దివ్యప్రేమ గీతం-9

దివ్యప్రేమ గీతంలోని ఎనిమిదవ గీతం చివరి గీతం కూడా. ఈ ఎనిమిదో గీతంలోని పన్నెండు చరణాల్లోనూ ఒక కావ్యకృతిలోని చివరి ఆశ్వాసంలో ఉండే నాటకీయత, పతాకసన్నివేశం, ఉపసంహారం కనిపిస్తాయి. ఒక సాహిత్యకృతిని, ముఖ్యంగా కథనీ, నాటకాన్నీ చదివినప్పుడు మనం చేరుకోగల ఒక epiphanous moment ఇక్కడ కూడా కనిపిస్తుంది. అలాగే అత్యాధునిక కథన లక్షణమయిన open-ended ముగింపు కూడా ఈ కవితలో కనిపించడం మనల్ని చకితుల్ని చేస్తుంది.

ఒక సాహిత్య కృతి ఎక్కడ మొదలయ్యిందో, అక్కడే ముగియడం ఉత్తమ సాహిత్యలక్షణంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మహాభారతం మొదలయినప్పుడు, జనమేజయుడు చేసే సర్పయాగంలో సంతర్పణ జరిగే చోటుకి వచ్చిన కుక్కల్ని జనమేజయుడి తమ్ముళ్ళు కొట్టి తరిమేస్తారు. అప్పుడు దేవలోక శుని అయిన సరమ జనమేజయుడి దగ్గరకి వచ్చి ‘ఏ రాజ్యంలో అయితే బీదలు, సాధువులు హింసకి గురవుతారో, ఆ రాజుకి అకారణమైన కష్టాలూ, భయాలూ వచ్చిపడతాయ’ని హెచ్చరిస్తుంది. మహాభారతం ముగింపులో యుధిష్ఠిరుడు స్వర్గారోహణ చేసేటప్పుడు అతణ్ణి తీసుకుపోవడానికి విమానం వచ్చినప్పుడు తనతో పాటు తనని వెన్నంటి వస్తున్న కుక్కకి కూడా ఆ విమానంలో ప్రవేశం కల్పించమని అడుగుతాడు. దానికి ప్రవేశం లేకపోతే తనకి కూడా ఆ స్వర్గంతో పనిలేదని చెప్తాడు. మహాభారతప్రయాణమంతా ఈ ఆద్యంతాల్లో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కూడా ఈ గీతం ఎక్కడ మొదలయ్యిందో, అక్కడే (8:1-5) ముగుస్తుంది. నాలువగ గీతంలో అతడు ఆమెని సోదరీ అని సంబోధించినట్టుగానే (4:9, 4:10, 4:12) ఆమె ఇప్పుడు అతణ్ణి నువ్వు నా సోదరుడివి అయి ఉంటే ఎంత బాగుండేది అని అంటున్నది. అప్పుడు తన ప్రేమని నడివీథిలో ప్రకటించగలిగి ఉండేదనీ, తనే స్వయంగా అతణ్ణి తన ఇంటికి తీసుకుపోగలిగి ఉండేదనీ, తన తల్లికి పరిచయం చేయగలిగి ఉండేదనీ చెప్తుంది. స్త్రీ పురుషప్రేమలో ఈ సహోదర ప్రేమని ఆవాహన చెయ్యడం కేవలం సంఘభీతినుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే కాదని మనం గమనించాలి. ఒకే తల్లి పాలు తాగి పెరిగే సహోదరుల్లాగా మనుషులు జీవించాలనే అత్యున్నత ఆకాంక్ష అందులో ఉందని మనం గుర్తించాలి. ‘అన్నదమ్ములవలెను జాతులు కలసిమెలసి మెలగవలెనోయ్’ అని మహాకవి చెప్పిన మాట అదే. ఈ భూమి ఒక తల్లి. ఈ భూమ్మీద సంపద ఆమె స్తన్యం. భగవంతుడు ఒక తల్లి. భగవత్కృప ఒక స్తన్యం. దాన్ని ఏకోదరులుగా పంచుకున్నప్పుడు ఈసుకీ, నిందకీ, తలవంపులకీ తావే ఉండదు.

నా మటుకు నాకు ఈ రెండు చరణాలూ (8:1-2) అత్యున్నత మానవ ఆకాంక్షగా గోచరిస్తున్నాయి. ఉదాత్తతలో ఈ చరణాలకు సాటిరాగల వాక్యాలు ప్రపంచ కవిత్వంలో ఎక్కడున్నాయా అని వెతకవలసి ఉంటుంది.

ఆమె అతని సామీప్యతను 2:6 లో చెప్పుకున్నట్టే మళ్లా ఇక్కడ కూడా అతడు తన ఎడమచెయ్యి తన శిరసుకింద ఉంచి, కుడిచేత్తో దగ్గరకు లాక్కున్నాడని (8:3)చెప్తున్నది. ఇటువంటి చరణాలే ఈ గీతానికొక సంపూర్ణతని చేకూరుస్తూ దీన్నొక ring composition గా మారుస్తున్నాయి.

అలాగే ‘ప్రేమ పక్వమయ్యేదాకా దాన్ని మేల్కొల్పబోమని ఒట్టుపెట్టండి’ (8:4) అనే మాట ఇంతకుముందు (2:7, 3:5) చెప్పిన మాటే. ఆ తర్వాత (5:8) మాత్రం తనకు ప్రేమాతిశయంతో స్పృహతప్పిందని తన ప్రియుడికి చెప్పమని స్నేహితురాళ్ళని వేడుకుంది. తిరిగి మళ్లా ఇక్కడ ప్రేమ పక్వమయ్యేదాకా దాన్ని మేల్కొల్పకండి అని కోరుకుంటోంది. ఈ గీతంలోని రెండు ప్రధాన నైతిక సందేశాల్లో స్త్రీపురుష ప్రేమ అంతిమంగా సహోదర ప్రేమకావాలని కోరుకోవడం మొదటిదైతే, ప్రేమ తనంతటతాను పక్వమయ్యేదాకా దాన్ని మేల్కొల్పకూడదనేది రెండవది.

బహుశా ఈ మాట ఎంత సార్వకాలికమో, అంత సమకాలీనం కూడా. పక్వం కాకుండానే బలవంతంగా మేల్కొల్పిన ప్రేమ విషంగా మారుతుంది. తనంతటతానుగా ప్రేమ వికసించేదాకా ఓపిక పట్టలేకపోవడంకన్నా మించిన హింస, అత్యాచారం మరొకటి ఉండవు. ఒక ప్రేమగీతం పరమోన్నతగీతంగా మారిందంటే, ఇదిగో, ఇలాంటి మాటలవల్లనే.

అలాగే 8:6 లో చెప్తున్న మాటలు కూడా ఏకోదర ప్రేమని మేల్కొల్పేవే. ఇక్కడ తల్లులు వేరువేరు కావచ్చుగానీ, స్థలం ఒక్కటే. ఎక్కడ అతణ్ణి అతడి తల్లి గర్భంలో ధరించిందో, ఎక్కడ అతణ్ణి కన్నదో, అక్కడే తాను అతణ్ణి మేల్కొల్పానని చెప్తున్నప్పుడు, ఆ జాగృతి ప్రేమ జాగృతి. ప్రేమ మేలుకోవడమే మనిషికి రెండవ పుట్టుక. తల్లి నిన్ను కంటుంది. నీ జీవితంలో ప్రవేశించిన ప్రేమికుడో, ప్రేమికురాలో నీలో ప్రేమని మేల్కొల్పడం ద్వారా నిన్ను తిరిగి కంటారు.

ఈ చరణమూ, తర్వాతి చరణమూ (8:7) ఈ పరమోన్నతగీతం మొత్తానికి పతాకవాక్యాలు. తన ప్రేమని అతని హృదయం మీద ముద్రలాగా అచ్చొత్తించుకోమనడం, తన చేతిమీద పచ్చబొట్టులాగా పొడిపించుకొమ్మనడం ప్రేమ స్త్రీపురుషుల మధ్య తేగల సాన్నిహిత్యానికి పరాకాష్ట మాత్రమేకాక, తమ ప్రేమకి శాశ్వతాన్ని చేకూర్చాలనుకునే ఆకాంక్ష కూడా. ఇద్దరి మధ్యా ఎటువంటి ఎడం ఉండకూడదనుకోడంలో అంతకన్నా మించిన అభివ్యక్తి మరొకటి కనం. అంతేకాదు, పూర్వపు రోజుల్లో ఒక మనిషి తనసొంతం అని చెప్పడానికి ఆ మనిషి చేతిమీద ముద్ర వేయించేవారు. తాను అతనిదీ, అతను తన వాడూ అని ఇంతకు ముందు వాచ్యంగా (6:3, 7:10) చెప్పినమాటలు ఇక్కడ పూర్తిగా ఆలంకారికంగా, మరింత ప్రగాఢంగా చెప్తున్నది ఆమె. ఒకసారి ప్రేమ అటువంటి అభివ్యక్తికి చేరాక, ఆ ప్రేమని ఎవరూ ఏమీ చెయ్యజాలరని చెప్పడం (8:7) సహజమే కదా.

ఆమె సోదరులు ఆమె చిన్నపిల్ల అనీ, ఆమెకింకా వయసు రాలేదనీ (8:8) చెప్పడం కవితకొక అనూహ్యమైన మలుపునిస్తున్నాయి. మూలంలో ‘ఆమెకింకా వక్షోజాలు పొటమరించలేదు’ అనే మాట ఉంది. నీ స్తనాలు లేడికూనలు, కలువపూల చేల మధ్య హరిణమిథునం అని అతడు ఆమెని వర్ణించినవర్ణనతో ఈ వర్ణనని పోలిస్తే పురుషప్రేమకీ, సహోదర ప్రేమకీ మధ్య ఉన్న భేదం బోధపడుతుంది. ఒక అన్నకి చెల్లెలు ఎప్పటికీ చిన్నచెల్లెలే. ఆమె లోకం దృష్టిలో యవ్వనవతిగా కనిపించవచ్చుగాక, కాని ఆ అన్నదృష్టిలి ఆ చెల్లెలికి ఎప్పటికీ వయసు రానట్టే. అటువంటి అమాయికురాలైన చెల్లెల్ని లోకం దృష్టినుంచి ఎలా కాపాడుకోవాలన్న ప్రశ్న (8:8-9) మన హృదయాన్ని చెమరింపచేసే ప్రశ్న. గోడ, తలుపు- ఈ రెండూ ఒక వస్తువుని దాచి ఉంచగల, కాచిరక్షించుకోగల సాధనాలు. కాని ఒక యువతి ప్రేమలో పడ్డప్పుడు, గోడలూ, తలుపులూ ఆమెని అడ్డగించలేవని ఆమెనే స్వయంగా (8:10) చెప్పడం విశేషం. ఇప్పుడు తానే ఒక గోడ అనీ, తన వక్షోజాలు బురుజుల్లాగా, గోపురాల్లాగా ఉన్నాయి అనడం ప్రేమ మాత్రమే చెయ్యగల చమత్కారం. ఇక

‘నా ప్రేమికుడికి నేను ప్రశాంత నగరాన్ని’

అనే మాట (8:10) మొత్తం పరమోన్నత గీతంలోని పరమోన్నత వాక్యం. ప్రేమానుభవ ఫలశ్రుతి. City of Peace. ఒకప్పుడు ప్రేమాతిశయం వల్ల ఆమె ఆ పట్టణంలో అర్థరాత్రి అతణ్ణి వెతుక్కుంటూ పరుగెత్తింది. అప్పుడు అక్కడి కావలివాళ్ల చేతిలో గాయపడింది, అవమానపడింది. అప్పుడు అది ఆమెకి City of Unrest. ప్రేమ ఆమెకు అశాంతనగరాన్ని కానుకచేసింది. కాని ఆమె తన ప్రియుడికి తాను ప్రశాంతనగరాన్నని చెప్పుకుంటున్నది. బహుశా ఇంతకన్నా మంగళమయ ప్రేమపర్యవసానాన్ని మరొకటి మనం ఊహించలేం.

అగస్టైన్ సాధువు City of God అని ఒక రచన చేసాడు. యెరుషలేం దైవనగరం. ఎవరి అంతరంగం భగవన్మయమవుతుందో ఆ అంతరంగం దైవనగరంగా మారుతుంది. మార్కస్ అరీలియస్ నైతిక జీవితాన్ని గడిపేవాడి అంతరంగం ఒక Inner Citadel గా మారుతుందని చెప్పాడు. అంటే అతడి అంతరంగం దుర్భేద్యంగా మారుతుందని ఆయన ఆశించాడు. పరమోన్నతగీత కర్త, ప్రేమ వల్ల, మనుషులు ఒకరికొకరు ప్రశాంతనగరాలుగా మారతారని చెప్తున్నాడు. ఈ గీతానికి పరమోన్నత గీతం అనే శీర్షికతో పాటు మరొక శీర్షిక కూడా సూచించమని ఆ కవి నన్ను అడిగిఉంటే City of Peace అని పేరుపెట్టమని చెప్పి ఉండేవాణ్ణి.

ఇక చివరగా ఒక్కొక్కరికీ వెయ్యి వెండినాణేలు వేతనంగా సొలోమోను చక్రవర్తి కాపాడుకుంటున్న ద్రాక్షతోటని తన ద్రాక్షతోటతో పోలుస్తో ఆమె చెప్పిన వాక్యాలు (8:11-12) ఒక చక్రవర్తి సంపదని ఒక ప్రేమికురాలి సంపదతో పోల్చి చెప్పడమే. తర్వాత రోజుల్లో క్రీస్తు, పొలంలో వికసించిన పూలని చూపిస్తూ, తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను చక్రవర్తి కూడా ఆ పూలముందు సరితూగడని చెప్పడం (మత్తయి, 6:28-29) వెనక ఈ వాక్యాల స్ఫూర్తి ఉందని మనం అనుకోవచ్చు.

కవితలోని చివరి రెండు చరణాలూ ( 8:13-14) ఈ గీతాన్ని యాంత్రికంగా ముగించకుండా మరింత మధురోహాగానంతో ముగించిన వాక్యాలు. మొదటిది (8:13) అతని చివరి అభ్యర్థన. ఈ గీతంలో అతడు ఆమెని వర్ణించిన ప్రతిసారీ చేసిన అభ్యర్థనలు ఒక దైహిక ప్రేమవైపే నడిచేయి. కాని ఇక్కడ ఆమె కంఠస్వరం వినాలన్న అభ్యర్థన చివరి అభ్యర్థన కావడం విశేషం. అతడు అంతిమంగా కోరుకుంటున్నది ఆమె మాటలు వినడమే.

ఇక ఆమె చివరి అభ్యర్థన (8:14) తన ప్రియుణ్ణి ఒక హరిణంలాగా, సారంగం లాగా చెంగుచెంగున దుమికి రమ్మనడం, దాల్చినచెట్ల కొండలమీంచి పరుగుపరుగున రమ్మనడం గీతం ముగింపుకి ఒక గతినీ, సుగంధాన్నీ, ఉల్లాసాన్నీ సమకూరుస్తోంది.

అంటే గీతం ఎక్కడ మొదలయ్యిందో (2:8) అక్కడే ముగుస్తోంది. ముగింపులోనే మరలా గీతం మొదలవుతోంది. ప్రేమకి ముగింపులేదు. ప్రతి తరంలోనూ ప్రేమికులు తాము స్వేచ్ఛగా సంచరించగల మైదానాలకోసం, ఉద్యానాలకోసం వెతుక్కుంటూనే ఉంటారు.


8.1

ఆమె

నువ్వే కనుక నా సోదరుడివై ఉంటే
మనమిద్దరం ఒకతల్లి పాలు తాగి ఉంటే ఎంతబాగుండేది
అప్పుడు నేను నిన్ను ఈ వీథిలోనే ముద్దుపెట్టుకునేదాన్ని
నన్నెవరూ తప్పుబట్టేవారు కారు.

2

నిన్ను నా తల్లిదగ్గరికి తీసుకుపోగలిగేదాన్ని
ఆమె నాకు మంచిచెడ్డలు చెప్పి ఉండేది
నేన్నీకు సుగంధద్రవ్యాలు కలిపిన ద్రాక్షరసం,
దానిమ్మ రసం చేతికందించేదాన్ని

3

అతని ఎడమచెయ్యి నా శిరసు కింద
కుడిచేత్తో నన్ను దగ్గరగా లాక్కునేవాడు

4

యెరుషలేం కన్యలారా ప్రమాణం చేసి చెప్పండి
ప్రేమ పరిపక్వమయ్యేదాకా
దాన్ని మేల్కొల్పబోమని ఒట్టుపెట్టండి

5

చెలికత్తెలు

శిరసు తన ప్రేమికుడి భుజం మీద ఆన్చి
ఎవరామె, ఎడారిదారిన కనవస్తున్నది?

6

ఆమె

అక్కడ బాదం చెట్టుకింద
నీ తల్లి గర్భం ధరించింది.
నువ్వు పుట్టిందీ అక్కడే
అక్కడే నేన్నిన్ను మేల్కొల్పిందీను.

7

నీ హృదయమ్మీద నా ముద్ర అచ్చొత్తించుకో
నీ చేతిమీద పచ్చబొట్టు పొడిపించుకో

ఎందుకంటే ప్రేమ మృత్యువులాగా భీకరం
అందువల్ల కలిగే రోషం మరణంలాగా దారుణం
దాన్నుంచి వచ్చే నిప్పురవ్వలుకూడా
అగ్నిలాగా జ్వలిస్తాయి, నాలుకలు చాపుతాయి.

7

మహాసముద్రాలు కూడా ప్రేమను ఆర్పలేవు
నదీనదాలేవీ దాన్ని ముంచెత్తలేవు.

తన సమస్త సంపదతోటీ
ఎవరేనా ప్రేమని కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తే
అంతకన్నా తిరస్కృతుడు మరొకడుండడు.

8

చెలికత్తెలు

మాకో చిన్నచెల్లెలుంది
ఆమెకింకా వయసు రాలేదు.
ఆమెకి పెళ్ళినిశ్చమయ్యేరోజు వరులంతా
మా ఇంటిమీద వచ్చి పడితే మేమేం చెయ్యాలి?

9

ఆమె గోడలాంటిదై ఉంటే, దానిమీద
ఒక బురుజు లేపి ఉండేవాళ్ళం
ఆమె తలుపులాంటిదై ఉంటే
దేవదారు చెక్కతో గడియబిగించి ఉండేవాళ్ళం

10

ఆమె

నేను గోడలాగా ఉన్నాను
నా వక్షోజాలు బురుజులు.
నా ప్రేమికుడికి
నేనొక ప్రశాంతనగరాన్ని.

11

సమృద్ధి పర్వతం మీద
సొలోమోను చక్రవర్తికి ఒక ద్రాక్షతోట ఉంది
ఆయన దానికి కావలివాళ్లను పెట్టాడు
ఒక్కొక్కరికీ వెయ్యి వెండి నాణేలు
వేతనం.

12

నా ద్రాక్షతోట నా సొంతం.
సొలోమోనూ
నీ వెయ్యి వెండి నాణేలూ నీ దగ్గరే అట్టేపెట్టుకో
ఆ తోట కాపలా కాసేవాళ్లకి
రెండువందలు చెల్లించు.

13

అతడు

తోటలో నిలబడ్డ లలనా
నా మిత్రులంతా నీ గొంతు వినాలని వేచి ఉన్నారు
నన్ను కూడా విననివ్వు.

14

ఆమె

పద ప్రేమికా, త్వరగా వచ్చెయ్యి.
దాల్చినచెట్ల కొండలమీదుగా
నా హరిణమా, నా వన్యసారంగమా
చెంగుచెంగున దుమికిరా!

11-3-2023

6 Replies to “దివ్యప్రేమ గీతం-9”

  1. ప్రేమ మాత్రమే చెయ్యగల చమత్కారం..!

    ఓహ్…

  2. చక్కటి అనుభూతిని మిగిలించిన ప్రయాణం. ధన్యవాదాలు.

    1. ధన్యవాదాలు. వట్టి అనువాదం మాత్రమే చేసి ఊరుకుందామనుకున్న నన్ను రోజు తెల్లవారుజాము మూడింటికి లేపి ఈ కామెంట్రీ రాయించింది మీరు. అందుకు మీకే ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: