
Image design: Mallika Pulagurtha
మన జ్ఞాపకాలకీ, కలలకీ మధ్య మరో సామ్యం కూడా ఉంది. కలల్లాగే జ్ఞాపకాల్లో కూడా మనుషులకీ, స్థల, కాలాలకీ రూపురేఖలు మారిపోతాయి. కలల్లోలాగే ఎవరో, ఎక్కడో కలుసుకున్నవాళ్ళు నీ ఇంట్లోనో, ఆఫీసు కారిడారులోనో ప్రత్యక్షమయినట్టే, నువ్వు కూడా ఎక్కడో మునిగి ఎక్కడో తేలతావు. ఎవరో మరెవరి షర్టో ధరిస్తారు. ఎవరో మరెవరి భావాలో ప్రకటిస్తారు. ఏదో జానపదకథలోలాగా ఒకరి దేహానికి మరొకరి శిరస్సు అతుక్కుపోతుంది. విడదియ్యాలని ప్రయత్నిస్తావుకాని, ఆ ప్రయత్నంలోనే అప్పట్లో నీకు అర్థంకాని విషయమేదో ఇప్పుడు కొత్త సత్యంగా స్ఫురిస్తుంది.
ప్రొఫెసర్ని అడిగితే కలలకి కూడా ఒక జియాలజీ ఉందంటాడేమో.
జియాలజీ ఆఫ్ డ్రీమ్స్.
సముద్రాల మీద ఏళ్ళ తరబడి ఉపరితలాల్లో పెరిగిన జీవజాలం, ప్లాంక్టాన్, మరణించినప్పుడు, నెమ్మదిగా కిందకి దిగి సముద్రగర్భంలోకి చేరుకుని గట్టిపడి స్లేట్ లాగా మారుతుందనీ, ఏళ్ళ తరబడి ఆ స్లేట్స్, అప్పటికే ఉన్న సముద్రగర్భంలోని రాళ్ళమీద పలకలు పలకలుగా పేరుకుంటాయనీ, టెక్టానిక్ ప్లేట్స్ కదిలినప్పుడు ఈ పలకలు ఆ కదలికల్ని వేగవంతం చేస్తాయనీ చెప్పాడొకరోజు. బహుశా ఇప్పుడు డ్రీమ్స్ ది కూడా అదే ప్రాసెస్ అంటాడేమో.
ఏం? ఎందుకు కాకూడదు? నీ రోజువారీ అనుభవాలూ, ఆ ఇన్సిగ్నిఫికెంట్, మైన్యూట్ గెస్చర్స్ అవన్నీ గాల్లో కలిసిపోతాయా? లేదు. రోజూ నీకు దొరికే చిన్నచిన్న సంతోషాలు, నువ్వు మింగాల్సి వచ్చే చిన్నవో పెద్దవో అవమానాలు, పైకి నెత్తురు కారకపోయినా లోపలకీ గాటుపడే గాయాలు- ఎక్కడికి పోతాయవన్నీ? డెడ్ ప్లాంక్టాన్ లాగా అవి నెమ్మదిగా నీ అంతరంగంలోకి దిగుతాయి. అప్పటికే అక్కడ కుతకుతా ఉడుకుతున్న అంతరంగ గర్భం ఉంటుంది. ఇవి పోయి దాని మీద పలకలు పలకలుగా పేరుకుంటాయి. ఇంతలో ఏదో ఒక అనుభవం ఒక టెక్టానిక్ ప్లేట్ కదిలినట్టుగా నీలోపల నిన్ను కుదిపేస్తుంది. మహాసముద్ర ఫలకమూ, భూగర్భఫలకమూ ఒకదాన్నొకటి రాచుకోవడం మొదలుపెడతాయి. అప్పుడు నీ అంతరంగంలో ఏ ప్రకంపనలు కలుగుతాయోగాని, అవి మళ్ళా నీ బయటి జీవితాన్ని కుదిపెయ్యడం మొదలుపెడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషి ఒక మెటామార్ఫోస్డ్ డ్రీమ్.
లేదా యానిమలైజ్డ్ డ్రీమ్.
నవంబరు నెలలో ఒక సాయంకాలం. నేను ఇంట్లో కూచుని ఆ రెండు మూడు రోజులుగా సేకరించిన ఆకులూ, కాయలూ సాంపిల్స్ ఆల్బంలో అతికిస్తూ ఉన్నాను. చిన్నమ్మాయి నా పక్కనే కూచుని ఒక్కొక్కటీ శ్రద్ధగా అందిస్తూ ఉంది. నేను అంటిస్తున్నవాటిని పేరుపేరుగా అడుగుతూ ఉంటే వివరిస్తూ ఉన్నాను. ఇంతలో పెద్దమ్మాయి లోపలకి వచ్చి ‘అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు’ అంది
‘అన్నయ్య ఎవరు?’
ఆ ఆల్బం, ఆ కాగితాలు చిన్నమ్మాయిని చూస్తూ ఉండమని చెప్పి సందేహంగానే బయటికి వచ్చాను. అక్కడ కంచె దగ్గర తలుపుకి బయట, గుమ్మంలో అడుగుపెట్టకుండా నిల్చున్నాడు.
రాజు!
అక్కడిదాకా వెళ్లాలా వద్దా, అతణ్ణి పలకరించాలా వద్దా అన్న తటపటాయింపుతోనే ఆ కంచె వైపు అడుగులేసాను.
‘బాగున్నారా? ఎలా జరుగుతోంది మీ ప్రాజెక్టు?’ అనడిగాడు.
మనిషి ఎక్కడికో బయల్దేరినవాడల్లే ఉన్నాడు. భుజాన బాగు, ఇస్త్రీ చేసిన షర్టు. తలకి నూనె రాసినట్టు లేదు, గాలికి ఊగుతున్న జుత్తు. ఎప్పట్లానే ఆ షార్ప్ లుక్స్.
ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడేమిటి ఇలా చెప్పాపెట్టకుండా అనుకున్నాను. ఆ మధ్య ఒకరోజు సాయంకాలం ప్రొఫెసరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయనే హటాత్తుగా అడిగాడు.
‘వేర్ ఈజ్ దట్ బాయ్?’ అని.
నాకు వెంటనే తట్టలేదు. ఎవరని అడిగాను. ఆ రోజు సాయంకాలం ఏటిదగ్గర మా సంభాషణ గుర్తు చేసాడు ప్రొఫెసరు. అప్పుడు గుర్తొచ్చాడు రాజు.
‘ఏమో. నాకు కూడా కనబడలేదు. కాలేజికి వెళ్లిపోయాడేమో’ అన్నాను.
‘లేదు. అతను ఆ రోజే కాలేజినుంచి వచ్చానని చెప్పాడు కదా’ అన్నాడు ప్రొఫెసరు. మెర్క్యురియల్ మెమొరి.
అవును కదా అనుకున్నాను. ఆ వెంటనే ఆ సాయంకాలం మా పిన్ని గారు అతణ్ణి పిచ్చాడు అన్నమాట కూడా గుర్తొచ్చింది.
‘మా పిన్ని గారు అతనో వైల్డ్ ఫెలో అని అన్నారు’ అన్నాను. మెంటల్ అనే పదం ఎందుకో నాకే నచ్చలేదు.
‘వ్హైల్డ్?’ కళ్ళు పెద్దవిచేసి మరీ అడిగాడు ప్రొఫెసర్. డబ్ల్యూ తర్వాత హెచ్ కూడా చేరుస్తూ. మామూలుగానే పలచగా ఉండే ఆయన కనుబొమలు ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు మరీ పలచగా సాగిపోయాయి.
‘ఇఫ్ హి ఈజ్ కాల్డ్ వైల్డ్, దెన్ వన్ మస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ ఎట్ ఒన్స్’ అన్నాడు ప్రొఫెసరు.
నాకు అర్థం కాలేదు.
అతణ్ణి ప్రేమించాలా? ఆ వైల్డ్ ఫెలోని. ఎందుకని?
వనలత అప్పుడే జుట్టు చిక్కు తీసుకుంటూ వచ్చి కూచుంది. మేం ఏమాట్లాడుకుంటున్నామో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉంది.
‘ఈజ్ వైల్డ్ నెస్ ఎ వర్చ్యూ?’ అనడిగాను ప్రొఫెసరుని.
ప్రొఫెసరు తల అడ్డంగా ఊపాడు. అది నా ప్రశ్నకి అవుననడమో కాదనడమో అర్థం కాలేదు.
‘అతని వయసు ఏ మాత్రం ఉండవచ్చు?’ అనడిగాడు ప్రొఫెసరు. తనే మళ్ళా ‘మస్ట్ బి హార్డ్లీ నైంటీన్ ఆర్ ట్వెంటీ. అవునా? ఆ వయసులో నవయువకులు వైల్డ్ గాకాక మరోలా ఎలా ఉంటారు? ఒకప్పుడు మన ఫ్రీడమ్ మూమెంట్ ని లీడ్ చేసింది ఎవరో తెలుసా? వాళ్ళంతా టీనేజర్స్. ఖుదీరాం బోస్ పేరు విన్నావా? బ్రిటిష్ రాజ్ మీద మొదటి బాంబు విసిరిన పిల్లవాడు. అప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? ఒన్లీ నైంటీన్. మన సమాజానికి ఉడుకు రక్తాన్ని ఎలా గౌరవించుకోవాలో తెలీదు’ అన్నాడు.
‘కాని వివేకానంద అన్నారు కదా, వాట్ వుయ్ వాంట్ ఈజ్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ నెర్వ్స్ ఆఫ్ స్టీల్’ అంది వనలత.
‘దట్ ఈజ్ ద ప్రోబ్లెం’ అన్నాడు ప్రొఫెసరు. ‘స్వామీజీ కుడ్ హావ్ యాడెడ్ బర్నింగ్ హార్ట్స్ ఆల్సో. ఎందుకంటే ద గ్రేటెస్ట్ అసెట్ ఆఫ్ స్వామీజీ వజ్ హిజ్ బర్నింగ్ హార్ట్. ఆయన అందరికీ అటువంటి బర్నింగ్ హార్ట్ ఉంటుందనుకున్నాడు. కానీ ‘మెన్ విత్ మజిల్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ నెర్వ్స్’, బట్ వితౌట్ ఏ బర్నింగ్ హార్ట్- తొందరలోనే మెషిన్స్ గా మారిపోతారు. మన స్కూల్సూ, కాలేజెస్ లో జరుగుతున్నదిదే. అయినా కూడా ఇంకా ఒక యువకుడు, వైల్డ్ గా ఉండగలుగుతున్నాడంటే, హౌ కెన్ ఐ నాట్ అఫర్డ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్?’
మళ్ళా రెండో సారి లవ్ అన్న మాట వాడాడు.
ఇప్పుడు నా ఎదురుగా నిలబడ్డ ఈ పిల్లవాణ్ణి చూస్తుంటే, ‘లవ్’, ‘లవ్’ అనే రెండు మాటలు రెండు పక్షుల్లాగా అతని చుట్టూ గిరికీలు కొడుతున్నట్టుంది.
నాకు నవ్వొచ్చింది.
‘స్మైల్ చేస్తున్నారుగాని, జవాబివ్వడం లేదు’ అన్నాడతను.
ఇంతలో హటాత్తుగా గుర్తొచ్చింది. పిన్నిగారు ఈ దృశ్యం చూస్తే? నాకు చాలా అనీజీగా అనిపించింది. ఎవరో వెనక నిలబడ్డట్టుగా వెనక్కి తిరిగి చూసాను.
మై గాడ్! సరిగ్గా అప్పుడే మా పిన్నిగారు ఇంట్లోంచి ఆ వాకిట్లోకి అడుగుపెడుతూ ఉన్నారు.
నాకు చాలా సిగ్గుగా అనిపించింది. చాలా గిల్టీగా కూడా అనిపించింది. అప్పుడు అతణ్ణి అక్కణ్ణుంచి వెళ్ళిపొమ్మనేదా? అది మరింత అసహ్యంగా ఉంటుంది. లోపలకు రమ్మనేదా? అది నా ఇల్లు కాదు, నాకు ఆ అధికారం లేదు. పోనీ నేను అక్కణ్ణుంచి తప్పుకునేదా? అది లేనిపోని అనుమానం కలిగిస్తుంది. నాకు ఏమి చెయ్యాలో తెలీక, సతమతమవుతున్న, ఆ క్షణంలోనే-
‘పిన్నిగారూ! బావున్నారా!’ అనడిగాడు రాజు.
అన్ ప్రిడిక్టబుల్ ఫెలో.
ఆమె అసలే సౌమ్యురాలు. అతనలా పలకరించేటప్పటికి కంగారు పడిపోయింది.
‘బావున్నాను బాబూ, నువ్వు కూడా బావున్నావు కదా. ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు? అమ్మగారు బాగున్నారు కదా’ అని, అలాంటివే ఒకటి రెండు కుశలప్రశ్నలు అడిగి ‘అక్కడే నించున్నావేం, లోపలకి రా బాబూ’ అంది.
‘లేదండీ, ఇప్పుడు కాకినాడ వెళ్ళిపోతున్నాను. లాస్ట్ బస్ కి ‘ అన్నాడు.
ఇన్ కారిజబుల్ ఫెలో.
లాస్ట్ బస్ వచ్చేటప్పటికి ఏడున్నరా ఎనిమిదవుతుంది. ఇప్పుడింకా ఆరు కూడా కాలేదు. అర్థమయింది, నాతో మాట్లాడటంకోసమే, అతను అంత తొందరగా అక్కడికొచ్చేడని.
కాని పిన్ని గారు మరింకేమీ సంభాషణ పొడిగించకుండా అక్కణ్ణుంచి వెళ్ళిపోయేరు. నేను బతికి బయటపడ్డాననుకున్నాను.
‘మిమ్మల్ని ప్రొఫెసరు తలుచుకున్నారు ఒకసారి’ అన్నాను అతనితో.
‘అవునా!’ అన్నాడు అతను. అతనిముఖంలో సంతోషం చూసింది. ‘ఆయన చాలా పెద్ద మనిషి. గొప్పవాడు. ఆ రోజు ఆయన గురించి తెలిసాక ఆయనంటే ఏదో తెలియని ఇష్టం కూడా కలిగింది’ అని అన్నాడు, ఇంగ్లిషులో.
‘ఏమి ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు! నేను తెలుగమ్మాయినే’ అన్నాను.
అతను నవ్వేసాడు.
‘మీరంతా చాలా ఇంటెలిజెంట్. మా కాలేజిలో లెక్చెరర్లు మీముందు ఎందుకూ పనికి రారు. మీతో ఇంగ్లిషులోనే మాట్లాడాలి’ అన్నాడు, కాని ఈ సారి తెలుగులో.
‘అంత వద్దులెండి. కాని మీరు చెప్పిన మాటలు ప్రొఫెసరు గారికి సరిపోతాయి. ఆయన జీనియస్. ఆయనతో కలిసి నడుస్తుంటే కూడా యూనివర్సిటీలో ఉన్నట్టే ఉంటుంది’ అన్నాను.
‘జీనియస్. నిజమే. కాని అంతకన్నా కూడా ఆయన చాలా కైండ్ హార్టెడ్ అనిపించాడు నాకు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ కళ్ళు చూసారా! ఆ కళ్ళు కూడా మనతో మాటాడుతూ ఉంటాయి’ అని అన్నాడు.
నవ్వేసాను.
ఎందుకు నవ్వుతున్నారు?
‘ఏమీ లేదు. ఇక్కడికి వచ్చేక రాళ్లు మాట్లాడతాయని తెలిసింది, మొక్కల్తో మాట్లాడాలని తెలిసింది. ఇప్పుడు కళ్ళు కూడా మాట్లాడతాయని తెలుస్తోంది. ఇంకా ముందు ముందు ఇంకేమి మాట్లాడతాయో అని!’
‘హాస్యానికి అనడం లేదు. ఏవైనా మాట్లాడవచ్చు. ఏం? ఎందుకు మాటాడకూడదు? మనం వినాలేగానీ. ఇదిగో ఇప్పుడు ఈ చంద్రుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. మీకు వినబడటం లేదా?’ అని దూరంగా ఆకాశంలో వ్యాపిస్తున్న వెన్నెల వైపు చూపించాడు.
అటు వైపు చూసాను.
ఆ ఇంటిముందు వీథి లోపలకీ వెళ్ళి కొండరెడ్ల ఇళ్ళమధ్యనుంచి అడవిలోకి అదృశ్యమైపోయే మలుపు లోంచి చంద్రుడు కొండమీదకు ఎక్కుతున్నాడనుకుంటాను. చెట్టపట్టాలు వేసుకుని యుగాలుగా ఆ కొండలు నిలుచున్నచోట, చంద్రుడు రాకముందే ఆ అడవులమీంచి సముద్రపు హోరులాగా వెన్నెల వినిపిస్తోంది. తూర్పు దిక్కున ఏదో పండగ మొదలైనట్టు, బృందాలు, బృందాలుగా మంగళవాద్యాల ఊరేగింపు మొదలైనట్టు, వేల పిచికారీలతో చందనద్రవాన్ని విరజిమ్ముతున్నట్టు వెన్నెల. నాకు కనిపిస్తున్నంతమేరా ఆకాశమంతా వెన్నెల పొగ. చెట్ల చిటారుకొమ్మల మీద, ఇళ్ళ కప్పులమీద, మా వీథిలో మా ఇంటిపక్క ఉన్న చింతచెట్టుమీద, ఇంటి ఎదురుగా ఉన్న రామకోవెల కప్పుమీద, నా ఎదట ఉన్న యువకుడి జుత్తుమీద, నా చీరమీద ఎక్కడ చూడు వెన్నెల దుమ్ము. నా భుజం మీద ఏదో చందనచూర్ణం రాలుతున్నదేమో అన్న భ్రాంతిలో దాన్ని దులుపుకోడానికి అప్రయత్నంగా నా వేళ్ళతో నా భుజం తడుముకున్నాను.
ఏళ్ళ తరబడి గడ్డకట్టిన మంచు కరిగినప్పుడు కూడా ఇంత నునువెచ్చదనం భూమ్మీద ప్రవహించదేమో అనిపించింది. ఆ వీథిలో పిల్లలు ఆడుకుంటున్న అరుపులు, రోడ్డుమీద మనుషులు మాట్లాడుకుంటున్న మాటలు ఆ వెన్నెల వడిలో ముద్దలుముద్దలుగా కరిగిపోతున్నాయి. ఇంతదాకా అనుభవానికి రాని లేతతెమ్మెర ఒకటి నా ఒళ్లంతా చుట్టబెడుతూ అడవిలోకి సాగిపోయింది.
మరుక్షణంలో నేను అక్కడున్న ప్రతి ఒక్క అస్తిత్వాన్నీ మర్చిపోయాను. నా ఎదట ఉన్న ఆ కుర్రవాడు నా కళ్ళముందు అదృశ్యమైపోయాడు. ఇప్పుడు నా చూపులన్నీ ఆ కొండమీద దిగిన అతిథి మీదనే ఉన్నాయి. చంద్రుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో నా జీవితంలో నేనెప్పుడూ చూడలేదు. ఒక చంద్రోదయం ఒక ప్రపంచం మీద ఇంత మంత్రజాలం చెయ్యగలదని నాకెప్పుడూ తట్టలేదు. ఆ క్షణాన నేనేమి చూసాను? నాకేమి జరిగింది? చెప్పలేను. కాని ఆ రోజు నేను దేవగంగాస్నానం చేసాను. అంతకు ముందు ఎన్నడూ నేను అంత నిర్మలమైన జలాల్లో నిలువెల్లా మునిగిందిలేదు, ఆ తర్వాత, ఇప్పటిదాకా, కూడా లేదు.
ఆ రాత్రి నేను వెన్నెల సుగంధాన్ని కూడా గుండెలోతుకీ ఆఘ్రాణించాను. చందనం అనే పదం వాడుతున్నానుగాని అది మరొక పదం దొరకనందువల్ల మాత్రమే. వెన్నెల తావిని మనం మనకు తెలిసిన మరొక సువాసన దేంతోనూ పోల్చలేం. నిజానికి అది ఘ్రాణేంద్రియానికి సంబంధించిన అనుభవం కాదు. కాని వెన్నెల ముందు మనలో మన మానవపూర్వ అస్తిత్వాన్ని దేన్నో జ్ఞప్తికి తెస్తుంది కాబట్టి, దాన్ని మనం ప్రథమ క్షణాల్లో వాసనచూసినట్టే గుర్తుపడతాం కాబట్టి, చందనం, సుగంధం లాంటి పదాలు వాడడం. కాని ఆ రాత్రి నాకు అనుభవానికి వచ్చినదాన్ని వివరించడానికి నేను నేర్చుకున్న తెలుగు, చదువుకున్న తెలుగు సరిపోవు. ఆ అనుభవం నాలో కలిగించిన ఉద్రేకాన్నీ, ఉపశమనాన్నీ మాటల్లో పెట్టాలంటే, సముద్రాల భాష కావాలి, సుగంధ ఓషధుల భాష కావాలి, సరీసృపాల భాష కావాలి. అవును, సరీసృపాలే. ఎందుకంటే, అక్కడ నిలబడ్డంతసేపూ, నా చర్మం ఆ వెన్నెల్ని అవిశ్రాంతంగా ఆస్వాదిస్తూనే ఉంది. సరీసృపాలు తమకి అందుతున్న రుచిని వాసనగా మార్చుకున్నట్టు, నా చర్మానికి అందుతున్న ఒక మధుస్పర్శని నేను చందనచర్చగా గుర్తుపడుతూ ఉన్నాను.
ఆ తర్వాత ఎన్నో సార్లు ఆ సాయంకాలం గుర్తొచ్చినప్పుడల్లా- ఆ ఊరు, ఆ గడ్డికప్పు ఇల్లు, ఆ కంచె, ఆ కంచె మీద పాకిన కాకరతీగె పూలు, అప్పుడు, ‘చూడండి, ఆ చంద్రుడు కూడా మాట్లాడుతున్నాడు, మీకు వినబడుతోందా’ అన్న మాటలు, ఆ తర్వాత, ఆ తర్వాత ఏముంది?
చందన చూర్ణం, చందన సుగంధం, చందన స్నానం.
నేననుకుంటాను, ఆ వెన్నెల్లో ఆ ఊరు, అప్పటిదాకా నేను ఆ ఫ్రొఫెసరుగారి బృందంలో ఒకతెగా తిరుగుతూ ఆ రాళ్ళతోటీ, ఆ మొక్కలతోటీ చేసిన సంభాషణలు, అపారమైన ఆ గ్రామాకాశం, అవిరళమైన ఆ తేజోనిశ్శబ్దం- అవన్నీ నాతో లేకపోయి ఉంటే, ఆ చంద్రోదయం నాకు అలా అనుభవానికి వచ్చి ఉండేదికాదేమో అని.
ఆ తర్వాత జీవితంలో ఎన్నో సార్లు మళ్ళా ఆ ఊరు వెళ్ళాలనీ, కాలండరులో కార్తిక పున్నమి ఎప్పుడొస్తుందో చూసుకుని మరీ వెళ్ళాలనీ అనిపించేదిగాని, ఉహుఁ, ఆ సంధ్యాసౌరభం నా మీంచి మరొకసారి వీస్తుందని నేను నమ్మలేకపోయాను.
ఆ తరువాత ఒకటి రెండు సార్లు ఆ అనుభవాన్ని విశ్లేషించుకుందామని చూసాను. అది సాధ్యం కాలేదు సరికదా, అనవసరం కూడా అనిపించింది. ఎందుకంటే ప్రొఫెసరు చెప్పినట్టు నాలో ఉన్న కొండా, కోనా, రాయీ, రప్పా, అన్నీ కలిసి ఆ వెన్నెలకి ప్రతిస్పందించాయని అనుకోవాలి. బహుశా చెట్ల మీద కాయలు వెన్నెల్ని పీల్చుకుని పండటం మొదలుపెట్టినట్టు, పొలాల్లో వరికంకులు వెన్నెల్ని రసంగా వడగట్టుకున్నట్టు నేను కూడా ఆ వెన్నెల్ని నాలోకి ఒంపుకున్నానని గ్రహించాను. ఒక జీవితకాలానికి అటువంటి ఒక రాత్రి చాలు.
ఆ రాత్రి ఆ పిల్లవాడు బస్సు వచ్చేదాకా అక్కడే నిలబడి ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను కూడా అక్కడే నిలబడిపోయాను. నేను మాట్లాడిందేమీ లేదు. వింటూనే ఉన్నాను. ఏమి విన్నాను?
చంద్రుడి మాటలు, చెట్ల గుసగుస, వెన్నెల నిశ్శబ్దం.
7-4-2023
దేవగంగాస్నానం, వెన్నెలని తనలోకి ఒంపుకోవడం, వెన్నెల సుగంధాన్ని గుండెలోతుకీ ఆఘ్రాణించడం!! వాహ్! నిజంగా ఇలాంటి అనుభవాలుంటాయా?
మీరనుభవిస్తేనే కదా ఇలా రాయగలిగారు!!
Super sir!! 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!💐
ఎన్నాళ్ళకు….ఇలాంటి మంచి రసాత్మకైన అనుభవాన్ని పొందుతూ ఉన్నాను..
సౌందర్యం ఏదైనా ఎంత గొప్పది.
లో లోపలకు చూడాలని అనుకోకూడదు…ఏమో?
అస్తిపంజరం/కంకాళాలు అగుపిస్తాయి..ఏమో…అస్తిత్వ వాదాలు…రసదృష్టిని మరుగు పరచాయని అనుకోవచ్చా? తెలుపగలరు.
“ఒక జీవితకాలానికి అటువంటి ఒక రాత్రి చాలు.”
అ లా గే…
మరేమంటే….
ఒక జీవిత కాలానికి ఈ రచన చాలును!
వెన్నెల పై ఏమి వర్ణన అది ! ! !
ఆకాశంలో ఆరవేసిన పాల మీగడ పై రాసిన రాత! ఆహా!!!
పాలమీగడ మీద రాసిన రాత! ఈ జీవితానికి ఈ ఒక్క స్పందన చాలు!
వెన్నెల చల్లదనాన్ని ఎంత హృద్యం గా ఊహించి వర్నించారండీ.. చదువుతూ ఆ పరిసరాల్లో మమ్మల్ని నిల బెట్టేసి ఆ పూర్ణ చంద్రుడి అమృత బిందువులతో అభిషేకించి తడిపేసారు. ఆ అలౌకిక దివ్యానుభూతిని వదల బుద్దేయటం లేదు.
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.
రీడింగ్ టైమ్ ఆరు నిమిషాలు అన్నారు కదా మీకెంత సమయం పడుతుందో చూద్దామని సెల్ మూలకున్న టైం నేటి చేసుకుని చదవడం మొదలు పెట్టాను.చదవడమంతా పూర్తి అయిన తరువాత మళ్లీ టైము గుర్తుకు వచ్చి చూస్తే 14 నిమిషాలు పట్టింది..నాకే నవ్వు వచ్చింది చదివేది అక్షరాలైతే ఆరునిమిషాలే కావచ్చు. కానీ అవన్నీ అనుభూతులు , అందమైన దృశ్యాలు వాటిని మనసులో ముద్రించుకుంటూ మనస్సు కెమెరాను ఎవరు మాట్లాడితే వారివైపు తిప్పుతూ తెలిసీ తెలియని రూపాలకు ఆకృతులు కల్పించి ఆ ముఒఖాల్లో మరే కవళికలను గమనిస్తూ చదివితే
మరి టైము ఎక్కువ పట్టదా అని. కొత్త విషయం
రజనీగంధం విన్నాను కానీ వెన్నెలతావిని ఊహిస్తూ, సరీసృపాలు రుచిని వాసనగా మార్చుకుంటాయనే కొత్త విషయాన్ని మననం చేస్తూ పఠనానందం పొందడం సమయానికి
తావు లేదనిపించింది.
Thank you so much!💐
There are typos
మీ కెంత బదులు నాకెంత
నేటి బదులు నోట్
మరే కవళికలు బదులు మారే కవళికలు
మీ స్పందన చదువుకుంటున్నప్పుడే మనసు వాటిని సరిచేసి చదువుకుంది.
నిజంగా ఇదో దృశ్యకావ్యం అండీ. మీ వర్ణన కాన్వాసు మీద చిత్రం గీసి చూపిస్తున్నట్లే ఉంది.
పట్టపగలే పండు వెన్నెల్లో విహరింపచేశారు. యాంత్రిక జీవితంలో.. మనుషులు ఈ వెన్నెల కురిసిన రాత్రులను ఆస్వాదించలేక, ఆ వెన్నెలగంధ సుగంధాన్ని ఆఘ్రాణించ లేక.. వెన్నెలను ‘అడవి కాచిన వెన్నెల’ అనుకొని కాలం వెళ్లదీస్తున్నారు గదా అనిపించింది
మీ రసభరిత స్పందనకు ధన్యవాదాలు
చంద్రోదయాన్ని వెనెల వెలుగులో ఎంతో సున్నితంగా ,సుసంపన్నంగా ఆవిష్కరించారు. వెన్నెల ని ఇలా వివరించటం, విశదీకరించడం మీకే చెల్లింది. పాల మీగడతరకలని, చంద్రోదయ కిరణాల్ని, వెన్నెల్లో వ్యాపించిన చందన సుగంధం తో కలిపి అందుకున్న అరుదైన అనుభవం. ప్రతీ పున్నమి కీ నెమరువేసుకుని పరవశించే అందమైన అనుభవం. మీ అక్షరాల ద్వారా వెన్నెల్లో విహరించి తడిసి తన్మయులయ్యే అదృష్టం అందించినందుకు అభినందనలు.
చందన చూర్ణం, చందన సుగంధం, చందన స్నానం. wonderful sir
Thank you
“మనిషి ఒక మెటామార్ఫోస్డ్ డ్రీమ్.,,లేదా యానిమలైజ్డ్ డ్రీమ్.——ప్రొఫెసరు చెప్పినట్టు నాలో ఉన్న కొండా, కోనా, రాయీ, రప్పా, అన్నీ కలిసి ఆ వెన్నెలకి ప్రతిస్పందించాయి.—-” 🙏
Thank you