
1.7
ఆమె
ప్రాణప్రియా!
నీ గొర్రెలమందని ఏ పచ్చికబయళ్ల వెంట నడిపిస్తావు
మధ్యాహ్నపు మండుటెండన
ఏ నీడల్లో వాటిని సేదతీరుస్తావు?
మందలాంటి నీ సహచరుల మధ్య
నన్ను నేను ఎట్లా మరుగుపరుచుకోను?
8
అతడు
అతిలోక సౌందర్యవతీ, అద్భుతమైన దానా
దారితోచకపోతే
నా గొర్రెలమందల అడుగుజాడలు పోల్చుకో
పసులకాపరుల గుడారాల నీడల్లోకి
నీ మేకలమందని నడిపించు.
9
అతడు
నా కలలంతటా, ప్రియసఖీ,నువ్వే
ఫారోచక్రవర్తి రథాల మధ్య
నా ఆడగుర్రంలాగా నువ్వు.
10
ఊగుతున్న ఆ లోలాకులమధ్య
చక్కని నీ చెక్కిళ్ళు.
కంఠసీమలో ఆ పూసలపేరు.
11
చెలికత్తెలు
బంగారు దుద్దులు చేయిస్తాము
వాటికి వెండిపూల నగిషీ కూడా.
12
ఆమె
నా రాజు నా పక్కనే శయనిస్తాడు
నా సుగంధం
రాత్రిని నిద్రపోనివ్వదు.
13
రాత్రంతా నా స్తనాల మధ్య
సాంబ్రాణిముద్దలాగా నా ప్రేమికుడు
14
ఎన్ గెదీ ద్రాక్షతోటల మధ్య
గోరింట పూలగుత్తి.
15
అతడు
సౌందర్యవతివి నువ్వు! ప్రియా!
నువ్వెంత సౌందర్యవతివి!
నీ కళ్ళు పావురాళ్ళు.
16
ఆమె
సుందరుడివి రాజా!
సుకుమారుడివి! మనం ఎక్కడ
శయనిస్తే అక్కడ పచ్చదనం.
17
మన ఇంటికి దేవదారు దూలాలు
పాలకర్రల వాసాలు
4-3-2023