దివ్యప్రేమ గీతం-4


3.1

ఆమె

రాత్రి నా శయ్యమీద
ఆ ఒకే ఒక్కడికోసం ఎదురుచూసాను
కాని కనుగొనలేకపోయాను.

2

అతడు కనబడేదాకా
పోయి నగరంలో వెతుక్కోవాలనుకున్నాను
ఆ ఇరుకు వీథుల్లో, నాలుగుదారుల కూడలి మధ్య
ప్రతి ఒక్కచోటా అతడికోసం అన్వేషించాను
కాని కనరాకున్నాను.

3

అప్పుడు నగరంలో పహరా కాస్తున్న
కావలివాళ్ళు నన్ను చూసారు
‘చూసారా మీరతణ్ణి? నా ప్రేమికుణ్ణి?’
అనడిగాను వాళ్ళని.

4

వాళ్ళనిట్లా దాటిపొయ్యానో లేదో
నా ప్రియతముడు కనబడ్డాడు
అతడెక్కడా జారిపోతాడో అని
గట్టిగా పట్టుకున్నాను
మా అమ్మ ఇంటికి, ఆమె గదిలోకి
అతణ్ణి తీసుకొచ్చినదాకా అతన్ని వదల్లేదు.

5

యెరుషలేం కన్యలారా
హరిణాలమీద, పొలాల్లో తిరుగాడే లేడికూనలమీద
ప్రమాణం చేసి చెప్పండి
ప్రేమ తనంతటతాను మేల్కొనేదాకా
మీకై మీరు మేల్కొల్పబోమని ఒట్టు వెయ్యండి.

6

చెలికత్తెలు

ఆ ఎడారిదారిలో ధూపస్తంభంలాగా
నడచివస్తున్నదెవరు?
సార్థవాహుల సుగంధద్రవ్యాలన్ని మించిన
సాంబ్రాణి, అగరు పరిమళాల ఆ గుబాళింపు ఏమిటి?

7

ఓహ్! ఎట్లాంటి వైభవం సొలోమోను చక్రవర్తిది!
అత్యంత సాహసవంతులైన ఇస్రాయేలీలు అరవై మంది
ఆయనకు కావలి.

8

వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ యుద్ధవిశారదులు
నడుముకి వేలాడే కృపాణాలతో
రాత్రిభీతినించి వారు ఆయనకు రక్షణ.

9

లెబనాను దేశపు దేవదారుతో నిర్మించిన
సొలోమోను చక్రవర్తి పల్లకి.
వెండి స్తంభాలు
బంగారు మెత్తలు
మేలిమి ఊదా రంగు దిండ్లు
యెరుషలేం వనితలు
దాన్ని ప్రేమపూర్వకంగా అలంకరించారు.

10

సీయోను కన్యలారా, రండి
సొలోమోను చక్రవర్తిని దర్శించండి
ఆయన వివాహదినోత్సవం నాడు
ఆయన తల్లి స్వయంగా
ఆయన శిరసున్న మకుటం తొడిగింది.
హృదయం ఉప్పొంగిన రోజది.

6-3-2023

3 Replies to “దివ్యప్రేమ గీతం-4”

  1. గీతాన్ని పూర్తి చేశాక కొంత వివరణ అయినా కలపండి. మీరు ఇంట్రో రాసినా ఎక్కువగా విషయం ఫీజికాలిటీ దగ్గరే ఆగుతున్నట్టు వుంది, గీతాంజలి మాదిరి కాకుండా, బహుశా నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. So, it helps. Thankyou.

  2. నేపథ్యం పూర్తిగా తెలిస్తే అనుభూతి హెచ్చుతుందేమో. కానీ ఒక ప్రేమలో పడ్డ కన్య ప్రియాన్వేషణ ఎలా ఉంటుందో నీటిరంగుల చిత్రంలా గోచరిస్తూంది.

Leave a Reply

%d bloggers like this: