వేదన వెలుగుగా మారిన వేళ-3

Kattu Alagiya Singar Temple, Tiruchirapalli

తాయుమానవర్ గుడినుంచి మేము నేరుగా మరలా శ్రీరంగం వెళ్ళాం. నిన్న రాత్రి రంగనాథస్వామి, ఆండాళ్ మాతల దగ్గర లభించిన దర్శనం తాలూకు అనుభూతి తాలూకు పరిమళం ఇంకా తాజాగానే ఉంది. పొద్దుటిపూట కావడంతో సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. కాని నిన్నటికన్నా ఇంకా ఎక్కువ దగ్గరగా స్వామిని చూసే అవకాశం లభించింది. ఆయనకు నూతనవస్త్రాలు సమర్పించుకున్నాం. నిన్న ఆయన నేత్రాలు చూసే అవకాశం దొరికితే ఈ రోజు ఆయన పాదాలు చూసే అవకాశం లభిమించింది. విష్ణుపాదాలు. ఋగ్వేదంలోని విష్ణు సూక్తంలో మాట పదే పదే గుర్తొస్తూ ఉంది.

ఇదమ్ విష్ణుర్ విచిక్రమే త్రేధా నిదదే పరమ్
సమూఢం అస్య పాగ్ంసురే (1:154:8)

(ఈ లోకమంతా విష్ణువు వ్యాపించి ఉన్నాడు, మూడు పాదాలతో సమస్తం ఆవరించి ఉన్నాడు. ఈ భువనమంతా ఆయన పాదధూళి)

లోకాలన్నీ విష్ణుపాదధూళి అని చూడగలిగిన ఆ ఋషి దర్శనం మామూలు దర్శనం కాదు. ఆ పాదధూళి అనే మాటలో సమస్త విశ్వం, గెలాక్సీలు, నెబ్యులాలు, మనకు తెలిసిన రోదసి, పాలపుంత, తెలియని సమస్తం ఇమిడి ఉన్నాయి. మహాతేజోవంతమైన ఆ పాదధూళిని చూసినతరువాత మనకు ఇక చూడవలసినదంటూ ఏమీ లేదని తెలుస్తుంది.

స్వామిదగ్గరనుంచి అమ్మవారి దగ్గరకు వెళ్ళాం. ఆమెకు కూడా నూతనవస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించుకున్నాం. ఆమె మూడు రూపాలూ రాత్రికన్నా ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ముందు ఉత్సవరూపంలో భూదేవి. ఆమె వెనక ఆండాళ్. ఆ వెనక రంగనాయకిదేవి. త్రిలోకాలను మూడు పాదాలతో ఆవరించిన వాడి లక్ష్మి, వైభవం, సంతోషం సమస్తం ఆమె.

శ్రీరంగదేవాలయ దర్శనం పూర్తయ్యేటప్పటికి పదకొండు దాటింది. ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. మేము నేరుగా యాత్రీనివాస్ కు వెళ్ళిపోయాం. అక్కడే భోజనం చేసి సాయంకాలం దాకా ఎక్కడికీ కదలకుండా కాటేజిలోనే ఉండిపోయాం.

విజ్జి వాళ్ళ పెద్దమేనమామ గారు శ్రీరంగంలో మాకు నిర్దేశించిన దర్శన క్రమంలో మేము చూడవలసిన మరొక ఆలయం నరసింహాలయం. సాయంకాలం ఆ గుడికి వెళ్ళాం. ఆ దేవుడి పేరు కాట్టు అళగీయ సింగర్.

దేవీదేవతలు వెలసిన తావులు భారతదేశమంతా కనిపిస్తాయిగాని, తమిళనాడులో ఆ దేవీదేవతలు కవితాత్మక దేవతలు. కాట్టు అళగీయ సింగర్ అంటే అడవిలో అందమైన సింహం అని అర్థం చెప్పింది విజ్జి. అందమైన అడవి సింహం అని కూడా అనవచ్చు. సింహం నిజానికి అడవిలోనే అందంగా ఉంటుంది, నీళ్ళల్లో మత్స్యంలాగా, నింగిలో పక్షిలాగా. ఒకప్పుడు ఆ ప్రాంతమంతా అడవి అయి ఉండవచ్చు. ఆయన అడవిలో వెలిసిన దేవుడు. ఆ గుడిని ఏకాంతంతమన్ కోయిల్ అని పిలుస్తారని విన్నాను. అంటే ప్రశాంతమైన దేవళం అని. మేము ఆ గుడి దగ్గర అడుగుపెడుతూనే చందనపరిమళం మా మీంచి వీచినంత సాత్త్వికానుభూతికి లోనయ్యాము. సాయంసంధ్యవేళ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి కీర్తన గుడి చుట్టూ సంధ్యవెలుతురులాగా పరుచుకుంది. ఆ దేవుడు నిజంగా ఎంతో అందమైన దేవుడు. నేను చూసిన నరసింహాలయాలన్నిటిలో ఆ అడవి సింహం చాలా ప్రత్యేకంగానూ, ప్రసన్నంగానూ, ఆదరపూర్వకంగానూ గోచరించాడు.

ఆయన్ని ఏమి కోరుకుంటే అది ఇస్తాడనీ, అందుకని వరప్రసాది అని కూడా అంటారనీ విన్నాను. ఒకప్పుడు పిళ్ళైలోకాచార్యులు ఆ ప్రాంగణంలో వైష్ణవసిద్ధాంత రహస్యాల్ని ప్రవచనం చేస్తూ ఉండేవారట. అటువంటి దేవాలయం దగ్గరలో ఉండగలిగినవాళ్ళు అదృష్టవంతులు. ప్రతి రోజూ ప్రభాత, ప్రదోష వేళల్లో ఆ గుడి చుట్టూ నాలుగైదుసార్లు తిరగడం కన్నా దివ్యమైన జీవితం మరొకటి ఉండదనిపించింది అక్కడున్నంతసేపూ.

నేను కితం సారి తమిళనాడులో పాటలు పుట్టిన తావుల్లో సంచరించినప్పుడు చూడలేకపోయిన దేవాలయం జంబుకేశ్వరం. తిరువానైక్క లేదా తిరువానైకోయిల్ గా కూడా ప్రసిద్ధి చెందిన ఆ దేవాలయాన్ని చూడకుండా శ్రీరంగంలో మరేమి చూసారని ఒకాయన నన్ను ఆశ్చర్యంగా అడిగాడు కూడా. అదీ కాక, ఈసారి శ్రీరంగంలో అడుగుపెట్టగానే మా కారు డ్రైవరు రెండు సార్లు శ్రీరంగ దేవాలయం అనుకుని ముందు జంబుకేశ్వరానికి తీసుకువెళ్ళాడు. కాబట్టి ఆ సాయంకాలం ఎలాగేనా ఆ దేవాలయాన్ని చూసి తీరాలనుకున్నాను.

తిరువానైకోయిల్ లో ఆ సాయంకాలం గడిపిన గంటా, గంటన్నర సమయం మరవలేని అనుభూతిని మిగిల్చింది. ఆ దేవాలయం మహాదేవాలయం. ఆ మంటపాలు, ఆ స్తంభాలు, ఆ నడవా మామూలు దేవాలయ వాస్తు కాదు. ఆ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ముందు శ్రీకాళహస్తి గుర్తు రావడంలో ఆశ్చర్యం లేదు. పంచభూతాలకీ ప్రాతినిధ్యం వహించే అయిదు శివాలయాల్లోనూ కంచిలోని ఏకామ్రేశ్వరుడు పృథ్వీలింగమనీ, అరుణాచలేశ్వరుడు అగ్నిలింగమనీ, శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగమనీ, చిదంబరేశ్వరుడు ఆకాశలింగమనీ, జంబుకేశ్వరుడు జలలింగమనీ చెప్తారు. ఆ రోజు జంబుకేశ్వరుడి దర్శనంతో పంచభూత స్థలాలూ అయిదింటినీ చూసినట్టయింది. దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట కంచి వెళ్ళాను. మొత్తం పంచభూతమయమైన శివస్థలాల్ని చూడటానికి ఇరవయ్యేళ్ళు పట్టింది అనుకున్నాను.

నాయనార్లు కీర్తించిన పాటలు పుట్టిన తావుల్లో జంబుకేశ్వరం కూడా ప్రముఖమైంది కావడంతో తేవారంలో ఎన్నో పదికాలు ఆ దేవాలయం గోడలమీద చెక్కి ఉన్నాయి. నాయనార్లతో పాటు, శంకరాచార్యులు, అరుణగిరినాథార్, తాయుమానవర్ వంటి వారు కూడా ఆ దేవాలయం మీద కవిత్వం చెప్పారు.

అక్కడి అమ్మవారు అఖిలాండేశ్వరి. ఆమె దర్శనం మరొక మహిమోపేతమైన దర్శనం. శంకరాచార్యులు ఆమెకి చెవికమ్మలు చేయించారని ఐతిహ్యం. ‘తాటంక యుగళీభూత తపనోడుపమండలా ‘ (సూర్యచంద్రులు ఆమెకి చెవి కమ్మలుగా మారిపోయారు) అంటుంది సహస్రనామం. ఆ సాయంకాలం అర్చకుడు ముమ్మారు హారతి ఇస్తున్నప్పుడు ఆ తాటంకాలు మరింత మెరుస్తూ కనబడ్డాయి. ఆమెకి చిన్న సంపెంగపూల మాల సమర్పించుకున్నాం.

కర్ణాటక సంగీత ఋషి త్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితర్ ఆమె పైన మూడు కీర్తనలు రాసేరు. అవి అఖిలాండేశ్వరి రక్షమాం, అఖిలాండేశ్వర్యై నమస్తే, శ్రీ మాతః శివ వామాంకే. ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి నివాళిగా బాంబే జయశ్రీ ఆలపించిన అఖిలాండేశ్వరి రక్షమాం కీర్తన వినండి:

దేవాలయంలోంచి బయటికి వచ్చేటప్పటికి సంధ్యాకాశంలో నెలవంక కనిపిస్తున్నాడు. ఆయనకు దగ్గరగా శుక్రతార. నెలవంక కనబడే సాయంసంధ్యాగగనాన్ని చూస్తే శివసందర్శనమైనట్టే అని మా మాష్టారు గుర్తొచ్చింది. ఆ మహాశివాలయ ప్రాగణంలో అటు ఆకాశమూ,ఇటు నేలా కూడా పూర్తిగా శివమయమైపోయాయి.

పొద్దున్న విష్ణు పాదధూళి, సాయంకాలం శివవిభూతి- నా శ్రీరంగ యాత్ర సంపూర్ణమైందనిపించింది.

29-3-2023

16 Replies to “వేదన వెలుగుగా మారిన వేళ-3”

  1. excellent post! భక్తిని మీరు effortless నా వంటి పాఠకుల్లో మేల్కొల్పగలరు.

    తనవున నంటిన ధరణీ పరాగంబు
    పూసిన నెఱి భూతి పూతగాగ
    ముందట వెలుగొందు ముక్తాలలామంబు
    తొగల సంగడికాని తునుక గాగ అంటాడు పోతన దశమ స్కంధంలో. అక్కడ బాలకృష్ణుడికి శివుడికి అభేదం…మీచివరి వాక్యాలతో అక్కడికి తీసుకు వెళ్లారు.

    నెలవంక ఉన్న ఆకాశం… అవును, సోమకళాధర మౌళౌ…🙏🙏

    1. మీవంటి భావుకుల కోసమే విష్ణువు, శివుడు అనంత రూపాలతో ఈ ద్యావా పృథ్వుల్ని వెలిగిస్తూ ఉంటారు.

  2. ప్రొద్దున్నే కోవెలలో తిరుగాడిన అనుభూతి!
    ఎంత దివ్యమైన అనుభవం!
    ఇక రోజంతా మధుర సంగీతం విన్నట్లే ఉంటుంది.
    Thank you…Sir

  3. “శివస్య హృదయం విష్ణుః
    విష్ణోశ్చ హృదయం శివః”

    మీవంటి యాత్రికులవెంట ఒక యాత్ర ఇట్లా మానసికంగా అయినా చేయగలగడం ఒక వైభవం 🙏

  4. సృష్టిని భగవత్స్వరూపంగా తలుస్తూ జీవించడంలో ఒక నియంత్రణ,నిమ్మళం చేకూరుతుందనిపిస్తుంది దేవాలయ సందర్శనానికి భావసందర్శనానికి తేడా చాలా చక్కగా వివరిస్తారు మీరు.
    విశ్వమెల్ల విష్ణుపాదధూళి మయము గా భావిస్తే ఎంత ఉల్లాసం .
    మేడం కు తమిళం వచ్చా . వారు మద్రాసులో గానీ ఉన్నారా చిన్నప్పుడు . ఆంతరంగిక ఆలయ దర్శనానుభవం కలిగించారు.నమస్సులు.

  5. ఓహ్ మీకు ఇంట్లోనే తమిళ కన్నడ నిఘంటువు ఎంత సౌకర్యం.అభినందనలు.

  6. మీతో శ్రీరంగ- జంబూకేశ్వర యాత్ర చేసి చేసిన అనుభూతి కలిగించారు ధన్యవాదాలు.

    జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి ఎదురుగా గణేశుల వారు ఉన్నారు. ఆ అమ్మవారు మొదట్లో ఉగ్రస్వరూపిణిగా ఉండేవారని.. ఆవిడ ఉగ్ర కళను తగ్గించడానికి.. ఆమె శక్తిని ఆది శంకరుల వారు.. ఆమె తాటంకాలలో నిక్షిప్తం చేశారని అందుకే అక్కడ అమ్మవారి తాటంకాలకు ప్రత్యేకత ఉందని చెప్తారు. అలాగే. ఆమె కనులు తెరవగానే ఎదురుగా ఆమె గారాల పట్టి వినాయకుల వారిని చూడగానే ఆమె దృక్కులు వాత్సల్య పూరితమై భక్తులపై ఆమె వాత్సల్యం కురిపిస్తుందని కూడా ఒక విశ్వాసం. అని విన్నాను. అలాగే అక్కడ అఖిలాండేశ్వరి అమ్మవారికి మధ్యాహ్నం ఆలయ ఆచార్యులు చీర కట్టుకుని నైవేద్యం పెడతారని కూడా విన్నాను.

  7. “నెలవంక కనబడే సాయంసంధ్యాగగనాన్ని చూస్తే శివసందర్శనమైనట్టే “

    మీ యాత్రా విశేషాలు కళ్ళకి కట్టినట్లుగా చెప్పారు.
    🙏🏽🙏🏽🙏🏽

Leave a Reply to ManasaCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading