ఎన్.హెచ్.44-2

ఎన్‌.హెచ్‌-44 ఎక్కగానే ముందు మేడ్చల్‌ దగ్గర ఆగాడు. అక్కడ గుంపుగా పోతున్న వలసకూలీలు కనిపించారు. కారు ఆపి వాళ్లతో మాట్లాడేడు. తన జేబులోంచి డబ్బు తీసాడు. వాళ్ళ చేతుల్లో పెట్టాడు.

– ఉంచుండ్రి.

-అన్నంకో, నీల్లకో, దారిలో ఎవరైనా బండి ఎక్కించుకుంటే కిరాయికో అవసరం పడతదొచ్చు.

కారు మళ్లా స్టార్ట్‌ చేసాడు.

ఆ తర్వాత తూప్రాన్‌, రామాయం పేట. అక్కడ మళ్ళా అభాగ్యులు కనబడ్డారు. కారు ఆపాడు. పలకరించాడు, మాట్లాడేడు. ఎడమజేబులోంచి డబ్బు తీసాడు. వాళ్ళ చేతుల్లో పెట్టాడు.

-ఉంచుండ్రి.దారిలో అవసరం పడొచ్చు.

ఆ తర్వాత కామారెడ్డి. మళ్లా అదే ప్రక్రియ. ఆ తర్వాత ఇందల్వాయి.

జక్రాన్‌ పల్లి చేరుకునేటప్పటికి సూర్యోదయం అయింది. అక్కడ కారు ఆపి ఆ రోడ్డమ్మట నడుచుకుంటూ పోతున్న కూలీల్ని ఆపి మాట్లాడి వాళ్ళకి డబ్బులిద్దామని చూస్తే-

రెండు జేబులూ ఖాలీ!

వెనక్కి కారు దగ్గరికి వచ్చాడు. వసంత హాండ్‌ బాగులో ఎంత డబ్బుంటే అంతా ఇచ్చెయ్యమన్నాడు. ఆమె తెల్లబోయింది. ఆ నిద్రకళ్లతో చూస్తే తన భర్త ఏమి చేస్తున్నాడో ఆమెకి అర్థం కాలేదు. కాని మరేమీ మాట్లాడకుండా ఉన్న డబ్బంతా తీసి అతని చేతుల్లో పెట్టేసింది.

3 మే 2020

ఎలాగైతేనేం మోతె చేరుకోగలిగాడు గంగారెడ్డి. దారిపొడుగునా గ్రామాల్లో అడ్డంగా కంచెలు కట్టేసారు. పక్క గ్రామం వాళ్ళని తమ గ్రామానికి రావద్దని బోర్డులు పెట్టారు. అలాంటి దృశ్యం తన గ్రామాల్లో చూసే రోజంటూ ఒకటొస్తుందని గంగారెడ్డి ఎప్పుడూ అనుకోలేదు.

ఆ సాయంకాలం గ్రామ పెద్దల్తో సమావేశం పెట్టాడు. ఎంపిటిసి, సర్పంచు, అందరినీ కలిసాడు. తాను అప్పటిదాకా వింటున్నదీ, రాత్రంతా చూసిందీ వాళ్ళకి చెప్పాడు. మనం వాళ్లకి ఏదో ఒకటి చెయ్యాలన్నాడు.

రైతుల దగ్గర ట్రాక్టర్లు ఉంటాయి. వాటితో కనీసం మహారాష్ట్ర వెళ్ళే కూలీల్ని మహారాష్ట్ర బోర్డరుదాకానన్నా పంపవచ్చు. వాళ్లకి ఆ కొంతదూరమైనా నడక భారం తగ్గుతుంది. కొంత ఆహారం కూడా చేతికి అందించవచ్చు. ఆ ఖర్చంతా తను పెట్టుకుంటానని చెప్పాడు.

పెద్దవాళ్ళు విన్నారు. పల్లెల్లోని పూర్వకాలపు మంచితనం, పరోపకారం ఇంకా మిగిలి ఉన్నాయి. వాళ్ల మాటల్లో తేమ కనబడిరది అతడికి. చదువుకున్న తన మిత్రుల్లో కనబడని హృదయం కనబడిరది అతడికి.

కాని అందరి ప్రశ్నా ఒకటే.

లాక్‌ డౌన్‌ రూల్స్‌ ఉల్లంఘించి ఏమన్నా చేస్తే పోలీసులు పెట్టే హింస తట్టుకోవడం ఎలాగు?

అన్నిటికన్నా పెద్ద భయం-  ‘ట్రాక్టర్లు సీజ్‌ చేసి, లైసెన్సు కాన్సిల్‌ చేస్తే’ అనడిగాడు ఎంపిటిసి.

ఇది చాలా పెద్ద సమస్య. ప్రభుత్వం పట్టించుకోవలసిన సమస్య. ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక పల్లె సరిపోవు ఈ బరువు మొయ్యడానికి.

4 మే 2020

గంగారెడ్డి పొద్దున్న పదింటికి మోతె నుంచి ఆర్మూరు వెళ్ళాడు. వెళ్లేటప్పుడు పెద్దగిన్నె నిండా వేయించిన అటుకులు పట్టుకెళ్లాడు.  హైవే పొడుగునా అటూ ఇటూ ఇరవై కిలోమీటర్లదాకా ఒక రౌండు తిరిగాడు.

అప్పుడు చూసాడతను. వలసకార్మికుల సమస్య ఏమిటో. అది ఒక విలేకరి ఒక ఫొటోలోనో, ఒక టెలివిజను ఛానెలు ఒక క్లిప్పులోనో చూపించగలిగేది కాదు. కనీసం ఒక రోజంతా నువ్వు హైవే మీద ప్రయాణిస్తే తప్ప ఆ దారుణ పరిస్థితి ఏమిటో నీకు అర్థం కాదు.

దేశం విడిపోయినప్పుడు మనుషులు రోడ్లమీద, బళ్ళమీద, రైళ్ళమీద, కాలినడకన చేసిన మహాప్రయాణాలు అతను ఇంతకు ముందు ఫొటోల్లో చూసాడు. మొన్నరాత్రినుంచీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నాడు.

గంగారెడ్డికి చెప్పలేని దుఃఖం పొంగుకొచ్చింది. అవును, ఇప్పుడు కూడా దేశం విడిపోయింది. అప్పుడు సరిహద్దుల్లో విడిపోయింది. ఇప్పుడు నడిరోడ్డుమీద విడిపోయింది.

ఒక్కొక్కరి నెత్తిన కనీసం ఇరవై కేజీలకు తక్కువగాని బరువు. రెండుమూడువందల కిలోమీటర్లు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని కాలినడక. చివరికి పొలాల్లో పడెలు కట్టి నాచుపట్టిన నీళ్ళే తమ పిల్లలకు ఇంత తాపి తాము దప్పిక తీర్చుకుంటున్న మనుషులు. పధ్నాలుగు రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు. తమిళనాడునుంచి నేపాల్‌ దాకా ఎర్రని తారురోడ్డు. బొబ్బలెక్కిన కాళ్ళు. ప్రాణాలు పైకి ఉబికి వచ్చి వేలాడుతున్న చూపులు.

ఆ ఎర్రటి ఎండలో ఆ జాతీయ రహదారి మీద ఎక్కడికక్కడ గంగారెడ్డి ఆ దారిన వెళ్తున్న ప్రతి ఒక్క మనిషినీ పలకరిస్తున్నాడు. ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ సమాధానాలు తనొక్కడే కాదు, లోకమంతా వినాలని వాళ్ళని లైవ్‌ లో చూపించడం మొదలుపెట్టాడు. నాలుగు నెలల బిడ్డని చంకనెత్తుకుని తన కొంగుమటుకే కప్పి రెండువందల కిలోమీటర్లకు పైగా నడిచి వచ్చిన పచ్చి బాలెంతరాలు. ఆమె ముందు మరొక ఏడెనిమిది వందల కిలోమీటర్ల ప్రయాణం ఉంది. మరొకామె మూడునెలల బిడ్డని చంకనెత్తుకుంది. పాలుతాగే బిడ్డ. కాని పాలెక్కడివి? నాలుగేళ్ళు, అయిదేళ్ళు, ఆరేళ్ళ వయసుగల పిల్లలు ఆ తల్లిదండ్రుల కూడా ఆ దారిన నడుస్తున్న దృశ్యం. మామూలు రోజుల్లో అలాంటి ఎర్రటిఎండలో నాలుగడుగులు వెయ్యడమే కష్టం. అలాంటిది వందలాది కిలోమీటర్లు.

కాని వాళ్ళెవరి మీదా ఫిర్యాదులు చెయ్యడం లేదు. శాపనార్థాలు పెట్టడం లేదు, చివరికి తమ కూలీ ఎగ్గొట్టి తమని మోసం చేసిన దళారుల గురించి కూడా వాళ్ళొక్క మాట మాటాడం లేదు. వాళ్ళను చూడగానే ఎవరికైనా ఏదో ఒక సాయం చెయ్యాలనిపిస్తుంది. ఏమీ చెయ్యలేకపోయినా కనీసం వాళ్ళ నడక దూరం తగ్గించినా చాలనిపిస్తుంది.

 శాసనసభ్యులకి, ప్రభుత్వానికి, ప్రభుత్వాధికారులకి, పత్రికాసంపాదకులకి, అందరికీ వినబడేలాగా నాలుగురోజుల పాటు గంగారెడ్డి లైవ్‌లో ఘోషిస్తూనే ఉన్నాడు. హైదరాబాదునుంచి అదిలాబాదుదాకా ఏడు నియోజకవర్గాలు. ఏడుగురు శాసనసభ్యులూ ముందుకొస్తే అంచెగుర్రాలు పూన్చినట్టు అంచెలంచెలుగా ట్రక్కులో, ట్రాక్టర్లో పెట్టి ఆ మానవకష్టాన్ని తగ్గించవచ్చు.

కానీ దొరికిన స్పందన అరకొర. ఎందుకని? వీళ్ళు భారతీయులు కారా?

గంగారెడ్డికి అర్థమయింది. వీళ్ళు భారతీయులే. కాని ఓటర్లు కారు. ఎక్కడకి వలసవచ్చారో అక్కడ ఓటర్లు కారు. తాము ఏ దారిన నడుస్తున్నారో, ఆ రోడ్లు ఏ రాష్ట్రం గుండా పోతున్నాయో అక్కడ ఓటర్లు కారు.

వీళ్ళ గురించి ప్రభుత్వాలు పట్టించుకునేదాకా ఆగలేమనిపించింది అతనికి. మళ్లా ఆర్మూరు పెర్కిట్‌ నడుమ గుట్టలుండే చోటుకి వచ్చాడు.  ఆ ఎండకి తట్టుకోలేక  కొంత మంది కాందిశీకులు అక్కడొక చెట్టుకింద చేరుకోడం చూసాడు.

కనీసం వీళ్లని ఏదో ఒక విధంగా అదిలాబాదుదాకా చేర్చగలిగితే?

ఆ ఎర్రటి ఎండలో వందా రెండొందల కిలోమీటర్లు నడిచే కష్టం తప్పించగలిగితే?

నిజమే. అది వాళ్ళ సమస్యను పూర్తిగా తీర్చినట్టుకాదు. వాళ్ల ఊరిదాకా వాళ్లతో కలిసి నడిచినట్టుకాదు. కాని కోరుట్ల బుచ్చవ్వలాగా, తాళ్ళధర్మారం సర్పంచ్‌ లాగా, ఎంతో కొంత, ఏదో ఒక  సాయం, మనిషి తోటిమనిషికి చెయ్యగల సాయం-

ఇక గంగారెడ్డి ఆలస్యం చెయ్యలేదు. గుంపులు గుంపులుగా వస్తున్నవాళ్లని ఆ చెట్టుకింద ఆగమన్నాడు. ఒక గంటలో వందమందిదాకా జమయ్యారు.

తన మిత్రుడు మునిసిపల్‌ కౌన్సిలర్‌ రాజుకి ఫోన్‌ చేసాడు. తన దగ్గర ఉంటే చాలన్నాడు. మోతె లో తనవాళ్ళకి ఫోన్‌ చేసాడు.

-రొండు పెద్దలారీలూ లేదా నాలుగు ట్రాక్టర్లయినా పర్లేదు. ఎట్లయిన సరే అరెేంజ్‌ చేయుండ్రి. ఆదిలాబాదు అవతల మహారాష్ట్రా బోర్డరు పెన్‌ గంగ దాకా పోవాలి. కిరాయి నేనిస్త. పోలీసులు ఫైను వేస్తే కట్టుకుంట. బండ్లు జప్తు చేస్తే ఇడిపించుకొస్త. నాది గారంటీ. దయచేసి జల్దీ అరెంజ్‌ చెయ్యుండ్రి.

చివరికి ఇద్దరు తన మాట విన్నారు. లారీలు తీసుకొచ్చారు. కానీ అక్కడ కూలీల్ని చూడగానే వాళ్ళ హృదయం ద్రవించింది. డీజెలు పోయిస్తే చాలు, కిరాయి అక్కర్లేదన్నారు.

రెండుగంటల్లో ఆ చెట్టుకింద రెండువందల మంది జమయ్యారు. వాళ్లకి గంగారెడ్డి తమని ఎందుకు ఆగమన్నాడో అర్థం కాలేదు. ఏమి చేస్తున్నాడో అర్థం కాలేదు. చివరికి తమ దగ్గరికి ఆ లారీలు తీసుకొచ్చి ‘ఎక్కండి, కనీసం బోర్డరు దాకా మీకు నడిచే శ్రమ తగ్గుతుంది. ఇదిగో ఈ బిస్కట్లు, ఈ మంచినీళ్ళు, ఇవిగో, అటుకులు’ అంటో అందించేక అప్పుడూ అర్థమయింది వాళ్లకి.

వాళ్ళ కళ్ళు ద్రవించాయి. లారీ డ్రైవర్ల కళ్ళు ద్రవించాయి. కౌన్సిలరు రాజు కళ్ళు ద్రవించాయి. గంగారెడ్డి కళ్ళు ద్రవించాయి.

7 మే 2020

నాలుగైదు రోజుల కిందట రెండు లారీలు పెట్టి వలసకూల్నీ మహారాష్ట్ర బోర్డరుదాకా పంపించాక గంగారెడ్డి తను చెయ్యాల్సిన పని అయిపోలేదు, అప్పుడే మొదలయింది అనుకున్నాడు. అటు పెన్‌ గంగ నుంచి ఇంటు ఇందల్‌వాయి దాకా ఎన్‌.హెచ్‌.44 మీద తిరుగుతూనే ఉన్నాడు.

ఆ నల్లటి తారురోడ్డుమీద వేలాది పాదాలు నిర్విరామంగా నడుస్తూనే ఉన్నాయి. కృష్ణారావుగారు లక్షబొటిమనవేళ్ళు చూసానని చెప్పుకున్నాడు. ఆయన చేతిబొటమ వేళ్ళు చూసాడు. గంగారెడ్డి కాలిబొటమనవేళ్ళు చూస్తున్నాడు. కూలీలవి, దిక్కులేని, వృద్ధులవి, పిల్లలవి, గర్భిణీస్త్రీలవి- నడిచి నడిచి, ఇంకా ఎంత దూరం నడవాలో తెలియక రాళ్ళల్లాగా మారిపోయిన కాళ్ళబొటమనవేళ్ళు చూస్తున్నాడు.

ఆ రోడ్డు పొడుగునా అటూ ఇటూ కనుచూపుమేరదాకా వరదలాగా నడుస్తోన్న ఆ అభాగ్యుల్ని చూస్తుంటే గంగారెడ్డికి ఉద్వేగం ఆగడం లేదు. తాను చూస్తున్న ఆ దృశ్యాన్ని ప్రపంచమంతా చూస్తే తప్ప ఒక దారి దొరికేలా లేదు.

అతను సోషల్‌ మీడియా తెరిచాడు. లైవ్‌ లో మాట్లాడటం మొదలుపెట్టాడు. చెట్లు కూలుతున్న దృశ్యంలాగా మనుషులు నడుచుకుపోతున్న దృశ్యం. తాను ఎంతచెప్పినా, ఎంత వివరించినా ప్రజలకు అర్థం కావచ్చు, కాకపోవచ్చు. కాని ఒక్క లైవ్‌ వీడియో మొత్తం దృశ్యాన్ని కళ్ళకు కట్టేలా చూపిస్తుంది అనుకున్నాడు.

ప్రపంచంతో మాట్లాడటం మొదలుపెట్టాడు.

చిమ్మచీకటిలాంటి ఆ మండుటెండలో చల్లనినీడనివ్వడానికి ప్రయత్నిస్తున్న మనుషులు అక్కడక్కడా కొందరు కనబడకపోలేదు. పెర్కిట్‌ చౌరస్తాలో కొందరు యువత, ముప్కల్‌ లో అమీనా బేగం, బాల్కొండలో కొందరు ఉపాధ్యాయులు, ఎన్‌.హెచ్‌-44 మీద సుంకెట్‌ యూత్‌, ఇందల్వాయి టోల్‌ గేట్‌ దగ్గర నవీన్‌ కుమార్‌ మిత్రబృందం- వాళ్ళు ప్రతిరోజూ సాయంకాలం వందో, రెండువందలో ఫుడ్‌ పాకెట్లు పట్టుకొచ్చి ఆ దారినపోతున్న అన్నార్తులకి అందిస్తున్నారు. వాళ్ళకి చేయగలిగిన అర్థికసహాయం చేసి, మనసులో వేనవేల నమస్కారాలు చెల్లించుకున్నాడు గంగారెడ్డి.

కాని ఆ ప్రయత్నాల్లో ఉన్న లోపం అతనికి కొట్టొచ్చినట్టు కనబడిరది. ప్రతి రోజూ వేలాదిమంది నడుస్తున్న ఆ దారిన వందా రెండు వందల పాకెట్లు ఏ మూలకి? వాళ్ళని చూసి ఆగిన కూలీల్లో కొందరికి అన్నం అంది, కొన్నివేలమందికి అన్నం అందకుండా పస్తులతో పోడాన్ని గమనించాడు.

చేస్తున్న సాయం గొప్పదే. కానీ, అన్న వితరణ చేస్తే ఎలా ఉండాలంటే ఆ దారిన వెళ్తున్న వాడు ఒక్కడు కూడా ఆకలి కడుపుతో పోరాదు. ఆలోచించాడు గంగారెడ్డి. ఎన్‌.హెచ్‌-44 మీద ఇరవై నాలుగ్గంటల ఫుడ్‌ కేంప్‌ తెరవకతప్పదనిపించింది. అప్పటికే ఇరవై రోజులుగా ఏదో ఒక రూపంలో అక్కడక్కడ నడుస్తున్న  ఫుడ్‌ పాకెట్ల డస్ట్రిబ్యూషన్‌ని  రోడ్దు పక్కనే  వంటలు వండి  పెట్టి అన్ని వేళల్లోనూ ఎన్ని వేలమందికైనా ఆహారాన్ని అందించగల పూర్తి స్థాయి కేంపుగా మార్చక తప్పదనుకున్నాడు.

ఆ టైములోనే ఎవరు తనతో కలిసి నడుస్తారా అని ఆలోచించాడు. అన్ని గ్రూపులకన్నా ఉపాధ్యాయబృందం తగినజోడీ అనిపించింది. అందుకని వాళ్లని ఇంకెన్నిరోజులు ఫుడ్‌ పాకెట్ల డిస్ట్రిబ్యూషను నడపాలనుకుంటున్నారు అని అడిగాడు. మరో రెండు రోజుల్లో ముగించెయ్యబోతున్నామని ఆ బృందం లీడర్‌ ఎమ్యీవో రాజేశ్వర్‌ చెప్పాడు. అప్పుడు వాళ్లతో ఇన్ని వేలమంది ఆకలితో పోతున్నారుకదా, ఒక పూర్తి స్థాయి ఫుడ్‌ కేంపుగా మారుద్దాం, అందుకు ఏర్పాట్లు తాను చూసుకుంటాననీ తనతో కలిసి పనిచెయ్యగలరా అని అడిగాడు. ఆ బృందం ఒప్పుకుంది.

అలా పెర్కిట్‌ దగ్గర ఎన్‌.హెచ్‌.44 మీద మొదట్లో తడికల్తో ఒక శిబిరం తెరిచారు. జనాల రద్దీ పెరిగాక షామియానాల్తో పెద్ద శిబిరంగా మార్చారు. కూరగాయలు తరగడానికీ, వంట వండటానికీ, గిన్నెలు తోమడానికీ పదిపన్నెండు మంది వర్కర్లను పెట్టుకున్నారు. వంట మాష్టరు రాంచందర్‌ రంగంలోకి దూకాడు. పక్కనున్న శివాలయంలో స్టోరు రూము పెట్టుకున్నారు. అక్కణ్ణుంచే నీళ్ళు తెచ్చుకున్నారు.

మొదటిరోజు పదిహేనువందలమంది ఆకలి తీరింది.

అక్కణ్ణుంచీ ప్రతిరోజూ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. పొద్దున్నే అయిదింటికల్లా పొయ్యి వెలిగించేవారు. ఎనిమిదింటికల్లా మొదటి అతిథికి భోజనం సిద్ధంగా ఉండేది.

అది కూడా ఏదో సాంబారన్నం, పెరుగన్నం కాదు. ఒక రకంగా ప్రతి రోజూ పెళ్ళిభోజనమే పెట్టారని చెప్పొచ్చు. భోజనం అయ్యాక అరటిపళ్ళు కూడా.

ఆ వంటా, వడ్డనా రోడ్డు పక్కనే నడిచేవి. కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని రోడ్డుమీద వెళ్ళే ప్రతి ఒక్క వాహనాన్నీ, సైకిళ్ళమీద వెళ్ళేవాళ్ళనీ, నడుచుకుంటూపోతున్నవాళ్ళనీ కూడా ఆపి ఇక్కడ భోజనం తిని వెళ్ళండి అని పిలిచేవారు. ఎందుకంటే ఏ ఒక్క మనిషి అక్కడ అన్నం తినడం తప్పిపోయినా మరి ఆ దారిపొడుగునా మరొక చోట అన్నం దొరకదని ఆ కార్యకర్తల తపన.

ఆ ఒక్క పూటా ఆకలి తీర్చడమే కాదు, ఆ ప్రయాణీకులు తమ ఇంటికి చేరేదాకా ఇంకా ఎన్ని రోజుల ప్రయాణం ఉంటే అన్ని రోజులకు సరిపడా అన్నమూ, బ్రెడ్డూ, పండ్లూ, మజ్జిగా, బిస్కెట్లూ, వాటర్‌ పాకెట్లూ మూటగట్టి ఇచ్చేవారు. చెప్పులు లేనివాళ్ళకి, చెప్పులు తెగిపోయినవాళ్ళకీ  కొత్త చెప్పులు కూడా ఇచ్చేవారు. బాగా అలసిపోయినవాళ్ళకి కొంతసేపు విశ్రాంతి తీసుకోడానికి షామియానాలు ఏర్పాటు చెయ్యడమే కాక, అత్యవసర వైద్యసదుపాయం కూడా అందుబాటులో ఉంచారు. అంతే కాదు, ఏ రవాణా సాధనం దొరికితే అందులో వాళ్ళని ఎక్కించడానికి ఆ ట్రక్కు డ్రైవర్లని బతిమిలాడో లేదా అవసరమైతే కిరాయి చెల్లించో వాళ్ళకి ఆయా రాష్ట్రాలకు దగ్గరుండి పంపించేవారు. కొన్నిసార్లు తామే వెహికిల్స్‌ ఏర్పాటు చేసి పంపించేవారు.

తొమ్మిదినుంచి రాత్రి పదకొండుదాకా ఆ దారిన పొయ్యే ప్రతి ఒక్క అన్నార్తుడికీ అక్కడ అన్నం దొరికింది. పధ్నాలుగు రాష్ట్రాల్ని కలిపే 4112 కిలోమీటర్ల పొడవైన ఎన్‌.హెచ్‌-44 మీద అక్కడొక్కచోటే ఆకలిగొన్న బాటసారికి పట్టెడన్నం దొరికింది.

‘సార్‌, కలెక్టరు సాబ్‌ వచ్చిండు’ అన్న మాట విని గంగారెడ్డి తన ఆలోచనలనుంచి బయటపడి కేంపు వైపు చూసాడు.

3

కలెక్టరు ఆ రోజు అందరినీ పేరుపేరునా పలకరించాడు. అభినందించాడు. ఎమ్యీవో రాజేశ్వర్‌ మొత్తం నివేదిక సమర్పించాడు. సుమారు ఇరవై మూడు లక్షల రూపాయలు విరాళాలు పోగుపడ్డాయని చెప్పాడు. డోనార్లందరితోనూ ఒక వాట్సప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసామనీ, ఏ రోజు లెక్కలు ఆ రోజే గ్రూపులో పెడుతూ వచ్చామనీ చెప్పాడు. అన్ని ఖర్చులూ పోగా ఇంకా ఆరున్నర లక్షలు మిగిలిందని చెప్పాడు. ఆ మిగిలిన డబ్బుతో స్మార్ట్‌ టివిలు కొనాలని నిర్ణయించామని చెప్పాడు. కరోనా కాలంలో అందరూ ఆన్‌ లైన్‌ ఎడుకేషన్‌ అవసరం తెలుసుకున్నారు కాబట్టి కాంపులో పనిచేసిన టీచర్లు  ఏ స్కూళ్లనుంచి వచ్చారో ఆ 45 ప్రభుత్వపాఠశాలలకీ ఆ టివిలు ఉచితంగా ఇవ్వబోతున్నామని చెప్పాడు.

‘లక్షా యాభైవేల భోజనాలంటున్నారు?అంత తక్కువలో ఎలా చేసారు’ అనడిగాడు కలెక్టరు.

‘అదంతా పైసల రూపంలో వచ్చిన సాయం. ఇక వస్తు రూపంలో ఎవరికి తోచినంత వారు సాయం చేసుకుంటూ వచ్చిండ్రు. రైతులు పాలు, పండ్లు, కూరగాయలు, కొంతమంది దాతలు చెప్పులు, బియ్యము, పప్పులు ఇలా ఓళ్ళకు తోచినట్టు ఆల్లు సాయం చేసిరు. ఓ రాత్రి అండిన అన్నం అయిపోయింది. అప్పుడే రెండు ట్రక్కుల్లో వలసకార్మికులు కేంపుకి చేరుకున్నరు. ఆ సమయానికే వంటచేసెటోళ్ళు కూడా ఎల్లిపోయిండ్రు.  ఆ అర్థరాత్రి ఎల్కటూరు తాండానుంచి లంబాడోళ్ళ రైతు దేవీసింగ్‌ రెండు గంపల కర్బుజా తీసుకొచ్చిండు. పెర్కిట్‌ నుంచి పద్మ తన తోటలో పండిన మూడుగంపల దోసకాయలు తెచ్చింది. ఇలా ఓళ్ళకు తోచినట్లు అళ్ళిచ్చిన సాయానికి లెక్కే లేదు. ఇంకో రోజు జగిత్యాలనుంచి సంజయ్‌ గాంధీ అనే వ్యాపారి ఆయన కొడుకు బర్త్‌ డే బయట చేసుకుంటే లక్షరూపాయలు ఖర్చవుతుంది కదా అని ఆవ్వే పైసల్తో బియ్యం, పప్పులు, నూనెలు, చెప్పులు కేంపులో ఇచ్చి పోయిండు. అట్లాంటోళ్లు ఎందరో చేసిన సాయం  వల్ల కొన్ని పైసలు మిగిలినయ్‌ సర్‌.’ అన్నాడు రాజేశ్వర్‌.

కలెక్టరు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన చేతిలో మొత్తం జిల్లా యంత్రాంగం ఉంది. కాని తనెందుకు చెయ్యలేకపోయాడిలా అని అనుకున్నాడు.

అంతలోనే తేరుకుని` ‘చెప్పండి గంగారెడ్డి గారూ, ముందు ఎవరిని సన్మానిద్ద్దాం?’ అనడిగాడు.

గంగారెడ్డి తన కేంపు సహచరులవైపు ఎంతో ప్రేమగా చూసాడు. సజలనయనాలతో చూసాడు. తండ్రి చేతికందిన బిడ్డల్ని చూసుకున్నట్టు గర్వంగా చూసాడు. కాని మొదటి సత్కారానికి అతడు చూసింది వాళ్లకేసి కాదు.

‘అందర్నీ సత్కరించాలి సార్‌. కాని అందరికన్నా ముందు గంజి లక్ష్మిని సత్కరించాలి’ అన్నాడు.

గంజి లక్ష్మి.  బీడీలు చుట్టుకుని బతికే తల్లి. ఆర్మూర్‌ యూత్‌ తనకి బియ్యం, పప్పులు, ఇతర వంటసామగ్రి సమకూరుస్తే తాను రోజూ అన్నం వండిపెట్టింది. ప్రతిరోజూ పాతికకిలోల బియ్యం వండి పెట్టింది.

‘వండిపెట్టినందుకు తనకి కూలీ ముట్టికాదు. ఆకలితో పోతున్న వాళ్లు తనబిడ్దలే ఆనుకుని చేసింది.  తన శ్రమదానం నలుగురికీ తెలుస్తుందని కూడా కాదు. ఈ రోజు మీరు వచ్చి శాలువా కప్పుతారనీ కాదు. ఆకలిగొన్న మనిషిని చూడలేక చేసింది. ఏమిచ్చీ ఆమె ఋణం తీర్చుకోలేం. అందుకని మొదటి సత్కారానికి ఆమెనే అర్హురాలు’ అన్నాడు గంగారెడ్డి.

అందరూ ఆమె వైపు ఆరాధనగా చూసారు. అభిమానంగా చూసారు. యాభై ఏళ్లుఉంటాయి ఆమెకి. సిగ్గుతో కందిపోయిన ఆ వదనం మీద చందనపు చుక్క సిగ్గు చెమటకు తడిసింది.

‘నెక్స్ట్‌?’ అన్నాడు కలెక్టరు.

‘మీ కేంపులో ఎవర్ని పిలుస్తున్నారు మొదట?’

‘మా కేంపువలంటీర్లను అభినందించేముందు మరొకామె ఉంది సార్‌. ఆమెని కూడా మీరు అభినందించాలి’ అని ‘అమీనా బేగం’ అని పిలిచాడు.

‘ముప్కాల్‌ అమీనా బేగం అంగన్‌వాడీ వర్కరు. ఆమె గంగారెడ్డిలాగా లండన్‌ బెడ్‌ ఫోర్డ్‌ యూనివెర్సిటీలో ఎంబీయే చదువుకోలేదు. మందీమార్బలం ఏమీ లేదు ఆమెకి. కానీ మా అందరికన్నా ముందు ఫుడ్‌ కేంప్‌ ఆమెనే తెరిచింది. మాకన్నా ముందు రోడ్డుమీద తొలిపొయ్యి వెలిగించింది ఆమెనే. యుద్ధంలో ఫ్రంట్‌ లైన్‌ సోల్జరు సార్‌ ఆమె’ అన్నాడు గంగారెడ్డి.

కలెక్టరుకి గూస్‌ బమ్స్‌ వచ్చాయి.

అమీనా బేగం ఎరన్రి స్కార్ఫుతో తళతళమెరిసింది. అంత అందమైన మనిషిని ముస్సోరీలో తన బాచుమేటుల్లో ఒక్కరిని కూడా చూడలేదనుకున్నాడు కలెక్టరు. ఎందుకంటే ఈ అందం ఉన్నతోద్యోగం వల్ల వచ్చింది కాదు. వానిషింగ్‌ క్రీమ్‌ రాస్తే వచ్చిన నిగనిగ కానేకాదు.

తమ తమ పరిథిలో ఎన్‌.హెచ్‌. 44 మీద అన్నవసతి ఏర్పాటు చేసిన బీడీకార్ఖానా రాజేశ్వర్‌, ఆర్మూర్‌ బజరంగ్‌ దళ్‌ యూత్‌, సుంకెట్‌ యూత్‌, వంటమనిషి రాంచందర్‌ లను కూడా అదే వరసలో కలెక్టరు అభినందించాడు.

ఇక అప్పుడు గంగసరెడ్డి తన కేంపు కార్యకర్తల్ని ఎమ్యీవోతో సహా ఒక్కొక్కర్నీ పిలిచాడు. ప్రతి ఒక్కరినీ కలెక్టరు పేరుపేరునా అభినందించి మెమెంటో, శాలువాలతో సత్కరించాడు. అందరినీ అభినందించాక గంగారెడ్డి భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా లాక్కుని ఎమ్యీవైపు తిరిగి ‘శాలువా ఎక్కడ?’ అనడిగాడు.

గంగారెడ్డి చేతులెత్తి కలెక్టరుకి నమస్కారం పెట్టాడు.

‘దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. సన్మానాన్ని తిరస్కరిస్తున్నానని అనుకోకండి. ఇది దుఃఖం నన్ను ఆవహించి దానికి అదిగా చేసుకున్న పని’ అని అన్నాడు..

ఆ మాటలంటూనే అతని మళ్లా కళ్లు సజలాలు కావటం మొదలయ్యింది. తన కళ్లు అక్కడున్న వాళ్ల నుంచి మరుగుపర్చడానికి తన చూపులు రోడ్డు మీదకు తిప్పాడు.

ఆ కేంపుకి అవతల నేషనల్‌ హైవే 44 పూర్తి నిర్మానుష్యంగా ఉంది.

2-4-2023

34 Replies to “ఎన్.హెచ్.44-2”

  1. ఆ రోజులు మళ్ళీ కళ్ల ముందు కదిలాయి సర్, అమాయకమైన మట్టి పాదాలు, చెమర్చిన గుండె తడి, ప్రాణాల్ని లెక్కచేయని సాయాల్ని…. గుర్తుచేసారు 🙏

    1. ఈ గంగారెడ్డి గారు కొందరు వ్యక్తులని కలిపి చూపిన reprensentative పాత్ర అనుకున్నా, నిజజీవితంలోని వ్యక్తి అని తెలియదు. ఎంత గొప్పమనిషి వారు 🙏 మానవత్వం అంటే ఇదేనా!?

      మనిషి దేవుడిగా మారిన సందర్భం ఇది.
      ఇంతటి వేదన నిండిన చరిత్రని డాక్యుమెంట్ చేసినందుకు మీకు నమస్కారాలు.

  2. ముందుకు సాచిన…కర పాత్రలతో…
    ఓ పసి కూనాల్లారా…
    మీరు పరమ శివులు అయినారా?!!?

    అబ్బ… ఏమి కాలమది!
    ఎంత వర్ణన మీది!!

  3. ‘ఆపదలందు ధైర్యగుణమంచిత కార్యములందు తాల్మియున్ …’ అన్నట్టు నలుబదినాలుగవ జాతీయ రహదారంటపోయిన అసంఖ్యాక ఆర్తపాదచారులకు అన్నంపెట్టి ఆదరించిన వితరణశీలి, చదువు కంటే సహృదయసంస్కారం మిన్న అని చాటి చెప్పిన గంగారెడ్డిగారు అన్నపూర్ణులయ్యారు. స్ఫూర్తిదాయక మైన అతని సాహసోపేత సామాజిక సేవను అక్షరీకరించిన మీకు అభివందనములు

  4. ఎక్కడా వర్ణన లేదు.అతిశయోక్తి అసలు లేదు మీ మాటల్లో.

    అప్పట్లో కరోనా సమయం లో గంగారెడ్డి గారి FB పోస్ట్స్ తప్పకుండా follow అయ్యాను.
    నిజంగా పుట్టిన పుట్టుకకు సార్థకత చేకూర్చుకున్న ధన్యజీవి శ్రీ గంగారెడ్డి గారు.
    ఆనాటి ఆ క్రతువులో పాల్గొన్న వారంతా ధన్యజీవులే.

    ఎక్కడా దాపరికం అన్నది లేకుండా పారదర్శకత తో చివరికంటా జమా ఖర్చుల వివరణ తో గంగారెడ్డి గారు
    వ్యక్తి గా ఎన్ని మెట్లను అధిరోహించారో లెక్కకు అందవు.

    1. ఒక్క అక్షరంలో కానీ, అంకెలో కానీ, ఎటువంటి అతిశయోక్తి గాని అవాస్తవంగానీ లేవు. ఈ విషయాన్ని నొక్కి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు.

  5. ఇది చరిత్రలో భాగం .రాబోయే తరాల యువత మనసులో తడి మిగలాలంటే తప్పక చదవాల్సిన documented history

  6. ఆ రోజుల్లో ఎఫ్బి లోను, వాట్సాప్ లో గంగారెడ్డి గారి సేవలు చూస్తూ.. నాకు తోచిన దేదో చేసినా, ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికీ దుఃఖం ఆగదు. మీ రైటప్ తో అన్నీ గుర్తుకు వచ్చాయి. గంగారెడ్డి గారు అయితే ఎంతటి సన్మానానికి అందనంత ఎత్తు.. వారిని కన్న వారు పుణ్యాత్ములు.🙏

  7. లక్ష మంది అన్నార్తుల కడుపు సంతృప్తిని…
    దానికై పాటుపడిన వందల మంది ఆత్మసంతృప్తిని…
    గంగారెడ్డి గారి మనస్సు సంతృప్తిని…
    మాకు అందించినందుకు మా కంటి ఊట ద్వారా అభినందనలు.

  8. ఎందరో మహానుభావులు .. అందరికీ వందనాలు ..

  9. చివరికంటా చదివిన తర్వాత అర్థమైంది, ఇదికథ కాదు, యథార్థ గాథ అని. వాడ్రేవు వారు ఏది వ్రాసిన ఒక పరమార్థం , పవిత్రత, సార్థక్యం, సకలం ఉంటాయి; రొటీన్ జానర్ లో కొట్టుకుపోయే రచయిత కాదు, హిపోక్రసీ ఏ మాత్రం లేని మనిషి. మిక్కిలి ధన్యవాదాలు అండి.

  10. దుఃఖపూరితమైన ఒక ఘట్టంలో కారుణ్య, సేవాభావనలను అంతర్లీనంగా చూపుతూ మామూలు మాటల్లో ఒక యథార్థగాథను కథనం చేశారు.. గంగారెడ్డిగారికి, మీకూ నమస్సులు.

  11. చివరికంటా చదివిన తర్వాత అర్థమైంది, ఇదికథ కాదు, యథార్థ గాథ అని. వాడ్రేవు వారు ఏది వ్రాసిన ఒక పరమార్థం , పవిత్రత, సార్థక్యం, సకలం ఉంటాయి; రొటీన్ జానర్ లో కొట్టుకుపోయే రచయిత కాదు, హిపోక్రసీ ఏ మాత్రం లేని మనిషి. మిక్కిలి ధన్యవాదాలు అండి.

    మంచి కథనాన్ని అందించా👌

  12. మనుషుల్లో భగవంతుడు సూర్య భగవానుడు

  13. గంగన్న వ్యక్తిత్వాన్ని, తత్వాన్ని కళ్ళకు కట్టారు సార్. కళ్ళు చెమర్చాయి.

  14. గంగా రెడ్డి గారు మరియు అతని మిత్ర బృందానికి శతకోటి వందనాలు..

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading