
దివ్యప్రేమ గీతంలోని ఆరవచరణం చివరలో అతడు ఆమె చెలికత్తెలతో ఆమె రెండు శిబిరాల మధ్య నాట్యం చేస్తున్నట్టు ఆమెనెందుకు తేరిపారచూస్తున్నారు అని అడగడం చూసాం. కింగ్ జేమ్స్ వెర్షన్ ప్రకారం ఆ చరణం ఆరవగీతంలో చివరి చరణం. కాని కొన్ని హీబ్రూ ప్రతుల్లో అది ఏడవగీతానికి మొదటి చరణం. కొందరు అనువాదకులూ, వారిని బట్టి వ్యాఖ్యాతలూ ఆ నాట్యాన్ని ఒక రూపకాలంకారంగా భావించారు. కొందరి దృష్టిలో ఆ నాట్యం నిజంగానే నాట్యం. అది నిజంగా నాట్యం కాకపోతే, ఈ గీతంలోని మొదటి చరణం ‘ఆ పాదరక్షల్లో నీ నాట్యభంగిమలు ఎంత విలాసంగా ఉన్నాయి’ అనే మాటకి అర్థం లేదు. కాని ఆమె నిజంగానే నలుగురిముందూ నాట్యం చేస్తున్నది అనుకుంటే, ఆ తర్వాత చేసిన వర్ణనల్లోని తీవ్రత నలుగురిముందూ వెల్లడించేది కాదు. ఏ విధంగా చూసినా ఈ రెండు చరణాలూ (6:13, 7:1) అనువాదకుడికి పరీక్షగానే చెప్పవలసి ఉంటుంది.
నేనేమనుకుంటానంటే, ఈ గీతంలోని మొదటి చరణంలోని నాట్యాన్ని రూపకాలంకారంగానే భావించాలి. అది ఆమె నడకలోని విలాసాన్ని సూచించేదనే అనిపిస్తుంది నాకు. ఆ రెండు చరణాల నిజమైన అర్థం ఏమైనప్పటికీ, అవి సమకూరుస్తున్న ప్రయోజనం, ఆ తర్వాత అతడు ఆమెని వర్ణించడానికి ప్రాతిపదిక కావడమే.
ఈ కవితలో ప్రధానమైన భాగాలు రెండు. ఒకటి అతడు ఆమెని వర్ణించడం (7:1-9), రెండు ఆమె ప్రతిస్పందించడం (7:9-13). ఇందులో అతడు ఆమె పట్ల చేసిన వర్ణన కవితలోని నాలుగవ స్తుతి, emblematic blazon. మొదటి, మూడవ వర్ణనలు (4:1-5, 6:5-7) అతడు చేసిన వర్ణనలుకాగా, రెండవది (5:11-15) ఆమె అతణ్ణి స్తుతించడం. అతడు ఇంతకుముందు చేసిన రెండు వర్ణనలకన్న ఇది మరింత దీర్ఘమైంది కావడమే కాక, మరింత తీవ్రమైనది కూడా.
ఇంతకు ముందు చేసిన వర్ణనల్లో అతడు ఆమెను శిరసునుండి మొదలై వక్షందాకా మాత్రమే వర్ణించాడు. అంతకన్నా కిందకు అతడి చూపు పోలేదు. కాని ఈ వర్ణన ఆమె పాదాలనుండి మొదలై శిరసుదాకా సర్వాంగస్తుతిగా సాగింది. అది కూడా ఒక పురుషుడు ఒక స్త్రీతో లభించగల అత్యంత సాన్నిహిత్యాన్ని సుసంపన్నమైన అనుభవంగా ఊహిస్తూ ప్రకటించుకోవడంగా సాగింది.
పాదాలు, ఊరువులు, కటి, ఉదరం, వక్షోజాలు, కంఠం, నాసిక, శిరస్సు, కురులు, నోరు ల చుట్టూ అల్లిన మొత్తం పది వర్ణనల్లో బంగారం, దంతం, పర్వతాలు, వృక్షాలు, సరస్సులు, హరిణాలు, వస్త్రాలు- ప్రకృతి, నగరం మొత్తం కలగలిసిపోయాయి. ఆమె దేహం ఒక సంపూర్ణక్షేత్రమై, ఆ landscape లో ప్రకృతీకీ, నాగరికతకీ మధ్య హద్దులు చెరిగిపోయాయి.
అంతే కాదు, ఆ వర్ణనల్లో ఇంతకుముందు కనిపించని తీవ్రత మనకి కొత్తగా కనిపిస్తున్నది.
ఇక ఈ గీతంలోని పతాకప్రాయమైన వాక్యాలు
నేను నా ప్రేమికుడి మనిషిని
అతడు నా కోసం పరితపిస్తాడు
అచ్చంగా నా కోసమే
అని అంటున్నప్పుడు ఆ ప్రేమ పూర్తి తీవ్రీకరణ చెందిందని చెప్పవచ్చు. ఇంతకు ముందు 6:3 లో ఆమె
నా ప్రేమికుడు నా వాడు, నేనతని దాన్ని
అని అంటున్నపుడు అది reciprocal love అనీ, అక్కడ ప్రేమ పారస్పరికత నిశ్చయాత్మకతను చేరుకుందనీ చెప్పుకున్నాం. కాని అక్కడున్నది వట్టి affirmation మాత్రమే. ఇక్కడది పరితాపం గా ప్రజ్వలమైంది. అంతేకాదు, అక్కడ ‘అతడు నా వాడు, నేనతని దాన్ని’ అనే మాటలు ఇక్కడికి వచ్చేటప్పటికి ‘నేనతని దాన్ని, అతడు నా వాడు’ గా మారాయి.
అతడు ఆమెని అంతగా ఆపాదమస్తకం వర్ణించిన తరువాత కూడా, తన పోలికలు, వర్ణనలూ సరిపోవడం లేదని స్ఫురించినవాడిలాగా ‘ప్రపంచంలోని మరే సుఖమూ నీతో పోల్చదగ్గంత మధురం కాదు’ అని అనడం ఈ గీతాన్ని అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళింది
ఇక ఆమె ప్రతిస్పందన మరింత దివ్యంగా ఉంది. ఆమె అతణ్ణి సంతోషపరచడమే తన ఆశయంగా చెప్పుకుంటూ అతణ్ణి రమ్మని ఆహ్వానిస్తున్నది. ఎందుకు? అక్కడ అతనికి తన సంపూర్ణ ప్రేమని సమర్పించడానికి. ఎక్కడ? ద్రాక్షతోటలు చిగురించే దగ్గర, గోరింటలు పూచే దగ్గర, మొగ్గలు విప్పారేదగ్గర, తోటల్లో కొత్త పూత తలెత్తే దగ్గర. ఓషధులు సురభిళించే దగ్గర, అరుదైన పండ్లనీ కోసి ఏరిపెట్టుకున్నదగ్గర- అటువంటి తావునే మనం స్వర్గం అంటాం.
ఇక ఈ గీతంలో మొదటినుంచీ మనం జాగ్రత్తగా గమనిస్తే, అతడూ, ఆమే ఒకరినొకరు ఇంత గాఢంగా వర్ణించుకుంటున్నప్పటికీ, ఒకరినొకరు ఇంతగా ఆహ్వానించుకుంటున్నప్పటికీ, ఇప్పటిదాకా కవి వారిద్దరి మధ్యా ఎటువంటి శారీరిక సాన్నిహిత్యాన్నీ వర్ణించలేదు. చివరికి వారు కనీసం ముద్దు పెట్టుకున్నారని కూడా చెప్పలేదు. ఈ వర్ణనలన్నీ ఒకరిపట్ల ఒకరికి ఉన్న గాఢమోహాన్నీ, అనుతాపాన్ని చిత్రిస్తున్నవే తప్ప, శారీరిక సాన్నిహిత్యాన్ని ఒక అనుభవంగా చెప్తున్నవి కావు. ఈ గీతానికి ఆధారం ప్రాచీన ఇస్రాయేలులోని వివాహ గీతాలు అనుకుంటే, ఆ వివాహాలు కూడా మన వివాహాల్లాంటివే అనుకోవాలి: వధూవరులు వివాహానంతరమే దగ్గర కాగలరు తప్ప, వివాహానికి ముందు కాదు. అందువల్ల ఈ గీతంలో ఆ స్త్రీపురుష పరితాపం తమ ఊహల్లో క్రమేపీ ప్రగాఢమవుతూ ఉండటం మనం గమనించవచ్చు.
సరిగ్గా ఈ అంశంవల్లనే ఈ గీతంలోని ప్రేమ ఒక అద్వితీయ నిష్కళంకతనూ, పవిత్రతనూ సముపార్జించుకుంది. అందుకే వ్యాఖ్యాతలు ఈ ప్రేమగీతాన్ని పవిత్ర గీతంగానూ, పరమోన్నత గీతంగానూ భావించడంలో ఆశ్చర్యం లేదు.
7.1
అతడు
ఓ రాజవంశ యువతీ
ఆ పాదరక్షల్లో నీ నాట్యభంగిమలు
ఎంత విలాసంగా ఉన్నాయి
నీ స్వర్ణ ఊరువులు
ఏ దేవశిల్పి మలిచినవో కదా
2
నీ కటి
చంద్రుడి ప్రకాశభరితమైన పానపాత్ర
అది మధువుతో పొంగిపొర్లుగాక!
3
నీ ఉదరం
కలువపూలమధ్యలో కుప్పపోసిన గోధుమపంట
నీ వక్షోజాలు రెండు లేడిపిల్లలు
హరిణమిథునం
4
నీ కంఠం దంతపు గోపురం
నీ నేత్రాలు హెస్బానులో రాజకుటుంబీకుల
నగర ద్వారం ముందు సరసుల్లాగా ఉన్నాయి
నీ నాసిక డమాస్కసుదిక్కుగా
చూస్తున్న లెబనాను గోపురం
5
నీ శిరస్సు కార్మెల్ పర్వతంలాగా
సమున్నతంగా నిలిచి ఉంది
నీ కురులు రాజవస్త్రాల్లాగా కపిలవర్ణాలు
వాటిమధ్య నీ రాజు పట్టుబడ్డాడు.
6
ఎంత అద్భుతమైనదానివి నువ్వు ప్రియా
ప్రపంచంలోని మరే సుఖమూ
నీతో పోల్చదగ్గంత మధురం కాదు
7
ఆ రోజు నువ్వు నాకొక పొడవాటి తాటిచెట్టులాగా
నీ స్తనాలు తాటిపండ్ల గెలల్లా కనబడ్డాయి
8
ఆ రోజే అనుకున్నాను మనసులో
ఈ తాటిచెట్టు ఎక్కి
ఆ కొమ్మల్ని చేతుల్తో అందుకోవాలని
నీ ఉరోజాలు తీగెకి వేలాడుతున్న
ద్రాక్షగుత్తులు, నీ శ్వాసనిండా
యాపిల్ పండ్ల సుగంధం
9
నీ నోరు మేలిమి మధురసం కావాలి
ఆమె
అది నా ప్రేమికుణ్ణి సంతోషపెట్టగలగాలి
అతణ్ణి నిద్రనుంచి మేల్కొల్పగలగాలి
10
నేను నా ప్రేమికుడి మనిషిని
అతడు నా కోసం పరితపిస్తాడు
అచ్చంగా నాకోసమే.
11
ప్రియతమా, పద పోదాం
పూచిన గోరింటచెట్ల
పల్లెపట్టుల్లో రాత్రంతా గడుపుదాం
12
పొద్దున్నే ద్రాక్షతోటలదగ్గరికి వెళ్దాం
తీగలు చిగురించాయేమో చూద్దాం
మొగ్గలు విప్పారుతున్నాయేమో
దానిమ్మపూత మొదలయ్యిందేమో చూసుకుందాం
అక్కడ నీకు నా సంపూర్ణప్రేమ సమర్పిస్తాను
13
గాలినిండా ఓషధీపుష్పాల సువాసన.
మన ఇంటి దగ్గర, ప్రియా,
అరుదైన ప్రతి ఒక్క పండునీ
నీ కోసం ఏరిపెట్టాను.
10-3-2023
మీ వివరణ వల్ల ఈ దివ్యగీతం అనుపమ గీతంగా
అనిపిస్తున్నది.
అచ్చమైన ప్రేమ ఆనవాలన నిదే
అంతరంగ నిలయుడామె కతడు
విచ్చుకున్న విమల ప్రకృతిన్ పరికించు
అమల ప్రేమ యుగళి అలరు గీతి