దివ్యప్రేమ గీతం-5

దివ్యప్రేమ గీతంలోని ఎనిమిది గీతాల్లోనూ ఎనిమిది దశలున్నాయి. మొదటి గీతంలో (1:2-4) ప్రేమని మాటల్లో పెట్టడం ఉంది. ఆ తర్వాత ఆ ప్రేమ ఆందోళనకి లోనవడం (1:5-7) ఉంది. దాని తరువాత కలయికలోని సంతోషం ( 1:9- 2:7) కనిపిస్తుంది. ఒక ఎదురుచూపుకి నోచుకుని, ఒక ఆహ్వానాన్ని అందుకోవడం ( 2:8-3:1) కనిపిస్తుంది. పరీక్షను ఎదుర్కొని నిరూపణకు నోచుకున్న దశ (3:1-5). పరీక్షానంతర సంతోషం శోభాయమానంగా వ్యక్తం కావడం (3:6-11) లో కనిపిస్తుంది. ఇక ప్రియురాలిని చూసి ఆమె ప్రేమికుడు పొందిన పారవశ్యం, మహానందం ఈ గీతంలో (4:1-16) కనిపిస్తాయి.

ఈ గీతం నుంచీ నాలుగు గీతాలు (4-7) ప్రేమ పారవశ్యంలో పలికిన సంతోషప్రకటనలు. వీటిని emblematic blazons అంటారు. అందులో మొదటి మూడూ వధువుని ప్రశంసించేవికాగా, నాలుగోది వరుడి ప్రశంస. Blazon అంటే వర్ణనలాంటి స్తుతి. Emblematic blazon అంటే కొన్ని చిహ్నాల్తో పోలుస్తూ చేసే స్తుతి. ఇక్కడ ఆ చిహ్నాలు ప్రాకృతిక చిహ్నాలు. చెట్లు, పక్షులు, గొర్రెలు, మేకలు, సుగంధతైలాలు, పూలు, పాలు, తేనె, మీగడ, తోట, ఊట- అత్యంత సుందరమైన landscape ని తన ప్రియురాలితో పోల్చి చేసే వర్ణన ఇది.

మామూలుగా మనం ఒక స్త్రీ ఆకృతినీ, దేహాన్నీ వర్ణించడం ఇహలోక సంబంధమైన వర్ణనగానూ, శృంగారభావనలు మేల్కొల్పే చిత్రణగానూ భావించడానికి అలవాటు పడిపోయాం. దైవాన్ని స్తుతించడమంటే దేహంతోనూ, భౌతిక సౌందర్యంతోనూ సంబంధంలేని విషయమని అనుకుంటూ ఉంటాం. కాని ఇది మధ్యయుగాల, పౌరాణిక యుగాల భావజాలం వల్ల వచ్చిన పరిస్థితి. ఇక్కడ కవి ఒక ప్రియుడి నోటివెంట తన ప్రియురాలి గురించి చేస్తున్న వర్ణన చూడటానికి భౌతికమైన అంశాల్ని వర్ణిస్తున్నట్టుగా కనిపించవచ్చు. కాని అందులో ఉన్నది అత్యంత అభౌతికమైన సంవేదన. అలాగని మరీ అధ్యాత్మిక కోణం నుంచి చూస్తే తప్ప అందుకోలేని అందం కాదు అది. చూడండి, ఇందులో ఆమె ప్రేమికుడు ఆమె కళ్ళనుంచి వక్షందాకా మాత్రమే వర్ణిస్తో పోయాడు. ఒక సున్నితమైన సరిహద్దు ఏదో అతణ్ణి అక్కడే ఆపేసింది. ఆ కళ్ళు ఎలా ఉన్నాయట! గువ్వపిట్టల్లాగా ఉన్నాయి. వర్ణిస్తున్నది కళ్ళనే. కాని అవి గువ్వపిట్టలనడంలో మనలో స్ఫురించే సంవేదనలు భౌతిమైన సంవేదనలు అని ఎలా అనగలం? గువ్వపిట్టలు చూడండి. రెక్కలు ఒద్దిగ్గా ముడుచుకుని ఉండే పావురాలు, ఇంతలోనే రెక్కలు టటపలాడిస్తూ ఎగిరిపోగలవు కూడా. ఆ కళ్ళు ఇంతలోనే ఒకింత సిగ్గుతో ముడుచుకుని ఉన్నాయి, ఇంతలోనే సంతోషంగా రెక్కలల్లాడించగలవు కూడా. ఆ గువ్వలు కూడా పూర్తిగా కనబడటం లేదు. చిక్కుపడ్డ ఆమె ముంగురుల మధ్యనుంచి తొంగిచూస్తున్నాయట. ఆ ముంగురులు ఒక గూడులాగా, ఆ గూటిలోంచి కనబడీ కనబడనట్టుగా ద్యోతకమయ్యే పిట్టల్లాగా ఆ కళ్ళు. కావడానికి ఈ పోలికలోని వస్తువు భౌతికమేగాని, ఆ స్ఫురణ మనలో రేకెత్తించే అతీంద్రియ సంవేదన మామూలుది కాదు.

మామూలుగా మనం బిగ్గరగా మాట్లాడే కవిత్వాలకు అలవాటు పడిపోయాం. గంభీరమైన వర్ణనలకూ, పదాడంబరానికీ అలవాటు పడిపోయాం. ఈ ప్రేమగీతంలోని దివ్యత్వమెక్కడుందంటే అది మన అంతరంగం మీద ఇన్నాళ్ళుగా అట్టకట్టిన insensibility ని పక్కకు నెట్టెయ్యడంలో ఉంది. చిన్న చిన్న పదాల్తో, నవనవలాడే పోలికల్తో, అలతి అలతి పదబంధాల్తో ఆ కవి ఎంత సౌందర్యమయ ప్రపంచానికి తెరతీస్తున్నాడో చూడాలి మనం. ‘గిలియదు పర్వతం మీంచి కిందకు పరుగెడుతున్న మేకలమందలాగా నీ శిరోజాలు’. ఏమి రూపకం ఇది! నాకు తెలిసి మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే ఇటువంటి రూపకాలంకారం మరొకటి లేదు. ఇందులో కవి చూపించిన రూపకప్రజ్ఞ మీదనే ఒక గ్రంథం రాయవచ్చు.

అయినా క్లుప్తంగా వివరిస్తాను.

మామూలుగా రూపకలంకారం లేదా ఉపమాలంకారం సమానధర్మం కలిగిన రెండు వస్తువుల మధ్య ఒక సాదృశ్యాన్ని చూపడం. ‘ఆమె ముఖం చంద్రబింబంలాగా ఉంది’ అంటే ఉపమాలంకారం. ‘ఆమె ముఖం చంద్రబింబం’ అంటే రూపకాలంకారం. ఇవి రెండూ గోచర వస్తువులు. ఒక గోచరవస్తువుకీ, ఒక అగోచర వస్తువుకీ మధ్య పోలిక తేవడం ఇంతకన్నా అత్యున్నత స్థాయి ఉపమ, రూపకం అవుతాయి. ఒక జ్ఞాతవస్తువుకీ, ఒక అజ్ఞాత వస్తువుకీ పోలిక తెచ్చినా అలానే గొప్పగా ఉంటుంది. ఆధునిక పాశ్చాత్యకవులు, తోమస్ ట్రాన్స్ ట్రోమర్ లాంటి వాళ్ళు సాధనచేస్తున్నది అటువంటి రూపకాలంకారాల్నే.

ఒక నిశ్చలవస్తువుకీ, ఒక చలనవస్తువుకీ మధ్య పోలిక తేవడం కూడా అటువంటి ప్రతిభావంతమైన ప్రయోగమే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కవి ఆమె కురుల్ని, కొండమీంచి కిందకు దుముకుతున్న మేకలమందతో పోల్చాడు. మేకలు నల్లగా ఉంటాయికాబట్టి, ఆమె కురులు నల్లగా ఉంటాయి కాబట్టి అక్కడికి ఉపమాలంకారం పూర్తయిపోయింది. అంతేనా? మేకలు సాయంకాలం కాగానే మేతనుంచి వెనక్కి మళ్ళీ కిందకి దిగుతున్నాయి. అంటే అస్తమిత సూర్యకాంతి వాటిమీద పడుతూ ఉంటుంది. అప్పుడవి రాగిరంగులో కనిపిస్తాయి. ఆమె కురుల్ని మేతకు వెళ్తున్న మేకలమందతో కాకుండా మేతనుంచి తిరిగివస్తున్న మేకలమందతో పోల్చడంతో ఆ రాగిరంగు కురుల్ని ధ్వనింపచేస్తున్నాడు తప్ప వాచ్యంగా చెప్పడం లేదు. ఇక అక్కడికే ఆ ఉపమాలంకారం సఫలమైపోయింది. కాని అంతేనా? కురులు నిశ్చలాలు. గాలికి కదలాడవచ్చుగాక, కాని శిరసునే అంటిపెట్టుకుని ఉంటాయి. కాని ఆ మేకలమంద కొండమీంచి కిందకి దిగుతున్నది. కొండమీంచి మేకలు ఎలా కిందకు దిగుతాయి? వడివడిగా దుముకుతున్నట్టు దిగుతాయి. ఆమె కురులు ఆమె శిరసుమీంచి కిందకి వాలినప్పుడు అవి కొండమీంచి కిందకు వడివడిగా దిగుతున్న మేకలమందలాగా ఉన్నాయి. అంటే ఆ కేశపాశాన్ని చూడగానే ఒక జలపాతసదృశమయిన వేగం స్ఫురిస్తోందన్నమాట. ఈ వేగం ఆ ప్రేమికుడి హృదయావేగం. అంటే ఇక్కడ సమానధర్మం ఏమిటి? చలనశీలత్వం. అంటే దుముకుతున్న మేకలమందకీ, ఆ కురుల్ని చూస్తుంటే రక్తం వడివడిగా ప్రవహిస్తున్న ఆ ప్రేమికుడికీ అనుకోవాలి. ఆ పోలిక వినగానే, మనం ఇదంతా ఆలోచించుకోకుండానే, ఇంత లోతుగా విశ్లేషించుకోకుండానే మన గుండె వేగంగా కొట్టుకోవడం మనం అనుభూతి చెందుతాం.

ఇలా ఇందులో ఉన్న ప్రతి ఒక్క పోలిక దగ్గరా మనం ఆగాలి. నెమరువేసుకోవాలి. నిండుగా పూసిన ఒక గులాబిని గుండెనిండుగా ఆఘ్రాణించినట్టుగా లోపలకీ తీసుకోవాలి. అప్పుడు మనలో రేకెత్తేది శృంగార భావనకాదు. నవనవలాడే తోటని చూసినప్పుడు, తేనెటీగలు ఝుమ్మని ముసిరే పూలగుత్తిని చూసినప్పుడు మనలో ఎటువంటి సంవేదనలు రేకెత్తుతాయో, ఈ కవిత చదివినప్పుడు కూడా అటువంటి సంతోషమే ఊటలూరుతుంది. అందుకనే ఒక వ్యాఖ్యాత, ఈ నాలుగవ గీతం చదివినప్పుడు మనం whiteness, wetness, symmetry, completeness లను అనుభూతి చెందుతామని రాసాడు.

ఇక ఈ గీతంలోని అత్యంత మహిమోపేతమైన విషయం, ఆ ప్రేమికుడు తన నవవధువుని ‘నా వధూ’ అని పిలవడంతో పాటు ‘నా సోదరీ’ అని సంబోధించడం కూడా. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లూ ‘సోదరీ’ అని పిలిచాడు ఆమెని. ఈ కవితలోని అత్యంత మానవీయ, దైవీయ, ఆత్మీయ సంబోధన అది. ఇద్దరు ప్రేమికుల ప్రేమ సాఫల్యం వాళ్ళు దంపతులవడంలో లేదు. అది పిల్లలు పుట్టడంతో ముగిసిపొయ్యే బంధం. దాన్ని దాటి వాళ్ళిద్దరూ సోదరుడూ, సోదరీ కాగలగాలి. తమదేహాల్ని దాటి తమలో దైవాన్ని కనుగొనాలి. మరి వివాహబంధం తాలూకు గమ్యం ఇదే అయితే పెళ్ళి అవసరమేమిటి అనవచ్చు.

తర్వాత రోజుల్లో క్రీస్తుని ఆయన శిష్యులు ఇదే అడిగారు (మత్తయి: 19:10):

ఆయన శిష్యులు ఆయనతో అన్నారు కదా : మరి భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధం ఇదీ అనుకుంటే అంతకంటే పెళ్ళిచేసుకోకుండా ఉండటం మంచిది కదా.

అప్పుడు క్రీస్తు వాళ్ళతో ఇలా చెప్పాడు (మత్తయి: 19:11-12):

యేసు ఇలా జవాబిచ్చాడు: ప్రతి ఒక్కరూ ఈ మాటని అంగీకరిస్తారనుకోను. దీని అంతరార్థం గ్రహించినవాళ్లు మాత్రమే దీన్ని అంగీకరిస్తారు. కొంతమంది పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారు. కొందరు ఇతరులవల్ల నపుంసకులుగా మారతారు. కొందరు మాత్రం పరలోక రాజ్యం కోసం నపుంసకులు కావాలని కోరుకుంటారు. ఈ మాట ఎవరికి నచ్చితే వాళ్ళే నేను చెప్పిన మాట ఒప్పుకోవచ్చు.

నిజానికి స్త్రీని మోహపు చూపుతో చూసే ప్రతి ఒక్కడూ పాపానికి పాల్పడుతున్నాడు అని క్రీస్తు చెప్పినప్పుడు ఆ మాట పరస్త్రీకి మాత్రమే కాదు, భార్యకి కూడా వర్తిస్తుందని టాల్ స్టాయి అన్నాడు. ఆ అవగాహనతోనే ఆయన ‘విషాద సంగీతం’ కథ రాసాడు. ఒక స్త్రీని మోహమయ దృష్టితో చూసినవాడు నరకానికి లోనవుతాడు అంటే ఆ నరకం ఎక్కడో ఉందని కాదు, మోహ పర్యవసానం సాధారణంగా నరకమే అవుతుందని గుర్తుపెట్టుకోవడం. అలాగే ఒక మనిషి నపుంసకుడు కావడం అంటే దాని అర్థం తన జీవితానందం ఒక్క లైంగిక అవయవం మీద మాత్రమే ఆధారపడి లేదని గ్రహించడం.

ఈ గీతం దివ్యప్రేమ గీతం ఎందుకంటే ఇందుకు.


4.1

నా ప్రియసఖీ ఎంత అందంగా ఉన్నావు
నా స్నేహితురాలా, గువ్వపిట్టల్లాటి
నీ కళ్ళు
నీ ముంగురులగుబుర్ల మధ్య తొంగి చూస్తున్నాయి

గిలియదు పర్వతం మీంచి
కిందకు దుముకుతున్న మేకలమందలాగా
నీ శిరోజాలు

2

ఉన్ని కత్తిరించాక చెరువులోమునిగి బయటికి తేలిన
గొర్రెపిల్లల్లాగా నీ దంతాలు
ఒక్కవరసలో కనిపిస్తున్నాయి.

3

జపాసూనకాంతులీనే దారం ఉండలాగా నీ పెదాలు.
నీ స్వరం నన్ను వివశుణ్ణి చేస్తుంది.

నీ కబరీభరం గుబురుమాటున
విచ్చిన దానిమ్మలాగా
నీ కపోలపాళి.

4

విజయసూచకమైన
దావీదు గోపురంలాగా నీ కంఠం.
సాహసయోధుల మొత్తం కవచాలు
వెయ్యి డాళ్ళు దానికి వేలాడుతున్నాయి

5

నీ రొమ్ములు రెండు లేడిపిల్లలు
కలువపూల చేలల్లో పచ్చికమేసే
హరిణమిథునం.

6

చల్లటి గాలితెమ్మెరలు వీస్తూ ఉండగానే
రాత్రి నీడలు ఇంకా తొలగిపోకముందే
నేను సాంబ్రాణి పర్వతం దగ్గరకి
గుగ్గిలం కొండదగ్గరికి పరుగుతీస్తాను

7

సౌందర్యవతీ, నా ప్రియా
నువ్వు కళంకరహితవి.

8

నా వధూ, నాతో వచ్చెయ్యి
లెబనాను కొండమీంచి దిగిరా
అమనా శిఖరం మీంచి కిందకి చూడు
సెనీర్, హెర్మోన్ శిఖరాల మీంచి,
చిరుతపులులు తిరుగాడే కొండలమీంచి
సింహాలు నివసించే గిరికంధరాలనుంచి
తరలి రా

10

నా హృదయాన్ని మేల్కొల్పావు
నా వధూ, నా సోదరీ
నీ ఒక్కకడగంటి చూపుతో
నీ కంఠాభరణపు అతిచిన్న మెరుపుతో
నన్ను పాదాక్రాంతుణ్ణి చేసుకునావు

11

ఆహ్, నీ ప్రేమ, ఏమని చెప్పను
నా సోదరీ, నా ప్రియా
నీ ముద్దుల ద్రాక్షారసం
నీ చందనతైలాల సురభిళం.

11

తేనెలూరే నీ అధరాలు.
తేనెమీగడలు
నీ నోట్లో ఊటలూరుతున్నాయి
నీ దుస్తుల నిండా లెబనాను సుగంధం

12

నా సోదరి, నా నవవధువు
చక్కని కంచెకట్టిన తోట, రహస్యసరోవరం
మూతపెట్టిన నీటి ఊట

13

నీ కొమ్మలు పండ్లతో బరువెక్కిన
దానిమ్మచెట్లు
విరగబూసిన గోరింటపొదలు, జటామాంసి ఓషధీలతలు
జటామాంసి, కుంకుమపువ్వు, లవంగం, దాల్చినచెక్క
గుగ్గిలం చెట్ల అడవి
అగరు, సాంబ్రాణి
అరుదైన సమస్త సుగంధజాతి

14

నువ్వు తోటలో జలాశయానివి
లెబనాను నుంచి ఊటలూరి ప్రవహించే
సజీవజలానివి

15

ఓ ఉత్తరపవనమా, మేలుకో, దక్షిణపవనమా తరలిరా
ప్రవహించండి నా తోటమీంచి
దాని సౌరభాన్ని వ్యాపింపచెయ్యండి నలుదిక్కులా
నా ప్రేమికుడు ఈ తోటలో అడుగిడుగాక
ఈ మధుర ఫలాల్ని తానై రుచిచూచుగాక!

7-3-2023

Leave a Reply

%d bloggers like this: