే ఉన్నాడు. టీ అందుకున్నాక మళ్ళా ఒక గుక్క సిప్ చేసి కొనసాగించాడు.
‘సేపియన్స్ ప్రత్యేకత, వాళ్ళ యునీక్ సామర్థ్యం వాళ్ళ భాష. భాష అంటే ఏదో ఒక భాష కాదు. దైర్ కెపాసిటీ టు కమ్యూనికేట్, ఆర్టిక్యులేట్, కెపాసిటీ టు కాన్స్పెచ్యువలైజ్- ఒక్క మాటలో చెప్పాలంటే, దైర్ సింబాలిక్ కమ్యూనికేషన్.’
‘ఐస్ యేజ్ ముగిసిపోడంతోటే గొప్ప జాతులు అంతరించిపోయాయి. మహామృగాలు, మామత్స్, బైసన్స్ లాంటివన్నీ అదృశ్యమైపోయాయి. భూమ్మీద బ్రూట్ యానిమల్ డామినన్స్ ముగిసిపోయింది. కొంతమంది మూడు లక్షల సంవత్సరాల లెక్క చెప్తారుగాని, అంతకన్నా కూడా తక్కువ వ్యవధిలోనే లక్ష సంవత్సరాల కాలంలోనే మనిషి మనం ఊహించని ఈ అద్వితీయ సామర్థ్యాలు కైవసం చేసుకున్నాడు. ఎలా అంటే? చెప్పాను కదా, తన కమ్యూనికేషన్ సామర్థ్యం వల్ల. ‘
‘ఒక జంతువు తక్కిన జంతువుల్తో ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చెయ్యాలంటే ఆ మంద మరీ పెద్దదిగా ఉండకూడదు. ముప్ఫై, నలభై, లేదా మాగ్జిమమ్, నూట యాభై. కానీ, కొన్ని లక్షలమందితో కమ్యూనికేట్ చెయ్యగల సామర్థ్యం సేపియన్స్ సాధించారు. లక్షలమందితో కమ్యూనికేట్ చెయ్యడమే కాదు, ఆ హెర్డ్ ఇంటెగ్రిటీ చెక్కుచెదరకుండా చూసుకోగల యునీక్ కెపాసిటీ- ఇక్కడే నియాండర్ తల్ మానవుడు సేపియన్స్ ముందు ఓడిపోయాడు.’
‘ఈ యునీక్ కేపబులిటీ సేపియన్స్ దేని ద్వారా సాధించారో తెలుసా? ఈ సృష్టిలో తక్కిన ప్రాణులు చూసినదాన్ని తమ తోటి ప్రాణులకు కమ్యూనికేట్ చెయ్యగలవు. కోతులైతే అబద్ధాలు కూడా ఆడగలవు. కానీ ఆ అబద్ధాలు కనిపించేవాటి గురించి మాత్రమే చెప్పగలవు. ఫర్ ఎగ్జాంపుల్, అదిగో సింహం, పరుగెత్తు అని ఒక కోతి మరో కోతితో అబద్ధం చెప్పగలదు. కాని అలా చెప్పడానికి సృష్టిలో ఏది కనిపిస్తుందో దాన్ని మాత్రమే గుర్తుచేస్తూ చెప్పగలదు. లేనిదాన్ని ఊహించి తన తోటి ప్రాణితో కమ్యూనికేట్ చెయ్యగల సామర్థ్యం దానికి లేదు. మరే ప్రాణికీ లేదు, ఒక్క మనిషి తప్ప.’
ఇప్పుడు ప్రొఫెసరు స్వరంలో మరింత స్పష్టత వచ్చింది. ఒక మనిషి తాను సాధించుకున్న స్పష్టతను మరొక మనిషికి అందించడంలో అనుభూతిచెందే తేటదనం అతని కంఠస్వరంలో వినిపిస్తూ ఉంది.
‘సో, విమలా, ద మాటర్ ఈజ్ వెరీ సింపుల్. మనిషి మాత్రమే ఒక మైథాలజీ సృష్టించుకోగలడు. ఎందుకంటే, ఆ మైథాలజీ వల్ల, ఆ ఇమేజినేషన్ వల్ల, ఆ సింబల్స్ వల్ల అతను కొన్ని లక్షలమందిని ఒక జాతిగా, ఒక స్ట్రాంగ్లీ బాండెడ్ హ్యూమన్ గ్రూప్ గా మార్చగలడు. ఆ గ్రూపులో ఉండే లక్షలాది మంది మెంబర్సులో ఒకరికొకరు ఏ మాత్రం తెలియకపోయినా సరే- ఎందుకంటే వాళ్ళని కలిపేది, ఆ సింబల్స్, ఆ మైథాలజీ- అందుకని ప్రైమరిలీ, మాన్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సోషల్ యానిమల్ బట్ ఆల్సో ఏ మిత్ మేకింగ్ యానిమల్. ఏ స్టోరీ టెల్లింగ్ యానిమల్.’
‘గాడ్, ట్రూత్, బ్యూటీ, జస్టిస్, గుడ్ నెస్- ఇవన్నీ అగోచరాలు. ఇంటేంజిబుల్ ఎంటిటీస్. కాని వీటికోసం మనిషి ప్రాణాలిచ్చెయ్యగలడు. నియాండర్ తల్ మానవుడు కూడా అగోచరాల్ని కొంతవరకు ఊహించగలిగాడు గానీ, కొన్ని లక్షలమందికి చేరగల కాన్సెప్ట్స్ ని అతను సృష్టించలేకపోయాడు. అది సేపియన్స్ కి, అంటే మనకి మాత్రమే సాధ్యమయ్యింది.’
‘దేవతలు, రాక్షసులు ఒకప్పటి సింబల్స్. మోడరన్ నేషన్ స్టేట్, కార్పొరేట్ బాడీస్, కరెన్సీ, ట్రేడ్ ఎగ్రిమెంట్స్, లీగల్ ఎంటిటీస్, హూమన్ రైట్స్- ఇలాంటివన్నీ ఇప్పటి సింబల్స్. మాన్ ఈజ్ ఎ సింబల్ క్రియేటింగ్ యానిమల్. నిరంతరాయంగా ప్రతీకల్ని సృష్టిస్తూనే ఉంటాడు. తాను సృష్టిస్తున్న ప్రతీకల్తో ఎంతమందితో కనెక్ట్ కాగలడన్నదే-అదే అతని నిరంతర అన్వేషణ.’
‘నేనేమనుకుంటానంటే, షేరింగ్ ద ఇంటాజిబుల్ కాన్సెప్ట్స్- ఇదే మనిషి జీవితానికొక మీనింగ్ సమకూరుస్తుంది. నువ్వు షేర్ చేసే సింబల్స్ బేసిక్ ఇన్ స్టింక్ట్స్ ని మాత్రమే మేల్కొల్పగలిగాయనుకో, అప్పుడు నువ్వు జెండాల దగ్గరే ఆగిపోతావు. నా దృష్టిలో అది లోయెస్ట్ ఫామ్ ఆఫ్ హూమన్ ఇంటరాక్షన్. గొప్ప అధ్యాత్మిక గురువుల దగ్గర, శిష్యులు కూచున్నప్పుడు, కేవలం నిశ్శబ్దంతోటే, ఆ గురువు తాను అనుభవిస్తున్న ప్రశాంతిని కమ్యూనికేట్ చేస్తాడు చూడు, ఐ థింక్, దట్ ఈజ్ ద హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ హూమన్ కమ్యూనికేషన్. ఇక తక్కినవన్నీ, నేను జియోలాజికల్ కాంగ్రెస్ లో ఒక పేపర్ చదవడం, ఒరుణిమ గురుదేవ్ గీతం పాడుతుంటే మనమంతా మైమరచి వినడం లాంటివన్నీ ఆ మధ్యలో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనుకుంటాను.’
మాట్లాడటం ఆపి ఆయన తన కప్పులో ఉన్న టీ పూర్తిగా తాగి, కప్పు పక్కన పెట్టి, మళ్లా ఇలా చెప్పాడు:
‘కాబట్టి విమలా, ఈ రోజు నువ్వు ఆ ట్రైబల్ సింబల్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఒక సింబల్ ని అనుభవంలోకి తెచ్చుకోగలిగావు. ఆ కొండ ఎక్కావు. నీకు తెలియదు, అదొక ఫర్ బిడెన్ జోన్ అని. బహుశా అందుకే ఆ వాచరు నీ దగ్గర లేడు అప్పుడు. కాని నువ్వేది ఎక్స్ పీరియెన్స్ చేసావో అది మేము మిస్సయ్యాం. నువ్వు భయపడ్డావు నిజమేకాని, యు హేవ్ అండర్ గాన్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ మొమెంట్స్ ఆఫ్ ఎ ప్రిమిటివ్ ఫియర్. ఐ ఎన్వీ యూ’ అని అన్నాడు నవ్వుతూ.
‘అంటే భయం కూడా అసూయపడ్డదగ్గ విషయమేనా ప్రొఫెసర్?’ అనడిగాను, ఉక్రోషంగా.
ఆయన పకపకా నవ్వేసాడు.
‘భయం కాదు విమలా, ద ప్రిమిటివ్ ఫియర్, యాజ్ ఎక్స్ పీరియెన్సెడ్ బై ఎ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. అంటే నువ్వొక ఆదిమ గిరిజన భాషను అనుభవంలోకి తెచ్చుకున్నావే, దానికి అసూయ కలిగింది అన్నాను. మనం కళలు నేర్చుకోడానికి, భాషలు నేర్చుకోడానికి, కొత్త ప్రదేశాలు చూడటానికి, కొత్త స్నేహాలు చేయడానికీ ఎందుకు అంత క్యూరియస్ గా ఉంటామంటే, మనకు తక్కిన హూమన్ గ్రూప్స్ తాలూకు సింబాలిక్ వరల్డ్ లోకి ప్రవేశించాలనే కోరికవల్ల. మనది కాని సింబాలిక్ వరల్డ్ ముందు మనల్ని భయపెడుతుంది, ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. కాని అది మనలో రేకెత్తించే క్యూరియాసిటీ కూడా తక్కువేమీ కాదు. టేక్ ఫర్ ఇన్ స్టన్స్, ద ఎక్స్ పీరియెన్స్ ఆఫ్ లవ్-‘ అని ఒక క్షణం ఆగాడు.
వనలత వైపు ప్రేమపూర్వకంగా చూసాడు. ఆమె ముఖంలో తత్తరపాటు కనిపించింది. ఆయన తన చూపులు ఆమె మీంచి మరల్చి నన్ను చూస్తూ చెప్పడం కొనసాగించాడు.
ప్రేమ కూడా ఒక సింబాలిక్ కమ్యూనికేషన్. అది ఒక మనిషి తనకై తాను నిర్మించుకునే ఒక సింబాలిక్ వరల్డ్. ఆ భాష మరొక మనిషికి అర్థమయిందనుకో, వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు అంటాం. లేదనుకో, అతనేం చెప్తున్నాడో ఈమెకి ఎప్పటికీ అర్థం కానే కాదు.’
‘అంటే ప్రేమ వట్టి సింబల్ మాత్రమేనా? అది ఒక ఫీలింగ్ కాదా? ఎక్స్ పీరియెన్స్ కాదా?’ అనడిగింది వనలత. ప్రొఫెసరుతో ప్రేమ గురించి చర్చించడం బహుశా ఆమె జీవితంలో ఇదే మొదటిసారి అయి ఉండాలి.
ప్రొఫెసరు ఆమె కేసి అనునయంగా చూసాడు. చిన్నపిల్లని చూసినట్టుగా చూసాడు.
‘యెస్. లవ్ ఈజ్ ఏన్ ఎక్స్ పీరియెన్స్, ఇట్స్ ఎ ఫీలింగ్. అందులో కాదనడానికేముంది? ఇంకా చెప్పాలంటే ఇట్స్ ఎ డ్రీమ్. నువ్వు మాత్రమే కంటున్న కల. నీ కలని మరొక మనిషికి కమ్యూనికేట్ చెయ్యడానికి ఏదో ఒక సింబాలిక్ ఫ్రేమ్ వర్క్ తప్పనిసరి అని మాత్రమే నేను చెప్తున్నాను. ఆ డ్రీమ్ ని ఒక ఫ్లాగ్ లాంటి సింబల్ తో ప్రకటిస్తున్నావనుకో, దాని అర్థం నువ్వు ఎదుటిమనిషి ఇన్ స్టింక్ట్స్ కి మాత్రమే అపీల్ చేస్తున్నావని. అదే నువ్వు అబ్సొల్యూట్ సైలెన్స్ తో కమ్యూనికేట్ చేస్తున్నావనుకో, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో, వారి ఆత్మని రీచ్ అవుతున్నావని అర్థం. ఇద్దరు ప్రేమికులు తాము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ సింబాలిక్ ఫ్రేమ్ వర్క్ లో కమ్యూనికేట్ చేసుకుంటున్నారో చూడమని చెప్తున్నాను, అంతే అని అన్నాడు.
వనలత ఏమీ మాట్లాడలేదు. ప్రొఫెసరు మాటలు ఆమెకి గొప్ప నిశ్చింత కలిగించాయని నాకు తెలుస్తూనే ఉంది.
మరి నా సంగతి?
నాకు ప్రేమ అంటే ఏమిటో అప్పటిదాకా ఎప్పుడూ అనుభవంలోకి రానేలేదు. ప్రేమ అంటే స్త్రీపురుష ప్రేమ అన్న అర్థంలో. కాని ఒక మనిషి మరొక మనిషికి ఇవ్వగల ప్రేమ, బహుశా, మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, చెల్లెలు- వాళ్ళదగ్గరనుంచి నేను పొందిందేమీ తక్కువకాదు. కాని తిరిగి వాళ్ళకు అంత ఇవ్వగలిగానా? కనీసం వాళ్ళిస్తున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలుగుతున్నానని తిరిగి చెప్పగలిగేనా? లేక ప్రొఫెసరు చెప్పినట్టుగా, ఆ ప్రేమ్ వర్క్ పూర్తిగా సైలెన్స్ కి చెందిందేనా?
ఇంక వెళ్ళొస్తానని లేచాను. చీకటి పడుతూ ఉంది. మా ఇంటిదాకా వచ్చి దిగబెడతామని ప్రొఫెసరూ, వనలతా కూడా బయల్దేరారు. మాఘమాసపు సంధ్యమామిడిపూల గాలితో మత్తెక్కిపోయి ఉంది. ఎక్కణ్ణుంచో జీడిమామిడిపూల గాలి కూడా ఎవరో తోటలో పాడుకుంటున్న పాటలాగా మంద్రంగా తేలివస్తోంది. చూస్తూండగానే సప్తమి చంద్రుడు ఆకాశంలో అడుగుపెట్టాడు. ఊరంతా సాంబ్రాణి ధూపం వేసినట్టు వెన్నెల. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన ఆ ప్రొఫెసర్, ఆ కలకత్తా యువతి, మాది కాని ఆ ఊరు, మాకేమీ కాని ఆ వీథులు- కాని కొద్దిరోజుల్లోనే మా మధ్య అల్లుకున్న ఆత్మీయత, ఆ పూలతావి, ఆ అగరు ధూపం-ఆ క్షణాన చెప్పలేని నిశ్శబ్దమేదో నా హృదయమంతా నిండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే స్వీట్ సైలెన్స్.
15-4-2023
Sir, నాకు communicate చెయ్యడం తెలియదు గానీ ఈ రచన ద్వారా communicate చేస్తున్న ఆ intangible truth ఏదోమెల్లగా ఇంకుతున్నట్లు తెలుస్తోంది. I hope I am capable enough to understand all that you are saying.
Swami Sarvapriyananda ‘Hard problem of consciousness’ గురించి చెప్పారు. It sounded like a similar question you asked here and Advaitic perspective has an answer to it.
‘How are HomoSapiens different’ అంటే for their ability to communicate అన్నారు కదా. గర్తొచ్చింది.
Thank you for this opportunity to read your work, sir 🙏🏽
ధన్యవాదాలు. పరిణత, ప్రసన్న పాఠకుల వల్ల రచనకు తృప్తి కలుగుతుంది.
‘సేపియన్స్’ సారాంశం మొత్తాన్ని ఎంత క్లుప్తంగా పట్టుకొచ్చారూ 👌
Thank you
తెలిసీ తెలియని విషయాలేవో తెరమరుగు నుండి బయటకు వచ్చినట్లు,ఒక గొప్ప (ఎంత గొప్పదో చెప్పలేనంత) ముఖ్యంగా నిఘంటువుల్లోనో , ఎన్ సైక్లోపెడియాలోనో దొరకని విషయాలు,మనిషి పరిణతుడు కావడానికి తెలియదగిన విషయాలు ,మానవశాస్త్రాన్ని మథించి చెప్పిన విషయాలు , సేపియన్ మరియు నియాండర్ తల్ వివరణలు ,
ఎన్ని విషయాలు వింగడిస్తున్నారో. ఈ గహనమైన విషయాలు ఇంత సులభగ్రాహ్యంగా చెప్పగలగాలంటే ఎంత విషయావగాహన , ధారణ కావాలో ఊహించగలను. జ్ఞాన సముపార్జన తపోధనులకే సాధ్యం. వీరభద్రమహర్షీ ! నానృషిః కురుతే కావ్యం.
హృదయపూర్వక నమస్సులు
మీ వెన్నెల రాత్రులు వదలకుండా ప్రతిదీ చదువుతూనే ఉన్నాను…
మొదలు పెట్టినప్పుడు కథగానే అనిపించింది… ఇప్పుడు చదువుతూ ఉంటే నా నుంచి ఒక భాగం నా నుంచి విడిపోయి ఎక్కడో సంచరించి వస్తున్నట్టుగా ఉంది..
నాకు అనిపించిన భావాన్ని పూర్తిగా అక్షరాల్లో చెప్పలేనేమో…
చాలా చాలా బాగుంది థాంక్యూ
మీరు చదువుతున్నందుకు సంతోషంగా ఉంది.
ఈరోజు రాసిన ఎపిసోడ్ లో రెండు పదాలకు అర్థం తెలియలేదండి.. అంత గిరిజం, అంత మంజిష్టవర్ణం…
గిరిజం అంటే కొండ నుంచి పుట్టినది అని. సాధారణంగా కొండల మీద వానలు పడ్డప్పుడు కాలువలు జలపాతాలు ప్రవహించి జనవరి తర్వాత ఎండిపోయి చారికలు మిగులుతాయి. ఆ చారికలు ఆ కొండ నుంచి పుట్టినట్టే కనిపిస్తాయి. అభ్రకంరంగులో ఉంటాయి. గిరిజం అంటే అభ్రకమనే పర్యాయపదం కూడా ఉంది.
మంజిష్టమంటే రాగి రంగులో ఉండే ఒక మూలిక. Red Madder hue.
ఇలా ఇన్ని విషయాల సమహారాన్ని చదవగలగడం కూడా ఓ అదృష్టమే అనిపించింది సర్.. మీరు చెప్పిన ఓ నిర్మానుష్యమైన నిశ్శబ్దన్ని సుమారు 4గంటల పాటు అనుభవించాను.. ఆ ఎక్స్పీరియన్స్ నీ అక్షరాల్లో మలచడం గొప్పగా వుంది… Thank you so much sir🙏
ధన్యవాదాలు రూప గారూ!
Essence of Sapiens Book one is all here in pure Telugu….Great readability sir.
Thank you
ఎన్నో,ఎన్నెన్నో విస్మయవిషయాలు తెలుస్తున్నాయండి🙏
Thank you