మెరుగైన బేరం

ఫాల్గుణ మాసపు గాలి సాయంకాలాల్లో నాకు ప్రాణంపోస్తున్నట్టుగా ఉంది. వీథిలో వేపచెట్లమీద తొలిపూత మొగ్గతొడుగుతోంది. వేపపూల సూక్ష్మ సుగంధం ఎప్పటిదో పూర్వజన్మ జ్ఞాపకంలాగా నన్ను రెండుచేతుల్తో దగ్గరికి తీసుకుంటోంది.

నేను ఆలోచిస్తూ ఉంటాను, వేపపూల గాలి నన్నెందుకింతగా మైమరపిస్తూ ఉంటుంది అని. నిజానికి నేను నివసించిన తావుల్ని వేపపూలగాలితోటే గుర్తుపెట్టుకుంటాను. కాని అసలు అన్నిటికన్నా ముందు ఆ సుగంధం నా హృదయంలోకి ఎలా చొరబడింది? జీవితాన్ని సురభిళసుసంపన్నం చెయ్యగల మరెన్నో పూలతావులు ఉండగా, ఏడాది పొడుగునా విరిసే పూలజాతులు ఉండగా, ఏడాదికి ఒక్కమారు అది కూడా ఫాల్గుణ-చైత్రాల మధ్య మాత్రమే పూసి తిరిగి మళ్ళా ఏడాది పొడుగునా కనరాని ఆ పూలగాలి ఎప్పుడు, ఏ జన్మలో, ఏ మలుపులో నన్ను వశపర్చుకుంది అని?

మా ఊళ్ళో, అంటే శరభవరంలో, మా ఇంటిపక్క ముర్ల గంగమ్మ అనే గిరిజన మహిళ ఇల్లు ఉండేది. ఆమె ఇంటి వాకిట పెద్ద వేపచెట్టు ఉండేది. ఆలోచించగా, ఆలోచించగా నాకు అనిపించిందేమంటే, మా అమ్మ నన్ను కనడానికి ముందు, అంటే నేను చైత్రశుద్ధ చతుర్ధి నాడు పుట్టానుకాబట్టి, ఆ చివరి వారాల్లో ఆమె ఆ వేపపూల గాలిని గుండెనిండుగా ఆఘ్రాణించి ఉంటుంది. పొద్దున్నే ఆ వేపచెట్టుమీంచి వీచే గాలిలో ఆమె నిలువెల్లా కరిగిపోయి ఉంటుంది. ఆమె ఆ వేపపూల సుగంధాన్ని తన రక్తంలో, తన శ్వాసలో, తాను తిన్న ఆహారంలో జీర్ణించిఉంటుకుని ఉంటుంది, ఆ మాతృప్రసాదాన్ని ఆ గర్భస్థ శిశువుగా నేను కూడా సంగ్రహించుకుని ఉంటాను, అందుకనే ఆ పూలతావి నాకు నా శైశవాన్ని, ‘శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు’ని గుర్తుకు తెస్తూంటుంది అనుకుంటాను.

అందుకనే కోకిల ప్రవేశించే కాలంలో ఒక కవిత ఇలా రాసుకున్నాను:

నన్ను కడుపులో దాచుకుని మా అమ్మ

నన్ను కడుపులో దాచుకుని మా అమ్మ
వేపపూల మీద నడిచి ఉంటుంది.
ఆ మట్టి ఇంట్లో పురిటిమంచం మీద
వేపపూల గాలినే ఊపిరి పీల్చి ఉంటాను.

నాన్న ఇంకా నాకు పేరుపెట్టకముందు
చెళ్లెళ్లతో ఆటలు నేర్వడానికి ముందు
అమ్మతో కలిసి పంచుకున్న తొలినిశ్శబ్దంలో
వేపపూల పరాగం మిళితమై ఉండాలి.

ఏ లోకాలనుండి ఈ అపరిచిత
లోకానికి పిలుచుకుని వచ్చిందో
గుక్కపట్టి ఏడుస్తున్న నన్ను మా అమ్మ
వేపపూల గాలితో ఊరడించింది.

నన్ను ఒదిలి ఏ అపరిచిత లోకాలకు
పయనమైపోయిందో మా అమ్మ
చేష్టలుడిగి చూస్తున్న నా చుట్టూ
వేపచెట్లు, వేపపూలు, వేపగాలి.

జీవితానికి అర్థమేమిటి అనే ప్రశ్ననీ లేదా ఈ జీవితంలో సాధించవలసిన పరమార్థం ఏమిటి అనే అన్వేషణగానీ ఒక వేపచెట్టు కింద నిల్చున్నప్పుడు అదృశ్యమైపోతాయి.

నిండుగా విరబూసిన
చెర్రీ తరువుకింద
ఏ ఇద్దరూ అపరిచితులు కారు

అన్నాడు ఒక హైకూ కవి.

నేను ఆ కవితను ఇలా రాసుకుంటాను

నిండుగా పూసిన
వేపచెట్టుకిందనే
నాకు నేను పరిచయమవుతాను.

అది నా స్వస్వరూపాన్ని నాకు గుర్తు చేస్తుంది. వెయ్యిన్నొక్క ప్రలోభాల్ని పక్కకు నెట్టగల మానసిక బలాన్నిస్తుంది. అందుకనే మీరా కీర్తనలో ఒక వాక్యం చదవగానే నాకు వేపచెట్లే గుర్తొచ్చాయి. ఆ గీతం వినండి:

Maine Lino Govind Mol | मैने लिनो गोविंद मोल | Ashwini Paranjape Ranade | Full Version | 2017

ఆ కవిత ఇంగ్లిషులో చదవండి, రాబర్ట్ బ్లై అనువాదంలో:

It’s True I Went to the Market

My friend, I went to the market and bought the Dark One.
You claim by night, I claim by day.

Actually I was beating a drum all the time I was buying him.
You say I gave too much; I say too little.

Actually, I put him on a scale before I bought him.
What I paid was my social body, my town body, my family body, and all my inherited jewels.

Mirabai says: The Dark One is my husband now.
Be with me when I lie down; you promised me this in an earlier life.

మామూలుగా మనం ఏమనుకుంటామంటే ప్రేమ లెక్కల్నీ, లాభనష్టాల్నీ చూసుకోదని. కాని ప్రేమకి తనదే అయిన ఒక అంకగణితం ఉంది. ప్రేమికులు తమ ప్రేమనీ, ప్రపంచాన్నీ తక్కెడలో వేసి చూసుకున్నాకనే, ప్రేమ ప్రపంచం కన్నా ఎన్నో రెట్లు విలువైందని గ్రహించాకనే, ప్రపంచాన్ని పక్కకు నెట్టేస్తారు. మీరా చెప్పిన మాటలు నిజమే. ఆమె గిరిధర గోపాలుణ్ణి తూకం వేసి తూచుకుని మరీ కొనుక్కుంది. దానికి ఆమె చెల్లించిన వెల కూడా ఆమెకి తెలుసు. తన సంఘదేహం, నగరం దేహం, కుటుంబదేహం, తన సమస్త సంపదా చెల్లించీ మరీ ఆమె ఆయన్ని కొనుక్కుంది.

సూఫీ కవులకి కూడా ఈ అంకగణితం తెలుసు. వాళ్ళింకా సూటిగా చెప్తారు: తమ శిరసుని వెలగా చెల్లించి తమ ప్రియతముణ్ణి కొనుక్కున్నారని.

నా జీవితం పొడుగునా నాకు ఎదురైన ప్రలోభాలు సామాన్యమైనవి కావు. కాని సుందరమూర్తి నాయనారుని తిరువెణ్ణైనల్లూరు దేవుడు ముందే కొనుక్కుని క్రయపత్రం రాయించుకున్నట్టుగా వేపచెట్లు నేను పుట్టినప్పుడే నన్ను కొనేసుకున్నాయి. నేను ఎప్పుడు ఎవరికి అమ్ముడుపోదామని చూసినా, ఆ చెట్లు నాకు అడ్డంగా నిలబడి ఆ పురాతన క్రయపత్రాన్ని చూపిస్తూనే ఉన్నాయి. అందుకనే ఈ కవిత రాసుకున్నాను:

మెరుగైన బేరం

Actually, I put him on a scale before I bought him
Mirabai

నన్ను కొనాలని ఎందరో చూసారు, కొన్నిసార్లు
నేనే ఎవరో ఒకరికి అమ్ముడుపోవాలనుకున్నాను
నవనవలాడే కూరగాయలు చూడగానే సంత
గుర్తొచ్చినట్టు నేనెక్కడుంటే అక్కడొక విపణి ప్రత్యక్షం.

క్రయవిక్రయాల మధ్య కూరుకుపోయినప్పుడల్లా
ఒక పచ్చదనం నా పక్కన నిలబడి ‘నువ్వు
పుట్టకముందే నిన్ను కొనేసుకున్నాను తెలుసా ‘
అంటుంది. పువ్వు పూసే లోపే తుమ్మెద చేరినట్టు.

మా అమ్మ కడుపులో ఉండగానే వేపపూల గాలికి
అమ్ముడుపోవడం ఎంతమంచిదైంది! దీర్ఘకాలం
లెక్కలు వేసి చూసాను. ఈ జన్మకి ఇంతకన్నా
మెరుగైన బేరం మరొకటి ఉండదనుకుంటాను.

ఈ కవిత రాయడం నా జీవితంలో జీవన్ముక్తి పొందిన క్షణం లాంటిది. ఇక ఆ తర్వాత నుంచీ ఈ లోకానికి అంటిపెట్టుకుని ఉన్నానేగాని, అంటుకుపోయి లేను. నేను కోరుకునేదంటూ ఏమన్నా ఉంటే ఇదొక్కటే- నా చివరిక్షణాల్లో ఒక పూసిన వేపచెట్టు నా దగ్గరలో ఉండాలన్నదే.

Featured photo courtesy: http://flowersong.in/flowers/neem

2-3-2023

8 Replies to “మెరుగైన బేరం”

  1. ఈరోజు ఇందాకే వాకింగ్ కు వెళ్ళినప్పుడు నడక తర్వాత పార్క్ లో ఒక చెట్టు కింద కూర్చొని ఇది చదివాను సర్ ప్రశాంతంగా..

  2. ఒక్కసారిగా మా ఊరి వేపచెట్లన్నీ ముఖ్యంగా రామాలయం ముందు ఉన్న వేపవృక్షం గాలి వీచి వెళ్లిపోయాయి.మీరు చైత్ర శుద్ధ చవితి నేను చైత్ర శుద్ధ నవమి. మీ పోస్టు చదివిన తరువాత నా చిన్న తనంలో మూడు దిక్కులా త్రిమూర్తుల్లా ఉన్న చింత చెట్ల సావాసం పోల్చుకున్నాను. మాది చింతల ఊరు. ఊరినిండా చింతలే. అయినా వేప చెట్ల నీడలు కూడా మా పై పారేవి. ఒక కొత్త అనుభూతిని ఆవిష్కరించారు.

  3. వేపపూలగాలికి పర్యాయపదాలు రాస్తే మీ పేరు తప్పకుండా వుంటుంది.

    1. ఒక క్షణం పట్టింది, ఈ కాంప్లిమెంట్ అర్థం కావటానికి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు!

  4. మీరన్న మూడు నిమిషాలు చాలవు సర్ .అక్కడక్కడా ఆపేస్తాయి కదా మీ మాటలు ,అప్పుడు ఆలోచనలో పడతాం ,మళ్ళీ చదువుతాం. మళ్ళీ చదువుతాం .మాకు మాత్రమే పరిమితమైన పరిమళాలు ఆఘ్రాణిస్తాం .

Leave a Reply

%d bloggers like this: