ఆ వెన్నెల రాత్రులు-2

Image design: Mallika Pulagurtha

ఇంటికి తిరిగి వచ్చేసిన చాలా సేపటిదాకా మధురిమ అడిగిన ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. ఇదే ప్రశ్న పాతికేళ్ళ కిందటనో, ఇరవయ్యేళ్ళ కిందటనో, కనీసం పదేళ్ళ కిందటనో అడిగి ఉంటే ఏమి జవాబు చెప్పి ఉండేదాన్నో తెలియదు. కాని ఇప్పుడు అరవయ్యేళ్ళ వయసులో ఈ ప్రశ్న నాకు కొత్తగా అనిపించడమే కాక, నాలోపల్లోపలి అస్తిత్వాన్నే తాకినట్టనిపించింది.

నేను చెప్పాలనుకున్నవాటిని వినడం మీద మధురిమ కి బహుశా ఇంక ఆసక్తి ఉంటుందనుకోను. ఆమెనేకాదు, అసలు ఏ శ్రోతకీ ఆసక్తి ఉంటుందనుకోను. ఆమె బహుశా నన్ను మళ్లా ఈ ప్రశ్న అడుగుతుందని కూడా నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఆమెకి నా జ్ఞాపకాలు చెప్పినా కూడా అవి ఆమెకి ఏ మాత్రం దారిచూపిస్తాయి? ఆమె కి వాటిలో ఎటువంటి స్ఫూర్తి దొరుకుతుంది?

మధురిమనో, మరొక శ్రోతనో పక్కనపెట్టి అసలు అన్నిటికన్నా ముందు నాతో నేనే ఈ జ్ఞాపకాల్ని పంచుకుందామనిపించింది. జ్ఞాపకాలు చిత్రమైనవి. అవి నిశ్చలంగానూ, స్థిరంగానూ ఉంటాయనుకుంటామా, కాదు. అవి కూడా మనతో పాటే ప్రయాణిస్తూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి. జీవితం ప్రతి మలుపులోనూ మనం కొత్త అనుభవాలకు లోనైనప్పుడల్లా అవి కూడా మనతో పాటు మారతాయి. అవి చాలా సజీవాలు. వాటికంటూ ఒక ప్రత్యేకమైన అస్తిత్వం, జీవితం ఉంటాయనిపిస్తుంది.

జ్ఞాపకాల్ని ఒక కవి సగంలో ఆగిపోయిన కలలన్నాడు. అలా అతనికి ఎందుకనిపించిందో ఊహించగలను. అతను బహుశా జీవితంలో ఏదో ముఖ్యమైన దశలో నిల్చున్నప్పుడు, ఏదో ఒక వైపు ప్రయాణం మళ్లా మొదలుపెట్టవలసి వచ్చినప్పుడు, అతడి జ్ఞాపకాలు కూడా మధ్యలో ఆగిపోయి ఉంటాయి. నీ జీవితగమనంలో నువ్వొక నిశ్చల బిందువుకు చేరుకున్నప్పుడు, మరొక కొత్త ప్రయాణమేదీ ఇప్పట్లో మొదలుపెట్టవలసిన అవసరం కనబడనప్పుడు నీ జ్ఞాపకాలు కూడా నిశ్చలంగానూ, మళ్ళీ మళ్ళీ తలుచుకోదగ్గవిగానూ అనిపించడంలో ఆశ్చర్యం లేదు. లేదా ఇదిగో ఇలా ఎవరో నిన్నొకసారి పట్టి గుంజినప్పుడు, నీలోపలి జ్ఞాపకాలు కూడా కదిలి నీ బాహ్యజీవితం కూడా పెద్ద కుదుపుకి లోనవ్వచ్చు కూడా.

ఈ రోజు నాకు జరిగింది అదే. నువ్వెవరినైనా ప్రేమించావా అని మధురిమ అడిగినప్పుడు ప్రేమించలేదని చెప్పవచ్చు. సూటిగా. ఎందుకంటే నేనెవరితోనూ ప్రేమలో పడలేదు, ఏ వయసులోనూ, జీవితపు ఏ మలుపు లోనూ కూడా. కాని అలా ఎందుకు చెప్పలేకపోయాను? ఆమె ఆ ప్రశ్న అడగ్గానే ఏదో పురాతన మేఘం నామీంచి పయనించినట్టుగా, ఏ దూరతీరాలనుంచో ఏదో పాట వినబడ్డట్టుగా, ఏ నదీప్రవాహమ్మీంచో ఎక్కడివో పూలు తేలుకుంటూ వచ్చినట్టుగా, ఒకప్పటి నా జ్ఞాపకాలు నాకెందుకు గుర్తొచ్చాయి? నన్నెందుకు ఉక్కిరిబిక్కిరి చేసాయి?

ఇప్పుడు మధురిమకోసం కాదు, నా కోసం నేనే ఆ జ్ఞాపకాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను. అదొక మంత్రలోకం. చెట్లు మాట్లాడినరోజులు. కొండలు నీ దగ్గరికి నడిచి వచ్చిన రోజులు. ఆకాశం నీ కోసం ఆగినిలబడ్డ రోజులు. నువ్వు ఇంటికి చేరుకునేటప్పటికి ప్రతి రాత్రీ చంద్రుడు కూడా నీకోసం నడిచి వచ్చిన రోజులు.

ఆ రోజులూ, ఆ రాత్రులూ గుర్తురాగానే తొలివేసవి రాత్రుల రాధామనోహరాల పూల గాలి, ఆ బార్బెట్ లు, ఆ వార్బ్లర్లు, హేమంతకాలపు ఆ పంటకోతలు, ఆ ఎడ్లబళ్ళు, ఆ పండగలు, ఆ అడవిదారులు, ఆ గిరిజనులు, ఆ ప్రాచీన శిలలు, ఆ ఆకురాలే అడవులు, ఆ చెట్లు, ఆ ఎండుటాకుల చప్పుడు, ఆ తొలివసంత మధురిమ- అవన్నీ నన్ను ముంచెత్తుతున్నాయి. తొలివానలు పడగానే నేలలో విత్తనాల కలవరింతల్లాగా నాలో ఏ నాటివో అనుభవాలు, ఇన్నాళ్ళూ నిద్రాణంగా ఉండిపోయినవి ప్రాణంతో కదలాడుతున్నాయి.

ఆ పాటలు, ఆ కవితలు, ఆ నవ్వులు, ఆ ఆటలు, ఆ సాయంకాలపు నడకలు, రాత్రి పొడుగునా భూమ్మీద గంధపు పొడిలాగా రాలే వెన్నెల, అపరాహ్ణాలవేళ అడవిలోనూ, ఊళ్ళోనూ కూడా ఆవరించే నిశ్శబ్దం, ఆ ఏరు, ఆ నీటిగలగల, ఆ యూకలిప్టస్ తోటలు, ఆ టేకుచెట్ల అడవి, ఆ కోవిదారపుష్పాలు, ఆ నాటకాల రిహార్సళ్ళు- ఒక పూలబండిలాగా వీటన్నిటినీ నిండా నింపుకుని అప్పటి జీవితం నా ఇంటిముందు వచ్చి ఆగినట్టుగా ఉంది.

జ్ఞాపకాల్లో మరో విశేషముందని కూడా తెలుస్తోంది. అవి మన అనుభవాల్ని యథాతథంగా మనకి తిరిగి గుర్తుచేస్తున్నట్టే ఉంటాయిగాని, వాటిలో మరెన్నో జ్ఞాపకాలు కలగలిసిపోయి ఉంటాయి. నది ప్రవహించిన ప్రతి ప్రదేశంలోంచీ కొంత కొత్త మట్టిని పోగేసుకుని ముందుకు ప్రవహించేట్టు, మన జ్ఞాపకాలు కూడా ఆ తర్వాత జీవితానుభవాలనుంచి కూడా కొంత కాంతినీ, కొంత చీకటినీ, కొంత సుగంధాన్నీ, కొంత మరపునీ, వెరపునీ కూడా తమలో కలుపుకుంటాయి. చాలాసార్లు అవి అప్పటి రోజుల్నే గుర్తు చేస్తున్నట్టుంటాయిగాని, వాటి ఉద్దేశ్యాలు మారిపోయి ఉంటాయి, అవి మనకి అందిస్తున్న సందేశాలు కూడా మనం ఎదురుచూస్తున్నట్టుగా మనకి ఎదురుకావు.

ప్రతి జ్ఞాపకం కూడా ఒక కథ. అందులో కొంత కల్పన ఉంటుంది. కొన్ని కలలు ఉంటాయి. నెరవేరినవీ, నెరవేరనవీ కూడా. నువ్వొక జ్ఞాపకాన్ని తలుచుకుంటున్నావంటేనే బహుశా నీలో మళ్ళా కొత్త కల ఏదో మొగ్గ తొడుగుతున్నదని అర్థం. అందుకనే ఏమో ఆ కవి జ్ఞాపకాలు సగంలో ఆగిపోయిన కలలు అని అన్నాడు.

నేను ఈస్టరన్ ఘాట్స్ మీద ఫీల్డ్ వర్క్ కోసం  వెళ్ళాలని నిశ్చయించుకున్నాక దసరావెళ్ళేదాకా ఆగవలసి వచ్చింది. సాధారణంగా ఫీల్డ్ వర్క్ సీజన్ నవంబరునుంచి మొదలై ఆరేడునెలలపాటు మార్చి, ఏప్రిల్ నెలలదాకా సాగుతుంది. వానాకాలం పూర్తయి, వేసవి ఎండలు ఇంకా ముదరకముందే ఫీల్డ్ లో చెయ్యాలనుకున్న అధ్యయనం పూర్తిచేసుకునేట్టుగా ప్లాన్  చేసుకుంటూ ఉంటారు. ఆ వచ్చేవాళ్ళు కలకత్తా నుంచి వస్తున్నారు కాబట్టి పూజాసెలవులు అయ్యాక వాళ్ళు వస్తామని ఉత్తరం రాసారు. తాము స్టడీ చేయబోతున్న ప్రాంతంలో బేస్ కాంప్ ఒక గ్రామంలో ఏర్పాటు చేసుకుంటున్నామనీ, తాము వచ్చేలోపే నన్ను వెళ్ళి అక్కడ ఉండగలిగితే మంచిదని కూడా ప్రొఫెసరు ఉత్తరం రాసాడు. ఆ గ్రామం విశాఖపట్టణం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో, మన్యప్రాంతంలో ఒక ఊరు. నేనెప్పుడూ అటవీ ప్రాంతానికి వెళ్ళినదాన్ని కాదనీ, అసలు ఏ పల్లెటూళ్ళో కూడా ఎప్పుడూ ఒక్కరోజు కూడా ఉండలేదనీ మా నాన్న ఆయనకు ఉత్తరం రాసినమీదట ప్రొఫెసరు ఆ సలహా ఇచ్చాడు. చదువుకునేటప్పుడు బొటానికల్ టూర్స్ కి వెళ్ళకపోలేదుగానీ, అవి దాదాపుగా పిక్ నిక్ లానే గడిచాయి. చదువుకునే రోజుల్లో నిజంగా చదువు మీద ఎక్కడ ధ్యాస ఉంటుంది గనక!

విజయదశమి వెళ్ళిన మర్నాడు మేము ఆ ఊరికి ప్రయాణమయ్యాం. నాన్నా నేనూ రైలు మీద ముందు విశాఖపట్టణం వెళ్ళాం. అక్కణ్ణుంచి బస్సు పట్టుకుని నర్సీపట్నం వెళ్ళాం. నర్సీపట్నం నుంచి బస్సు ఒక పట్టాన దొరకలేదు. అక్కడే ముఖం కడుక్కుని ఇడ్లీ తిన్నాం, కాఫీ తాగాం. మేము ఎక్కవలసిన బస్సు దొరికి ఆ ఊరు చేరుకునేసరికి మధ్యాహ్నం రెండుదాటింది. మాకు దారి తెలియక చుట్టు తిరిగి వచ్చామనీ, రాజమండ్రినుంచి నేరుగా రావచ్చని తర్వాత చెప్పారు. కాని ఆ ఊళ్ళూ, ఆ దారులూ నేను మొదటిసారి ప్రయాణిస్తున్నవి కావడంతో కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. ఇంటికి దూరంగా వెళ్తున్నాననీ, అమ్మకి, తమ్ముడికీ, చెల్లెలికీ కొన్నాళ్ళు దూరంగా ఉండవలసి ఉంటుందనీ నాకు గుర్తేలేదు.

నేననుకుంటాను, తొలిసారి చూసే ప్రతి లాండ్ స్కేప్ మనకి మళ్ళా ఈ ప్రపంచంలో కొత్తగా పుట్టిన అనుభవం లాంటిదని. అది మనకి కొత్త నేత్రాల్నీ, కొత్త వీనుల్నీ అందిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం అలవాటుగా మారిపోయిన జీవితచట్రాన్ని అది బద్దలుగొడుతుంది. లేకపోతే నువ్వెన్నేళ్ళు జీవించు, అదే వీథి, అదే దారి, అవే ముఖాలు నీకు నిండుగా జీవించిన క్షణాల్ని ఎప్పటికీ ప్రసాదించలేవు.

మాకు ఆ ఊళ్ళో ఒక ఫారెస్టు ఆఫీసరు పేరు చెప్పి ఆయన్ని కలవమని ప్రొఫెసరు రాసాడు. మేము ప్రయాణం మొదలుపెట్టేముందే నాన్న ఆ ఫారెస్టు ఆఫీసరుకి టెలిగ్రాం ఇచ్చాడు. మేము ఆ ఊళ్ళో దిగగానే ఆ ఫారెస్టు ఆఫీసరు ఇల్లు కనుక్కోడం ఏమంత కష్టం కాలేదు. ఆ ఊరు చాలా చిన్న ఊరు. ఆరేడువందల మించి జనాభా ఉండదు. మొత్తం కలిపి వందా నూటయాభై ఇళ్ళుంటాయి. ఆ ఊరుని ఆనుకుని కొండలు. ఒకరకంగా దాన్ని కొండకింద పల్లె అని చెప్పవచ్చు. ఆ ఊరి చివర మామిడిచెట్ల తోపు వెనక కొండపక్కన ఆ ఫారెస్టు ఆఫీసరు ఇల్లు. మేము వెళ్ళేటప్పటికి ఆయన ఇంట్లో లేడు. కాని మేము వస్తామని ఇంట్లో చెప్పి వెళ్ళాడు. మా కోసం ఏర్పాట్లు కూడా చేసి వెళ్లాడు.

ఆ ఫారెస్టు ఆఫీసరు ఇల్లు ఒక చిన్న పొదరిల్లులాగా ఉంది. ఇంటిచుట్టూ కంచె. ఇల్లొక కుటీరంలాగా ఉంది. కోపురు గడ్డి కప్పు. ఇంటి ఆవరణలో రకరకాల చెట్లు ఉన్నాయి. కంచె వారగా టేకు చెట్లు ఉన్నాయి. వాటిని చూస్తే అయిదారేళ్ళ వయసుకన్నా మించి లేవనిపించింది. బహుశా ఆ ఆఫీసరు ఆ కుటీరం కట్టుకుని కూడా అయిదారేళ్ళకు మించి ఉండదనిపించింది. ఆ అవరణలో నిమ్మ, నారింజ, బొప్పాయి, ఉసిరి లాంటి మొక్కలున్నాయి. ఇంటిముందు ఆవరణలో పూలమొక్కలున్నాయి. ఇంట్లోకి అడుగుపెట్టే గేటుదగ్గర ఒక వెదురుతడికతో అల్లిన ఆర్చిమీదుగా మాధవీలత తీగ పాకించి ఉంది. ఆ ఇల్లు పరిమళాలు మూటగట్టిపెట్టిన పెట్టెలాగా ఉంది.

మేము ఇంట్లో అడుగుపెట్టగానే ఆ ఫారెస్టు ఆఫీసరుగారి శ్రీమతి, ఆమె తనని గ్రేస్ అని పరిచయం చేసుకుంటూ, మమ్మల్ని ఆదరంగా స్వాగతించింది. సాధారణంగా అలాంటి సమయాల్లో అడిగే ప్రశ్నలు, ప్రయాణం బాగా జరిగిందా లాంటివి పూర్తయ్యాక ఆమె మా స్నానానికి ఏర్పాట్లు చేసింది. మా స్నానాలు, భోజనాలు అయ్యేటప్పటికి ఆ ఫారెస్టరుగారు కూడా వచ్చాడు. ఆయన పేరు జోసెఫ్. నలభై నలభై అయిదేళ్ళ వయసు ఉండవచ్చు. మనిషి, ఎత్తరి, విశాలమైన నుదురు, కొనదేలిన ముక్కు, గంభీరమైన రూపం. ఆయన వస్తూనే ముందు అన్నమాట ‘వెల్ కమ్ టు అవర్ ఫారెస్ట్’ అని.

ఆ మాట వినగానే నాకేదో గమ్మత్తుగా అనిపించింది. ‘మా ఇంటికి స్వాగతం అనవచ్చు, లేదా వెల్కమ్ టు మై ఫారెస్ట్’ అనవచ్చు. అది ఆయన అడవి. కాని అవర్ ఫారెస్ట్ అన్నాడే, ఆ మాట గుర్తొస్తే, ఇప్పటికీ నాలో ఒక పులకింత కలక్కుండా ఉండదు.

మన అడవి.

పుట్టి బుద్ధెరిగాక నేనెప్పుడూ ఏ అడవిలోనూ వెళ్ళి ఉన్నది లేదు. వెళ్ళి ఉంటానని కూడా అనుకోలేదు. అలాంటిది ఒక అడవి నాదవుతుందనే ఊహనే నాలో ఏదో సున్నితమైన తీగల్ని మీటింది.

జోసెఫ్ గారు నేను అక్కడున్నన్నాళ్ళూ ఒక కుటుంబానికి అతిథిగా ఉండటానికి వాళ్ళతో మాట్లాడిపెట్టాడు. సాయంకాలం మమ్మల్ని వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇంటిపెద్ద సూర్యనారాయణ ఉపాధ్యాయుడు. ఆయన ఆ ఊళ్ళో స్కూల్లో కాకుండా ఆ లోపల నాలుగైదుకిలోమీటర్ల దూరంలో ఉండే మరో ఊళ్ళో పంచాయతీసమితి స్కూల్లో పనిచేస్తుంటాడు. రోజూ సైకిల్ మీద ఆ స్కూలుకి వెళ్లి వస్తుంటాడు. ఆయన  శ్రీమతి రామలక్ష్మి, ఆయన ఆమెని రమా అని పిలుస్తుండేవాడు, పెద్దగా చదువుకున్నది కాదు. బహుశా ఒకప్పటి చాలామంది స్త్రీలలానే ఆమె చదువుకూడా అయిదో తరగతితో ఆగిపోయి ఉంటుంది. కాని సౌమ్యురాలు. నిష్కారణంగా ప్రేమించగల శక్తిగలది. కాబట్టే ఆ ఇంట్లో నేను అన్ని నెలలు ఉండగలిగాను. వాళ్ళకిద్దరు పిల్లలు. వాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయిగాని వాళ్ళిద్దర్నీ పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అనే పిలిచేవారు. వాళ్ళు నాక్కూడా అలాగే గుర్తుండిపోయారు.

మేము వాళ్ళింటికి వెళ్ళగానే రామలక్ష్మిగారు, ఆమెని ఆ తర్వాత కాలమంతా నేను పిన్నీ అనే పిలిచేదాన్ని, ఆ ఫారెస్టరుగారితో మేము ఆ రాత్రినుంచే అక్కడ ఉండిపోతామనీ, మా సామాను పంపించెయ్యమనీ అన్నది. ఏముందికనుక నా లగేజి? గ్రే కలర్ వి ఐ పి సూట్ కేసు, ఒక హోల్డాలూనూ. ఆ ఆదరణ, అరమరికల్లేని ఆ ఆప్యాయత నాన్న హృదయానికి హత్తుకున్నాయి.

సూర్యనారాయణగారి ఇల్లు మట్టి ఇల్లు. పేడతో అలికిన మట్టి అరుగులు. తాటాకు కప్పు. ఇంటి చుట్టూ కంచె. ఇంట్లో వంటగది కాక, మరో రెండు గదులు. ఒకగదిలో ఆ కుటుంబమంతా గడిపేవారు. నేనున్నన్నాళ్ళూ నాకోసం మరో గది ఇచ్చేసారు. మొదట్లో ఆ పిల్లలిద్దరూ తల్లిదండ్రుల్తో పాటు వాళ్ళ గదిలోనే పడుకునేవారుగాని, నేను రెండో వారానికల్లా వాళ్ళని నాతో పాటు నాగదిలోనే పడుకోమన్నాను. ఆ రోజునుంచీ నేను వాళ్ళకి అక్కనైపోయాను. సూర్యనారాయణగారికీ, రామలక్ష్మిగారికీ నిజంగా పెద్దకూతురినైపోయాను.

ఆ మొదటిరోజు రాత్రి మా నాన్న వాళ్ళతో చాలాసేపు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ గురించీ, ఆ ఊరు గురించీ వివరాలు అడుగుతూ ఉన్నాడు. తెల్లవారేక ఆ సూర్యనారాయణ గారు నాన్నకి ఊళ్ళో కొందరు పెద్దల్ని, కరణం, మునసబు, సర్పంచి, స్కూలు టీచర్లు మొదలైనవాళ్ళని పరిచయం చేసాడు. నాన్న అనకు పరిచయమైన ప్రతి ఒక్కరికీ నా బాధ్యత అప్పగిస్తూనే ఉన్నాడు. ఆ మధ్యాహ్నం మళ్ళా నర్సీపట్నం వెళ్ళి అక్కణ్ణుంచి విశాఖపట్టణానికి ప్రయాణమైపోయాడు.

వెళ్తున్నప్పుడు నా చేతిలో కొద్దిగా డబ్బు పెట్టాడు.

‘నీకు వాళ్ళేదో రెమ్యూనరేషన్ ఇస్తారని ప్రొఫెసరుగారు చెప్పారు. వాళ్ళివ్వనీ, ఇవ్వకపోనీ, ఈ డబ్బులుంచు’ అన్నాడు. ‘పెద్దవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, ఏదో చదువుకు సంబంధించిన పనికోసం నిన్ను పిలిచారు. నాకు అదే చాలు’ అని అంటూ  ‘ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే మంచివాళ్ళల్లానే కనిపిస్తున్నారు. ఇది అడవిలో ఊరేగాని, అడవిలాగా లేదు’ అని కూడా అన్నాడు.

ఆ రోజంతా నేను ఎక్కడికీ వెళ్ళలేదు. నాన్న ఉన్నంతసేపూ తెలియలేదుగానీ, నాన్న వెళ్ళిపోగానే ఎందుకో చాలా బెంగగా అనిపించింది. వెళ్తూ వెళ్తూ నాన్న నాకు ఒక డజను పోస్టు కార్డులు మా ఇంటి అడ్రసు రాసిపెట్టి నా చేతికిచ్చి వెళ్ళాడు. వారం వారం నా క్షేమసమాచారాలతో ఉత్తరాలు రాయమని చెప్పాడు. ఆ కార్డులు చూడగానే చాలా బెంగగా అనిపించింది. మొదటి కార్డు తీసుకుని అప్పటికప్పుడే నాన్నకి ఉత్తరం రాయాలనిపించింది.

ఆ సాయంకాలం ఏడు కూడా దాటకుండానే రాత్రిభోజనాలు చేసేసాం. నేనుంటున్న గదిలో ఒక ఎలక్ట్రిక్ బల్బు. కాని ఆ మట్టిగోడల మధ్య ఆ బల్బు వెలుతురు మందగించి కనిపిస్తూంది. ఒక్కర్తినీ ఆ గదిలో పడుకున్నానన్నమాటేగాని నా మనసు అక్కడ లేదు. ఆ వేళకి మా ఇంట్లో తమ్ముడూ, చెల్లెలూ ఏం చేస్తూంటారా అని ఊహించాను. నాన్న రైలెక్కి ఉంటాడా లేదా అనుకున్నాను. ఆ గదిలో మంచాలేమీ లేవు. నేలమీద ఒక చాప, చాప మీద బొంత, తలగడ. పైన మిద్దె కప్పు కాకపోవడంతో, వెదురుకప్పు, తాటాకులూ కనిపిస్తూ ఉన్నాయి. అక్టోబరు నెలకే అక్కడ చలికాలం వచ్చేసినట్టుగా ఉంది. ఆ కప్పు చలిని జల్లెడ పడుతున్నట్టుగా ఉంది. కొంతసేపటికి చలి నన్ను వణికించడం మొదలుపెట్టింది. అక్కడ మరొక్క రోజు కూడా ఉండలేననిపించింది. తెల్లవారగానే ఆ ఇంటివాళ్ళకి చెప్పి, ఫారెస్టరుగారికి చెప్పి వెనక్కి వెళ్ళిపోవాలని గట్టిగా అనుకున్నాకగానీ నిద్రపట్టలేదు.

కానీ మళ్ళా అర్థరాత్రి మెలకువ వచ్చేసింది. ఆ చీకట్లో, ఆ మట్టిగదుల ఇంట్లో, ఆ పైకప్పుమీంచి లోపలకి ధారాపాతంగా దిగుతున్న చలిలో, నేనెందుకు అక్కడున్నానో నాకు ఒక క్షణం అర్థం కాలేదు. ఎక్కడో అడవిలోంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. కుక్క ఒకటి విసుగులేకుండా మొరుగుతూనే ఉంది. ఎవరో ఒకటే సణుగుతున్నట్టుగా చిమ్మెటలు గీపెడుతున్నాయి. గదిలోపల దండెం మీద వేసిన గుడ్డలు అట్టకట్టిన నీడల్లాగా ఉన్నాయి. నాకు చెప్పలేనంత భయం పుట్టింది. వెళ్ళి ఆ పక్క గది తలుపు తట్టి నేను కూడా వాళ్ళ మధ్య ముడుచుకుపడుకోవాలన్న కోరికని అతి కష్టం మీద నిగ్రహించుకోగలిగాను.

లేచి వాచీ చూసుకున్నాను. హెచ్ ఎం టి రేడియం ముల్లు వాచీ. డిగ్రీలో చేరినప్పుడు నాన్న కొనిచ్చాడు. నీ జీవితంలో అడల్ట్ హుడ్ ఎప్పుడు మొదలయ్యింది అని ఎవరేనా అడిగితే ఆ రిస్టు వాచీ మొదటిసారి పెట్టుకున్న రోజునే అని చెప్తాను.

టైము మూడు కావొస్తూంది. గదిలో పడుకోలేక ఏమైతే అయిందని నెమ్మదిగా తలుపు తెరుచుకుని బయటికి వచ్చాను. ఊరంతా మాటుమణిగి ఉంది. ఇంట్లోంచి బయటకి వచ్చాను. ఇంటిముంగిట్లో నిల్చున్నాను. ఇంటి ఆవరణలో విరగబూసిన మందారచెట్టు మీద తెల్లని గీతలు గీసినట్టు ఆకుల మీదా, పూలమీదా వెన్నెల. మరికొంత ముందుకొచ్చి తలెత్తి ఆకాశం కేసి చూసాను. పడమటి దిక్కుగా ప్రయాణిస్తున్న త్రయోదశి చంద్రుడు.

ఇంక ఉండబట్టలేక కంచెకి కట్టిన తలుపు కూడా తెరిచి బయటకొచ్చి నిలబడ్డాను. అబ్బ! ఏమి వెన్నెల! అలాంటి రాత్రి అప్పటిదాకా నా జీవితంలో నేనెప్పుడూ చూసి ఎరగను. ఆ క్షణాన అప్పటిదాకా నన్ను కమ్ముకున్న భయం, అలసట అన్నీ ఎవరో మంత్రించినట్టుగా మాయమైపోయాయి. చుట్టూ చూసాను. ఊరంతా ఇళ్ళ గడ్డికప్పులమీద, ఇళ్ళముందు చెట్లమీద, దూరంగా కొండలమీద, ఎటుచూసినా వెన్నెల. అడవిలో అప్పటిదాకా వినిపిస్తూ వచ్చిన అరుపులు కూడా ఆ వెన్నెలని చిక్కబరుస్తున్నాయి. చిమ్మెటలన్నీ ఎక్కడికక్కడ రాలుతున్న  వెన్నెలని తీగలు చుడుతున్నట్టుగా ఉన్నాయి. అదొక అపూర్వమైన నిశ్శబ్దం. ఆ వెలుగంతా నాకోసమే కురుస్తున్నట్టుగా, పండగలాంటి ఆ వెన్నెలకి నన్ను అతిథిగా ఆహ్వానించినట్టుగా అనిపించింది.

ఎవరో నా పక్కన నిలబడి నా చెవిలో రహస్యం చెప్తున్నట్టుగా ‘వెల్ కమ్ టు అవర్ మూన్లిట్ నైట్’ అని అంటున్నట్టుగా అనిపించింది.  చంద్రుడు ఒక నావలాగా ఆకాశంలో మరింత మరింత దూరం ప్రయాణిస్తోనే ఉన్నాడు. నేను కూడా ఆ నావమీద ప్రయాణిస్తోనే ఉన్నాను.  అప్పటికి కొద్దిసేపటికిందటే ఆ ఊరువదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనుకున్న విషయం ఆ క్షణాన గుర్తేలేదు. తెల్లవారుతూనే ఇంటివాళ్లకి చెప్పి ఎలాగేనా వెనక్కి వెళ్ళిపోవాలని అనుకున్న విషయమే ఆ సమయంలో మర్చిపోయాను. ఆ వెన్నెల్లో ఆ రాత్రి అలా ఎంతకాలమేనా నిలబడిపోవాలనిపించింది. ఏదో అపురూపమైన మహిమ నాలోపలకంటా ప్రవహించినట్టనిపించింది. ఆకాశంలో ఎవరో ఏదో మూలికని అరగదీస్తూ ఉన్నారనీ, ఆ సారమేదో నాలోపలకీ ఇంకిపోతోందనిపించింది.

అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. ఇంతలో తొలికోడి కూసింది.

5-4-2023

10 Replies to “ఆ వెన్నెల రాత్రులు-2”

 1. అందమైన అడవిలో కురస్తున్న వెన్నెల దృశ్యాన్ని అక్షరాలతో ఆవిష్కరించారు.
  ఒక ఊహను ఒక చిత్రకారుడిగా చూస్తూ, కవిగా వర్ణిస్తున్నారు.
  బహుశః రెండు కళలలోనూ నిష్ణాతులు కావడం వల్లనేమో..
  ప్రతి పదం.. ఇక చిత్రంలా మదిలో నిలిచిపోతున్నది.
  ధన్యవాదాలు.

 2. ఙ్ఞాపకాలు మనతోపాటే ప్రయాణించటం!
  అవి సజీవాలు….మన జీవనగమనంతో
  పాటు అవ్వికూడా వాటి రూపురేఖల్ని
  మార్చుకోవటం….!
  జ్ఞాపకాల పూలబండి గుమ్మంముందు
  ఆగటం!
  సుదీర్ఘమైన కవితామాలలా వుందండీ
  మీ అక్షరసుమాల అల్లిక!

  మనస్సులోని భావాలమీంచి ఎవరో పల్చటి
  తెరలు తొలగిస్తూ ‘ఇదిగో నీ మనసులో జరిగేది ఇదన్నమాట ‘అని చెబుతున్నట్టుగా
  ఒకటే సంభ్రమాశ్చర్యాలు!

 3. తొలిసారి చూసే ప్రతి లాండ్ స్కేప్ మనకి మళ్ళా ఈ ప్రపంచంలో కొత్తగా పుట్టిన అనుభవం లాంటిదని. అది మనకి కొత్త నేత్రాల్నీ , కొత్త వీనుల్నీ అందిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం అలవాటుగా మారిపోయిన జీవితచట్రాన్ని అది బద్దలుగొడుతుంది . లేకపోతే నువ్వెన్నేళ్ళు జీవించు, అదే వీథి, అదే దారి , అవే ముఖాలు నీకు నిండుగా జీవించిన క్షణాల్ని ఎప్పటికీ ప్రసాదించలేవు .

  ఒక కొత్త ప్రదేశాన్ని చూసినపుడు కలిగే భావాన్ని అపురూపంగా మీరు యాత్రానుభవంగా మాతో పంచుకున్న సందర్భం మీరు ఇలా అపురూపంగా అనుభూతి చెందడం వల్ల అనిపిస్తోంది..
  వెన్నెల రాత్రిని అదీ చిక్కటి అడవిలో చదువుతుంటే రహస్య సంగీతంలా చివురాకుల స్పర్శ అనుభూతినిస్తు న్నట్లే వుంది సర్.. కృతజ్ఞతలు సర్..

 4. “ఒక అడవి నాది అవుతుందనే ఊహ….”
  పతాక సన్నివేశం!
  గొప్ప అనుభూతి…సర్.

 5. అడవి వెన్నెల్లో ఆడుకున్న అక్షరాలు

Leave a Reply

%d bloggers like this: