
సామగీతాల్ని తెలుగు చేసినప్పుడు ఆ వెంటనే పాతనిబంధనలోని The Song of Songs కూడా తెలుగు చేయాలనుకున్నాను. ఆ గీతానికి ఇప్పటికే తెలుగు బైబిలు అనువాదాలు కాక, దీవి సుబ్బారావుగారు ‘పరమోన్నత గీతము’ పేరిట చేసిన అనువాదం కూడా ఉంది. కాని గీతాంజలి ని చదివిన ప్రతి ఒక్కరూ ఆ గీతాల్ని తమకోసం తాము తెలుగులోకి అనువదించుకోవాలి అనుకున్నట్టే, The Song of Songs ని కూడా తెలుగులోకి అనువదించుకోవాలని ప్రతిభావుకుడూ కోరుకోవడం సహజం.
The Song of Songs మన గోపికాగీతలాగా, తిరుప్పావై లాగా ఒక శుభగీతం, మంగళగీతం, ప్రేమాన్వితగీతం, రసరమ్యగీతం. అందులో భగవదాంశ ఎంత ఉందో భూలోకాంశ కూడా అంతే ఉంది. నిజానికి భూమ్మీద స్వర్గం దిగి వచ్చిన దృశ్యాన్ని దర్శించిన గీతం అది.
ఆ గీతం పైన కూడా గత రెండువేల ఏళ్ళకి పైగా విస్తృతమైన వ్యాఖ్యానాలూ, ప్రతి తరంలోనూ సరికొత్త అనువాదాలూ వస్తూనే ఉన్నాయి. కొందరు దాన్ని పూర్తి లౌకిక గీతంగా భావించి అది పవిత్రగ్రంథంలో ఎలా చోటు చేసుకుందా అని ఆశ్చర్యపోయారు. కాని మరికొందరు అంతకన్నా భగత్ప్రేమగీతం మరొకటి ఉండటం అసాధ్యమని వాదించారు.
రెండవ శతాబ్దానికి చెందిన రబ్బీ అకివా ఇలా అన్నాడట:
దేవుడు మన్నించుగాక! ఇప్పటిదాకా ఇస్రాయేలుకు చెందినవారెవ్వరూ కూడా పవిత్రగ్రంథంలో పరమోన్నత గీతం స్థానాన్ని ప్రశ్నించలేదు. .. ఇస్రాయేలుకు పరమోన్నత గీతం అనుగ్రహించబడ్డ రోజు విలువకు మొత్తం ప్రపంచం సరితూగదు. అన్ని రచనలూ పవిత్రాలే గాని, పరమోన్నత గీతం పవిత్రాతి పవిత్రం.
Psalms డేవిడ్ రాసాడని భావించారు కాబట్టి ఈ పరమోన్నత గీతాన్ని సొలోమోన్ రాసాడని చెప్పడం ఒక నమ్మిక. బహుశా సొలోమోన్ రాసాడని నమ్మినందువల్ల ఈ గీతం పవిత్రగ్రంథంలోకి ఎక్కి ఉండవచ్చు లేదా పవిత్రగ్రంథంలో చోటు చేసుకుంది కాబట్టి దీన్ని సొలోమోను రాసాడని భావిస్తూ ఉండవచ్చు. కానీ ఈ గీతాన్ని ఎవరు రాసారన్నది ఏమంత ముఖ్యం కాదు. వ్యాసవాల్మీకులు హోమరు, చివరికి షేక్స్పియరుల గ్రంథాల విషయంలోలాగే ఈ గీతకర్త కూడా ఎవరన్నది ఇతమిత్థంగా తెలియకపోయినా, ఆ గీతకర్త అత్యున్నత కావ్యకర్త అని మాత్రం ఒప్పుకోక తప్పదు.
ఈ గీతాన్ని ఒక దివ్యమంగళగీతంగా అభివర్ణించవచ్చు. కాని గీతంలో ఎక్కడా దేవుడు అనే పదం కనబడదు. పరలోక ప్రస్తావన ఎక్కడా కనిపించదు. నిజానికి ఈ గీతంలో కనిపించే ప్రాకృతిక క్షేత్రం దానికదే ఒక స్వర్గం. మరొక స్వర్గంతో దానికి నిమిత్తం లేదు.
ఈ గీతంలో ఒక ఉద్యానవనం కనిపిస్తుంది. అది ఏదోను ఉద్యానవనం లాంటిదే. నిజానికి Eden అనే హీబ్రూ మాటకి అర్థం ‘సుఖం, సంతోషం’ అని. ఆ ఏదోను ఉద్యానవనంలో ఆదిస్త్రీపురుషులు ప్రేమైకజీవులుగానే తిరిగారు, భగవంతుడి ఆదేశాన్ని ఉల్లంఘించి ప్రలోభానికి లోనయ్యేంతదాకా. ఒకసారి వారు సైతాను ప్రలోభానికి లోనయ్యాక ఆ ఆనందమానవులు అభిశప్తమానవులై పోయారు. కాని ఈ గీతంలోని ప్రేమికులు అభిశప్తులు కాని ప్రేమికులు. కాబట్టి ఇందులో ఉన్న ఉద్యానవనం కూడా ఏదోను ఉద్యానం వంటిదే గాని, శాపస్పర్శలేని స్వర్గం ఇది.
ఈ ఉద్యానంలో దేవుడి ప్రస్తావన లేదు, నిజమే, కాని సైతాను కూడా లేడు. మనిషికీ, మృగానికీ మధ్య విరోధం లేదు. ఆధిపత్యం లేదు, ఒకరినొకరం అణచివేసుకోడం లేదు. కాబట్టి ఆ ఉద్యానం దానికదే ఒక దైవం. దేవుడి ప్రస్తావనలేని దైవానుభవం ఈ గీతం.
ఈ గీతంలో మనల్ని ఆకర్షించేది, యుగయుగాలుగా వ్యాఖ్యాతల్ని ఇబ్బందికి గురిచేస్తూ వచ్చింది, మానవ దేహాల్నీ, ఇంద్రియాల్నీ ఆ కవి ఉగ్గడించిన తీరు. ఇందులో ఉన్న ప్రేమ దేహాలమీద ఆధారపడ్డ ప్రేమ. దేహాల్ని దాటిన ప్రేమ కూడా అనవచ్చుగాని దేహాల్ని విడిచిపెట్టిన ప్రేమ మాత్రం కాదు. స్త్రీపురుష ప్రేమానుభవంలో దేహాల సంబరం, ఆ సంతోషానికి కవి వాడిన రూపకాలంకారాలు, పదచిత్రాలు, ఆ శబ్దజాలంతాలూకు రంగు, రుచి, సుగంధం మనల్ని కట్టిపడేస్తాయి. నా తొలియవ్వనకాలంలో, అంటే పద్ధెనిమిది, పందొమ్మిదేళ్ళ వయసులో మొదటిసారి ఈ గీతం చదివినప్పుడు ‘గిలాదు పర్వతం చరియలమీంచి కిందకు పరుగెడుతున్న మేకలమందలాంటి నీ కురులు’, ‘కలువపూల మధ్య రెండు లేడికూనల్లాంటి నీ రొమ్ములు’, ‘ఏన్ గెదీ ద్రాక్షతోటలో వికసించిన గోరింటచెట్టులాంటి వాడు నా ప్రియుడు’, ‘ఒలకబోసిన పరిమళ తైలాంటి నీ పేరు’, ‘నువ్వు ఊపిరి తీసినప్పుడు ఆపిల్ పండ్ల వాసన’ లాంటి పదచిత్రాలు నన్ను అప్రతిభుణ్ణి చేసాయి. ఆ కవిత నా ఇంద్రియాల్ని నిశితం చేసి నాముందొక కొత్త లోకాన్ని నిలబెట్టింది.
పరమోన్నత గీతం ఒట్టి గీతం కాదు, అదొక కథాకావ్యం అని కూడా చెప్పవచ్చు. ఆధునిక కథానికలోని నిర్మాణం ఆ గీతంలో ఉంది. ఎందుకంటే ఆ గీతప్రారంభం ఆ గీతానికి ప్రారంభం కాదు, అప్పటికే కొంత కథ జరిగినట్టు మనకి తెలుస్తూంటుంది, ఆ గీతం ముగింపు కూడా ఆ కథకి ముగింపు కాదు. నిజానికి అత్యాధునిక కథానిర్మాణాల్లో కనవచ్చే open ended ముగింపుతో ఆ గీతం ముగుస్తుంది. అందులో ఒక పాత్రధారి, ఒక గళం కాదు, ఆ ప్రేయసీ ప్రేమికులతో పాటు చెలికత్తెలు కూడా ఉన్నారు, రాత్రిపూట నగరానికి కాపలా కాసే కావలివాళ్ళు మొదలుకుని సొలోమోను చక్రవర్తిదాకా చాలామంది ఆ కవితలో కనిపిస్తారు. అందుకని కొందరు దాన్ని ఒక సంగీతరూపకంగా భావించారు కూడా. దాన్ని రూపకంగా భావించినవాళ్ళు అందులో కొన్ని భాగాలు లభ్యం కాలేదని అనుకునేంతదాకా వెళ్ళారు. కాని ఆ గీతం ఎన్నో జానపద గీతాల అల్లిక అనీ దానిలో కోల్పోయినవంటూ ఏ భాగాలూ లేవనీ ఇటీవలి పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
హీబ్రూ గీతాన్ని ఇంగ్లిషులోకి అనువదించినప్పుడు కింగ్ జేమ్స్ వెర్షన్ దానిలోని ఇంద్రియసంవేదనల గాఢతని చాలావరకూ తగ్గించిందని భావిస్తూ, ఆ మూలగీతంలోని స్వారస్యాన్ని పట్టిచ్చే విధంగా, కొత్త అనువాదాలు వెలువడుతూనే ఉన్నాయి.
వాటిలో చెప్పుకోదగ్గది Chana Bloch, Ariel Bloch అనే ఇద్దరు పండితులు వెలువరించిన The Song of Songs (మాడర్న్ లైబ్రరీ, 1995, 2006) చెప్పుకోదగ్గది. ఈ అనువాదానికి అనువాదకులు విస్తారమైన నోట్సుకూడా సమకూర్చారు. మరొక సుప్రసిద్ధ అనువాదకుడు స్టీఫెన్ మిచెల్ ముందుమాట రాస్తే, Psalms ని ఇంగ్లిషులోకి అనువదించిన రాబర్ట్ ఆల్టర్ మలిమాట రాసాడు. ఈ గీత అనువాదకులు In the Garden of Delights అనే ఒక సమగ్రమైన, ఆసక్తికరమైన పరిచయవ్యాసం కూడా రాసారు.
తమ పరిచయ వ్యాసాన్ని ముగిస్తూ వారు రాసిన వాక్యాల్ని ఇక్కడ పేర్కోవాలని ఉంది. వారిలా అంటున్నారు:
కాలం మొదలైన తొలిదినాల్లోని సమగ్రతతాలూకు, సమృద్ధి తాలూకు స్మృతిని ఏదోను గాథ కాపాడుకుంటూ వస్తున్నది. యుగాంతవేళ ఒక శాంతిమయ సామ్రాజ్యం నెలకొనగలదనే ఆశ తో పాతనిబంధన ప్రవక్తలు మాట్లాడుతుంటారు. కాని పరమోన్నత గీతం ఆ సామ్రాజ్యాన్ని మానవప్రేమలో, మనం జీవిస్తున్న ప్రస్తుత క్షేత్రంలో పట్టుకోడానికి ప్రయత్నించింది. మన సమస్త శ్రద్ధాసక్తులతో మనం అందులోకి ప్రవేశించడానికి ఆహ్వానిస్తున్నది.’
పరమోన్నత గీతం ఎనిమిది భాగాల దీర్ఘకవిత. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భాగం చొప్పున ఆ గీతాన్ని మీకు తెలుగులో అందించబోతున్నాను.
1
సొలోమోను రాసిన దివ్యప్రేమ గీతం
2
చుంబించు, నన్ను నీ ముద్దుల్తో మత్తెక్కించు.
నీ ప్రేమానురాగాలు
ద్రాక్షరసంకన్నా బహుతీపి.
3
నువ్వు సుగంధం వెదజల్లుతుంటావు
ఒలకబోసిన పరిమళ తైలంలాంటిది నీ పేరు.
యువతులంతా నిన్ను కోరుకుంటారు.
4
నా చెయ్యందుకో, కలిసి పరుగెడదాం
నా ప్రియుడు, నా రాజు నన్ను అంతఃపురంలోకి తెచ్చుకున్నాడు
నువ్వూ నేనూ కలిసి ముద్దులాడుకుందాం
ప్రతి ముద్దూ లెక్కపెట్టుకుందాం
ద్రాక్షారసంకన్నా తియ్యని ముద్దులు
వాళ్ళల్లో ప్రతి ఒక్కరూ నిన్నిష్టపడతారు.
5
యెరుషలేము కన్యలారా, నేను నల్లదాన్ని
అయినా అందమైన దాన్ని
కేదారువాళ్ళ గుడారాల్లాగా గాఢమైనదాన్ని
సొలోమోను మందిరంలో పరదాల్లాగా
హొయలు పొయ్యేదాన్ని.
6.
అలాగని మరీ నల్లగా ఉన్నాననుకోకండి
ఏం చెయ్యను, సూర్యుడు కూడా నన్ను చూస్తున్నాడు.
మా అన్నదమ్ములు నామీద కోపించారు
నన్ను ద్రాక్షతోటలకి కావలిపెట్టారు
నేనేమో నా సొంతతోటనే కాపాడుకోలేకపోయాను.
3-3-2023
ప్రేమోన్నత గీతం 👌🏻
అవును
అనువాదం ఎవరికోసం వారు చేసుకోవాలనడం ఎంతో బావుంది.
Thank you