ఏమి పాఠం నేర్చుకున్నాం?

Reading Time: 3 minutes

మనుషులు చాలా బలంగా మర్చిపోవాలనుకుంటున్నవాటిలో బహుశా కరోనా కాలం అన్నిటికన్నా మొదట ఉంటుందనుకుంటాను. ఎందుకంటే, ఆ కాలంలో మనుషులు ఎంతో విచిత్రంగా ప్రవర్తించేరు. కుటుంబాలూ, జాతులూ, దేశాలూ కూడా. లాక్ డౌన్ కాలంలో ఒక చిన్న ప్రయాణంకోసం, కరోనా రెండోసారి దండెత్తినప్పుడు ఒక ఆక్సిజను సిలిండరు కోసం, మొత్తం కరోనాకాలంలో చనిపోయినవాళ్ళకి ఒక గౌరవప్రదమైన దహనసంస్కారం కోసం మనుషులు ఎంతెంత పెద్ద యుద్ధాలు చెయ్యవలసి వచ్చిందో మనలో చాలామందికి తెలుసు. మామూలు రోజుల్లో మాట్లాడే నీతివాక్యాలు, సిద్ధాంతాలు, మామూలు సందర్భాల్లో తోటిమనిషిమీద ఉదారంగా తీర్చే తీర్పులు కరోనా కాలంలో తల్లకిందులయ్యాయి.

ఆ సంఘటనల గురించిగాని, ఆ ఒత్తిడిలో, ఆ ఆందోళనలో మనుషులు ఎలా ప్రవర్తించారన్నదానిమీద గాని కరోనా రోజులు గడిచిన తర్వాత పెద్దగా రచనలు ఏమీ వచ్చినట్టు నేను చూడలేదు. విమర్శనాత్మకంగానో, ఆత్మవిమర్శనాత్మకంగానో, ఆ రోజులనాటి మన ప్రవర్తన నమోదు కావడం చాలా అవసరమని నేననుకుంటాను. ఎందుకంటే, రేపు మరో అంటువ్యాధినో, లేదా యుద్ధమో, అంతర్యుద్ధమో లేదా ఓ భూకంపమో సంభవిస్తే నువ్వూ, నీ ఇరుగుపొరుగూ ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారో తెలియకుండా పోతుంది.

అన్నిటికన్నా ముఖ్యం, కరోనా ఎంత భయాన్ని తీసుకొచ్చిందో, అంతకన్నా ఎక్కువగా దుఃఖాన్ని కూడా పరిచయం చేసింది. ఆ దుఃఖంలో మనకు తెలియని మన ముఖమొకటి కొత్తగా కనిపించడంలోని అపరాధ భావం కూడా ఉంది. మంచి రచయితలు చేసే పని అటువంటి ఒక రోజునో, ఒక గంటనో, ఒక మరణాన్నో, ఒక వియోగాన్నో నమూనాగా తీసుకుని, భయస్వరూపాన్ని, దుఃఖస్వరూపాన్ని విశ్లేషించుకోడానికి పూనుకోవడం. చిమమంద గోజి అడిచే రాసిన Notes on Grief (2021) అందువల్లనే నాకు ఒక విలువైన రచన అనిపించింది.

అడిచే, చినువా అచెబె తర్వాత అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నైజీరియన్ రచయితల్లో ఒకరు. అమెరికాలో ఉంటుంది. ఆమె రచనల గురించి నేను మొదటిసారిగా సత్యవతిగారి ద్వారా విన్నాను. ఈ చిన్నపుస్తకం, నిజానికి పుస్తకం అని కూడా అనడానికి లేదు, ఇది కథ కాదు, వ్యాసం కాదు, ఒక మెమొయిర్ లాంటిది. ఆమె తండ్రి జేమ్స్ వోయె అడిచే స్టాటిస్టిక్స్ ప్రొఫెసరు. యూనివెర్సిటీ ఆఫ్ నైజీరియాలో విశ్రాంత ప్రొఫెసరుగా పనిచేస్తుండగా, 2020 లో కరోనా తలెత్తిన మొదటినెలల్లోనే చనిపోయాడు. ఆయన నైజీరియాలో మరణించినప్పుడు రచయిత్రి అమెరికాలో ఉంది. ఆ సంఘటన చుట్టూ ఆమె రాసుకున్న జ్ఞాపకాలు ఈ పుస్తకం. నిజానికి దీన్ని ప్రచురణకర్తలు వ్యాసం అనీ, non-fiction అనీ వ్యవహరించారుగానీ, రచయిత్రి సిద్ధహస్తురాలు కాబట్టి ఈ పుస్తకానికి ఒక సాహిత్యలక్షణం కూడా సమకూరింది.

ఆమె పుస్తకం మొదలుపెడుతూనే మూడో పేజీలో grief is a cruel kind of education అని రాసింది. నిజానికి నేను ఆ వాక్యం దగ్గరే ఆగిపోయాను. కరోనా రోజుల గురించి, కరోనా తర్వాత, సాహిత్యం రాలేదని నేను అనడం వెనక బహుశా నేను మాట్లాడుతున్నది ఈ అంశం గురించే అనుకుంటాను. ఒక విపత్తు, కుటుంబాలకు గానీ, సమాజాలకు గానీ, సంభవించాక, అది నేర్పే పాఠాలు మన జాతిస్మృతిలో, సమాజస్మృతిలో భాగం కావాలి. అంటే విపత్తు విద్యగా మారాలి. ఆ పాఠాలు ఎంత క్రూరంగానైనా ఉండనివ్వు. కాని ఆ అనుభవాలు పాఠాలుగా మారకపోతే, మళ్ళా అలాంటి పరిస్థితులే సంభవించినప్పుడు, మనుషులు మళ్ళా అంతే క్రూరంగా ప్రవర్తిస్తారు.

కరోనా రోజుల్లో, గడ్డు లాక్ డౌన్ కాలంలో కూడా, నేను ఒక్కరోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసింది లేదు. రోజూ ఆఫీసుకో, లేదా ఏదో ఒక విజిట్ కో పోతూనే ఉండేవాణ్ణి. పోక తప్పేది కాదు. లాక్ డౌన్ సడలించి ఆఫీసుల్లో సిబ్బంది యాభై శాతం చొప్పునో లేదా రకరకాల నిష్పత్తుల్లోనో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటి ఒక జ్ఞాపకం మీతో పంచుకోవాలని ఉంది. ఆ రోజు నేను పటమటలో ఉన్న కార్యాలయంలో ఉన్నాను. ఇబ్రహీంపట్నంలో మరొక కార్యాలయం ఉండేది. అక్కణ్ణుంచి ఫోన్ వచ్చింది. ఆఫీసు సిబ్బంది అంతా ఒక్కసారిగా ఆఫీసు వదిలిపెట్టి వెళ్ళిపోయారనీ, తలుపులు వెయ్యడానికి కూడా ఎవరూ లేరనీ. నేను హుటాహుటిన ఆ కార్యాలయానికి వెళ్ళాను. నా ఛాంబరు నాలుగో అంతస్తులో ఉంది. లిఫ్ట్ ఆపరేటరు కూడా ఆఫీసు వదిలిపెట్టివెళ్ళిపోయాడు. నేను మెట్లెక్కి నాలుగో అంతస్తుకు చేరుకుని నెమ్మదిగా దగ్గరలో ఉండే ఆఫీసు సిబ్బందిని పట్టుకుని విచారిస్తే, తెలిసిందేమంటే, ఆ రోజుల్లో ఢిల్లీలో ఒక మహ్మదీయసమావేశానికి వెళ్ళివచ్చిన ఒకాయనతో మా ఆఫీసు సూపర్నెంటు ఒకాయన చేతులు కలిపి నడుస్తూండటం మా ఆఫీసులో ఎవరో చూసారట. ఆ వార్త తీసుకొచ్చి మా ఆఫీసులో ఎవరికో చెప్పాడు. అంతే, ఆఫీసు సిబ్బంది మొత్తం కకావికలై పారిపోయారు. మైగాడ్! నేను విన్నది నమ్మడానికి నాకు చాలాసేపే పట్టింది. కరోనా వల్ల మనుషుల మతిస్తిమితం అంత తప్పిపోగలదని అప్పటిదాకా నేను ఊహించలేదు.

ఆ కథ అక్కడితో పూర్తవలేదు. మా ఆఫీసు సూపర్నెంటు నాకు ఎక్కణ్ణుంచో ఫోన్ చేసాడు. తనని ఆఫీసులో ఎవరూ మనిషిగా చూడటం లేదనీ, దగ్గరకు రావడం సరే, ఫోన్ చేసి మాట్లాడటానికి కూడా భయపడుతున్నారనీ, తనకి అన్నిటికన్నా ముందు ఆ సాంఘిక బహిష్కరణ భరించలేనిదిగా ఉందనీ, తనేం చెయ్యాలో చెప్పమనీ అడిగాడు. నా ముందు రెండు మార్గాలు కనబడ్డాయి. ఒకటి, అతణ్ణి ఆఫీసుకు రమ్మని, అతడు రాగానే నలుగురూ చూస్తూండగా (అప్పుడు నా దగ్గర కనీసం నలుగురు మనుషులు కూడా లేరు) హగ్ చేసుకోవడం. కానీ అంతకన్నా మంచి ప్రత్యామ్నాయం అతణ్ణి కోవిడ్ టెస్టు చేయించుకొమ్మని చెప్పడం. అతనికి (సహజంగానే) నెగటివ్ రిపోర్టు వచ్చింది. అయినా కూడా మనుషులు అతణ్ణి మామూలు మనిషిగా చూడటానికి మరికొన్ని రోజులు పట్టింది.

ఇది నిజంగా ఒక క్రూరమైన అనుభవం. దీన్నుంచి నువ్వు ఏమి పాఠం నేర్చుకుంటావు? ఏ పాఠాన్ని నీ తర్వాత తరాలకి అందచేయగలుగుతావు?

అడిచే తన తండ్రి గురించి రాసిన దానిలో కరోనాకి సంబంధించింది ఏమీ ప్రధానంగాలేదు. ఆ మరణం సంభవించినప్పుడు తాము లాక్ డౌన్ లో ఉండటం, ఆ మృతి కరోనా రోజుల్లో జరగడం తప్ప, తక్కిన జ్ఞాపకాలన్నీ ప్రధానంగా ఒక తండ్రి గురించి ఒక కూతురు రాసుకున్న జ్ఞాపకాలే. ఆ దుఃఖం ప్రధానంగా కౌటుంబికం, వైయక్తికం. కానీ, ఆ మెమొయిర్ చదువుతున్నంతసేపూ, కరోనా కాలానికి సంబంధించి నమోదు కావలసిన అనుభవాలు, అసంఖ్యాకం, నమోదు కాకపోకుండా ఉండిపోయాయనే నాకనిపించింది.

రచయిత్రి తన పుస్తకంలో చివరివాక్యం ఇలా రాసింది:

I am writing about my father in the past tense, and I cannot believe I am writing about my father in the past tense.

ఈ వాక్యం చదవగానే బహుశా మనకు కరోనాకాలం ఇంకా గతంగా మారిపోలేదనీ, మన surface memory లో అది కదలాడకపోయినా, ఇంకా అక్కడే ఉందనీ, అది deep memory గా మారితే తప్ప దాని జ్ఞాపకాలు సాహిత్యంగా మారవేమో అనీ అనిపించింది.

Featured image courtesy: Indian Express

3-4-2023

14 Replies to “ఏమి పాఠం నేర్చుకున్నాం?”

  1. కరోనా కాలం మనుషులను చాలా ఆందోళన కు గురిచేసింది. స్థితః ప్రజ్ఞ కలిగిన మీరు కరోనా సందర్భంలో స్పందించిన తీరు ఆదర్శనీయ మైనది. మీరు కచ్చితంగా స్పందించారు.
    ఆ నైజీరియా రచయిత్రి వ్రాసిన జ్ఞాపకాన్ని కొద్దిగా నైనా చెప్పండి సార్…

  2. జ్ఞాపకాల రూపాంతరం…సాహిత్యం!
    ఎంత క్లుప్తత!!!

  3. ఒక మహమ్మారి రేపిన విధ్వంసం సామాజికం నుండి వైయుక్తికం దాకా అంతః బహిర్లోకాలను అతలాకుతలం చేసింది.కాస్త ప్రయత్నం చేస్తే వివిధ సమూహాల జీవితాల్లోని మీరన్న కోణంలో అనుభవాలు నమోదు కావాలి. నిన్న మీరు పంచిన NH 44 లా హిపోక్రసీ కి తావులేని ఆనుభవాలు మనో తాత్విక కోణంలో నమోదు కావాలని అనిపిస్తోంది..
    ధన్యవాదాలు సర్..

  4. బెత్తం పట్టని పంతులమ్మ అని నా శార్వరిలో కోయిలలో రాసుకున్న పోయెమ్ కు మీ మాటలతో శ్వాస వచ్చింది.వచనంగానో కథలుగానో ఎందుకో కరోనా సాహిత్యం లోకి రాలేదు.

  5. ఎప్పటి లాగానే కదిలించే వ్యాసం .Grief is a cruel kind of education అనే వాక్యం నాకెప్పుడూ గుర్తుంటుంది

  6. భావోద్వేగాలను ప్రభావితం చేసే విద్య బాగా నాటుకుంటుంది.
    ఒక ప్రమాదం, ఒక శోకం, ఒక విషాదం.. తెచ్చే అనుభవాలు, మిగిల్చే జ్ఞాపకాలు.. హృదయం పై సలుపులు పెట్టే గాయం అవుతుంది.

    84 లక్షల జీవరాశులలో అత్యంత స్వార్ధపరుడుగా ముద్రపడ్డ మనిషి.. కరోనాకాలంలో మరీ స్వార్థపరుడయ్యాడు.. అంటే స్వార్థపరుడు కావలసిన పరిస్థితిని ఆ ప్రకృతి తీసుకువచ్చింది..
    నా దేశం, నా రాష్ట్రం, నా ఊరు, నా వీధి, నా కుటుంబం, చివరికి నేను.. నేనైనా క్షేమంగా ఉండాలి అనుకొనే పరిస్థితిని కల్పించింది.

    కన్న తల్లో, తండ్రో, కట్టుకున్న భార్యో/ భర్తో.. కడుపున పుట్టిన పిల్లలో.. కరోనా కబంధ హస్తాలలో చిక్కుకుంటే..
    దగ్గరగా వెళ్లి పలుకరించలేని దైన్యం..
    పక్కన కూర్చుని సేవ చేయలేని సంకటం..
    ఆసుపత్రిలో చేరితే తోడుగా ఉండలేని నిస్సహాయత..
    చివరకు వారు చనిపోతే కనీసం శవాన్ని కూడా తనివితీరా ముట్టుకోలేని దౌర్భాగ్యం..
    మానవ సంబంధాల విషయంలో ఇది ఒక తీవ్ర విషాదం. ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఆ మనసు గాయం రక్తం ఓడుతూనే ఉంది..
    ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మనిషికి కొన్ని దశాబ్దాలు పడుతుందో..

    మీరన్నట్టు.. వీటిని గ్రంథస్తం చేస్తే భవిష్యత్ తరాలకు నిజంగా ఒక పాఠమే అవుతుంది..

  7. “Grief is a cruel kind of education ”
    విపత్తు విద్య గా మారాలి.అది ఎంత క్రూరంగా ఉండనీ,
    ఆ అనుభవాలు మనకు పాఠాలు నేర్పాలి.అవి పాఠాలు గా మారకపోతే మనుషులు ఎంత క్రూరంగా మారిపోతారు.

    పై వాక్యాల కొరకు కనీసం మూడు నాలుగు సార్లు చదివాను.
    ఆపదలలో,కష్టాలలో ఎదురైన అనుభవాలను మరచిపొదామన్న మరపుకి రావు. అలాంటి అనుభవాలు ఎదుటి వారికి ,కనీసం మన ఆత్మీయులకు ఎదురు కారాదని భావిస్తాం.ఆయా సందర్భాలలో హితవు చెప్పాలని చూస్తాం.కాని ఇప్పుడు అర్థం చేసుకొనే వారే కరువు. అప్పుడు మన బాధ వర్ణనాతీతం.
    చాలా మంది గతం గతః అంటూ వుంటారు.
    అయితే గతం నాస్తి కారాదు.
    అది అనుభవాల ఆస్తి గా మార్చుకోవాలి. అనుభవ సారాన్ని అమృతం వలె పెంచాలి. అపుడే మనిషి గా మన జన్మకు సార్థకత.

    శుభ రాత్రి sir.

Leave a Reply

%d bloggers like this: