తన ధ్యాసంతా

అజ్ఞాత వాసంలో ఉన్న చిత్రకారుడెవరో
తన తైలవర్ణాలిక్కడ దాచుకున్నట్టుగా
కొంత పసుపు, కొంతతెలుపు, కొంత ఎరుపు
ముద్దగా మూటగట్టుకున్నట్టు ఒక మొగ్గ.

సూర్యతాపానికి కరుగుతున్న బంగారం
పిడికెడు పువ్వుగా మారడం మొదలుపెట్టాక
ఎలా పోతపోసారో తెలియదు, ప్రతి రేకలోనూ
చోళకాల దేవతాశిల్పాల అనితరసాధ్యవక్రత.

ఎండకి వెనక్కి ముడుచుకుంటున్న నీడల్లో
ఆకుల గుబుర్లలో ఒదిగి కూచున్న ఓరియోల్.
గొంతులోంచి వికసిస్తున్న పాటని పరిమళంగా
మార్చుకోడం మీదనే ఇప్పుడు తన ధ్యాసంతా.

3-4-2023

19 Replies to “తన ధ్యాసంతా”

 1. సింహాచల పువ్వు సౌందర్యం పై నే చదివిన అపురూప కవిత..వెనక్కి ముడుచుకున్న నీడలు చొలకాల దేవతా శిల్పాల వక్రత..(బహుశా ఇది తమిళ దేశ పర్యటనలో రాశారా అనిపిస్తోంది సర్) పాత పరిమలంగా మార్చుకోవడం..మొత్తంగా ఆత్మగీతిలా వుంది..చాలా బాగుంది సర్..,

 2. ఓరియోల్ పక్షి గురించి వెతుక్కుని తెలుసుకున్నాను.
  చోళకాల దేవతాశిల్పాల అనితరసాధ్య వక్రత ఆ పూరేకల్లో!!

  మీరు రాసిన మాటలు చదువుకుంటూ
  నాలో వికసిస్తున్న భావాల రాగాల్ని
  అలౌకిక ఆనందపరిమళంగా మార్చుకోవడం
  మీదే ఇప్పుడు నా ధ్యాసంతా!! 😁
  🙏🏽🙏🏽🙏🏽

 3. తైలవర్ణాలిక్కడ దాచుకున్నట్టుగా అన్న ప్రయొగం నన్ను చలా ఆకతుకున్నది గురువు గారు

 4. కొంత పసుపు, కొంతతెలుపు, కొంత ఎరుపు
  ముద్దగా మూటగట్టుకున్నట్టు ఒక మొగ్గ.
  చాలా బావుంది సర్ ఉదయపు పరిమళాన్ని పంచుతూ..

   1. ఎంత తపస్సు చేస్తే, ఒక పువ్వును చూడగానే ఇట్లాంటి మాటలు పుడతాయి అన్న ఆలోచన దగ్గరే ఆగిపోయా నేను…

 5. .. .. కాదేది కవితకు అనర్హం..
  కవి ఒక వస్తువుని చూసినప్పుడు ఆయన మనసు ఎలా చలిస్తుందో.. కంటికి కనబడే ఆ వస్తువును వర్ణించడానికి.. ఉపమానంగా కవి తన భావ ప్రపంచంలో ఏ వస్తువును దర్శించి.. ఆ రెండింటి సామాన్య ధర్మాలను కవితాత్మకంగా చెప్పి.. చదువరుల మనసును కట్టిపడేస్తారో చెప్పడం కష్టం.
  అందమైన ఊహకు అద్భుతమైన వర్ణన.
  ధన్యవాదాలు సార్.

 6. .. కాదేది కవితకు అనర్హం..
  కవి ఒక వస్తువుని చూసినప్పుడు ఆయన మనసు ఎలా చలిస్తుందో.. కంటికి కనబడే ఆ వస్తువును వర్ణించడానికి.. ఉపమానంగా కవి తన భావ ప్రపంచంలో ఏ వస్తువును దర్శించి.. ఆ రెండింటి సామాన్య ధర్మాలను కవితాత్మకంగా చెప్పి.. చదువరుల మనసును కట్టిపడేస్తారో చెప్పడం కష్టం.
  అందమైన ఊహకు అద్భుతమైన వర్ణన.
  ధన్యవాదాలు సార్.

Leave a Reply

%d bloggers like this: