
భగవంతుడి ఎదుట నిలబడ్డప్పుడు
అన్నిటికన్నా ముందు
నన్ను నిలువెల్లా కట్టిపడేసినవి
భగవంతుడి చూపులు.
ఆ చూపులకు అర్థం ఇదీ అని
స్పష్టంగా చెప్పుకోలేననిపించింది
నిశ్చితమైన ఏ అర్ధానికీ
వాటిని నేను కుదించలేననిపించింది
ఆ చూపులు నేలమీద లేవు
వాటి దృష్టి నింగి పైన కూడా లేదు
అవి బయటకు చూడటం లేదు
లోపలకి సారించినవీ కావు.
ఆ చూపులు నీ వైపు చూడాలని
అనుకుంటూనే ఉన్నావా
అవి నీ వైపు ప్రసరించడం కాదు
నిన్నే తనలోకి లాక్కుంటున్నవి.
ఆ తలపుల్లో నేనున్నానని
నాకు తెలుస్తున్నది కానీ
ఆ నేను నేనుగా మిగలకుండా
నన్ను తమలో కలుపుకుంటున్నవి
ఆ చూపులు ఎటు చూస్తున్నవో
ఆ తావుకు సాగలేను, ఎగరలేను
వాటి ముందు ఎంతసేపు నిలబడ్డా
ఎంతకీ తనివి తీరదనుకున్నాను.
కొండల వరస లాగా నీలి కడలి లాగా
నీలాకాశం అద్దంలా నిలబడ్డట్టుగా
అవి నీవైపు నడిచి రావటం కాదు
నిన్నే తమవైపు రమ్మంటున్నవి.
ఆ చూపులు చూసే దిక్కు చేరటానికి
ముందుకో వెనక్కో నడిస్తే చాలదు
నువ్వు లేకుండా ఉండగలిగినప్పుడే
వాటి ఎదుట నిలబడగలమనిపించింది
ఎంత ప్రయత్నించు భగవంతుడి చూపుల్ని
మరే భావంతోనూ పోల్చలేకపోయాను
భగవంతుడి చూపుల్ని భగవంతుడి చూపులని
గుర్తుపట్టాను, మరింకేం కావాలనిపించింది.
24-3-2023
ఎంత బాగుందో చెప్పలేనంత బాగుంది. భగవంతుని చూసినప్పుడల్లా గుర్తు రావలసిన పద్యాలు ఇవి.
హృదయపూర్వక నమస్సులు, ధన్యవాదాలు.
భగవంతుడి చూపులను భగవంతుడి చూపులని గుర్తుపట్టాను మరింకేం కావాలనిపించింది….
ఆ స్థాయికి చేరగల్గటమే కదా కావలిసింది. అలతి పదాలలో అతినవీన ఆధ్యాత్మిక చింతన . 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు.
మాటలకందని… చూపులు… బాగుంది సర్
ధన్యవాదాలు మేడమ్
” ఆ చూపులు చూసే దిక్కు చేరటానికి
ముందుకో వెనకకో నడిస్తే చాలదు
నువ్వు లేకుండా ఉండగలిగనప్పుడే
వాటి ఎదుట నిలబడగలమనిపించింది ”
అస్తిత్వం అదృశ్యమైనపుడే అచ్యుతుడు అనంత విధాలుగా
అవగాహనలోకి చేరుకుంటాడు
అంతర్యామి యై కొలువుంటారు.
అద్భుతమైన కవిత sir.
ధన్యవాదాలు
అందరిలోనూ నువ్వు భగవంతుణ్ణి చూస్తే నిన్ను భగవంతుడు చూస్తాడు అని గీతాచార్యులు చెప్పిన శ్లోకాలు రెండు, మూడు రోజులుగా చదువుతున్నా! ఇదిగో సారాంశం మీరిలా రాసేశారు. ధన్యోస్మి. ధన్యవాదాలు మీకు 🙏
ధన్యవాదాలు
తాదాత్మ్యతనే మనో సిద్ధిత్వం ప్రయత్న పూర్వకంగా వచ్చేది కాదు..
నిరలంకార మనో నిశ్చలత్వం నుండి మొదలై నిష్కామ సమర్పణ దాకా అనే సంక్లిష్ట భావాన్ని మీ మాటల్లో దర్శింప చేశారు సర్..సవినయ నమస్సులు.
చాలా సంతోషం అమ్మా! మీ మాటలకు!
🙏🏻
ధన్యవాదాలు