ఆ వెన్నెల రాత్రులు-5

Image design: Mallika Pulagurtha

వారం రోజుల్లో తయారవుతుందన్న కుటీరం పూర్తిగా తయారయ్యేసరికి రెండువారాలు దాటింది. దీపావళి వెళ్ళిన రెండోనాడు ఆ కుటీరంలో ప్రవేశించడానికి జోసెఫ్ గారు ఏర్పాట్లు చేసారు. దాన్ని ఆయన దాదాపుగా గృహప్రవేశంలాగా చేయించారు. ఆ రోజు కూడా మళ్ళా ఊళ్ళోవాళ్ళని పిలిచారు. గ్రామపెద్దల్నీ, ఫారెస్టు డిపార్ట్ మెంటులో తనతో పనిచేసే సిబ్బందినీ, చుట్టుపక్కల స్కూళ్ళల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్నీ భోజనానికి ఆహ్వానించేరు.

ఆ కుటీరం చూడటానికి చాలా అందంగా తయారయ్యింది. వంటగదికాక రెండు గదులు, ఒక వీథరుగు ఉన్నాయి. ఆ రెండు గదుల్లోనూ వెదురుతోనే మంచాల్లాగా ఏర్పాటు చేసారు. ఇంటి ఆవరణలో మామిడిచెట్ల కింద కూచోడానికి కొయ్యతోనూ, వెదురుతోనూ సీట్లు ఏర్పాట్లు చేసారు. సాయంకాలం పూట లాంతరు తగిలించుకోడానికి ఒక లాంటర్న్ పోస్ట్ కూడా.

ఆ కుటీరానికి ఏం పేరు పెడితే బాగుంటుందని జోసెఫ్ సేన్ గుప్తాని అడిగాడు. ఆయన ఒకటి రెండు నిమిషాలు ఆలోచించి ‘బొకుల్ కుటి’ అని పెట్టండి అన్నాడు.

వకుళ కుటి.

బొగడపూల పొదరిల్లు.

‘గురుదేవుల కి ఎంతో ఇష్టమైన పూలచెట్టు అది’ అని అన్నాడు.

ఆ రోజు మాకు ఫీల్డ్ వర్క్ ఆఫ్. మధ్యాహ్నం విందు ముగిసాక నేను ఇంటికి వచ్చేస్తుంటే వనలత ‘సాయంకాలం రారాదూ కాసేపు మాట్లాడుకోవచ్చు’ అంది. ఆమె నాతో ఆత్మీయంగా మాట్లాడిన మొదటి సందర్భం అది. నాకు ఆశ్చర్యం వేసింది. సంతోషంగా కూడా అనిపించింది.

ఆ సాయంకాలం ఇంకా వెలుతురు ఉండగానే నేను వకుళకుటికి వెళ్లాను. ప్రొఫెసరుగారూ, వనలతా రెండు గదుల్లోనూ తమ సామాను సర్దుకుంటూ ఉన్నారు. నేను వనలత గది గుమ్మం దగ్గర నిలబడగానే ఆమె చిరునవ్వుతో తన చెయ్యి నా నడుంచుట్టూ వేసి తనగదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఒకవైపు బల్లమీద ఆమె పుస్తకాలతో పాటు ఒక ఖాళీకప్పుని ఫ్లవర్ వాజ్ గా మార్చిపెట్టుకుంది. మరో పక్క వెదురు దండెం మీద ఆమె దుస్తులు, వెదురు మంచం మీద ఒక పరుపు, బహుశా జోసెఫ్ గారే ఏర్పాటు చేసి ఉంటారు. దాని మీద బెంగాల్ కాటన్ బెడ్ స్ప్రెడ్. లేత పసుపు అంచుతో తెల్లటి దుప్పటి. తలగడకి కూడా అదే డిజైన్ పిల్లో కవర్. ఒక్కరోజులో వాళ్ళ చుట్టూ వాతావరణాన్ని మాజికల్ గా మార్చేసారు అనుకున్నాను. అక్కడ ఒక కేన్ మోడా మీద కూర్చోబోతుంటే, పర్వాలేదు, కాట్ మీదనే కూచో అంది.

ఆ మంచం మీద కూచుని చుట్టూ పరికించాను. ఆ బల్లమీద నేను అంతకుముందు గమనించని చిన్న వస్తువొకటి కనబడింది. నల్లగా దీపం ప్రమిదలాగా ఉంది.

ఏమిటది అనడిగాను.

‘అదా!’ అంటో ఆమె దాన్ని తీసి నా చేతుల్లో పెడుతూ ‘మై ఫస్ట్ ఫాజిల్ కలెక్షన్’ అంది.

దాన్ని పరిశీలనగా చూసాను. అది ఏదో పక్షినో, కీటకమో లేదా ఏదో జంతువు ఎముకనో లేదా దంతమో భూమిపొరల్లో నిక్షిప్తమైపోయి శిలాజంగా మారిపోయిందనుకున్నాను.

‘యు నో. దట్స్ ఎ రేర్ ప్లాంట్ ఫాజిల్. ఇట్ మస్ట్ బి ఆఫ్ ఎ మిలియన్ యియర్స్ ఓల్డ్. నేను మొదటిసారి ఒక హిమాలయన్ స్టడీ టూర్ లో వెళ్ళినప్పుడు దొరికింది. ఇది నా ఫీల్డ్ వర్క్ టాలిస్ మన్ అనుకో. ఇది దగ్గరుంటే ఫీల్డ్ వర్క్ లో ఎలాంటి ఇబ్బందులూ ఉండవని నమ్ముతాను’ అంది.

‘ఇది కూడా నేను కాకూ (చిన్నాన్న) నుంచి నేర్చుకున్న పాఠమే. ఆయన దగ్గర ఒక పీస్ ఆఫ్ రాక్ ఉంటుంది ఎప్పుడూ. అది ఆయన కర్నూలు-కడప బేసిన్ లో పనిచేస్తున్నప్పుడు శ్రీశైలంలో దొరికింది. ప్రి కేంబ్రియన్ కాలానికి చెందిన క్వార్ట్జ్. 70 కోట్ల సంవత్సరాల వయసు వయసు ఉండొచ్చు ఆ రాయికి. దాన్ని ఆయన ప్రాణంలాగా చూసుకుంటాడు. ఎక్కడికివెళ్ళినా కూడా ఉంటుంది. చివరికి కలకత్తాలో ఉన్నప్పుడు కూడా తన బెడ్ రూములోనే పెట్టుకుంటాడు’ అంది.

నేను ఆ వృక్షశిలాజాన్ని మరోసారి నా వేళ్ళతో తడిమి చూసాను. ప్రొఫెసరు నన్ను మొక్కల్తో మాట్లాడటం మొదలుపెట్టమన్నాడు. మొక్కలంటే ఈ వృక్షశిలాజాలు కూడానా? ఎన్నో లక్షల సంవత్సరాల కింద ఏ హిమానీ ప్రవాహాల్లోనో కొట్టుకొచ్చిన ఒక ఆకు ఎక్కడో ఏ జలాశయంకిందనో రాళ్లపొరలమధ్య చిక్కుకుపోయి ఇలా ఘనీభవించింది. ఇప్పుడు నేను దానితో ఏ భాషలో మాట్లాడాలి?

మేము మాట్లాడుకుంటూ ఉండగా రాములమ్మ టీ తీసుకొచ్చింది.

‘మనం ఈవెనింగ్ వాక్ కి వెళ్దామా?’ అనడిగింది వనలత.

నేను ఆ ఊరు వెళ్లిన రెండోరోజు తిరిగిందే తప్ప మళ్ళా ఊళ్ళోగాని, ఊరుబయటగాని నడిచింది లేదు. ఆమె ఈవెనింగ్ వాక్ అనగానే నాకు ఏటి ఒడ్డున యూకలిప్టస్ తోట గుర్తొచ్చింది.

‘నేనో స్పాట్ చూసాను. అక్కడిదాకా వెళ్దామా’ అనడిగాను.

తీరా మేము గది తలుపు దగ్గరకు వేసి బయటికి అడుగుపెట్టబోతుంటే ప్రొఫెసరు కూడా తన గదిలోంచి బయటకి వస్తూ తాను కూడా మాతో పాటు నడుస్తానన్నాడు.

మేము నేరుగా రోడ్డమ్మట ఏటిదాకా వెళ్ళి, అక్కడ రోడ్డు దిగి మట్టిబాటమ్మట ఏటి మలుపు వైపుకు తిరిగాం. ఆ ఏరు చూస్తూనే ప్రొఫెసరు ‘అయ్యో, నేను షూస్ తోనే వచ్చేసేనే? ఇప్పుడెలా’ అన్నాడు.

‘ఆ షూస్ తీసి నాకివ్వండి. ఏరు దాటాక మళ్ళా వేసుకుందురు గాని’ అన్నాను.

ఆయన షూస్ విప్పడమైతే విప్పాడుగాని వాటిని నేను పట్టుకుంటానంటే ఒప్పుకోలేదు.  తనే ఎడమచేత్తో పట్టుకుని ఆ కాలవనీళ్ళల్లో దిగాడు.

‘మరీ లోతుగా లేదు’ అన్నాడు, సులువుగా అడుగుతీసి అడుగు వేస్తూ.

ఏరు దాటి అవతలి వైపు వున్న యూకలిప్టస్ చెట్ల దగ్గరకి నడిచాం. శరత్కాలపు చల్లదనం ఆ చెట్లకింద మామీద ఒక వస్త్రం కప్పినంత దగ్గరగా అనుభవానికొచ్చింది. చెట్ల మీద పూత చివరిరోజుల్లో ఉంది. ఆకులు ముదురు నీలం వన్నె తిరిగి ఇంక పండిపోడానికి సిద్ధమవుతూ ఉన్నాయి. గాలి వీచినప్పుడల్లా ఆ వనం మా మీద సుగంధతైలం స్ప్రే చేస్తున్నట్టుగా ఉంది.

ఆ చెట్ల కిందనే కొద్దిగా సమతలంగానూ పొడిగానూ ఉన్న  చోటు చూసుకుని ప్రొఫెసర్ సేన్ గుప్త చతికిలబడి కూచున్నాడు. నేనూ, వనలతా ఆ తోటలో అటూ ఇటూ పచార్లు చెయ్యడం మొదలుపెట్టాం. సాయంకాలపు బంగారు కాంతి తెల్లటి చెట్ల కాండాల మీద పడుతూ ఉంటే నిలువుటద్దాల మీద పడుతున్నట్టుగా ఉంది. ఇంతలో ఎవరో ఆ కాలవకి అడ్డం పడి వేగంగా మావైపు వస్తూండటం గమనించింది.

మేము ఆ వచ్చేదెవరై ఉండవచ్చునా, ఎందుకొస్తున్నారా అని ఆలోచనలో పడి ఉండగానే మాముందు ఒక యువకుడు ప్రత్యక్షమయ్యాడు.

‘నేను సార్ రాజుని’ అన్నాడు.

మేము గుర్తు తెచ్చుకునేలోపే-

‘ఆ రోజు కలిసాం కదా. టాగోర్ నవల్లో కేరక్టరా మీరు అని అడిగానే ఆ రాజుని’ అన్నాడు.

ఆ రోజు అతణ్ణి కనుచీకటిలో చూసినందువల్ల నిజంగానే గుర్తులేడు. కాని ఇప్పుడు చూస్తుంటే ఆ రోజు కనిపించినట్టే ఈ రోజు కూడా ఆ కళ్ళు షార్ప్ గా కనిపిస్తున్నాయి. షార్ప్ గానే కాదు, ఆ చూపుల్లో ఒక దీప్తి కూడా ఉంది.

అతను నేరుగా ప్రొఫెసరు సేన్ గుప్త కి ఎదురుగా తను కూడా నేలమీద చతికిలపడి కూచున్నాడు.

‘మీరు ఇలా కాలవవైపు నడుస్తుండటం కనబడింది. సాయంకాలం వేళ ఇలా ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాలేదు. అందుకని మిమ్మల్ని ఫాలో అయ్యాను. మీరు ఈవెనింగ్ వాక్ కే కదా వచ్చారు’అన్నాడు.

సేన్ గుప్తా  అతణ్ణి మందహాసంతోనే పలకరించి అవునన్నట్టుగా తలాడించాడు.

‘మీరు మధ్యాహ్నం లంచ్ కి వస్తారనుకున్నాం. ఎందుకు రాలేదు?’ అనడిగాడు అతణ్ణి.

‘లంచ్ నా ? ఎందుకు? ఎక్కడ’ అనడిగాడు రాజు.

సేన్ గుప్తా ఏమీ మాట్లాడలేదు. బహుశా జోసెఫ్ అతనికి ఆహ్వానం పంపించకపోయి ఉండవచ్చు. తాను అనవసరంగా ఆ ప్రస్తావన తెచ్చానా అనుకున్నట్టున్నాడు.

‘ఈ రోజు ప్రొఫెసరుగారు కొత్త కుటీరంలో గృహప్రవేశం చేసారు. అందుకని ఫారెస్ట్ ఆఫీసరుగారు లంచ్ హోస్ట్ చేసారు. బహుశా మిమ్మల్ని పిలిచినట్టు లేదు’ అన్నాన్నేను అతనితో.

‘అలానా! నేను ఊళ్ళో లేను. కాకినాడనుంచి మధ్యాహ్నమే వచ్చాను. అందుకని నాకు తెలియలేదు’ అన్నాడు. ‘గృహప్రవేశమా! ఓ కొత్త కుటీరం కదా! ఫారెస్టరు గారి ఇంటిదగ్గర. కడుతుండగా చూసానులే’ అని కూడా అన్నాడు.

‘మీరు కాకినాడ ఎందుకు వెళ్లారు’ అనడిగాను. ‘ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పనేలేదు’ అని కూడా అన్నాను.

‘నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. మా నాన్నగారు ఇక్కడ రైతు. మాకు ఒక మామిడితోట కూడా ఉంది. కాని ఆయనకి నేను రైతుని కావడం ఇష్టం లేదు. చదువుకోవాలని కోరిక. అందుకని కాకినాడలో చదువుకుంటున్నాను. అక్కడ రూము తీసుకుని ఉంటున్నాను. ఎప్పుడు తోచకపోయినా ఇదిగో ఇలా వచ్చేస్తుంటాను’ అని చెప్పాడు.

ఒక విధంగా ఆ అయిదారువాక్యాల్లో తన మొత్తం బయోడేటా చెప్పేసాడనే అనుకున్నాను. అతను చెప్పిన వివరాల్ని ఇంగ్లిషులోకి అనువదించి సేన్ గుప్తాకి చెప్తుంటే ‘ఓ ఐ యాం సారీ. ఇంగ్లిషులో చెప్పి ఉండాల్సింది. ఇక మీదట ఆ పొరపాటు చెయ్యను’ అని ఇంగ్లిషులోనే చెప్పాడు.

సేన్ గుప్తా మళ్ళా అతణ్ణి చూసి మందహాసం చేసాడు. ఆ పిల్లవాడిలో ఆయన్నేదో మొదటిచూపులోనే ఆకర్షించింది అనుకున్నాను. 

‘బి ఏ లో ఏమిటి సబ్జెక్ట్స్?’ వనలత అడిగింది

‘పొలిటికల్ సైన్స్, ఇకనమిక్స్, హిస్టరీ’

‘ఒరుణిమా! మన శచీంద్ర ది కూడా ఇదే కాంబినేషన్ కదా’ అనడిగాడు సేన్ గుప్త.

‘ఒరుణిమా ఎవరు?’ అనడిగాడు రాజు. శచీంద్ర ఎవరు అని అడగవలసింది మర్చిపోయి.

‘ఒరుణిమా అంటే నేనే’ అంది వనలత నవ్వుతూ.

‘అదేమిటి మీ పేరు వనలత కదా. జీబనానంద దాస్ పొయెంలో కేరక్టరు కదా. జీబనానందదాస్. యామై రైట్?’ అనడిగాడు రాజు.

‘అవును. జీబొనానంద దాస్ నే. ఒరుణిమ కూడా ఆయన పొయెంలో కేరక్టర్ నే’ అంది వనలత మళ్ళా నవ్వుతూ. ఈ సారి ఆమె నవ్వులో చిన్న కొంటెతనం కూడా వచ్చి చేరింది.

‘ఒక మనిషికి రెండు పేర్లా! అది కూడా రెండు కవితలనుంచా! దిస్ మస్ట్ బి ఎ గ్రేట్ లగ్జరీ, ఐ బిలీవ్’ అన్నాడు రాజు.

ఈసారి వనలత వదనంలో నవ్వు అదృశ్యమై గంభీరంగా మారింది. ‘వనలత మా నాన్న పెట్టిన పేరు. కాని మా కాకూ కి నన్ను చూస్తే తాను ఎప్పుడో వదిలిపెట్టిన గ్రామాలు, మర్చిపోయిన గ్రామాలు గుర్తొస్తాయట. జీబొనానంద దాస్ ఒక కవితలో అరుణిమా సన్యాల్ అనే ఆమె గురించి ప్రస్తావిస్తాడు. ఆమెని చూస్తే ఎప్పుడో కనుమరుగైన గ్రామాలు గుర్తొస్తాయంటాడు. అందుకని కాకూ నన్ను ఒరుణిమా అని పిలుస్తుంటాడు’ అంది.

‘కనుమరుగైన గ్రామాలా? ఎందుకు? ఏదైనా ట్రాజెడీ ఉందా మీ జీవితంలో?’

అలా చకచకా నిస్సంకోచంగా ప్రశ్న వెనక ప్రశ్న అడుగుతున్న ఆ పిల్లవాణ్ణి చూసి నాకు ఆశ్చర్యం వేసింది. చూసిన రెండోరోజునో, మూడో రోజునో ఇలా ప్రశ్నలు అడగడం నాకైతే ఊహకి కూడా అందని సంగతి.

కాని సేన్ గుప్త అతడికి జవాబిచ్చాడు.

‘అవును. ఐ యామ్ ఎ విక్టిమ్ ఆఫ్ పార్టిషన్. వుయ్ ఆర్ ఆల్ విక్టిమ్స్ ‘అని వనలతని కూడా చూపిస్తూ, ‘ఇన్నొసెంట్ విక్టిమ్స్ మి మేమంతా’ అని అన్నాడు

అప్పుడు సుదీర్ఘంగానే తన గురించి చెప్పుకొచ్చాడు. ఆయన పుట్టింది తూర్పు బెంగాల్లో. దేశవిభజనలో అది తూర్పుపాకిస్తాన్ గా మారిపోయింది. సేన్ గుప్తల పూర్వీకులు ఆయుర్వేద వైద్యులు. బ్రిటిష్ పాలనా కాలంలో కొందరు సేన్ గుప్తలు రెవల్యూషనరీలుగా కూడా మారారు. సేన్ గుప్త తండ్రి ఒకప్పుడు పెద్ద లాయరు. కానీ సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నప్పుడు తన వృత్తి వదిలిపెట్టేసాడు. ఉన్నాడు జైలుకి కూడా వెళ్ళాడు. అప్పటిదాకా సంపాదించినదాంతోనూ, మిగిలిన ఆస్తిపాస్తులతోనూ కుటుంబం నడుపుకుంటూ ఉండేవాడు. జాతీయ ఉద్యమం ఆ కుటుంబాన్ని దెబ్బ తీయలేదు కానీ పార్టిషన్ పూర్తిగా ధ్వంసం చేసేసింది. దాంతో సేన్ గుప్త తండ్రి తన ఇద్దరు మగపిల్లల్నీ, ఇద్దరు ఆడపిల్లల్నీ తీసుకుని భారతదేశానికి వచ్చేసాడు. అక్కడ తమ ఇల్లు, పొలాలు, బంధువర్గం అన్నీ వదులుకుని వచ్చేసాడు. అప్పటికి సేన్ గుప్త ఢాకాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. వాళ్ళన్నయ్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. కాని పార్టిషన్ లో కట్టుగుడ్డల్తో కలకత్తా వచ్చేసాక సేన్ గుప్త తండ్రి ఆ అనుభవాన్ని తట్టుకోలేకపోయాడు. వచ్చిన కొన్నాళ్ళకే మరణించాడు. సేన్ గుప్త అన్నయ్య కలకత్తాలో చిన్న ఉద్యోగంలో చేరి తమ్ముణ్ణి చదివించాడు. చెల్లెళ్ళకు పెళ్ళిళ్లు చేసాడు. తల్లిని దగ్గరపెట్టుకుని చివరిదాకా ఆమెకు సేవచేసాడు. సేన్ గుప్తాకి లెక్చెరర్ ఉద్యోగం దొరికాక అన్నయ్యకు తోడుగా నిలబడ్డాడు. ఆ కుటుంబాలు మళ్ళా ఆర్థికంగా నిలబడ్డాయి. సేన్ గుప్త కి తన అన్నయ్య అంటే తండ్రితో సమానం. అపారమైన గౌరవం. తమ కుటుంబాలను నిలబెట్టాడని చెప్పలేనంత కృతజ్ఞతా భావం’

‘కాని నేను నా పుట్టిన ఊరికి మళ్ళా వెళ్ళలేకపోయాను. నా తండ్రిని తీసుకువెళ్ళలేకపోయాను. జీవితమంతా ఈ లోటు నన్ను వెంటాడుతూనే ఉంటుంది’ అన్నాడు సేన్ గుప్తా.

‘ఎందుకు? బంగ్లాదేశ్ వెళ్ళడం కష్టమేమీ కాదు కదా?’ అనడిగాడు రాజు. నాక్కూడా అదే ప్రశ్న నోటిలో ఆడుతూ ఉంది.

‘అవును. వెళ్లగలను. ఢాకా యూనివెర్సిటీనుంచి కూడా చాలా సార్లు పిలిచారు. కాని, వెళ్లలేదు’ అన్నాడు ఆయన. తన ఎదట రాలి పడి ఉన్న యూకలిప్టస్ ఆకునొకటి చేతుల్లోకి తీసుకుని దాన్ని ఒక పక్షిరెక్కను తడిమినట్టు ఆప్యాయంగా తడిమాడు.

‘అవును వెళ్ళలేదు. ఎందుకంటే?-‘

‘వెళ్ళలేను కాబట్టి’ అన్నాడు.

‘ఎప్పటికీ వెళ్ళలేను కాబట్టి’ అని అన్నాడు మరోసారి. ఈసారి ఆ కంఠం చాలా బలహీనంగా ఉంది. మరోక్షణం ఆగితే ఆయన భోరున ఏడుస్తాడేమో అనిపించింది. కాని తనను తాను సంబాళించుకున్నాడు.

‘ఒరుణిమా, నాకేదైనా ఒక గీతం వినాలని ఉంది’ అన్నాడు.

‘వనలత పాటలు పాడుతుందా?’ ఆశ్చర్యపోయి పైకే అడిగేసాను.

వనలత చిరునవ్వి, గొంతు సవరించుకుంది.

‘షల్ ఐ సింగ్ ఏ ఉదాసీ హవార్?’ అనడిగింది ఆయన్ని.

ఆ పాట వినగానే ఆయన కళ్ళల్లో ఒక మెరుపు కనబడింది. కాని అది సంతోషపు మిలమిల కాదు. ఏదో జీర. ఎప్పటివో అనుభవాలు నిన్ను ఎప్పటికీ వదలవని తెలిన ఒక ఎరుకతో వచ్చే జీర. కాని నిన్ను వదిలిపెట్టని నీ బాధ ఒక్కటే నీ నిజమైన తోడు అని తెలియడంలోని సంతోషం కూడా ఉంది ఆ మెరుపులో.

‘యే ఉదాసీ హవార్ పొథే పొథే.. పాడు ఒరుణిమా, పాడు, ప్లీజ్’ అని అన్నాడు ఆయన ఆర్తిగా, బేలగా, లాలనగా.

వనలత పాడటం మొదలుపెట్టింది.

‘యే ఉదాసీ హవార్ పొథే పొథే..’

ఆయన వెంటనే ఆమెని ఆపాడు. మాతో ‘చూడండి. ఆ ఉదాసీ హవా. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఉదాసీ అంటే-‘ అని దానికి తగ్గ ఇంగ్లిషు పదం కోసం వెతుక్కున్నాడు. స్ఫురించలేదు.

‘ఉదాసీ హవార్- సుచిత్రా మిత్రా గొంతులో వినాలి ఆ పదం. ఆ మాటే చెప్పాను ఆమెకి. సముద్రమంత శూన్యం ఆ ఒక్కపదంలో ఇమిడ్చిపెట్టాడు గురుదేవ్. ఆ బరువు అందరూ తేలిగ్గా మొయ్యగలిగేది కాదు. ఐ యాం సారీ, ఒరుణిమా గో ఆన్’ అని అన్నాడు.

‘యే ఉదాసీ హవార్ పొథే పొథే..’

వనలత పాట మొదలుపెట్టింది. ఆమె గొంతులో ఏమి తియ్యదనమో గాని, యూకలిప్టస్ గాలి దానిముందు తేలిపోయింది.

ఏ ఉదాసీ హవార్ పొథే పొథే
ముకుల్ గులి ఝొరే
అమి కుడియె నియేచ్ఛి
తొమార్ చొరొణె దియేచ్ఛి
లాహో లాహో  కొరునో కొరె

(ఈ ఉదాసీన పవన పథంలో మొగ్గలు వాడిరాలిపోతున్నాయి. నీకు సమర్పించడానికి ఏరితెచ్చుకున్నాను ఈ పూలని, ప్రభూ, కరుణతో స్వీకరించు)

ఆమె ఆ పల్లవి వెంట ఒక చరణం ఆలపించింది. ఆ చరణం తరువాత మరొక చరణం-

జాఖోన్ జాబొ చోలే ఒరా ఫూట్బే తొమార్ కొలే
తోమార్ మాలా ఘటార్ అంగుల్ గులి మొధురొ బేదొనొభొరే
జెనో అమాయ్ స్మొరొణొ కరే

( నేను సెలవుతీసుకున్న తరువాత అవి నీ ఒడిలో విప్పారతాయి. అప్పుడు వాటిని మాలగా అల్లుతున్న నీ అంగుళులు నా మధురవేదనని ఇంచుక స్మరించాలని నా కోరిక)

బోకథాకావ్ తోంద్ర హరా బిఫోలో బథాయ్ డాక్ దియే హోయ్ షొరా
ఆజ్ బిభొరొ రాతే

(నిద్రకరువైన కోకిల తన విఫల వ్యథతో ఈ రాత్రంతా పాడుతూనే ఉంటుంది)

దుజొనేర్ కనాకని కొథా దుజొనేర్ మిలొనొబిహ్వలతా
జ్యోత్స్నాధరాయ్ జాయ్ భీసే జాయ్ దొలేర్ పూర్ణిమతే
ఏ ఆభాస్ గులి పోడ్బే మాలొయ్ గథా కాల్ కే దినేర్ తోరే తోమార్
అలొసొ దిప్రోహరె

(మన గుసగుసలు, మన సమ్మోహభరిత సంగమం తొలివసంత జ్యోత్స్నలో కొట్టుకుపోతాయి.  రేపటి నీ సోమరి మధ్యాహ్నానికి మాలగా గుచ్చిన స్మృతులు మాత్రమే మిగుల్తాయి)

ఆమె పాడుతున్నంతసేపూ ఆ యేరు, ఆ చెట్లు, ఆ పొలాలు అన్నీ ఆగిపోయి వింటున్నట్టే ఉన్నాయి. ఆ గీతంలో విషాదం లేదు. జీవితం పట్ల అంగీకారం ఉంది. ఈశ్వరుడి చరణాల ముందు తాను సమర్పించగలిగింది తన వేదనని మాత్రమే అనే ఒక నిర్లిప్త ఆరాధన ఉంది. ఆమె పాడటం ముగించేటప్పటికి ఎక్కడో పద్మానదిమీంచి వీచిన గాలి ఆ ఊరిచివర ఏటిదాకా ప్రసరించిందనిపించింది.

మా మధ్య నిశ్శబ్దం అలముకుంది.

‘కమాన్ లెట్ అజ్ మేక్ ఎ మూవ్ ‘అన్నాడు సేన్ గుప్త అందరికన్నా ముందు తానే లేస్తూ.

మేము కూడా లేచి ఆయన్ని అనుసరించాం.

ఏరు దాటి మళ్ళా మట్టిబాటవెంబడి రోడ్డుమీద అడుగుపెట్టేసరికి ఆకాశంలో నెలవంక. ఇంకా అరుణిమ చెరిగిపోని ఆ సాంధ్యగగనం మీద ఆ నెలబాలుడు కూడా ఆ పాట వినడానికి ఆకాశంలో అడుగుపెట్టాడా అనిపించింది.

‘గురుదేవుల గీతం ఏది విన్నా నన్ను నేను నిగ్రహించుకోవడం కష్టమైపోతుంది’ అని అన్నాడు సేన్ గుప్త. ‘ఆయన ఎంత ఆనందం చూసాడో అంత దుఃఖం కూడా చూసాడు. గురుదేవులు రాసినంత విస్తారంగా రాయలేదుగాని జీవన్ బాబులో కూడా ఆ వెలుగూ, చీకటీ అంత ఇంటెన్స్ గానూ కనిపిస్తాయి’అని అన్నాడు.

‘జీవనానందబాబుది బారిసాల్. మాకులానే ఆయన కూడా కొన్నాళ్ళు ఢాకాలో, ఆ తర్వాత చాలాకాలం కలకత్తాలో గడిపాడు. గురుదేవుల్లానే జీవన్ బాబు కూడా అవిభక్త బెంగాల్ సౌందర్యానికి వారసుడు. ఆ నదులు, ఆ పొలాలు, ఆ పడవలు, ఆ కొంగలు, ఆ రెల్లుపూలు, ఆ రావిచెట్లు, ఆ బుల్బుల్ పిట్టలు-టాగోర్, జీవన్ బాబు- వీళ్ళిద్దరిలోనే నేను నా బెంగాల్ ని చూసుకుంటూ ఉంటాను’ అని అన్నాడు.

ఆ సాయంసంధ్యవేళ ఆ కొండప్రాంతంలో ఆ ఏటి ఒడ్డున ఆ తండ్రీ కూతుళ్ళతో నడుస్తూ, ఆయన టాగోర్ గురించీ, జీవనానంద దాస్ గురించీ చెప్తో ఉంటే, ఆ మాటలు వింటూ వాళ్లతో పాటు కలిసి నడిచిన ఆ సమయం నేనెప్పటికీ మర్చిపోలేను.

‘మీకో సంగతి చెప్పనా! మనిషి ఎక్కడికి వెళ్ళినా తనదంటూ ఒక చిన్న ప్రపంచాన్ని తన వెంటపెట్టుకునే వెళతాడు. ఆ ప్రపంచాన్ని తాను పోగొట్టుకున్నాడని అనుకుంటాడుగానీ అది ఎక్కడికీ పోదు. అతనిలోనే ఉంటుంది. ఆ మనిషేగనుక ఒక కవినో, గాయకుడో చిత్రకారుడో అయితే అతడు ఎవరిని కలిస్తే వాళ్ళకి కూడా ఆ ప్రపంచాన్ని ఇంత తుంచి పంచిపెడతాడు. గురుదేవులు జీవించినంతకాలం చేసింది ఆ పనే. జీవన్ బాబు కలకత్తా వచ్చినా కూడా తన బారిసాల్ నీ, తన కీర్తనకోలా, తన ధనశ్రీ నదుల్నీ, ఆ పలాశ వృక్షాల్నీ, ఆ పంటపొలాల్నీ వెంట పెట్టుకునే వచ్చాడు. ఏ పొలిటికల్ పార్టిషన్ కూడా బ్రేక్ చెయ్యలేని దేశం అతనిది. నాకు మా ఊరు చూడాలనిపించినప్పుడల్లా ఒక బావుల్ గీతాన్నో, ఒక జీవన్ బాబు కవితనో, గురుదేవులు రాసిన కథనో ఆశ్రయిస్తాను. వాటిని నానుంచి ఎవరూ తీసుకుపోలేరనిపిస్తుంది. ఆ గ్రామాలు నిజంగా కనుమరుగైపోయాయా అని అనుమానం వస్తే, ఇదుగో, మా ఒరుణిమ నా కళ్ళముందే కదుల్తూ అవెక్కడికీ పోలేదని గుర్తుచేస్తూనే ఉంటుంది ‘అని కూడా అన్నాడు.

ఆయనతో నడుస్తూ ఆ మాటలు వింటూండగా నాకు మొదటిసారిగా నా జీవితం నా ఇల్లు, నా కుటుంబం అనే సరిహద్దుల్ని దాటి రెండుదేశాలమేరకు విస్తరించింది అనిపించింది. ఇదుగో నా పక్కన ఒక మానవుడున్నాడు, ఇతడి వెనక నదులున్నాయి, కొండలున్నాయి, మహాకవులున్నారు అని నాకు నేను చెప్పుకున్నాను. నా హృదయం గొప్ప కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. దాన్ని ఎలా ప్రకటించాలో తెలీక నా పక్కనే నడుస్తున్న వనలత చేయి నా చేతుల్లోకి తీసుకుని ప్రేమగా, మృదువుగా నొక్కాను.

మేము ఊరిమధ్యకు చేరుకున్నాక, ఇక నేను మా ఇంటికి వెళ్తానని సెలవు తీసుకున్నాను. వారిద్దరూ ముందుకు నడిచారు. రాజు వాళ్ళతో వెళ్ళబోయినవాడల్లా ఆగి నాతో పాటు మా వీథిలో అడుగుపెట్టాడు. అతను మా ఇంటికి వస్తాడా అనుకున్నాను. రమ్మని పిలవాలా వద్దా తేల్చుకోలేకపోయాను. కాని అతను నాతో మరేమీ మాటలు పొడిగించలేదు. నేను మా ఇంటిముందు ఆగగానే తాను ‘వస్తానండీ, గుడ్ నైట్’ అని వెనక్కి తిరిగాడు. బహుశా ఆ నాలుగడుగులూ నాతో కలిసి నడవడం కోసమే అతను మా ఇంటిదాకా వచ్చాడనుకున్నాను.

నేను ఇంట్లో అడుగుపెట్టగానే మా పిన్నిగారు ఆ ఇంటి వాకిట్లో కనబడింది. ఆమె అప్పటికే నన్ను చూస్తూ ఉన్నదని నాకు అర్థమయింది. ఆ కంచె మీంచి ఆమె చూపులకి మేము రోడ్డుమీద నడుస్తూండటం, రాజు నాతో పాటు వీథిలో అడుగుపెట్టి ఇంటిదాకా నాతో కలిసి అడుగులు వెయ్యడం కనిపిస్తూనే ఉందని నాకు అర్థమయింది.

నన్ను చూస్తూనే ఆమె ‘వాడితో మాట్లాడకు. వాడో మెంటల్’ అంది.

మెంటల్?

ఎందుకు,  ఏమిటి అని అడగాలనిపించింది. కాని అడగలేదు. ఎందుకో నేనతనితో కలిసి ఆ నాలుగడుగులు నడిచి ఉండవలసింది కాదనిపించింది. కాని ఆ సాయంకాలం వరసగా జరిగిన ఆ సంఘటనల్లో నేను కోరుకుంటే  జరిగింది ఏముంది?

5-4-2023

19 Replies to “ఆ వెన్నెల రాత్రులు-5”

 1. ఒక హృద్యమైన అనుభవాన్ని మాకూ కలుగజేస్తున్నందుకు మీకు మిక్కిలి ధన్యవాదాలు.

 2. మీ ప్రపంచాన్ని మాకు కాస్త తుంచి పెడుతున్నందుకు ధన్యవాదాలు, సర్! 🙏🏽

 3. ఇవాళ ఓ కొత్త లోకానికి తీసుకుని పోయారు. ఏ ” యే ఉదాసీ హవార్ పొథే పొథే..” ఇవాళ రోజంతా వినిపిస్తూ ఉంటుంది. నిజం.. వింటూ ఉన్నట్టే ఉంది. ధన్యవాదాలండీ.

   1. అడగకుండా కురిసిన వెన్నెల…

 4. ఎప్పటివో అనుభవాలు నిన్ను ఎప్పటికీ వదలవని తెలిన ఒక ఎరుకతో వచ్చే జీర. కాని నిన్ను వదిలిపెట్టని నీ బాధ ఒక్కటే నీ నిజమైన తోడు అని తెలియడంలోని సంతోషం కూడా ఉంది ఆ మెరుపులో…
  బాధే సౌఖ్యమనే భావన రానీవొయ్..కనుగొంటే సత్యమింతేనోయీ.. మహాత్ముడు సముద్రాల సీనియర్ గారు వంగదేశపు ఆత్మను ఒడిసిపట్టి రాశారు అంటారు .బహుశా ఈ ఎపిసోడ్ చదివాక బెంగాలీ సాహిత్యం తప్పకుండా విస్తృతంగా చదవాలి అనిపిస్తోంది సర్..
  జీవితంతో ముడిపడిన అనుభవాలు , మేలిపెట్టే జ్ఞాపకాలు మనిషికి అదృశ్య నేస్తాలు. జీవన సందోహానికి ఆవల దొరికే నిశీధి ఏకాంతం పురాస్మృతుల వనాల నీడన సేదతీరుస్తూ తప్త శాంతి ప్రసాదిస్తుంది..

  ధన్యవాదాలు సర్..

 5. నాలుగైదు దశాబ్దాల తరువాత మళ్లీ బెంగాలీ నవలలు చదివిన రోజులు గుర్తుకు వచ్చాయి.శరత్ ,బంకిం, టాగోర్ అందరూ వీపు తట్టిన ఫీలింగ్. అప్పట్లో చదివిన యువ పుస్తకాల ముఖ చిత్రాలు
  నవలల రూపాలు అన్నీ కళ్లముందు కదలాడాయి.

 6. మీ శైలికి ప్రణామ సహస్రాలు..

 7. ఇలాంటి సాయంకాలాలే కదా జీవితాంతం మనకు తోడుండేవి .

 8. “ఆ గీతంలో విషాదం లేదు. జీవితం పట్ల అంగీకారం ఉంది. ఈశ్వరుడి చరణాల ముందు తాను సమర్పించగలిగింది తన వేదనని మాత్రమే అనే ఒక నిర్లిప్త ఆరాధన ఉంది!”

  సర్…ఒక తడి గీతం తాలూకు మధుర వేదన, సంవేదన గా మారిన వైనం.

  ప్రతి మాటా ఆసక్తికరం!

 9. అవును వెళ్ళలేదు. ఎందుకంటే?-‘

  ‘వెళ్ళలేను కాబట్టి’ అన్నాడు.

  ‘ఎప్పటికీ వెళ్ళలేను కాబట్టి’
  ఈ మాటలు నాకు సాంత్వన నిచ్చాయి.. నేను ఖాళీ చేసి వచ్చిన ఇళ్లను తిరిగి చూడాలని, ఆ మనుషులతో మాట్లాడాలని ఉంటుంది కానీ, వెళ్లలేను

Leave a Reply

%d bloggers like this: