2,47,000 ఏళ్ళ నాటి మాట

Anil Devara

మొన్న సాయి పాపినేని గారు ఫోన్ చేసి ‘అనిల్ దేవర వచ్చాడు. సాయంకాలం కొంతమంది మిత్రుల్ని పిలుస్తున్నాను, మీరు కూడా రావాలి’ అన్నారు. ఆయన పిలిచింది డిన్నర్ కి. కాని ఆర్కియాలజీలో, పాలియాంటలజీలో ఒక చిన్నపాటి సెమినార్ కి హాజరవుతున్నానని అక్కడికి వెళ్ళాకగానీ నాకు తెలియలేదు.

అనిల్ దేవర ది ప్రకాశం జిల్లా. ఆయన ఎం.ఎస్.యూనివెర్సిటీ, బరోడానుంచి ఆర్కియాలజీలో ఎమ్మేచేసాడు. అక్కడే పి హెచ్ డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆయన చేసిన పరిశోధనలు, చేస్తున్న అన్వేషణ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పేలా చేస్తున్నాయి.

ఆ రోజు రాత్రి ఆయన తన ఇటీవలి పరిశోధన లోని ముఖ్యాంశాల్ని మాకు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించాడు. డా. ఈమని శివనాగిరెడ్డి తో పాటు ప్రాచీన చరిత్ర, పురావస్తు పరిశోధన మీద ఆసక్తి ఉన్న మరికొందరు పెద్దలు ఆ ప్రెజెంటేషన్ చూసారు. చర్చించారు. ఆ రోజు మేము తెలుసుకున్నవాటిని స్థూలంగా మీతో పంచుకుంటాను.

మానవ పరిణామ క్రమంలో మరీ ఇటీవలి రెండు దశల్ని ప్లీస్టోసిన్, హోలో సీన్ అని అంటారు. ప్లీస్టోసిన్ ఒక భౌగోళిక మహాయుగం. అది 25.80 లక్షల సంవత్సరాల కింద మొదలై 11,700 సంవత్సరాల కింద ముగిసింది. దాన్ని హిమయుగం అని కూడా అంటారు. ఆ తర్వాత భూమి వేడెక్కడం మొదలై 11,700 సంవత్సరాలనుంచి ఇప్పటిదాకా హోలోసిన్ యుగం అంటారు. క్రీ.పూ.9701 సంవత్సరంలో మొదలైన ఈ యుగం మానవవికాసంలో అనూహ్యమైన దశ. ఇందులో గత అయిదారువేల ఏళ్ళుగా చరిత్ర యుగం నడుస్తూ ఉంది. ఈ కాలంలోనే మనిషి లిపి కనిపెట్టడం, భాష, సాహిత్యం, సంస్కృతి వికాసాలతో మొదలై ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దాకా ప్రయాణించాడు.

చరిత్ర యుగం గురించి తెలుసుకోడానికీ, మాట్లాడటానికి మనకు చాలా లిఖిత ఆధారాలు లభ్యంగా ఉన్నాయి. కాని చరిత్ర పూర్వయుగం (prehistory) గురించి తెలుసుకోడానికి మనకు మరీ ఎక్కువ ఆధారాలు లభ్యంగా లేవు. ఉన్నవాటిలో ముఖ్యమైనవి రాళ్ళు, రాతిపనిముట్లు, ప్రాచీన మానవుడి ఆవాసానికి సంబంధిన ఆనవాళ్ళు. రెండవది ప్రాచీన జీవజాలం తాలూకు ఎముకలు, దంతాలు, పాదార్థిక అవశేషాలు, అవి నేలలో, రాళ్ళల్లో యుగాలుగా చెక్కుచెదరకుండా నిలిచిపోయినందువల్ల ఏర్పడే శిలాజాలు. ఇందులో ప్రాచీన అవశేషాల్ని అధ్యయనం చేయడం ఆర్కియాలజీ కాగా, శిలాజాల అధ్యయనాన్ని paleontology అంటారు.

ప్లీస్టోసిన్ యుగంలో చివరి దశని రాతియుగంగా లెక్కేస్తారు. అందులో మళ్ళా పాతరాతియుగం, మధ్యరాతియుగం, కొత్త రాతి యుగం అని మూడు విభాగాలున్నాయి. ఇవి కొద్దిగా పాతపదాలు. ఇప్పుడు శాస్త్రీయంగా ప్లీస్టోసిన్ ని నాలుగు యుగాలుగా లెక్కవేస్తున్నారు. అవి Gelasian, Calabrian, Chibanian (మధ్యపాతరాతియుగం), Upper Pleistocene.

ఇప్పుడు మనం మానవుడిగా పరిగణిస్తున్న హోమో సేపియన్స్ (తెలివైన మానవుడు) ఇప్పటికి మూడు-మూడున్నర లక్షల సంవత్సరాల కింద ఆఫ్రికాలో ఉదయించాడు. అతడు ప్రభవించిన తర్వాత అంతకు ముందు అస్తిత్వంలో ఉన్న వివిధరకాల మానవప్రాగ్రూపాలు (హోమినిన్స్) అంతరించి, ఈ కొత్తమానవుడొక్కడే మిగిలాడు. ఈ హోమో సేపియెన్స్ ఇప్పటికి 1,30,000-1,00,000 సంవత్సరాల మధ్య మొదటిసారిగా ఆఫ్రికానుంచి యూరోపు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియాలో అడుగుపెట్టాడు. అతడు తనతో పాటు కొత్త పనిముట్లు, ఆయుధాలు తీసుకుని ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో అడుగుపెట్టాక, అక్కడ అప్పటికే నివసిస్తున్న వివిధ ప్రాచీన మానవ సముదాయాలతో పోరాడీ, కూడీ ఎక్కడికక్కడ కొత్త సంస్కృతులకీ, నాగరికతలకీ తెరతీసాడు.

హోమో సేపియెన్స్ భారతదేశంలో అడుగుపెట్టకముందు, అంటే, లక్షా ముప్పై వేల సంవత్సరాలకన్నా ముందు ఇక్కడ కూడా ప్రాచీన మానవ ప్రాగ్రూపాల(హోమినిన్) ఆవాసాలుండేవని పురావస్తువేత్తలు కొత్త పరిశోధనల్లో బయటపెట్టారు. ఇప్పటిదాకా బయటపడ్డ అటువంటి ఆవాసాల్లో అత్యంత ప్రాచీనమైన అవాసం తమిళనాడులో చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తిరాంపక్కం. ఇక్కడ 1863 నుండి ఇటీవల 2018 దాకా జరిగిన పరిశోధనల్లో, 3,80,000 సంవత్సరాలనాటి పనిముట్లు దొరికాయి. ఆ తర్వాత మరొక నాలుగు ప్రదేశాల్లో కూడా ఇటువంటి ఆధారాలు దొరికాయి. అవి ఆంధ్రప్రదేశ్ లో జ్వాలాపురం, గుజరాత్ లో కచ్ ప్రాంతంలోని సాంధవ్, రాజస్థాన్ లోని కటోటి, మధ్యప్రదేశ్ లోని డాబా.

అయితే ఈ నాలుగు ప్రదేశాల్లో దొరికిన పనిముట్లు 1,20,000 సంవత్సరాల నాటివి. అంటే ప్లీస్టోసిన్ యుగంలో మరీ చివరి కాలానికి చెందినవి అన్నమాట. దాంతో అత్తిరాంపక్కం (3,80,000) కీ, జ్వాలాపురం (1,20,000) కీ మధ్య సుమారు రెండున్నర లక్షల సంవత్సరాల కాలం ఇప్పటిదాకా చీకటి యుగంగానే ఉంది. ఆ కాలంలో భారతదేశంలో హోమో సేపియెన్స్ కన్నా పూర్వపు మానవుడు ఉన్నాడా? ఉంటే ఏ ప్రాంతాల్లో ఉన్నాడు? ఎటువంటి పనిముట్లు చేసుకున్నాడు? అతని జీవన విధానం ఏమై ఉండవచ్చు?- ఇవీ ప్రశ్నలు.

అనిల్ దేవర పరిశోధనలు చేపట్టేదాకా.

ఇప్పుడు అనిల్ ప్రకాశం జిల్లా పాలేరు నదీ పరీవాహక ప్రాంతంలో హనుమంతునిపాడు, మోటరోళ్ళపాడు గ్రామాల్లో చేపట్టిన తవ్వకాల్లో 2,47,000 ఏళ్ళ కాలానికి చెందిన పనిముట్లు బయటపడ్డాయి!

పాతరాతియుగం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లకి ఇది గొప్ప వార్త! భారతదేశ చరిత్ర పూర్వయుగంలో అత్తిరాంపక్కం తర్వాత ప్రాచీన శిలాజాలు, సాధనాలు దొరికిన స్థలం ఇదే. అనిల్ వెలుగులోకి తెచ్చిన ఈ ఆవిష్కరణతో  చరిత్ర పూర్వయుగ ప్రపంచపటమ్మీద ఆంధ్రప్రదేశ్ కి కొత్త గౌరవం సమకూరినట్లయింది.

భారతదేశంలోని ఈ అత్యంత ప్రాచీన ఆవాసాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేమంటే, ఈ స్థలాల్లో ఎక్కడా కూడా ఇంతవరకూ మనకు ప్రాచీన మానవుడి అవశేషాలు దొరకలేదు. కాబట్టి ఆ మానవుడు హోమో సేపియన్స్ కాదనేది నిశ్చయమేగాని, అతడు Homo Erectus(నిటారు మనిషి), లేదా Homo Neandethalensis లేదా Homo Hidelbergensis లో ఎవరేనా కావచ్చు. (ఇందులో చివరి శాఖనుంచే హోమో సేపియెన్స్ ప్రభవించాడు.) ఆ మానవుడికి సంబంధించిన ఒక పుర్రె, లేదా దంతం లేదా తుంటి ఎముక- ఏ చిన్న ఆధారం దొరికినా భారతదేశ చరిత్రపూర్వయుగం మీద గొప్ప వెలుతురు పడగలదు. అయితే అటువంటి రోజు మన జీవితకాలంలో మనం ఇంకా చూడవలసే ఉంది.

అనిల్ చేసిన పరిశోధనల్లో ప్రకాశం జిల్లా అత్యంత ప్రాచీన మానవ ఆవాసానికి ఊయెలతొట్టి అన్న విషయం బయటపడటమే కాక, మరి రెండు కొత్త అంశాల్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది.

అందులో మొదటిదేమిటంటే, ఇంతదాకా హోమో సేపియన్స్ ఆఫ్రికానుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అప్పటికి అత్యాధునికమైన పనిముట్లని వాళ్ళే తమ కూడా తీసుకువచ్చారు అని భావిస్తూ ఉన్నారు. అనిల్ చెప్పేదేమంటే పాలేరు నది ఒడ్డున బయటపడ్డ పాతరాతియుగమ పనిముట్ల ఫాక్టరీలో కనీసం 2.47 లక్షల కింద ఇక్కడి మానవప్రాగ్రూపాలు ఇక్కడే పనిముట్లు తయారు చేసుకున్నారు అని. అతని పరిశోధనలమీద ప్రతిస్పందించిన సహమేధావులు ఈ విషయంలో రెండు శిబిరాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు అతడి ఊహాగానం నిజమని భావిస్తూ ఉండగా, మరొక వర్గం వారు, ఆ పనిముట్ల తయారీ మీద మధ్య పాతరాతియుగానికి చెందిన ఇతర మానవప్రాగ్రూపాల ప్రభావాన్ని కూడా కొట్టిపారేయలేమని చెప్తున్నారు.

రెండవ అంశం మధ్య పాతరాతియుగానికి చెందిన జంతువుల శిలాజాల్ని కూడా అనిల్ కనుగొనడం. మామూలుగా అటువంటి శిలాజాలు ఇంతదాకా వేరేచోట్ల లభ్యమయినవి శకలాలుగా మాత్రమే లభ్యమయ్యాయి. కాని ఇక్కడ దాదాపుగా ఒక జంతుకలేబరాన్ని మనం గుర్తుపట్టగలిగే రీతిలో దాని కంకాళ శిలాజం లభ్యం కావడం మరొక విశేషం.

ఒక పనిముట్టు ఎంతకాలానికి చెందిందో ఎలా లెక్కగడతారు అనేది ఈ సందర్భంగా తలెత్తే ప్రశ్న. మనం చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో కర్బన్-14 పద్ధతి గురించి చదువుకున్నాం. కాని ఆ పద్ధతిలో 40,000 ఏళ్లను దాటి వెనక్కి పోలేం. ఆ తర్వాత కొత్త పద్ధతులు వాడుకలోకి వచ్చాయి. వాటిలో Optically stimulated luminescence (OSL) ముఖ్యమైంది. దీని ప్రకారం మనకు లభించిన అవశేషంలోని ఇసుకరేణువుల్ని వేడిచేసుకుంటూ పోయినప్పుడు దాన్నుంచి వెలువడే కాంతితాలూకు తరంగ దీర్ఘతని బట్టి దాని కాలాన్ని అంచనా వేస్తారు.

భారతదేశంలో ఇప్పటిదాకా లభించిన పాతరాతియుగం అవశేషాల్ని ఇలా లెక్కించనందువల్ల మన చరిత్రపూర్వయుగం గురించిన నిర్దిష్టమైన చరిత్రని మనం ఇప్పటిదాకా నిర్మించుకోలేకపోయాం. కాని, ఇప్పుడు అనిల్ తనకు దొరికిన ఆధారాల్ని OSL కు గురిచెయ్యడంతో ఆంధ్రప్రదేశ్ లో ఆదిమానవుడి చరిత్రని 2.47 లక్షల సంవత్సరాల వెనక్కి జరపగలిగాడు.

ఇదంతా నాకైతే నాకు కొత్త ప్రపంచంగా అనిపించింది. కాని అది మనమధ్యనే మరుగున పడి ఉన్న ప్రపంచం. తెలుగువాళ్ళు గర్వించవలసిన నిజమైన సందర్భాలంటూ ఉంటే అవి ఇలాంటి ఆవిష్కరణలు వెలుగు చూసిన సందర్భాలు.

ఇప్పుడు అనిల్, ఆయన బృందం ఈ మే మాసంలో మళ్ళా పాలేరు, మన్నేరు నదీతీరాల్లో తవ్వకాలు కొనసాగించ బోతున్నారుట. ఆ తవ్వకాలు జరుగుతున్నప్పుడు నేనైతే తప్పకుండా వెళ్ళాలనుకుంటున్నాను. మరి మీరు?

Featured photo: ప్రకాశం జిల్లాలో బయటపడ్డ మధ్యపాతిరాతియుగం పనిముట్లు, అనిల్ సేకరణ

14-3-2023

9 Replies to “2,47,000 ఏళ్ళ నాటి మాట”

  1. Entirely new lesson.Very Interesting.
    మీ వివరణ చాలా స్పష్టతతో కూడికలని ఉండటంతో విషయావగాహన సులభతరమైంది.
    ఇక్కడ మరో విషయం ప్రస్తావించాలి. చాలా మంది అనవసరమైన విషయాలపట్ల తమ సమయాన్ని వృధా చేసుకునేవారు ఈ అధ్యయన శీలతను , పరిశోధనా పటిమను, దీక్షను స్ఫూర్తిగా తీసుకొని తమతమ ఐచ్ఛికరంగాలపైన దృష్టి సారిస్తే బాగుండుననినపించింది. నిత్య నూతన సమాచార కేంద్రం మీ కుటీరం.🙏

  2. ఓ పుస్తకం చదివి, దానికి అనుబంధం-గా ఇంటర్నెట్-ని చూసి, ఒకరిద్దరు నిపుణలతో మాట్లాడితే గాని అర్థం కానీ విషయాలని పండు వలిచినట్టు చెప్పగలిగారు సర్! నాకు ఎప్పుడు ఆ హిమయుగం, పాత రాతి యుగాల విభజన గురించి విన్నా తల తిరుగుతూ ఉంటుంది. మీ ద్వారా చక్కని పరిచయం ఏర్పడింది. ఓ స్కాలర్-కీ రైటర్ -కీ తేడా ఇదే అనుకుంటున్నాను! ప్రజలకీ నిష్ణాతులకీ మధ్య మీలాంటివారే వారధి కాగలరు.
    మే నెలలో నాకూ ఆ తవ్వకాల దగ్గరకి వెళ్ళాలి అని ఉంది సార్!

  3. మంచి ఆవిష్కారం. ఇక్కడ ప్రాచీన మానవ అవశేషాలు దొరికితే అంతర్జాతీయవార్తే అవుతుంది. యూరప్, కొంతవరకు మధ్య ఆసియాకు పరిమితమనుకునే నియాండర్తల్స్ అవశేషాలు దొరికినా అది సంచలనమే అవుతుంది. బాగా వివరించారు.

  4. మంచి విషయాలు తెలియ చెప్పారు సార్ అనిల్ గారి ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాం….

Leave a Reply to కల్లూరి భాస్కరంCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading