ఆ వెన్నెల రాత్రులు-8

Reading Time: 7 minutes

Image design: Mallika Pulagurtha

హేమంత ఋతువు మొదలవుతూనే రెల్లు పూయడం ఆగిపోయింది. ఏటి ఒడ్డునా దొరువుల దగ్గరా, మరీ లోతట్టుగా ఉన్న వరిచేల పక్కనా నిన్నటిదాకా గుంపులు గుంపులుగా వాలిన తెల్లనెమళ్ళు ఎగిరిపోయినట్టు రెల్లు అదృశ్యమైపోయింది. ఒకరోజు మేము అడవినుంచి తిరిగివస్తూండగా దూరంగా కనిపిస్తున్న రెల్లు పొదలు చూపించి ‘జీవన్ బాబుకి ఎంతో ఇష్టమైన కాశ పుష్పాలు కనుమరుగైపోయాయి, ఇంక పొయెట్రీ కనిపించదు’ అన్నాడు ప్రొఫెసరు. కానీ వారం రోజులు తిరక్కుండానే ‘ఎక్కడ చూసినా కవిత్వమే. ఈ అద్భుతమైన ఋతువుని నేనిక్కడ చూస్తానని అనుకోలేదు’ అన్నాడు.

ఆ హేమంతాన్ని మేము గుండెనిండా ఆఘ్రాణించామని చెప్పాలి. అసలు హేమంత ఋతువుని చూడాలంటే పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ, తోటల్లోనూ కాదు, అడవీ, పల్లె అల్లుకునే చోట చూడాలి. ఒకవైపు అడవి తనను తాను పండించుకుంటూ ఉంటుంది. అది ఒక పరిణత దశ. ఆ తర్వాత తనని తాను పూర్తిగా రిక్తం చేసుకున్నాక కానీ వసంతం రాదు. మరొక వైపు పుడమి తనను తాను పూర్తిగా ప్రకటించుకుంటూ ఉంటుంది. అన్నేళ్ళుగా తాను స్వీకరించిన సూర్యరశ్మిని, చంద్రకాంతిని పంటలు పండించి వెనక్కి ఇస్తుంది. ఇప్పుడు నీకు ఆ రోజుల గురించిన జ్ఞాపకాల్ని ఒక్కమాటలో చెప్పు అనడిగే, పక్వానికొస్తున్న పంటపొలాలమీద రాలే మంచుసుగంధం అని చెప్తాను.

వేసవిరోజుల్లో వట్టివేళ్ల తడికల్ని మాటిమాటికీ నీళ్లతో తడుపుటూ ఉంటే మట్టివాసనలాంటి ఒక శీతలసుగంధం మన చుట్టూ అల్లుకుంటుంది చూడు, అట్లాంటి సుగంధమే అక్కడ ప్రతి రోజూ అనుభవానికొచ్చేది. నేలమీద పరిచిన వట్టివేళ్ళ తడకల్లాంటి ఆ పైరుపచ్చల్ని రాత్రంతా మంచు తడిపిన సువాసన.

మనం ఒకప్పుడు గడిపిన రోజుల్ని చాలా కాలం తర్వాత జ్ఞాపకం చేసుకోబోతే మన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలనో, హృదయాన్ని తీవ్రంగా ఉద్రేకించినవో, గాయపరిచినవో అలాంటివేవో అనుభవాల్ని గుర్తుతెచ్చుకుంటాం. కాని నిజానికి మన జీవితంలో ఆ రోజులు పూర్తిగా ఇంకేది అట్లాంటి నాటకీయక్షణాల్లో కాదు. మామూలు రోజులు, మామూలు ఉదయాలు, చిన్న చిన్న రోజువారీ రుటీన్ అలవాట్లు, ఎలాంటి హడావిడీ లేని కలయికలు, చిన్న చిన్న దగ్గరి దగ్గరి ప్రయాణాలు- ఆ రోజుల్ని ఆ రోజులుగా మార్చేవి ఇవే. ఆ కాలమంతా ఒక వర్ణచిత్రం అనుకుంటే ఈ చిన్న చిన్న బ్రష్ స్ట్రోక్స్ తోటే ఆ రంగుల బొమ్మ పూర్తయ్యేది.

ఇన్నాళ్ళ తరువాత ఆ హేమంతకాలాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటే నాకొక రంగుల చీర నేసుకుంటున్నట్టుగా ఉంది. ఒకసారి చీరాలలో ఒక నేతపనివారి ఇంట్లో ఒక చీర నేస్తున్న దృశ్యం చూసాను. ఆ మగ్గం, ఆ నేతపనిమనిషి, ఆ ఇంటిగోడలు- అదంతా ఒక గ్రేయిష్ బాక్ గ్రౌండ్. బహుశా, కొంత గ్లూమీ బాక్ గ్రౌండ్ కూడానేమో. కానీ ఆ మగ్గం మీద అల్లుకుంటున్న ఆ నేతచీరలో ఎన్ని రంగులు, ఎన్ని మోటిఫ్స్, ఎంత ఇంద్రజాలం! ఆ రంగులు ఎక్కడున్నాయి? ఆ నేతపనిమనిషి హృదయం ఎంత వర్ణభరితం కాకపోతే ఆ వస్త్రం అంత వర్ణసుశోభితం కాగలుగుతుంది!

ఆలోచిస్తున్నాను, ఆ హేమంతమాసాల రంగులు నాలో ఉన్నాయా, ఆ అడవినుంచి ఒలికి పొలాల్లోకి ప్రవహించాయా, లేక ఆ పొలాల్లో వికసించి నాలోకి ప్రసరించాయా?

ఒకరోజు ప్రొఫెసరు అన్నాడు: నేను పొయెట్రీ అదృశ్యమైపోయిందనుకున్నాను. కాదు, పొయెట్ తో పాటు ఇప్పుడు ఇక్కడికి పెయింటరు కూడా వచ్చాడు. బాగా పండి బంగారు వన్నె తిరుగుతున్న ఆ పొలాల్ని చూస్తుంటే రామ్ కింకర్ బైజ్ అనే చిత్రకారుడి చిత్రలేఖనాలు గుర్తొస్తున్నాయి అని చెప్పాడు. రామ్ కింకర్ శాంతినికేతన్ లో పనిచేసాడట. అడవుల్నీ, పైర్లనీ, పల్లెల్నీ చిత్రించడానికి రామ్ కింకర్ ఆకృతులకోసం వెతుక్కోడనీ, రెండు మూడు రంగుల్ని అలవోకగా పూత పూస్తాడనీ, ఆ రంగుల పూత మీద అటూ ఇటూ నాలుగైదు గీతాలు గీసి విడిచిపెడతాడనీ చెప్పాడు. అది నిజంగానే గొప్ప దర్శనం. ఒక విధంగా చెప్పాలంటే విహ్వల దర్శనం కూడా. మరేం చేయాలో తెలియక నాలుగు గీతలు గీయడమేమో కూడా. లేకపోతే ఆ రంగుల విభ్రమాన్ని ఎలా వర్ణించగలుగుతాం?

నాక్కూడా ఒకటి రెండు రంగు పూతల్తోనూ, నాలుగైదు గీతల్తోనూ ఆ హేమంతసౌందర్యాన్ని మళ్ళా నా కళ్ళముందుకు తెచ్చుకోవాలని ఉంది. కాని నేను రామ్‌కికర్ లాగా సిద్ధ హస్తురాల్ని కాను. ఆ చిత్రకారుడికున్నంత ఆత్మనిర్భరత నాకుందనుకోను. కాబట్టి ఒక కుంచె తీసుకుని చిన్న చిన్న చిరుపూతలతోనే వర్ణవిలేపనం మొదలుపెడతాను.

ఎక్కణ్ణుంచి మొదలుపెట్టను? ముందు ఆ అపరాహ్ణాల్లో ఆ పొలాల మీద పరుచుకునే మేఘాల నీడలు కనిపిస్తున్నాయి. ఆ నీడలు మరికొంచెం సేపు తమనట్లా కావిలించుకోవాలని మత్తుగా మూలుగుతుండే ఆ పొలాలే నా కళ్ళముందు మెదుల్తున్నాయి. ఒక తెల్లటి గుడ్డతీసుకుని శరత్కాలం శుభ్రంగా తుడిచిపెట్టిన ఆకాశం మీద కదిలే మేఘాల్ని నువ్వు చూడాల్సింది వాటి వెలుగులో కాదు, నీడల్లో. మధ్యాహ్నం పొద్దు వాటారుతూ సాయంసంధ్యగా మారే వేళల్లో కొండలమీదా, సుదూర దిగంతందాకా పరుచుకున్న పంటపొలాల మీదా మేఘాల నీడల్ని చూడటం ఒక అనుభవం. ఎవరన్నా నీకు అంత దగ్గరగా జరగాలంటే నువ్వు కూడా అంత పరిపక్వమై ఉండాలన్నమాట.

ఒక్కొక్క ఋతువు మనకి చేరువకావడానికి ఒక్కొక్క ఇంద్రియాన్ని ఎంచుకుంటుందనుకుంటాను. హేమంతానిది ఘ్రాణేంద్రియం. వసంతానిది శ్రవణేంద్రియం. ఏమో, నేను సరిగ్గా చెప్పలేకపోతూండవచ్చు. వర్షాకాలానిది శ్రవణేంద్రియం కాదా? ఆ వసంత మాసపు రోజుల్లో అడవి అంతా అల్లుకున్న ఆ తీపిపూల సుగంధం ఘ్రాణేంద్రియానిది కాదా? కాని ఎందుకో, ఇప్పుడు ఈ క్షణాన మాత్రం హేమంతం అంటే సుగంధం అనే గుర్తొస్తూ ఉంది నాకు. మార్గశిర మాసంలో ఆరోజు మేము అడవి నుంచి వెనక్కి వచ్చేటప్పటికి బాగా పొద్దుపోయింది. చీకటి పడుతూ ఉంది. మేము కొండ బాటమ్మట, మడేరు దాటి, మట్టిబాట వెంబడి ఊళ్ళోకి మలుపు తిరిగే చోట, నేనెన్నడూ పీల్చి ఉండని మధురమైన సువాసన ఒకటి నన్ను వెనక్కి లాగినట్టుగా గుంజింది. ‘అదేమి ఫ్రాగ్రెన్స్?’ అని వనలత కూడా అడిగింది.

‘వెలగపండ్ల వాసన’ అన్నాడు రాంబాబు, స్టీరింగ్ మీంచి తలకూడా పక్కకు తిప్పకుండా. ఎన్నేళ్ళుగానో, ఆ వేళల్లో, ఆ వెలగపండ్ల పిలుపు ఎన్నో సార్లు విని విని అలవాటయిపోయినవాడిలాగా.

‘వుడ్ యాపిల్! ఒక్కసారి ఆ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళవా?’ అనడిగింది వనలత చాక్లెట్ కోసం మారాం చేసే చిన్నపిల్లలా.

‘చీకటి పడుతోంది కదమ్మా’ అన్నాడు దేవయ్య.

‘ఒక్కసారి! ఓన్లీ వన్ మినిట్ ప్లీజ్’ అంది వనలత.

రాంబాబు బండి బాక్ చేసాడు. ఆ చెట్టు మరీ దూరంలో లేదు. అంతా కిందకి దిగాం.  సాయం సంధ్యా గగనం మీద మిగిలిన రెండు మూడు మేఘాల్ని అంటుకున్న నారింజరంగు వెలుతురు మసగ్గా మాకు దారి చూపించింది. ఆ చెట్టు కిందకి పోయి చూద్దుం కదా, విరగ్గాసిన ఆ చెట్టుమీదనే పండి, మూడు నాలుగు, వెలగపండ్లు కింద రాలి ఉన్నాయి. మరికొన్ని ఇంకా చెట్టుమీదనే పండుతూనే ఉన్నాయి.

‘ఇంకో నెలరోజులు పోతే ఇక్కడంతా తాండ్ర అచ్చులు పోసినట్టు ఉంటుంది’ అన్నాడు రాంబాబు.

కింద రాలిపడ్డ ఆ పండ్ల కేసి చూసాను. పగిలి నెర్రెలు విచ్చిన ఆ పండ్లలోంచి తీపిదనం పొంగిప్రవహిస్తోంది. రాగిరంగు తీపిచారికలు ఆ చెట్టుకింద అల్లిబిల్లిగా అల్లుకుపోయాయి. చీమలు బారులు కట్టి ఆ దారులవెంట సంతోషపు బిడార్లు నడుపుతున్నాయి. ఆ పండ్ల పైన అడవిదోమలు తలుపు దగ్గర నిలబడ్డ గాయకబృందాల్లాగా తంత్రీవాద్యాలు మీటుతున్నాయి. శ్రోతల్తో పనిలేని సంగీతసమారోహం అది. అక్కడకు మాలాంటి ఒక మానవబృందం చేరుకోగలదని ఆ చెట్టు ఊహించినట్టులేదు. ఊహించిఉంటే ఆ సుగంధాన్ని మరింత దాచుకునేదో లేక మరింతగా వర్షించేదో నేను చెప్పలేను. 

అక్కడ మేము ఆ సుగంధాన్ని ఆఘ్రాణించినంత ఆఘ్రాణించి తక్కింది గాలికీ, గంధర్వులకీ వదిలిపెట్టి జీపు ఎక్కాం. కొంతసేపు గడిచాక దేవయ్య ‘ముందు ఆ వాసన తగలగానే వెలగ పండ్ల వాసన అనుకోలేదు. ఇక్కడేదో పాము తిరుగుతోంది అనుకున్నాను’ అన్నాడు.

‘అదేమిటి?’ అని అడిగాడు ప్రొఫెసరు.

‘ఎక్కడేనా ఇంత ఘాటుగా పండ్ల వాసన సోకితే అక్కడొక తాచుపామో, జెర్రిగొడ్డో తిరుగుతూ ఉంటుందంటారు మా ఊళ్ళో’ అన్నాడు దేవయ్య.

నేను ఇంటికి తిరిగి వచ్చాక కూడా ఆ పండ్లవాసనతో పాటు ఆ మాటలు కూడా నన్ను వదల్లేదు. ఆ రెండింటినీ కలిపి ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. కాని ఇన్నేళ్ళు గడిచాక ఇప్పుడు గ్రహిస్తున్నాను, జీవితం ఫలవంతమయ్యే ప్రతి తావు పక్కనా గాఢమైన కోరిక ఒకటి పూర్తి సంతృప్తితోనో, పూర్తి అసంతృప్తితోనో పాములాగా పాకుతూనే ఉంటుందని. లేదా మరోలా కూడా అనుకోవచ్చు. ఆ సర్పం నీ పక్కనే పొంచి ఉండి నీకొక పరిపక్వతాభ్రాంతి కలిగిస్తూ ఉంటుందని కూడా. ఏదోను ఉద్యానంలో ఆది స్త్రీపురుషుల మధ్య సాతాను ఒక సర్పంలాగా ప్రవేశించినప్పుడు, ‘ఎనిమి ఇన్ వెయిట్’ లాగా ఉన్నాడు అనలేదా కవి! బహుశా పూర్వకాలపు గ్రామీణులకి ఈ రహస్యం బాగా తెలుసనుకుంటాను.

బాగా పాలుపోసుకున్న పొట్టల్తో విప్పారిన పొలాల మీద ఎక్కడెక్కడినుంచో పిట్టలు వచ్చివాలినట్టు, ఆ హేమంత ఋతువుని తలుచుకుంటేనే ఎన్నెన్ని జ్ఞాపకాల్లో నా చుట్టూ మూగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆ రాత్రి.

డిసెంబరు మొదటివారమో, రెండో వారమో గుర్తులేదు. ఆ ఆదివారం మాకు ఫీల్డ్ వర్క్ లేదు. మధ్యాహ్నం వకుళకుటిలోనే నా లంచ్ కూడా. కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కి కూచున్నప్పుడు ప్రొఫెసరు తన ప్లేట్లో వడ్డించిన చేపల పులుసు చూసి ఆశ్చర్యపోయాడు.

‘ఎక్కడిది ఈ ఫిష్?’ అని అడిగాడు, అప్పటికే ఉండబట్టలేక, ఒక ముక్క తుంపి నోట్లో వేసుకుంటూ.

‘రాజు గారి అబ్బాయి తీసుకువచ్చాడు’ అంది కొండమ్మగారు.

ఏ రాజు గారి అబ్బాయి అని అడగబోయి, రాజు అయి ఉండవచ్చు అని స్ఫురించి, ‘ఎప్పుడొచ్చాడు రాజు’ అని అడిగాను ఆమెని.

‘రాజునా? ఎక్కడున్నాడు? నేను రమ్మంటున్నానని కబురుపెట్టండి’ అన్నాడు ప్రొఫెసరు. ఆయన నిజంగానే ఆ పిల్లవాడితో ప్రేమలో పడిపోయినట్టే ఉన్నాడు.

ఆ కబురు ఎంత తొందరగా చేరిందోగాని, మేము టీ తాగే వేళకి రాజు అక్కడికి ఎగిరి వాలాడు. ఈసారి అతణ్ణి చూస్తే వనలత కళ్ళల్లో కూడా ఒక మెరుపు కనబడింది.

‘థాంక్యూ వెరీ మచ్. మేమిక్కడికి వచ్చాక ఫిష్ సంగతే మర్చిపోయాం. ఎలా తట్టింది మీకు  మాకీ గిఫ్ట్ ఇవ్వాలని?’ అనడిగింది ఆమె.

‘ఎప్పుడొచ్చారు’ అని కూడా అడిగింది.

‘నిన్ననే వచ్చాను. రాత్రి పంట కాపలాకి వెళ్ళాను. పొద్దున్నే ఇంటికొస్తుంటే అప్పుడే ఎవరో ఏటిదగ్గర గాలాలు పట్టుక్కూచున్నారు. నేను కూడా వాళ్ల దగ్గర గంటసేపు కూచుని దొరికినవి దొరికినట్టుగా మూటగట్టి మీకు పంపాను’ అన్నాడు.

‘థాంక్స్ ఎ టన్’ అన్నాడు ప్రొఫెసరు.

వనలత చేపల సంగతి మర్చిపోయి పంట కాపలా అన్న మాట పట్టుకుంది.

‘పంటలు కాపలా కాయడమంటే రాత్రంతా మేలుకుని ఉంటారా?’ అనడిగింది. ఎక్కడ కూచుంటారు? ఎక్కడ పడుకుంటారు? వైల్డ్ యామిమల్స్ వచ్చి మీద పడితే ఏమి చేస్తారు- లాంటి ప్రశ్నల పరంపర కురిపించింది. ఒక ఇలస్ట్రేటెడ్ జంగిల్ బుక్ తెచ్చి చూపిస్తే పేజీలు తిప్పుతూనే ప్రశ్నలడిగే పిల్లలాగా.

రాజు ఆమె ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా జవాబులిస్తూ ఉన్నాడు. ఎండ వేడితగ్గి పలచని పసుపు రంగులోకి తిరిగింది. పక్కనున్న అడవిలోంచి రెడ్ వెంటెడ్ బుల్బుల్ ఇందాకటినుంచీ ఒకటే పాటలు పాడుతూ ఉంది. మధ్యాహ్నం వేళల్లో వకుళకుటి దగ్గర కూచున్నప్పుడల్లా రెడ్ వెంటెడ్ బుల్బులో లేకపోతే రెడ్ విష్కర్డ్ బుల్బులో పాటలు పాడుతూనే ఉంటాయి. అవి పాటలు పాడుతున్నంతసేపూ అడవి అడవిగా మారిపోతూ ఉంటుంది.

పంటచేలో రాత్రి కాపలా సంగతి అలా ఉంచి, అసలు పండిన పంటచేలల్లో నిదానంగా నాలుగడుగులు కూడా నేనెప్పుడూ నడించింది లేదు. రాజూ, వనలతా మాట్లాడుకుంటూ ఉంటే, నాక్కూడా వెన్నువాలుతున్న వరిపైర్లమీంచి వీచే పండుగాలులు వంటిని తాకుతున్నట్టు అనిపించింది.

‘కాకూ, షల్ వుయ్ స్పెండ్ దిస్ నైట్ ఇన్ ద ఫీల్డ్స్?’ అనడిగింది ప్రొఫెసర్ని. ఆయన్ని చూద్దును కదా, అప్పటికే ఆయనకి రెండు భుజాలకీ వెనకవైపు రెక్కలు విప్పారుతూ ఉన్నాయి.

అందుకు ఏర్పాట్లు చేయడానికి ముందే చెప్పాలనీ, అందుకని ఆ మర్నాడు వెళ్దామనీ అన్నాడు రాజు. మర్నాడు అడవినుంచి తొందరగా వచ్చేసి మరీ చీకటిపడకుండా పొలాలకు వెళ్దామనీ, కాని ఒక రాత్రంతా గడపడం కష్టమవుతుందనీ, కొంతసేపు అక్కడ గడిపి వచ్చేద్దామనీ అన్నాడు.

నేను మర్నాడు పిన్నిగారికి అదంతా చెప్పి, రాత్రి రావడం ఆలస్యమవుతుంది కాబట్టి వకుళకుటిలోనే పడుకుంటానని చెప్పాను. పిల్లలు పెద్దమ్మాయీ, చిన్నమ్మాయీ కూడా వస్తామన్నారుగానీ, ఆ రాత్రి ఎలా ఉంటుందో నాకే తెలియదు, మరోసారి తీసుకువెళ్తానని చెప్పాను.

ఆ సాయంకాలం మేము టీతాగినవెంటనే పొలాలకి బయల్దేరాం. ఆ ఊళ్ళో చెరువుకీ, బావికీ మధ్యలో అల్లిబిల్లిగా అల్లుకున్న డొంక దారిన లోపలకి కొంతదూరం నడిచాక, మట్టిబాట దిగి పొలం గట్లమ్మట నడిచి మరీలోపలకి వెళ్ళాక ఎదురయ్యాయి రాజూవాళ్ల పొలాలు. వరిచేలు. దూరంగా చెరకుతోట. చేలకి దిగువగా, మరీ దగ్గరా, మరీ దూరంకాని చోట ఏరు మలుపు తిరుగుతూ ఉన్నచోటు. ఆ వొంపుదగ్గర పెద్ద తెల్లమద్ది చెట్టు.

అక్కడ ఏ అలికిడీ లేదు, వరికంకులు ఆకాశంతో మొదలుపెట్టిన మాటలు తప్ప. ఆ పొలాల మధ్య అక్కడక్కడా మంచెలు. రాజు మమ్మల్ని తమపొలంలో కట్టిన మంచె దగ్గరకు తీసుకువెళ్లాడు. మనుషుల అలికిడి మోసుకుంటూ గాలి తొందరతొందరగా ఏ వార్త చేరవేసిందోగాని, ఏటి ఒడ్డుమీంచి కొంగలు ఒక్కసారిగా పైకి లేచాయి. దూదిపింజల్లాగా పైన సాగుతున్న మేఘాలనుంచి తునిగిపోతూ గాల్లో తేలుతున్న దూదిపోగుల్లాగా కొంగలు.

‘ఓహ్! బలాకలు’అన్నాడు సేన్ గుప్త.

‘దే లుక్ లైక్ పేజెస్ ఫ్రమ్ గీతాంజలి !’ అని కేరింతలు కొట్టాడు.

‘ఆ మంచె ఎక్కుదామా?’ అనడిగింది వనలత.

తాను కూడా ఆ మంచె ఎక్కితే కూలిపోక తప్పదనీ, ఆ ఆలోచన వదిలిపెట్టమన్నాడు ప్రొఫెసరు. కానీ తననైనా ఎక్కనివ్వమని వేడుకుంది. కానీ కింద ప్రొఫెసర్ని ఒక్కరినీ వదిలి ఆమెతో పాటు ఆ మంచె ఎక్కాలనిపించలేదు నాకు. రాజు సాయం చేస్తూ ఉంటే ఆమె నెమ్మదిగా ఆ మంచె పైకి ఎక్కింది.

‘ఓహ్! స్పెక్టాక్యులర్!’ అంటో అరిచింది పైకి ఎక్కాక.

ఆమె కళ్ళతోనే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఊహించుకునే ప్రయత్నం చేసాను. ఆమె అరుపు విని దూరంగా ఉన్న పొలాల్లోంచి కూడా మంచెల మీంచి అరుపులు వినవచ్చాయి. చెరువులో రాయి వేస్తే బుడగలు తేలినట్టుగా ఆ పొలాలమీద ఆ అరుపులు గెంతుకుంటూ తేలిపోయాయి.

నేనూ, ప్రొఫెసరూ అక్కడ పొలం గట్టుమీద కూచున్నాం. రాజూ, వనలతా మంచెమీదనే కూచుని మాటాడుకుంటూ ఉన్నారు. ప్రొఫెసరు ఉన్నట్టుండి నిశ్శబ్దంలోకి జారిపోయాడు. ఆయనకి ఆ క్షణాన బంగ్లాదేశ్ పంటపొలాలు గుర్తు వస్తూ ఉండవచ్చు. లేదా చివరి రెల్లుపూలు రాలిపోయాక ఆ లాండ్ స్కేప్ వదిలి పెట్టి వెళ్ళిపోయాడనుకున్న జీవన్ బాబు మళ్ళీ తిరిగివస్తూ కనిపించి ఉండవచ్చు. నేను ఆయన మౌనాన్ని భగ్నం చెయ్యాలనుకోలేదు. నిజానికి నేను అటువంటి ఒక తావుకు చేరుకోవాలనే ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాననీ, ఎట్టకేలకు ఆ తావుకి చేరుకున్నాననీ అప్పుడే తెలుసుకున్నాను. నువ్వు చేరుకోవలసిన తావుకి చేరుకున్నట్లు తెలియడానికి గుర్తు అదే: మాటలు ముగిసిపోయి, మౌనం మొదలుకావడం.

కొంతసేపటికి ఎలాగైతేనేం వనలత ఆ మంచె దిగింది.

‘ఏముంది ఆ పైన?’ అనడిగాడు ప్రొఫెసరు.

‘అక్కడా! ఎవరో వదిలిపెట్టి వెళ్ళిన పాటలున్నాయి’ అంది వనలత. అలాకాక మరోలా ఏమి చెప్పగలదు? అప్పటికే ఆమె వంటిమీదా, వస్త్రాల మీదా మేఘాలనుంచి రాలిన ఆరెంజ్ డస్ట్.

‘గ్లాడ్ టు నో దట్’ అన్నాడు ప్రొఫెసరు తలూపుతూ. కాని వనలత ఆయన మాటలు ఇంకా ఆమె చెవుల్ని చేరకుండానే

‘ఆజ్ ధానెరి ఖేతే రోద్రో ఛాయా-‘

అని గీతం అందుకుంది. ఆ మాటలు వింటూనే సేన్ గుప్త చలించిపోయాడు. ‘ఒరుణిమా, ఒరుణిమా’ అని ప్రేమగా మూలిగాడు.

వనలత పాట కొనసాగించింది.

అజ్ ధానెరి ఖేతే రోద్రో ఛాయా

లూకొచూరి ఖేలా రే భాయ్, లూకొచూరి ఖేలా

నీల్ ఆకాశే కే భాషాలే సాదా మేఘిర్ భేలా రే భాయ్

లూకొచూరి ఖేలా

(పంటపొలాల్లో ఎండా, నీడా దాగుడుమూతలాడుతున్నాయి, ఎవరు నీలాకాశంలో మేఘాల తెల్లతెరచాపలెత్తారు? )

ఆజ్ భ్రోమొర్ భోలే మోధు ఖేతే

ఊడే బేడాయ్ ఆలోయ్ మేతే

(తుమ్మెదలు ఈ రోజు తేనెకోసం పరుగులుపెట్టడం మాని, ఆ  కాంతిలో ఊరికే గెంతుతున్నాయి)

ఆజ్ కీషర్ తారే నొదిర్ చారే చోకచోకిర్ మేలా

ఒరె జాబోనా ఆజ్ ఘోరే రె భాయ్ జాబొ న ఆజ్ ఘోరే

(ప్రేమపక్షులెందుకు ఈ రోజు నది ఒడ్డుకి చేరుకున్నారు? ఈ రోజు ఇంట్లో గడిపే రోజు కాదు కనుకనా)

ఒరె, ఆకాశ్  భేంగే బాహిర్కే ఆజ్ నేబోరె లుట్ కొరే

జెనొ జోవార్ జాలె ఫేనార్ రాశి బతాసి ఆజ్ చూట్ చె హాసీ

ఆజ్ బీన్ కాజే బాజియే బన్సి కాట్బె సకొల్ బేలా

(ఈ రోజంతా మనం ఆకాశంలోకి రెక్కలు చాపి ఆరుబయలుని కొల్లగొట్టుకుందాం. కెరటాలమీద నురుగులాగా, గాల్లో తేలివచ్చే నవ్వుల్లాగా ఈ రోజంతా మనం సోమరిగా గడుపుదాం, పిల్లంగోవి ఊదుకుందాం)

ఆమె పాడుతుండగా ఆమె కురులమీంచీ, కపోలాల మీంచీ వెన్నెల చిందటం మొదలుపెట్టింది. సేన్ గుప్త ఆమె భుజం చుట్టూ ఆప్యాయంగా చెయ్యివేసాడు.

‘ఒరుణిమా, గురుదేవ్ మనకోసమే ఈ పాట రాసాడు కదూ. యు మేడ్ మై డే’ అన్నాడు.

‘మాక్కూడా’ అన్నాడు రాజు. అతడి కళ్ళల్లో వాళ్ళ సంతోషం ప్రతిఫలిస్తూ ఉంది.

‘ఏం రాజూ? మీరెప్పుడొచ్చినా చంద్రుణ్ణి వెట్టబెట్టుకొస్తున్నారు? ఏమిటి మీ ఇద్దరి మధ్యా రిలేషన్’ అన్నాన్నేను.

‘అలాగా? మీరే నన్ను చంద్రుడికి పరిచయం చేస్తున్నారనుకుంటున్నానే’ అన్నాడు రాజు.

అలా మేము ఎంత సేపు కూర్చున్నామో మాకే తెలియదు. ఇన్నేళ్ల తర్వాత ఆ వెన్నెల సంజ గుర్తొస్తుంటే అపారమైన నీలాకాశం కింద ఆడుకుంటున్న పిల్లలు నా కళ్ళ ముందు మెదులుతున్నారు. అన్ని చింతలూ, చికాకులూ పక్కనపెట్టి దాగుడుమూతలు ఆడుకుంటున్న పిల్లలు. ఏం చేస్తే ఇప్పుడు నేను మళ్లా ఆ పిల్లల ప్రపంచంలోకి పోగలుగుతాను?

8-4-2023

22 Replies to “ఆ వెన్నెల రాత్రులు-8”

 1. వాళ్ళతో పాటుగా ఆ ఊళ్ళో ఆ పొలాలమీద తిరిగినట్లుగా వుంది. ఎవరో వదిలిపెట్టిన ఆ పాటల్ని విన్నట్లుంది. 🙏🏽
  కాకపోతే నేను చేరుకోవలసిన ఆ తావేదో తెలియకుండా వుంది. 😊

 2. “ఏం చేస్తే ఇప్పుడు నేను మళ్లా ఆ పిల్లల ప్రపంచంలోకి పోగలుగుతాను?”

  తన్వీర్ నక్వీ రాసిన, మొహిందర్ సింఘ్ సర్నా సంగీతం చేసిన, 1956 లో వచ్చిన షిరీన్ ఫర్హాద్ సినిమాలో లతా గొంతులో తేనెలూరిన పాట… విందామా, సర్!

  Gujra hua jmaana ata nahin dobaara
  Haafij khuda tumhaara

  Khushiyaan thi chaar din ki, ansu hain umrabhar ke
  Tanahiyon men aksar royenge yaad kar ke
  Wo wakt jo ke hamane ek saath hai gujaara

  Meri kasam hai mujhako tum bewafa na kahana
  Majabur thi mohabbat sabakuchh pada hai sahana
  Tuta hai zindagi ka ab akhari sahaara

  Mere lie sahar bhi ai hai raat banakar
  Nikaala mera janaaja meri baraat banakar
  Achchha hua jo tumane dekha na ye najaara

  ఎంత అనుగ్రహం!

 3. ఒక విస్తృత పాఠకుడు, ప్రకృతి ప్రేమికుడు, సంగీత ప్రియుడు, చిత్రలేఖకుడు, పరిశోధకుడు,భూభౌతిక , జీవ విజ్ఞాన శాస్త్రవేత్త, ప్రేమ మూలాలెరిగిన వ్యక్తి , ఋతురాగాలు తెలిసిన మనిషి, అన్నిటికీ మించి ఉత్తమ లక్ష్యాల వైపు నడిచే మనిషి రాసిన కథను ఎన్ని సార్లు చదివితే అన్ని కొత్త దర్శనాలు అవుతాయి.
  అంబర చుంబి శిరస్సరఝ్ఝరీ పటలాల వంటి కథలు చదివి ఇప్పుడు మందాకిని వంటి కథ చదువుతుంటే ఎంత హాయిగా ఉందో.The story is an album of abundant paintings of rural nature.

  1. బమ్మెర పోతన పుట్టిన గడ్డ నుంచి ఇటువంటి అభినందనలు పొందడం కన్నా జీవితానికి కావలసిందేముంటుంది?

 4. ఇప్పుడిక ఈ కథ ఏ తీరాలకు చేరుతుందనే ఆలోచన పూర్తిగా పోయింది. ఇది ఇట్లా సాగుతుంటే చాలు.

 5. జీవితంలోని ప్రతి క్షణాన్నీ,ప్రకృతిలోని ప్రతి అణువునీ,ప్రతి పరిణామాన్నీ ఇంతటి రసహృదయంతో,భావుకతతో దర్శించటం….🙏🙏🙏 సర్!
  చిత్రకారుడి విభ్రమ వ్యక్తీకరణ గురించిన మీ మాటలు మా హృదయాల్లోకి రంగుల్ని విభ్రమంగా విరజిమ్మాయి సర్!

 6. జీవితంలోని ప్రతి క్షణాన్నీ,ప్రకృతిలోని ప్రతి అణువునీ,ప్రతి పరిణామాన్నీ ఇంత రసాత్మకంగా,భావుకతతో ఆవిష్కరింపజేయటం 🙏🙏🙏సర్!
  చిత్రకారుడి విభ్రమ వ్యక్తీకరణలా…మీ ఈ దీర్ఘకవితా పఠన సంభ్రమానికి మేము కూడా అక్షరాలని . ..కానీ నైపుణ్యంకూడా వుండాలిగా!

 7. పాఠకులకు మీరు ప్రస్తావిస్తూన్న సమయం ఏమాత్రం లెక్కలోకి రావట్లేదు సర్..
  వాక్యాల వెంట ప్రయాణం మాత్రమే తెలుస్తూ అంతర్లోచన..ఊహా లోచనలు దాటి ముందుకు వెళ్లడం అవుతోంది.. ..🙏

 8. హేమంతము కృషిక జన సీమంతం, హిమకణాభిషేచిత లతికా సీమంతం దరహాసిత చామంతము.. అంటూ తెలుగు పల్లెలను తడిమిన హేమంతాన్ని వర్ణించిన రాయప్రోలు వారు గుర్తుకు వచ్చారు.
  ఋతు రాగాలతో ప్రకృతి లో అణువణువు ఎలా పులకరిస్తుందో.. ఆ ప్రకృతి పులకరింతలను పరిశీలించి.. మనసు ఎలా పురి విప్పి నాట్యం చేస్తుందో.. అనుభూతి కలిగించారు. ధన్యవాదాలు.

 9. నేతగాని హృదయంలో అందం చూసిన మీ మనసు ….నమస్సులు మీకు

 10. తనని తాను పూర్తిగా రిక్తం చేసుకున్నాక కానీ వసంతం రాదు, తాత్వికత పండిన మాట

 11. “”జీవితం ఫలవంతమయ్యే ప్రతి తావు పక్కనా గాఢమైన కోరిక ఒకటి పూర్తి సంతృప్తితోనో, పూర్తి అసంతృప్తితోనో పాములాగా పాకుతూనే ఉంటుంది  . మరోలా  అనుకోవచ్చు. ,,,ఆ సర్పం నీ పక్కనే పొంచి ఉండి నీకొక పరిపక్వతాభ్రాంతి కలిగిస్తూ ఉంటుందని కూడా. 
  —-నువ్వు చేరుకోవలసిన తావుకి చేరుకున్నట్లు తెలియడానికి గుర్తు అదే: మాటలు ముగిసిపోయి, మౌనం మొదలుకావడం.–“

Leave a Reply

%d bloggers like this: