ఆ వెన్నెల రాత్రులు-11

పందొమ్మిదో శతాబ్దంలో యూరోప్ లో ఒక చిత్రకారుడు తనకన్నా వయసులో ఎంతో పెద్దవాడూ, రేఖానైపుణ్యంలో మానవహస్తాలు చేరగల చిట్టచివరి అంచుదాకా చేరుకున్నవాడూ అయిన మరొక చిత్రకారుణ్ణి చూడటానికి వెళ్ళాడుట. ‘బొమ్మలు బాగా వెయ్యాలంటే ఏం చెయ్యాలి?’ అనడిగాడట. ప్రొఫెసరు మాకు ఆ కథ చెప్పినప్పుడు గట్టిగా నవ్వేడు. ఆ పెద్దాయన ఆ యువకుడికి చెప్పాడట: ‘బాగా వెయ్యాలని కాదు, ముందు, బొమ్మలు వెయ్యాలని కోరుకో. ఎలా వెయ్యాలంటే, నువ్వు నీ చిత్రించాలనుకున్న ప్రకృతి నీ కళ్ళముందుండాలి. ఒకవేళ నీ కళ్ళముందు ఆ దృశ్యం లేదనుకో. నీ జ్ఞాపకాల్లోంచి చిత్రించు’ అని.

ఇప్పుడు నాకు ఆ నాటి ఆ జీవితాన్ని చిత్రించాలంటే మళ్ళా మరొకసారి ఆ ఊరు వెళ్ళాలని ఉంది. ఆ అడవిలో నడవాలని ఉంది. నిర్జనమైన కొండ అంచుల్లో నిలబడి ఆకాశాన్ని నోరారా పిలవాలని ఉంది. ఏటి ఒడ్డున రెల్లుదుబ్బుల్లో మాటుమణిగి, కొంగలు ఏమి చెప్పుకుంటున్నాయో వినాలని ఉంది.

కాని ఆ ఊరికి వెళ్ళలేను. వెళ్ళలేనని కాను, కాని వెళ్ళలేను. డా.సేన్ గుప్తా బంగ్లాదేశ్ లో తాను పుట్టిన గ్రామానికి పోగలనుకానీ, పోలేనని ఎందుకన్నాడో ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు వెళ్లగలవు, ఆ ఊరు అలానే ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎవరో తత్త్వవేత్త అన్నాడని చెప్తారే, నేను కూడా ఆ మాటలే చెప్తున్నాను, నువ్వు అదే నదిలో కాదు, అదే అడవిలో కూడా రెండు సార్లు అడుగుపెట్టలేవు.

ఆ మహాచిత్రకారుడు తనని చూడటానికి వచ్చిన ఆ యువకుడికి చెప్పినమాటల్లో గొప్ప రహస్యం ఉందని నాకు ఇప్పుడు అనుభవానికొస్తోంది. నీ కళ్లముందున్నది నువ్వు చిత్రిస్తే నువ్వు ఒక రిపోర్టరువి మాత్రమే అవుతావు. కాని దాన్ని నీ జ్ఞాపకాల్లోంచి బయటికి తీసినప్పుడు, ఆ అనుభవాల వేర్లు ఒకదానికొకటి ఎంత అల్లిబిల్లిగా అల్లుకుపోయాయో తెలుస్తుంది. అప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు నీకు తెలీదు- కాని  ఆ ఉదయాలు, ఆ సాయంకాలాలు, ఆ చింతచెట్లు, ఆ కొంగలు, ఆ మట్టిబాటలు, ఆ ఐరేణి కుండలు- ఇప్పుడు నీకు గుర్తొస్తుంటే వాటిలో నీ జీవితకాల బాధానందాలు సమ్మిళితమై నువ్వు వినని రాగాలు కొత్తగా వినడం మొదలుపెడతావు. జీవించినప్పుడు నీకు ఒకటే అనుభవం, కాని జీవితాన్ని తలుచుకున్నప్పుడు రెండు అనుభవాలు. రెండో సారి పుట్టడం. కాని మొదటిసారి తెలియని సంతోషం ఇప్పుడు సగం బాధగా, సగం సంతోషంగా, వెరసి ఒక పూర్ణానందంగా అనుభవానికి రావడం.

రాత్రుళ్ళు ఆ తాటాకు ఇళ్ళకప్పుల్లోంచి చలిధారాపాతంగా కురిసేది. నేనూ, పెద్దమ్మాయీ, చిన్నమ్మాయీ ఒకరినొకరం దగ్గరగా లాక్కుని ఒకరి డొక్కలో ఒకరం ముడుచుకుపడుకునేవాళ్ళం. తెల్లవారుతూనే అన్నిటికన్నా ముందు నీళ్ళపొయ్యి దగ్గర చేరేవాళ్లం. వెచ్చని ఆ మంటకి చేతులు అడ్డుపెట్టి కాచుకుంటూ ఉంటే, వీపు మంచుకి తడిసిపోయేది. కొంతసేపయ్యాక మేము వెనక్కి తిరిగి వీపు మంటకి తగిలేలా కూచునేవాళ్ళం. ఇంతలో మళ్ళా వీపు వేడెక్కేది. ఇటు తిరిగేవాళ్ళం. ఊరంతా ఆవరించిన మంచు ఇంకా కరిగేది కాదు. సూర్యరథం ఊరవతలే ఆగిపోయిందా అనిపించేది. అడవి, కొండా, చెట్లూ, ఊరి చివర ఏరూ- అన్నీ మేలుకోడానికి బద్ధకిస్తున్నట్టే ఉండేది.

పిన్నిగారు వాళ్ళింటిని కూడా అరుగులు మెత్తించి పేడతో అలికించారు. గోడలకి తెల్లటి సున్నం వెల్ల వేయించారు. ఇద్దరు ముసలమ్మలు, ఆ ఊరికి కిలోమీటరు దూరంలో ఉందే ఊరినుంచి వచ్చి రోజూ వెల్లవేసేవారు. బకెట్లలో సున్నం కలిపి చీపుర్లతో పూతమీద పూత వేస్తూ ఆ గోడలంతా వెల్లవేయడం చూస్తుంటే పండగ ప్రతి ఒక్క తావులోనూ అడుగుపెడుతున్నట్టుండేది.

పండగ అంటే ఏమిటి? అది ఒకరి ఇంట్లో వాళ్ల కుటుంబానికి మాత్రమే పరిమితమైన వేడుకలాగా కనిపించలేదు. అది ఊరంతటికీ వేడుక. అందరూ అందరి ఇళ్ళకీ వెళ్ళేవారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కర్నీ పలకరించేవారు. ఆ రోజులంతటా దర్జీ సద్గురుమూర్తి మిషను ఖాళీ ఉండేది కాదు. పెద్దమ్మాయీ, చిన్నమ్మాయీ ఒక రోజంతా టైలరు దగ్గరే కూచుని తమ గౌన్లు దగ్గరుండి కుట్టించితెచ్చుకున్నారు.

పండగ ఇంకా మూడు నాలుగు రోజులుందనగా, రాజు ఒక మధ్యాహ్నం మా భోజనాలయ్యాక మమ్మల్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ ఇల్లు ఊరికి తూర్పువేపున శివార్లలో ఉంది. ఆ ఇంటికి వెళ్ళేదారిలో ప్రతి ఇంటి ముందూ చిక్కుడు తీగలు పూలు పూసి కనిపిస్తున్నాయి. ఇళ్ళ కప్పుల మీద అల్లుకున్న గుమ్మడితీగలకు పండుగుమ్మడి, బూడిదగుమ్మడి పండ్లు చుట్టుకుని ఉన్నాయి.  రెండు అరచేతులు కలిపినా చాలనంత పెద్ద పెద్ద గుమ్మడి పూలు పచ్చగా వాటి చుట్టూ అల్లుకుని ఉన్నాయి. వాటిని చూస్తుంటే అన్నిటికన్నా ముందు అవే  తొలిసూర్యకాంతిని కడుపారా తాగినట్టు కనిపిస్తున్నాయి.

రాజు వాళ్ళిల్లు పెద్ద ఇల్లు. పెద్ద ముంగిలి. ఎత్తైన అరుగులు. తక్కిన వాళ్ళ ఇళ్ళల్లో మట్టి అరుగులు కాగా వాళ్ళ ఇంట్లో అరుగులు గచ్చు చేసి ఉన్నాయి. గోడలు కూడా సిమెంటు గోడలు. కప్పు మాత్రం గడ్డి కప్పు. ఆ ఇంటి చుట్టూ కంచె పొడుగునా టేకు చెట్లు, ఒకపక్కంతా అరటిచెట్లు. దాదాపుగా అన్ని చెట్లూ గెలలు వేసి ఉన్నాయి. కొన్నింటికి ఊదారంగు పూలు. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే అరిసెలు వండుతున్న వాసన గాల్లో అల్లుకుపోయి స్వాగతమిచ్చింది. ఆ రోజో, ఆ ముందురోజో ఇంట్లో పూతరేకులు చుట్టి ఉంటారు, నెయ్యీ, ఏలకులూ కలిసిన సుగంధం చిక్కగా పొరలాగా పేరుకుని ఉంది. రాజు వాళ్ళ తండ్రి పెద్ద రైతు. ఆయనకి మాగాణి పొలాల్తోపాటు, అరటితోట, చెరకుతోట కూడా ఉన్నాయి. పెద్ద కుటుంబం. వాళ్ళ ఇంట్లో మమ్మల్ని  ఎంతో ఆదరంగా పలకరించేరు. వెండి పళ్ళేల్లో అరిసెలు, పూతచుట్టలు పెట్టారు. కంచుగ్లాసుల్తో కాఫీ ఇచ్చేరు.

‘ఇంటికొస్తే చాలు మా వాడు రోజూ మీ కబుర్లే చెప్తుంటాడు’ అన్నది వాళ్ళమ్మగారు.

కొంతసేపు కూచున్నాక మళ్ళా నేరుగా ఊళ్ళోకి రాకుండా కొండరెడ్ల వీథిలోంచి మమ్మల్ని చుట్టు తిప్పి తీసుకొచ్చాడు రాజు. పండగ సంతోషం మాకు చూపించాలని.

సంక్రాంతి కొండరెడ్లకు పెద్ద పండగ. వాళ్ళు ఇళ్ళన్నీ బూజు దులిపి, గోడలు, అరుగులు మళ్ళా మట్టితో కొత్తగా మెత్తుకుంటున్నారు. ఇంటి అరుగుల పక్కన ఎర్రటి మట్టిమెత్తి దాని మీద తెల్లటిచుక్కల్తో ముగ్గులుపెట్టారు. గోడలమీద కూడా లతలూ, పూలూ తెల్లటి ముగ్గులూ పెట్టారు. వాటిని చూడగానే ప్రొఫెసరు ‘జామినీ రాయ్ గుర్తొస్తున్నాడు’ అన్నాడు.

‘సీ దోజ్ మోటిఫ్స్. బెంగాల్లో పటచిత్ర కళాకారులు గీసిన బొమ్మల్లాగా ఉంది ప్రతి ఇల్లూ. దీజ్ పీపుల్ మస్ట్ బి ఆర్టిస్ట్స్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఆర్డర్. ఇంటినే కాన్వాసుగా మార్చేసుకున్నారు’ అని అన్నాడు.

‘జామిని రాయ్ చాలాకాలం యూరోప్ ని అనుకరించాక, వన్ ఫైన్ మార్నింగ్, హి రియలైజ్డ్ దట్ ద రియల్ ఆర్ట్ వాజ్ దేర్ ఇన్  రూరల్ బెంగాల్. అంతే, కాళీఘాట్ పటచిత్రకారుల దగ్గరకి పోయి కూచున్నాడు. యు నో. దెన్ హి ఎమర్జెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్స్ ఆఫ్ బెంగాల్ ‘ అని కూడా అన్నాడు.

సంక్రాంతి దానికదే ఒక ఋతువు. తక్కిన ఋతువులకి చెట్లో, పొలాలో, నదులో కొత్త శోభ సంతరించుకుంటాయి. కాని సంక్రాంతివేళ ప్రతి ఇల్లూ కొత్త కళసంతరించుకుంది. కొత్తధాన్యం దాచుకోడానికి గాదెలు తెరుచుకున్నట్టే, ఉత్తరాయణపు సూర్యకాంతిని దాచుకోడానికి ప్రతి ఇల్లూ తన ఒక గాదెగా మారిందా అనిపించింది.  దివారాత్రాలూ వెలిగించిన మట్టి ప్రమిదల్లాగా ఆ కొండరెడ్ల ఇళ్ళవరసలు కలకల్లాడేయి. దీపావళి ఒక రాత్రి పండగ. కాని సంక్రాంతి నెలరోజుల పండగ అనిపించింది.

ఆ రోజులంతటా ప్రతి రోజూ ఊళ్ళోకి కొత్త ధాన్యం మూటలు కట్టుకుని ఎడ్లబళ్ళు అడుగుపెడుతూనే ఉండేవి. ఏటిమీద వంతెన దాటి, పొలాల మధ్యనుంచి ఊళ్ళోకి అడుగుపెట్టగానే చింతచెట్లమీద కొంగలు ఒక్కసారిగా కలకలం చేసేవి. ప్రతి రోజూ ఎవరో ఒకరింట్లో అటుకులు దంచుతున్న చప్పుడు వినిపించేది. మంగలంలో దోరగా వేయించిన కొత్తధాన్యం రోట్లో వేసి రోకళ్ళతో దంచుతుంటే గాజులగాజుల గలగలతో పాటు మనుషుల కిలకిలకూడా కలిసి వినిపించేది. ప్రతి ఇంటికీ బంతిపూల మాలలు తోరణాలయ్యేవి. తోటల్లో నారింజలు, కమలాలు పండిన నవసుగంధం వీథులదాకా వ్యాపించేది.

పండగ మూడురోజులూ ఊరూ, మనుషులూ, పశువులూ, బండ్లూ, చివరికి గోడలూ, అరుగులూ కూడా కొత్త అలంకారాల్తో మెరిసిపోయారు. పండగరోజు ఆ ఊళ్ళో వాళ్ళంతా ఊరి వెనక ఉన్న కొండ ఎక్కారు. పండగరోజు కొండ ఎక్కే ఆ ఆచారం ఎక్కణ్ణుంచి వచ్చిందో నాకైతే తెలియలేదు.  ఆ రోజు రంగురంగుల జెండాల ఊరేగింపులాగా కొండ పొడుగునా కనిపిస్తున్న మనుషుల్ని చూసి సేన్ గుప్త ఆనందం పట్టలేకపోయాడు.

‘దీజ్ ఆర్ ట్రూ మౌంటెన్ వర్షిప్పర్స్!’ అన్నాడు. చప్పట్లు కొట్టాడు.

‘ఒరుణిమా, టేక్ ఫొటోస్. మన డిపార్ట్ మెంట్ లో చూపిద్దాం. దోజ్ ఫెలోస్ షుడ్ బి సెంట్ హియర్ ఫర్ ఏన్ ఓరియెంటేషన్’ అని అన్నాడు.

ఆ రోజు సేన్ గుప్తని, వనలతనీ సూర్యనారాయణమూర్తిగారు ఇంటికి భోజనానికి పిలిచాడు. అరటాకుల్లో పూర్తి తెలుగుభోజనం వడ్డించారు. ప్రతి ఒక్క వంటకాన్ని సేన్ గుప్త పేరుపేరునా అడిగి మరీ ఆరగించాడు. ఆ తర్వాత ఆయన ఆ దంపతులిద్దరికీ కొత్త వస్త్రాలు కానుకచేసాడు.

‘నేను పెద్దయ్యాక ఉద్యోగంలో చేరాక ప్రతి పండక్కీ మా పేరెంట్స్ కి కొత్త వస్త్రాలు పెట్టాలనుకునేవాణ్ణి. కాని నాకింకా ఉద్యోగం రాకముందే మా నాన్న ఈ లోకం నుంచి సెలవుతీసుకున్నాడు. నాకు ఆ అదృష్టం లేకపోయింది. ఈ రోజు మీ రూపంలో వాళ్లకి ఈ నూతన వస్త్రాలు సమర్పిస్తున్నాను’ అని అన్నాడు. ఆయన కళ్లల్లో పలచని నీటిపొర.

పండగ పేరు చెప్పి వారం రోజులు మేం ఫీల్డ్ కి పోలేకపోయాం. కాని రాజు ప్రతి రోజూ మమ్మల్ని సాయంకాలాలు ఎక్కడో ఒకచోటికి తీసుకుపోతుండేవాడు. ఒకరోజు వాళ్ల చెరకుతోటకి తీసుకువెళ్ళాడు. అక్కడ మొదటిసారిగా ఒక చెరకుగానుగ చూసాను. బెల్లం వండటం కూడా చూసాను. పెద్ద పాత్రలో చెరకుపోసం పోసి కలయదిప్పుతూ ఉంటే అది మరిగి మరిగి బెల్లంగా గడ్డకడుతూ ఉంది. ఆ బెల్లంపాక పక్కన గుట్టలుగా పోసిన చెరకు పిప్పి. ఆ పిప్పినే మళ్లా పొయ్యిలో మంటపెట్టడానికి వాడుతున్నారు. మరొక పక్క ఈతాకుల చాప మీద అచ్చులు అచ్చులుగా పోసిన కొత్త బెల్లం. ఆ బెల్లం చుట్టూ, ఆ పిప్పిమీదా, ఆ బెల్లం వండుతున్న మనుషుల చేతులమీద ఈగలు. ఆ ఈగలకి తీపి తప్ప మరొక రుచి తెలిసే అవకాశమే లేదు.

సాయంకాలాలు పొలాలమ్మట నడిచివెళ్ళేవాళ్ళం. వనలత అతణ్ణి ఏదో ఒకటి అడుగుతూ ఉండేది. కాని నా దృష్టి వాళ్ళ మాటల మీద ఉండేది కాదు. పంట కోసిన తర్వాత పొలాల్లో మిగిలిన పరిగె ఎవరో ఒకరు ఏరుకుంటూ ఉండేవారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయాక రాలి పడ్డ గింజలకోసం గోరువంకలు వచ్చి వాలేవి. అవి వాలి ఎగిరిపోయిన తర్వాత కింద బొరియల్లోంచి ఎలకలు పైకి వచ్చి మిగిలిన కంకుల్ని నెర్రెల్లోంచి పాతాళంలోకి పట్టుకుపోయేవి. గంగిరెద్దులు ఆడించుకునేవాళ్ళు మొదలుకుని గోరువంకలదాకా సంక్రాంతి ప్రతి ఒక్కరికీ పెద్ద పండగే.

ఒకరోజు వనలత రాజుని సూటిగా అడిగేసింది.

‘మీరెప్పుడు చూసినా ఇక్కడే కనిపిస్తున్నారు. మీ కాలేజి నడవట్లేదా? మీ చదువు సంగతేమిటి?’ అని.

‘అదొక పెద్ద చదువా? దానికేముంది? ఎలా రాసినా పాసైపోతాను’ అన్నాడు. ‘కాని ఎందుకో, ఇక్కణ్ణుంచి కాకినాడ వెళ్తానా, మర్నాడే మళ్ళా బస్సెక్కి ఇక్కడికి వచ్చెయ్యాలని ఉంటుంది. మా ఊరు నాతో పాటే వచ్చేస్తుంది. తెల్లవారినప్పణ్ణుంచీ, ఇక్కడుండొద్దు, వెళ్ళిపోదామంటుంది. ఏం చెయ్యను!’ అన్నాడు.

‘మీరు ఫైనలియరేమో కదా. ఫస్ట్ టూ యియర్స్ ఆవెరేజి ఎలా ఉంది?’ అనడిగింది.

ఏదో చెప్పాడు టక్కున, ఎయిటీ అనో, ఎయిటీ టూ అనో. కానీ తర్వాత తర్వాత తెలిసింది, అతను ఆ మొదటి రెండేళ్ల పరీక్షలు కూడా పరీక్షలు రాయలేదని. మూడేళ్ళూ సింగిల్ సిటింగ్ లో రాద్దామని అనుకుంటున్నాడని. కానీ ఈ లోపు మా గాంగ్ లో చేరాడు. ఎలా రాస్తాడో ఏమో అని అనుకున్నాను. చెప్పొద్దూ, జాలేసింది.

కానీ ఆ ఊరు అలాంటిది. అక్కణ్ణుంచి బయటి ప్రపంచంలోకి రావాలంటే మామూలు బలం చాలదు. భూమ్యాకర్షణ శక్తిని దాటి ఒక మనిషి తనంతతాను రోదసిలోకి ఎగరడం ఎంత కష్టమో, ఆ ఏరూ, ఆ కొండలూ, ఆ గాలీ, ఆ వెలుగూ మనమీద విసిరే వలనుంచి బయట పడటం కూడా అంతే కష్టం.

పండగ వెళ్ళిపోయాక మళ్లా మేము పనిలో పడ్డాక, ఒక సాయంకాలం వకుళకుటికి వెళ్లాను. ప్రొఫెసరు బాగా అలసిపోయి ఉన్నట్టున్నాడు, తన గదిలో విశ్రాంతితీసుకుంటూ ఉన్నాడు. నేనూ, వనలత ఆ కుటీరం పక్కన మామిడిచెట్ల కింద కూచున్నాం. గాలినిండా మామిడిపూత.

మాటల మధ్యలో వనలత లోపలకి వెళ్ళింది. అంతలో, పోస్ట్ మాన్ రాజబాబు ఒక కవరు తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాడు. పసుపుపచ్చ కవర్. దాని మీదా ‘మిస్ బనలతా సేన్ గుప్త’ అని పొందిగ్గా రాసిన అక్షరాలు. ఎవరో చాలా శ్రద్ధగా చదువుకునే స్కాలర్ చేతిరాతలాగా ఉంది.

వనలత మళ్లా నా దగ్గరకు రాగానే ఆ కవరు ఆమె చేతుల్లో పెట్టాను. ఆమె ‘ఏమిటిది?’ అని అడుగుతూ దాన్ని చూస్తూనే ఉలిక్కిపడింది. ఆ కవర్ని చేతుల్తో రెండువేపులా ఆప్యాయంగా తడిమింది. అంతలో ఆమె ప్రమేయం లేకుండానే కన్నీళ్ళు బొటబొటా కారడం మొదలుపెట్టాయి. మరుక్షణంలో వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

నాకు ఏమీ అర్థం కాలేదు. కంగారుగా అనిపించింది. ఏమై ఉంటుంది? ఎవరు రాసి ఉంటారు ఆ ఉత్తరం? అందులో ఏముందో కూడా చూడకుండానే, చదవకుండానే ఎందుకలా ఏడుస్తోంది? ఎప్పుడూ లేడిపిల్లలాగా చెంగుచెంగున గెంతులేసే ఆ బిడ్డ ఎందుకలా ఏడుస్తోంది?

కాని నేను ఆమెనేమీ అడగలేదు. మౌనంగా కూర్చుండిపోయాను. ప్రొఫెసరు బయటికొస్తే ఆమెని అలా చూస్తే ఏమనుకుంటాడో అని ఆత్రుత కూడా కలిగింది. కొంతసేపటికి వనలత తేరుకుంది.

‘ఐ యామ్ సారీ’ అంది, కళ్ళు తుడుచుకుంటూ.

‘ఆ ఉత్తరంలో ఏముందో చూడకుండానే ఎందుకు మీకంత కష్టం కలిగింది?’ అనడిగాను.

‘ఆ లెటర్ లోనా? ఏముంటుంది? ఏమీ ఉండదు. బహుశా న్యూ యియర్ గ్రీటింగ్స్ తప్ప మరేమీ ఉండకపోవచ్చు’ అంది.

ఈసారి మరింత ఆశ్చర్యపోయాను. వట్టి న్యూయిరర్ గ్రీటింగ్స్ కే పట్టరానంత దుఃఖం ఎలా పొంగిపొర్లుతుంది? ఆమెని అటువంటి స్థితిలో అప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు.

ఆమెని అడగడం కూడా సమంజసం కాదు అని ఊరుకున్నాను. రెండుమూడు నిమిషాలట్లా గడిచాయి. చిరుగాలి వీచినప్పుడల్లా మామీద కూడా మామిడిపూత రాలుతున్నది. అప్పుడప్పుడే ఆకుపచ్చని చుక్కల్లాగా తలెత్తుతున్న పిందెల్ని రామచిలుకలు కొరికిపడేస్తున్నాయి.

అప్పుడు వనలత నెమ్మదిగా, మెల్లగా ‘ద గ్రీటింగ్స్ ఆర్ ఫ్రమ్ హిమ్’ అంది.

డాక్టర్ నిహార్ రంజన్ రే వనలతకి సీనియర్ కొలీగ్. అతనూ, వనలతా, ప్రొఫెసరు సేన్ గుప్తా ఒక బృందం. చాలా తెలివైన విద్యార్థి. ఇప్పుడు యూనివెర్సిటీలో అసిస్టంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాడు. అతనికి ముప్పై అయిదేళ్ళుంటాయి. పెళ్ళయింది, పిల్లల్లేరు. ఏ కారణం చాతనో భార్యాభర్తా విడాకులు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారు.

‘ఇంకా ఆ ప్రపోజల్ మెటీరియలైజ్ కాలేదు. బెంగాలీ భద్రలోక్ లో డైవోర్స్ తీసుకోవడం చిన్న విషయం కాదు.’

అతనూ, వనలతా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఆ డైవోర్స్ విషయం ఒక కొలిక్కి వస్తే వనలత పెళ్ళి ముందుకు నడుస్తుంది.

‘ప్రొఫెసరు కి తెలుసా?’ అనడిగాను.

‘కాకూకి తెలుసో లేదో నాకు తెలియదు. ఎప్పుడూ మాటమాత్రంగా కూడా అడగలేదు, అనుమానించలేదు. కాని తెలిస్తే మాత్రం అడ్డుచెప్పడు. వాళ్ళన్నకి సేన్ గుప్త ఎంత చెప్తే అంత. ఆయన్ని ప్రొఫెసరు ఒప్పించగలడు అని నా నమ్మకం. కానీ, సమస్యల్లా మా మమ్మీతో. ఆమె ఒప్పుకోదు సరికదా, గందరగోళం సృష్టించగలదు’ అని అంది. అందుకనే మధురిమ కథ వినగానే నాకు వెంటనే వనలత గుర్తొచ్చింది.

‘మరి వాళ్ళింట్లో సంగతేమిటి? అతని వైపు కూడా ఆలోంచించాలి కదా. మరి మీరు వివరంగా మాట్లాడుకున్నారా? ‘ అనడిగాను.

‘ఏమిటి మాట్లాడుకోవడం? నేనిప్పటిదాకా అతన్ని ప్రేమిస్తున్నట్టే అతనికి చెప్పలేదు’ అంది వనలత.

మరింత ఆశ్చర్యపోయాను.

‘మరి అతను చెప్పాడా?’

‘ ఐ లవ్ యు అనా? లేదు. ఇప్పటిదాకా అతని నోటమ్మట ఆ మూడు మాటలు విననేలేదు’ అంది

‘ఒకరికొకరు చెప్పుకోకుండానే ఒకరినొకరు ప్రేమించుకున్నామని ఎలా అనుకుంటున్నారు?’ అని అడిగాను.

‘ప్రేమ ఎక్స్ ప్రెస్ చేసేది కాదు విమ్మీ, ఫీలయ్యేది’ అంది వనలత.

నాకేమనాలో తోచలేదు.

‘కాని ఫీలింగ్స్ ఎన్నో రకాలుగా ఉంటాయేమో కదా. అది ప్రేమే అని మీకెలా తెలుసు?’ అన్నాను మళ్ళా, ఏమిటో నా ప్రశ్నలు, నాకే చిరాకుపుట్టిస్తున్నాయి.

‘తప్పకుండా తెలుస్తుంది. ఫర్ ష్యూర్, ప్రేమ ఈజ్ ఎ యునీక్ ఫీలింగ్’ అంది వనలత, చిరునవ్వుతో.

వానవెలిసిన తరువాత వెలుగులాగా కన్నీళ్ళకు తడిసిన ఆమె చెంపలమీద ఆ చిరునవ్వు తళుక్కుమంది.

14-4-2023

13 Replies to “ఆ వెన్నెల రాత్రులు-11”

 1. మా ఊళ్ళో సంక్రాంతి సంబరాల్లో ఆ రంగుల ముగ్గులు, గొబ్బిళ్ళు, ఇంకా చెరుకుగానుగలు (బెల్లం తయారు చేసేవాళ్ళు) కళ్ళ ముందు మెదిలాయి. 🙏🏽

 2. సంక్రాంతి పండుగ కథలోకి కథను తెచ్చింది. ప్రేమ డిస్కషన్ బాగుంది.

 3. సంక్రాంతి వైభవం పల్లెల్లోనే చూడాలి. మా చిన్నప్పటి సంక్రాంతి రోజులు గుర్తుకువచ్చాయి.. చాలా బాగుంది సర్.

 4. “—-జీవించినప్పుడు నీకు ఒకటే అనుభవం, కాని జీవితాన్ని తలుచుకున్నప్పుడు రెండు అనుభవాలు. రెండో సారి పుట్టడం. కాని మొదటిసారి తెలియని సంతోషం ఇప్పుడు సగం బాధగా, సగం సంతోషంగా, వెరసి ఒక పూర్ణానందంగా అనుభవానికి రావడం.—“

 5. నాకూ ఇప్పుడు అనుభవానికొస్తోంది…

  జీవించినప్పుడు నీకు ఒకటే అనుభవం, కాని జీవితాన్ని తలుచుకున్నప్పుడు రెండు అనుభవాలు. రెండో సారి పుట్టడం. కాని మొదటిసారి తెలియని సంతోషం ఇప్పుడు సగం బాధగా, సగం సంతోషంగా, వెరసి ఒక పూర్ణానందంగా అనుభవానికి రావడం.

  అవి కథలుగా రూపుదిద్దుకోవడం.

 6. మీరు చెప్పిన పల్లె వైభవాలు చిన్నప్పుడు నేనూ ఆస్వాదించానండి.ఎంతో భావావేశంతో
  మరీను.
  కానీ ఇప్పుడు వెళ్ళగలను…కానీ వెళ్ళలేను…
  ఎందుకో మీ మాటలు చదివాక అర్థమయింది🙏

 7. వీరభద్రుడి గారి కుటీర విహారం చేయక ముందు చేసిన తర్వాత మన అనుభూతులకు, వాటిని వ్యక్తీకరించే భాష, ఆలోచన ఇలా అనేక అంశాల్లో మనకు ఓ విభజన రేఖ స్పష్టంగా తెలుస్తుంది. బయట ప్రపంచాన్ని వీక్షిస్తున్నప్పుడు వారి రచనల పఠనానుభవాన్ని దాటి పోలేము అనిపిస్తుంది. https://www.youtube.com/watch?v=aP6FMnmX7BQ
  ఇలా ఒంటరి చేల మధ్య ఒకతే మన అమ్మలా గుర్తుకు వస్తూనే ఉంటుంది.

Leave a Reply

%d bloggers like this: