
ఇరవై ఒక్క అడుగులు పొడవు, ఎనిమిది అడుగుల ఎత్తు, ఇరవై రెండు అడుగుల కైవారం- ఆ టేకు దుంగ బర్మాలో ఏ అడవుల్లోనో దొరికింది. దాని వయసు మూడున్నర శతాబ్దాలు. బ్రిటిషు వాడు బర్మాలో అడుగుపెట్టకముందు పుట్టి పెరిగిన చెట్టు. ఆ దుంగని ముక్కలుగా కోసి ఫర్నిచరుగానో, తలుపులు, ద్వారబంధాలుగానో మార్చి అమ్ముకోవచ్చు. కాని అనూరాధా టింబర్స్ ఇంటర్నేషనల్ అధినేత చదలవాడ తిరుపతిరావుగారికి ఆ చెక్కలో మరేదో పిలుపు వినిపించింది. దానిలో అద్భుతమైన దారుశిల్పమేదో నిద్రిస్తున్నట్టుగా ఆయన గుర్తుపట్టాడు. ఆ శిల్పాన్ని మేల్కొల్పగల కళాకారుడికోసం ఆయన అన్వేషణ మొదలుపెట్టాడు.
కె.సదాశివరావుగారి ద్వారా ఆయనకి గిరిధర్ గౌడ్ పరిచయమయ్యాడు. ఆ దారుఖండాన్ని ఒక కళాఖండంగా మలిచే బాధ్యత గిరిధర్ తీసుకున్నాడు.
ఆ టేకు దుంగ ఫొటో చూడగానే గిరిధర్ కి విశ్వరూప సందర్శనం జరిగినంత పనయ్యింది. ఇరవై ఒక్క అడుగులు పొడవున్న ఆ దారుశకలంలో ఆయనకి అనంత శేష శయన మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. భగవద్గీతలోని ఈ శ్లోకం (11:6) మనసులో మెదిలింది:
పశ్యాదిత్యాన్, వసూన్ రుద్రాన్
అశ్వినౌ, మరుతస్థథా
బహూన్యదృష్టపూర్వాణి
పశ్చాశ్చర్యాణి భారత!
పన్నెండు మంది ఆదిత్యులు, పదకొండు మంది రుద్రులు, ఎనిమిది మంది వసువులు, ఇద్దరు అశ్వినీ దేవతలు, నలుబది తొమ్మిది మంది మరుత్తులు తనలోని వారే అని మహావిష్ణువు చెప్పినమాటలు గుర్తొచ్చాయి.
ఆ వెంటనే తనకు గోచరించిన మహావిష్ణురూపాన్ని ఆయన ముందు కాగితం మీద పెట్టుకున్నాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే:
శ్రీ మహావిష్ణువును అనంతశయన మూర్తిగా శిరస్సు ఎడమ వైపుకు, పాదాలు కుడివైపుకు ఉండేటట్టు చిత్రించాను. అనంతశేషుని దివ్యమంగళమైన పడగల కింద కిరీటం. దివ్యాభరణాలతో కూడుకుని, పట్టుపీతాంబర ధారియై, ఒక కుడిచేతిని తలకింద వూతంగా ఆనించి, మరొక చేతితో పద్మాన్ని పట్టుకుని, ఒక ఎడమచేయిని లాలిత్యంగా, యెడమ కాలుపైన మోపి, మరొక ఎడమచేతితో పాంచజన్యాన్ని పట్టుకుని ఉన్నాడు శ్రీమహావిష్ణువు. అతని కుడిచేతులకి అందుబాటులో సుదర్శన చక్రం ఉంది. అతని కుడివైపు ఊరువుకు దగ్గరగా కౌముది అనే గదాయుధం చిత్రించటమైంది.
ఆ పక్క శేషుని తమ్ముడు వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు తలగడ వద్ద వేదోచ్చారణ చేస్తూ వేదవ్యాసుడు, ఎదురుగా శుకమహర్షి, విష్ణుమూర్తి మోచేతికి కిందగా విప్పారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు, అతనికి ఎదురుగా నారదమహర్షి, తుంబురుడు, తరువాత సప్త ఋషులు, వారిపక్కన విష్ణు భక్తులైన సనక సనందనాదులు ఉన్నారు.
సత్యాక్షుడు, దస్యుడు అనే అశ్వినీ దేవతలుకూడా కౌముది గదాయుధానికి ఎదురుగా ఉన్నారు. సరిగ్గా విష్ణుమూర్తి పాదాలకు కిందుగా వీరనమస్కారముద్రలో ఆంజనేయుడు, కింద క్షీరసాగరంపై అనంత శేషుని శరీరం చుట్టలుచుట్టలుగా పానుపు వలె శిల్పాన్ని మలచాలి.
ఇక పై భాగాన ఆకాశాన్ని సూచిస్తూ మేఘాల వరసలు వరసలుగా మలచాలి. యక్ష గంధర్వ, కిన్నర, కింపురుష, విద్యాధర, ఖేచరులతో సమావృతమైన ఆకాశం- విష్ణువు నాభినుండి పుట్టిన తామరతూడుకు ఇరుపక్కల ఉన్న మధుకైటభులనే రాక్షసుల్ని చిత్రించాను.
కమలం మధ్యలో బ్రహ్మదేవుడు నాలుగుముఖాలతో, నాలుగు చేతులతో ఒక కుడిచేతిలో లేఖిని, ఒక ఎడమచేతిలో భూర్జపత్రాన్ని ధరించి -మరొక కుడిచేతిలో అక్షమాల, మరొక ఎడమచేతిలో కమండలం ధరించి ఉన్నాడు. అతని భార్య సరస్వతి అమ్మవారు, హంస ఒకవైపున ఉన్నారు. బ్రహ్మకు ఎడమవైపున వాహనములపై అష్టదిక్పాలకులు ఉపస్థితులై ఉన్నారు. ఇంకా-
తొమ్మిది మంది గ్రహాలు, పన్నెండు మంది ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, నలభైతొమ్మిది మంది మరుత్తులు శ్రీ మహావిష్ణువును సేవిస్తూ ఉన్నట్టుగా చిత్రరచన చేసుకున్నాను.
ఆ చిత్రప్రణాళికని ఆయన ఇక్కణ్ణుంచి బర్మా పంపించాడు. అక్కడ దాదాపు మూడేళ్ళ పాటు బర్మాశిల్పులు ఆ విష్ణుస్వరూప స్థూలాకృతి ఆ చెక్కమీద చెక్కారు. అటువంటి అరుదైన దారుఖండం దేశం సరిహద్దులు దాటడానికి బర్మా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అందుకని ఆ శిల్పం సగం అక్కడ చెక్కి ప్రభుత్వానికి చూపించి అనుమతి సంపాదించారు. అప్పుడు దాన్ని ఓడమీద భారతతీరానికి చేర్చారు. చుట్టూ ఇనపపంజరం కట్టి, పెద్ద కంటెయినర్ లో దాన్ని రోడ్డుమీద హైదరాబాదుకు చేర్చారు. ఇప్పుడు బోయినపల్లిలోని అనూరాధా టింబర్స్ ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఆ శిల్పాన్ని గిరిధర్ ఊహించినట్టుగా పూర్తి వివరాలతో చెక్కే పని సాగుతూ ఉంది.
జింబోలాగ-2 శ్రీరామ్ పరివార్ అనే అయిదుగురు బర్మా శిల్పులు రోజుకి పన్నెండు గంటల చొప్పున నవంబరు 5 నుంచి ఫిబ్రవరి 25 దాకా 85 రోజుల పాటు మొదటి విడత పని చేసి పూర్తి చేసారు. ఆ శిల్పాల్ని చెక్కడంలో మొదట్లో ఆ శిల్పాలకి చీనా శిల్పాకృతుల ముఖలక్షణాలు వస్తున్నట్టుగా గిరిధర్ గుర్తించాడు. అప్పుడు వాళ్ళని రామప్ప, గణపేశ్వరం, వేయిస్తంభాల దేవాలయాలకు తీసుకువెళ్ళి హిందూ శిల్పాకృతుల లక్షణాల్ని స్వయంగా బోధపరిచాడు.

‘ఆ శిల్పం పనిజరుగుతుండగా ఎందరో పెద్దలు, మిత్రులు వచ్చి చూసి వెళ్లారు, కాని మీరు వచ్చి చూసి వెళ్తే నా మనసుకి సంతృప్తిగా ఉంటుంది ‘ అన్నాడు గిరిధర్ మొన్న గురువారం నాడు. అంతకుముందు తానే స్వయంగా నాకు ఆ శిల్పాన్ని చూపించాలని ఎంతో అనుకున్నాడుగాని, ఆ రోజు నేను ఊళ్ళో లేకపోవడంతో వీలుకాలేదు.
గిరిధర్ ఫోన్ చేసినరోజే నేనూ, విజయకుమార్ తక్షణమే బోయినపల్లి వెళ్ళాం. ఆ మహావిష్ణుమూర్తి ఆ దారుసీమలో తనను తాను నెమ్మదిగా ఆవిష్కరించు కుంటూ ఉన్న దృశ్యం కళ్లారా చూసాను.

ఒకప్పుడు హళేబీడు, రామప్ప వెళ్ళినప్పుడు ఆ శిల్పులు రాతిని వెన్నగా మార్చి శిలని సంగీతంగా వికసింపచేసారని రాసుకున్నాను. కాని మన కాలంలో మన ఒక చిత్రకారుడు ఇలా ఒక దారుఖండాన్ని ఒక విష్ణుస్తుతిగా మార్చడం నా కళ్లారా చూడగలనని ఎన్నడూ అనుకోలేదు.
గిరిధర్ ఇంటికి నేను గతంలో రెండుమూడు సార్లు వెళ్ళాను. అతను భాగవతం ఇతివృత్తంగా గీస్తున్న మీనియేచర్లు చూసినప్పుడే అతనికి భాగవతం మీదా, విష్ణు విలాసం మీద ఎంత అవగాహన ఉందో అర్థం చేసుకున్నాను. అందుకే అతనొక గోలోకంలో నివసిస్తున్నాడని రాసాను అప్పుడు అతని గురించి.
దేవుడు తన మహిమను తీర్చిదిద్దే పని అతనికి అప్పగించడంలో ఆశ్చర్యంలేదు. ఈ శిల్పం పూర్తయ్యాక ఇది మహనీయ భారతీయ శిల్పపరంపర తాలూకు 21 వ శతాబ్దపు కొనసాగింపుగా చరిత్రలో నిల్చిపోతుందనడంలో సందేహం లేదు.
పూసిన ప్రతి పువ్వూ పూజకి నోచుకోదు. ఆ టేకుచెట్టు ఏ తపస్సు చేసిందో, ఇప్పుడు అనంతశేష శయన శ్రీమహావిష్ణువు దాన్ని తన శాశ్వతతల్పంగా ఎంచుకున్నాడు అనిపించింది.
13-3-2023
శుభోదయం sir.
ఎక్కడ మంచి కనిపించినా అభినందించడం ,ఆనందించడం మీ ప్రకృతి సహజ గుణం sir.
ఆనాటి శిల్పులు రాతిని వెన్న గా మలిచారు.
గిరిధర్ గారు టేకు వృక్షాన్ని వెన్నగా మలుస్తున్నారు.
మీరు అక్షరాలను అమృత బిందువులుగా మలచి
అందరికీ పెంచేస్తున్నారు.
నిజంగా పూచిన ప్రతి పూవు పూజకు నోచుకోదు.
దేవుని పాదాల వద్దకు చేరుకున్న పూవు ది కదా అదృష్టం.ఎన్ని జన్మల తపః ఫలమో ఉంటే కాని
అంత అదృష్టానికి నోచుకోదు.
ఆ టేకు వృక్షం మూడు శతాబ్దాలుగా చేసుకుంటున్న తపస్సు ఈ విధంగా ఫలించింది.
తానే దైవమై కొలువుదీర పోతుంది.
శివ సాయుజ్యం అంటే ఇదే,ఇంతకన్నా పట్టే అదృష్టం మరేముంటుంది ఏ చెట్టుకైనా ,పుట్ట కైనా , జీవికైనా , నిర్జీవికైనా !!
ధన్యవాదాలు
మీరు శిల్పం గురించి ఇచ్చిన వివరణ చాలా అద్భుతంగా వుంది సర్.
గిరిధర్ గౌడ్ గారి ఆహ్వానం మేరకు మేము బర్మా శిల్పులు తయారు చేస్తున్న సమయంలో వెళ్ళాం సర్. నిజంగా అద్భుతమైన శిల్పం. అనూరాధా టింబర్ డిపో అధినేతలు చాలా గొప్ప వ్యక్తులు. వారితో మేము ఒక గంట గడపగలిగాము. వారికి సంబంధించిన పని కొంతవరకు చెయ్యడానికి వారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ బర్మా శిల్పులకి మన భాష రాకపోవడం కూడా ఇక్కడ వారి ఏకాగ్రతకి ఒక గొప్ప అవకాశం అనిపించింది.
మీ స్పందనకు ధన్యవాదాలు
ఎంత గొప్ప ప్రయత్నం ఇది. మీరు రాసిన మాటలు గొప్పగా ఉన్నాయి “ఆ మహావిష్ణుమూర్తి ఆ దారుసీమలో తనను తాను ఆవిష్కరించుకున్నాడు.”
గిరిధరగౌడ్ గారు పరమోత్తమస్థాయి కళాకారులు 🙏
ధన్యవాదాలు
మాటలే రావటం లేదు. ఈ కాలంలో ఇటువంటి అద్భుతం!తన మనస్సులో అనంత శేష శయన శ్రీ మహా విష్ణువు రూపాన్ని దర్శించగలిగిన గిరిధర్ గారు ధన్యులు. వారి కళ పరిపూర్ణమైంది. ఈ మహా కార్యంలో పాలు పంచుకుంటున్నవారంతా ధన్యజీవులు.
ఒక అపురూప దారుశిల్ప పరిచయం కలప పుట్టువు తో సహా అత్యంత ఆసక్తి దాయకంగా పరిచయం చేయడం అద్భుతం .గిరిధర గౌడు గారి ప్రణాళికలోని పరిణతి తెలిసిన వారు ఆ వివరాలను చాలా చక్కగా సమీక్షించారు.
మువ్వ
ఎంత చిత్రం
దారువులో దాగున్న విశ్వరూపం
పొరలు తొలగుతున్న కొద్దీ బయటపడుతూ
సంకల్పాంతరంగులు దలవాడ తిరుపతిరావుగారికి 🙏, ఉత్తమ శిల్పిని సూచించిన కే.సదాశివరావుగారికి🙏, ప్రణాళికాబద్ధంగా అత్యుత్తమశిల్పంగా తీర్చి దిద్దుతున్న గిరిధరగౌడుగారికీ బర్మా శిల్పులకీ🙏 వీరందరినీ పరిచయం చేసిన మీకూ 🙏
చాలా సంతోషం సార్. ధన్యవాదాలు.
చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారు ధన్యవాదములు .
ధన్యవాదాలు
వెంటనే చూడాలనిపిస్తుంది…మీరు రాసిన విధానం చదువుతుంటే…
తప్పకుండా చూడాలి మీ వంటి వాళ్లు.
శిల్పకళ పట్ల, ముఖ్యంగా దారు శిల్పం పట్ల ఈ నాటి తరానికి ఆసక్తి గోల్ఫ్ విధంగా తెలియజేశారు. ఈ పూనిక మహత్తరమైనది, భారతీయ ఆత్మ అందరినీ ఒక దగ్గరికి చేర్చింది. అందరూ సార్ధక్యం నొందుతున్నారు. ధన్యవాదాలు అండి.