ఆ వెన్నెల రాత్రులు-4

Image design: Mallika Pulagurtha

ఆ తర్వాత రెండుమూడు రోజుల్లో జోసెఫ్ గారు మా టీముకి కావలసిన ఏర్పాట్లు మొత్తం చేసిపెట్టారు. ఒక జీపు సేన్ గుప్త విశాఖపట్టణంలోనే కిరాయికి మాట్లాడి తెచ్చుకున్నారు. ఆ జీపు డ్రైవరు రాంబాబుది అనకాపల్లి. జీపుకి అతనే ఓనర్ కం డ్రైవర్. పాతికేళ్ళ కుర్రవాడు. ఇంకా పెళ్ళికాలేదు. కాబట్టే ఎన్ని నెలలైనా ఇక్కడ ఈ బృందంతో పనిచెయ్యడంకోసం సిద్ధపడి వచ్చాడు. ఇక్కడ వాళ్ళకి ఒక వంటమనిషిని, తోడుగా పనులు చేసిపెట్టడానికి మరొక మనిషిని జోసెఫ్ మాట్లాడిపెట్టాడు. ఆ వంటమనిషి రాజుల కుటుంబాలకు చెందిన నడివయసు స్త్రీ. ఆమె పేరు అప్పలకొండమ్మ. ఆ పనిమనిషి గిరిజన మహిళ. ఆమె పేరు రాములమ్మ. రోజూ ఫీల్డ్ వర్క్ లో సాయం చెయ్యడానికీ, రాళ్ళు సాంపిల్స్ కలెక్ట్ చేసాక వాటిని కేంపుకి తీసుకొచ్చి అక్కణ్ణుంచి ట్రాన్స్ పోర్ట్ లో పంపడానికీ, అలాగే రోజూ అడవికి, కొండకీ వెళ్ళినప్పుడు అక్కడ జంగిల్ క్లియరెన్స్ కీ, దారి చూపించడానికి కూడా ఫారెస్టు ఆఫీసరు మనుషుల్ని మాట్లాడిపెట్టాడు. వాళ్ళని అజమాయిషీ చెయ్యడానికీ, సేన్ గుప్తా ఇచ్చే ఆదేశాల ప్రకారం ఎప్పటికప్పుడు పనులు చేయిస్తూ ఉండటానికి దేవయ్య అనే మనిషిని కూడా మాట్లాడిపెట్టాడు.

రెండు మూడురోజుల్లోనే పెద్ద కేంపు తయారయ్యింది. ఈ లోగా సేన్ గుప్త ఒకటి రెండు సార్లు తాను పని ఎక్కడనుంచి మొదలుపెట్టాలో ఫీల్డ్ సర్వే చేసుకుని వచ్చాడు. తన దగ్గర ఉన్న టోపో షీట్ల ప్రకారం, ఫారెస్టు ఆఫీసరు ఇచ్చిన సమాచారాన్ని పోల్చుకుంటూ గంగన్న పాకలు అనే రిజర్వ్ ఫారెస్ట్ ని ఆనుకుని ఉన్న పనసమామిడి కొండ ని మొదటి దశలో స్టడీకోసం ఎంచుకున్నాడు. మేముంటున్న ఊరునుంచి ఆ కొండ అయిదారుకిలోమీటర్ల దూరంలో లోపలకీ ఉంటుంది. మధ్యలో మడేరు అనే పెద్ద కొండవాగు దాటాలి. తారురోడ్డుగాని, మట్టిబాటగాని లేకపోయినా జీపు పోడానికి అనుకూలంగానే ఉందన్నాడు ప్రొఫెసరు.

అన్ని ఏర్పాట్లూ పూర్తిగా చూసుకున్నాక ఆయన ఒక రోజు మా అందర్నీ కూచోబెట్టి మేము చెయ్యాల్సిన పని వివరించాడు. ఆయన దగ్గర ఉన్న టోపో షీటులో 500 మీటర్ల చొప్పున ఒక గ్రిడ్ తయారుచేసుకున్నాడు. ప్రతి రోజూ పొద్దున్నే ఏడింటికి బ్రేక్ ఫాస్ట్ చేసి ఏడున్నరకల్లా జీపు ఎక్కాలి. ఎనిమిదింటికి సైట్ దగ్గర ఉండాలి. అప్పణ్ణుంచి ఒంటిగంటదాకా తాను ఎంపికచేసిన గ్రిడ్ ని అనుసరిస్తూ పని చెయ్యాలి. పని అంటే ఆయన ఆ కొండ తాలూకు రాళ్ళనీ, ఔట్ క్రాప్స్ నీ, ఫోల్డ్స్ నీ, ఫాల్ట్స్ నీ చూసుకుంటూ మాపు చేసుకుంటూ వెళ్తాడు. ఆయన మార్కు చేసుకుంటూ వెళ్ళిన దారిపొడుగునా ఆసక్తికరంగానూ, మరింత లోతుగా పరిశీలించదగ్గవిగానూ అనిపించిన రాక్స్ ని వనలత మరింత దగ్గరగా, మరింత వివరంగా పరిశీలించాలి. వాటిని మరిన్ని టెస్టులకీ, అనాలసిస్ కీ పంపడానికి సాంపిల్స్ కట్ చెయ్యాలి. నేను వారిద్దరి వెనకా, ఆ మార్క్ చేసిన దారిపొడుగునా ఉన్న ఫ్లోరాని గుర్తుపట్టాలి. వాటిని మాపు మీద మార్క్ చెయ్యాలి. చిన్న చిన్న మొక్కలూ, మూలికలూ, ఫెర్న్ లూ లాంటివయితే సాంపిల్స్ సేకరించాలి. చెట్లైతే వాటి గుర్తులు పెట్టుకోవాలి. సైంటిఫిక్ నేమ్స్ రాసుకోవాలి. రేర్ స్పీషిస్ అయితే వాటివి కూడా ఆకులు, పాండ్స్, ఫ్రూట్ శాంపిల్స్ సేకరించాలి.

ఒంటిగంటకి పని ముగించాక మళ్ళా ఇంటికి వచ్చేటప్పటికి రెండవుతుంది. లంచ్. ఆ తర్వాత రెండు మూడు గంటల పాటు విశ్రాంతి. పొద్దున్న చూసిన రాళ్ళమీదా, మొక్కలమీదా, తక్కిన ఆసక్తికరమైన అంశాల మీదా రోజూ సాయంకాలం డిస్కషన్ ఉంటుంది.

మా టీములో ఒక యాంత్రొపాలజిస్టు కూడా రావలసి ఉంది. అతనితో పాటు ఒక  పాలియాంటాలజిస్టు కూడా వస్తే బాగుణ్ణని  సేన్ గుప్తా అనుకోవడంతో వాళ్ళు మార్చి నెలాఖరుకి గాని మాతో చేరే అవకాశం లేదని తెలిసింది. అప్పటిదాకా అయిదు నెలల పాటు మేము ముగ్గురమే, అంటే ప్రొఫెసరు, వనలత, నేనే మొత్తం పరిశోధకబృందం అన్నమాట.

తీరా ఫీల్డ్ వర్క్ మొదలైన మొదటిరోజున నేను విలేజి చావడికి వెళ్ళి సేన్ గుప్తాకి గుడ్ మార్నింగ్ చెప్పగానే ఆయన నన్ను ఎగాదిగా చూసాడు. ఎందుకలా చూస్తున్నాడో అర్థం కాలేదు. మమ్మల్ని చూసి వనలత బయటికి వచ్చాక నేను చేసిన పొరపాటు నాకు అర్థమయింది. పాంటూ, షర్టూ వేసుకుని ఫీల్డ్ కి వెళ్ళడంలో ఉన్న సౌకర్యం చీరకట్టుకుని పోవడంలో లేదని గ్రహించాను. కాని ఏమి చెయ్యను? ప్రొఫెసరు నాకు ముందే చెప్పి ఉండవలసింది.

ప్రొఫెసరుకి నా పరిస్థితి అర్థమయింది.

‘నీకు పంజాబీ డ్రెస్ లాంటిది ఒక్క జత కూడా లేదా?’ అనడిగాడు. నా సూట్ కేసులో ఒకటి ఉందని గుర్తొచ్చింది. అది కూడా మా చెల్లెలిది. నేను బయల్దేరేముందు చివరినిమిషంలో రజని దాన్ని నా సూట్ కేసులో కుక్కిపెట్టడం గుర్తొచ్చింది.

ఉందని చెప్పాను. వెంటనే వెనక్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాను. ఈలోపు ప్రొఫెసరు ఫారెస్టు ఆఫీసరుని పిలిచి నాకు అర్జంటుగా అరడజను డ్రెస్ లు కుట్టించిపెట్టే ఏర్పాటు చెయ్యమని చెప్పాడు.

మేము ఫీల్డ్ స్టడీకి వెళ్ళిన ఆ మొదటిరోజు నేనెప్పటికీ మర్చిపోలేను. జీపులో ముందుసీటులో ప్రొఫెసరు కూచున్నాడు. వెనక ఒక వైపు వనలత, నేనూ కూచున్నాము. మరొక వైపు దేవయ్య కూచున్నాడు. మాతో పాటు పెద్ద బాగునిండా చిన్నవీ పెద్దవీ సుత్తులు, రాక్ పిక్స్, చిజెల్స్, గ్లోవ్స్, కళ్ళద్దాలు, రెండుమూడు రకాల షూస్, హాండ్ టవల్స్, రోప్స్, టేప్స్, బేసిన్స్ లాంటివన్నీ పట్టుకు బయల్దేరాం. వనలత చేతుల్లో నల్లని వెల్వెట్ పౌచ్ లో జియాలజిస్టు కంపాస్ ఉంది. ఆమె మెడలో బైనాకులర్స్ వేలాడుతున్నాయి. ఆమె ఒళ్ళో ఒక నోట్ పాడ్ ఉంది. దానికి ఒక రబ్బరు బాండు చుట్టి ఉంది.

నేను కూడా జీపు ఎక్కి ఆమె పక్కన కూచోగానే ఆమె మా పక్కనున్న బాగులోంచి ఒక నోట్ పాడు, పెన్ను తీసి నాచేతుల్లో పెట్టింది. ఆ నోటు పాడ్ చిన్నప్పుడు స్కూల్లో ప్రాక్టికల్స్ రాసుకోడానికి వాడుకునే వన్ సైడ్ రూల్డ్ నోట్ బుక్. కుడివైపు రూళ్ళూ, ఎడమవైపు తెల్లకాగితం. ఆమె నా చేతుల్లో ఆ నోట్ బుక్కు పెట్టగానే నాకు మళ్ళా అక్షరాభ్యాసం మొదలైనట్టుగా, నేను ఆ రోజే కొత్తగా బళ్ళో చేరినట్టుగా అనిపించింది.

మేము వర్క్ సైట్ కి చేరుకోగానే అందరం జీపు దిగ్గానే ప్రొఫెసరు సేన్ గుప్త అతి ప్రయత్నం మీద మోకాళ్ళమీద ముందుకు వాలి మా ఎదురుగా ఉన్న కొండకి నమస్కారం పెట్టాడు. కొంతసేపు కళ్ళుమూసుకుని ఏదో ధ్యానిస్తున్నట్టుగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు.

దేవయ్య అప్పటికే పురమాయించిన మనుషులు అయిదారుమంది అక్కడ సిద్ధంగా మాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అక్కడంతా బాగా తుప్పలు, పొదలు అల్లిబిల్లిగా అల్లుకుపోయి ఉన్నాయి. ప్రొఫెసరు తన భుజాన ఉన్న సంచిలోంచి టోపో షీట్ తెరిచాడు. ఆ రోజు మేము చూడవలసిన గ్రిడ్ ను కొంతసేపు పరిశీలనగా చూసాడు. మా నడక ఎటునుంచి మొదలుపెట్టబోతున్నామో దేవయ్యకు చేత్తో చూపించాడు. అప్పుడు మా వైపు తిరిగి

‘కమ్ లెట్ అజ్ ఓరియెంట్ అవర్ ట్రాన్సెక్ట్ వాక్ ఫ్రమ్ దిస్ సైడ్’ అన్నాడు.

నేనెప్పుడూ కొండల్ని దగ్గరనుంచి చూసింది లేదు. అడవిలో అడుగుపెట్టిందీ లేదు. ఊళ్ళో సూర్యోదయం అయినప్పటికీ అడవిలో ఇంకా సూర్యుడు కొండలమీదకి ఎక్కలేదు. అక్కడ అప్పుడప్పుడే తెల్లవారుతున్నట్టుగా ఉంది. ఆ పొద్దుటి పూట అడవి అంతా పసరు వాసన వేస్తూ ఉంది. మా ఎదురుగా ఉన్న కొండ ఒక్కటి కాదు, ఒకదానికొకటి అల్లుకుని భుజం భుజం పట్టుకుని నిలబడ్డట్టుగా ఒక కొండల వరస ఉంది.

ఇప్పుడు మేము ఆ కొండలు ఎక్కాలా అనుకున్నాను. వనలత కంపాస్ తెరిచి దిక్కులు స్టడీ చేస్తూ ఉంది. ప్రొఫెసరు నాలుగైదు అడుగులు ముందుకు వేసి నన్ను దగ్గరకు పిలిచాడు.

‘ఇవి ఏ అడవులో చెప్పగలవా?’ అనడిగాడు.

నాకు అడవులు రెండు రకాలన్న విషయం గుర్తుంది. ‘ఇవి ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్స్ కదా’ అన్నాను.

ఆయన చిరునవ్వుతో తలూపాడు. ముందు ఉద్యోగం ఇచ్చి ఆ తరువాత ఇంటర్వ్యూ చేసాడన్నమాట అనుకున్నాను.

‘యెస్. దీజ్ ఆర్ డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్స్’ అన్నాడాయన. ‘కాని ఈ ప్రాంతంలో అక్కడక్కడా మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. నీకు తెలుసా, పాచెస్ ఆఫ్ సవానా కూడా ఉంటాయి’ అని అన్నాడు.

సవానా అంటే గడ్డిభూములని గుర్తుంది. అవి ఎక్కడో ఆఫ్రికాలో కదా ఉంటాయి అనుకున్నాను.

‘వెయ్యీ పదిహేనువందల అడుగుల ఎత్తులో కొండలమీద మరీ ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నచోట ఇక్కడ కూడా సవానా టైప్ ఫారెస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు కాదు గానీ, తర్వాత ఎప్పుడేనా కొండ ఎక్కినప్పుడు చూద్దాం’ అన్నాడు.

మొదటిసారి చూసినప్పుడు నన్ను పలకరించడానికి లేచినిల్చున్నప్పుడు తొట్రుపడ్డ స్థూలకాయం కాస్తా అడవిలో ఆ కొండ దగ్గరకు వెళ్ళేటప్పటికి తేలికపాటి దేహంగా మారిపోయినట్టుంది. ఆయన చకచకా అడుగులు వేస్తూ ముందుకు నడుస్తున్నాడు. మిలటరీ వాళ్ళు వేసుకునేలాంటి ఆయన కాన్వాసు షూస్ తపతప చప్పుడు చేస్తున్నాయి.

‘ఒరూ, లెట్ అజ్ మూవ్ దిస్ సైడ్’ అన్నాడు ఆయన వనలతతో. అక్కడ కొండ వాలు పైకి ఎక్కడానికి అనువుగా ఉంది. మేము కొంత దూరంపాటు ఆ వాలమ్మటే కొండ ఎక్కాక అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళతో పాటు కొండ ముందుకు పొడుచుకు వచ్చినట్టుగా ఉన్నచోట ఆయన ఆగాడు.

‘సీ దిస్ ఔట్ క్రాప్’ అన్నాడు. దాని దగ్గరకు వెళ్ళాడు. ముందు చేత్తో ఆ రాయిపైన ఆప్యాయంగా తడిమాడు. వేలితో ఆ రాతి అంచుల్లో గీతల్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసాడు. రెండుమూడు సార్లు ఆ రాతికి దగ్గరగా ముఖం పెట్టి అక్కడేవో అక్షరాలు రాసి ఉన్నట్టుగా, వాటిని చదవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కళ్ళు చికిలించి చూసాడు.

‘దేవయ్యా, కమాన్, గివ్ మీ మై హేమర్’ అన్నాడు.

దేవయ్య వెనగ్గా ఒకతను మా బాగు మోసుకుంటూ వస్తున్నాడు. అతణ్ణి ముందుకు రమ్మని పిలిచి ఆ బాగు తెరిచి ప్రొఫెసరు చిన్నపాటి హేమర్ ఒకటి బయటికి తీసాడు. ఆ సుత్తితో ఆ రాతిమీద మూడు సార్లు చిన్నగా తాటించాడు. మళ్లా నేనెక్కడున్నానో అని అటూ ఇటూ వెతుక్కుని నాకేసి చూసి ‘డు యు నో? ద రాక్స్ స్పీక్ టు అజ్’ అన్నాడు. ‘ఇప్పుడు నేను వాటిని పర్మిషన్ అడిగాను. పని మొదలుపెడతామనీ, కొన్ని సాంపిల్స్ కోసం అక్కడక్కడా రాళ్ళు ముక్కలు చేసుకుంటామనీ అడిగాను. ద రాక్స్ గేవ్ దైర్ అసెంట్!’ అన్నాడు.

అదంతా నాకొక సైంటిఫిక్ స్టడీ కన్నా కూడా ఒక రిచ్యువల్ లాగా అనిపించింది. నాముందొక పురాతన మానవుడు తొలిరోజుల్లో చెట్లు నరికేముందు, వేటకి బాణం సంధించే ముందు ప్రకృతిని వేడుకున్నట్టుగా ఆయన ఆ కొండల్నీ, ఆ రాళ్ళనీ ప్రార్థిస్తున్నట్టుగా అనిపించింది. నాకు తెలీకుండానే నాలో ఏదో గంభీరభావన ఉదయించింది. ఆ క్షణాన ఆయన రామలక్ష్మణుల్ని వెంటబెట్టుకుని అడవిలో నడుస్తున్న విశ్వామిత్రుడిలాగా అనిపించాడు.

నన్నూ, వనలతనీ కళ్ళద్దాలు పెట్టుకొమ్మని చెప్పి, తాను కూడా జేబులోంచి కళ్ళద్దాలు తీసుకుని పెట్టుకున్నాడు. అవి సాధారణంగా మోటారు సైక్లిస్టులు పెట్టుకునే రైడింగ్ గ్లాసెస్ లాంటివి. అప్పుడు ఆయన హేమర్ తీసుకుని ఆ పెద్ద బండరాయి ముందుకు పొడుచుకువచ్చినచోట అంచు తెగినట్టుగా ఉన్నచోట సుత్తితో గట్టిగా మోదాడు. అరవయ్యేళ్ళకు దగ్గరపడుతున్న ఆ శరీరంలో అంత బలం ఉంటుందని ఊహించలేదు. రెండో దెబ్బకే ఆ రాయి విరిగి రెండు పెద్ద పెళ్ళలు మా ముందు పడ్డాయి. చిన్నచిన్న తునకలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఆయన ముందుకు వంగి ఒక రాతిశకలాన్ని ఏరి చేతుల్లోకి తీసుకున్నాడు. బాగులోంచి చిజ్లెర్లు తీసి ఆ రాతిముక్కని కోసుగా ఉన్నవైపు నున్నగా ట్రిమ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఆయన ఆ రాతిని చెక్కడం చూసి దేవయ్య ముందుకొచ్చి ఆయన చేతుల్లోంచి ఆ రాతినీ, ఆ చిజ్లెర్నీ తీసుకోబోయాడు. కాని ఆయన అతణ్ణి వారించి తానే ఆ రాతిని చెక్కడం మొదలుపెట్టాడు.

ఆ పని చేస్తున్నంతసేపూ ఆయన దృష్టి ఆ రాతిమీదనే ఉంది. ఆ సమయంలో ఆయన ఒక జియాలజిస్టుగా కాక, ఒక శిల్పిగా కనిపించాడంటే అతిశయోక్తి కాదు.  దాదాపు మూడు అంగుళాల వెడల్పు, నాలుగంగుళాల పొడవు ఉండేట్టుగా ఆ రాతిని ట్రిమ్ చేసాక ముందుకు నాలుగడుగులు వేసి అక్కడే ఒక చెట్టునీడన కూచున్నాడు. నన్ను కూడా తన పక్కకి వచ్చి కూచోమన్నాడు.

తాను వేసుకున్న జెర్కిన్ పాకెట్ లోంచి నోటు పాడ్ తీసుకున్నాడు. అందులో అప్పటికే రాసి ఉన్న పేజీలు పక్కకి తిప్పి ఒక ఖాళీపేజీ తెరిచాడు. ఆ పేజీల్లో ఎడమవైపు పేజీ ఖాళీగానూ, కుడివైపు పేజీ ఒక గ్రాఫు కాగితం లానూ ఉంది. జేబులోంచి బాల్ పెన్ను తీసి ఆ కాగితం మీద ముందు ఆ రోజు తేదీ రాసాడు. దాన్ని అండర్ లైన్ చేసాడు.

‘గివ్ మీ థెర్మో అండ్ కంపాస్’ అన్నాడు వనలతతో. ఆమె తన చేతుల్లో ఉన్న కంపాస్ ఆయనకిచ్చి, బాగులోంచి చిన్న చెక్కపెట్టె బయటకు తీసింది. అందులో రెండుమూడు రకాల ధథర్మోమీటర్లు ఉన్నాయి. ఒక థర్మామీటరు ఆయనకిచ్చింది. ఆయన ఆ థర్మా మీటరు ఒకసారి గట్టిగా విదిలించి రెండు వేళ్ళ మధ్యా పట్టుకుని కళ్ళు చికిలించి చూసాడు.

23 డిగ్రీ సెల్సియస్. 73.4 ఫారన్ హీట్.

‘చూడు విమలా. ఫీల్డ్ వర్కర్ కి నోట్ బుక్ అంటే చేత్తో పట్టుకు నడిచే గుండెకాయలాంటిది. మనం ఏమి చూసినా అది ఇక్కడ ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. మా యూనివెర్సిటీ ప్రొఫెసరు మాకో సామెత చెప్పేవాడు. ఎంత వెలిసిపోయినా కూడా ఇంకు మెమరీ కన్న గొప్పది’ అంటో, ఆ నోటుబుక్కులో లాటిట్యూడ్, లాంగిట్యూడ్ లు నమోదు చేసాడు. వాటికింద పనసమామిడికొండ అని రాసాడు. దానికింద 9.30 ఎ.ఎం. అని టైము రాసాడు.

అప్పుడు ముందు ఎన్ అని ఉత్తరం దిక్కును మార్కు చేసుకున్నాడు. దాని కింద తాను చూస్తున్న కొండ ఆకృతిని స్థూలంగా గీతలాగా గీసుకున్నాడు. తాను కట్ చేసిన రాక్ సాంపిల్ సైజు నమోదు చేసాడు. దానిమీద సీరియల్ నంబరు 1/ 80 అని రాసాడు.

తన జెర్కిన్ ఎడమవైపు పాకెట్లోంచి మాగ్నిఫయింగ్ గ్లాస్ తీసి ఆ సాంపిల్ ని పరీక్షించడం మొదలుపెట్టాడు. కొంతసేపు పరిశీలంగా చూసాక ఆ నోట్ బుక్కులో ‘ఖోండలైట్ ఫోలియేటెడ్ మెటమార్ఫిక్’ అని కూడా రాసుకున్నాడు. పక్కన గ్రాన్యులార్ అని రాసుకుని దాని చుట్టూ బాక్సులాగా గీత గీసాడు. దానికింద ‘ద ఫస్ట్ నోట్ ఫ్రమ్ ద ఆర్కియన్ టైమ్స్’ అని రాసుకున్నాడు. ఆ సాంపిల్ ని వనలత చేతికిచ్చి నంబరు వెయ్యమన్నాడు. ఆమె బాగులోంచి రెడ్ స్కెచ్ పెన్ను తీసి ఆ సాంపిల్ మీద పెద్ద అక్షరాలతో నంబరు రాసిపెట్టింది.

ఆయన ఆ రాక్ కట్ చేసి ఆ శాంపుల్ ఛిజెల్ చేయటం నాకోసమే చేసి చూపించిన ఒక డెమాన్ స్ట్రేషన్ లెసన్ అనిపించింది.

అప్పుడు ప్రొఫెసరు నన్ను నా నోట్ బుక్ తెరవమని చెప్పి, తాను రాసుకున్నట్టే తేదీ, లాట్-లాంగ్ లు, ఊరు, కొండ, ఆర్ ఎఫ్ అన్ని వివరాలూ రాయించి, ‘ ఇప్పుడు నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్న మొక్కల వివరాలూ, చెట్ల వివరాలూ రికార్డు చెయ్యి’ అన్నాడు.

మళ్ళా తనే ‘నువ్వు ఆ మొక్కల్ని గుర్తుపట్టగలవా? వాటి సైంటిఫిక్ నేమ్స్ రాయగలవా?’ అనడిగాడు.

నేను తెల్లమొహం వేసాను. మోనో కాటిలెడన్, డైకాటిలెడన్ అనే పదాలు తప్ప ఆ క్షణాన నాకు మరేమీ గుర్తు రాలేదు. ఒక అడవి ముందు నిలబడ్డప్పుడు అంతదాకా నేను చదువుకున్న ఎంత నిష్ప్రయోజనమో నాకు ఒక్కసారిగా తెలిసి వచ్చింది.

ప్రొఫెసరు నా అవస్థ చూసి చిరునవ్వాడు. ఆ చిరునవ్వు నన్ను చెప్పలేనంతగా తేలికపరిచింది.

‘నో ఇష్యూస్. ఐ కెన్ అండర్ స్టాండ్. ప్లీజ్ కలెక్ట్ ద సాంపిల్స్. గివ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఎ నంబర్. ఇంటికి వెళ్ళాక ఓపిగ్గా రిఫర్ చేసి డిటెయిల్డ్ నోట్సు రాసుకుందువు గాని’ అని అన్నాడు.

‘అండ్, రిమెంబర్, నీ నోట్సులో వట్టి సాంపిల్సూ, డిటెయిల్సూ కాదు. ప్రతి రోజూ ఫీల్డ్ లో నువ్వేం ఫీలయ్యావో ఆ ఫీలింగ్స్ కూడా రికార్డు చెయ్యాలి. మా ప్రొఫెసర్ అనేవాడు ‘ ఫీల్డ్ నోట్ బుక్ ట్రావెలర్ స్కెచ్ బుక్ లాంటిది. సముద్రం దగ్గరికి వెళ్ళావనుకో. ఆ ఉప్పదనం కూడా ఆ బొమ్మల్లోకి రావాలి. అలాగే మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు, ఆ సంతోషం, ఆ సైలెన్స్ కూడా మీ నోట్ బుక్ లోకి రావాలి’ అనేవాడు.

‘ఆయన ఎప్పుడూ డార్విన్ నోట్ బుక్స్ గురించి చెప్పేవాడు. ఆ నోట్ బుక్స్ లో రాళ్ళ గురించీ, ఫాజిల్సూ, మొక్కలూ, జంతువుల గురించీ మాత్రమే కాదు, మాపులు, డ్రాయింగ్స్, షాపింగ్ లిస్టులు, వ్యాసాలు,  నోట్సు, డైరీ ఎంట్రీలు అన్నీ ఉన్నాయి. మన నోట్ బుక్స్ మనం ఫీల్డ్ లో గడిపిన రోజుల్ని మన వెంట తీసుకురావాలంటే అలాగే నింపిపెట్టుకోవాలి వాటిని అనేవాడు.’

‘ఇప్పుడు నీక్కూడా అదే మాట చెప్తాను.  నీ నోట్ బుక్కులో మొక్కల్తో నీ కాన్వర్సేషన్స్ రికార్డు చెయ్యాలి, తెలుసునా?’ అని అన్నాడు.

నాకు వళ్ళు ఝల్లుమంది.

మొక్కల్తో సంభాషణ.

మొక్కల్తో మాట్లాడవచ్చుననే నాకెవరూ ఇప్పటిదాకా చెప్పలేదు. ఆ ఊహనే ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది. నేను అప్రయత్నంగా నా చుట్టూ చూసాను. అక్కడ కొండచుట్టూ, కొండమీదా పెరిగిన తరులతాగుల్మాదులన్నీ నాతో మాట్లాడటానికి నా చుట్టూ మూగుతున్నట్టనిపించింది. తమతో తాము పోటీపడుతున్నట్టుగా అనిపించింది. నేను ఒంటరిదాన్ని కాననీ, సమస్త మహారణ్యం నన్నొక్కసారిగా తనదానిగా చేసుకున్నదనీ అనిపించింది.

5-4-2023

18 Replies to “ఆ వెన్నెల రాత్రులు-4”

  1. “సముద్రం దగ్గరికి వెళ్ళావనుకో. ఆ ఉప్పదనం కూడా ఆ బొమ్మల్లోకి రావాలి. అలాగే మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు, ఆ సంతోషం, ఆ సైలెన్స్ కూడా మీ నోట్ బుక్ లోకి రావాలి’“
    ఈ భావన గొప్పగా వుంది సర్!! 🙏🏽

      1. “సమస్త మహారణ్యం నన్నొక్కసారిగా తనదానిగా చేసుకున్నదనీ అనిపించింది”

        నన్నొక్కసారిగా తనదానిగా చేసుకున్నదనీ…

        తనదానిగా చేసుకున్నదనీ …

        ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎందుకైనా…ఈ అనుభూతిని పొందారా?!!!

        Love is an empty sound అని ఎవరన్నారో గానీ వారికి చేరవలసిన వాక్యం!

        సర్….”జీవితమే సఫలము…. జిక్కీ గొంతులో పాట ఎక్కడినుండో లీలగా వినిపిస్తోంది

        “తనదానిగా చేసుకున్నదనీ” అను మీ మాట తాలూకు తీపి లో…

        May your tribe increase!

  2. సముద్రం దగ్గరికి వెళ్ళావనుకో. ఆ ఉప్పదనం కూడా ఆ బొమ్మల్లోకి రావాలి. అలాగే మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు, ఆ సంతోషం, ఆ సైలెన్స్ కూడా మీ నోట్ బుక్ లోకి రావాలి’
    ఈ భావన గొప్పగా వుంది సర్! 🙏🏽

  3. ప్రకృతిని ,పరిశీలనను ఏకకాలంలో దర్శించినట్లు వుంది .. సందర్భాన్ని అనుభవ పరిశీలనతో సంపన్నం చేయడం నిజంగా ఆసక్తికరమైన అభ్యసనం..చాలా బాగుంది సర్..

  4. ఇది నవవనలోకం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఎస్ సి జియాలజీ చెయ్యాలని అప్పటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ భీమశంకరం గారిని కలవాలనుకున్న విషయం గుర్తుకు వచ్చింది. పరిస్థితులు అనుకూలించక అది జరగలేదు. అప్పుడు చదివి నేర్చుకోవాలనుకున్నవి ఇప్పుడు ఇలా నేర్చుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.చదువుతుంటే ఆ అడవి వాసన ఆ చిరువేడి ఆ ఆయాస ప్రయాసలు అన్ని అనుఒభూతమవున్మాయంటే మీరెంత తాదాత్మ్యంగా పాత్రల్లోకి మారి రాస్తున్నారో తెలుస్తున్నది.రేపటి దాకా అడవిలో అలాగే ఉండక
    తప్పదుకదా!

  5. ఇదేదో ఒక పుస్తకం చదివినట్లు లేదు.
    ఒక అడవికి ఫీల్డ్ ట్రిప్ కి వెళ్లి.. అక్కడ ప్రతి బండను, కొండను, చెట్టును, ఆకును ఆప్యాయంగా తడిమి, తడిమి పరిశీలిస్తునట్లు.. వాటిని అనుభూతి పొందుతున్నట్లు ఉంది. ధన్యవాదాలు.

  6. ఏదైనా మీరు గ్రేట్ సర్…. అడవి, కొండలు ఆ వాతావరణం కళ్ళముందు కదలడుతున్నట్టే ఫీల్ అయ్యేలా అక్షరాలు 🙏🙏🙏👌👌👌

  7. ఈ ప్రకృతిని అర్ధం చేసుకోవడానికి మనిషి ఎలా సిద్ధం కావాలో చక్కగా చెప్పారు ఒక్కసారిగా
    తుళ్ళిపడి మేల్కొనేలా🙏

  8. ఉదయాన నిద్ర లేచి మంచం దిగే ముందు, తన మేని పై పాదాలతో పారాడుతున్నందుకు క్షమించమని భూమాతను ప్రార్థించినట్టుగా ఉంది…. అచలాని అనుమతివ్వమని అడగడం

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading