దివ్యప్రేమ గీతం-3

2.1

ఆమె

షారోన్ లో విరబూసే గులాబీపువ్వుని
లోయల్లో వికసించిన నీలికలువని.

2

అతడు

ముళ్ళకంపల మధ్య
పూసిన కలువ పువ్వులాగా
నవయవ్వనవతుల మధ్య
నా ప్రియసఖి.

3

ఆమె

అడవిచెట్ల మధ్య ఆపిల్ కొమ్మలాగా
యువ సమూహం మధ్య నా ప్రేమికుడు
ఆ పండ్లు రుచిచుస్తూ
ఎన్ని సార్లు ఆ నీడన తచ్చాడేనో.

4

ఇప్పుడతడు నన్ను ద్రాక్షతీగల పొదరింటిలోకి తీసుకొచ్చాడు
నా మీద ఎగరేసిన పతాకంలాగా అతని ప్రేమ.

5

ఆపిల్ పండ్ల శయ్యమీద
పూలతీగల నడుమనన్ను పరుండనివ్వండి
ఇప్పుడు నాకు ప్రేమ జ్వరం పట్టింది.

6

అతని ఎడమ చెయ్యి నా శిరసుకింద.
కుడిచేత్తో
నన్ను దగ్గరగా లాక్కున్నాడు

7

యెరుషలేము కన్యలారా
హరిణాల సాక్షిగా, పొలాల్లో లేడిపిల్లల సాక్షిగా
ఒక్క ప్రమాణం చేసి చెప్పండి
ప్రేమ తనంతతాను మేలుకునేదాకా
మీరు మేల్కొల్పబోమని ఒట్టువెయ్యండి

8

కొండలమీంచి
పర్వతపంక్తులకి అడ్డంగా వినవస్తున్నది
నా ప్రియుడి కంఠస్వరం, ఇంచుక ఆలించు.

9

అడవిదుప్పి లాగా, జింక లాగా నా ప్రేమికుడు
మన ఇంటిగోడకి అవతల నిలబడ్డాడు, అడుగో
రాళ్ళసందుల్లోంచి చూపు సారిస్తున్నాడు.

10


నా ప్రియుడు పిలుస్తున్నాడు

అతడు

ప్రియా, నా సఖీ, త్వరగా రా,
తొందరగా వచ్చెయ్యి

11

చూడు, చలికాలం గడిచిపోయింది
వానలు వెనకబడ్డాయి

12

నేలంతా పూలు పరిచినట్టుంది
ఇది కోకిల ప్రవేశించే కాలం
ప్రతి ఒక్క మైదానం మీంచీ వినవస్తున్నది
గువ్వపిట్టల పాట.

13

అత్తిచెట్లమీద
పండ్లు తీపెక్కుతున్నాయి
ద్రాక్షతీగలు పూతపట్టి
సుగంధాలు విరజిమ్ముతున్నాయి
ప్రియా, నా సఖీ, త్వరగా రా
తొందరగా వచ్చెయ్యి

14

కొండరాళ్ళ నడుమ దాక్కునే పావురానివి
బండరాళ్ళ నీడన సేదదీరే పావురానివి
నిన్ను చూడనివ్వు
నీ గొంతు వినాలని ఉంది
మధురమైన నీ పాట మైమరచి వినాలని ఉంది
ఊరికే నిన్నట్లా చూస్తూ ఉండిపోవాలని ఉంది

15


ద్రాక్షతోటలు పూతకొచ్చాయి
వాటిమీద వచ్చిపడే
గుంటనక్కల్ని పట్టుకో
ద్రాక్షతోటల్ని పాడుచేసే
గుంటనక్కల్ని పట్టుకో

16

ఆమె

నా ప్రియుడు నా వాడు, నేనతని దాన్ని.
కలువపూల చేలల్లో
అతడు విందారగిస్తాడు

17

తొలివేకువ తెమ్మెర వీస్తూ ఉండగానే
రాత్రి నీడలు తొలగిపోకముందే
నా ప్రియతమా, పరుగెత్తి రా
అడవి దుప్పిలాగా, హరిణంలాగా
ఎగుడుదిగుడు కొండలమీంచి
ప్రియతమా పరుగెత్తి రా.

5-3-2023

2 Replies to “దివ్యప్రేమ గీతం-3”

  1. ఆదిమ ప్రేమ గీతంలో అవ్యక్త మధుర నాదం . చదువరి రెండు పాత్రలు తానై చదవాలి..ఆధునికత అంటు లేని అచ్చమైన ప్రకృతి ప్రణయ పరాగం.

Leave a Reply

%d bloggers like this: