
Image design: Mallika Pulagurtha
పంట కోతలు మొదలయ్యాయి. ఆ ఊళ్ళో పొలాలు నీటిపారుదల పెద్దగా ఉన్నవి కాదు. ఇప్పట్లాగా ఎక్కడ చూసినా గొట్టపుబావులు కనిపించే కాలమూ కాదు. నాలుగైదు చిన్న చెరువులకింద ఉండే వరిచేలు పుష్టిగా ఎదిగాయి. అవికాక వర్షాధారానికి పెరిగిన చేలు కూడా ఏ తుపానులూ తాకనందువల్లా, విస్తారంగా మంచుకురుస్తున్నందువల్లా కొద్దో గొప్పో ఏపుగానే పెరిగాయని చెప్పవచ్చు.
నా కళ్ళముందే ఆకుపచ్చని వరిచేలు ముందు గోధుమరంగులోకీ, ఆ తర్వాత బంగారుపసుపురంగులోకీ మారిపోతూ ఉండటంతో నా కళ్ళు ప్రతి రోజూ తూనీగల్లాగా ఆ పొలాల మీదనే ఎగుర్తుండేవి. వరిచేలల్లో కోతలు మొదలయ్యాక ఆ గ్రామసీమ స్వరూపమే మారిపోయింది. ప్రతి ఒకరి ముఖంలోనూ ఏదో సాఫల్యం, ఏదో సంతోషం. ఆ రోజులంతటా కనిపించేమేరదాకా లోకమంతా తలుపుల్లేని ఇల్లులాగా కనిపించేది. ఆ రోజుల్లో ఆ దారమ్మట ఏ బాటసారి నడిచి వెళ్తున్నా ఆ పొలాల మీది గాలులు అతణ్ణి అకారణంగా ముద్దాడుతున్నట్టుగా అనిపించేది. బహుశా నేనొక్కర్తినే ఆ సాయంకాలాలు ఆ పొలంగట్లమీంచి నడిచి వెళ్ళి ఉంటే ఆ చేలు నా దోసిళ్ళనిండా ధాన్యం ధారపోసి ఉండేవనిపించేది.
ఆ పొలాల్ని చూస్తూ ఉంటే, ఒక్కరోజు కూడా అక్కడ దుక్కి దున్నక పోయినా, నాట్లు వెయ్యకపోయినా, కలుపు తియ్యకపోయినా- ఆ పంటంతా నా చేతికొచ్చినట్టే కనబడేది. ఆ పొలాలన్నీ నావేననీ, ఆ పంటలు బాగా పండేక, ఇవాళో, రేపో ఊళ్ళోవాళ్ళందరినీ పిలిచి ఎవరికి ఎంత కావాలో అంత కోసి తీసుకుపొమ్మని చెప్పబోతున్నాను అనుకునేదాన్ని.
అలాంటి రోజుల్లో ఒక ఆదివారం రాజు పొద్దున్నే మా ఇంటికొచ్చాడు. వకుళకుటికి వెళ్దామన్నాడు. ఆదివారం ఒక్కరోజే ప్రొఫెసరుకి విశ్రాంతిదొరికే రోజు, ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడమన్నాను. కాని ఎక్కువసేపు వుండొద్దనీ, ఊరికే చూసి వచ్చేద్దామనీ అన్నాడు. తీరావెళ్ళాక అసలు విషయం బయట పెట్టాడు.
తమ వరిచేలో కోతలు మొదలుపెట్టారు, తీసుకువెళ్ళి చూపించడానికి వచ్చానని చెప్పాడు. ప్రొఫెసరు నన్నేమనుకుంటాడో అనుకున్నాను. ఆ రోజు ఆయన అప్పటిదాకా కలెక్ట్ చేసిన సాంపిల్స్ నంబర్లవారీగా పాక్ చేసుకుంటున్నాడు. దేవయ్య, రాంబాబు ఆయనకి సాయం చేస్తున్నారు. ఆ మద్ధ్యాహ్నం వాటిని నర్సీపట్నం లో ట్రాన్స్ పోర్ట్ లో ఇవ్వాలని అనుకుంటున్నారు.
రాజు చెప్పిన మాటలు విని ప్రొఫెసరు ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. అది తటపటాయింపుకాదు, తాను కూడా మాతో రావాలని ఒకక్షణం ప్రలోభానికి లోనయ్యాడేమో అనుకున్నాను. చివరికి తాను రాలేననీ, నేనూ, వనలతా వస్తే తీసుకువెళ్ళొచ్చనీ చెప్పాడు.
‘లంచ్?’ అంది వనలత. అప్పటికింకా పదిదాటలేదు.
‘అక్కడే’ అన్నాడు రాజు.
‘ఎక్కడ? పొలాల్లో?’ అనడిగింది ఆమె. ఆ కళ్ళల్లోంచి పసితనం కారిపోతూ ఉంది.
ఊరికి అడ్డం పడి, పొలాలమ్మట నడుచుకుంటూ రాజు వాళ్ళు చేలదగ్గరకి చేరుకున్నాం. మేము అంతకుముందు ఒక వెన్నెల సాయంకాలం అడుగుపెట్టిన చేలే అవి. అప్పుడు అంత స్పష్టంగా కనిపించని ఆ చెరువూ, దూరంగా ఏరూ. కనుచూపుమేరంతా నడుస్తున్న కోతలు- ఆ దృశ్యంలో చెప్పలేనంత ఉత్సవ సంరంభం కనిపించింది. రాజూ వాళ్ళ చేలో కోతలు అప్పటికే మొదలయ్యాయి. ఆ కోస్తున్న స్త్రీలకి నడుందాకా ఎదిగిన చేలు. వాళ్ళు కోతలు సాగిస్తున్నట్టు లేదు. పొడుగ్గానూ, వెడల్పుగానూ నేలమీద పరిచిన పసిడి అంచు చీరని పదిమందీ వరసగా మడుస్తున్నట్టుంది. మేమిద్దరం కొంతసేపు వాళ్ళనట్లానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాం. వాళ్ళ పాదాల మువ్వల చప్పుళ్ళు, చేతులనున్న గాజుల గలగలలు, మధ్యలో ఎవరో ఉండీ ఉండీ ఒక పాటని గాల్లోకి ఎగరెయ్యడం, తక్కినవారు బంతి అందుకున్నట్టుగా ఆ ఎగిరివస్తున్న పాటని తామందరూ అందుకోవడం, ఆ పొలంగట్టుమీద తాటిచెట్లు గాలిపటాలు ఎగరేస్తున్నట్టుగా ఆకాశంలో కదలాడుతున్న తెల్లటిమేఘాలు, పచ్చటిపొలాలమీద పరుచుకుంటున్న వాటి నీడలు, కోసి పక్కన పడేస్తున్న వరికంకుల్ని పనలు కడుతుండగా చుట్టూ ఝుమ్మంటూ రేగుతున్న జోరీగలు, తూనీగలు, గాల్లో ఎగురుతున్న గడ్డిపోగులు, మధ్యమధ్యలో అరుపులు, పురమాయింపులు, నవ్వులు, ఎకసెక్కాలు- బహుశా ఈ రోజు కోసమే రైతులు అన్నినెలలపాటు ఓపిగ్గా ఎదురుచూస్తారన్నమాట అని అనుకున్నాను. హార్వెస్ట్ అనే పదం పూర్తి స్పెల్లింగ్ అప్పుడు నాకు నోటికొచ్చింది.
‘నేను కూడా కొయ్యొచ్చా?’ అనడిగింది వనలత. ఆమె అడుగులు అప్పటికే ముందుకుపడుతూ ఉన్నాయి. రాజు ఆమె చేతికి ఒక కొడవలి ఇచ్చాడు. ఆమె దాన్ని చేతుల్లోకి తీసుకుని ఆ కక్కుల్ని అంచమ్మటే పైపైన వేళ్లతో తాకింది. బహుశా ఒక కొడవలి చేతుల్తో పట్టుకున్నది ఆమె జీవితంలో అదే మొదటిసారి అయి ఉండవచ్చు. ఆమెని చూస్తే నాక్కూడా ఒక కొడవలి చేతుల్లోకి తీసుకోవాలనిపించింది. నేను అడిగేలోపు రాజు నాక్కూడా ఒకటి చేతికందించాడు. మా ముందు రంగులతాడులాగా లయబద్ధంగా ఊయలూగుతున్న ఆ శ్రామికస్త్రీలకి ఒక పక్క చేరబోయాం. కాని వాళ్లు మా ఇద్దర్నీ తమ మధ్యకి రమ్మన్నారు. ఒకామె తను చేస్తున్న పని ఆపి ఆ కొడవళ్లు ఎలా పట్టుకోవాలో, ఎడమచేత్తో వెన్నులు ఎట్లా పిడికిట్లో ఇముడ్చుకోవాలో, కుడిచేత్తో ఆ వెన్నుల్ని ఎట్లా కొయ్యాలో చూపించింది. వనలతా నేనూ ఇద్దరమూ కొంగు నడుం చుట్టూ బిగించాం. ఎవరేనా దూరం నుంచి చూస్తే మేము కూడా ఆ గ్రామీణ స్త్రీలలో ఒకరమే అనుకుంటారనిపించింది. సంతోషంగా అనిపించింది. గర్వంగా కూడా అనిపించింది. చిన్నప్పుడు స్కూలు బాగులూ, ఆ తర్వాత హాండు బాగులూ తగిలించుకుని నలుగురితో కలిసి స్కూలుకో, కాలేజికో, ఆఫీసుకో మాత్రమే వెళ్ళివస్తూండటం అలవాటయిన జీవితానికి మొదటిసారిగా కొడవళ్ళు పట్టుకోవడం కొత్త జన్మ ఎత్తినట్టుగా అనిపించింది.
ఎన్నేళ్ళనుంచో వరిపొలాల్లో నాట్లు వెయ్యడం, పండినపొలాల్లో కోతలు కొయ్యడం అలవాటయినవాళ్లల్లాగా చకచకా ఆ వరిచేల పొడుగునా కోతలుకోస్తూ వెళ్ళిపోతున్నామనీ, అప్పుడంతా ఆశ్చర్యంతో, ఆరాధనతో మమ్మల్నే చూస్తున్నారనీ మదిలో ఒక దృశ్యం లీలగా మెదిలింది. కానీ వనలతా, నేనూ కూడా కంకులు ఎడమచేత్తో పట్టుకోడమైతే పట్టుకున్నాంగానీ తీరా వాటిని కొయ్యాల్సివచ్చేసరికి కొడవళ్లు ఒక పట్టాన సాగలేదు. మా అవస్థ చూసి ఒకరిద్దరు నవ్వుకుంటున్న చప్పుడు వినబడింది కూడా. కాని మాకు ఆ కోతలెలాకొయ్యాలో చెప్పినామె మాత్రం ‘అమ్మగోరూ, అలానే, అలానే, సక్కంగా కోస్తున్నారు, అలానే, అలానే ‘ అంటూ ఉంది.
నాలుగైదు నిమిషాల తర్వాత వాళ్ళు మమ్మల్ని మర్చిపోయారు. తమ పనిలో తాము లీనమైపోయారు. కాని మాకు ఆ పని మధ్యలో వదిలిపెట్టబుద్ధి కాలేదు. ఆ చేలకీ, మాకూ మధ్య ఆ కొన్ని క్షణాల్లోనే అనుబంధం బలపడిపోయింది. ‘అలానే, అలానే ‘, కోసుకుంటూ ముందుకు వెళ్లాం. ముఖం మీద పడుతున్న ముంగురుల్ని వెనక్కి తోసుకుంటూ, చెంపలమ్మటా, మెడచుట్టూ పడుతున్న చెమట మధ్యమధ్యలో తుడుచుకుంటూ, పళ్లు బిగబట్టి, కనీసం గంటసేపేనా కొడవళ్ళు చకచకలాడిస్తూనే ఉన్నాం. తీరా చేస్తున్న పని ఆపి చుట్టూ చూసేసరికి అంతదాకా మాకు అటూ ఇటూ ఉన్న ఆడవాళ్ళంతా అయిదారడుగులు ముందుకు వెళ్ళిపోయారు. మా ఎదట నాలుగైదు అడుగుల వెడల్పున ఇంకా కోతకొయ్యని చేను!
మా సామర్థ్యం చూసుకుని మాకిద్దరికీ నవ్వొచ్చింది. సిగ్గేసింది కూడా.
‘దిస్ ఈజ్ ట్రూలీ యాన్ ఔట్ క్రాప్’ అంది వనలత. ఏదన్నా కొండమధ్యలో శిలాభాగం ముందుకు పొడుచుకు వచ్చినట్టు ఉంటే దాన్ని ‘ఔట్ క్రాప్’ అంటారు జియాలజీలో.
‘యాన్ ఔట్ స్టాండింగ్ ఔట్ క్రాప్’ అన్నాన్నేను, నవ్వుతో. కాని నా నవ్వులో నిస్పృహ ఉంది. పొలాలకు దూరంగా పుట్టిపెరిగిన నా జీవితంలో దేన్ని చూసుకు గర్వించాలో తెలియలేదు నాకు.
అక్కడ మంచె కింద పండుగడ్డి పరిచి ఉంది. వాటిమీద ఖాలీ గోనె సంచులు పరిచిపెట్టారు. రాజు మమ్మల్ని అక్కడకు తీసుకువెళ్ళాడు. అతని ఇంటినుంచి కారియర్ వచ్చింది. ఒకామె ఆ మంచెకింద నీడలో మాకు అరటాకుల్లో అన్నం వడ్డించింది. కోతలు నడుస్తున్న ఆ పంటచేలో, ఆ మంచె కింద ఆ మధ్యాహ్న భోజనం ఒక అనుభవం. అన్నం తిన్నాక అక్కడే కొంతసేపు మేనువాల్చాము. మాగన్నుగా కునుకుపట్టింది. మేము మళ్లా కళ్ళు తెరిచేటప్పటికి కోతలు ఆగిపోయాయి. అప్పటిదాకా కోసి పనలు కట్టిన వరికంకులు తెచ్చి కుప్పపోస్తున్నారు. మేము లేచి ఆ కుప్పలదగ్గరికి వెళ్ళాం. ఆ కుప్పలు నూర్చడానికి కళ్ళం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కుప్పలచుట్టూ బంతిపూలు దండలాగా పరిచారు. అప్పటికే అక్కడికి పాటలు పాడుకుంటూ యాచనచేసుకునే ఒక కుటుంబం వచ్చి నిలబడింది. వాళ్ళల్లో మగాయన చిన్నతంబురాలాంటిది మీటుతో ఏదో పాట పాడుతూ ఉన్నాడు.
‘అచ్చం మా బావుల్ సింగర్స్ లాగా ఉన్నారు’అంది వనలత.
ఆ పంటచేలని వెతుక్కుంటూ ఒక పాట చేరుకునేటప్పటికి ఆ హేమంతం పరిపూర్ణమైదనిపించింది. కోసికుప్పపోసిన ఆ ధాన్యపు కంకుల్ని చూస్తే ప్రకృతి అన్ని నెలలుగా, అన్ని దివారాత్రాలు, ఆ సాఫల్యసంతోషం కోసమే వేచి ఉందా అనిపించింది. బహుశా, రాత్రి కోవెల్లో పవళింపు సేవ ముగిసాక, దేవుడు ఎవరికీ తెలియకుండా పెరటిదోవన ఆ పొలాల్లోకి వచ్చేస్తాడని కూడా అనిపించింది.
‘ఇంక బయల్దేరతాం, ఇంట్లో ఎదురుచూస్తుంటారు’ అన్నాను. ‘అప్పుడేనా’ అంది వనలత. ఆమెని చూడబోతే ఆ రాత్రంతా కూడా అక్కడే గడిపేలా ఉంది. పొద్దు వాలుతున్నవేళ మనుషులు, ఆ వరికుప్పలు, ఆ మంచె, ఆ శ్రామికులు ప్రతి ఒక్కరినీడలూ పొడుగ్గా సాగుతున్నాయి. దూరంగా ఏటి ఒడ్డుమీంచి కొంగలు ఆకాశంలోకి ఒక్కసారిగా లేచాయి.
‘ఆ ఏటి దగ్గరకి తీసుకువెళ్తారా?’ అనడిగింది వనలత రాజుని. రాజు కూడా బహుశా అలాంటిదేదో మేము అడగాలనే ఎదురుచూస్తున్నట్టుగా, ఆ మాటవినగానే, చప్పున, ‘పదండి,మళ్ళా చీకటిపడితే కష్టం’ అని ముందుకు దారితీసాడు.
హేమంతకాలం కావడంతో ఆ ఏటినీళ్ళు చాలా తేటగా ఉన్నాయి. ఆ నీళ్ళ దగ్గర అడుగుపెట్టగానే ముందు ముఖం కడుక్కున్నాం. నరాలు జివ్వుమన్నాయి. నీళ్ళల్లో పాదాలు పెట్టగానే చలికొరికింది. కానీ, ఆ మొదటిక్షణమే. మరీ అంతగా లోతులేని, మోకాళ్ల దాకా కూడా రాని ఆ ఏటిలో వనలత పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. నన్ను కూడా తనతో పాటు గెంతులాడమంది. సందేహంగా నిలబడి చూస్తున్న నా మీద రెండుచేతుల్తోనూ నీళ్ళు రువ్వింది. ఆ నీళ్ల తుంపరమీదపడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టనిపించింది. నేను కూడా చీర మోకాళ్లదాకా పైకిలాగి, కుచ్చిళ్ళు పైకిలాగి బొడ్డులో దోపి ఒక్క ఉదుటున ఆ నీళ్ళల్లోకి గెంతాను. చల్లటినీళ్ళు, ఎక్కడో కొండలమీద మూలికల్ని ఒరుసుకుంటూ ప్రవహించిన నీళ్ళు, రాత్రంతా నక్షత్రకాంతితో తడిసిన మంచుని కడుపారా తాగిన నీళ్ళు తల్లి లేగదూడని దగ్గరకు లాక్కున్నట్టు మమ్మల్ని వాత్స్యల్యంతో అక్కున చేర్చుకున్నాయి. అలా ఎంతసేపు ఆడామో తెలియదు, కేరింతలు కొట్టాం, ఒకరిమీద ఒకరం నీళ్ళు చల్లుకున్నాం. మా ఇద్దరి చీరలూ తడిసిపోవడం కూడా మేము గమనించుకోలేదు. తీరా ఆ ఆటలమధ్యలో ఒకసారి తలతిప్పి పక్కకు చూసేసరికి మమ్మల్నే చూస్తో రాజు! నీళ్ళకు తడిసిన మా దేహాల యవ్వనం ఒక ఆకృతిగా అతడికి మొదటిసారిగా గోచరించినట్టుంది. ఒక మగపిల్లవాణ్ణి చూసి మొదటిసారిగా నాకు సిగ్గుముంచుకొచ్చింది.
వడివడిగా నీళ్ళల్లోంచి బయటికి వచ్చాం. తడిసిన దుస్తుల్తో మా ఇంటికి వెళ్తే మా వాళ్లు నా గురించి ఏమనుకుంటారో అని అప్పుడు తెలివొచ్చింది. అందుకని ముందు వకుళకుటికి బయల్దేరాం.
ఆ రోజు నుంచి సంక్రాంతి పండగ అయిపోయేదాకా మేము ప్రతి రోజూ ఒక పండగలాగా గడిపాం.
క్రిస్మస్ ముందురోజు సాయంకాలమూ, క్రిస్మస్ నాడూ కూడా జోసెఫ్ గారింట్లో పండగ. క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఇల్లంతా రంగుకాగితాల్తో, బెలూన్లతో అలంకరించారు. వాళ్లింటితో పాటు వకుళకుటిని కూడా అందంగా అలంకరించారు. క్రిస్మస్ రాత్రి విందుతో పాటు గ్రేస్ మేడం క్రైస్తవ కీర్తనలు ఆలపించడం మరో విందు.
డిసెంబరు ముప్ఫై ఒకటి రాత్రి జోసెఫ్ గారు కేంప్ ఫైర్ ఏర్పాటు చేసారు. ఆ రాత్రి నేను సూర్యనారాయణగారినీ, వారి శ్రీమతినీ, ఆ పిల్లలిద్దర్నీ కూడా ఆ వేడుకకి తీసుకువెళ్ళాను. ఆ పిల్లలు కేంప్ ఫైర్ చూడటం అదే మొదటిసారి. రాజు తనతో పాటు ఒక గాయకబృందాన్ని పట్టుకొచ్చాడు. వాళ్ళల్లో ఇద్దరుముగ్గురు గిరిజన గాయకులు, ఒకరిద్దరు దళితులు కూడా ఉన్నారు.
కేంప్ ఫైర్ మొదలయ్యేముందు ‘సరిగ్గా ఈ రోజుల్లోనే మా దగ్గర శాంతినికేతన్ లో పౌష్ మేళా జరుగుతుంది. డిసెంబరు నాలుగోవారం అనుకోండి. బావుల్ గీతాలు, కీర్తనలు, కవితాగానం జరుగుతాయి అన్నాడు’ సేన్ గుప్త జోసెఫ్ తో.
బావుల్ కవుల గురించీ, టాగోర్ పైన వాళ్ళ ప్రభావం గురించీ కూడా రెండుమూడు మాటలు స్థూలంగా చెప్పాడు. ఆయన ఈ రోజుల్లో కలకత్తాలో ఉండి ఉంటే శాంతినికేతన్ వెళ్ళి ఉండేవాడు కాడేమోగాని, ఆ అడవిలో, ఆ గిరిజనగాయకుల్ని చూడగానే ఆయన పౌష్ మేళాకి వెళ్లినట్టే ఉత్సాహపడ్డాడు.
అందుకని కేంప్ ఫైర్ మొదలుకాగానే వనలతతో ఏదేనా ఒక బావుల్ గీతం పాడమని అడిగాడు.
వనలత ముఖంలో కూడా ఎక్సైట్ మెంట్ కనిపించింది. ఆమె ఒకటి రెండు ట్యూన్లు హమ్ చేసింది. చివరికి ‘మిలొన్ హోబె కొతొ దినె’ అని ఎత్తుకుంది.
‘ఓహ్! లాలోన్ ఫకీర్! గ్రేట్!’ అన్నాడు ప్రొఫెసరు.
ఎదురుగా నెగడిలో నెమ్మదిగా జ్వాల చిగురించడం మొదలుపెట్టింది. శంఖం లాంటి వనలత కంఠంలోంచి ప్రాచీనసాగరఘోష వినిపిస్తున్నట్టుగా గీతం మొదలయ్యింది.
మిలొన్ హోబె కొతొ దినే
ఓ మిలొన్ హోబె కొతొ దినే
ఆమార్ మోనేర్ మానుషేర్ షానే
అమార్ మోనేర్ మానుషేర్ షానే.
(నామనిషిని కలుసుకునేదెప్పుడు? ఓ! నా ప్రియతముణ్ణి కలుసుకునేదెప్పుడు?)
చాతోకో థాకే ఆహొర్నిషి
ఛే ఆచే కాలోశోషి
అమి హోబో బొలె చొరొణో దాసి
ఓ తా హ్య్ నా కోపాల్ గునే
ఆమార్ మోనేర్ మనుషేరో షానే
(చకోరం రాత్రంతా మేలుకునే ఉంది. కృష్ణపక్ష చంద్రుడు కన్నార్పకుండా చూస్తున్నాడు. నీ చరణదాసిని కావాలని కోరుకుంటున్నాను. నా కోరిక తీరేదెన్నడు? నా మనిషిని కలుసుకునేదెప్పుడు?)
మేఘేర్ బిద్యుత్ మేఘే జామోన్
లుకా లే న పాయ్ అన్వేసోన్
ఆమి కలా రే హరయే జేమోన్
ఓఇ రూప్ హేరి ఎ దర్పనే
ఆమార్ మోనేర్ మనుషేరో షానే
(మబ్బుల్లో మెరుపులాగా అది దాచితే దాగేదికాదు. నా ప్రియుడు దూరమైనప్పుడు నా అంతరంగదర్పణంలో అతణ్ణి కలుసుకోగలను. ఆ నా మనిషిని కలుసుకునేదెన్నడు?)
ఓ రూప్ జోఖోన్ స్మొరణే హోయ్
థాకే న లోకో లొజ్జారో భోయ్
లాలోన్ ఫకీర్ భేభే బోలే సాదై
ఓ ప్రేమ్ సే జె కొరె సె జానె
ఆమార్ మోనేర్ మనుషేరి షానే
(అతడి రూపు నా మనసులో పొడచూపగానే సిగ్గూ, శరం, లజ్జ, భయం సకలం వదిలిపెట్టేస్తాను. లాలోన్ చెప్తున్నాడు, ఆ ఒకే ఒక్కణ్ణి ప్రేమించినవాడు మాత్రమే అలాంటి మాటలు చెప్పగలడు. మరి ఆ నా ప్రియతముణ్ణి కలుసుకునేదెప్పుడు?)
జ్వాల ఇప్పుడు ఒక లతలాగా ఆ చీకటిని పెనవైచుకుంటోంది. నేనంతదాకా విని ఉండని ఏదో ప్రేమజీర వనలత గొంతులో ఆ రాత్రి లీలామాత్రంగా పొడగడుతున్నట్టు తెలుస్తోంది. లేదా ఆ పాట పాడే ప్రతి ఒక్కరికీ ఆ అనుభూతి గొంతులో పలుకుతుందా?
వనలత పాట ముగించగానే అంతా చప్పట్లు కొట్టారు, ఇక ఆ మిగిలిన రాత్రిని ఆ గాయకులు ఆ పూర్తిగా తమ సొంతం చేసుకున్నారు. వాళ్ళు తమతో పాటు ఒక హార్మోనియం పెట్టె, ఒక కంజిర, తబలా, తాళాలు తెచ్చుకున్నారు. ఆ బృందం నాయకుడు తమ్మారావు పౌరాణిక నాటకాల్లో వేషాలువేస్తూ ఉంటాడట. వాళ్ళు పాండవోద్యోగవిజయాలు, హరిశ్చంద్ర లాంటి నాటకాల్లోంచి వాళ్లకి వచ్చిన పద్యాలు పాడారు. రాబోయే శ్రీరామనవమికి వాళ్ళు కాంతామతి అనే ఒక నాటకం వెయ్యబోతున్నారనీ, ఇప్పణ్ణుంచే రిహార్సలు మొదలుపెట్టారనీ రాజు చెప్పాడు. వాళ్ళు ఆ నాటకంలోంచి కూడా కొన్ని పద్యాలు పాడారు, డైలాగులు చెప్పారు.
సేన్ గుప్త ఆ నాటకబృందం మాటల్నీ, పద్యాల్నీ, పాటల్నీ తదేకంగా విన్నాడు. ఆ కేంప్ ఫైర్ ఎర్రని వెలుగులో ఆయన ముఖమ్మీద రాత్రి పూటనే తామరపూలు పూస్తున్నంత సంతోషం కనబడుతూ వచ్చింది.
బాగా పొద్దుపోయేక కేంప్ ఫైర్ ని ముగిస్తున్నట్టుగా జోసెఫ్ గారు ప్రకటించేక అందరూ ఇళ్ళకి బయల్దేరారు. నన్ను ఆ రాత్రికి తమదగ్గరే ఉంచెయ్యమని వనలత మావాళ్ళని అడిగింది. వాళ్లు కూడా ఇంటికి వెళ్లిపోయాక, డిన్నర్ కి కూచున్నాం. మాతో పాటు రాజుని కూడా డిన్నర్ చేసి వెళ్ళమని సేన్ గుప్త ఆహ్వానించేడు.
కృష్ణపక్షపు రాత్రులు కావడంతో నక్షత్రాల వెలుగు తప్ప మరే వెలుతురూ లేదు. కింద ఆరుబయట లాంప్ చుట్టూ వెలుగు తడిసిపోకుండా మంచు తెల్లటి గుడ్డ చుట్టినట్టుగా ఉంది. ఇంటిముంగిల్లోంచి, పక్కన అడవిలోంచి తొలిమామిడిపూత తీపి వాసన తాకుతూ ఉంది. ఆ సుగంధం మధ్య తేనె పరిమళంగా మారినట్టు పనసపూల వాసన.
డిన్నర్ చేస్తున్నంతసేపూ సేన్ గుప్త ఏమీ మాట్లాడలేదు. ఆయన ధ్యాస ఎక్కడో ఉన్నట్టే ఉంది. డిన్నర్ ముగించాక మేము ఆ అరుగు మీద ఒక చాప వేసుకు కూచున్నాము. మామిడిచెట్లమధ్యనుంచి దశమి చంద్రుడు కనిపిస్తున్నాడు. సేన్ గుప్త తన గదిలోకి వెళ్ళిపోకుండా కేన్ మోడా దగ్గరగా లాక్కుని మా పక్కన కూచున్నాడు.
‘మీ డ్రామా ట్రూప్ నన్ను బంగ్లాదేశ్ తీసుకువెళ్ళిపోయారు. ఇందాకటినుంచీ ఒకటే స్ట్రగుల్ అవుతున్నాను, ఇక్కడికి రావడానికి. చాత కావడం లేదు’ అని అన్నాడు రాజుతో.
‘మా బెంగాలో జాత్రా నాటకాలు ఇలానే ఉంటాయి. చైతన్య మహాప్రభు కాలంలో మొదలయ్యాయి అవి. ఆయన కూడా ఆ నాటకాల్లో వేషాలు వేసేవాడట. ఇలానే మైథొలాజికల్ థీమ్స్. ఇలానే పద్యాలు, పాటలు, బిగ్గరగా చెప్పే డైలాగులు, రాత్రంతా నడుస్తాయి. నా చిన్నప్పుడు జాత్రా నాటకాలు ఎక్కడ ఉన్నా మా అన్నయ్య తీసుకుపోయేవాడు. ఒక్కొక్కప్పుడు మా ఇంట్లో మా అమ్మానాన్నా పడుకున్నాక చెప్పకుండా గోడదూకి పరిగెత్తేవాళ్ళం. ఆ పద్యాలు నారాయణ గంజ్ లో పాడుతుంటే రాత్రిపూట ఢాకా దాకా వినిపించేవి’ అని అన్నాడు.
‘జాత్రా గ్రేట్ ట్రెడిషన్. దాన్ని మోడల్ గా తీసుకుని లోక్ నాట్య, అంటే ఫోక్ థియేటర్ బెంగాల్ లో ఎంత విస్తరించిందో తెలుసా? మూర్షిదాబాద్ విలేజెస్ లో ఆడే ఆల్కాప్, జల్పాయిగురి ప్రాంతంలో కనిపించే మాన్ పాంచాలి, కాశ్ పాంచాలి, రంగ్ పాంచాలి, సుందర్ బన్స్ లో బొన్ బీబీర్ పాల, ట్వెంటీ ఫోర్ పరగణాస్ లో పుతుల్ నాచ్- ఎన్నిరకాలు ఫోక్ పామ్స్! వాటిని ఆడేవాళ్ళెవరో తెలుసా? ఇదిగో మీ ట్రైబల్స్ లానే మా సంతాలీలు, రాజవంశీల్లాంటి దళితులు, మార్జినలైజ్డ్ ముస్లిమ్సూనూ. వాళ్ళు బెంగాలీ జాత్రాని ఫోక్ థియేటర్ గానూ, ఫోక్ థియేటర్ ని లోకల్ థియేటర్ గానూ మార్చేసారు. ఎన్ని రాగాలు, ఎన్ని కథలు, ఎన్ని పాటలు- హార్వెస్ట్ టైమ్ లో, వసంతకాలంలో, పంటపొలాల్లో, నదీతీరాల్లో, సంతల్లో, పండగల్లో ఎక్కడ ఆ నాటకాలుంటే అక్కడకు పొయ్యేవాళ్ళం. అదొక మాజికల్ వరల్డ్ ‘ అని కళ్ళు అరమోడ్చాడు.
‘ఎప్పుడేనా జీవితంలో మీకు అవకాశం దొరికితే నార్త్ బెంగాల్ తిరిగి చూడండి. యెట్ లీస్ట్ బీర్ భూమ్ జిల్లా అయినా తిరిగి చూడండి. ప్రజల గుండె చప్పుడు ఎలా ఉంటుందో వినాలంటే కనీసం ఒక్క రంగ్ పాంచాలి నాటకమేనా చూడండి’ అని కూడా అన్నాడు.
‘మా దగ్గర కూడా ఎన్నో ఫోక్ ఫార్మ్స్ ఉన్నాయి’ అన్నాడు రాజు. ‘పౌరాణిక నాటకాలు, బుర్రకథలు, హరికథలు, జక్కుల భాగోతాలు, తోలుబొమ్మలాటలు..’ అంటో అతను ఇంకా చెప్పబోతుండగా, సేన్ గుప్త అతడికి అడ్డుతగిలి-
‘ఐ నో, ఇండియాలో ప్రతి ఒక్క చోట ఎన్నో కళారూపాలున్నాయి. రకరకాల కళారూపాలు ఉన్నాయి. కాని జాత్రా కి ఒక ప్రత్యేకత ఉంది. లెట్ మీ ఎక్స్ ప్లెయిన్ దట్. జాత్రా అంటే యాత్ర. థియేటర్ యాజ్ ఎ జర్నీ, యాజ్ ఏ పిలిగ్రిమేజ్. మీదగ్గర అటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఉందా?’ అనడిగాడు.
రాజు ఆలోచించాడు. ‘మా దగ్గర కూడా డ్రామా ట్రూపులు ఊరూరా తిరుగుతారు. సురభి డ్రామా కంపెనీలు, కూచిపూడి భాగవతులు దేశమంతా తిరుగుతూనే ఉంటారు’ అన్నాడు.
‘యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. నేను దాని మెటఫరికల్ మీనింగ్‌లో అడుగుతున్నాను. తారాశంకర్ బెనర్జీ రాసిన కొబి గుర్తుంది కదా నీకు ఒరుణిమా’ అనడిగాడు వనలతని.
‘ఇదే నేను ఎప్పుడూ చెప్పేది. సైన్సు, ఆర్ట్, లిటరేచర్ ఏదైనా గానీ నిన్నొక పిలిగ్రిమ్ గా మార్చకపోతే దానికి అర్థం లేదు. చదువెందుకంటే బాగా ఆస్తిపాస్తులు సంపాదించి, జీవితంలో చక్కగా సెటిల్ అవడంకోసం ఆనుకుంటారంతా. కాదు, చదువు నిన్ను ప్రవహించే నదిగా మార్చాలి, నడిచే చెట్టుగా మార్చాలి. యు షుడ్ అల్టిమేట్లీ బికమ్ ఎ మూవింగ్ మెలొడీ, నాట్ ఎ హేంగింగ్ స్టార్. ఆర్ట్ ఈజ్ యాన్ యాంటీ- అక్యుములేషన్ మూవ్ మెంట్. నా చిన్నప్పుడు ఆ జాత్రా బృందాల్ని చూస్తుంటే నాకు రెక్కలొచ్చినట్టుండేది. వాళ్ళల్లాగా నాక్కూడా, ఒక ఇంటికో, ఊరుకో అతుక్కుని ఉండిపోకుండా, ఒక సంచారిని కావాలని ఉండేది. ఒక లోకసంచారిగా. ఒక లోక్ నాట్యసంచారిగా దేశమంతా తిరగాలని ఉండేది. బహుశా నేనొక సేన్ గుప్తగా కాక ఒక రాజ్ వంశీ గా, ఒక సంతాల్ గా పుట్టి ఉంటే వాళ్ళల్లో కలిసిపోయి ఉండేవాణ్ణేమో’ అని అన్నాడు.
ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు. అంతా ఆలోచనలో పడిపోయాం. బహుశా ఆ మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించగలిగే వయసుకూడా కాదేమో అప్పుడు.
తనకి నిద్రవస్తోందంటూ సేన్ గుప్త తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెళ్లిపోతూ, ఏదో గుర్తొచ్చినవాడిలా వెనక్కి తిరిగి ‘విష్ యు ఆల్ ఏ హేపీ న్యూ యియర్’ అన్నాడు.
మేము కూడా ఆయనకి హేపీ న్యూ యియర్ చెప్పాం. మాలో మేము కూడా ఒకరికొకరం హేపీ న్యూ యియర్ చెప్పుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడంలో ఉండే సరదా అప్పుడప్పుడే తెలుస్తున్న చిన్న పిల్లల్లాగా చెప్పుకున్నాం. ఒకరికొకరం కరచాలనం కూడా చేసుకున్నాం.
తను కూడా సెలవుతీసుకుంటానని రాజు అరుగు మీంచి కిందకి దిగాడు. అతడికి వీడ్కోలు చెప్పడానికి మేము కూడా కిందకి దిగి గేటుదాకా వెళ్ళాం. మూడవజాము రాత్రి కూడా గడిచిపోతూ ఉందని ఆకాశం గుర్తు చేస్తున్నది. అప్పటికే చంద్రుడు తేనెరంగు తిరుగుతున్నాడు.
12-4-2023
చదువు నిన్ను ప్రవహించే
నదిగా మార్చాలి
చదువు నిన్ను నడిచే ఒక
తరువుగ మార్చాలి
తత్పర్యవసానంగా తప్పక
నువ్వొక కదిలే
మధురమైన నాదంలా
మున్ముందుకు సాగాలి
మా ఊరు, మానేరు జలాశయం ముంపుకు గురి కాకముందు, మాకు మానేటి ఒడ్డునే కాల్వ పొలం మూడెకరాల ఉండేది. ఊళ్లో గడిపిన పదహారేళ్లూ వ్యవసాయం పనులంటే బాగా ఇష్టం గనక బాపుతో పాటు పొలాల వెంబడి తిరిగిన అనేక సందర్భాలు, రాత్రి పూట కల్లం దగ్గర చుక్కల పందిరి కింద, గడ్డి పరుపుల్లో గొంగడి మడతల్లో దూరి, పాలేర్లతో బాపు పెట్టే ముచ్చట్లు వింటూ నిద్రలోకి జారిపోవడం మన సు బ్యాంకు లాకర్లో భద్రంగా దాచిన ఆ బంగారు దృశ్యాలను మళ్లొకసారి చూసుకొని మురిసి పోయాను. ఎన్నో నదులు చూసాను. కానీ నా చిన్న తనంలో మానేటి ఇసుక పరుపుల మీద దొరలే స్ఫటిక సాదృశ జలధారల స్వచ్ఛత ఎక్కడా చూడలేదు.
తిరిగి చూడ లేని ఎవరికి చూపించ లేని మనోజ్ఞ దృశ్యాలు అనుభవాలు ఇలా అక్షరయవనిక పై చూస్తుంటే,ఆ అనుభూతి అనుభవైకవేద్యమనటం కన్నా ఏం చెప్పను?
హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ వెన్నెలరాత్రుల గుండె చప్పుడు ప్రొఫెసర్ సేన్ గుప్తా….
Thank you
“కాని నా నవ్వులో నిస్పృహ ఉంది. పొలాలకు దూరంగా పుట్టిపెరిగిన నా జీవితంలో దేన్ని చూసుకు గర్వించాలో తెలియలేదు నాకు.”
రైతుల పట్ల వీరభద్రులు చూపుతున్న కృతజ్ఞత కాదా ఇది!!!?
ఏ ప్రభుత్వం…ఏ ప్రజ… ఏ పారిశ్రామికవేత్త….ఏ దళారీ….ఏ దుకాణాదారు….
ఎన్నడైనా ఒక్కనాడు ఇలా రైతుల పని సంస్కృతి పట్ల…?!
“పొలాలకు దూరంగా పుట్టిపెరిగిన నా జీవితంలో దేన్ని చూసుకు గర్వించాలో తెలియలేదు నాకు.”
మీ ఆత్మ ప్రబోధం అనుక్షణం ఆచరణీయం….మా అందరికీ!
అనేక ధన్యవాదాలు
“”సైన్సు, ఆర్ట్, లిటరేచర్ ఏదైనా గానీ నిన్నొక పిలిగ్రిమ్ గా మార్చకపోతే దానికి అర్థం లేదు—-చదువు నిన్ను ప్రవహించే నదిగా మార్చాలి, నడిచే చెట్టుగా మార్చాలి. యు షుడ్ అల్టిమేట్లీ బికమ్ ఎ మూవింగ్ మెలొడీ, నాట్ ఎ హేంగింగ్ స్టార్. ఆర్ట్ ఈజ్ యాన్ యాంటీ- అక్యుములేషన్ మూవ్ మెంట్.—-“
Thank you once again.
చదువు నిన్ను ప్రవహించే నదిగా మార్చాలి, నడిచే చెట్టుగా మార్చాలి. యు షుడ్ అల్టిమేట్లీ బికమ్ ఎ మూవింగ్ మెలొడీ, నాట్ ఎ హేంగింగ్ స్టార్💕💕💕💕💕💕
ధన్యవాదాలు