వరమాలికా ప్రసాదుడు

మునిపల్లె రాజు (1925-2018) గారి పరిచయం, ఆయన నా పట్ల అకారణంగా చూపించిన వాత్సల్యం నా జీవితంలో నాకు లభించిన గొప్ప ఆశీస్సులూ, భాగ్యమూనూ. మంచివాళ్ళని తలుచుకునే కొద్దీ ఆనందం అధికమవుతుందని గురజాడ రాసుకున్నది రాజుగారిలాంటి వాళ్ళని మనసులో పెట్టుకునేనేమో అనిపిస్తుంది.

ఆయన 94-95 మధ్యకాలంలో ఆహ్వానం పత్రికలో ఒక ఇంటర్వ్యూలో తనకి ఇష్టమయిన రచయితల్లో నన్నూ, మా అక్కనీ పేర్కొన్నారు. అప్పట్లో నేను పాడేరు లో పనిచేస్తున్నాను. రాజుగారిని ఎన్నడూ చూసి ఉండను. ఆయన కథలు కూడా చదవలేదు. కాని ఆయన తనకి ఇష్ఠమైన రచయితల్లో నా పేరు చెప్పడం నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ తర్వాత హైదరాబాదు వచ్చాక ఆయన పరిచయమయ్యాక తమ ఇంటికి ఆహ్వానించారు. సైనిక్ పురిలో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆ దంపతులు నా తల్లిదండ్రుల్లానే నన్నెంతో ప్రేమతో ఆదరించారు. ఆప్యాయంగా అన్నం పెట్టారు. ఆ మొదటిరోజే వాళ్ళ హృదయంలోనేనూ, నా హృదయం మీద వాళ్ళూ ఒకరిపేరు ఒకరం పచ్చబొట్టు పొడిపించుకున్నాం.

అప్పణ్ణుంచీ, ఇప్పటిదాకా రాజుగారు సి.వి.కృష్ణారావుగారిలాగా, రావెల సోమయ్యగారిలాగా నా కుటుంబపెద్దల్లో ఒకరు. నాకు ఏదైనా సంతోషం కలిగితే అది ఆయనకు సంతోషం, నాకు ఏదైనా కష్టం కలిగితే అది ఆయనకే కలిగినంతగా విలవిల్లాడేవారు.

2000 లో నేను శ్రీశైలం ఐటిడిఎ లో ప్రాజెక్టు అధికారి గా పనిచేస్తున్నాను. అప్పట్లో ఒక పత్రిక నా మీద ఆరోపణలు చేస్తూ మెయిన్ పేజీలో రెండు రోజుల పాటు వరసగా వార్తలు రాసింది. అప్పటి రాజకీయ పరిస్థితుల ప్రకారం ఆ పత్రికలో ఏ అధికారిమీదనైనా ప్రతికూల వార్త వస్తే ఆ అధికారి పరిస్థితి అంతే. మామూలుగా ఎవరేనా రచయిత మీద ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే, తక్కిన రచయితలూ, మీడియా వెంటనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆ రచయితకి మద్దతుగా నిలబడతాయి. కాని అదే ఒక పత్రిక తన ప్రయోజనాల కోసం ఒక అధికారిని వేధిస్తే? ఆ అధికారి ఒక రచయిత కూడా అయితే? ఏమో! ఆ కఠినాతికఠినమైన పరిస్థితిలో ఒక్క రచయిత కూడా నాకు మద్దతుగా నిలబడలేదు. అయితే ఆ పత్రిక అలా రాసినందువల్ల ప్రభుత్వం నుంచి నాకేమీ ఇబ్బంది ఎదురుకాకపోగా, ఆ పత్రికనే ఖండించడం జరిగింది. ఆ పత్రిక ఆ వార్తల్ని ఆపేసింది. అది జరిగిన చాలా కాలం తరువాత, ఒక సారి సి.వి.కృష్ణారావుగారు నాతో మాట్లాడుతూ మునిపల్లె రాజు గారు ఆ సమయంలో ఆ పత్రికాధిపతికి పెద్ద లేఖ రాసారని చెప్పారు. ఆ మాట రాజుగారు ఎప్పుడూ నాతో మాట మాత్రంగా అనలేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక మనిషి మరొక మనిషినుంచి ఇంతకన్నా కోరుకోగలదేముంటుంది? రాజు గారికి నా మీద ఉన్న నమ్మకానికి నేను ఆయనకి మనసా కైమోడ్చాను. ఆ పత్రిక అలాంటి వార్తలు ప్రచురించినందువల్ల కదా రాజు గారి హృదయం నాకు అవగతమైంది అనుకున్నాను.

రాజుగారి సంస్కారానికి ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఇవ్వగలను. ఆయనకు సాహిత్య అకాదెమీ అవార్డు వచ్చిన రోజు ఒక తెలుగు దినపత్రిక సంపాదకుడినుంచి నాకు ఫోన్ వచ్చింది. ఆయన మీద వెంటనే ఒక వ్యాసం రాసిపంపమని. ఆ రోజు నేను అసెంబ్లీలో ఉన్నానో, సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతున్నానో, ఏ హడావిడిలో ఉన్నానో గాని, చాలా సంతోషంతోనూ, ఉద్వేగంతోనూ రాజుగారి పైన ఒక వ్యాసం రాసిపంపాను. కాని అనూహ్యంగా, తెలుగులో సుప్రసిద్ధ రచయిత ఒకాయన ఆ వ్యాసం చదివి ఆ మరుసటి వారం ఆ పత్రికకి ఒక ఉత్తరం రాసాడు. అందులో నేను రాజుగారిని ‘మేడ్ డిఫికల్టు’ చేసానని రాసాడు. జీవితాన్ని, సాహిత్యాన్నీ కూడా ‘మేడ్ ఈజీ’ గా చూపించడానికి అలవాటు పడిపోయిన ఆ రచయితకి రాజు గారి సాహిత్యమూ, నా వ్యాసమూ మేడ్ డిఫికల్టుగా కనిపించడంలో ఆశ్చర్యం లేదుగాని, ఆ ఉత్తరం చదివి రాజుగారు ఎక్కడ నొచ్చుకుని ఉంటారో అని నాకు చాలా ఖేదం కలిగింది. కాని ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆ మర్నాడు రాజు గారినుంచి నాకో కార్డు వచ్చింది. ‘మీ వ్యాసం terrific గా ఉంది. అది వచ్చినప్పణ్ణుంచీ నాకు అసంఖ్యాకంగా ఫోన్ కాల్సూ, ఉత్తరాలూనూ ‘అంటో. అది నిజమో కాదో నాకు తెలియదు గాని, ఆ ఉత్తరం చదివి నేనెక్కడ నొచ్చుకుంటానో అని రాజు గారు నాకా కార్డు రాసారని నాకిప్పటికీ నమ్మకం. ఏమి? ఒక ఫోన్ కాల్ చేసి ఊరుకోవచ్చు. కాని ఆయన తన స్పందనని రాతపూర్వకంగా నమోదు చెయ్యాలనుకున్నారన్నమాట!

రాజు గారి కథల పైన మాట్లాడే అవకాశం, రాసే అవకాశం నాకు చాలాసార్లు వచ్చింది. హైదరాబాదులో ఆయనా నేనూ కూడా ఎన్నో సాహిత్యసమావేశాల్లో వేదిక పంచుకున్నాం. నా పుస్తకం ‘సహృదయునికి ప్రేమలేఖ’ మీద కృష్ణారావుగారు గోష్ఠి పెట్టినప్పుడు రాజుగారు ముఖ్య అతిథిగా వచ్చారు. ‘చినవీరభద్రుడి కి నేను సమకాలికుణ్ణి కావడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది ‘ అని రాజుగారు ఆ మీటింగ్ లో చెప్పటం నన్ను చకితుణ్ణి చేసింది. అటువంటి మహానుభావుడు ఆ మాట చెప్పడం అవధుల్లేని వాత్స్యల్యం వల్ల మాత్రమే సాధ్యమని అనుకుంటాను. అందుకే ఆ మాటల్ని నా గుండెలో కుట్టిపెట్టుకున్నాను.

ఆయన కథాసంపుటి ‘అస్తిత్వనదం ఆవలి తీరాన’ వెలువడినప్పుడు, ‘నెలనెలా వెన్నెల’లో ఆ పుస్తకం మీద చర్చపెట్టుకున్నప్పుడు నన్ను మాట్లాడమని అడగడానికి ఆయన సైనిక్ పురి నుండి మెహిదీపట్నం రావడం నన్ను సంభ్రమానికి గురిచేసింది. మామూలుగా తమ పుస్తకం మీద మాట్లాడమని అడిగే వాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలనుకుంటారు. చాలామంది తమ పుస్తకం పిడిఎఫ్ పంపించి నన్ను చదువుకుని రమ్మంటారు. కాని తన పుస్తకం మీద మాట్లాడమని ఒక వక్తని పిలిచేటప్పుడు ఆయనకి పుస్తకం స్వయంగా ఇచ్చి మాట్లాడమని పిలవడం ధర్మం అనుకునే పూర్వతరాలకు చెందిన మనిషి రాజు గారు.

నా పుస్తకం ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ ఆయనతో ఆవిష్కరింపచేసుకునే అదృష్టం కలిగింది నాకు. ఆ రోజు ఆ వేదిక మీద రావెల సోమయ్యగారు, కాళీపట్నం రామారావుగారు, వకుళాభరణం రామకృష్ణ గారూ కూడా ఉన్న ఫొటోలు నాకు జీవితకాలానికి సరిపడా జ్ఞాపకాలు.

రాజుగారితో ఆకాశవాణి ఒక ఇంటర్వ్యూ చెయ్యాలనుకున్నప్పుడు సి.ఎస్.రాంబాబుగారు వల్ల ఆ అవకాశం నాకు దొరికింది. ఆ ఇంటర్వ్యూ రాజుగారిని నాకు మరింత దగ్గర చేసింది. ఆ ఇంటర్వ్యూ మళ్ళా వినాలనుకున్నవాళ్ళు ఇక్కడ వినొచ్చు.

వరంగల్ సహృదయ సాహితి వారు ప్రతి ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారం ఒకసారి కథాప్రక్రియకు ప్రకటించినప్పుడు నన్ను కూడా ఒక న్యాయనిర్ణేతగా ఎంచుకున్నారు. ఆ ఏడాది వచ్చిన పుస్తకాలు నాకు పంపినప్పుడు అందులో రాజుగారి పుస్తకం కనబడగానే నేను తక్కిన పుస్తకాలన్నీ పక్కనపెట్టేసాను. రాజుగారికే ఆ ఏడాది వారు పురస్కారం ప్రకటించి ఆయన కథల మీద మాట్లాడమని నన్ను పిలిచారు. ఆ రోజు ఆయనా, కవితా ప్రసాద్ నేనూ కలిసి వరంగల్ పోయి రావడం నాకొక మరవలేని జ్ఞాపకం. నిరాడంబరుడూ, నిగర్వీ, ప్రేమించడం తప్ప మరేమీ తెలియనివాడూ అయిన మనిషితో నాలుగు నిమిషాలు మాట్లాడినా కూడా నువ్వెంతో పరిశుభ్రపడతావు. అటువంటిది ఒక రోజంతా ఆయనతో కలిసిగడిపితే అంతకన్నా చెప్పేదేముంది!

ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నిన్న మునిపల్లె రాజు గారి పిల్లలు ఆయన్ని తలుచుకుంటూ ఏర్పాటు చేసిన సభకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచి మాట్లాడమంటే నా గొంతు గద్గదం కావడంలో నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. వారి పిల్లలు ‘కణ్వస గ్రంథమాల’ తరఫున పోయిన నాలుగేళ్ళుగా మునిపల్లె రాజు పేరిట అవార్డు ఇస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఆ పురస్కారం ప్రసిద్ధ రచయిత సింహప్రసాద్ గారికి అందించారు. ఆ పురస్కార ప్రదాన సభకి విహారి అధ్యక్షత వహించారు. పోయిన ఏడాది జరిగిన సభకి నన్ను పిలిచారుగాని, అప్పటి ఉద్యోగజీవితం నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అయినా కూడా రాజు గారి అమ్మాయి ఉషగారు మళ్ళా గుర్తుపెట్టుకుని ఈ సారి కూడా నన్ను పిలిచారు

నిన్నంతా మళ్లా ఒకసారి నాకు రాజుగారిని ప్రత్యక్షంగా కలుసుకున్నంత ఉద్వేగంగా ఉండింది. మునిపల్లె రాజు ఒక శతాబ్ది సమానుడు. తెలుగునేలను ప్రభావితం చేసిన సాహిత్య, సాంఘిక, సాంస్కృతిక ప్రభావాలన్నింటికీ ఆయన వారసుడు. ఆయన రచనలు చదువుతూ ఉంటే మనం ఒక మనిషినో, ఒక కుటుంబాన్నో కాదు, వందేళ్ళ సామాజిక పరివర్తనని దగ్గరనుంచి చూస్తున్నట్టుగా ఉంటుంది.

రాజు గారికి కథకుడిగా ప్రకాస్తి లభించిందిగాని, ఆయన కవి కూడా. నిజానికి ఆయన వాక్యాల్లో కనిపించే అలౌకిక, మార్మిక, మాంత్రిక సంవేదనలు పూర్తిగా కవిత్వ లక్షణాలు. అందుకే ఆయన ‘అలసిపోయినవాడి ఆరణ్యకాలు’ (2000) ఎప్పుడు తిరగేసినా నాకు బైరాగి, అజంతా, త్రిపుర గుర్తొస్తారు. నిన్న ఆ మాట కూడా చెప్పి ఆయన కవిత ‘వరప్రసాదుడి వినయగీతం’ చదివి వినిపించాను. అందులో ఆయన

అందరూ అనుకొన్నంత అదృష్టహీనుణ్ణి కాను
ఎందరికో లభించని వరమాలికా ప్రసాదుడిని నేను

అని రాసుకున్నారు. అవును. రాజుగారు ఒక వరమాలికా ప్రసాదుడు. నేను ఆయన వాత్సల్య వరమాలికా ప్రసాదుణ్ణి.

20-3-2023

6 Replies to “వరమాలికా ప్రసాదుడు”

  1. ఎంత సహృదయులు రాజు గారు. గొప్పల్ని భుజకీర్తుల్లా మోసే మనుషులే కానీ, ఇతరుల మనసు నొచ్చుకుంటుందేమో అని ఆరాటపడే మనుషులు అరుదైన కాలంలో ఇట్లాంటి వ్యక్తి గురించి తెలియడం ఎంతో ఆనందం 🙏

    ఈ మధ్య నిడదవోలు మాలతి గారికి ‘మొల్ల సత్కారం’ జరిగినప్పుడు కూడా తలుచుకున్నారు వారిని ఎంతో ఇష్టంగా. మాలతి గారు చేసిన వారి పుస్తక అనువాదం తొందరగా బయటకు వస్తే బావుణ్ణు, బయటివారికి కూడా తెలుస్తుంది.

  2. పురుషులందు పుణ్య పురుషులు వేరయా
    ఎంత చక్కగా అన్వయిస్తుందిక్కడ.అవ్యాజ ప్రేమకు ఆలవాలం. చరిత్రగా నిలచిన సాహితీ శిఖరం
    కథలముని పల్లెరాజు సంస్మరణ ఎక్ మధుర భావన. నమస్సులు.

  3. గురువు గారికి నమస్సులు.ఆత్మీయులు రాజు గారి గురించి చాలా మంచి వ్యాసం. మీకు అభనందనలు. నేను వారిని ఎప్పుడూ కలవలేదు.నాకు సాహిత్య అకాడెమీ యువ పురస్కారం ఇచ్చిన జూరీ సభ్యుల్లో వారుకూడా ఒకరు. ఆ తర్వత ఎప్పుడో ఒక సారి ఫోన్ లో మాట్లాడి నా ‘గ్రీష్మ భూమి ‘ కథలు పంపితే ముందుమాట రాసి పంపారు.వారికి ఆత్మీయ కృతజ్ఞతలు.

Leave a Reply

%d bloggers like this: