దేవతగా మారిన కవయిత్రి

Reading Time: < 1 minute

దేవతగా మారిన కవయిత్రి ఇంట
అడుగుపెట్టాను లేదో ఆమె
నీతో కొంత చీకటి పట్టుకొచ్చావు
దాన్నక్కడే వదిలిపెట్టి రా అంది.

నేనన్నాను కదా! అమ్మా!
ఎంతో కొంత చీకటి లేకుండా
మనిషి కవిగా ఎలా మారతాడు
నువ్వు దేవతగా ఎలా మారావు

ఆమె నాకు చెప్పిన మాటలు
ఒక్కసారిగా అర్థమైనవికావు
విన్నవాటిని ఒక్కటొక్కటిగా
నెమరేస్తూ నే తెలుసుకున్నదిది.

వేదనలేక కవిత్వం లేదు
వేదన లేక బతుకు లేదు
చీకటి వెలుగుగా మారినట్టు
వేదన కవితగా మారుతుంది

తపించు, దుఃఖించు, సంఘర్షించు
అనుభవించు, ఆత్మలో నిరాకరించు.
ఏ క్షణం కూడా ఆగకు చీకటి దగ్గర
నీ వెంట మోసుకుపోకు, తీసుకురాకు.

కిందకు దిగులాగుతుంది వేదన
ఓపిగ్గా నిన్ను పైకి లేపుకోవాలి
ఎప్పటికప్పుడు నిన్ను నువ్వే
నీ చేతుల్తో పైకెగరేసుకోవాలి.

వేదనతో అలసి సొలసిన ప్రతిసారి
అదే నిజం కాదని చెప్పుకోవాలి.
ఆగ్రహం, అవమానం, ఈసు-
ఈ పంకంలోనే పద్మం వికసించాలి.

అయినా ఆమెనింకో ప్రశ్న అడిగాను
అమ్మా, మనిషిగా పుట్టినందుకే కదా
వేదన పడ్డావు, పద్యం చెప్పావు
మరి దేవతగా ఎందుకు మారావు?

మనిషిని కాబట్టి దుఃఖం తెలిసింది
దుఃఖం దాటగానే దేవతనయ్యాను.
ఒకసారి ఈ విద్య పట్టుబడిందా
ఇక నువ్వెటు నడిస్తే అటు వెలుగు.


25-3-2023

14 Replies to “దేవతగా మారిన కవయిత్రి”

  1. స్వస్థత నిచ్చేదిగా ఉంది. ధన్యవాదాలు.

  2. నువ్వు ఎటు నడిస్తే… అటు వెలుగు!!!
    ఏమి భావన!

  3. ఆహా ఏమి కవిత సార్.
    “ఎప్పటికప్పుడు నిన్ను నువ్వే నీ చేతుల్లో పైకెగరేసుకోవాలి”
    ఒకసారి ఈ విద్య పట్టుబడిందా
    నువ్వెటు నడిస్తే అటే వెలుగు
    అద్భుతమైన పంక్తులు

    ఎక్కడి చీకటినక్కడే వదిలేస్తూ
    వేదనాకల్లోలిని దాటితే వెలుగు తీరం దొరుకుతుంది.🙏

  4. నాకు ఈ కవయిత్రి తెలుసు

  5. “వేదన లేక కవిత్వం లేదు
    వేదన లేక బతుకు లేదు”

    ప్రసవ వేదన పడితేనే పండంటి బిడ్డ కు జన్మనిస్తుంది తల్లి.
    హృదయ వేదన లోనుండీ
    కవిత ఊపిరి పోసుకుంటుంది

    “ఒకసారి పట్టుబడిందా
    నువ్వెటు తిరిగితే అటు వెలుగు”

    ఆర్తి కి ఆవేశం భావావేశం తోడైతేనే
    భారతి జిహ్వ పై నర్తించడం మొడలిడుతుంది.

Leave a Reply

%d bloggers like this: