ఆ ఒక్క క్షణమే

Reading Time: < 1 minute


సగం తవ్విపోసిన ఇనుప ఖనిజంలాగా
సికింద్రాబాదు రైల్వే స్టేషను.
ఎండి పోతున్న గోతుల్లోంచి
పెల్లురేగిన ఈగల్లాగా
బిలబిల్లాడుతూ మనుషులు.

పెట్టెలు మోసుకుంటూ
మెట్లు దిగుతుండగా
ఎక్కణ్ణుంచో
తొలి కోకిల పిలుపు.

ఆ ఒక్క కూజితం
క్షణంలో
ఆ రైల్వే స్టేషన్ని మాయం చేసేసింది
ఎటు చూడు విరబూసిన బూరుగ చెట్లు,
తేనెలు రాలుతున్న పూలు.

ఆ ఒక్క క్షణమే.

మళ్లా నా చుట్టూ ఖణేల్మంటూ హారన్లు
దారిపొడుగునా ఉమ్ములు.

30-3-2023

15 Replies to “ఆ ఒక్క క్షణమే”

  1. చక్కటి కవిత.
    నేను మాత్రం
    ఆ మొదటి లైన్ దగ్గర ఆ ఉపమానంతో సికింద్రాబాద్ స్టేషన్ ని ఊహించుకుంటూ…
    పిబిడివి ప్రసాద్

  2. రణగొణ ధ్వనుల జనారణ్యంలో..
    వసంతానందం క్షణికమే..
    తరువాత అంతా.. షరా మామూలే!!

    బాగా చెప్పారు.. నమస్కారములు

  3. వైరుధ్యాలు గమనిస్తాం కానీ మీ కవి హృదయం సున్నితం మరియు గొప్పది.. చాల బాగుంది కవిత ఆర్యా..🙏🌷🌷

  4. రణగొణల ధ్వనులను వినకుండా ఉండడానికి పక్షుల సంగీతం వదులుకోవాల్సి వచ్చింది

Leave a Reply

%d bloggers like this: