ఆ వెన్నెల రాత్రులు-1

Image design: Mallika Pulagurtha

‘నువ్వు కూడా నీ జీవితంలో ఎప్పుడేనా ప్రేమించేవా?’ అని అడిగింది మధురిమ.

ఆమె నేత్రాల్లో పసితనపు కుతూహలం. నిర్మల కాంతి. ఎదురుగా హుసేన్ సాగర్ పదిగంటల ఎండవేళ నీలిపూత పూసిన అద్దంలా మెరుస్తోంది. ఆదివారం తీరిక మనుషుల్ని పోగేసుకుంటోంది.

నెక్లెస్ రోడ్డు పైన ట్రాఫిక్ చిక్కనవుతోంది. మధురిమ ప్రశ్న నన్ను కలవరపరిచింది.

ఆమె ఎంత మామూలుగా అడిగిందని. కానీ ఆ ప్రశ్న నాలో లేవనెత్తగల కల్లోలం ఆ చిన్నారి హృదయానికి ఊహకి కూడా అందేది కాదు. మాఘమాసపు వేళ మామిడి తోట పక్కనుంచి పోయినప్పుడు పరిమళాలు నీ మీద కూడా వర్షించినట్టు నా గత స్మృతులు నన్నొక్కసారిగా ముప్పిరిగొన్నాయి.

ఆమె ప్రశ్నకేమని జవాబివ్వాలి?

మధురిమ నేనుంటున్న అపార్ట్ మెంటులో నా పొరుగు ఫ్లాట్ వాళ్ళమ్మాయి. వాళ్ళ నాన్న హైకోర్టులో సీనియర్ అడ్వొకేటు. తల్లి యూనివెర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో రీడర్ గా పనిచేస్తోంది. మధురిమకి ఒక తమ్ముడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆమె ఈ మధ్యనే కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెని ఏదో ఒక అమెరికా సంబంధానికిచ్చి పెళ్ళి చేయాలని తల్లిదండ్రుల అన్వేషణ. అందులో అసహజమేమీ లేదు. ఇప్పుడు నా చుట్టూ ఉండే సమాజానికి భూలోక స్వర్గం అమెరికానే కదా. కాని చిక్కెక్కడొచ్చిందంటే ఆ అమ్మాయి తన కాలేజిలోనో లేదా తాను ప్రాక్టీసు చేస్తున్న కంప్యూటర్ లాబ్ లోనో ఒక పిల్లవాడితో ప్రేమలో పడింది. ఆ కుర్రవాడు కూడా అమెరికా వెళ్ళే అర్హతలున్నవాడే. కానీ అతని కుటుంబపరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. మధు తల్లిదండ్రులకా తమ కాబోయే అల్లుడు అమెరికా వెళ్లడం తప్పనిసరి.

మధు ప్రేమ జాడ ఏ మేరకో చూచాయగా వాళ్ళమ్మ పసిగట్టింది. అప్పటినుంచీ ఆమె కూతురిని వేధించడం మొదలుపెట్టింది. ఆ వేధింపు పైకి కనబడేది కాదు. విద్యాధికురాలూ, యూనివెర్సిటీ అధ్యాపకురాలూ కాబట్టి ఆమె తక్కిన తల్లుల్లాగా బయటికి బిగ్గరగా మాట్లాడదు. కానీ ఒక నిఘా వేసే ఉంటుంది. కూతురికి వచ్చే ఫోన్ కాల్స్ మీదా, ఆమె కదలికల మీదా కెమేరా పెట్టినట్లు ఉంటుంది. ఆ ఉక్కిరిబిక్కిరి వాతావరణాన్ని భరించలేక, తన వేదన ఎవరికీ చెప్పుకోలేక మధురిమ కొన్నాళ్ళు నలిగిపోయింది.

ఆమెకి నా మీద గురి ఎందుకు కుదిరిందో, ఎప్పుడు కుదిరిందో గాని నెమ్మదిగా నాతో కలిసి మాట్లాడటానికి ఆసక్తి కనపరచడం మొదలుపెట్టింది.

ఆమె అప్పుడూ అప్పుడూ సందేహిస్తూనే తన ఆవేదనని నాతో పంచుకోవాలనే సంకేతాలివ్వడం చూసి నేనే ఒక రోజు అడిగాను ఆమెని. అప్పుడు చెప్పుకొచ్చింది. అంతా ఒక్కసారిగా కాదు, అప్పుడప్పుడు. తొలియవ్వనంలో అడుగుపెట్టిన ఒక యువతి తన ప్రేమానుభవాన్ని మొదటిసారిగా చెప్తున్నప్పుడు వినడం ఒక ప్రార్థనాసమావేశంలో కూచోడం లాంటిది. ఉదయపు వేళ వీచే గాలుల్లో ఉండే తాజాదనం, బలం, ఉత్సాహం ఉంటాయి ఆ అనుభవంలో.

ఆమె తన మిత్రుణ్ణి తొలిసారిగా ఎక్కడ చూసిందీ, అప్పుడతను వేసుకున్న చొక్కా రంగు దగ్గరినుంచీ, ప్రతి ఒక్క వివరాన్నీ వదలకుండా, ఏది చెప్పకపోయినా, ఎక్కడో ఏదో తప్పిపోతుందేమోనన్నంత ఆత్రుతతో, గాయని రాగాన్ని ఆలపించేటప్పుడు ఏ గమకాన్నీ ఎక్కడా తప్పిపోనివ్వకుండా స్వరప్రస్తారం చేసినట్టుగా ఆమె చెప్పుకొచ్చింది. నేనామె చెప్పేదంతా ఏదో ఒక మంచి కావ్యాన్ని విన్నట్టుగా విన్నానే గాని ఒక సమస్యని వింటున్నానుకోలేదు. ఆమెకి ఏదో ఒక పరిష్కారాన్ని వెంటనే చూపించి తీరవలసిన బాధ్యత నామీద ఉందనీ నేననుకోలేదు. ఆమె కూడా అటువంటి అభ్యర్థననేమీ చెయ్యలేదు.

‘ఆంటీ! మీరు నా మాట విన్నట్టు లేదు. నేనడిగాను మీరు కూడా ఎవరినేనా ప్రేమించారా? లేక డాక్టర్ గార్నే ప్రేమించారా?’ మళ్ళీ అడిగింది మధురిమ.

చిరునవ్వు నవ్వేను. ‘నీ ప్రశ్న నేను ముందే విన్నాను మధూ. కాని ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక, ఆలోచనలో పడ్డాను. ఏమన్నావూ, ఎవర్నేనా ఎప్పుడేనా ప్రేమించేనా అని కదూ. నీ ప్రశ్న వినగానే ప్రేమ అంటే ఏమిటన్న పెద్ద సందేహంలో పడిపోయాన్నేను. అయినా ఆ మాట వినగానే నాకేదో గుర్తొచ్చింది. బహుశా ఆ అనుభవానికీ, ప్రేమ అన్నమాటకీ ఏదో సంబంధం ఉండే ఉండాలి కాబోలు. లేకపోతే నువ్వు ఆ ప్రశ్న వెయ్యగానే ఆ అనుభవాలే ఎందుకు గుర్తు రావాలి నాకు?’

నిజమే. ఆ అనుభవాలే ఎందుకు గుర్తు రావాలి?  అసలు ప్రేమంటే ఏమిటి? నాకే నవ్వొచ్చింది. జీవితం మూడువంతులు గడిచిపోయిన ఈ వేళ ఈ తరుణి నన్నెందుకీ ప్రశ్న ఎదట నిలబెడుతోంది? డాక్టర్ కి  చెప్తే నవ్వుతాడు. ‘నీలో ఇంకా పసితనం పోలేదు విమలా’ అంటాడు.

మధురిమని చూసాను. జీవితం ఇప్పుడిప్పుడే ఆమెలో రేకలు విప్పుకుంటోంది. నలభయ్యేళ్ళ కిందట నేను ఇలానే ఉండేదాన్ని. కాని ఈమెకి ఉన్న మెలకువ ఆనాడు నాకేదీ? కళ్లు తెరిచే లోపునే కాలం దొర్లిపోయింది. అందుకు నాకు చింత లేదు. పశ్చాత్తాపం లేదు. కానీ ఒక బెంగ మటుకు మిగిలిపోయింది. గడిచిపోయిన బాల్యం ఇక ఎన్నటికీ తిరిగిరాదన్నప్పుడు కలిగే బెంగ, చిన్ననాటి స్నేహితులు ఇంక మళ్లీ కనిపించరన్నప్పుడు కలిగే బెంగ. తీయని బెంగ. తలపు మెదిలినప్పుడల్లా పువ్వు పొత్తిలిలో పొంచిన ముల్లులాగా మెత్తగా గుండెలో దిగబడే బెంగ.

‘చెప్తాను మధురిమా. నీకెందుకో చాలా చెప్పుకోవాలని ఉంది. నా మనసు మడతల్లో మరుగున పడిన మొగలిరేకల్లాంటి, బొగడపూవుల్లాంటి జ్ఞాపకాలేవో నీకు చెప్పుకోవాలని ఉంది. అవి చెప్తే నా బరువేదో తీరుతుందని కాదు. నీలాంటి లేత హృదయం ఆ  సంగతులు వింటే ఎంతో కొంత పరవశిస్తుందనీ, ఆ పారవశ్యం నీ నిర్మల ప్రేమానందాన్ని మరికొంత బలపరుస్తుందనీ చెప్తాను ‘ అన్నాను.

దూరంగా బుద్ధశిల ఎండలో మెరుస్తూ వజ్రచ్ఛేదిక ప్రజ్ఞా పారమిత సూత్రలా ఉంది. ఒక తెరచాపబోటు నీలి జలఫలకం పైన తెల్లని బ్రష్ తో గీతాలు గీస్తూ సాగుతోంది. పచ్చికలో ఎండా తేమా ఆర్ద్రంగా స్పృశించుకుంటున్నాయి. మధురిమ చీర అంచు రెపరెపలాడుతోంది. దానిపైన ఆకుపచ్చని గీతల డిజైన్ ని కొంతసేపు చూస్తూండిపోయాను. ఆ కొద్ది క్షణాల్లో నా మనసు ఇరవయ్యేళ్ళ కిందటి జ్ఞాపకాల మైదానాల్లోకి పరుగెత్తింది. ఎక్కడ్నించి మొదలుపెట్టను? ఏ బిందువు నుంచి?

‘మధూ, ప్రేమంటే ఏమిటో నీకు అర్థమయిందంటావా? నాకిన్నేళ్ళయినా అర్థం కాలేదు. నేనెవర్నీ ప్రేమించానని కూడా చెప్పలేను. నాకూ డాక్టర్ కీ మధ్య ఉన్నది ప్రేమ అని నేననుకోను. డాక్టర్ కూడా అనుకుంటాడనుకోను. మేమిద్దరం మంచి స్నేహితులం. పెళ్ళి మమ్మల్ని ఒక్కటి చేసినా ఆ తరువాత మమ్మల్ని కలిపి ఉంచుతున్నది స్నేహమే. మాకు ఒకరితో ఒకరం కలిసి జీవించడం బావుంటుంది. నా మనసులో కలిగే తలపులన్నీ అతడికి చెప్పుకుంటాను. అతని భావాలన్నీ నాతో పంచుకుంటాడు. ఏ ఒక్కరోజైనా ఒకరినొకరం ఏ కారణం వల్ల మిస్సైనా ఆ రోజంతా ఎంతో వెలితిగా, శూన్యంగా ఉంటుంది. కానీ దీన్ని ప్రేమ అనగలనా? అనలేననిపిస్తుంది. ప్రేమ, స్నేహం రెండు పదాలు అనుకుంటే, ఆ రెండింటికీ మధ్య పోలిక తెస్తే, ఏది ఎక్కువనో నేను తేల్చి చెప్పలేను. కాని స్నేహంలో అనంతమైన బాధ్యత ఉంటుంది. ప్రేమలో ఆ బాధ్యత ఉందా? లేక ప్రేమ ఈ లోకవ్యవహారంలో మనకు తెలిసిన పదాల ద్వారా తెలుసుకోగలిగే భావన కానే కాదా?’

‘నా జీవితం చాలా వరకు నేను కోరుకున్నట్టుగానే నడిచింది. అలాగే మా తల్లిదండ్రులు కోరుకున్నట్టు కూడా. నా జీవితంలో నాకు లభించినవీ, నేను పొందినవీ, పొందలేనివీ కూడా నాకు ఏ మేరకో అర్థమయ్యాయనే అనాలి. అదెలాంటిది అంటే, నువ్వు ఓ ఇంటర్వ్యూకి వెళ్ళావనుకో. ఎంతోకొంతసేపు వెయిట్ చేసిన తరువాత వాళ్ళు నిన్ను లోపలకి పిలిచి ప్రశ్నలు అడిగారనుకో.నువ్వు కొన్ని చెప్పగలుగుతావు. కొన్ని చెప్పలేకపోతావు. కొన్ని తప్పు చెప్పావని బయటికి వచ్చాక గ్రహిస్తావు. ఆ ఇంటర్వ్యూలో నువ్వు సెలక్ట్ కాలేదనుకో. ఓ క్షణం బాధపడతావు. ఎంపిక అయ్యావనుకో. సంతోషిస్తావు. కాని నిజంగా ఆ ప్రక్రియ అంతా నీకేమి అర్థమయ్యిందని? అయినా అందులో నీ భాగస్వామ్యం ఉందని నువ్వూ,ఆ ఇంటర్వ్యూ బోర్డూ అంగీకరిస్తారు కాబట్టి అదంతా నీకు అర్థమయినట్టే భావిస్తావు. కాని అదే నీ ప్రమేయమేమీ లేకుండానే నీకో ప్రశంస లభించింది అనుకో, లేదా నువ్వో నింద మోయవలసి వచ్చిందనుకో. అప్పుడు? దాన్ని అదృష్టమని కానీ, దురదృష్టమని గానీ అనడం కన్నా చెయ్యగలిగింది ఏమన్నా ఉంటుందా?

మధురిమా, జీవితంలో మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం లాగా మన పూర్తి ప్రమేయం తోనూ, ఒక యాక్సిడెంటు లాగా మనం బాధ్యతేమీ లేకుండానూ జరిగే అనుభవాలు కూడా కొన్నుంటాయి. వాటిని మనం అదృష్టమనీ అనలేం, మన దురదృష్టమనీ అనలేం. బహుశా ప్రేమానుభవం అటువంటిదే అనుకుంటాను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ప్రేమానుభవానికొక్కదానికే మన నిజస్వరూపాన్ని మనకు తెలియచేసే శక్తి ఉందనుకుంటాను. ఎవరి జీవితంలో ప్రేమ సంభవిస్తుందో వారి జీవితానుభవంలో మరేది సంభవించకపోయినా పర్వాలేదనుకుంటాను. ప్రేమ కలుగక బతుకు చీకటి అని ఒక కవి అన్నాడని మా ప్రొఫెసర్ చెప్తుండేవాడు. అక్కడ చీకటంటే వారి జీవితంలో మరేదీ లేదని కాదు, ఏదీ కనిపించదనీ కాదు. అలాగని సూర్యుడు లేకపోవడమనీ కాదు. కాని చంద్రుడు కూడా లేకపోవడం అది. ఊహించు. చంద్రుడు లేకపోవడం. ఎట్లా ఉంటుందది?పుట్టినప్పటినుంచీ ఒక్కసారేనా చంద్రుడుండే రాత్రిని చూడని అనుభవం?

కానీ నా జీవితంలో ఆ చంద్రుడు వెలిగిన రాత్రులు ఒక్కటి కాదు, ఎన్నో ఉన్నాయి. అవి నా జీవితంలో సంభవించడానికి నా ప్రమేయమేమీ లేదు. వెన్నెల కాయడానికీ, చంద్రుడు హంసలాగా ఆకాశంలో తిరుగాడటానికీ నా ప్రమేయముంటుందా? చెప్పు. ఆ వెన్నెల నా మీద వర్షించడానికి నా ప్రయత్నమేముంటుంది? అది నా అదృష్టమో, దురదృష్టమో నేనింతదాకా నిర్ణయించుకోలేకపోయాను. కానీ ఆ వెన్నెల రాత్రులు మాత్రం నా ఆత్మనంటిపెట్టుకునే ఉన్నాయి. ఆ రాత్రుల గురించే నేనిప్పుడు నీకు చెప్పాలనుకుంటున్నది, వింటావా?

మా నాన్న వి-లో పెద్ద ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు. సరుకులు చేరవేసే వ్యవహారాలు అజమాయిషీ చేస్తుండేవాడు. అందుకని నెలలో ఇరవై రోజులకు పైగా ఊరికి బయటే గడపవలసి వచ్చేది. ఇంట్లో మేము ముగ్గురం పిల్లలం. నా చెల్లెలు రజని, తమ్ముడు ప్రశాంత్. మా అమ్మే మా పనులన్నీ చూస్తుండేది. మా ఇంట్లో మా కుటుంబం మాలో మేమే ఒక ప్రపంచంగా జీవించేవాళ్లం. మాకు ఎవ్వరికీ ఏ లోటూ లేకుండా ఉండాల్ని మా అమ్మా నాన్నా తపనపడుతుండేవారు. మా ముగ్గురు పిల్లలకీ ఎవరి వస్తువులు వాళ్ళకి సబ్బూ తువ్వాలూ దగ్గర్నుంచి కూడా ఏర్పాటు చేసి వుంచేవారు. దేనికోసం వెతుక్కునే అవసరం గానీ, లేదన్న భావన గానీ లేకుండా మా నాన్న ఊళ్ళో ఉన్నప్పుడు నెలకి రెండు సార్లు అందరినీ సినిమాకి తీసుకువెళ్ళేవాడు. మా ఇల్లు కాక బయటి జీవితం గానీ, స్నేహాలుగానీ, కనీసం పరిచయాలు గానీ మాకు తెలియదు. నా బాల్యమంతా , అలాగే నా విద్యార్థి జీవితం కూడా ఒక టైం టేబుల్ కి అనుగుణంగా నడిచిపోయిందనే చెప్పాలి.

నీ చిన్నప్పుడు నీ జీవితంలో ఏ అలవాట్లు బలంగా ఉంటే నీ తక్కిన జీవితమంతా కూడా అవే బలంగా ఉండి నడిపిస్తాయి. అంటే పైకి స్పష్టంగా తెలియకపోయినా వాటి ప్రభావం నీ ప్రతి ముఖ్యనిర్ణయంలో ఉండి తీరుతుంది. బహుశా నా జీవితం దాదాపు అరవయ్యేళ్ళుగానూ కూడా ఆ ప్రకారమే నడిచిందనాలి. మధ్యలో ఆ ఎనిమిది నెలలూ తప్ప. కాని ఆ ఎనిమిది నెలలూ నా జీవితంలో అలా గడవకపోయుంటే నేను ఇప్పుడున్నట్టుగా ఉండి ఉండేదాన్నా? నీ ప్రశ్నని అర్థం చేసుకోవాలనుకునేదాన్నా?

నేను అప్పుడే నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉన్నాను. సైన్సులో ముఖ్యంగా బోటనీతో డిగ్రీ తీసుకుంటే ఏమి భవిష్యత్తు ఉంటుందో నాకు ఇప్పటికీ తెలియదు. అసలు నేను బోటనీ ఎందుకు ఎంపిక చేసుకున్నానో కూడా నాకు తెలియదు. బహుశా మా గర్ల్స్ హై స్కూల్లో  బయాలజీ చెప్పే మేడం నాకు ఇష్టమైనందువల్లనా? అదే చిత్రం. ఆమె పట్ల ఇష్టానికే నేను ఇంటర్ లో బి.పి.సి తీసుకున్నా, బోటనీలో బి ఎస్ సి చదివినా మళ్ళీ అటువంటి మేడం నాకెప్పుడూ తారసపడలేదు. ఇప్పుడాలోచిస్తే అనిపిస్తోంది. బహుశా ఆ ఎనిమిది నెలల అనుభవాల కోసమే నేనా చదువు చదివానేమో అని.

నా గ్రాడ్యుయేషన్ పూర్తయింది. రిజల్ట్సు కూడా వచ్చాయి. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. నాకు ఎం ఎస్ సి లో చేరాలని ఉంది. కానీ నాన్న ఆలోచనలు వేరే ఉన్నాయి. ఏదన్నా సంబంధం కుదిరితే పెళ్ళి చేసేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. నా బాధ్యత తీరితే రజనిపైనా ప్రశాంత్ పైనా దృష్టి పెట్టొచ్చని ఆయన ఉద్దేశ్యం అయి ఉండొచ్చు.

నాన్న నన్ను యూనివెర్సిటీలో జాయిన్ చెయ్యడానికి ఉత్సాహం చూపకపోవడంతో నేను కూడా ఏమీ చెయ్యలేక రెండుమూడు నెలలు ఇంట్లోనే గడిపేసాను. రజని ఇంగ్లిషు లిటరేచర్ లో బి ఏ చేస్తూంది అప్పుడు. తమ్ముడిని నాన్న ఇంటర్ లో సైన్సులో జాయిన్ చేసాడు. వాణ్ణి ఇంజనీరింగ్ చదివించాలని ఆయన కోరిక.

రోజులట్లానే గడిచి ఉండేవేమేవోగాని అనుకోకుండా చిన్న మలుపు తిరిగింది నా జీవితం అప్పుడు. ప్రొఫెసరు సేన్ గుప్తా అని కలకత్తా యూనివెర్సిటీలో జియాలజి హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంటు, ఈస్టరన్ ఘాట్స్ మీద పరిశోధనకు, ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు. అదొక మల్టీ డిసిప్లినరీ స్టడీ. అందులో జియాలజి, బోటని, యాంత్రొపాలజీకి చెందిన విద్యార్థులు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా అవసరమయ్యారు. మా బోటనీ లెక్చరర్ కి ఆయన బాగా మిత్రుడు. ఈయన డాక్టరల్ థీసిస్ కి ఆయన ఎక్సర్టనల్ ఎవేల్యుయేటర్ గా ఉన్నారట. అప్పటినుంచీ వారిద్దరి మధ్యా స్నేహం. ఆ ప్రొఫెసర్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లని కలకత్తా నుంచి తేలేడు కదా. అదీకాక ఫీల్డ్ లో పనిచెయ్యాలంటే స్థానికులైతేనే ఎక్కువ వీలు. అందుకని ఎవరేనా విద్యార్థులు తనకి సహకరిస్తారేమోనని ఆయన మా లెక్చెరర్ ని అడిగాడట. మా లెక్చరర్ బోటనీ విభాగంలో నా పేరు సూచించాడు. మా నాన్న మొదట్లో ఒప్పుకోలేదు. ఊరు దాటి ఇల్లు దాటి నేనెప్పుడూ బయటికి వెళ్ళింది లేదు. నన్ను వదిలి ఉండటం మా వాళ్ళకిగాని, వాళ్ళని వదిలి ఉండటం నాకు గాని ఎన్నడూ అనుభవానికి రాని విషయం. కానీ మా లెక్చెరరు సరాసరి మా ఇంటికి వచ్చి నాన్నతో మాట్లాడి ఒప్పించడంతో నాన్న కాదనలేకపోయాడు.

మా నాన్న కాదనలేకపోవడానికి ముఖ్యమైన కారణం మరొకటి కూడా ఉంది. ప్రొఫెసరుగారి కూడా ఆయన కలకత్తా విద్యార్థిని వనలతా సేన్ గుప్తా కూడా ఆ ఫీల్డ్ వర్క్ కి రాబోతున్నది.. వనలత ప్రొఫెసరుగారి అన్నగారి కూతురు. ఆమె జియాలజీలో డాక్టరేట్ చేస్తోంది. ప్రొఫెసర్ కి జియాలజీలో తీరని జీవితాశయాల్ని ఆమె ద్వారా సాధించాలని పట్టుదల. ఆ వయసుకే ఆమె ఎన్నో సెమినార్లలో పాల్గొంది. ఆమె కూడా ఆ ఈస్టరన్ ఘాట్స్ ప్రాజెక్టులో సహపరిశోధకురాలు. పెళ్ళి కాని మరొక అమ్మాయి, అదీ ప్రొఫెసరుగారికి స్వయానా అన్నకూతురు ఆ ప్రాజెక్టులో ఉందని తెలియడంతో నాన్న ఇంక నన్ను ఫీల్డ్ వర్క్ కి పంపడం గురించి పెద్దగా ఆలోచించలేదు.

ఈ రోజు మీరు ప్రపంచంలో ఎక్కడికేనా సాహసంగా వెళ్ళిపోగలుగుతున్నారు. పెద్ద చదువులు చదువుకోడానికి అమెరికా, ఆస్ట్రేలియా- ఎక్కడికన్నా భయం లేకుండా వెళ్ళిపోగలుగుతున్నారు. మీ తల్లిదండ్రులు కూడా మరో ఆలోచనలేకుండా మిమ్మల్ని పంపగలుగుతున్నారు. పంపగలగడమే కాదు, మీరు విదేశాలకు వెళ్లి తీరాలని కలలుకంటున్నారు కూడా.. కాని నలభయ్యేళ్ళ కింద ఇది ఊహకి కూడా అందని విషయం. ఒక ఆడపిల్ల ఒక రాత్రి రైలు ప్రయాణం చెయ్యవలసి వస్తే కూడా తండ్రినో, అన్ననో, తమ్ముడో ఎవరో ఒకరు వెంటలేకుండా ప్రయాణం చెయ్యడం ఊహకి కూడా అందని విషయం. అలాంటిది ఎక్కడో మా ఊరికి అయిదారువందల కిలోమీటర్ల దూరంలో అడవిలో నన్ను అన్ని నెలలపాటు ఇంటికి దూరంగా మా నాన్న ఎలా ఉండనిచ్చాడో ఇప్పుడు తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగానూ, నమ్మశక్యంకాకుండానూ ఉంది.

ఊహించు. మొబైల్ ఫోన్లూ, వాట్సప్ లూ, ఈ మెయిళ్ళూ లేని కాలం. ఇప్పుడు గ్లోబుకి అవతల ఉన్నవాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఇక్కడున్నవాళ్ళతో వీడియో కాల్ చేసుకోగలిగే రోజులు. అప్పట్లో ఒక ట్రంక్ కాల్ అంటేనే ఒక రోజంతా పట్టేది. పొద్దున్న బుక్ చేస్తే ఒక్కొక్కసారి సాయంకాలానికిగాని కాల్ కనెక్టయ్యేదికాదు. ఇక కాల్ బుక్ చేసినప్పణ్ణుంచీ అక్కడే ఎదురుచూస్తూ గడపాల్సి వుండేది.

ఎవరికేనా ఉత్తరం రాస్తే, వాళ్ళు వెంటనే జవాబు రాసినా కూడా వాళ్ళేం రాసారో తెలియడానికి కనీసం వారం రోజులేనా పట్టేది. ఇప్పట్లాగా చాట్ లోనో, మెసెంజరులోనో, వాట్సప్ లోనో ఇలా సందేశం పంపగానే అలా జవాబు వచ్చే కాలం కాదు. అసలు ఇలాంటి కాలమంటూ ఒకటి వస్తుందనిగాని, రాగలదని గాని మాకు ఆ రోజుల్లో ఊహకి కూడా లేదు.

అలాంటి రోజుల నాటి అనుభవాల గురించి నీతో మాట్లాడాలి అనుకోగానే ముందు నీకూ నాకూ మధ్య యోజనాల దూరం ఉందనిపిస్తోంది-‘

అని ఆగాను. ఎందుకంటే మధురిమ దృష్టి నా మాటల మీద లేదు. ఆమె మొబైల్ స్క్రీన్ పదే పదే బ్లింక్ అవుతుండటం నాకు తెలుస్తూనే ఉంది.

ఆమె మెసేజిలు చూసుకుంటూ ఉంది.

నేను మాట్లాడటం ఆపినట్టు క్షణం తర్వాత ఆమెకి స్ఫురించగానే మొబైల్ మీంచి చూపులు నా వైపు తిప్పి

‘మమ్మీ నుంచి మెసేజిలు ఆంటీ. ఇందాకటినుంచి. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, వెంటనే ఇంటికి రా అంటో. మీతో కలిసి బయటకి వచ్చాను అని రిప్లై ఇచ్చాను గాని, వినడం లేదు’ అంది.

మొదటిసారిగా ఆ అమ్మాయి మాటలు నాకు పూర్తిగా నమ్మాలనిపించలేదు. ఆమె తల్లినుంచి మెసేజిలు వస్తూండవచ్చుగాని, ఆమె దృష్టిని పక్కకు తప్పించే శక్తి ఆ మెసేజిలకు లేదని నేనూహించగలను.

‘సరే, మధూ, బయల్దేరదాం. కాబ్ బుక్ చెయ్యి’ అన్నాను.

నిజానికి ఆమె నన్ను నువ్వెవరినైనా ప్రేమించావా అని అడిగినప్పుడు నా నుంచి ఆశించిన సమాధానం అవును లేదా కాదు అని మాత్రమే అని నాకు తట్టింది. నేను అవుననో, కాదనో ఏదో ఒకటి సూటిగా చెప్పకుండా ఏవేవో జ్ఞాపకాల్ని నెమరెయ్యడం మొదలుపెట్టాక ఆమెకి ఆసక్తి ఎలా ఉంటుంది? కానీ, నిజంగా, ఎవరేనా, తాము ఎవరో ఒకరిని ప్రేమించామనో, ప్రేమించలేదనో చెప్పగలిగితే వాళ్ళకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరేమో!

‘ఆంటీ, ఓలా టు మినిట్స్ డిస్టన్స్ లో ఉంది’ అంది మధురిమ.

మేము రోడ్డు వైపు కదిలాం.

5-4-2023

20 Replies to “ఆ వెన్నెల రాత్రులు-1”

  1. ఇలా పిల్లలు అడిగినప్పుడు… ప్రేమ విషయంలో.. ప్రతీ ఒక్కరం వేయి యోజనాల మలుపుల్లో చిక్కుకుంటమేమో… ఓ చిన్ని అనుభవం కథ గా భలే మలిచారు… సర్

      1. కొన్ని అధ్యాయాలు చదివాక నేను చదవడం మానేసాను అనడం కన్నా కుదరలేదు అనడం సబబు. మళ్ళీ సునీత గారి రైటప్ వలన మొదట్నించీ మొదలుపెట్టాను.

  2. ఈ జనరేషన్ కథను ఎంచుకుని గడచిన జనరేషన్ తో పోలిస్తే సాగే కథ ఎత్తుగడనే ఆసక్తికరంగా మొదలైంది. ఒక పేరాగ్రాఫు దాకా రచయిత ఉత్తమ పురుష అనిపించి వెంటనే కథలోని పాత్ర ప్రవేశింపజేయటం, క్షణాల్లో అక్షరాలకు బదులు దృశ్యాలు ఇరువురు రెండుతరాల ప్రతినిథులైన మహిళల లీలారూపం తో కథ సాగటం అద్భుతంగా ఉంది. మిగతా కథకై సంపుటిలో వెతికాను. ఇది కొత్త కథ అని తేలింది. తరువాయి భాగానికై ఒక రేయి గడపాలి.
    “ఎవరి జీవితంలో ప్రేమ సంభవిస్తుందో వారి జీవితానుభవంలో మరేది సంభవించకపోయినా పర్వాలేదనుకుంటాను.”
    ప్రొఫెసరుతో చెప్పించిన మాటలు
    దానికి పైన
    “ప్రేమ ఈ లోకవ్యవహారంలో మనకు తెలిసిన పదాల ద్వారా తెలుసుకోగలిగే భావన కానే కాదా?’”
    వంటి వాక్యాలు చెప్పాలంటే ఎంత విశ్లేషణ కావాలో
    ఎంత ప్రణాళిక కావాలో అనిపించింది నాకు . నమస్సులు.

  3. ప్రేమ – స్నేహం
    రెండూ.. ఎవరికి వారు తమ అనుభవాలసారాన్నిరంగరించి నిర్వచించుకోవాల్సిన విషయాలేమో !.
    ఏమైనా స్నేహం-ప్రేమ రెండు మనతో పాటు.. ఆ స్నేహం-ప్రేమ మననుంచి పొందిన వారు లేదా మనకు పంచిన వారి వ్యక్తిత్వం, ప్రవర్తనతో పెనవేసుకోవడం అనివార్యం. దాంతో.. ఆ అనుభవం మరిచిపోలేని జ్ఞాపకం గానో, మరుపురాని బాధ గానో మిగలడం దాదాపు అనివార్యం.

    స్నేహం-ప్రేమ .. రెండు తరాల మద్యం ఆలోచనలలో తేడా.. ఆవిష్కారానికి నాంది పడినట్లుంది. ..

    శేషం కోసం ఎదురుచూస్తూ ఉంటాము.

  4. తాము ఎవరో ఒకరిని ప్రేమించామనో, ప్రేమించలేదనో చెప్పగలిగితే వాళ్ళకన్నా అదృష్టవంతులు మరొకరు ఉండరేమో!
    How relaxing!

  5. కథ ముగిసింది కదా

  6. స్నేహం ,ప్రేమ రెండూ పెనవేసుకొనే ఉంటాయి. అప్పుడే బలపడతాయి కూడా.
    స్నేహం బలపడాలంటే ప్రేమ మొలకెత్తాలి.
    ప్రేమ శాశ్వతమై నిలబడాలంటే స్నేహం(,ఒకరి భావాలను ఒకరు మన్నించుకోడం )తప్పనిసరి.

    చేయితిరిగిన కథకుని కథనం లో విషయం కన్నా
    వివరణలు,అనుభవాలు ,అనుభూతులు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.
    అవి పాఠకుణ్ణి ఆలోచనా సంద్రం లో మునకలు వేయిస్తాయి.
    ఇందులో మీరు సిద్ధహస్తులు. ధన్యవాదాలు sir.

  7. ప్రేమనుభవాన్ని వినడం ప్రార్థనా సమావేశం లాంటిది..
    నీలి జలఫలకం పై తెల్లని బ్రష్ గీతాలు పడవ వెళ్లిన జాడలు..ఓహ్..
    ఒక్కో వాక్యం అందమైన పఠన అనుభూతుల్ని కలిగిస్తూ చాలా చాలా బాగుంది సర్..తరువాయి భాగం కోసం ఎదురుచూస్తూ వుంటాం..

  8. నువ్వు కూడా నీ జీవితంలో ఎప్పుడేనా ప్రేమించేవా?’
    ఎవరిని వారు ఒక్కసారైనా అడిగి తీరవలస్సిన ప్రశ్న.
    అలా ప్రశ్నించుకోగలిగితే లోకం ఇలా ఉండదు. వివరణలు,అనుభవాలు ,అనుభూతులు
    హృదయంలోంచి వచ్చి హృదయాన్ని కదిలించాయి.

  9. ప్రేమానుభవాన్ని వినడం …ప్రార్థనా సమావేశం లో పాల్గొనడం …. నమస్సులు మీకు

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading