దివ్యప్రేమగీతం-7

దివ్యప్రేమ గీతంలోని అయిదవ గీతంలో ఆమె తన గదిలో ఉండగా ఆమె ప్రేమికుడు వచ్చి తలుపు తట్టాడనీ, ఆమె లేచి తలుపు తియ్యడానికి ఆలోచించిందనీ, తీరా తలుపు తీసేటప్పటికి అతడు వెళ్ళిపోయాడనీ తెలుసుకున్నాం. అప్పుడు ఆమె అతణ్ణి వెతుక్కుంటూ అర్థరాత్రి ఆ పట్టణంలో తిరుగాడిందనీ, ఆమెను రాత్రి పూట పహరా కాసేవాళ్ళు కొట్టిగాయపరిచారనీ, అవమానించారనీ కూడా తెలుసుకున్నాం. అయితే ఇది నిజంగా జరిగిందా లేక ఆమె ఊహలోనా అన్నది కవి స్పష్టంగా చెప్పలేదని కూడా అనుకున్నాం. అప్పుడామె తన స్నేహితురాళ్ళతో తన ప్రియుడు ఎక్కడున్నాడో వెతికిపెట్టమని కోరుకుందని కూడా తెలుసుకున్నాం. అంతకు ముందు గీతాల్లో ప్రేమ తనంతతనుగా మేలుకునేవరకూ ప్రేమని మేల్కొల్పకండని తన చెలికత్తెల్ని ప్రమాణం చెయ్యమని అడిగిందని కూడా కవి చెప్పాడు. కాని అయిదవ గీతంలో ఆమెలో ప్రేమ మేల్కోడం మనం గమనిస్తాం. తన ప్రియుడు కంఠస్వరం వినగానే తనకు స్పృహతప్పిందని చెప్పుకుందామె. తన ప్రియుడు కనిపిస్తే ఆ సంగతి అతనికి చెప్పమని చెలికత్తెల్ని అడగడమేకాదు, అలా చెప్తామని వాళ్ళని ఒట్టువెయ్యమని కూడా అడిగింది.

ఆరవగీతం అక్కణ్ణుంచి మొదలవుతోంది. ఆ చెలికత్తెలు అడుగుతున్నారు (6:1) నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడో చెప్తే తాము పోయి అతణ్ణి వెతికి తీసుకొస్తాం అని చెప్తున్నారు. అప్పుడామె తన ప్రియుడు తన తోటదగ్గరికే వెళ్ళాడనీ, తన గొర్రెల్ని మేపుకుంటున్నాడనీ, కలువు పూలు ఏరుకుంటున్నాడనీ (6:2-3) చెప్తున్నది.

ఇదేమిటిది? ముందు గీతంలో (5:6) తన ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడో తాను వెంత వెతికినా కనబడలేదనీ, అతణ్ణి వెతుక్కుంటూనే తాను నగరవీథుల్లో పడి తిరగడం మొదలుపెట్టిందనీ చెప్పింది కదా. ఇప్పుడు ఇంత సరళంగా అతను తన తోటకి వెళ్ళాడని ఎలా చెప్తున్నది? వ్యాఖ్యాతలు ఈ అంశాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా సమన్వయించడానికి ప్రయత్నించారు. కాని ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. తాను తలుపు తీసేలోపు తన ప్రియుడు వెళ్ళిపోగానే తనకు స్పృహ తప్పిందని ఆమె చెప్పినదగ్గరనుంచీ అతణ్ణి వెతికిపెట్టమని చెలికత్తెల్ని అడిగిన దాకా (5:6-8) ఆమె మనసు మనసులో లేదు. ఆమె చెలికత్తెలు అతడు ఎలా ఉంటాడో చెప్పమని అడిగినప్పుడూ అతడి సౌందర్యవర్ణన (5:10-16) చేసిన తర్వాతనే ఆమెకు మతిస్థిమితం చిక్కిందనీ, అతను బహుశా తన తోటకి వెళ్ళిపోయి ఉంటాడని గ్రహించిందనీ మనం అనుకోవచ్చు.

కాని అతను మరెక్కడికీ పోకుండా తన తోటకే ఎందుకు వెళ్ళినట్టు? వ్యాఖ్యాతలు ఈ అంశం మీద చాలా రాసారు. మొదటిది, అతడు సదా ప్రకృతిమధ్యనే సంచరిస్తాడన్నది ఒక అంశం. పూలు, పచ్చిక, గొర్రెలు, నదులు- అతడు కళ్ళముందు లేడనుకున్నప్పుడల్లా అతణ్ణి కనుగొనగలిగిన తావులు ఇవే. ఈ ప్రేమ గీతాన్ని దివ్యగీతంగా మార్చింది ఇలాంటి మెలకువనే. రామాయణంలో రాముడు పర్ణశాలకు తిరిగివచ్చిన తరువాత సీత కనబడ్డనప్పుడు ఆమె ఏమైపోయింది, ఎక్కడకు వెళ్లిందని చెట్లనీ, మృగాల్నీ, పక్షుల్నే అడగడం లాంటిదే ఇది. ఇక్కడ ఈ గీతాన్ని ఒట్టి ప్రేమగీతమే అనుకుందాం. ఇదొక పల్లెపాట, ఒక కొండపాట అనుకుందాం. అప్పుడు కూడా ఒక ప్రేమికురాలు తన ప్రియుణ్ణి కనుగొనగల తావులు కొండలూ, లోయలూ మటుకే. ఒకవేళ ఈ గీతం సాధారణ లౌకిక గీతం కాదు, ఆధ్యాత్మిక గీతం అనుకుందాం. అప్పుడు కూడా ఒక భక్తుడు తన ఈశ్వరుణ్ణి కనుగొనగల తావులు సూర్యాస్తమయ వేళలు, పర్వతాలు, పచ్చికబయళ్ళు మాత్రమే. అందుకనే గీతాంజలి లో కవి దేవుణ్ణి ప్రకృతి ఒడిలో వెతుక్కున్నాడు.

ఇంకొక వ్యాఖ్యాత మరొక అందమైన అంతరార్థాన్ని ఊహించాడు. ఆయన చెప్పినదాని ప్రకారం ఆ ప్రేమికుడు తన ప్రియురాలి దగ్గరనుంచి నేరుగా తన పనిపాటల్లోకి వెళ్ళిపోయాడు. గొర్రెల్ని మేపుకోడం, కలువపూలు ఏరుకోడం. ఒక వేళ ఇది భగవంతుడి గురించిన అన్వేషణా గీతమే అయి ఉంటే, నీ ఈశ్వరుడు సంచరించే తావులు పనిపాటలుండే తావులు మాత్రమే అని ఆ వ్యాఖ్యాత అంటున్నాడు.

ఈ వ్యాఖ్యానాలేమీ తెలియకపోయినా, ఆమె ప్రేమికుడు తోటలో సుగంధద్రవ్యాల పానుపు దగ్గరికి వెళ్ళాడనీ, కలువ పూలు ఏరుకుంటున్నాడనీ చెప్పిన మాటల్లో మహత్తరమైన సౌందర్య స్పృహ ఉంది. కలువపూలు ఏరుకోవడం! ఎంత అద్భుతమైన మాట!నీ జీవితంలో నీకొక ప్రేమికుడు లభ్యమైతే, అతడు పొలాల్లో కలువపూలు ఏరుకునే వాడే అయితే నువ్వు ఎంత ధన్యురాలివి! అంతకన్నా సుకుమార హృదయుణ్ణి ఊహించడం కష్టం.

అందుకనే ఈ గీతంలోనూ, అసలు మొత్తం గీతంలోనూ మహిమాన్వితమైన వాక్యంగా మనం 6:3 ను చెప్పుకోవచ్చు.

నా ప్రేమికుడు నా వాడు, నేనతని దాన్ని.
అతడు కలువపూల చేలో
గొర్రెలు మేపుకుంటున్నాడు.

‘అతడు నా వాడు, నేనతని దాన్ని’ అనే ఈ వాక్యం ‘తత్త్వమసి’ లాంటి ఉపనిషద్వాక్యం. మహావాక్యం. ఒక వ్యాఖ్యాత దీన్ని పరిపూర్ణమైన reciprocal love గా పేర్కొన్నాడు. ప్రేమ పరాకాష్ట ఈ పారస్పరిక ప్రేమానుభవంలోనే ఉంది. తమ మధ్య ప్రేమని ఇంత నిశ్చయాత్మకంగా చెప్పే ఈ క్షణానికి రావడంతో ఈ గీతంలోని అనుభూతి పతాకస్థాయికి చేరుకుంది అని చెప్పవచ్చు.

ఇక ఆ తరువాత గీతమంతా అతడు (6:4-10) ఆమెని వర్ణించడం. Emblematic blazon. ఇది నాలువగీతంలోని వర్ణన (4:1:7) ను గుర్తు తెస్తున్నప్పటికీ, అక్కడ వర్ణన కళ్ళతో మొదలై కిందకి నడిస్తే, ఇక్కడ కిందనుంచి కళ్ళవైపుగా సాగింది. కాని ఈ వర్ణనలో కూడా భౌతిక వర్ణన అమూర్త, అపార్థివ స్ఫురణకు చేరుకున్న తావు ఆమెని ‘తన తల్లి కడుపుపంట, తన తల్లికి కన్నుల పండగ’ (6:9) అనడం. ఈ సందర్భంగా నాకు ‘మరోచరిత్ర’లో పాట గుర్తొస్తోంది. అక్కడ కవి ‘నిన్నూ నన్నూ కన్నవాళ్ళకు కోటిదండాలు’ అంటాడు. ఆ ప్రేమికుడు తన ప్రియురాల్ని స్తుతిస్తూ ఆమెను కన్న తల్లి ధన్యురాలు అనడం ఒక అత్యంత సుకోమలమైన స్ఫురణ.

ఇక 6:12 వాక్యం ఈ గీతంలో వ్యాఖ్యాతల్ని తికమకపెడుతున్న వాక్యం. దీని అనువదించడంలో కూడా ఏకీభావం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు. ‘నేను చూసుకునేలోపలే అత్యంత ఘనసన్నిధిలో ఒక రథంలో ఉన్నాను’ అనేది నిజజీవితంలో కాక, ఆమె ఊహలో సంభవించిందిగా అర్థం చేసుకోవాలని ఈ వాక్యానికి అర్థం చెప్పారు. అతణ్ణి కనుగొనగానే ఆమెకి గాల్లో తేలిపోయినట్టున్న అనుభూతిని వర్ణించడానికి ఆమె అలా ఒక ఘనసన్నిధిలో రథం లో కూర్చున్నట్టుగా అనిపించదని చెప్తోంది అనే వ్యాఖ్యానం నా వరకూ నాకు అంగీకరించదగ్గదిగా అనిపించింది.

ఇక చివరి వాక్యం (6:13-2) అతడు ఆ చెలికత్తెలతో ఆమెని ఎందుకు వెనక్కి రమ్మనిపిలుస్తున్నారు? ఆమె రెండు శిబిరాల మధ్య నాట్యంలా కనబడుతోందా? అని అడుగుతున్నప్పుడు అది కూడా ఆమె అందాన్ని మరోరూపంలో ప్రశంసించడంగానే భావించవచ్చు. ఆధ్యాత్మిక వ్యాఖ్యాతలు దీన్ని ఆమె అందం రెండు ప్రపంచాల్నీ కూడా సమ్మోపరిచేదిగా ఉందని చెప్పడం కూడా అతిశయోక్తి కానేరదు.

ఈ గీతంలో మాత్రమే కవి Shulamite అనే పదం వాడాడు. ఆ పదాన్ని తెలుగు చేయడం కష్టం కాబట్టి నేను వదిలేసాను. కాని ఆ పదానికి అర్థం ఏమై ఉండవచ్చు అనేదానిమీద కూడా ఏకాభిప్రాయం లేదు. కొందరి దృష్టిలో ఆమె ‘షూలం’ అనే ఊరికి చెందింది కాబట్టి షూలమైటు. కొందరి దృష్టిలో ఆమె సొలోమోనుకి చెందింది కాబట్టి షూలమైటు. కాని గొప్ప కవితం తాలూకు ఒక ముఖ్యలక్షణమేమిటంటే, అది సార్వత్రిక మానవానుభూతిని నిర్దిష్టదేశకాల పరిభాషలో మాట్లాడుతుంది. అనువదించలేని ఆ దేశకాల పదజాలం ఆ కవిత్వానికి ఒక అనిర్వచనీయ సౌందర్యాన్ని సంతరిస్తాయి. ఈ కవితలో ఆమెని Shulamite అని పిలుస్తున్నపుడు మనలో ఒక అనిర్వచనీయమైన స్ఫురణ కలగడం మనం గుర్తుపడతాం.


6.1

చెలికత్తెలు

అతిలోక సుందరీ
నీ ప్రియుడు ఎక్కడికి వెళ్లాడు?
ఎక్కడుంటాడో చెప్పు
మేము వెతికి పట్టుకొస్తాం

2

ఆమె

ఆ సుగంధ ద్రవ్యాల శయ్యదగ్గరికి
కలువపూలు ఏరుకోడానికి
నా ప్రియుడు తనతోటదగ్గరికి వెళ్ళిపోయాడు

3

నా ప్రేమికుడు నా వాడు, నేనతని దాన్ని.
అతడు కలువపూల చేలో
గొర్రెలు మేపుకుంటున్నాడు.

4

అతడు

నా ప్రియురాలా, తిర్సాపట్టణం లాగా అందమైనదానివి
యెరుషలేములాగా రాజసగంభీరవి
నక్షత్రమండలాల గతిలాగా
భయదసౌందర్యానివి

5

నీ కళ్ళు! ఆ చూపులు పక్కకి తిప్పుకో
వాటిని చూస్తుంటే నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి
గిలియదు పర్వతం మీంచి కిందకు దుమికే
మేకలమందలాగా నీ కురులు.

6

నీ దంతాలు అప్పుడే కొలనులో మునిగి పైకి వచ్చిన
గొర్రెలమందలాగా మెరుస్తున్నాయి

7

నీ కపోలాలు
నీ కబరీభరం మాటున విచ్చిన
దానిమ్మపండ్లు.

8

అరవై మంది రాణులు
ఎనభై మంది రాణివాసం
ఇంకా దాసదాసీజనం, అసంఖ్యాకం

9

కాని నా గువ్వపిట్ట ఆమె ఒక్కతే
శీలవతి, నిష్కళంక
తన తల్లి కడుపు పంట, తన
తల్లికి కన్నుల పండగ

ప్రతి ఒక్క కన్య ఆమెని ధన్యురాలంటున్నది
రాణులు ఆమెని శ్లాఘిస్తారు
రాణివాసమంతా ఆమెని పొగుడుతుంది

10

వేగుచుక్కలాంటి ఆ సుందరి ఎవరు?
చంద్రబింబంలాగా నిర్మల వదన
సూర్యకాంతిలాగా జేగీయమాన
నక్షత్రమండల గతిలాగా ధీర గంభీర.

11

ఆమె

అప్పుడు నేను బాదంచెట్లతోపుదగ్గరకి వెళ్ళాను
ఏటి ఒడ్డున వికసించిన కొత్త పచ్చిక చూడటానికి
ద్రాక్షతీగలు కొత్త చివుర్లు తొడిగాయేమో చూడటానికి
దానిమ్మచెట్లు పూతపట్టాయేమో తిలకించడానికి.

12

ఓహ్! నేను చూసుకునేలోపలే
అత్యంత ఘనసన్నిధిన ఒక రథంలో ఉన్నాను.

13

చెలికత్తెలు

ఓ యెరుషలేం వనితా! రా వెనక్కి రా
నిన్నొక్కసారి చూడాలి, వెనక్కి రా.

అతడు

రెండు శిబిరాల మధ్య జరిగే నాట్యంలాగా
ఆమెనెందుకు తనివితీరా చూస్తున్నారు?

9-3-2023

Leave a Reply

%d bloggers like this: