
కళాకారుడు రెండు రకాలుగా ఉంటాడు. ఒకరు తనలో సంచలిస్తున్న ఉద్వేగాలను పోల్చుకోడానికి ప్రయత్నిస్తూ, వాటికి రూపాన్నివ్వడానికి నిరంతరం ప్రయోగాలు చేస్తూ, ఆ క్రమంలో తాను చేపడుతున్న సృజన తనకు ఏ మాత్రం సంతృప్తినివ్వక ఎప్పటికప్పుడు మరింత అసంతృప్తితో మరింత వేదనకు గురువవుతూ ఉంటాడు. చాలాసార్లు అతనికి తాను నిజంగా కళాకారుడేనా, తాను సృష్టిస్తున్నది కళ అనిపించుకుంటుందా అనే ఒక ఆత్మసందిగ్ధతలో నలిగిపోతూనే ఉంటాడు. అటువంటి కళాకారుణ్ణి మనం అన్వేషి అనీ, ఇంకా చెప్పాలంటే ఆత్మాన్వేషి అని అనవచ్చు.
రెండో తరహా కళాకారుడికి ఇంత పెద్ద వెతుకులాట, ఇంత సమస్య ఏమీ ఉండవు. అతడు తన కాలం నాటి ప్రజల్ని రంజింపచెయ్యడమెలాగా అన్నదానిగురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటి ప్రజల అభిరుచి ఏ దారిన నడిస్తే తానూ ఆ దారినే నడుస్తాడు. సాధారణంగా ఏ కాలంలోనైనా ప్రజలు తమని రంజింపచేస్తున్నదాన్నే కళ అని పిలుస్తారు కాబట్టి ఈ రెండవ తరహా కళాకారుణ్ణి ఎటువంటి సందేహాలూ బాధించవు. ఏ వేదికమీద నిలబడ్డా అతడు తాను కళాకారుణ్ణని నిశ్చయంగా చెప్పుకోగలుగుతాడు.
కాలం చాలా చిత్రమైంది. అది రెండవ తరహా కళాకారుణ్ణి నెమ్మదిగా ఈడ్చి చెత్తబుట్టలో వేసేస్తుంది. మొదటితరహా కళాకారుణ్ణి నిజమైన కళాకారుడని పిలవడమే కాక, తర్వాత కాలాలకు అతణ్ణొక ఆదర్శప్రాయుడిగా పైకెత్తి చూపించడం మొదలుపెడుతుంది.
చాలాసార్లు మొదటి తరహా కళాకారుడికి అతడి జీవితకాలంలో ఈ గుర్తింపు లభించదు. కాని అతడి కళకొక శాశ్వతత్త్వం లభిస్తుంది. సంతకం పక్కకు పోతుంది. చిత్రం మిగిలిపోతుంది.
మరే కళలో కన్నా కూడా, ఈ వైరుధ్యం, చిత్రకళలో తీవ్రాతితీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకి వాన్ గో నే తీసుకోండి. అతడు గీసుకున్న చిన్న స్కెచ్ దొరికినా కూడా ఇవాళ కోట్ల డాలర్లకు వేలం పాడుకునే కళాభిమానులున్నారు. కాని అతడి జీవితకాలంలో కుంచెలూ, కాన్వాసులూ, రంగులూ కొనుక్కోడానికి కూడా డబ్బులుండేవి కావు. అతడి జీవితకాలంలో అమ్ముడైంది ఒకే ఒక్క బొమ్మ. అదే వాన్ గో కాలంలో సెలూన్లలో ప్రజలు వేలంవెర్రిగా మూగి, అత్యధికంగా వేలంపాడుకుని కొనుక్కున్న బొమ్మలు ఏవో, ఆ చిత్రకారులు ఎవరో కూడా మనకి తెలియదు. కాలం వాళ్ళందరి పేర్లూ తుడిచిపారేసింది,
ఇప్పుడు భారతీయ చిత్రకారుల్లో కూడా ఈ వైరుధ్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అంతర్జాతీయ విపణిలో భారతీయ గ్రామాలకీ, గిరిజన సంస్కృతికీ, ప్రాంతీయ సంప్రదాయాలకీ చెందిన motifs ను తీసుకుని decorative style లో చిత్రించిన చిత్రాలకు చాలా గిరాకీ. వాటిని కొనుక్కుని తమ ఇళ్ళల్లోనో, కార్యాలయాల్లోనో, సమావేశమందిరాల్లోనో ప్రదర్శించుకోవడంలో ఆ కొనుగోలుదారులకి గొప్ప సంతోషం ఉంటుంది. ఆ గదిలో కార్పెట్, సోఫా, టీపాయ్, టీపాయ్ సోఫామీద టీపాట్ లాగా ఆ గోడ మీద బొమ్మకూడా ఆ వస్తుసామగ్రిలో, ఆ అలంకరణలో ఒక భాగం.
కాని అటువంటి చిత్రాల్ని గియ్యడంలో ఆ చిత్రకారుడికి ఏ అన్వేషణా, ఏ తపనా, ఏ వేదనా అవసరంలేదు. అతనికి ఒక motif దొరికితే చాలు, దాన్ని చిత్రించడానికి అనువైన ఒక pattern దొరికితే చాలు. ఇక అతడు వందలాది కాన్వాసులు గీస్తూ పోతాడు. వాటిని అంతర్జాతీయ విపణిలో వేలం వేసినప్పుడు అవి అతనికి సంపదనీ, గౌరవాన్నీ సముపార్జించిపెడతాయి.
అదే ఒక చిత్రకారుడు తన హృదయాన్ని ఉద్వేగభరితం చేస్తున్నవో, లేదా నిలబడనివ్వకుండా కుదిపేస్తున్నవో సంవేదనల్ని ఏ రేఖలుగా గియ్యాలో, వాటిని గుర్తుపట్టడానికి ఏ రంగుల్లో చిత్రించాలో తెలియక, తనలో తను చెప్పలేని భావసంఘర్షణకు లోనవుతూ, నిరంతరం ఒక అశాంతిలో, ఆందోళనలో గడుపుతున్నట్లయితే, అతడికి తన జీవితకాలంలో లభించేది పేదరికం, నిరాదరణ, ఆత్మసంశయం మాత్రమే.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే ఈ మధ్య మోషే డయాన్ ఇంటికి వెళ్ళి అతని స్టూడియో, అతని చిత్రలేఖనాలు చూసాను. చిత్రకారుడిగా అతనిలో అన్వేషి బలంగా కనబడ్డాడు నాకు. కళని ఒక వ్యాపారంగా, చిత్రలేఖనాల్ని ఒక commodity గా మార్చుకోడానికి ఇష్టపడని ఒక సున్నితహృదయుడు కనిపించాడు. అతని ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్ రెండూ చూసాను. రెండింటిలోనూ ఒక ప్రయోగశీలి కనబడ్డాడు.

నిజానికి ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో కళలో ప్రయోగాలకి గొప్ప గౌరవం లభించేది. గొప్ప ప్రయోగాలు గొప్ప కళా ఉద్యమాలు కూడా. క్యూబిజం, డాడాయిజం, సర్రియలిజం, చివరికి మనం సాహిత్య ఉద్యమంగా భావించే మాజికల్ రియలిజం కూడా చిత్రకళా ప్రయోగాలే. నాకు అనిపిస్తూంటుంది- రాజకీయంగా మనం ఒక స్థిరతనీ, భద్రతనీ, complacence ని ఎంత బలంగా కోరుకుంటూ ఉంటే, కళా రంగంలో అంతగా conservative గా మారిపోతుంటామని. 90 ల తరువాత, లిబరలైజేషన్ వల్ల మన సమాజంలో మధ్యతరగతి, సంపన్న తరగతి తాము పోగుచేసుకుంటున్న సంపదని పెట్టుబడిగా మార్చుకోవడం మీదా, షేర్లు కొనుక్కుని అమ్ముకోడం మీదా, మరిన్ని గృహోపకరణాలు, కార్లూ, కొత్త కొత్త మొబైల్ డివైస్ లూ సమకూర్చుకోడం మీదా దృష్టిపెడుతున్న కాలం ఇది. ఇటువంటి కాలంలో మన చుట్టూ ఉన్న సమాజానికి అసంతృప్తి అంటూ ఉంటే అదొకటే, మరింత డబ్బు సంపాదించడమెలాగ, అది కూడా మరింత త్వరితంగా సంపాదించడమెలాగ. ఇటువంటి కాలంలో జీవితంలోనూ, కళలోనూ కూడా ప్రయోగాల్ని ఆశించలేమనిపిస్తుంది.
అందుకనే నాకు మోషే డయాన్ స్టూడియో చూసినప్పుడు ఒకింత ఆశ్చర్యం కలిగింది. సంతోషం లాంటి విచారం కూడా కలిగింది. అక్కడ ఒక కళాకారుడు తన సృజనతో తృప్తి చెందడం లేదు. ఒకటో రెండో motifs పట్టుకుని కాన్వాసుల్ని అలంకరణ సామగ్రిగా మార్చాలనుకోవడం లేదు. తన రంగుల్తో, గీతల్తో నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు.

నిజానికి ఒక కళాకారుడి స్టూడియో, అతడు అనుమతిస్తే, ఆ నగరానికి ఒక పర్యాటక కేంద్రం కావాలి. ఒకప్పుడు పారిస్ లో రోడే లాంటి శిల్పి స్టూడియో అలా ఉండేది. అతడి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచెయ్యడానికి వెళ్ళిన రిల్కని ఆ స్టూడియో మహాకవిగా మార్చేసింది. కాని మన నగరంలో కళాకారుల పట్ల అటువంటి క్రేజ్ ఏదీ నేనింతదాకా చూడలేదు.
ఇప్పటికీ, ఇన్నేళ్ళ తరువాత కూడా నాకు ఒక కవిని ఇంటికి వెళ్ళికలుసుకుంటే ఆ రోజు ఆకాశంలో ఎగిరి వచ్చినట్టుంటుంది. ఒక చిత్రకారుణ్ణి అతని స్టూడియోలో కలుసుకుని వస్తే గరుత్మంతుడిలాగా నాక్కూడా ఇంత అమృతాన్ని దొంగిలించి తెచ్చుకున్నట్టుగా ఉంటుంది.
గిరిధర్, మోషే వంటి చిత్రకారుల్ని వాళ్ళ స్టూడియోల్లో కలుసుకుని వచ్చిన తరువాత నాలో మరింత అశాంతిపెరుగుతుంది. బహుశా చలంగారి రచనల్లాగా గొప్ప కళ మనుషులకి ఇవ్వగలిగేది ఈ అశాంతినే అనుకుంటాను. ఎందుకంటే తిలక్ అన్నట్లుగా, ‘అగ్ని చల్లినా, అమృతం కురిసినా అందం, ఆనందం దాని పరమావధి’.
Featured photo: Studio of Moshe Dayan
17-3-2023
అందం, ఆనందం…పరమావధి! ఏం ముగింపు! సర్.
ధన్యవాదాలు
ఒక కళాకారుని గురించి, కళ తెలిసిన ప్రశంస ఇలాగే వుంటుందేమో.
కళాకారుల శోధన, గుర్తింపులను గమనించి మీరు చేసిన వర్గీకరణ చక్కగా వుంది. ఈమధ్యనే Schopenhauer గురించిన ఒక podcast లో కింది మాటలు విన్నా.
“I wish someone would attempt a tragic history of literature showing, how the various nations which now take the highest pride in the great writers and the artists treated them while they were alive. In such a history an author would visibly bring before us an endless struggle which the good and the genuine of all ages and all lands has to endure against the always dominant bad and wrong headed.”
దేశకాలాలకతీతంగా అంతటా ఇదే నిరంతర పరిస్థితి.
ఈ వాక్యాలు నిజంగానే చాలా బాధాకరంగా ఉన్నాయి ఉత్తమ రచయితల్ని కళాకారుల్ని ఆ జాతులు ఎంతగా వేధిస్తాయో బతికున్నంత కాలం వాడకం చూపిస్తాయో ఆ కథంతా రాస్తే అంతకన్నా విషాద మహాకావ్యం మరొకటి ఉండబోదు.
Good
ధన్యవాదాలు
మీ విశ్లేషణాత్మక పరిచయం బాగుంది. కళాకారుడికి అసంతృప్తి లేకపోతే ఎదుగుదల ఉండదు. అలాంటి నిరంతరాన్వేషకులు లేకుంటే ఇన్ని కళా ప్రక్రియలు ఉద్భవిల్లేవి కావు.
అవును సార్
సంతకం పక్కకు పోతుంది. చిత్రం మిగిలిపోతుంది.- Adbuthangaa undi sir!
Thank you very y