ప్రపంచ కవితా దినోత్సవం

Reading Time: 3 minutes

Handscroll of flowers and birds from the Chinese Qing dynasty, 1800, Wikicommons

ఈ రోజు ప్రపంచ కవితా దినోత్సవం. 1999 నుంచీ ఐక్యరాజ్యసమితి మార్చి 21 ని ప్రపంచ కవిత్వ దినోత్సవంగా జరుపుతూ వస్తోంది. ఈ రోజు వసంత విషువత్తు. దివారాత్రాలు సమంగా ఉండే రోజు. మరే రోజైనా అయితే ఏదో ఒక ప్రాంతానికి ప్రాధాన్యమిచ్చినట్లు అవుతుందనీ, ఈ రోజయితే, ప్రపంచమంతటికీ వర్తించే రోజు అవుతుందనీ యునెస్కో ఈ రోజుని ఎంపిక చేసింది. కవిత్వం రాయడం, చదవడం, వివిధ కవితారూపాల్ని ప్రదర్శించడం, విద్యార్థులకి బోధించడం, వివిధ భాషా సాహిత్యాల్లోని కవిత్వాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం ఈ రోజు చేపట్టదగ్గ కార్యక్రమాలుగా ఐక్యరాజ్యసమితి సూచించింది.

ప్రతి ఏడాదీ ఈ రోజుకి యునెస్కో ఒక థీమ్ కూడా సూచిస్తూ ఉంటుంది. Always be a poet, even in prose అనేది ఈ సారి ఇతివృత్తం. ప్రపంచానికి వచనకవితను పరిచయం చేసిన ఫ్రెంచి మహాకవి బోదిలేర్ మాటలు ఇవి. ఈసారి ఈ మాటల్ని ముందుకు తీసుకురావడం ద్వారా కవిత్వాన్ని పూర్తిగా అన్ని రకాల నిర్మాణ పరిమితుల్ని విడుదల చేసినట్టే అని చెప్పుకోవచ్చు. కవిత్వం ఫలానా ఫార్మాట్ లోనో, టెంప్లేట్ లోనో ఉండాలనే నియమనిబంధనల్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే. అన్ని రకాల ఛందస్సూత్రాల్నీ, అలంకారాల్నీ అప్రధానంగా భావిస్తున్నాక, కవిత్వమంటే, ఒక హృదయం నుంచి మరొక హృదయానికి నేరుగా అర్థం కాగల భాష అని నేడు ప్రపంచవ్యాప్తంగా అంగీకరిస్తున్నట్టే.

నేను ‘నిర్వికల్ప సంగీతం’ కవిత్వ సంపుటి వెలువరించినరోజుల్లో (1986) ప్రపంచ కవిత్వం నుంచి కొన్ని అనువాదాలు చేస్తూ అందులో అశోకుడి శిలాశాసనాలనుంచి కొన్ని వాక్యాల్నీ, మహాత్మాగాంధీ రచనల నుంచి కొన్ని వాక్యాల్నీ కూడా కవిత్వంగా పరిచయం చేసాను. ఏ వాక్యం వినగానే మనసు అప్రయత్నంగా స్పందిస్తుందో, రసార్ద్రమవుతుందో, అటువంటి ప్రతి వాక్యమూ కవిత్వమే అని ఈ రోజు మనం కొత్తగా చెప్పుకోనక్కరలేదు. ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అని మన ప్రాచీన అలంకారికుడు బోదిలేర్ కన్నా కనీసం రెండు శతాబ్దాల ముందే చెప్పాడు.

చాలాసార్లు ఆ రసాత్మకతను కవి తన self-consciousness తో కలతపరుస్తాడు. ఒకప్పుడు ఛందస్సు కవి హృదయంలోని అవ్యక్త ప్రజ్ఞను వెలికి తియ్యగలిగే సాధనంగా ఉండేది. కాని ఆ ఛందస్సు నియమాలకు అనుగుణంగా ఉండటంకోసం కవులు చాలా సార్లు వ్యర్థపదాలు, శుష్కపర్యాయ పదాలు వాడకతప్పని పరిస్థితి ఏర్పడటం కూడా మనకు తెలుసు. కాని ఛందస్సుని పక్కన పెట్టి కవిత్వం చెప్పడం మొదలుపెట్టాక కవి మరీ సోమరిగా మారిపోయాడు. రసాత్మకం కావలసిన వాక్యాన్ని అనవసర పదజాలంతో విస్తారమైన ప్రసంగంగా, అభిప్రాయప్రకటనగా మార్చేసాడు.

కవిత్వానికి అన్నిటికన్నా పెద్దశత్రువు పడికట్టు పదం. పడికట్టు కవిసమయాలు, పడికట్టు దృక్పథాలు, పడికట్టు నిర్మాణాలు- ఏదైనా సరే అప్పటికే నలుగురూ పలికిన తీరులో పలకడం కవిత్వాన్ని బండబారేట్టు చేస్తుంది. పదం, పదసంయోజనం, పద్యనిర్మాణం పడికట్టు నుడికట్టుకావడం కన్నా కవిత్వానికి విపత్తు మరొకటి ఉండబోదు. అందుకనే Poetry fettered, fetters the human race అన్నాడు విలియం బ్లేక్. పాల్గ్రేవ్స్ గోల్డెన్ ట్రెజరీ సంకలనం తెరవగానే ఈ వాక్యాలే మనకు కనిపించడం ఇందుకే.

బహుశా కవిత్వ దినోత్సవం నాడు అన్నిటికన్నా ముందు చేయవలసిన పని కవిత్వాన్ని అకవితాశృంఖలాల్నుంచి విడిపించడం. ప్రతి యుగంలోనూ నిజాయితీ కలిగిన ప్రతి కవీ ముందు ఈ పనికే పూనుకుంటాడు. అందుకే ఇస్మాయిల్ గారు భాషని శుభ్రపరచడం తన పని అని చెప్పుకున్నాడు.

కవిత ఒక క్షణిక చమత్కారమో లేదా సుదీర్ఘ ప్రసంగమో కాదు. అది క్షణికమూ, శాశ్వతమూ కూడా.

కవిత అంటే ఏమిటి అని మనం వివరించడం కష్టంగాని, నాలుగు వాక్యాలు కవిత అవునో కాదో చెప్పడం మాత్రం చాలా సులభం. సహృదయ మందిరంలోకి ప్రవేశించేటప్పుడు ప్రతి హృదయద్వారందగ్గరా ఒక poetry detector ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఏమార్చి సహృదయమందిరంలోకి ప్రవేశించడం అసాధ్యం.

మంచి కవిత అన్నిటికన్నా ముందు మన మనసులో ఒక దీపం వెలిగిస్తుంది. ఆ కాంతిలో మనకి మనమే కొత్తగా కనబడతాం. దానిలో ఒక పసిపిల్లవాడి innocence తో పాటు, ఒక జ్ఞాని తాలూకు experience కూడా ఉంటుంది.

ఉదాహరణకి వసీరా రాసిన ఈ కవిత (ఇష్ట కవిత్వం, పే.333) చూడండి:

ఆవుతోక

అది గేటు దగ్గరకొచ్చి నిలబడినపుడు
దానితోకంత లేడుగానీ
ఈనెపుల్లతో తోలడానికి తయారూ!

ఇంతలో ఒకావిడ
వాణ్ణెత్తుకుని లోపలికెళ్ళిపోతుంది.
తోలనివ్వనందుకు
ఆవు కూడా ఏడుస్తూ వెళ్ళిపోతుంది.

ఇంత కుసుమపేశలమైన వాక్యాలు వినగానే మనలో ఏదో జరుగుతుంది. ఇందులో ఛందస్సు లేదు, శబ్దాలంకారాలు లేవు, అర్థాలంకారాలు లేవు, విస్పష్టమైన దర్శనం ఏదీ లేదు, ఏ నిర్దిష్టమైన అభిప్రాయ ప్రకటనా లేదు. అసలు ఇందులో కవిత్వం తప్ప మరేమీ లేదు.

ఎవరైనా కవిత రాయాలనుకునేవాళ్ళు ఇటువంటి కవితనొకసారి చదవాలి. ఒకక్షణం తనలోకి తాను చూసుకోవాలి. మరే సామగ్రితోనూ పనిలేకుండా కేవలం తన హృదయం మాత్రమే ఏం చెప్తున్నదో చెవి ఒగ్గి ఆలించాలి. అప్పుడు పలికేది మాత్రమే కవిత అవుతుంది. చిత్రకొండ గంగాధర్ రాసిన ఈ కవిత (ఇష్ట కవిత్వం, పే. 419) చూడండి:

మొద్దు

ఏటి ఇసుకతో
పిల్లకాయ
ఎడారి నమూనా తయారు చేశాడు.
చీకటి పడింది
ఒంటెల్ని మర్చిపోయాడు.

ఎటువంటి pretensions లేకుండా కవిత్వం చెప్పడం ఒక ఎత్తు, అలా చెప్పినదాన్ని కవిత్వంగా గుర్తుపట్టడం మరొక ఎత్తు. ఒక జాతి తన చరిత్రలో అటువంటి సెన్సిబులిటీని ఎప్పుడు సాధించుకోగలుగుతుందో అప్పుడే దానికి స్వర్ణయుగం అని చెప్పగలం. Poetry fettered, fetters the human race అని అన్న తరువాత విలియం బ్లేక్ ఈ మాటలు కూడా అన్నాడు: Nations are destroyed or flourish in proportion as their poetry, painting, and music are destroyed or flourish.

నినాదాలు, ప్రచారాలు, అనుకరణలు, పొగడ్తలు, తెగడ్తలు కవిత్వంగా చెలామణి అవడం మొదలుపెట్టాయంటే ఆ జాతి ధ్వంసం అవుతున్నట్టు. నిరలంకారంగా, సూటిగా పలికే ఒక చక్కనిమాటకి శ్రోతల హృదయాలు స్పందిస్తున్నాయంటే ఆ జాతికి మంచిరోజులు వచ్చినట్టు.

ఇంతా చెప్పాక ఇంకో మాట కూడా చెప్పాలి.

ఏది కవిత అవుతుందో ఏది కాదో అందరికన్నా ముందు కవికే తెలుస్తుంది. ఒక మాట తనలో పలికినప్పుడు అది కవిత అవుతున్నదని గుర్తుపట్టగలిగిన కవి తన ప్రతిమాటా కవిత ఎందుకు కావడంలేదని పరితపించడం మొదలుపెడతాడు. ఆ పరితాపం కవికి మాత్రమే అనుభవైకవేద్యమైన ఒక జీవితానుభవం. అందుకనే మా మాష్టారు కవిత్వాన్ని అష్టమ వ్యసనం అన్నారు. ఏడు వ్యసనాలనుంచీ బయటపడగలవాళ్ళు ఉండవచ్చుగానీ, ఈ ఎనిమిదో వ్యసనానికి చిక్కిన తరువాత బయట పడ్డవాళ్ళని నేనిప్పటిదాకా చూడలేదు.

21-3-2023

13 Replies to “ప్రపంచ కవితా దినోత్సవం”

  1. కవిత్వం వచనంలో కూడా ఉండవచ్చు అనే వాక్యం చదవగానే నాకు గుర్తు వచ్చింది ,రాజారావు కాంతపుర నవలలో కార్తీక దీపాలను వర్ణించిన తీరు .
    మంచి కవిత్వం ఎందుకు కంటతడి పెట్టిస్తుందో !

  2. ప్రపంచ కవితా దినోత్సవ సందర్భంగా మీ ఆత్మీయ ఆర్ద్ర సందేశం అమూల్యం. చివరి పేరాలో అంశం అనుభవైకవేద్యం. మీ వంటి సాహితీ పరుల సాన్నిహిత్యం ఏర్పడటం జీవితం ఒక మేలిమి వరం 🙏

    1. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  3. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మీరు అందించిన ఈ వ్యాసం ఎంతో రసార్ద్రం గా ఉంది

Leave a Reply Cancel reply

Exit mobile version
%%footer%%