వేదన వెలుగుగా మారిన వేళ-2

At Ucchipillaiyar temple, Tiruchirapalli

మర్నాడు పొద్దున్నే కావేరీ స్నానంతో మా రోజు మొదలయ్యింది. తిరుచిరాపల్లిలో అమ్మమండపం దగ్గర కావేరీ స్నానఘట్టం దగ్గర స్నానం చేసాం. అక్కణ్ణుంచి తిరుచిరాపల్లి రాక్ ఫోర్ట్ దేవాలయానికి వెళ్ళాం. ఆ కొండ అత్యంత ప్రాచీనమైన శిల. దానిపైన ఉచ్చి పిళ్ళయ్యార్ పేరిట ఒక వినాయకుని ఆలయం ఉంది. దాదాపు నాలుగువందలకు పైగా మెట్లు. అవి కూడా ఎత్తుగానూ, నెట్రం గానూ ఉండే మెట్లు. ఆ మెట్లు ఎక్కేకొద్దీ తిరుచిరాపల్లి ఒకవైపు, శ్రీరంగం మరొకవైపూ, మధ్యలో కావేరీ నదీరేఖా కనిపించడం మొదలుపెట్టాయి. పైకి ఎక్కేకొద్దీ శ్రీరంగదేవాలయ గోపురాలు, ఆ విశాల సముదాయమూ వెయ్యేనుగుల ఊరేగింపులాగా కనిపించడం మొదలయ్యింది.

ఆ కొండ ఎక్కి దేవుణ్ణి వేడుకున్నతరువాత, అప్పుడు తెలిసింది, ఆ కొండమీదనే తాయుమానవర్ గుడి కూడా ఉందని. వినాయకుడి గుడికీ, తాయుమానవర్ గుడికీ మధ్య పల్లవరాజుల కాలం నాటి బౌద్ధ గుహాలయాలు కూడా ఆ కొండ మీద తొలిచి ఉన్నాయి.

నాతో పాటు మెట్లు దిగుతున్న ఒక యాత్రీకుడు నన్ను చూసి చిరునవ్వాడు. అతణ్ణి పలకరించాను. ముంబై నుంచి వచ్చాడట. ఆ దేవాలయం గురించి విని దర్శించుకోడానికి వచ్చానని చెప్పాడు. ముందు రోజు శ్రీరంగం దేవాలయం చూసానని చెప్తూ ‘ఎటువంటి దేవాలయం! ఎంత వైభవోపేతంగా ఉంది!’ అన్నాడు నిలువెల్లా పరవశించిపోతూ. ముంబై నుంచి వచ్చిన యాత్రీకుణ్ణి నేను పలకరించడం చూసి మరొక యాత్రీకుడు నాకు ఆ దేవాలయం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అతడు మధురై నుంచి వచ్చాడట. అక్కడ కొందరు భక్తులు తాము దేవుడికి నివేదన చేసిన కొబ్బరి అన్నం, అరటిపళ్ళు తక్కినభక్తులకి పంచిపెడుతున్నారు. మాకు కూడా కొంత కొబ్బరి అన్నం ప్రసాదం మా చేతుల్లో కూడా పెట్టారు.

తాయుమానవర్ గుడి కొండకి మధ్య స్థాయి ఎత్తులో ఉంది. బయటినుంచి చూసినప్పుడు ఆ గుడి బహుశా చిన్న గుడి అయిఉండవచ్చుననిపిస్తుంది. కాని లోపలకి అడుగుపెట్టగానే విశాల ప్రాకారం, చోళశైలి మంటపాలు, స్తంభాలు, కుడ్యచిత్రాలు సాక్షాత్కరించాయి.

భూమికీ, ఆకాశానికీ మధ్య అంతరిక్షంలో నిర్మించిన కైలాసంలాంటి ఆ గుళ్ళో అడుగుపెట్టగానే గర్భగుడిలో ఒక మహాలింగం ప్రత్యక్షమయింది.

ఆ దేవుడి ఎదట నిల్చోగానే మధురై నుంచి వచ్చిన భక్తుడు ఆ దేవుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఒక నిండు చూలాలు తన తల్లితో కలిసి కావేరినది ఒడ్డున నిలబడి ఉందట. వారిద్దరూ ఆ నదిని దాటాలి. ముందు ఆ తల్లి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ చూలాలు అంత వడిగా నడవలేక నెమ్మదిగా అడుగుతీసి అడుగువేస్తూ ఉండగా, ఇంతలో కావేరి పొంగింది. ఆమె ఆ నది దాటలేక అక్కడే ఆగిపోయింది. సరిగ్గా అప్పుడే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. తన తల్లి నదికి ఆవల ఉంది. తానేమో ఇక్కడ ఉంది. ఆమె నొప్పులు పడుతూ, భరించలేని వేదనపడుతూ ఉండగా, దేవుడు చూసాడు. తానే ఆమెకు దగ్గరుండి ప్రసవం చెయ్యాలనుకున్నాడు. కాని ఒక మగవాడిగా ఆమెని సమీపించడం ఉచితం కాదనిపించి ఒక స్త్రీరూపంలో ఆ చూలాలి దగ్గరకు వెళ్ళి, ఆమె దగ్గరుండి సుఖప్రసవమయ్యేలాగా చూసాడు. ఈలోపు కావేరి వరద ఉధృతి తగ్గింది. అవతలి గట్టున ఉన్న ఆమె తల్లి తన కూతురు ఇవతలి ఒడ్డునే ఉండిపోవడంతో మళ్ళా నది దాటి వెనక్కి వచ్చింది. ఆమె దగ్గరకు రావడం చూసిన దేవుడు ఆ తల్లీబిడ్డల్ని వదిలిపెట్టి అదృశ్యమైపోయాడు. ఒక తల్లికోసం స్త్రీరూపం ధరించి వచ్చిన ఆ చోటు తాయుమానవర్ వెలిసినచోటుగా పూజకు నోచుకుంటున్నది అని చెప్పాడు ఆ భక్తుడు.

అప్పుడు విజ్జి చెప్పింది.

‘తాయుమ్ ఆనవర్ అంటే తల్లి అయినవారు. ఇంకా చెప్పాలంటే తాయుమ్ అంటే తల్లిగా కూడా ఆనవర్ అయినవారు, తల్లిగా కూడా అయినవారు’ అని.

నాకు లోపల చెప్పలేనంత భావోద్వేగం కలిగింది. కన్నీళ్ళు ఉబికి రావడం మొదలయ్యింది. ఆ రోజు శోభకృత్తు వచ్చి మూడో రోజు. అప్పటికి నేను ఈ భూమ్మీద పుట్టి అరవై ఏళ్ళు గడిచిపోయాయని గుర్తొచ్చింది. అంతేకాదు, ఆ మధ్యాహ్నమే చవితి వస్తూ ఉండడంతో, అరవై ఏళ్ళ కింద మా అమ్మ నన్ను కన్నరోజు కూడా ఆ రోజే అని స్ఫురించింది.

ఆ క్షణాన మా అమ్మ నా ముందు ప్రత్యక్షమైంది. అరవై ఏళ్ళ కింద నేను పుట్టినప్పుడు ఆమెని చూడలేదు. ఆమె ఎలా ఉంటుందో తెలియదు. నా గురించిన స్పృహ కూడా నాకు లేని ప్రథమదినం, ప్రథమ క్షణం అది. కాని ఈ రోజు తాయుమానవర్ గుళ్ళో ఆ శివలింగం ఎందట నిల్చున్నప్పుడు మా అమ్మ ప్రత్యక్షమైందనిపించింది. మా అమ్మ రూపంలో దేవుడే నాకోసం ఎదురుచూస్తున్నాడనిపించింది.

తాయుమ్ ఆనవర్.

తల్లిగా కూడా అయ్యాడాయన.

తల్లి. ఎంత ప్రసవవేదన పడి ఉంటుంది. నేను పుట్టినందువల్ల ఆమెకి ఏమి సంతోషాన్నిచ్చి ఉంటాను? ఆమె జీవించి ఉన్నంతకాలం నేను ఆమెకి ఏమీ చెయ్యలేకపోయాను. కాని ఏదైనా చేసి ఉండగలననే ఆలోచనే అర్థరహితమనిపిస్తుంది. ఈ ప్రపంచంలో నువ్వుగాని నేనుగాని ఏ విధంగానూ తీర్చుకోలేని ఋణం తల్లి ఋణం ఒక్కటే. కాని మరొకమాట కూడా అనిపిస్తుంది. ఈ దేహం తల్లి దేహంలోంచి ఊడిపడ్డదే కదా, ఈ ప్రాణం ఆమె ఊపిరిని పంచుకుని పుట్టిందే కదా. కాబట్టి నా దేహం ఉన్నంతకాలం నా తల్లి నాతో ఉన్నట్టే, నా ప్రాణం ఉన్నంతకాలం నా తల్లి కూడా ఊపిరి పీలుస్తున్నట్టే.

అందుకని ఆ క్షణాన తాయుమానవర్ ఎదట నేను కూడా ఒక తాయుమానవర్ నే అనిపించింది. ఆయన తల్లికూడా అయినవాడు. ఆయన ఎదట నా రూపంలో ఉన్న నా తల్లి.

ఆ తాయుమానవర్ గర్భాలయంలో నాకు అరవై ఏళ్ళు పూర్తయి, అరవై ఒకటవ పుట్టినరోజు కూడా జరుపుకున్నాను అని గ్రహించాను. మన దేవాలయ వాస్తు ప్రకారం గర్భగుడి మాతృ గర్భం లాంటిది. ఒక భక్తుడు ఆ గర్భాలయంలోకి ప్రవేశించి దైవదర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పుడు అది అతడికి కొత్త జన్మలాంటిదనే ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విధంగా చూసినా ఆ గుళ్ళోంచి నేను సరికొత్తమానవుడిగా బయటకు అడుగుపెట్టాను.

ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా కూడా ఆ అనుభూతి నన్ను వెన్నంటే ఉంది. దేవాలయాల్లో కప్పే శేషవస్త్రంలాగా, ఆయన మా అమ్మ కూడా అయి నన్ను దగ్గరగా తీసుకున్న ఒక అనిర్వచనీయమైన అనుభూతి. నీ తల్లీ, నా తల్లీ, ప్రతి ఒక్క తల్లీ ఒక తాయుమానవర్. ఆ తాయుమానవర్ ప్రతి ఒక్కరికీ తల్లి.

కొద్ది సేపు ఆ దేవాలయ ప్రాంగణంలో కూచుండిపోయాను. ఆ క్షణాన నాకు తాయుమానవర్ అనే కవి కూడా ఉండేవాడని గుర్తొచ్చింది. రమణమహర్షి సంభాషణల్లో పదే పదే ఆ కవి గురించిన ప్రస్తావనలు చదివానని కూడా గుర్తొచ్చింది. ‘అమ్మై అప్పన్’ అనే మాట కూడా గుర్తొచ్చింది. తాయుమానవర్ ఈశ్వరుణ్ణి అమ్మై-అప్పన్ అన్నాడు, అంటే తల్లీ-తండ్రీ కూడా. ఈశ్వరుడు ఈ భూమ్మీద ధరించిన మొదటిరూపం తల్లి-తండ్రినే. ప్రతి ఇంట్లోనూ తల్లి-తండ్రి రూపంలో మనం చూసేది తాయుమానవర్ నే అని తాయుమానవర్ అనే కవి చెప్తున్నాడు.

తాయుమానవర్ (1705-1744) తంజావూర్ నాయక రాజుల కాలానికి చెందిన సిద్ధ కవి. శైవ కవి, భక్తి కవి, జ్ఞాన కవి. ఆయన కొన్నాళ్ళు విజయరంగ చొక్కలింగ నాయకర్ దగ్గర మంత్రిగా కూడా పనిచేసాడు.  తాయుమానవర్ తల్లిందండ్రులు బిడ్డ పుట్టినప్పుడే అతడికి తాయుమానవర్ పేరు పెట్టుకున్నారు. పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక అతనికి ఒక గురుసన్నిధి లభించింది. ఆ గురువు ఒక మౌన గురువు. ఆ మౌన గురువు ‘తిరుమంతిరం’ రాసిన తిరుమూలార్ అవతారమని ఒక నమ్మిక. తాయుమానవర్ సదా ఆ గురుసామీప్యం కోసం తహతహలాడేవాడు. ఒకసారి ఆ గురువు తీర్థయాత్రలకు బయల్దేరుతున్నప్పుడు తాను కూడా ఆయన వెంట వస్తాననీ, అనుమతించనీ తాయుమానవర్ ఆయన్ని వేడుకున్నాడు. కానీ ఆ గురువు తాయుమానవర్ కోరికని అంగీకరించక ‘సుమ్మ-ఇరు’ అన్నాడు. మా ఊళ్ళో కొండరెడ్లు ‘పల్లకుండు’ అంటారు. అంటే ‘పలకకుండా ఉండు’ అని. సుమ్మ-ఇరు అంటే అదే అర్థం. నిశ్శబ్దంగా ఉండు లేదా ఉన్నచోటే ఉండు లేదా నిశ్చలంగా ఉండు అని అర్థం. ఆ రెండు మాటలూ తాయుమానవర్ జీవితాన్ని మార్చేసాయి. ఆయనకి ఈశ్వరసాన్నిధ్యం అనుభవంలోకి వచ్చింది. అటువంటి గంభీర దర్శనం కలిగిన తర్వాత చిత్తం అణగిపోవడం సహజమే కదా. చిత్తం అడగిపోయిన తర్వాత మిగిలేది మౌనమే.

‘సుమ్మ-ఇరు’ ని రమణ మహర్షి కూడా ఒక మంత్రంగా స్వీకరించారు. ఆయన తనని ప్రశ్నిస్తున్న ఎంతో మంది సందర్శకులకి, యాత్రీకులకి, ఆర్తులకి, జిజ్ఞాసులకి ఆ మాటే చెప్పేవారు. ఆ సంభాషణల్లో ఎన్నో సార్లు ఆయన తాయుమానవర్ గీతాలనుంచి పంక్తులకి పంక్తులకు ఉదాహరించేవారు.

తిరు జ్ఞానసంబంధర్ తర్వాత రమణమహర్షి ఎక్కువసార్లు ప్రస్తావించింది తాయుమానవర్ నే అనుకోవచ్చు. తాయుమానవర్ గీతాల్ని గుర్తుచేసుకోబోయిన ప్రతిసారీ ఆయన గొంత గద్గదమై కన్నీళ్ళు ఉబికి వస్తుంటే వాటిని ఆపుకోలేక ఆ పుస్తకాలు పక్కన పెట్టేసేవారట.

రమణులు తాయుమానవర్ గురించి చేసిన ప్రస్తావనల గురించి డేవిడ్ గాడ్ మాన్ వెబ్ సైట్లో ఒక చక్కటి వ్యాసం నాకు కనిపించింది.  తాయుమానవర్ గురించీ, ఆయన పట్ల రమణులు చూపించిన గౌరవం గురించీ తెలుసుకోవాలనుకున్నవాళ్ళు తప్పనిసరిగా చదవవలసిన వ్యాసం అది.

https://www.davidgodman.org/bhagavan-and-thayumanavar/

అందులోంచి ఒక చిన్న భాగం ఇక్కడ మీతో తెలుగులో  పంచుకోవాలనుకుంటున్నాను.

తాయుమానవర్ మౌనం గురించి చాలాసార్లు మాట్లాడతారుగాని ఆ మౌనం ఏమిటో అతడు ఒకే ఒక్కసారి నిర్వచింవాడని రమణులు తమ సంభాషణల్లో ఒకచోట చెప్పారు. ‘అహంకారం అణగిపోయిన తక్షణమే అప్రయత్నంగా సిద్ధించే స్థితియే మౌనం’ అని తాయుమానవర్ నిర్వచించాడని రమణులు అన్నారు.

తాయుమానవర్ ఏ పద్యంలో ఆ మాట అన్నారో రమణులు అక్కడ ప్రస్తావించలేదు. అయితే రమణుల సంభాషణల తమిళ ప్రతిలో విశ్వనాథ స్వామి ఆ పద్యాన్ని పయప్పుళి గీతంలోని 14 వ పద్యంగా గుర్తుపట్టారు. ఆ పద్యం ఇది:

నాలో ఉన్న ఆ మూలాధార అస్తిత్వం, నాలోని అసలైన నేను అయిన నా హృదయం ముందు నేను సిగ్గుతో తలవంచుకుంటుంది. మరిదేంతోనూ పోల్చడానికి వీల్లేని అపూరుపమైన ఒక ఆనందాన్ని నాకు అనుగ్రహిస్తూ, నా చైతన్యం మొత్తాన్ని కబళించివేస్తూ నాకొక అపురూపమైన పారవశ్యాన్ని అనుగ్రహిస్తూ ఆ అసలైన నేను నాలో ఒక మౌనస్థితిని ఆవిష్కరిస్తుంది. ఇదీ విషయం, ఇంక చెప్పడానికేముంది?

తాయుమానవర్ అంతిమంగా చేరిన మనఃస్థితిని వివరించే ఈ పద్యానికీ, రమణులు రాసిన ‘ఉల్లదు నార్పదు’ లో ముప్ఫైవ పద్యానికీ మధ్య ఎంతో దగ్గరితనముంది. భగవాన్ తన పద్యంలో కూడా వ్యక్తి అహంస్ఫురణ తన హృదయాధారంలో అణగిపోయినప్పుడు మిగిలేది ఆత్మ ఒక్కటే అని చెప్పారు. ఆ పద్యం చూడండి:

‘మనసు అంతర్ముఖమై ‘నేనెవర్ని’ అని ప్రశ్నించుకుంటూ హృదయంలో లీనమైపోయినప్పుడు ఈ అహంస్ఫురణ ఆ ఆత్మస్ఫురణ ముందు సిగ్గుతో తలవాల్చుకుంటుంది. అప్పుడు మిగిలే నేను ఒక్కటే. ఆ నేను ఈ నేను గా అనిపించినప్పటికీ, అది అహం కాదు. అదే సత్యం, పరిపూర్ణం, ఆత్మసాక్షాత్కారం.’

ఈ రెండు పద్యాల మధ్యాపోలిక ఇంత స్పష్టంగా కనిపిస్తున్నందువల్ల భగవాన్ తాయుమానవర్ రాసిన ఈ పద్యం తనకెంతో ప్రీతిపాత్రమైందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.  ప్రతి రోజూ రమణాశ్రమంలో పారాయణ చెయ్యవలసిన  స్తోత్రాలలో, పద్యాలలో ఈ పద్యం చేరడంలో కూడా ఆశ్చర్యం లేదు.

గాంధీ రాసిన ఒక వ్యాసం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు భగవాన్  ఆలోచనల బరువునుంచి బయటపడ్డ స్థితి గురించీ, మౌన విషయం గురించీ భగవాన్ మరొకసారి ప్రస్తావించారు.  ఆ రోజు భగవాన్ ప్రస్తావించింది గాంధీ హరిజన్ పత్రికలో రాసిన ఈ వాక్యాలు. గాంధీ ఇలా రాస్తున్నాడు:

‘భగవంతుడి లీలలు ఎంత చిత్రమైనవి! నేను రాజ్ కోట్ కి చేస్తున్న ఈ ప్రయాణం నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనెందుకు వెళ్తున్నాను? ఎక్కడికి వెళ్తున్నాను? ఎందుకోసం వెళ్తున్నాను? ఇవేవీ నేను ఆలోచించలేదు. అయినా భగవంతుడే నాకు దారిచూపిస్తున్నాక నేనెందుకు ఆలోచించాలి? అసలు అటువంటి ఆలోచనే భగవంతుడి మార్గదర్శనానికి ప్రతిబంధకం అయిపోతుంది కూడా. నిజానికి ఆలోచన అణగిపోడానికి ఏ ప్రయత్నమూ అవసరం లేదు. ఆలోచనలు తమంతట తాము రావు. అలాగని మనసు శూన్యంగా ఉందనీ కాదు. నేను చెప్తున్నదేమంటే నేనే పని మీద వెళ్తున్నానన్న ఆలోచన నాకెంతమాత్రమూ లేదనే.

ఈ పేరాలోని ప్రతి ఒక్క వాక్యమూ అక్షర సత్యమని భగవాన్ నొక్కి చెప్పారు. అప్పుడు ఆలోచనల బరువులేని మనఃస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి తాయుమానవర్ రాసిన ఈ పద్యాన్ని పేర్కొన్నారు:

నువ్వంటూ ఒకరు ప్రత్యేకంగా లేని స్థితి 

అదే నిష్ట, నీకు నువ్వు కట్టుబడి ఉండటం.

అయితే ఆ స్థితిలో

నువ్వంటూ ఉంటావా?

మౌనంకట్టిపడేసిన నువ్వు

మళ్ళీ ఈ ప్రశ్నకు కలవరపడకు.

ఆ స్థితిలో నిజానికి నువ్వంటూ లేకపోయినా

నువ్వంటూ ఎవరూ మిగలకపోయినా

నువ్వు నిజంగా లేనట్టు కాదు

శాశ్వతంగా నువ్వక్కడే ఉన్నావు

అనవసరంగా రొష్టు పడకు

ఆనందంలో తేలియాడు.

ఆలోచనల బరువునుంచి విడుదలైన అనుభవం ఎలా ఉంటుందో గాంధీ మాటల్లో భగవాన్ వివరించిన రెండు రోజుల తర్వాత ఒక సందర్శకుడు మళ్ళా ఆ ప్రస్తావన లేవనెత్తాడు. అప్పుడు వాదిద్దరి మధ్యా కొంత సంభాషణ నడిచింది.

సందర్శకుడు: ఆలోచనలు అపరిచితంగా అనిపించే స్థితి గురించే కదా గాంధీ మాట్లాడుతున్నాడు?

భగవాన్: అవును. ‘నేను ‘అనే భావన ఉదయించాకనే, తక్కిన ఆలోచనలన్నీ పుట్టేది. ‘నేనున్నాను ‘అని స్ఫురించాకనే, ప్రపంచం గోచరించడం మొదలవుతుంది. కాని గాంధీకి ఆ నేననే భావనా, దాన్నుంచి పుట్టే తక్కినభావనలన్నీ కూడా (ఆ క్షణాన) అదృశ్యమైపోయాయి.

ఆ రోజు తాయుమానవర్ గర్భాలయంలో నేను లోనైన అనుభవం అటువంటిది అని చెప్పలేనుగాని, ఆ క్షణాన, ఆయన నా తల్లిగానూ, నేనాయన బిడ్డగానూ నిలబడ్డానని మాత్రం చెప్పగలను.

28-3-2023

18 Replies to “వేదన వెలుగుగా మారిన వేళ-2”

  1. తాయుమానవర్…వేదనును వెలుగుగా పంచి వేకువ నిచ్చిన మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. కలకాలం నిలిచి యుందురు గాక.
    హ్యాపీ బర్త్ డే అండ్ షష్ఠి పూర్తి…సర్.

  2. షష్టి పూర్తి శుభాకాంక్షలు సర్. మీ ద్వారా ఆ వెలుగు మా మీద కూడా ప్రసరించాలని మా ఆకాంక్ష.

  3. మాటలు లేవు. అద్భుతం.‌షష్టిపూర్తి శుభాకాంక్షలు సర్. నిండు నూరేళ్ళు మీ సాహితీ సేవ ఇలాగే కొనసాగాలని, మీ ద్వారా ఆ వెలుగు మా పైన కూడా ప్రసరించాలని ఆకాంక్షిస్తున్నాను.

  4. అపురూపమైన రాత యిది. ఉగాదికి దగ్గరలో ఏదో అదృశ్యశక్తి మిమ్మల్ని ఆవరిస్తుంది అనిపిస్తుంది నాకయితే, బహుశా మీ అమ్మగారేనేమో🙏

    షష్టిపూర్తి శుభాకాంక్షలు భద్రుడు గారూ, అనంతకాలవాహినిలో ఒక ఆవృత్తం పూర్తి చేసుకోవడం అదీ ఇంత సంరంభంతో… ఎంత గొప్ప విషయం. నిండు నూరేళ్లూ తెలుగులకు సాహిత్యతృష్ణ తీర్చేలాగా, పెంచేలాగా సదా శాంతితో జీవించాలన్న ఆకాంక్షని శుభాకాంక్షగా చేర్చుతున్నాను. Have great life….like this day, each other day 💐

  5. ఎంత అపురూపం గా ఉంది! ఏదో దిగులు ఆవరించిన ఈ ఉదయం ఇది చదవగానే మంచు తెరలు విడి వెలుగు పరుచుకున్నట్లు ఎంత కాంతి! ఎంత శాంతి! రాసినందుకు మీకు కృతజ్ఞతలు. షష్టి పూర్తి శుభాకాంక్షలు సర్

  6. చదువుతూ ఉంటే.. చాలా హాయిగా ఉంది మీ కధనం. అప్పుడే అయిపోయిందా అనిపించింది. తాయుమానవర్ గుడిలో మీ అనుభూతి చదువుతున్న ఏదో తెలియని సంతృప్తి. బహుశా.. మా అమ్మా-నాన్న గుర్తు రావడం వల్ల అనుకున్నా.. శ్రీరంగం వెళ్లినా.. తాయుమానవర్ గుడి చూడలేదు.. కాని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి మిగిలింది.

    షష్ఠిపూర్తి జన్మదిన శుభాకాంక్షలు అండీ..
    ఆ తాయుమానవర్, శ్రీరంగనాధుల ఆశీర్వాదాలు.. మీకు పరిపూర్ణంగా లభించి.. మీరు ఎంచుకున్న వృత్తిలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.

Leave a Reply to rambhaskarrajuCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading