వేదన వెలుగుగా మారినవేళ-1

Kurattalvar Cottage, Yatrinivas, Srirangam

శ్రీరంగంలో యాత్రీనివాస్ కి చేరుకునేటప్పటికి సాయంకాలం అవుతూ ఉంది. వసంతఋతువు మొదలైనవేళ. కొల్లిడం నది మీంచి వసంతమారుతం తల్లిలాగా నా వళ్ళంతా ఆప్యాయంగా తడిమింది. ప్రాణం లేచి వచ్చిందని చెప్పాలి.

యాత్రీనివాస్ లో మాకొక కాటేజి దొరికింది. ఆ కాటేజి పక్క ఒక సింహాచలం సంపెంగ మొక్క. మొగ్గ తొడుగుతూ. ఎవరో ఒక కీర్తనని మంద్రస్వరంతో ఆలపిస్తున్నట్టు సన్నని పరిమళం అక్కడ అల్లుకుని ఉంది.

కాటేజి పైన తమిళంలో పేరు రాసి ఉంది. ఆ పేరు ఏమిటో చదివిచెప్పవూ అని అడిగాను విజ్జిని. కూరత్తాళ్వారు కాటేజి అంది విజ్జి.

ఏదో చెప్పలేని ఉద్వేగం నా హృదయంలో ఒక కెరటంలాగా ఎగిసిపడింది.

కూరేశుడి గురించి మొదటిసారి దాశరథి రంగాచార్య గారిదగ్గర విన్నాను. శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఎల్లల్లేని త్యాగానికీ, మొక్కవోని ధీరత్వానికీ ఆ పేరు ఒక శాశ్వత చిహ్నంగా మారిపోయింది. పదకొండు-పన్నెండు శతాబ్దాల మాట. శ్రీరామానుజులు అప్పట్లో శ్రీరంగంలో ఉండేవారు. కూరేశుడిది కంచి. చింతల్లేని కుటుంబం. ఆయన రామానుజుల ప్రభవానికి లోనై ఆయనికి శిష్యుడిగా మారి, అనతికాలంలోనే ప్రధాన శిష్యుడిగా మారాడు. ఆ రోజుల్లో చోళనాడులో శైవం రాజమతంగా ఉంది. రెండవ కులోత్తుంగ చోళుడు శైవాన్ని తప్ప మరే మతాన్నీ సహించే స్థితిలో ఉండేవాడు కాడు. ఆ అసహనం ఎంత ముదిరిందంటే చిదంబరంలో ఉండే గోవిందరాజ విగ్రహాన్ని తీసుకుపోయి సముద్రంలో పడేసాడు. అతడొకసారి పెద్ద సంతకాల ఉద్యమం చేపట్టాడు. తన రాజ్యంలో ఉన్నవాళ్ళంతా ‘శివాత్ పరతరం నాస్తి’ అని కాగితం మీద సంతకం పెట్టాలి. రాజుకి భయపడి ప్రజలు సంతకాలు పెట్టారు. కాని రాజు దగ్గర ఉన్న మంత్రి కూరేశుడి శిష్యుడు. అతడు రాజుతో ‘మీరిలా ఎన్ని సంతకాలు పెట్టించినా ప్రయోజనం లేదు. ఆ ఇద్దరూ సంతకం పెడితే తప్ప ఈ ఉద్యమానికి అర్థం లేదు’ అన్నాడు. ‘ఎవరా ఇద్దరూ?’ అని అడిగాడు రాజు. ‘రామానుజులూ, కూరేశుడూనూ’ అని చెప్పాడు మంత్రి. రాజు వెంటనే భటుల్ని పంపించి ఆ ఇద్దర్నీ తన ఆస్థానానికి తీసుకురమ్మన్నాడు.


ఆ భటులు రామానుజుడి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు రామనుజులు కావేరి ఒడ్డున స్నానానికి వెళ్ళి ఉన్నారు. తమ ఆశ్రమానికి రాజభటులు రావడం చూసి కూరేశుడు కీడు శంకించాడు. వెంటనే ఆయన రామానుజుడికి అటునుంచి అటే వెళ్ళిపొమ్మని సందేశం పంపించి, తాను రామానుజుల వస్త్రాల్నీ, దండాన్నీ ధరించి రాజు దగ్గరికి బయల్దేరాడు. రామానుజుల మరొక శిష్యుడు మహాపూర్ణుడు కూడా కూరేశుడి వెంట రాజు దగ్గరకు వెళ్ళాడు.

తన దగ్గరికి వచ్చిన కూరేశుణ్ణి మహారాజు రామానుజులనే అనుకుని ‘శివాత్ పరతరం నాస్తి’ అన్న కాగితం మీద సంతకం పెట్టమన్నాడు. కూరేశుడు సంతకం పెట్టి, ఆ వాక్యం కింద ‘ద్రోణం అస్తి తతః పరమ్’ అని రాసాడు. అలా రాయడంలో అతడు ‘ శివ’ అనే పదం మీద శ్లేష చేసాడు. ‘శివ’ అంటే ఒక కొలపాత్ర అనే అర్థం కూడా ఉంది. ‘ద్రోణం’ అంతకన్నా పెద్ద కొలపాత్ర. కూరేశుడు రాసిన దాన్ని బట్టి ‘శివం కన్నా పెద్దదిలేదు, కాని ద్రోణం అంతకన్నా పెద్దది’ అని అర్థమొస్తుంది. అంటే అతడు అసత్యం ఆడినట్టూ లేదు, తన మతాన్ని వదులుకున్నట్టూ కాదన్నమాట.

రాజుకి ఆ శ్లేష అర్థమయింది. అతడు కూరేశుడిమీద నిప్పులు చెరిగాడు. అతడి కళ్ళు పీకెయ్యమని భటుల్ని ఆజ్ఞాపించాడు. కూరేశుడు వెంటనే ఒక భటుడి చేతిలోంచి బల్లెం లాక్కున్నాడు. రాజుతో ‘నీలాంటి పాపిష్టివాణ్ణి చూసాక ఈ కళ్ళు ఉండీప్రయోజనం లేదు’ అని తన కళ్ళు తానే పెరుక్కున్నాడు. అతడితో వచ్చిన మహాపూర్ణుణ్ణి కూడా రాజు సంతకం పెట్టమని అడిగాడు. అతడు కూడా అందుకు నిరాకరించాడు. రాజు అతడి కళ్ళు కూడా పెరికెయ్యమని ఉత్తర్వులిచ్చాడు. భటులు అతణ్ణి బయటికి ఈడ్చుకుపోయారు. వాళ్ళు మళ్ళా లోపలకి రాగానే ‘ఆ వైష్ణవ క్రిమి బతికాడా, చచ్చాడా?’ అనడిగాడు రాజు. ఆ మాటలకి కూరేశుడికి పట్టరానంత ఆగ్రహం వచ్చింది. ‘క్రిమి అన్నావు కదా. నువ్వు క్రిముల పాలై చస్తావు’ అని రాజుని శపించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ రాజుకి మెడచుట్టూ పుండై మరణించాడు. అందుకని అతణ్ణి చరిత్రలో క్రిమికంఠ చోళుడు అని పిలుస్తారు.

మహాపూర్ణుడు వయోవృద్ధుడు కావడంతో ఆయన తన కళ్ళు పీకేసిన బాధ తట్టుకోలేక వెంటనే మరణించాడు. కూరేశుడు తన బాధని సహించి శ్రీరంగనాథ దేవాలయానికి వెళ్ళాడు. కాని రాజు ఆజ్ఞ మేరకు అతణ్ణి దేవాలయంలో అడుగుపెట్టనివ్వలేదు. రామానుజుల్ని వదిలిపెడితే రంగనాథస్వామి దర్శనానికి అనుమతిస్తామన్నారు. కాని కూరేశుడు రామానుజులు లేని శ్రీరంగంతో తనకు పనిలేదనుకున్నాడు.

ఆ కాటేజి మీద కూరత్తాళ్వార్ పేరు చూడగానే ఈ కథంతా గుర్తుకొచ్చింది. అంతేనా? కూరేశుడి కథలో గుర్తు చేసుకోదగ్గ విషయం మరొకటుంది.

ఏళ్ళ తరువాత, రామానుజులు శ్రీరంగం వచ్చిన తరువాత ఆయన కూరేశుడి త్యాగం విని కళ్ళనీళ్ళపర్యంతమై అతణ్ణి కంచివెళ్ళి వరదరాజస్వామిని ప్రార్థించమని చెప్పాడు. కూరేశుడు కంచివెళ్ళి ప్రార్థించాడు. అతడికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి వరం కావాలని అడిగాడు. తనకి కంటిచూపునిమ్మని అడగాలి. కాని ఆ క్షణాన కూరేశుడికి ఆ రోజు తాను రాజుని శపించడం గుర్తొచ్చింది. తాను ఆగ్రహాన్ని అణచుకోలేకపోయిన ఆ క్షణం తాను వైష్ణవుడు కాలేకపోయిన క్షణమని కూడా అనుకున్నాడు. కాని రాజు అప్పటికే మరణించాడు. ఐతే రాజుకి ఆ దుర్బుద్ధి కలిగించిన ఆ మంత్రి ఇంకా బతికే ఉన్నాడు. కూరేశుడు ఆ మంత్రికి సద్బుద్ధి ప్రసాదించమని దేవుణ్ణి వేడుకున్నాడు.

ఇది శైవానికీ, వైష్ణవానికీ పరిమితమైన కథ కాదు. ఒక మతం రాజమతంగా మారినప్పుడు తక్కిన మతాల పట్ల అసహనం పెరిగినప్పుడు, పాలకులు persecutors గా మారినప్పుడు నిజమైన విశ్వాసులు ఎలా ప్రవర్తించాలో చెప్పే కథ ఇది. అటువంటి ఒక ధీరచిత్తుడి పేరుపెట్టుకున్న కాటేజిలో ప్రవేశించిడమే నాకెంతో ప్రగాఢంగా అనిపించింది. శ్రీరంగంలో అడుగుపెడుతూనే నాకు ఒక భావోద్వేగ భరితమైన అనుభవం లభించిందనిపించింది.

మేము పదినిమిషాల్లో తొందరగా తయారై నేరుగా గుడికి వెళ్ళిపోయాము. ‘ఈ సాయంకాలం ధూళి దర్శనం చేసుకుందాం’ అంది విజ్జి. కాని ఏదో మన ఇంటికి వెళ్ళినంత నేరుగా శ్రీరంగదేవాలయంలో ప్రవేశించగలమా, అంత తొందరగా దర్శనం లభిస్తుందా అన్న సందేహం నన్ను పీడిస్తూనే ఉంది.

కాని ఏమాశ్చర్యం! మాకు దర్శనం చాలా తొందరగా దొరకడమే కాదు, చాలా దగ్గరగా, చాలా ప్రశాంతంగా నిలబడి చూసేట్టుగా దొరికింది.

నేను ఇంతకు ముందు శ్రీరంగం వచ్చినప్పుడు విజయదశమి రోజులు. అప్పుడు కూడా స్వామిని చూడగలిగాను కాని, అది వేరే విధమైన అనుభవం. మొదటిసారిగా రంగనాథుణ్ణి చాలా దగ్గరగా, చాలా కాలంగా వింటూ, ఎలాగేనా వెళ్ళి చూస్తే చాలు అనుకున్న ఒక మహనీయుడి దగ్గరకు వెళ్లగానే, ఆయన, ‘దా, ఇలా నిలబడు, బావున్నావా? ఏమిటి విశేషాలు?’ అంటే ఎలా ఉంటుందో అలా. కాని అక్కడ నిలబడ్డ ఆ కొంతసేపూ, ఎంతో సేపో తెలీదు, నేను లోనైన మానసికోద్వేగం మాటల్లో పెట్టలేనిది. ముఖ్యంగా ఆ చూపులు. ఆ చూపుల్ని చూసే అండాళ్ ‘నాచ్చియార్ తిరుమొళి’ రాసిందంటే ఏమీ ఆశ్చర్యం లేదు. ఆ చూపులు నీకు ఏమీ చెప్పవు, కానీ చాలా చెప్తాయి. అవి నీ కేసి చూడవు. కాని ఆ చూపుల తలపుల్లో నువ్వే ఉన్నావని తెలుస్తూంటుంది. అవి ఎటు చూస్తున్నాయి? ఆకాశాన్నా, లేదా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నా? ఉహుఁ. నీకు తెలిసిన ఏ భావానికీ నువ్వు ఆ చూపుల్ని కుదించలేవు. ఒక తండ్రిదగ్గరకు వెళ్ళిన పిల్లవాడిలాగా నేను ఆయన దగ్గర నిలబడ్డాను కాబట్టి, నిలబడగలిగానుకానీ, గోదాలాగా ఒక కన్యగా ఆయన ఎదట నిలబడి ఉంటే, నేను కూడా ఆమెలాగా నా వక్షోజాల్ని పెరుక్కుని ఆయన మీదకు విసిరికొట్టాలన్నంత ఉద్వేగానికి లోనయి ఉండేవాణ్ణే.

కాని నేను ఆ రాత్రి ఆయన్ని ఒక ఆండాళ్ అంశతో కూడా సమీపించానని చెప్పాలి. రేపు విడుదల కాబోతున్న నా కథల పుస్తకానికి ముందుమాట రాస్తూ చంద్రశేఖర రెడ్డిగారు ‘తానే ఆండాళ్ కాగలినవాడు ఎంత భావుకుడు!’ అని రాసారు. ఆండాళ్ మీద కథ రాసినందుకే దేవుడు నన్ను అంత దగ్గరగా పిలిపించుకున్నాడని అర్థమయింది నాకు. కానీ, మరి, ఆ చూపులు!

అక్కణ్ణుంచి అమ్మవారి కోవెల కు వెళ్ళాం. మేము కిందటిసారి శ్రీరంగం వెళ్ళినప్పుడు ఆమె దర్శనం దొరకలేదు. కాబట్టే ఆమె మమ్మల్ని మళ్ళీ పిలిపించుకుందని కూడా అర్థమయింది. స్వామి దగ్గర కలిగిన అనుభూతి వేరు. తల్లి దగ్గర కలిగిన సాక్షాత్కారం వేరు. అక్కడ అడుగుపెడుతూనే ముందు స్ఫురించిన మాట, ఆమె దేవతగా మారిన కవయిత్రి అని. నేను కూడా కవినే కదా! కాని నేనెందుకు ఇంకా మనిషిగానే మిగిలిపోయాను? ఎంత ప్రయత్నించినా ఏదో ఒక వేళ దానవుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను? నా ప్రశ్నలు ఆమెకి వినబడ్డాయి. ఆమె అన్నిటికన్నా ముందు నాకు చెప్పిన మాట ‘నువ్వు వస్తూనే కొంత చీకటి కూడా వెంటబెట్టుకొచ్చావు, ముందు ఆ చీకటి అక్కడే బయట దులిపి లోపల అడుగుపెట్టు’ అని. ఆమె దగ్గర నిలబడ్డంతసేపూ వేదన వెలుగు గా మారే ఒక రాసాయినిక సూత్రమేదో నాకు బోధపడుతున్నట్టే ఉంది.

కూరత్తాళ్వార్ కథ చెప్పినప్పణ్ణుంచీ ప్రమోద్ మనసు రామానుజులమీదనే ఉంది. అందుకని పరుగులాంటి నడకతో రామానుజుల కోవెల దగ్గరకు చేరుకునేటప్పటికి గుడితలుపులు మూసేస్తూ ఉన్నారు. పిల్లవాడి కోరికలో బలం ఏమిటోగాని, ఆ రోజుకి చివరి సందర్శకులం మేమే.

రాజేంద్ర ప్రసాద్ గారు మా విజ్జికి పెద్దమేనమామ. మేము శ్రీరంగ యాత్ర చెయ్యాలని చాలా రోజులుగా చెప్తున్నారు ఆయన. మేము ఎంతకీ బయల్దేరకపోవడంతో ఈ సారి తానే మా ప్రయాణానికీ, దర్శనానికీ తేదీలు నిర్ణయించేసారు. కాని ఆయనకి తెలియదు, ఆ మర్నాడు నా జీవితంలో ఎంత ముఖ్యమైన రోజో!

27-3-2023

16 Replies to “వేదన వెలుగుగా మారినవేళ-1”

 1. ఎన్ని కోణాలలో లోతైన వ్యాసం ఇదీ 🙏 ఆ ‘విశాల నేత్ర శాయి’ రాయించుకున్నట్టు వుంది తన పరమ భక్తుల గురించి.

 2. అద్భుతమైన అనుభూతి కలిగింది mee వ్యాసం చదివిన తరువాత.

  “గోదాలాగా ఒక కన్యగా ఆయన ఎదట నిలబడి ఉంటే, నేను కూడా ఆమెలాగా నా వక్షోజాల్ని పెరుక్కుని ఆయన మీదకు విసిరికొట్టాలన్నంత ఉద్వేగానికి లోనయి ఉండేవాణ్ణే.”.. ఎందుకు ఇలా అన్నారని ఆలోచిస్తూ ఉండి పోయిను.

  ఇది దేవత గా మారిన కవయిత్రి గారి అనుభూతా?

   1. ధన్యవాదాలు సర్. ఆ కవిత్వాన్ని ఆస్వాదించే అదృష్టం కలగలేదు ఇంకా.

 3. చదువుతుంటే ఒక పవిత్రమైన అనుభూతి కలిగింది.

 4. చాలా బాగుంది భద్రుడు గారూ . వైష్ణవ సంప్రదాయానికి చెందిన నేను కూరేశుడి రాజధిక్కారానికి బాగా దగ్గరయ్యాను. అసహనాన్ని రాజ్యమైన అసహనాన్ని ధిక్కరించడమే, ఒక ప్రజాస్వామ్య వాతావరం కోసం కృషి చేయడం అవసరమని అంతరార్థంగా తెలిపిన మీకు బోలెడన్ని నెనర్లు

 5. 2019లో శ్రీరంగం వెళ్ళాను. మీ వ్యాసంతో మళ్ళీ ఆ దర్శన భాగ్యం కలిగింది. చదువుతున్నంత సేపు కూరేశుని త్యాగం, నిబద్ధత గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. 🙏🙏

Leave a Reply

%d bloggers like this: