
ఈసారి విజయవాడ బుక్ ఫెస్టివల్ లో కొన్న పుస్తకాల్లో The Vagabonds Way అనే పుస్తకం దాదాపుగా నాకు బెడ్ సైడ్ బుక్ గా మారిపోయింది. అందులో ఆ పుస్తక రచయిత Rolf Potts ప్రతిరోజు ఒక మెడిటేషన్ చొప్పున ఏడాది పొడుగునా యాత్రల గురించీ, యాత్రానుభవాల గురించీ, యాత్రాసాహిత్యం గురించి 365 ఆలోచనలు పంచుకున్నాడు. వాటిలో ఇప్పటిదాకా నాలుగు నెలల ఆలోచనలు పూర్తి చేయగలిగాను. ఎందుకంటే మొత్తం పుస్తకం ఒక నవలలాగా ఏకబిగిన ఒక్కసారి చదివేసేది కాదు. ప్రతి ఒక్క ఆలోచనా మనల్ని కొంతసేపు అక్కడ నిలవరించి మరింత ఆలోచింప చేసేదిగా ఉంది.
రచయిత ఈ పుస్తకాన్ని ఆరు అధ్యాయాలుగా విభజించాడు. అందులో జనవరి ఫిబ్రవరి నెలల్లో, ప్రయాణాలు మొదలుపెట్టేముందు ప్రయాణాలు గురించి కలలు కనడం, ప్రయాణాల గురించి చేసుకునే ముందస్తు ఏర్పాట్లు చేసుకోడం గురించిన ఆలోచనలు ఉన్నాయి.
ఇలాంటి పుస్తకాలు చదివేటప్పుడు మామూలుగా నేను నాకు ఆసక్తి కలిగించే వాక్యాల పక్కన పెన్సిల్తో చిన్న గుర్తు పెట్టుకుంటాను. ఒకసారి ఆ పుస్తకం మీద ఒక సమీక్ష వ్యాసమో లేదా కొన్ని ఆలోచనలో రాసుకున్నాక ఆ పెన్సిల్ గుర్తులు చెరిపేస్తాను. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం చదివినప్పుడు నేను పెన్సిల్ గుర్తులు పెట్టుకోలేదు. ఇప్పుడు ఆ ఆధ్యాయం నుంచి కొన్ని ఆలోచనలు మీతో పంచుకుందాం అనుకున్నప్పుడు మళ్ళా ప్రతి ఒక్క పేజీ నన్ను కొత్తగా ఆలోచనలో పడేస్తున్నది.
ఉదాహరణకి మొదటి పేజీలోనే హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ (1805-75) రాసిన ఉత్తరంలోంచి రచయిత ఒక వాక్యాన్ని ఉల్లేఖించాడు. మనందరికీ అండర్సన్ గొప్ప రచయితగా తెలుసు. అద్భుతమైన బాల సాహిత్య సృష్టికర్త గా తెలుసు. ‘రాజు గారి దేవతా వస్త్రాలు’ పేరిట మనకు చిరపరిచితమైన కథ రాసింది ఆయననే. ఆయన ఒక ఉత్తరంలో రాశాడట: ‘అందరూ హోమ్ సిక్ నెస్ గురించి మాట్లాడతారు, నాకు ఔట్ సిక్ నెస్ ఉంది’ అని. ఆ వాక్యం ప్రేరణతో ఈ పుస్తక రచయిత far sickness అనే పదాన్ని సృష్టిస్తాడు.
యాత్రలు చేయాలని కోరిక ఉన్న వాళ్ళ దృష్టి ఎంతసేపూ సుదూర ప్రాంతాల మీదా, చూడని దేశాల మీదా, తెలియని గ్రామాల మీదా ఉంటుంది. తాము ఎన్నడూ ప్రయాణించని దారుల్లో, తాము ఎన్నడూ చూసి ఉండని మనుషుల్ని చూడాలని, వాళ్ళ కథలు వినాలని, వాళ్లతో కలిసి వాళ్ల ఊరి మధ్య నెగడు దగ్గర కూర్చుని వాళ్ల పురాణాలు వినాలని కోరుకునే వాళ్లే ఈ ప్రపంచాన్ని ఇంత దగ్గరగా జరిపారు.
రచయిత ఈ far-sickness అనే పదాన్ని fernweh అనే జర్మన్ పదం నుంచి తెచ్చుకున్నాడు. Fern అంటే దూరం. Weh అంటే ఒక వ్యాకులత. దూరప్రాంతాల గురించి కతలచుకోగానే మనిషిలో కదలాడే ఒక వ్యాకులతనే యాత్రలకూ, ప్రయాణాలకూ పుట్టినిల్లు. సాహస నావికుడు సింద్ బాద్ కథల్లో మనం ఈ దూర తీరాల వ్యాకులతనే చూస్తాము. ప్రతి ప్రయాణం తర్వాత సింద్ బాద్ మళ్ళా ఇక మరొక ప్రయాణం చేయకూడదనీ, సముద్రం వైపే పోకూడదనీ గట్టిగా ఒట్టు పెట్టుకుంటాడు. కానీ ఇంటిపట్టున కొన్నాళ్లు గడపగానే మళ్ళా సముద్రం అతన్ని పిలవడం మొదలు పెడుతుంది. మళ్లా మరొక సాహస యాత్రకు అతణ్ణి పురికొల్పుతుంది.
తర్వాత మరొక పేజీలో జోసెఫ్ కాంప్ బెల్ ని ఉదాహరిస్తూ ప్రతి ఒక్క యాత్రా నిజానికి మనిషి తనను తాను కలుసుకోడానికి చేసే ప్రయాణమే అంటాడు. ప్రతి యాత్రా నీలో ఒక పరివర్తన తీసుకువస్తుంది. నీ రోజువారీ రుటీన్ల
నుంచి నిన్ను బయటపడేస్తుంది. నీ పరిమిత జీవితం నీకిస్తున్న భద్రతలోని అంధత్వాల్నీ, అల్పత్వాల్నీ నీకు ఎరుకపరుస్తుంది.
ప్రతి యాత్ర కూడా కొత్త కవిత్వం లాంటిది. నీ రోజువారీ జీవితం ఒక పడికట్టు పదం గా మారిపోతున్నప్పుడు అది నీ చుట్టూ ప్రపంచాన్ని నీకు మళ్లా కొత్తగా పరిచయం చేస్తుంది. అందుకని ఈ పుస్తకం లో యాత్రల గురించి రచయిత మనతో పంచుకున్న ఆలోచనలు చదువుతూ ఉంటే ఇదొక యాత్రాపరిచయ గ్రంథంకన్నా ఒక కావ్యం పరిచయం గ్రంథం లాగా ఎక్కువ కనిపిస్తూ ఉంది. యాత్రానందానికీ కావ్యానందానికీ ఆట్టే తేడా లేదనిపిస్తుంది
వందేళ్ల కిందట పాశ్చాత్య దేశాల్లో wanderlust ని ఒక మానసిక రుగ్మతగా భావించేవారట. సంచారుల్ని సామాజిక జీవితంలో ఇమడలేకపోయిన dropouts గా భావించేవారట. ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే తెప్పలు వేసుకుని మృత్యువుకు ఎదురీదిన యూరోపియన్ మహానావికులే లేకపోయింటే ఆధునిక చరిత్ర ఇలా ఉండేదే కాదు. కాని ఒక సంచారిని చూస్తే భద్రజీవులకి భయం కలగడంలో ఆశ్చర్యం లేదు. హిట్లర్ వేటాడిన మానవసమూహాల్లో జిప్సీలు కూడా ఒకరని మనం మరచిపోలేం. అందుకే రచయిత ఏమంటాడంటే నిజమైన dropous సంచారులు కాదు, తమ సంకుచిత జీవన వ్యాపకాలకు అంటిపెట్టుకు పోతున్న వాళ్లే అని.
ప్రతి యాత్రా నువ్వొక గానుగెద్దువి కాకుండా కాపాడుతుంది. నువ్వు యాత్రకి బయలుదేరావంటేనే నీ సామాజిక అంతస్తుని వదిలిపెట్టి సామాన్యమైన మనిషిగా మారుతున్నావని అర్థం. అందులో తప్పనిసరిగా రిస్క్ ఉంటుంది. కాని ఆ రిస్క్ నువ్వింతదాకా చూడని, ఊహించని ఎన్నో అవకాశాల్ని నీకు పరిచయం చేస్తుంది. చివరికి పండక్కి నువ్వు నీ స్వగ్రామానికి వెళ్లి వచ్చినా కూడా నువ్వెంతో కొంత మారకుండా తిరిగిరావు.
ఈ పుస్తకంలో రచయిత భద్రజీవితం లోని అల్పత్వాన్ని మాత్రమే కాదు, యాత్రా జీవితంలో పొంచివున్న అల్పత్వాల గురించి కూడా హెచ్చరిస్తాడు. ఉదాహరణకి మనం ప్రసిద్ధయాత్రాస్థలాలకు వెళ్లినప్పుడు అక్కడ ఏళ్ళతరబడి స్థిరపడిపోయిన tourist circuits ల్నే మళ్లా ఒక చుట్టు చుట్టి వచ్చి ఒక యాత్ర చేసివచ్చాం అనుకోవడంలో అర్థం లేదంటాడు. నిజానికి ఆ యాత్రలో మనం చూడవలసింది నలుగురూ నడిచిన దారికి ఆవలనే ఉంటుంది, దాన్ని కనుక్కోవటమే నిజమైన యాత్రంటాడు.
ఇలా ఈ పుస్తకం లోని ప్రతి ఒక్క ఆలోచననీ మీతో పంచుకోవాలని ఉంది. పుస్తకం మొదట్లోనే బషో వాక్యం ఒకటి కనిపిస్తుంది. Everyday is a journey and the journey itself a home అని. ఈ దృష్టితో యాత్రలు చేసినప్పుడు అది నీ ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా మార్చటమే కాక, నువ్వు పరిచయమైన వాళ్ళకి కూడా ఆ కొత్తదనాన్ని పరిచయం చేస్తుంది.
26-3-2023
మంచి వ్యాసం.
విభూతి భూషణ్ బందోపాధ్యాయ యాత్రికుడు గుర్తొచ్చింది.
మోడరన్ టూరిజం యాత్రని వ్యాపారం రొటీన్ గానూ ముందస్తు ప్రణాళిక ప్లేనింగ్ గానూ మార్చాక యాత్రకు అర్థం పరమార్థం క్షీణించలేదా?
అవును
మీరు పరిచయం చేయడానికి ఎంపిక చేసుకునే పుస్తకాలు మీ ప్రత్యేకతను తెలుపుతాయనడంలో సందేహం లేదు. వలసయావ వల్ల ఇవాళ ప్రపంచ సంస్కృతుల పరస్పర అవగాహన, సారూప్యతలు, వైవిధ్యాలు తెలుస్తున్నాయి. నేను అమెరికా వెళ్లిన కొత్తలో అమెరికా చరిత్ర చదివాను. కొలంబస్ ఇండియా కోసం బయలుదేరి అమెరికా తీరాన్ని చేరుకుని అక్కడి స్థానికులను రెడ్ ఇండియన్స్ అన్నట్లు గుర్తు. అదే గాకుండా కేవలం నాలుగవది వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే కలిగిన భూఖండంగా దాని ప్రత్యేకతను రాయాలని పించింది కూడా. కలలో కూడా ఊహించని అమెరికా యాత్ర మొదటి సారి చాలా చిత్రమైన
అనుభూతికి గురిచేసింది. ఇటీవలి యూరోపు యాత్ర కూడా అలాగే అనిపించింది. అవన్నీ రాయాలని ఉంది ఎప్పటికి నెరవేరేనో కాని మీ ఈ పరిచయం ద్వారా అనేక యాత్రానుభూతుల్ని వెలికి తీసినందుకు కృతజ్ఞతలు.
ఎవరు ఎన్ని యాత్రల అనుభవాలు రాస్తే ఈ ప్రపంచం అన్ని విధాలుగా నలుగురికి పరిచయం అవుతుంది.
నేను ఆర్నెల్లు కదలకుండా ఇంట్లో వుంటే నిలకడగా ఉండలేకపోయేదాన్ని .ప్రతీ ట్రాన్సఫర్ నాకో కొత్త అనుభవం .ఓ బ్యాక్ ప్యాక్ తో ప్రపంచం చుట్టివచ్చేవారంటే ఎంతో అభిమానం నాకు .చాలా తిరిగాను ,చాలా చూశాను .కానీ ఇది తీరని దాహం.
అవును ఇది తీరని దాహమే.
తిరుగుప్రయాణం టిక్కెట్ మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా ఇంటికి చేరే క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాక ఇంట్లోంచి కాలు బయటపెట్టే
ఇప్పటి ప్రయాణాలని ‘యాత్ర’ అనలేం కదా 🙂
ఈ ప్రయాణంలో కొన్ని భాగాలనైనా యాత్రకి సరండర్ అయిపోయి చేయగలగాలని ఆశ పడటమే ఇప్పటి మేలుకొలుపు. Thanks for introducing this book.
తిరుగు టిక్కెట్టు ముందే కొనుక్కున్న వాడిని టూరిస్టు అనీ, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియని వాడిని ట్రావెలరు అనీ ఒకాయన నిర్వచించాడు.
నువ్వు యాత్రకి బయలుదేరావంటే నీ సామాజిక అంతస్తు ని వదిలిపెట్టి సామాన్య మనిషిగా మారుతున్నావని అర్థం. ఎంత సత్యం!వెంటనే ఈ పుస్తకం చదవాలని, సునీత గారు చెప్పినట్టు return ticket bookచెయ్యకుండా ఒక నిజమైన యాత్ర చెయ్యాలని అనిపిస్తోంది. మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
A ship(Men) in harbor (Bachelor) is safe, but that is not what ships(men) are built for.
___ John A. SHEd-d 😊👍