ఆ వెన్నెల రాత్రులు-6

Image design: Mallika Pulagurtha

అడవిలో మొక్కల్నీ, చెట్లనీ సులువుగా గుర్తుపట్టడం కోసం ప్రొఫెసరు నాకు డయట్రిస్ బ్రాండిస్ రాసిన ‘ఇండియన్ ట్రీస్’ అనే పుస్తకం ఇచ్చాడు. బ్రాండిస్ భారతదేశంలో అటవీ శాఖకీ, సైంటిఫిక్ ఫారెస్ట్రీకి పితామహుడని ప్రొఫెసరు చెప్పాడు. అప్పటికి అరవయ్యేళ్ళ కిందట రాసిన ఆ పుస్తకం చూస్తుంటే నాకు మతిపోయింది. జర్మన్ థరోనెస్ అంటారే, అది ఆ పుస్తకం ప్రతి పేజీలోనూ కొట్టొచ్చినట్టుగా కనబడింది. అందులో చెట్లు, పొదలు, తీగలు, వెదుళ్ళతో సహా అప్పటి బ్రిటిష్ ఇండియాలో కనవచ్చే వృక్ష విజ్ఞానం దాదాపుగా సమస్తం ఉంది. ఆ పుస్తకానికి ‘ద ఫ్లోరా ఆఫ్ బ్రిటిష్ ఇండియా’ అనే పుస్తకం స్ఫూర్తి అనీ, దురదృష్టవశాత్తూ అది కలకత్తాలో ఉండిపోయిందని ప్రొఫెసరు నిట్టూర్చాడు.

‘ఇంత వివరంగా మొక్కలగురించీ, చెట్ల గురించీ ఎప్పుడో పుస్తకాలు రాసిన తర్వాత ఇప్పుడు మళ్ళా మనం కొత్తగా పరిశోధించడానికేముంది?’ ఒకరోజు ధైర్యం తెచ్చుకుని ప్రొఫెసర్ని అడిగేసాను.

అప్పుడు ప్రొఫెసరు చెప్పిన జవాబు నాకు కనువిప్పు.

ఆయన ఏమన్నాడంటే, ‘అటువంటి పుస్తకాలు నువ్వు చెప్పినట్టే విజ్ఞాన సర్వస్వాలు. వాటికవే ఒక యూనివెర్స్ లాంటివి. కాని మనం ఎప్పటికప్పుడు ఆ యూనివెర్స్ ని తిరిగి  చిన్న చిన్న తావుల్లో అన్వేషించాలి. ‘బిట్ బై బిట్’ పునర్నిర్మించుకోవాలి.  మైక్రో లెవెల్ మాపింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పుస్తకాల్లో చూడటానికి అన్నీ ఉన్నట్టు కనిపించినా తీరా నువ్వు ఫీల్డ్ మీదకు వెళ్ళినప్పుడు కొత్త మొక్కలూ, పొదలూ, తీగలూ కనిపించినప్పుడు, ఈ పుస్తకంలో అవి కనిపించకపోవచ్చు. అలాంటి చాలా గాప్ లు మనకి అడుగడుగునా ఎదురవుతాయి. ప్రతి శాస్త్రవేత్తా తన ముందున్న పరిజ్ఞానాన్ని వీపున మోసుకుంటూనే బయల్దేరతాడు. ఎప్పుడు ఆ మూటలో అతనికి కావలసిన సమాచారం దొరకదో, ఆ రోజు అతనికి పండగ అనుకో. ఎందుకంటే, అప్పుడతనికి, ఈ విశ్వపరిజ్ఞానానికి తనవంతు కాంట్రిబ్యూషన్ తాను సమకూర్చే అవకాశం దొరుకుతుంది. హు నోస్? బ్రాండిస్ చూడలేని మొక్కలో, మూలికలో విమలమ్మకి దొరికే ఛాన్స్ ఉండవచ్చు కదా!’

ప్రొఫెసరు చెప్పిన మాటలు ఎంత నిజమో నాకు ఆ తర్వాత దాదాపుగా ప్రతిరోజూ అనుభవంలోకి వస్తూనే ఉండేది. ఉదాహరణకి రాకాముఖి అనే చిన్న మొక్కని నేను మొదటిసారి చూసినప్పుడు నాకు దాని గురించిన వివరాలేవీ బ్రాండిస్ పుస్తకంలో కనబడలేదు. దానికి బదులు పిట్టోస్పర్మ్ ఫ్లోరిబండం అనే మొక్క గురించి ఉంది. జోసెఫ్ గారిని అడిగితే కూడా ఏమీ చెప్పలేకపోయాడు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక కానీ  రాకాముఖి శాస్త్రీయ నామం పిట్టోస్పరం నపోలెన్సి అని తెలుసుకోలేకపోయాను. అంటే బ్రాండిస్  తర్వాత బోటనిస్టులు మరొక అడుగు ముందుకు వేసి ఆ కుటుంబంలోనే మరొక సూక్ష్మ భేదాన్ని పట్టుకున్నారన్నమాట.  గోల్డెన్ ఫ్రాగ్రెన్స్ అని పిలిచే ఆ మొక్క సుగంధాన్ని బ్రాండిస్ ఆఘ్రాణించలేకపోయాడు కదా అనుకున్నాను.

ప్రొఫెసరు మరో మాట కూడా చెప్పాడు.

‘ఆ నాచురలిస్టులు, ఆ జియాలజిస్టులు, ఆ యాంత్రొపాలజిస్టులు ఎంత గొప్ప వర్క్ చేసినా కూడా వాళ్ళది సింగిల్ యూనివెర్స్ మాత్రమే. యూనివెర్స్ అనే పదానికి సరిగ్గా సరిపోతారు వాళ్ళు. అంటే ఒకటే ప్రపంచం అన్నమాట. అఖండ ప్రపంచం. టోటల్. బట్ నాట్ ఇంటెగ్రల్. ఇప్పుడు మనం మల్టీ యూనివెర్స్ లో అడుగుపెడుతున్నాం. ఇంతదాకా మనకు పరిచయమైన యూనివెర్సులన్నింటినీ పక్కపక్కనపెట్టి మాపు చేసుకోవాలి. అందులో ఎక్కువతక్కువలుంటే సరిచేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ మల్టీ డిసిప్లినరీ స్టడీస్. ఒక రాయి, రాయి పక్కన మొక్క, ఆ మొక్క పక్కన మట్టి, ఆ మట్టిలో ఉన్న మాయిశ్చర్, ఆ పొలం దున్నుకునే రైతు, అతని అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, అతని చుట్టూ ఉండే మైథాలజీ- ఇవన్నీ కలిపి మనం తెలుసుకోవాలి. ఎంత వీలైతే అంత తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈ ప్రపంచం కొద్దిగానైనా పరిచయం కావడం మొదలవుతుంది.’

ఏమి మాటలవి! నేను మాటలుడిగి ఆ మాటలే వింటూ ఉండిపోయాను.

వకుళ కుటికి మారిన తర్వాత మా బృందం పని ఒక క్రమపద్ధతిలోకి కుదురుకుంది.

రోజూ పొద్దున్న ఏడింటికల్లా కొండమ్మగారు టిఫిన్, కాఫీ సిద్ధంచేసేసేవారు. నేను కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్ ప్రొఫెసరుగారి దగ్గరే చెయ్యడం మొదలుపెట్టాను. డిన్నర్ మాత్రమే పిన్నిగారింట్లో చేసేదాన్ని. వకుళకుటి దాదాపుగా ఒక బాచిలర్ మెస్సులాగా తయారయ్యింది. మేము ముగ్గురమే కాక,  దేవయ్యా, రాంబాబూ, ఇంకా ఆ రోజుకి ఎవరుంటే వాళ్ళంతా అక్కడే బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ప్రొఫెసరు తీసుకునే అల్పాహారం నిజంగా అల్పాహారమే. బ్రెడ్డు, జామ్, ఒక బాయిల్డ్ ఎగ్ మాత్రమే తినేవాడు. ఎప్పుడేనా దోసె, ఆమ్లెట్ లాంటివి వేసినప్పుడు తను కూడా ఒకటి తినేవాడు. వనలతకి ఆంధ్రా వంటలు బాగా నచ్చాయి. ఆమె అడిగి మరీ చేయించుకునేది. బ్రేక్ ఫాస్ట్ చేసాక, జీపు ఎక్కేముందు, ఆమె మళ్ళా అందరికీ రసగుల్లానో, సందేశ్ నో ప్రసాదం పంచినట్టు అందరి చేతుల్లో కొద్దిగా కొద్దిగా పెట్టేది. ఇక హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ జీపులో బయల్దేరేవాళ్లం.

లంచ్ కి ఇంటికి వచ్చేటప్పటికి వేడి వేడిగా చపాతీలు, అన్నం, కూరా, సాంబారు ఉండేవి. ఊరగాయలు, స్వీటు కూడా తప్పనిసరి. ఒక్కోసారి సాయంకాలం డిస్కషన్ కి నేను మళ్ళా వకుళ కుటికి వెళ్ళినప్పుడు వేడి వేడి పుల్కాలూ, కుర్మా నోరూరిస్తూ సిద్ధంగా ఉండేవి. ఆ మామిడిచెట్ల కింద వెదురు కర్రల్తో కట్టిన ఆ సీట్లమీద కూర్చునేవాళ్ళం. సంభాషణలు కొండలమీంచీ, రాళ్ళమీంచీ మొదలై ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండేవి.

ప్రొఫెసరుగారు వకుళకుటిలోకి మారినప్పణ్ణుంచీ పనిలో కూడా వేగం పెరిగింది. ఆ మాటే ప్రొఫెసరుతో అంటే ఆయనొక ఆఫ్రికన్ ప్రోవెర్బ్ కోట్ చేసాడు: ‘యువకుడొక్కడూ నడిస్తే వేగంగా నడుస్తాడు, వృద్ధుడొక్కడూ నడిస్తే నెమ్మదిగా నడుస్తాడు, ఇద్దరూ కలిసి నడిస్తే బహువేగంగా నడుస్తారు ‘ అని.

ఆ మాట నిజమే. ఒకసారి ఫీల్డ్ మీదకు వెళ్ళాక ప్రొఫెసరు నడక మొత్తం మారిపోయేది. ఆయనలో ఒక యువకుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఒక్కోసారి ఏదో ఒక బండరాతి మీద నిలబడి డాన్సు చేసేవాడు. అప్పుడప్పుడు బిగ్గరగా కేరింతలు కొట్టేవాడు. అడవిలో ఏదైనా పక్షి కూత వినబడితే తానూ తిరిగి కూత పెట్టేవాడు.

కాని కొన్ని కొన్ని సార్లు ఆయన మౌనంగా ఉండిపోయేవాడు. ఏ చెట్టుకిందనో కూచుండిపోయేవాడు. లేదా ఏ బండనీడనో కళ్ళు మూసుకుని మౌనంలోకి వెళ్ళిపోయేవాడు. ఆయన అలసట వల్ల అలా కూచుంటున్నాడని మొదట్లో అనుకున్నాను. కాని అలాంటి సమయాల్లో వనలత ఆయన దగ్గరికి కూడా వెళ్ళేది కాదు. నేను ఒకసారి ఆయన్ని పిలవబోతే సైగలతోటే వారించింది. నెమ్మదిగా ఆయన్ని అలాంటి సమయాల్లో దూరం నుంచే ఆసక్తిగా చూస్తుండేదాన్ని. కొన్నిసార్లు ఆయన ఒక చిన్న రాయినో లేదా ఎండుకొమ్మనో ఒళ్ళో పెట్టుకుని పసిపాపను ఒళ్ళో నిద్రబుచ్చుతున్న తల్లిలాగా అరమోడ్పు కళ్ళతో చాలాసేపు కూచుండిపోయేవాడు. నేను నా కుతూహలం ఆపుకోలేక అట్లాంటి ఒక క్షణంలో ఆయన దగ్గరకి వెళ్ళి నిలబడ్డాను. పిల్లిలాగా నడిచి వెళ్ళినా కూడా నా అడుగుల చప్పుడు ఆయనకి వినబడినట్టుంది. కళ్ళు తెరిచి నాకేసి చూసాడు. నాకు భయం వేసింది. పురాణాల్లో తపసు చేసుకుంటున్న మునుల్ని నాలాంటి వాళ్ళు తపసు భగ్నం చేసినప్పుడు ఆ మునులు శాపాలు పెట్టిన కథలు గుర్తొచ్చాయి. కాని ఆయన నాకేసి చాలా ప్రేమగా చూసాడు. ఆ చూపుల్ని ఏ లోకాలదో నిశ్శబ్దం, తేజస్సు అంటి పెట్టుకుని ఉన్నాయనిపించింది. ఎక్కడికో వెళ్ళి అమృతం తాగివచ్చిన చూపులవి. ఆ మాధుర్యం నామీద కూడా కొంత వొలికింది.

‘డిస్టర్బ్ చేసానా?’ అనడిగాను, చుట్టూ చూస్తూ, నా అదృష్టం కొద్దీ వనలత దగ్గరలో లేదు.

‘నో నాట్ ఎట్ ఆల్’ అన్నాడాయన.

‘రా, ఇలా వచ్చి కూచో ‘ అన్నాడు, తన పక్కన చోటు చూపిస్తూ.

ఆయన ఒక బొడ్డ చెట్టు నీడన కూచున్నాడు. పన్నెండు గంటల ఎండ వేళ. కానీ ఆ నీడలో చెప్పలేనంత తేమ తగుల్తూ ఉంది. ఆయన ముఖంలో నాకు ఎటువంటి అలసటా కనిపించలేదు. అయినా ఏదో ఒక రకంగా మాటలు కొనసాగించాలని అడిగాను

‘బాగా అలసటగా ఉంటోందా? రోజూ మీరు ఫీల్డ్ కి రాకపోతే మాత్రం ఏమవుతుంది? నేనూ, వనలతా ఉన్నాం కదా.’

‘అలాగా’ అన్నాడాయన. అప్పటిదాకా కాళ్ళు బారచాపుకు కూచున్నవాడు సర్దుకుని కూచున్నాడు. ఆయన ముఖంలో చిరునవ్వు ఒక నీడలాగా కదిలిపోయింది.

‘నేను ఇంతదూరం వచ్చిందే ఈ కొండల్లో గడుపుదామని. లేకపోతే కలకత్తాలోనే ఉండిపోయేవాణ్ణి కదా. నెలల తరబడి యూనివెర్సిటీలో నా ఛాంబర్లోనో, ఆ లెక్చెర్ హాల్స్ లోనో, సెమినార్ హాల్స్ లోనో గడుపుతుండాలి. అప్పుడు నాకు ఎంత శూన్యంగా అనిపిస్తుందో చెప్పలేను. వాళ్ళంతా చాలా స్ట్రేంజ్ గా, నాకు ఏ మాత్రం సంబంధం లేనివాళ్ళుగా కనిపిస్తారు. ఒక్కొక్కప్పుడు ఆ కేంపస్ లో నాకు నేనే ఒక ఏలియన్ లాగా కనిపిస్తాను. కాని ఇదుగో చూడు, ఇలా కొండల మధ్యకి వచ్చినప్పుడు, ఈ చెట్లకింద నడుస్తున్నప్పుడు, ఇలా నీలాంటి వాళ్లతో కలిసి ఈ మొక్కల్ని వెతుక్కుంటున్నప్పుడు నాకు నా సొంత వూరికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. నీళ్ళు దొరికిన చేపలాగా, వెన్నెల దొరికిన చకోరంలాగా అయిపోతాను’ అన్నాడు.

అప్పుడు కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏవో మాటలు వెతుక్కుంటూ వాక్యాలు పేర్చుకుంటున్నవాడిలాగా తనలో తానే గొణుక్కుంటూ ఉండిపోయాడు. మళ్ళా ఒక్కసారి తనను తాను విదిలించుకుని తన ఒళ్ళో ఉన్న రాతి శకలం తన చేతుల్లోకి తీసుకున్నాడు.

‘సీ. దిస్ పీస్ ఆఫ్ రాక్. డు యు నో హౌ ఓల్డ్ దిస్ మస్ట్ బి?’అనడిగాడు.

‘నేను జియాలజీలో పూర్’ అన్నాను నవ్వుతో. ఆయన దగ్గర నెమ్మదిగా చనువు ఏర్పడుతూండటం నాకు తెలుస్తూనే ఉంది.

‘ఓకే. డు యు నో వేర్ ఇట్ ఈజ్ బార్న్?’

ఆ రాతిముక్క. దాన్నొక కుందేలుపిల్లలాగా చేతుల్తో ఆప్యాయంగా తడుముతో, ఇదెక్కడ పుట్టిందో నీకు తెలుసా అనడుగుతున్నాడు. నేను మాట్లాడలేదు.

‘చూడు, విమలా, ఇది అంటార్కిటికా లో పుట్టింది’ అన్నాడు.

అంటార్కిటికా!

నేను సరిగానే విన్నానా?

అప్పుడాయన కాళ్ళు మరీ దగ్గరగా లాక్కుని బాసింపట్టు వేసుకోడానికి ప్రయత్నించాడు. అంటే నాకొక కొత్త పాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నాడన్నమాట.

అప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఒక తేనెచుక్క. ఎన్నో ఏళ్ళ పాటు ఎన్నో పుస్తకాలు, పరిశోధనలు, అడవులు, కొండలు తిరిగి ఏరి తెచ్చుకున్న తేనె అది.

‘ఈ తూర్పు కనుమలు ఒకప్పుడు ఇండియాలో భాగంగా ఉండేవి కావు.  ఒకప్పుడు మా జియాలజిస్టులకి వెస్టర్న్ ఘాట్స్ మీద ఉన్న ఇంటరెస్ట్ ఈస్టరన్ ఘాట్స్ మీద ఉండేది కాదు. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ లో లాగా ఇక్కడ పెద్ద పెద్ద శిఖరాలు, స్టీప్ గోర్జెస్, ఎస్కార్ప్ మెంట్లు, డీప్ వేలీస్ కనబడవని. కానీ జియొలాజికల్ టైమ్ లో చూస్తే ఈ ఘాట్స్ పెద్ద పుస్తకం లాంటివి. ఒక పుస్తకం కాదు, కొన్ని వాల్యూమ్స్. మనమింకా వాటి అట్టలు మాత్రమే చూస్తున్నాం. ఇండెక్స్ దాకా కూడా రాలేదు.

ఈ భూఖండం దాదాపు యాభై కోట్ల సంవత్సరాల కిందట ఇండియాని ఢీకొంది. ఆ కొల్లిజన్ లోంచి ఈ శిఖరాలు ఏర్పడ్డాయి. ఏళ్ళ తరబడి ఆ మహాపర్వతాలు  కరిగిపోగా కరిగిపోగా మిగిలిన కొండలు మనం చూస్తున్నవి. కొంతమంది చెప్పేదాన్ని బట్టి ఈ ఘాట్స్ ఒక ఇండిపెండెంట్ బ్లాక్. ఎప్పుడో 250 కోట్ల సంవత్సరాల కిందట ఆర్కియన్ టైమ్స్ లో ఇది అంటార్కిటికా లో భాగమైంది.’

‘మరికొంత మంది దృష్టిలో ఇది మొదటినుంచీ అంటార్కిటికాలో భాగమే. ఇప్పటికి నూట డెబ్భై, నూట అరవై కోట్ల సంవత్సరాల కింద పెద్ద మాగ్మాటిజంకి లోనయ్యాయి. మాగ్మాటిజం అంటే తెలుసు కదా! భూమిలోపల ఇంకా కుతకుత ఉడుకుతూ చల్లారని పదార్థం పైకి పొంగినప్పుడు గట్టిపడి క్రస్ట్ గా ఫార్మ్ కావడం. మనం చూస్తున్న ఈ దృశ్యప్రపంచమంతా అనుక్షణం మార్పుకి లోనవుతూ ఉంటుంది. కానీ భూమిలోపల ఆ కోర్, దాని పైన మేంటిల్- అవి మాత్రం భూమి పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయి. 250 కోట్ల కిందటి భూమి జ్ఞాపకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇదిగో, ఈ రాయిని తడిమి చూడు ‘అని తన చేతిలో ఉన్న ఆ శిలాశకలాన్ని నా చేతుల్లో పెట్టాడు.

నా ఒళ్ళు జలదరించింది.

ఆ చిన్న రాతిముక్క ఒక చిన్న చేపపిల్లలా నా చేతుల్లో కదుల్తోందా అన్న భ్రాంతికి లోనయ్యాను క్షణం పాటు.

‘నిజమే. ఈ రాయి ఎంతో ఎరోజన్ కి లోనయ్యింది. యాభై కోట్ల సంవత్సరాల పాటు ఎండకి ఎండి వానకు తడిసింది. కాని అదంతా పైపైన మాత్రమే. దీనిలోపల ఆ ఒరిజినల్ మాటర్ అలానే ఉంది. అండ్, యు నో. దట్ ఈజ్ నాట్ ఎ డెడ్ మాటర్. ఇట్ ఈజ్ ఎవర్ ఇవాల్వింగ్, కంటిన్యువస్లీ మెటామార్ఫింగ్.’

మొదటిసారిగా నా చేతుల్లో ఉన్న ఆ చిన్న రాయి కూడా ఒక మొక్కలాంటిదే అనిపించింది నాకు.

‘ఇంకో సంగతి చెప్పనా! నీ చేతిలో ఉన్న ఆ పీస్ ఆఫ్ రాక్ లో మహాసముద్రాల రహస్యాలున్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాలుగా  కాంటినెంట్స్ చేస్తూ వచ్చిన ప్రయాణ రహస్యాలున్నాయి. ఆ చిత్రలిపి నువ్వు చదవడం నేర్చుకోవాలేగాని, అదొక కాంటినెంటల్ ట్రావెలోగ్’ అని కూడా అన్నాడు.

ఇంతలో వనలత మమ్మల్ని వెతుక్కుంటూ అక్కడికొచ్చింది. చాలా సేపటిగా ఎండలో పనిచేస్తూ ఉందేమో ఆమె ముఖమంతా చెమట పట్టి ఉంది. ఎప్పుడూ విరబోసుకుని ఉండే ఆ కురుల్ని వదులుగా ముడివేసుకుంది. ఆమె టీషర్టు మొత్తం చెమటతో తడిసిపోయి ఉంది. నుదుటన పెట్టుకున్న బొట్టు ఎప్పుడో చెమటకి తడిసి ఎక్కడో జారిపోయి ఉంటుంది.

ఆమె వస్తూనే ఉస్సురంటూ వగరుస్తూ సేన్ గుప్త పక్కన కూలబడింది. సేన్ గుప్త ఆప్యాయంగా ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు.

‘ఏమి చెప్తున్నాను? దిస్ పీస్ ఆఫ్ రాక్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ మెరైన్ మెమొరీస్ అని కదా. అవును. మహాసముద్రగర్భం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ రాతిని బద్దలు గొడితే తెలుస్తుంది’ అని వనలతతో ‘ఇవన్నీ నువ్వు ఎప్పుడూ వినే మాటలే. బోరు కొడుతుందేమో నీకు’ అన్నాడు.

‘నో. నాట్ ఎటాల్’ అంది వనలత.

‘కాకూ ఈ మాటలు ఎన్ని సార్లు చెప్పినా నాకు వినాలని ఉంటుంది. ఎందుకంటే అదంతా షీర్ పొయెట్రీ’ అని అంది నాతో.

‘అవును. నిజమే. నేను మాట్లాడేది పొయెట్రీనే. నా తోటి జియాలజిస్టులు నన్ను ఆటపట్టిస్తుంటారు. నేను హాఫ్ జియాలజిస్టు- హాఫ్ పొయెట్ ని అని. కాదు, నేను పొయెట్ ని కూడా కాదు. నేను డ్రీమర్ ని. ఎప్పుడూ నేనో డ్రీమ్ టైమ్ లో జీవిస్తూ ఉంటాను. మీకు తెలుసునా? ఆస్ట్రేలియాలో కొన్ని ఇండిజీనిస్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు తామెప్పుడూ తమ ఏన్సెస్టరల్ డ్రీమ్ టైమ్ లోనూ, డ్రీమ్ స్పేస్ లోనూ మటుకే జీవిస్తున్నామనుకుంటూ ఉంటారట. నేను కూడా అలాంటి ఒక అబొరిజినల్ ని మాత్రమే’ అన్నాడు.

‘అండ్ ఐ కీప్ టెల్లింగ్ హిమ్ దట్ హిజ్ ట్రైబ్ ఈజ్ అల్మోస్ట్ గెటింగ్ ఎక్స్టింగ్విష్డ్’ అంది వనలత.

‘మీరు సముద్రం గురించి చెప్తున్నారు’ అన్నాను సంభాషణని మళ్ళా దారికితేవాలని.

‘సముద్రం. యెస్. ఈ రాయిలో సముద్రాల జ్ఞాపకాలున్నాయి అన్నాను కదా. ఆ మాటకొస్తే నీలోనూ, నాలోనూ కూడా ఉన్నది సముద్రమే. తెలుసా! సోడియం, పొటాషియం, కాల్షియం – ఈ మూడూ సముద్రజలాల్లో ఏ ప్రపోర్షన్లో ఉన్నాయో మన వీన్స్ లో కూడా అదే ప్రపోర్షన్ లో ఉన్నాయి. మన అంతరాంతరాల్లో మనం ప్రతి ఒక్కరం ఒక సముద్రాన్ని మోసుకు తిరుగుతున్నాం. మన పూర్వీకులు సముద్రంలో పుట్టిన ఒక ఏకకణ జీవి అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్, నైట్రొజెన్, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం- ఈ పదార్థాలతోటే ప్రకృతి కొన్ని కోట్ల సంవత్సరాలుగా ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఆ ప్రయోగపరంపరలో, ఆ పరిణామ క్రమంలో, చేప, కప్ప, రెప్టైల్, పక్షి, మేమల్, ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఈ సేన్ గుప్త, ఈ ఒరుణిమ, ఈ విమల కూడా వచ్చారు. కాని ఈ లాంగ్ అండ్ ఎసిడ్యువస్ ప్రాసెస్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లో వీళ్ళేమీ చివరి మజిలీ కాదు. వీళ్ళని దాటి ప్రకృతి ఇంకా ముందుకు పోతున్నది, మనం గమనించడం లేదంతే.’

‘కాబట్టి-‘ అని ఆగి ఆయన తన పైనున్న చెట్టుకేసి చూసి ‘ఇదేమి చెట్టు?’ అనడిగాడు నన్ను.

‘బొడ్డ చెట్టు. మొరాసియే ఫామిలీ. ఫైకస్ జీనస్. సైంటిఫిక్ నేమ్ ఫైకస్ రేస్ మోసా’ అన్నాను గబగబా, పాఠం అప్పచెప్పినట్టుగా. బ్రాండిస్ నా పరువు కాపాడేడు అనుకున్నాను.

‘ఓహ్! ఔదుంబరమా! గుడ్. కాబట్టి నేను చెప్పేదేమంటే, ఇదిగో, ఈ ఔదుంబరం, నీ చేతుల్లో ఉన్న ఆ రాయి, ఈ కొండ, నువ్వూ, నేనూ అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళమే. మనందరం మోసుకుంటూ తిరుగ్తున్నది ఒక భూమి జ్ఞాపకాలే, ఒక సముద్రం జ్ఞాపకాలే. ఈ జ్ఞాపకాల్తోనే మనం పరిణామం చెందుతున్నాం. కొత్త రూపాలు పొందుతున్నాం. కాని ఆ పాత జ్ఞాపకాల్ని వెంటతీసుకుపోతూనే ఉన్నాం. ఈ సృష్టిలో ఏదీ నిశ్చలం కాదు. ఈ కొండ, చెట్టు, ఇదుగో, ఈ విరిగిపోయిన రాయి, ఈ ఎండిపోయిన కొమ్మ ప్రతి ఒక్కరం ప్రయాణిస్తోనే ఉన్నాం. బట్, ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్పీడ్. కాని అందరం ప్రయాణిస్తూనే ఉన్నాం. మనమందరం సహయాత్రీకులం, ఇంకా చెప్పాలంటే ఆల్ ఆఫ్ అజ్ ఆర్ ఆన్ ద సేమ్ పిలిగ్రిమేజ్.’

ఆయన తన తలమీంచి మెడమీదకు ఒరుగుతున్న వాట్సన్ హేట్ సర్దుకుని మళ్లా చెప్పడం మొదలుపెట్టాడు.

‘లెట్ అజ్ కమ్ బేక్ టు దిస్ పీస్ ఆఫ్ రాక్. థోరో ఒకచోట ఒక చేపపిల్ల గురించి రాస్తూ దాన్ని ఏనిమలైజ్డ్ వాటర్ అన్నాడు. పందొమ్మిదో శతాబ్ది ఇవొల్యూషనిస్టులు రాతిలో జీవం లేదనీ, అది పరిణామక్రమంలో అన్నిటికన్నా అడుగున ఉన్న ఇనార్గానిక్ మేటర్ అనీ, పరిణామక్రమంలో మనిషి అందరికన్నా అత్యున్నత స్థాయిలో ఉన్నాడనీ వాదించారు. అది కూడా, యు నో, నాట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఒన్లీ ద యూరోపియన్ మేన్. కాని, మనిషి కూడా ఈ పరిణామక్రమంలో ఈ రాయిలాంటివాడే, రాదర్, ఎ మూవింగ్ స్టోన్.

ఆయన ఒక క్షణం ఆగేడు. కాని ఆయన ఉద్వేగం ఆయన్ని ఆగనివ్వలేదు.

‘తాను ఎందుకు ఇక్కడున్నదో ఈ రాతికి ఎంత తెలుసో మనం ఇక్కడెందుకున్నామో మనకీ అంతే తెలుసు. ఎవరెస్టు పర్వతం ఎక్కడానికి బయల్దేరిన ఒక మౌంటెనీర్ని ఎవరో అడిగారట: ఆ పర్వతం ఎందుకు ఎక్కాలనుకుంటున్నారు అని. ఎందుకంటే, అదక్కడ ఉంది కాబట్టి అని చెప్పాడట ఆయన. అని అది కాదు కారణం. నేనేమనుకుంటానంటే, ఆ కొండలోనూ, అతనిలోనూ ఒకే పదార్థం ఉంది కాబట్టి, ఆ పదార్థం నిరంతరం ఏదో చెప్పలేని అశాంతితో చలించిపోతూ ఉంది కాబట్టి అంటాన్నేను. ఇక్కడ నేను కూర్చుని ఏం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా. ఇదుగో, ఆ రాతితో మాట్లాడుతున్నాను. దానికేసి చూస్తున్నాను. అది కూడా నాకేసి చూస్తోంది. మేమిద్దరం మౌనంగా కొన్ని కోట్ల, బిలియన్ల సంవత్సరాల వెనక్కి ప్రయాణిస్తున్నాం. ఒకప్పుడు ఈ భూమి సూర్యుణ్ణుంచి విడివడ్డ కొత్తలో మనిషీ, మొక్కలూ, మత్స్యాలూ సరే, సముద్రాలు కూడా, పర్వతాలు కూడా లేవు. ఆ తొలిరోజుల్లో ఇంకా వేడితో రగిలిపోతూన్న భూమినుంచి ఒక ముక్క విడిపోయి చంద్రుడిగా మారిపోయింది. అలా ఆ ముక్క తెగిపోయిన చోట పెద్ద అగాధం ఏర్పడింది. అసంఖ్యాక సంవత్సరాల పాటు కురిసిన వర్షాలకు ఆ అగాధం నిండి సముద్రంగా మారింది. మొదటి సముద్రం అది ఈ భూమ్మీద. ఆ వానలు ఎక్కణ్ణుంచి వచ్చాయి? మండుతున్న భూగర్భం నుంచి పైకెగిసిన ఉష్ణవాయువులు ఆకాశాన్ని చేరి చల్లారుతూ వానలుగా తిరిగి భూమిని చేరుకోడం వల్ల కురిసాయి. మండుతున్న రాళ్ళు వాయువుగా మారి, వాయువు నీళ్ళుగా మారి, నీళ్ళు మళ్ళా ప్రాణికోటిగా మారి, ప్రాణులు మరణించి మళ్లా రాళ్లుగా మారి- దేర్ ఈజ్ ఎ ప్రావిడెన్స్ ఇన్ ద ఫాల్ ఆఫ్ ఏ స్పారో అన్నాడు హామ్లెట్. ఒక రాయిలో, ఇదుగో, చూడు ఈ ఎండుకొమ్మలో’- అంటో తనపక్కన పడి ఉన్న ఎండిపోయిన చిన్న కొమ్మని చూపిస్తూ – ‘ఈ ఎండుకొమ్మలో మొత్తం ఇవొల్యూషన్ అంతా ఉంది. ఇక్కడ కూచున్నప్పుడు నేను ఈ పదార్థంలో, కాదు ఈ పదార్థ పరిణామ ప్రయాణంలో ఒకడినైపోతాను. దేశం, కాలం మర్చిపోతాను’ అన్నాడు.

‘ఈ భూమి మీద నీళ్లు ఎలా వచ్చాయి? చాలా థీరీస్ ఉన్నాయి. ఈ మధ్య జెయింట్ ఇంపాక్ట్ థీరీ అని ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు. నాలుగున్నర బిలియన్ల సంవత్సరాల కిందట ఒక పెద్ద గ్రహం భూమిని డీకొట్టింది. దాన్ని థీయా అంటున్నారు. థీయా అంటే గ్రీకు పురాణాల్లో చంద్రుడికి తల్లి. ఆ థీయా ఈ గాయా ని అంటే ఈ పురాతన పృథ్విని ఢీకొట్టినప్పుడు దానిలోని కొంత భాగం భూమిలో కలిసిపోయింది. ఆ థీయానే భూమ్మీదకి నీళ్ళు పట్టుకొచ్చింది అని ఒక ఊహాగానం. ఏమో. రకరకాల సిద్ధాంతాలు. ఏదీ కచ్చితంగా తెలీదు. కాని నాకు అర్థమయినంతవరకూ ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలను. కొంత సూర్యరశ్మి, కొంత చంద్రకాంతి, కొంత నక్షత్రధూళి- ఇవన్నీ కలిస్తేనే, ఈ రాయీ, రప్పా, చెట్టూ, చేమా, నువ్వూ నేనూ మనందరం ఏర్పడ్డాం. మనందరిలో ఉన్న ధూళి ఒక్కటే, జీవం ఒక్కటే. అందుకనే మనకి ఒకరి పట్ల ఒకరికి ఇంత ఆసక్తి. లేకపోతే ఎక్కడి ఢాకా, ఎక్కడి కలకత్తా, ఎక్కడి సేన్ గుప్తా? ఎక్కడి పనసమామిడి కొండ? ఒకవేళ నేను ఇక్కడికి రాకపోయుంటే, ఆశ్చర్యం లేదు, ఈ కొండనే కలకత్తా వచ్చి ఉండేది!’ అన్నాడు.

దేవయ్య మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ‘రెండయిపోయింది, బయల్దేరదాం’ అన్నాడు.

‘యెస్, యెస్’ అన్నాడు సేన్ గుప్తా.  తనకి ఆసరాగా వనలత చేయూతకోసం చూస్తూ లేచి నిలబడబోయాడు. నేను చప్పున ఆ చేయి అందుకున్నాను. నేను కూడా వనలతలాగా ఆ బృందంలో శాశ్వతసభ్యురాలినైపోతే ఇలా వాళ్ళతో పాటు కొండలూ, కోనలూ తిరుగుతూ ఉండవచ్చుకదా అనిపించింది. కలకత్తా యూనివెర్సిటీలో నాక్కూడా సీటు దొరుకుతుందా అని ప్రొఫెసర్ని అడగాలనిపించింది.

6-4-2023

24 Replies to “ఆ వెన్నెల రాత్రులు-6”

 1. నేను నడిచిన దార్లు చాలా కనిపిస్తున్నాయి ,నాకు సేన్ గుప్తా దాస్ గుప్తా అనే పేరుతో తెలుసు .కలకత్తా యూనివర్సిటీ లో జియాలజిస్ట్ .ప్రపంచంలో మంచి పేరున్న శాస్త్రజ్ఞులు. ఇంత భావుకత ఆయనలో మాత్రమే చూశాను.

 2. “ఒక మౌంటెనీర్ని ఎవరో అడిగారట: ఆ పర్వతం ఎందుకు ఎక్కాలనుకుంటున్నారు అని. ఎందుకంటే, అదక్కడ ఉంది కాబట్టి అని చెప్పాడట ఆయన.“
  చిన్నప్పుడు English text book లో “Why climb mountains?” అన్న essay లో చదువుకున్న గుర్తు ఈ మాటలు.

 3. “కొంత సూర్యరశ్మి, కొంత చంద్రకాంతి, కొంత నక్షత్రధూళి- ఇవన్నీ కలిస్తేనే, ఈ రాయీ, రప్పా, చెట్టూ, చేమా, నువ్వూ నేనూ- ” పోయెట్రీ లా సాగుతోంది ..

 4. “ప్రతి శాస్త్రవేత్తా తన ముందున్న పరిజ్ఞానాన్ని వీపున మోసుకుంటూనే బయల్దేరతాడు. ఎప్పుడు ఆ మూటలో అతనికి కావలసిన సమాచారం దొరకదో, ఆ రోజు అతనికి పండగ అనుకో. ఎందుకంటే, అప్పుడతనికి, ఈ విశ్వపరిజ్ఞానానికి తనవంతు కాంట్రిబ్యూషన్ తాను సమకూర్చే అవకాశం దొరుకుతుంది.”

  ఈ భాగం బుక్ మార్క్ చేసి పెట్టుకుని మళ్లీ మళ్లీ చదువుకుంటాను. Quotes ఎత్తి రాయాలంటే కనీసం సగం మళ్లీ ఇక్కడ పెట్టేయాలి. వనలత చెప్పినట్లు sheer poetry this is 🙏 ఈ వాక్యాలని మాత్రం ఇంత చెప్పీ తలుచుకోవడం, పరిశోధక విద్యార్థిగా ఆ పండగ ఎట్లాంటిదో తెలిసివుండటం వల్ల. ఇకముందు మరెవరినైనా వాకింగ్ ఎన్సైక్లోపీడియా అనాలంటే ఇంకాస్త ఆలోచిస్తాను. నమో నమః భద్రుడు గారూ 🙏

 5. నాకు మీరప్పడప్పడూ ప్రస్తావించే వాల్మీకి కాళిదాసుల వనప్రేమ గుర్తుకు వస్తున్నది. సంప్రదాయం కొనసాగింపు అనిపిస్తున్నది. అన్నిటి కంటే ముఖ్యంగా మా ఊరి ప్రతి చోటు నాకు ఎందుకంత ఉద్వేగం కలిగిస్తూందో కూడా అర్థమౌతున్నది. వనవిజ్ఞాన కౌముది అపూర్వం.🙏

  1. ఇదంతా డ్రమాటిక్ మోనోలాగ్ లోంచి డ్రీమ్ లైక్ రియాలిటీ లోకి వెళ్తోంది మాష్టారు.కొట్టుకుపోతున్నాం.

 6. కలకత్తా యూనివర్సిటీ లో నాక్కూడా సీట్ దొరుకుతుందా

 7. అన్నయ్య అసలు ఏమి వ్రాస్తున్నారు మీరు!అద్భుతం.సేన్ గారిలో మీరు కనిపిస్తున్నారు రాయితో మాట్లాడటం.విరిగిన రాయి,కొమ్మ,నువ్వు ,నేను అందరం కొన్ని సముద్రాల జ్ఞాపకాలు మోస్తూ తిరుగుతున్నాము.అన్నింటిలో పదార్థం ఒక్కటే.బ్రహ్మమొక్కటే అంటే ఇదే కదా.మీలాంటి ఒక తపస్వి మాత్రమే వ్రాయగల వాక్యాలు 👌👌👌

 8. మీ యూనివెర్సిటీలో నాక్కూడా సీటు దొరికింది

Leave a Reply

%d bloggers like this: