ఎన్.హెచ్.44 -1

మొన్న మార్చి 28 సాయంకాలం హోటల్ దసపల్లా మేడమీద ఎమెస్కో సంస్థ నిర్వహించిన సాహిత్యసాయంకాలానికి వచ్చిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ రోజు నా కథల సంపుటిని పద్మభూషణ్ డా. వరప్రసాద్ రెడ్డిగారు ఆవిష్కరించారు.

‘వాడ్రేవు చిన వీరభద్రుడు కథలు 1980-2023’ సంపుటి ఎమెస్కో బుక్స్, విజయవాడ వారిదగ్గర లభ్యమవుతుంది. కావలసినవారు emescovja@gmail.com, sahiti.vja@gmail.com, http://www.emescobooks.com లేదా 0866-2436643 ను గాని సంప్రదించవచ్చు. పుటలు 504+4, వెల రు.300.

ఆ కథల సంపుటిలోంచి ఒక పెద్ద కథ ఈ రోజూ, రేపూ మీతో ఇక్కడ పంచుకుంటున్నాను.


ఎన్.హెచ్.44

జూన్‌ 10, 2020

నేషనల్‌ హైవే 44. కన్యాకుమారి నుండి కాశ్మీరు దాకా మొత్తం భారతదేశాన్ని కలిపే అత్యంత సుదీర్ఘమైన రహదారి. దాదాపు పధ్నాలుగు రాష్ట్రాల్ని కలిపే ఆ దారిమీద నిజామాబాదు జిల్లాలో పెర్కిట్‌ గ్రామం. ప్రపంచం గతంలో ఎప్పుడూ చూసి ఉండని మహమ్మారి మధ్య అక్కడ యాభై అయిదు రోజులుగా నడుస్తున్న ఫుడ్‌ కాంపు చివరి రోజు.

మార్చి 22 న భారతప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ ప్రకటించినప్పటినుంచి మనుష్య సంచారం మీద కనీ వినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించడం మొదలయ్యాక, బతుకు తెరువుకోసం దూరప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలు, తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి ఎలాంటి రవాణా సాధనం దొరకని కాలంలో, ఇంత అన్నం, ఇన్ని మంచి నీళ్ళు కూడా దొరక్కుండా వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ పోతున్న రోజుల్లో వాళ్ళ ఆకలితీర్చడానికి స్వచ్ఛందంగా నడిపిన కాంపులో చివరిరోజు.

దారుణమైన ఆ పరీక్షాకాలంలో మొదట్లో రోజుకి మూడునాలుగువేలమంది వలసకూలీలతో మొదలైన సంతర్పణ ఒక దశలో రోజుకు ఆరేడువేలమందిదాక సాగింది. లాక్‌ డౌన్‌ నిబంధనలు సడలిస్తూ వచ్చిన కొద్దీ ఆ సంఖ్య నెమ్మదిగా పలచబడి చివరకి రోజుకి మూడునాలుగువందలకి చేరింది. ఇక హైవే మీద అక్కడక్కడా డాబా  తెరవడం మొదలయ్యాక కాంపు ముగించవచ్చని అందరూ తీర్మానించుకున్నారు.

కాంపు నడిచినన్నాళ్ళూ ఒక రాజకీయనాయకుడుగాని, ఒక మంత్రిగాని, ఒక ప్రతిపక్షనాయకుడుగాని, ఒక పత్రికాధిపతిగాని, ఒక పీఠాధిపతిగాని, ఏ ఒక్క మత ప్రచారకుడుగాని అక్కడ అడుగుపెట్టలేదు. ఏ ఉన్నతాధికారీ ఆ కాంపు సందర్శించాలనుకోలేదు. కాని చివరిరోజు జిల్లాకలెక్టరుని పిలవాలనుకున్నాడు గంగారెడ్డి. ఆ వచ్చిన అధికారి తనని ప్రశంసిస్తాడని కాదు. దాదాపు రెండునెలలు నిర్విరామంగా పనిచేసిన ఉపాధ్యాయులు, స్కూల్లో మధ్యాహ్నభోజనం వండిపెట్టే వంటమనుషులు నిస్వార్థంగా చేసిన కృషికి కనీసం కలెక్టరుతోనైనా ఒక ఫొటో ఏర్పాటు చేస్తే అది వాళ్ళకి గుర్తుగా ఉంటుందని.

కలెక్టరు నిజామాబాదునుంచి బయల్దేరాడని ఫోన్‌ వచ్చింది.

ఆ షామియానాలో బల్లలు, కుర్చీలు ఒక పక్కగా సర్ది మీటింగుకోసం ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. కేంపు నడిచినన్నాళ్ళు వెయ్యి చేతుల్తో పనిచేసిన టీచర్లు, ఎమ్యీవో రాజేశ్వర్‌, ఫతేపూర్‌  రమణ, బాల్కొండ రాజేందర్‌, మహర్షి, సాయన్న, ప్రభాకర్‌, బొయిడ నరసయ్య ఆ మీటింగు ఏర్పాట్లు మొదలుపెట్టారు. మధు, కుకునూరు రాజేందర్‌ల మొహంలో అలసట కనిపించడం లేదు. వంట మాష్టర్‌ రాంచందర్‌కి నిద్రాహారాలు అవసరమే లేదు.

పొద్దున్న అయిదింటినుంచీ అప్పటిదాకా నిమిషం విరామం లేకుండా పనిచేసిన గంగారెడ్డికి ఒక్కసారిగా తెలియని నిస్సత్తువ ఆవహించింది. శివాలయం ముందు షామియానా పక్కన ఒక కుర్చీ లాక్కుని కూచున్నాడు. మాన్‌సూన్‌ సీజన్‌ మొదలయినా ఇంకా ఎండ తగ్గలేదు. సాయంకాల సూర్యరశ్మి పొలాలమీంచి హైవేదాటి అవతలవైపు దాకా పరుచుకుంది. పసిడి ప్రవహిస్తున్నట్టున్న ఆ ఆ కాంతిలో షామియానాలు, మనుషులు, బల్లలు, కుర్చీల నీడలు అల్లిబిల్లిగా అల్లుకున్నాయి.

గంగారెడ్డి తనలో తనే నవ్వుకున్నాడు. ఒక రోజు ముగిసేక సాయంకాలం అవుతుందనీ, సూర్యుడు అస్తమిస్తాడనీ, అప్పుడు చివరి సూర్యకిరణాలు లోకమంతా పరుచుకుంటాయనీ అతడు ఇన్ని రోజులుగా మర్చిపోయాడు.

ఇంతలో ఎమ్యీవో రాజేశ్వర్‌ వచ్చాడు.

గంగారెడ్డి అలసిన కళ్ళతోనే అతని వైపు చూపులు తిప్పాడు. ఎట్లాంటి మనిషి రాజేశ్వర్‌ అనుకున్నాడు. ఈ రెండు నెలలూ అతను చేసిన పని మామూలు పనికాదు. ‘నాకో వంద మంది యువకుల్నివ్వండి, ఈ దేశ భవిష్యత్తు మార్చేస్తాను’ అని వివేకానందుడు అంటున్నప్పుడు ఆయన మనసులో బహుశా రాజేశ్వర్‌ లాంటి మనిషి ఉండి ఉండాలి అనుకున్నాడు గంగారెడ్డి.

‘సార్‌, నేపాల్‌  ఎల్లే  వలస కార్మికులు అన్నం తిని ఎక్‌స్ట్రా ఫుడ్‌ పాకెట్స్‌ కూడా తీసుకుని చేసి ఇప్పుడే బస్‌ ఎక్కిండ్రు. లాస్ట్‌ కార్మికుడు ఇప్పుడే మన కాంప్‌లో లాస్ట్‌ మీల్స్‌ తినిండు. కడుపు నిండిరదని సంతోషంగా నమస్తే చెప్పుకుంటూ ఎల్లిండు ’ అన్నాడు రాజేశ్వర్‌. అక్కడితో ఆగకుండా`

‘సార్‌, ఆయనతో  కలిపి 1,47,753 ప్లేట్లు అయినయి’ అని అన్నాడు.

‘మనం కేంపు పెట్టిణ్ణుండీ ఈ దారిన వెళ్ళిన ఏ ఒక్క వలస కార్మికుడూ ఆకలికడుపుతో ఈ కేంపు దాటలేదు సార్‌ ’ అని కూడా అన్నాడు.

ఆ మాట వినగానే గంగారెడ్డికి కళ్ళ నీళ్ళు ఆగలేదు. తన కన్నీళ్ళు రాజేశ్వర్‌  చూస్తే కంగారు పడతాడు. అంతా పని వదిలిపెట్టి తన దగ్గరకొచ్చేస్తారు. గంగారెడ్డి గిరుక్కున లేచి ‘మంచిది సార్‌, కలెక్టరు గారు బయల్దేరిండ్రంట, జర  మీరు అర్మూరు దిక్కు హైవేకే చూస్తూ ఉండుండ్రి’ అని, ఆ కుర్చీ పక్కకు లాగి, శివాలయం వైపు నడిచాడు.

అక్కడ, ఆ శివాలయం దగ్గర నిలబడి తనలోకి తాను చూసుకున్నాడు.

‘ఈ దారిన ఎవ్వరు కూడా ఆకలితో వెళ్ళకూడదు’ అని కదా తన సంకల్పం!

భగవంతుడు తన మనసులో మాట ఇలా వింటాడనిగాని, తాను విన్నానని మళ్ళా తనకిలా చెప్తాడని గాని గంగారెడ్డి అనుకోలేదు. నిజంగా ఇది ధన్యక్షణం. తాను మనిషిగా పుట్టినందుకు మనిషినని చెప్పుకోగల నైతికమైన హక్కు దొరికింది ఇన్నాళ్ళకి.

లక్షా యాభైౖ వేల మంది ఆకలి తీరింది. ఒకరోజు ఆకలి కాదు. ఆ వచ్చినవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేదాకా చద్దిమూటతో పాటు మంచినీళ్లు కూడా కట్టి ఇచ్చిన కేంపు అది. ఒక ఊరు వాళ్లు కాదు, పధ్నాలుగు రాష్ట్రాలవాళ్లు.

కాని ఆ క్షణాన గంగారెడ్డికి తన హృదయం అత్యంతం ద్రవించిన క్షణం అది కాదు, మరొకటిది ఉందని గుర్తొచ్చింది. అంతకన్నా విలువైన క్షణం. ఆ క్షణమే లేకపోతే ఈ క్షణం తనకి దొరికుండేదే కాదు.

అతని మనసులో గడచిన రోజులు డైరీలో పేజీల్లాగా కదలాడటం మొదలుపెట్టాయి.

2

మార్చి 29. 2020

లాక్‌డౌన్‌ మొదలై వారం రోజులు. మార్చి నెల మొదలైనప్పటి నుంచీ కరోనా వార్తలు అతను కూడా ఫాలో అవుతూ వచ్చాడు. భారతదేశంలో పరిస్థితి మరీ చైనాలోలాగా, అమెరికాలోలాగా, ఇంగ్లాండులోలాగా, యూరోపులోలాగా లేదనీ, ఇక్కడ అంతా బాగానే ఉంటుందని అందరిలానే అతనూ నమ్మాడు. ఆఫ్రికా దేశాల్లాగా భారతదేశం కూడా ఒక ట్రాపికల్‌ కంట్రీ కాబట్టి ఇక్కడ కరోనా మరీ అంతలా  వ్యాపించదనుకున్నాడు. కానీ ఇక్కడ కూడా లాక్‌ డౌన్‌ విధించకతప్పదని విన్నప్పుడు మహా అయితే వారం రోజులో, పదిరోజులో ఉంటుందనుకున్నాడు.

అందరిలానే అతను కూడా ఆ సాయంకాలం గంటలు మోగిస్తే, చప్పట్లు కొడితే కరోనా భయం నుంచి సమాజం బయట పడుతుందనుకున్నాడు.

అందరిలానే అతను కూడా రెండు వారాలకు సరిపడా ప్రోవిజన్లు తెచ్చుకున్నాడు. తనలాంటి మధ్యతరగతి భారతదేశం కరోనాలో కాలాన్ని గడపడం నేర్చుకుంటున్నట్టే తను కూడా యూట్యూబ్‌, నెట్‌ ఫ్లిక్స్‌, ఆమె జాన్‌ ప్రైమ్‌ నీడల్లో తలదాచుకోవచ్చనుకున్నాడు.

కానీ ప్రతి రోజూ సాయంకాలం సరుకులు తెచ్చుకోడానికి గంట పాటు ఆంక్షలు విధించినప్పుడు బయట ఏమి జరుగుతోందో చూద్దామని అతడు వీథిలోకి వెళ్ళకుండా ఉండలేకపోయేవాడు. మొదట్లో నాలుగైదు రోజులు ఏమీ తెలియలేదుగాని, నెమ్మదిగా, అతనికి విషయాలు బోధపడటం మొదలుపెట్టాయి.

వీథుల్లో నిన్నటిదాకా అడుక్కునేవాళ్ళు ఇప్పుడు కనిపించడం లేదు. నిన్నటిదాకా పార్కుల్లో, సిటీబస్సు స్టాండుల్లో, దుకాణాల ఎదురుగా పేవ్‌ మెంట్ల మీద పడుకునే నిరాశ్రయులు ఇప్పుడు కనిపించడం లేదు. వారు బతికే ఉన్నారా? వాళ్ళు రెండు వారాల ప్రోవిజన్స్‌ ఎలా తెచ్చుకుంటారు? ఎక్కడ దాచుకుంటారు? కాలింగ్‌ బెల్లుని కూడా శానిటైజ్‌ చేసే రోజుల్లో ఇళ్ళే లేనివాళ్ల సంగతేమిటి?

అతనికి ఆతృత హెచ్చడం మొదలయ్యింది. ఏదో తెలియని ఆందోళన. ఈ అందోళన తన ఒక్కడికే ఉందా? తక్కినవారికి లేదా? వాళ్ళలాగా తనెందుకు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు?

ఆ రోజు జిహెచ్‌ఎంసి వారి ప్రకటన ఒకటి చూసాడతను. కోవిడ్‌ 19 సమయంలో ఫుడ్‌ హెల్ప్‌ డెస్క్‌ ప్రకటన అది. కరోనా కాలంలో అన్నార్తులకి ఆహారం అందించడం కోసం దాతలు, కార్యకర్తలు ముందుకి రావాలని ఇచ్చిన పిలుపు అది. అప్పటికే గంగారెడ్డి సోషల్‌ మాధ్యమాల ద్వారా తనకు తెలిసినవారందరికీ ధైర్యం చెప్తూ ఉన్నాడు. కాని మొదటిసారిగా ఫుడ్‌ కేంప్‌ అనే మాట అతడి మనసులో ముద్రపడిరది.

14 ఏప్రిల్‌ 2020

ఆ రోజు పొద్దున్నే పేపరు తెరిచిన గంగారెడ్డి దృష్టి ఒక వార్త మీద పడిరది. ముంబైలో లాక్‌ డౌన్‌ ఆంక్షలు ధిక్కరించిన వలసకూలీల మీద పోలీసులు లాఠీ ఛార్జి చేస్తున్న ఫొటో. ఆ ఫొటో చూడగానే గంగారెడ్డికి ముందు ఆగ్రహం పొంగుకొచ్చింది. ఆ పోలీసులు తనముందే ఉన్నట్టుగా, ఆ లాఠీ ఛార్జి తన కళ్ళముందే జరుగుతున్నట్టుగా అనిపించింది.

ఆ పోలీసులు ఆ కూలీల్ని ‘రేయ్‌, ఆగుండ్రి, లాక్‌ డౌన్‌ అని తెలువద్‌ రా గాడిదా, యాడికిరా, లక్షలమంది గుంపులుగా బయలుదేరారు?’ అని అంటున్న దృశ్యం.

నెలరోజులుగా స్నానం చెయ్యని దేహాల్తో, మాసి చింకిపాతలవుతున్న గుడ్డల్తో, మాసిన గడ్డాల్తో, ఎండిపోతున్న డొక్కల్తో,  ఆ కూలీలు, ఆ లాఠీలకు చేతులు, మోచేతులు, వీపు అడ్డం పెట్టుకుంటూ ‘అయ్యా, కొట్టకండయ్యా, నెలరోజులైతుందయ్యా తిండికి కష్టమైతుంది. మా దేశం పోతున్నం’ అని అంటున్న దృశ్యం.

మళ్ళీ ఆ పోలీసులు ‘ఎన్ని సార్లు చెప్ప్రాల్రా? లాక్‌ డౌన్‌ అంటే యాడ వుంటే ఆన్నే సావాల, చల్‌ !’ అని మళ్ళా లాఠీలు ఎత్తడం.

ఆ కూలీలు, ఆ ఆడవాళ్ళు, ఆ చిన్నపిల్లలు ‘కొట్టకండయ్యా, పనిలేదు, ఇల్లు లేదు, తిండికి తిప్పలైతుంది, చిన్నపిల్లలున్నరు, వోళ్ళు పట్టించుకుంటున్నరు? భయమైతుంది! మా వూరికి మేం పోతామయ్యా’ అని ఆ పోలీసుల కాళ్ళమీద పడుతున్నట్టు-

కానీ భారతప్రధానమంత్రి అధ్యక్షతన నేషనల్‌ డిసాస్టర్‌ మేనేజిమెంటు అథారిటీ ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను అమలు చేయడమే తమ డ్యూటీగా భావిస్తున్న పోలీసులు, మళ్లా లాఠీలు ఎత్తుతూ ‘మళ్ళా అంతే! నోర్‌ ముయ్‌, లాక్‌ డౌన్‌ అంటే లాక్‌ డౌనే. యాడ ఉంటే ఆన్నే సావాల, లేకుంటే మాకుంటది’ అని వాళ్లని బాదుతున్న దృశ్యం.

ఆ కూలీలు ‘అయ్యా ఆ సచ్చేదేదో మా వూళ్ళోనే సస్తమయ్యా, ఈడ మాకు వోల్లున్నరు సారు! దయచేసి ఎల్తమయ్యా!’

‘షట్‌ అప్‌! అదంతా మాకు తెల్వద్‌.. నడుండ్రి, ఎనుకకు నడుండ్రి!’

‘అయ్యా మా పరిస్థితి?’

‘మాట్లాడొద్దన్ననా- నీ కర్మ, నడు, ఎనుకకు నడు.’

ఆ దృశ్యం, ఆ మాటలు, మళ్ళా ఆ ఫొటో, ఆ మాటలు- గంగారెడ్డికి తలతిప్పడం మొదలయ్యింది.

అతనికి దేశం రెండుగా చీలిపోయినట్టనిపించింది. నిజానికి ఇటువంటి విపత్తు విరుచుకుపడ్డప్పుడు, మానవజాతి కనీ వినీ ఎరుగని ఉపద్రవం ఎదురయినప్పుడు దేశం ఒక్కటికావాలి. కాని ఇదేమిటి? జీవితం తాలూకు సకల సౌకర్యాలూ సమకూరిన భద్రలోకం ఒక వైపూ, కనీస సౌకర్యాలకు కూడా నోచని బీదజనం మరొకవైపూ కనబడుతున్నారు.

ఇలాంటి విపత్తులో ఎలా నడుచుకోవాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా ప్రాణాలు కాపాడుకోవాలో- ఎవరికీ తెలీదు. ఏదైనా సమాచారం తెలిస్తే, సమాజంలో పై వర్గం వాళ్ళు వెంటనే జాగ్రత్తపడుతున్నారు. అన్ని ప్రికాషన్స్‌ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆ జాగ్రత్తలు ఒక రక్షణ. కాని ఆ జాగ్రత్తలే అట్టడుగు వర్గాలదగ్గరికి వచ్చేటప్పటికి ఆంక్షలుగా మారుతున్నాయి. హింసగా పరిణమిస్తున్నాయి.

ఇసకలో అయస్కాంతం పెట్టగానే ఇసుక ఒకపక్కా ఇనుపరజను మరొక పక్కా విడిపోయినట్టు, కరోనా దేశాన్ని రెండుగా చీల్చేసింది. సౌకర్యంవంతమైన జీవితాలు ఒకపక్కా, కనీస సౌకర్యాలకు నోచుకోని వారు మరొక పక్కా.

ఒకరికి భద్రత, మరొకరికి హింస- దీనికి కులం, మతం, ప్రాంతం, లింగం లాంటి ఏ ప్రాతిపదికా లేదు. ఉన్నది ఒకటే ప్రాతిపదిక. నువ్వు తలదాచుకోడానికి నీడ ఉందా- నీకు భద్రత. నువ్వు నిరాశ్రయుడివా? నీకు లాఠీదెబ్బలు!

టాల్‌ స్టాయి వాక్యాలు గుర్తొచ్చాయి గంగారెడ్డికి. సంతోషంగా జీవించేవారి జీవితాలన్నీ ఒక్కలానే ఉన్నాయి. కష్టాలు తప్పనివాళ్ళ కష్టాలే వేరువేరు. అవి కూడా వట్టి కష్టాలు కావు. వ్యవస్థ అంతా ఒక్కటై వాళ్లమీద విరుచుకుపడుతున్న వయొలెన్సు.

17 ఏప్రిల్‌ 2020

పేపర్లలో, సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన.

Are you facing any of the below issues due to Corona Virus Lockdown?

గంగారెడ్డి ఆ ప్రకటనని ఆశగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకలిగొన్నవాడికి పట్టెడన్నం దొరికితే రెండు చేతుల్తో ఎలా అందుకుంటాడో అలా.  నీటిచుక్క కనరాని  ఎడారిలో మైళ్లకి మైళ్ళు నడుస్తూ ఉన్న పాంథుడికి ఒక నీటిపిడత చేతికందితే దాన్ని ఎంత భక్తిశ్రద్ధలతో పెదాలకు చేర్చుకుంటాడో అలా.

అది ఒక ఎన్‌జిఓ ఇచ్చిన ప్రకటన. అందులో కరోనా సమస్యల జాబితా ఉంది. కాని గంగారెడ్డిని  ఆకట్టుకున్నది ఆ సమస్యలు కాదు. ఆ లిస్టులో అన్నిటికన్నా మొదటి సమస్య, వలసకూలీల సమస్య.

ఓ! ఇది ముంబైలోనే కాదు, హైదరాబాదులో కూడా ఉందన్నమాట అనుకున్నాడు. ఆ క్షణాన అతనికి సంజీవరెడ్డి నగర్‌ బస్‌స్టాపు దగ్గర కనిపించకుండా పోయిన బెగ్గర్లు ఒకరొకరే గుర్తుకొచ్చారు. వాళ్ళ గురించి కూడా ఎవరో ఆలోచిస్తున్నారన్నమాట.  ఆలోచించడమే కాదు, ఒక హెల్ప్‌ లైను కూడా తెరిచారట.

ఫోన్‌ కనెక్షనూ, ఇంటర్నెట్టూ ఓటీటీ కోసం మాత్రమే అనుకోని వాళ్లు ఇంకా ఎవరో ఉన్నారన్నమాట.

గంగారెడ్డి వాళ్ళకి వెంటనే ఫోన్‌ చేసాడు. కొంత డబ్బు పంపించాడు. ఒకేలాంటి తపన ఉన్న నలుగురు మిత్రులు కలిస్తే తను కూడా ఒక హెల్ప్‌ లైన్‌గా మారొచ్చని అనుకున్నాడు.

19 ఏప్రిల్‌ 2020

గంగారెడ్డికి అహర్నిశలు ఇదే ధ్యాస. కళ్ళుమూసుకుంటే చాలు వందలాది, వేలాది, లక్షలాది నిరాశ్రయులు, వలసకూలీలు, అడుక్కుతినే వాళ్ళు కనబడుతున్నారు. వాళ్లెక్కడున్నారు ఈ లాక్‌ డౌన్‌లో? వాళ్ళకి ఎవరు అన్నం పెడుతున్నారు? బయటికి వెళ్లి చూద్దామంటే కఠినాతికఠినమైన లాక్‌ డౌన్‌ నిబంధనలు.

‘షూట్‌ ఎట్‌ సైట్‌’ అనే మాట కూడా ఎక్కడో చదివాడు. ఆకలికి తాళలేక లాక్‌ డౌన్‌ని లెక్కచెయ్యలేకపోతున్న వలసకూలీలమీద పోలీసులు విరుచుకుపడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో నెమ్మదిగా పెరుగుతున్నాయి.

కాని అతను వెతుక్కుంటున్నది నిబంధనల్ని సడలించారా లేదా అని కాదు, లాక్‌ డౌన్‌ ఎన్నాళ్ళు నడుస్తుందని కూడా కాదు. ఒక మిత్రుడు రోజూ అమెరికానుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల రిపోర్టు సోషల్‌ మీడియాలో పెడుతూ ఉన్నాడు. గంగారెడ్డి ఒకటిరెండురోజులు ఆ రిపోర్టు ఆసక్తిగా చూసాడు. మూడో రోజునుంచి దానిమీద ఆసక్తిపోయింది. అవి అంకెలుగా తప్ప మనుషులుగా కనిపించడం మానేసింది అతనికి.

ప్రతి రాత్రీ టెలివిజన్లో భారత ప్రభుత్వ వైద్య అరోగ్య శాఖ ప్రతినిధి చక్కగా గెడ్డం గీసుకుని, ఫుల్‌ సూటులో నిండుగా కూచుని కరోనా వైరస్‌ అప్‌ టుడేట్స్‌ ఇస్తున్నాడు. గంగారెడ్డి ఆ వార్తలు కూడా చూసాడు నాలుగైదురోజులు.

కానీ అవి వట్టి రిపోర్టులు. అందులో మనుషులు కనిపించడం లేదు. సంజీవరెడ్డి నగర్‌ పోలీసు స్టేషన్‌ పక్కన చెప్పులు కుట్టుకునే వాళ్లు ఏమైపోయారో ఆ నివేదికల ద్వారా అతనికి తెలియడం లేదు. ఆ రోజు ముంబైలో లాఠీ ఛార్జికి గురయిన ఆ కూలీలు ఏమైపోయారు. వాళ్ళు కోరుకున్నట్టే వాళ్ళ ‘దేశం’ వెళ్ళగలిగారా? లేకపోతే  ‘యాడ ఉండెటోళ్లు  ఆడ్నే సచ్చిపోయిండ్రా?’

కూరగాయలు, పాల పాకెట్లు ప్రతి ఒక్కటీ కడుక్కోకుండా ముట్టుకోవాలంటే భయంతో, వైరస్‌ ఏ గాల్లోంచి, ఏ చేతుల్లోంచి, ఆ శ్వాసలోంచి, ఏ నోటితుంపరలోంచి ఇంట్లో అడుగుపెడుతుందో, ఎప్పుడు అడుగు పెడుతుందో అని భయంతో తక్కిన ప్రపంచమంతా బిక్కుబిక్కు మంటున్న కాలంలో గంగారెడ్డికి లోపల ఎక్కడో ఒక ధైర్యం. కాని తన అంతరంగంలో తనని చల్లగా తాకుతున్న ఆ ధైర్యాన్ని నలుగురికీ అందించాలంటే ఏదో చెయ్యాలి.

అలాంటి ఒకరోజు,

పేపరులో ‘గోసనిపిచ్చింది’ అని వార్త, ఒక ఫొటో కనిపించాయి.

ఆసక్తిగా ఆ వార్త చదివాడు. జగిత్యాల నుంచి ఒక స్థానిక విలేకరి రాస్తున్నాడు:

‘ఆడకట్టుకున్నోళ్లంతా కూలీలే. .పనిచేస్తేనే ఆళ్ళ కడుపులకు పట్టెడన్నం పోయేది. లేకపోతే ఉపాసమే. లాక్‌ డౌన్‌తో ఇంట్లకేని ఎవ్వరూ బైటికెళ్లలేరు. కనీసం పిల్లలకు బువ్వపెట్టలేకపోతుండ్రు. .ఈ పరిస్థితిని చూసి ఓ నిరుపేద 70 ఏండ్ల వృద్ధురాలు చలించిపోయి నాలుగేండ్లుగా దాచిన రు. 25 వేలు దానం చేసింది.’

ఆ  తర్వాత ఆ కింద ఏమి రాసిందో చదవడానికి ముందు గంగారెడ్డి  ఆ ఒక్క పేరానే నాలుగు సార్లు చదివాడు. చదువుతున్నంతసేపూ అతని కళ్ళు తడిసిపోతూనే  ఉన్నాయి.

‘70 ఏళ్ళ వృద్ధురాలు!’

‘నాలుగేండ్లుగా దాచుకున్న 25 వేలు!’

‘దానం చేసేసింది!’

మామూలు మామూలు మాటలా అవ్వి?

ఎక్కడో ఏదో సినిమాలో ఎవరో చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. సంతోషమంటే ఏమిటి అని ప్రశ్నిస్తుంది ఒక పాత్ర. అప్పుడు తనే చెప్తుంది. సంతోషమంటే, డెబ్భై ఏళ్ళ వృద్ధులు చెట్లు నాటడం అని. తాము ఆ చెట్టునీడన కూచునే అదృష్టానికి నోచుకోమని తెలిసి కూడా చెట్లు నాటడం!

కాని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గొల్లపల్లి బుచ్చవ్వ తన డెబ్భై ఏళ్ల వయసులో, ఒక చెట్టు నాటింది. మొక్క కాదు, మహావృక్షం నాటింది.

 ఆ దారిన ఎండనపడిపోతున్నవారి ముందు ఆ నీడ పరిచింది.

గొల్లపల్లి బుచ్చవ్వ ఇండ్లల్లో బట్టలుతుకుతుంది. ఆమె భర్త గంగారం వాటిని ఇస్త్రీ చేస్తాడు. రెక్కాడితేగాని డొక్కడని వాళ్లు. నాలుగేళ్ళుగా కూడబెట్టుకున్న తమ చెమట, పాతికవేలు, ఒక్కొక్క కూలీ కుటుంబానికీ పదిహేనువందల చొప్పున పదహారు కుటుంబాలకి పంచిపెట్టేసారు.

‘సంపాదించిన పైసలు నెత్తిల వెట్టుకుని పోతమా సార్‌. పోరగాండ్ల తిండికి మన పైసలు అక్కరకు అచ్చినయంటే..అంతకంటే సంబురం ఏముంటది సార్‌?’ అని అన్నదట ఆ బుచ్చవ్వ.

‘పైసలు నెత్తిన వెట్టుకుని పోతమా?’

తాను ఇంతదాకా ఎంతో కొంత సాయం చేస్తూనే ఉన్నాడు. కాని బుచ్చవ్వ చేసిన సాయంలో మరేదో ఉంది. అదేమిటని ఆలోచించాడు. అవును, ఆమె ఎంతో కొంత చేయలేదు. తాను దాచుకున్న సమస్తం త్యాగం చేసేసింది.

25 ఏప్రిల్‌ 2020

గొల్లపల్లి బుచ్చవ్వ మాటలు గంగారెడ్డిని వదలడం లేదు.

ఇప్పుడు కరోనాలో అంతా ఆన్‌ లైన్‌ ఎడ్యుకేషన్‌ గురించి మాట్లాడుతున్నరు. అలాంటిది తాను ఇరవయ్యేళ్ళకిందటనే ఆన్‌ లైన్‌ ఎడ్యుకేషన్‌ మొదలుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా లెర్నర్లనీ, టీచర్లనీ ఆన్‌ లైన్‌ ప్లాట్‌ ఫారంలో ఎలా కలపొచ్చో హైదరాబాదుకి చూపించాడు. అది తనలోని ఎంటర్‌ప్రెన్యూర్‌ని నిద్రలేపింది. లండన్‌ వెళ్ళి ఎంబిఏ చేసాడు. ఆక్కడ ఆమెజాన్‌ కంపెనీలో మంచి జీతం  మీద ఉద్యోగం కూడా చేసాడు. కాని  తెలంగాణాలో సాగునీటి సమస్య, గల్ఫ్‌ దేశాలకు పోయిన తెలంగాణా వలసకూలీ మరణాలు అతణ్ణి ఇక్కడికే రమ్మన్నాయి.

అప్పటికింకా ఆంధ్రపాలనలోనే తెలంగాణా నడుస్తోంది. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఇంకా పూర్తిగా ఊపందుకోలేదు.  రాజకీయ కార్యకర్త అన్నిటికన్నా ముందు ప్రజాకార్యకర్త కావాలి. వాళ్లల్లో ఒక్కడు కావాలి. వాళ్ళ కష్టసుఖాలు తనవి కావాలి. అందుకని బాల్కొండ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజల్ని కలవడం మొదలుపెట్టాడు. ఈలోగా నవతెలంగాణా పార్టీ ప్రభవించింది. ఆ అధినేత తనని కూడా తమతో కలిసి పనిచేయమన్నాడు. సరేననన్నాడు. పనిచేసాడు, అహర్నిశలు, టిక్కెట్టుకోసం కాదు, ప్రజలకి భరోసా ఇవ్వడానికి. తాను దాచుకున్న పైసలు కర్చయిపోయాయి. కొనుక్కున్న ఇల్లు అమ్మేసాడు. అప్పులు మొదలయ్యాయి. నవతెలంగాణా పార్టీ ప్రజారాజ్యంలో విలీనమైపోయింది. తన బదులు ఒక ఎన్నారైకి బాల్కొండ టిక్కెట్టు ప్రకటించారు. అదీ తన మంచికే అనుకున్నాడు గంగారెడ్డి.

జరిగిన సంఘటనలన్నీ గంగారెడ్డి మనసులో మళ్ళా సినిమారీలులాగా తిరుగుతున్నాయి. జీవితంలో నాటకాన్ని మించిన నాటకీయత ఉంది. ప్రజలకి చేరువ కావడానికి వాళ్లతో కలిసి పనిచెయ్యడంతో పాటు మన భావాలు, మన ఆలోచనలు మరింత శక్తిమంతంగా ప్రజలకు చేరేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.

అలా ప్రజలకి చేరువకావడానికి రాజకీయాల్తో పాటు అంతే శక్తిమంతమైన సాధనం సినిమా అనుకున్నాడు. ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లో చేరాడు. డైరక్షన్‌, ఎడిటింగ్‌ల్లో ప్రావీణ్యం సంపాదించాడు. బయటికి వస్తూనే తను తీసిన మొదటి యాడ్‌ ఫిల్మ్‌నే చరిత్ర సృష్టించింది.

కానీ రాజకీయనాయకులూ, సినిమాలూ కూడా చూడలేని తావులున్నాయని గంగారెడ్డికి ఇప్పుడు తెలుస్తోంది.

ఎందుకంటే ఆ రోజు పేపర్లో ఒక వార్త చూసాడు గంగారెడ్డి.

ముగ్గురు వలసకూలీలు, ఆడవాళ్ళు హైదరాబాదు శివార్లలో కొంపల్లిలో కూలిపని చేసుకుంటూ ఉన్నారు. వాళ్లది ఛత్తీసగఢ్‌. వాళ్ళతో పని చేయించుకున్న కాంట్రాక్టరు వాళ్లకి కూలీ ఇవ్వలేదు. వాళ్లకి హైదరాబాదులో బతకడం కష్టమైంది. వాళ్ళు కాలినడకన చత్తీస్గఢ్‌ బయల్దేరారు.

ముగ్గురి చంకనా ముగ్గురు చిన్నపిల్లలు.

మండుటెండలో నడుస్తున్న వాళ్ళని డిచ్‌పల్లి దగ్గర  ఒక విలేకరి ఫొటో తీసాడు. అప్పటికి ఆ ముగ్గురూ మరొక ముగ్గుర్ని ఎత్తుకుని 140 కిలోమీటర్లు నడిచారు. మరొక 750 కిలోమీటర్లు నడిస్తేగాని వాళ్ళు తమదనే చోటు చేరుకోలేరు.

గంగారెడ్డి ఆ ఫొటోని చాలా సార్లు చూసాడు. ఆ ఆడమనుషుల కాళ్ళకి చెప్పులున్నాయా లేదా అని చూసాడు.

వాళ్ళకి కాళ్ళు చెప్పులున్నాయి.

కాని గంగారెడ్డి కాళ్ళకి బొబ్బలెక్కడం మొదలయ్యింది.

ఆ వార్త పడ్డప్పటినుంచి తాను చదివేటప్పటికి ఆ ముగ్గురూ ఎంత దూరం నడిచి ఉండగలరో లెక్కగట్టాడు. వాళ్లీ పాటికి బహుశా ముప్కాల్‌ చేరి ఉంటారు. వెంటనే ఆ విలేకరికి ఫోన్‌ చేసి ముప్కాల్‌ మండల ప్రెసిడెంటు నంబరు పట్టుకున్నాడు. అతనికి ఫోన్‌ చేసాడు. వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేసి ఏం సాయంకావాలంటే ఆ సాయం చెయ్యమన్నాడు. ఆ డబ్బు తనిస్తానన్నాడు.

కానీ అప్పటికే వాళ్ళు ఆ ఊరు దాటిపోయారు.

28 ఏప్రిల్‌ 2020

లాక్‌ డౌన్‌ మొదలయ్యాక మధ్యతరగతి భద్రజీవులు ఎవరిళ్ళల్లో వాళ్ళు గడపడం మొదలుపెట్టినా భద్ర జీవితాలన్నీ ఒక్కలానే గడుస్తున్నాయని గంగారెడ్డికి అర్థమయింది. తన స్నేహితుల వాట్స్‌ గ్రూప్‌ చూస్తాడు. అందులో లాక్‌ డౌన్‌ కష్టాలు కనిపిస్తూంటాయి. ఏమి కష్టాలు అవి!

లాక్‌ డౌన్‌ మొదలయ్యాక భార్యా, భర్తా తెల్లవారిలేచినప్పటినుంచీ ఒకరిమొకం ఒకరు చూసుకుంటూ ఉండటంలోని కష్టాలు! మగవాళ్ళు వంట చెయ్యవలసి రావడంలోని కష్టాలు! చూడవలసిన సినిమాలు అన్నీ చూసేసామనీ ఇంకా చూడటానికి సినిమాలు లేవనే కష్టాలు!

అవేనా? ఇంకా ఉన్నాయి కష్టాలు. ఒక సినిమా హీరో ఇంట్లో దోసె వేస్తున్నట్టు రీలు పెట్టాడు. ఇప్పుడు మేం కూడా దోసెలు వెయ్యాలి, వీడియోలు షేర్‌ చెయ్యాలి. ఒక యువహీరో చీపురుతీసుకుని తన ఇల్లు ఊడ్చుకున్నాడు. దాంతో అతను నిజజీవితంలో కూడా హీరో అయిపోయాడు. ఇప్పుడు మేం కూడా ఇల్లు వూడ్చాలి, ఫొటోలు పెట్టాలి.

కాని గంగారెడ్డి కష్టం వేరే. అతను తనని వేధిస్తున్న, హింసిస్తున్న వ్యథని వాట్సప్‌ గ్రూప్‌లో షేర్‌ చేసుకోబోయాడు. కాని మొదటి పోస్టుకే విచిత్రమైన స్పందన వచ్చింది.

ఒకడు, వాడు తనకి చాలా దగ్గర మిత్రుడు. చిన్నప్పణ్ణుంచీ చూస్తున్నాడు వాణ్ణి. సాఫ్ట్‌వేర్‌లో బాగా నిలదొక్కుకున్నవాడు.

‘ఎవరి కష్టాలో ఎందుకు షేర్‌ చేస్తున్నవ్‌ మిత్రమా! అందరం కష్టాల్లో ఉన్నోళ్ళమే! నీకు తెలుసా? కరోనాకి కరుణ లేదు. ఎప్పుడు ఎవర్ని లేపేస్తుందో తెల్వదు’ అని రాసాడు. ఆ కామెంటు చివర ఒక స్మైలీ కూడా పెట్టాడు.

గంగారెడ్డికి ఎన్నడూ లేనంత ఒంటరితనం ఆవహించింది. అలాంటి రోజుల్లో, ఒక రోజు, మళ్ళా మరొక వార్త.

ఒక మిత్రుడు ఫేస్‌ బుక్‌ లో పోస్టు చేసిన వార్త. జగిత్యాల జిల్లాలో బీర్పూర్‌ మండలంలో తాళ్ళ ధర్మారం గ్రామం మీదుగా యాభై మంది వలస కూలీలు ఛత్తీస్‌ గఢ్‌ వెళ్తూండటం ఆ గ్రామ సర్పంచు చూసాడట. తన గ్రామంలో ఉన్న యువతని పిలిచాడట. ఆ రాత్రి వాళ్ళంతా ఆ కూలీలకి అన్నం పెట్టారట. అదీ ఆ పోస్టులో సారాంశం.

గంగారెడ్డి వెంటనే జగిత్యాల మిత్రుడు చిట్నేని విజయకుమార్‌ ద్వారా ఆ సర్పంచ్‌ కి ఫోన్‌ చేసాడు. ఆ కూలీల సమస్య అతణ్ణి నివ్వెరపరిచింది. వాళ్ళు మహారాష్ట్ర వెళ్ళాలి. కాని ఎలా వెళ్ళాలో తెలీదు. వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మేస్త్రీలు వాళ్ళని లారీల్లో, రైళ్ళల్లో పట్టుకొస్తారు. తాము ఎక్కడికి  వెళ్తున్నారో, ఏ దారిన వెళ్తున్నారో తెలియకుండానే ఆ కూలీలు పని వెతుక్కుంటూ పోతారు. తీరా ఇలాంటి సమయాల్లో వాళ్ళకి తమ ఊరు ఎక్కడుందో తెలియదు. ఎలా తిరిగి వెళ్ళాలో తెలియదు.

గంగారెడ్డి చలించిపోయాడు. వాళ్ళకి ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తానని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయుంటే ఆ దారిన మళ్ళా ఎవరొస్తే వాళ్ళకన్నా సాయం చెయ్యండి, మీకు అన్నిరకాలుగా తోడుగా ఉంటాం

వెంటనే అతనికి తన మోతె గ్రామమిత్రుడు రాజేష్‌ గుర్తొచ్చాడు. అతను ఎన్‌.హెచ్‌-44 మీద బాంకు మానేజరుగా పనిచేస్తున్నాడు. అతనితో పాటు తన క్లాస్‌ మేటు, మంచి వంటకాడు బాపురావు గుర్తొచ్చాడు. వాళ్లని తక్కిన మిత్రులతో కలిసి ఆ రోడ్డుమీద ఏ కూలీలు కనబడితే వాళ్లకి అన్నం పెట్టమని చెప్పాడు. దాదాపు మూడువందల మంది ఆకలి తీరింది ఆ రోజు.

1 మే 2020

టెలివిజన్‌ లో న్యూస్‌ వస్తోంది. తెలంగాణా నుంచి ఛత్తీస్‌గఢ్‌ కి ప్రత్యేకంగా రైలు వేసారట. వలసకార్మికుల్ని క్షేమంగా చేర్చడం కోసం.

ఆ దృశ్యం చూస్తూనే గంగారెడ్డి వలవలా ఏడ్చేసాడు. చిన్నపిల్లవాడిలా ఏడ్చేసాడు.

‘క్షేమంగా వెళ్లండి. మమ్మల్ని క్షమించండి. ఇదే పని కొన్ని రోజులముందు కూడా చేసి ఉండవచ్చు. రోడ్లెంబడి మీ పాదముద్రలు పచ్చిగా అలా పడి ఉండేవి కావు. మీ పిల్లల ఆకలి కేకలు అలా గాలిలో ఎగసి ఉండేవి కావు. దిగులు పట్టిన మీ ఆడవాళ్ళ కంట్లో నీళ్ళు సుళ్ళు తిరిగేవి కావు’ అనుకున్నాడు

‘మమ్మల్ని సమర్థించుకోడానికి మాకు చాలా కారణాలు వుంటాయి. మాటలు నేర్చినోళ్ళం! లెక్కలు తెలిసినోళ్ళం !’ అని కూడా అనుకున్నాడు.

2 మే 2020

ఇరవై నాలుగ్గంటలు. అతికష్టమ్మీద గడిచాయి. గంగారెడ్డి మనసులో చెప్పలేని ఉద్వేగం. ఏం చేసైనా సరే ముందు ఎన్‌.హెచ్‌.44  మీదకి వెళ్ళాలి. ఏ దూరప్రాంతాలనుంచో మరే దూరప్రాంతాలకో నడుచుకుంటూపోతున్న వలసకూలీల్ని పలకరించాలి. వాళ్లకి ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలో తెలీదు. కాని ఇంట్లో మటుకు కూచోగూడదు.

`యెట్లెల్తవ్‌?

`కారుమీద.

`మరి నీ భార్య, పిల్లవాడు.

`వాళ్ళని కూడా తీసుకుపోతా.

`నిన్ను పోలీసులు పట్టుకుంటే? నీ కారు సీజ్‌ చేస్తే? నీ లైసెన్సు కాన్సిల్‌ చేస్తే?

`తెలుసా? 144 సెక్షను అమల్లో ఉంది. రోడ్డుమీద కనిపిస్తే కాల్చేస్తారు.

` ఇవన్నీ తప్పించుకున్నావే అనుకో. తోవలో వైరస్‌ నీకూ, నీ కుటుంబానికి పట్టుకుంటే?

`ఏమో, అవన్నీ తెలువదు. ముందెట్లైనా  సరే ఎల్లి పోవాలి. ఈ ఇంట్లో ఉండలేను. ఈ లాక్‌ డౌన్‌, ఈ టీవీ, ఈ హాట్‌ స్టార్‌, ఈ యూట్యూబ్‌, ఈ వాట్సప్‌ గ్రూప్‌- వీటన్నింటినుంచీ బయటపడాలి.

`ఎప్పుడు ఎల్తవ్‌? కఠినాతికఠినమైన లాక్‌ డౌన్‌  ఆంక్షలు..

`ఏం పోలీసులు మాత్రం మనుషులు కారా? కనికరించరా? వాళ్లకి నిద్రరాదా? నా పోలీసు దోస్తుల్ని అడిగాను! ఆల్లు చెప్పిందాన్నిబట్టి అర్తమైంది.  నడిరజాము  ఒంటిగంటకీ, రెండిరటికీ మధ్యలో వాళ్ళ కళ్ళు మూతలు పడతాయని. అప్పుడు ఎల్తాను.

`హైవే. హైదరాబాదు నుంచి ఆర్మూరు 180 కిలోమీటర్లు. ఆర్మూరు నుంచి మోతె పదిహేను కిలోమీటర్లు. రెండు వందల కిలోమీటర్లు దాటగలిగితే, ఎలాగైనా మోతె చేరుకోగలిగితే` అది మా ఊరు, అక్కడ ఎవరో ఒకరు పలుకుతారు, చెయ్యి కలుపుతారు. నేనేదో ఒకటి చెయ్యగలుగుతాను.

రెండవ తేదీ రాత్రి రెండు గంటలు దాటాక గంగారెడ్డి తన భార్యనీ, పిల్లవాణ్ణీ నిద్రలేపాడు. కిందకు పోయి కారులో కూచోమన్నాడు. లాక్‌ డౌన్‌ రోజులు కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఇంట్లో దాచుకున్న కాష్‌ అంతా తీసుకున్నాడు. రెండు జేబుల్లోనూ పెట్టుకున్నాడు. ఎంత? ఏమో తెలియదు. లెక్కపెట్టుకునే టైము లేదు.

క్రేటా, హ్యుండయ్‌ 2019 మోడలు, ఇమ్మాక్యులేట్‌ వైట్‌. ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కారు.

అన్ని భయాలూ పక్కన పెట్టి కారు స్టార్ట్‌ చేసాడు.

(ఇంకా ఉంది)

1-4-2023

8 Replies to “ఎన్.హెచ్.44 -1”

  1. కరుణరసాత్మక గాథ చదువుతుంటే గుండె కలికలు అయింది సర్. పురుషులకు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన పలుకులు నిజం చేసారు గంగారెడ్డి గారు.

  2. జైగురుదేవ్
    ఇది కథ కాదు సర్.. మనసుల్ని మనుషుల్ని కదిలించే జీవన పోరాటం.

  3. ఆనాటి ఆ రోజుల్లో గంగారెడ్డి గారు అందించిన సేవ రంతిదేవుని కథను జ్ఞప్తికి తీస్తుంది.
    ఎవరికీ వారు తమ తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్న కాలం లో ప్రాణాలకు తెగించి ,అందరినీ కలుపుకొని అందించిన సేవ
    చిరస్మరణీయం..ఆ సంఘటనలకు అక్షర రూపం
    NH 44-1.
    చాలా బాగుంది.
    ఆకలి కి అన్నం పెట్టేవారు అమ్మా నాన్నలు.

  4. తోటి వారి కష్టాలు, కడగండ్లు చూసి దాదాపు అందరి హృదయాలు ద్రవించినా.. ఆ వేదనను పక్కకు నెట్టి.. పరులకు తమ వంతు సహాయం చేసే కారణజన్ములు కొంతమందే ఉంటారు.. అలాంటి మహానుభావులందరికీ వేల వేల వందనాలు.

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading