
ఆధునిక తెలుగు కవిత్వంలో వచనకవిత, గేయం, గీతం అనే ప్రక్రియల్లోంచి తనకు ఇష్టమైన కవితల్ని కొన్నింటిని అనిల్ బత్తుల ఇష్ట కవిత్వం (బోధి ఫౌండేషన్, 2023) పేరిట ఒక సంకలనంగా వెలువరించాడు. నిన్న సాయంకాలం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సమావేశమందిరంలో ఆ పుస్తకం ఆవిష్కరణ సభ జరిగింది. కె.శివారెడ్డి ఆ సమావేశానికి అధ్యక్షత వహించి పుస్తకం ఆవిష్కరించారు. నేను, ఊర్మిళ, నందకిశోర్ ఆ పుస్తకం గురించీ, కవిత్వం గురించీ మాట్లాడేం. నిజానికి నందూ ఒక వక్తగా మాట్లాడాలిగాని, సభ మొదలయ్యేముందు కాశిరాజుతో కలిసి తనవి కొన్ని పాటలు పాడి వినిపించాడు.
ఒక పాఠకుడు లేదా కవి లేదా సాహిత్య రసజ్ఞుడు తనకి ఇష్టమైన కొన్ని కవితలతో ఒక సంకలనం తేవడం ఇదే మొదటిది కాదు. తాను ఎంత తటస్థంగా, నిష్పాక్షికంగా ఉన్నానని చెప్పుకున్నప్పటికీ ప్రతి సంకలనం ఒక ఇష్టరచనా సంకలనమే. ఉదాహరణకి తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి ప్రాతినిధ్యం వహించే ‘వైతాళికులు’ లోఆ కాలం నాటి ప్రముఖకవులందరూ చోటు చేసుకున్నారని చెప్పలేం.
కాబట్టి అటువంటి ఒక తాటస్థ్యాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకోకుండా తనకి ఇష్టమైన కవిత్వాన్ని మాత్రమే తాను సంకలనం చేస్తున్నాని చెప్పుకోవడంలో ఒక నిజాయితీ ఉంది. అందుకు అనిల్ ని అభినందించాలి. ఈ సంకలనంలో ఎందరో గొప్ప కవులు, గొప్ప కవితలు చోటు చేసుకోలేదు. చోటు చేసుకున్న కవులు కూడా వారి వారి స్థాయికి తగిన విధంగా చోటు చేసుకోలేదు. కాని అందుకు అనిల్ ని ప్రశ్నించి లాభం లేదు. ఎందుకంటే, ఇది ఒక శతాబ్ది సంకలనం అన్నది ఎంత నిజమో, ఒక పాఠకుడి వ్యక్తిగతమైన ఎంపిక అన్నది కూడా అంతే నిజం.
ప్రపంచ కవిత్వంలో ఇటువంటి సంకలనాలు లేకపోలేదు. ప్రసిద్ధ పోలిష్ కవి, నోబెల్ పురస్కార స్వీకర్త చెస్లా మీవోష్ సంకలనం చేసిన A Book of Luminous Things (1998) ఇటువంటి సంకలనమే. అయితే అందులో తాను ఎంపిక చేసిన ప్రతి కవితకూ మీవోష్ అది తనకు ఎందుకు ఇష్టమో నాలుగైదు వాక్యాల చిన్న పరిచయం కూడా జతపరిచాడు. Camille Paglia అనే ఆమె Break, Blow and Burn (2006) అనే పేరు మీద ఇంగ్లిషులో 41 కవితలు తీసుకుని వాటిని చాలా సవివరంగా పరిచయం చేసింది. ఆ స్ఫూర్తితో Edward Hirsch అనే అమెరికన్ కవి Poet’s Choice (2007) అనే సంకలనాన్ని తీసుకొచ్చాడు. అందులో తనకి ఇష్టమైన కవుల గురించి రాస్తూ వారి కవితల్ని పరిచయం చేసాడు. వారిలాగే అనిల్ కూడా తాను చేసిన సంకలనంలో తాను ఎంపికచేసిన కవితలు తనకి ఎందుకిష్టమో ఒకటి రెండు పరిచయవాక్యాలైనా రాసి ఉంటే బాగుండేది.
నేను ముందే చెప్పినట్టుగా ఇది ఒక వ్యక్తి ఎంపిక. అంటే ఒక మనిషి తెలుగు కవిత్వాన్ని తన దృష్టితో చూసిన సేకరణ. అతడు నిలుచున్న చోటునుంచి దాదాపు వందేళ్ళ తెలుగు కవిత్వాని తాను ఎలా చూస్తున్నాడో ఆ దృక్కోణాన్ని కూడా మనకు పరిచయం చేస్తున్న సంకలనం. కాబట్టి ఈ కవిత్వాన్ని చదువుతున్నప్పుడు ఇది ఒక భాషకు సంబంధించిన కవిత్వం అనే ఎరుకతో పాటు ఒక దృక్కోణానికి సంబంధించిన కవిత్వం అనే ఎరుకతో కూడా చదవాలి.
ఈ సంకలనంలో 64 గురు కవులు, 243 కవితలు ఉన్నాయి. దాదాపుగా తొంభై శాతం కవితలు నేనింతకుముందు చదివినవి. కొన్ని గతంలో చాలాసార్లు చదివినవి కూడా. కొన్ని కవితలు ఇప్పుడే మొదటిసారి చదివినవి. అయిదారుగురు కవుల్ని కూడా ఇప్పుడే మొదటిసారి చదివాను. ఈ సంకలనాన్ని ఒక బయటివాడు తెలుగు కవిత్వాన్ని మొదటిసారి చదువుతున్నట్టుగా చదివాను. లేదా ఈ సంకలనం నాకు తెలుగు కవిత్వాన్ని మొదటిసారిగా పరిచయం చేసిందని కూడా అనవచ్చు. ఇది perspective మహిమ. నాకు తెలిసిన కవులే, నేనెన్నో సార్లు చదివిన కవితలే ఇందులో ఉన్న ఎంపిక వల్ల, అమరికవల్ల మొదటిసారి చదివినట్టుగా అనిపించింది.
అలా చూసినప్పుడు నాకు కలిగిన కొన్ని పరిశీలనల్ని నిన్న నా ప్రసంగంలో పంచుకున్నాను. వాటిలో కొన్ని మీముందుంచుతాను.
ఒక తరం అంటే 20-30 ఏళ్ళు అంటారు. నేను ఇరవయ్యేళ్ళు ఒక తరంగా లెక్కగట్టుకు చూసినప్పుడు ఇందులో గురజాడ అప్పారావు తరానికి ఆయనొక్కడే కవి కనిపిస్తున్నాడు. ఆ తర్వాత కవి చలంగారే. ఆయన 1894 లో పుట్టారు. అప్పణ్ణుంచి కాశిరాజు (జ.1989) దాక ఇందులో ఆరు తరాలకు చెందిన కవులున్నారు. గురజాడతో కలిపి ఏడు తరాలు. 1894-1923, 1924-33, 1934-53, 1954-73, 1974-93, 1994- దాకా ఉన్న ఆరు తరాలకు చెందిన కవుల కవితలు ఇవి అనే ఒక స్థూలమైన విభజనతో ఈ కవిత్వం చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, తెలుగు కవి సమస్య వందేళ్ళుగానూ ఒక్కలానే ఉందని. తరం మారినప్పుడల్లా భాషలోనూ, అభివ్యక్తిలోనూ, నిర్మాణంలోనూ కొత్త పోకడలు పోతున్నట్టుగా కనబడ్డప్పటికీ, అతణ్ణి వేధిస్తున్న మూల ప్రశ్నలు మాత్రం అలానే ఉన్నాయనిపించింది. అన్నిటికన్నా ముందు ఆత్మలో సంఘర్షణ, ప్రేమకీ, వాంఛకీ మధ్య నలుగులాట, తనకీ, లోకానికీ మధ్య అంతరం, ఆ అంతరాన్ని పూరించాలనే తాపత్రయం- ఇటువంటి మౌలికమైన ప్రశ్నలు చలంగారి నుంచి నందకిశోర్ దాకా ఒక్కలానే ఉన్నాయి.
అంటే తెలుగు కవి ఎక్కడ మొదలుపెట్టాడో, అక్కడే ఉన్నాడు. లేదా అక్కడికే చేరుకున్నాడు, కాని మొదటికన్నా ఎక్కువ ఎత్తులోనో లేదా ఎక్కువ లోతులోనో.
ఉదాహరణకి ఈ సంకలనంలోని మొదటి కవిత, గురజాడది, చూడండి:
మనిషి
మనిసీ చేసిన రాయిరప్పకి
మహిమ కలదని సాగిమొక్కుతు
మనుషులంటే రాయిరప్పల
కన్న కనిష్ఠం
గాను చూస్తావేల బేలా?
దేవుడెకడో దాగెనంటూ
కొండకోనల వెతుకులాడే
వేలా?
కన్నుతెరిచిన కానబడడో?
మనిషి మాత్రుడి యందు లేడొ?
యెరిగి కోరిన కరితి యీడో
ముక్తి?
సంకలనంలో చివరి కవిత కాశిరాజుది, చూడండి:
వొంగపువ్వు
వేలితో సబ్బుబిళ్ళరగదీసి
అద్దాన్నొకసారీ, నాననొకసారీ సూసాక
నువ్వెట్టుకున్న కాస్తకుంకుం బొట్టూ
నీ నొసటమీద ఉదయించిన సూరీడు
నాన్నలెగిసినా, నేను లెగిసినా కనపడే నీ మొకమే మా తూరుపుదిక్కు.
నువ్వు మెడ తడుముకున్నాక కల్లద్దుకున్న పసుబ్బొందు
నాన్నతో ఏమ్మాటాడుద్ది?
నవ్వే నినూ సూసి నాన్న వొయ్యారంగా తెంపిన వొంగపువ్వు
నీ సిగనున్నాక
అమ్మా, అందమంటే నీదే కదూ..
కవిత నిర్మాణంలోనూ, క్లుప్తతలోనూ మాత్రమే కాదు, సారాంశంలో కూడా పోలిక చూడండి. దేవుణ్ణి మనిషిలో వెతుక్కొమ్మని 1915 లో రాసిన కవిత దగ్గరికే ఇప్పటి తెలుగు కవి చేరుకోవడం ఆశ్చర్యంగా లేదూ!
ఇటువంటి ఆశ్చర్యాలతో తెలుగు కవిత్వం ఈ సంకలనం ద్వారా నాకు సరికొత్తగా పరిచయమయ్యింది. ఉదాహరణకి త్రిపుర రాసిన ‘రుక్మానీ కా హవాథ్’ అనే కవితనీ, పాలపర్తి ఇంద్రాణి రాసిన ‘యాపిల్లోంచి యాపిల్ ‘ అనే కవితనీ గురజాడ అప్పారావుగారి ‘లవణ రాజు కల’ అనే కవిత తో పోల్చి చూడండి. త్రిపురకీ, ఇంద్రాణికీ తెలియదు, తాము మళ్ళా గురజాడ కవితనే మరొక రూపంలో రాస్తున్నామని.
అలా చూసినప్పుడు ఈ సంకలనంలోని కవులంతా కొన్ని కుటుంబాలకు చెందిన కవుల్లాగా కనిపిస్తారు. మన సాహిత్య చరిత్రలో ఇలాంటి కుటుంబాల్ని ఉద్యమాల వారీగా schools గా వర్గీకరిస్తూ వచ్చారు. కాని ఉద్యమాల హద్దుల్ని దాటి ఇందులో కవులు కొన్ని కుటుంబాలుగా ఏర్పడుతున్నట్టుగా నాకు కనిపించింది. ఉదాహరణకి నండూరి సుబ్బారావు, బాపిరాజు, బసవరాజు, కొనకళ్ళ, కృష్ణశాస్త్రి, బంగారమ్మ, శివసాగర్, గోరటి ఎంకన్న, నందకిశోర్ లు ఒక కుటుంబానికి చెందిన కవులు. వాళ్ళంతా గీత ప్రక్రియలో కవిత్వం రాసారనే కాదు, అసలు వాళ్ళ భావతీవ్రతలోనూ, భాషని ఎంచుకునే sensiblity లోనూ, ఒకలాంటి కవులు. వాళ్ళ మధ్య ఉన్న తేడా అల్లా తరాల అంతరం మాత్రమే. కవితమీద ఒక అనుభూతి బరువు తప్ప తక్కిన బరువులేమీ లేకుండా చూసుకోవడంలో నండూరి సుబ్బారావు నుంచి నందకిశోర్ దాక నడిచిన దారి ఒక్కలాంటిదే.
తమకి కలుగుతున్న అనుభూతిని స్పష్టంగా పోల్చుకుని, ఇదీ అని ఒక స్థిరీకరణకు తీసుకొచ్చి తమ బాధ ఏమిటో స్పష్టంగా చెప్పిన కవులు ఒక కుటుంబం. గురజాడ, శ్రీ శ్రీ, నండూరి సుబ్బారావు, కృష్ణశాస్త్రి, బైరాగి, తిలక్, శివసాగర్, చెరబండరాజు, ఇస్మాయిల్, అజంతా, రేవతీదేవి, శివారెడ్డి ఆ కోవలోకి వస్తారు. వారి కవిత్వం తెలుగు అభివ్యక్తి స్పష్టత సాధించుకున్న peak moments అనిపించింది నాకు.
కాని వారు ఆ స్పష్టతను పొందడం వెనక ఒక సుసంపన్నమైన పృష్టభూమి ఉంది. తాము ఏది చూస్తున్నారో, వింటున్నారో దాన్ని ఒక మూసలోకో, ఒక నిర్ధిష్టమైన కొలతలోకో కుదించడానికి ఇష్టపడక దానిలోని fluidity ని కాపాడుకుంటూ వస్తున్న ఒక కుటుంబం ఉంది. పఠాభి, నారాయణబాబు, శిష్ ట్లా, త్రిపుర, మహాస్వప్న, శ్రీకాంత్, అనిల్ బత్తుల, ఎం.ఎస్.నాయుడు, చిత్రకొండ గంగాధర్ అటువంటి కవులు. వీళ్ళల్లో భావ తీవ్రత మరీ బలంగా ఉన్న ఉపకుటుంబంలో మో, సిద్ధార్థ, అయిల సైదాచారి వంటి కవులున్నారు. ఈ కవులే లేకపోతే, తరం నుంచి తరానికి తెలుగు కవిత్వం పడుతున్న పురిటినొప్పుల్ని ఎప్పటికప్పుడు నిజాయీతీగా నమోదు చేసే సిస్మోగ్రాఫుల్లాంటి ఈ కవులే లేకపోతే తెలుగు కవిత్వం తన peak moments ను చేరుకోగలిగి ఉండేది కాదు.
ఇక మరికొన్ని ఆశ్చర్యాలున్నాయి. దిగంబర కవులు నన్నయ్యను రాజరాజనరేంద్రుడి బొందెలో పాతిపెట్టామనుకున్నారుగాని, ఇందులో నగ్నముని, మహాస్వప్న కవితలు చదివితే వారు తిలక్ శయ్యకి ఎంత దగ్గరగా ఉన్నారో చూసి ఆశ్చర్యం కలిగింది. నన్నయలానే తత్సమీకృత కావ్యభాషనే తాము కూడా అనుసరించామని వాళ్ళకిప్పటికీ తెలీదు.
ఈ సంకలనంలోని 64 మంది కవుల్లో అయిదుగురు మాత్రమే స్త్రీలు. అందులో నలుగురు 1980 తర్వాత కవులే. ఇదొక మెలకువ. అందుకేనేమో, ఈ కవితల్లో తెలుగు కవి ఆకాంక్షలు, అనుభూతి దాదాపుగా స్త్రీ కేంద్రంగానే పరిభ్రమించడం కనిపిస్తుంది. ఇది సంకలనకర్త దృక్కోణ ప్రభావం అని కూడా చెప్పుకోవచ్చు. కాని శతాబ్ది కాలం పాటు తెలుగు కవి స్త్రీని ఒక తల్లిగా, తనయగా, పడతిగా, పడుపువనితగా ఏదో ఒకరూపంలో చూడకుండా ఉండలేకపోవడం, ఆమె చుట్టూతానే తన కవిత్వం చెప్పుకుంటూ రావడం కొంత ఆలోచించవలసిన విషయంగానే అనిపించింది. చివరికి చెరబండరాజు కూడా స్త్రీని ఒక దేశమాతగా సంబోధిస్తూ కవిత చెప్పకుండా ఉండలేకపోయాడు. తెలుగు కవి స్త్రీ పట్ల, అంటే ఆమె దేహం పట్ల, ఆమెమీద తనలో ప్రజ్వలిస్తున్న మోహం పట్ల (ఆమె హక్కులపట్లా, స్వాతంత్య్రం పట్లా, వ్యక్తిత్వం పట్లా కాదు) ఇంత obsessed గా ఉన్నాడా అనిపించింది. చివరికి ఒక యానాది వనిత (ఆమె తెలుగు కవిత్వంలో కనిపించిన చోటు బహుశా అదొక్కసారే అయి ఉంటుంది) కనబడ్డప్పుడు కూడా పఠాభిలాంటి కవి
అదో రసాల్మామిడి పండ్లనమ్ము
ఏనాద్దానిం జూడుము!
పయ్యంట తడిసి, కండ్లకు
పండుగ జేస్తున్నవి దాని
రసాల్మామిడి పండ్లలాంటి పాలిండ్లు
అనడం నన్ను నివ్వెర పరిచింది. ఇక్కడ నేను value judgment కి పూనుకోవడం లేదు. శతాబ్ది కాలం పాటు తెలుగు కవులు (ఇందులో ఉన్న నా కవితతో సహా) స్త్రీ దేహం పట్ల ఇంత తత్పరులుగా ఉండటం నన్ను నివ్వెరపరిచిందని మాత్రమే చెప్తున్నాను.
ఇక ఈ సంకలనంలో తెలుగు కవిత్వం చేరుకున్న శిఖరాగ్ర బిందువులు ‘మహాప్రస్థానం’, ‘లంగరెత్తుము’ కవితలతో పాటు అజంతా రాసిన ‘మృత్యువు హాస్యప్రియత్వం’ కవిత అని అనిపించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. కాని ఈ కవిత కూడా ఇందులో లేకపోయుంటే ఈ సంకలనానికి సమగ్రత చేరి ఉండేది కాదు. ముఖ్యంగా అజంతా అంటున్నమాట:
దిగుమతి చేసుకుంటున్న యూరపియన్ దుఃఖం పూర్తిగా నిషిద్ధం
అనే మాటకి ఈ సంకలనం దర్పణం. ఎందుకంటే సాహిత్య చరిత్ర చదివి ఆధునిక పాశ్చాత్య కవిత్వం లేకపోతే ఆధునిక తెలుగు కవిత్వం లేదనుకుంటూ ఉన్నాం. కాని యూరపియన్ దుఃఖానికి మరీ అంతలా ఋణపడకుండానే తెలుగులో ఇంత అద్భుతమైన కవిత్వం వికసించిందని ఈ పుస్తకం మనకి స్పష్టంగా గుర్తుచేస్తోంది. ఎందుకంటే అజంతానే ఒక ప్రవక్తలాగా ఈ మాటలు కూడా అన్నాడు:
కవిత్వం వేరే ఎక్కడో లేదు
నిస్సహాయుడు నిరాయుధుడైన ఒక గిరిజనుడు లేద
ఒక దళితుడు మాట్లాడేదంతా కవిత్వమే
తెలంగాణాలో ఒక గ్రామం చాలు
లేదా మన్యప్రాంతంలో ఒక గ్రామం నా మరో జీవితం
అక్కడే అని ఆశ
అనిల్ బత్తుల ఏరి తెచ్చిన ఈ కవితలు ఆ ఆశని బలపరుస్తున్నవిగానే ఉన్నాయి. అందుకు అనిల్ కి మరోమారు ధన్యవాదాలు.
19-3-2023
నిన్న రాలేక పోయిన లోటును తీర్చినందుకు ధన్యవాదాలు.అలాంటిదే మీరు తెలుగులో ఇష్టపడిన కవితల సంకలనం కూడా వస్తే బాగుంటుంది.
అవును సార్. ప్రతి ఒక్కరికి ఒక ఇష్టకవితా సంకలనం ఉంటే బాగుంటుంది
బహుశా కవిత్వ పరిభాషలో సంవేద వ్యక్తీకరణలో మార్పు వుందేమో కానీ వస్తు విషయంలో సారూప్యత కాలాలకు అతీతం అనే ఈ పరిశీలన చాలా విలువైనది సర్.
మీరు అన్నట్లు 1980దశకం తర్వాత కవయిత్రుల ప్రవేశం నుండి ఇప్పటి దాకా వచ్చిన పరిణామాల్ని తెలుసుకోవాలంటే సమగ్ర అధ్యయనం అవసరం వుంది సర్. సాహిత్య ఆవరణను దగ్గరగా మెలిగిన మీలాంటి వారు ఈ దిశగా మార్గదర్శత్వం వహించాలని ఆకాంక్ష సర్..
సవివరమైన అభిప్రాయాన్ని పంచుకున్నందుకు కృతజ్ఞతలు
.అనిల్ బత్తుల గారికి హృదయపూర్వక అభినందనలు..
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.