అనువాదం ఒక కెరీర్ కూడా

హైదరాబాదులో సిటీ గవర్నమెంటు కాలేజికి వెళ్ళడం నిన్న రెండో సారి. ఆ కళాశాలలో పెద్దలు సూరపురాజు రాధాకృష్ణమూర్తిగారు పాఠాలు చెప్పారనీ, ఇప్పుడు వాళ్ళమ్మాయి రమగారు బోధిస్తున్నారనీ మాత్రమే తెలుసు ఇప్పటిదాకా. కాని నిన్న వెళ్ళినప్పుడు ఆ కాలేజి శతవసంతాలు పూర్తి చేసుకుందనీ, ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో విద్యార్థులు ప్రవేశాలు కోరుకోవడంలో మొదటిస్థానంలో ఉందనీ, దాదాపు నాలుగువేల మంది విద్యార్థులు, తెలంగాణా రాష్ట్రం నలుమూలలనుంచీ అత్యుత్తమ ప్రతిభావంతులు అక్కడ చదువుతున్నారనీ తెలిసింది. ఒకప్పుడు హైదరాబాదు రాష్ట్రంలో అక్కడ చదువుకున్నవాళ్ళల్లో కొందరు గవర్నర్లుగా, కేంద్రమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా కూడా పనిచేసారనీ, మక్థూమ్ మొహియుద్దీన్ లాంటి కవి అక్కడ ఇంగ్లిషు బోధించాడనీ తెలిసింది. ఇప్పుడు దాదాపు నూటనలభై మంది లెక్చరర్లతో ఆర్ట్స్, కామర్స్ కోర్సులు నడుపుతున్న ఆ కళాశాలలో నిన్న అడుగుపెట్టినప్పుడు ఆ సిబ్బందిలో, ఆ విద్యార్థుల్లో కనిపించిన అంకితభావం, ఉత్సాహం నన్ను ముగ్ధుణ్ణి చేసాయి.

ప్రసిద్ధ కవి కె.శ్రీకాంత్ అక్కడ ఇంగ్లిషు బోధిస్తున్నాడు. ఈ మధ్య ఒకరోజు ఆయన తమ కళాశాలా, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖా కలిసి అనువాదం మీద రెండు రోజుల ఓరియెంటేషన్ నడుపుతున్నామనీ, నన్ను కూడా రమ్మని ఆహ్వానించాడు. ముఖ్యంగా కంటెంట్ రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అనే ఒక కోర్సు ఒకటి తాము కొత్తగా ప్రారంభించామనీ, ఔత్సాహిక అనువాదకుల్ని ప్రోత్సహించడంతో పాటు, కంటెంట్ రైటింగ్ నీ, అనువాదాన్నీ ఒక కెరీర్ గా కూడా పెంపొందించుకోవచ్చు అని విద్యార్థులకు చెప్పడం తమ ఉద్దేశ్యమనీ చెప్పాడు. తమ కళాశాల విద్యార్థులే కాక, సిటీలో ఉన్న ఇతరకళాశాలలనుంచి కూడా విద్యార్థులు, లెక్చరర్లూ పాలుపంచుకోబోతున్నారని చెప్పాడు. అది వాళ్లకే కాదు, నాక్కూడా మంచి అవకాశం అని భావించి తప్పకుండా వస్తానని చెప్పాను. నిన్న వెళ్ళాను కూడా.

నిన్నటి కార్యక్రమంలో ప్రారంభ సమావేశం తర్వాత మూడు సెషన్లు నడిచాయి. మొదటి సెషన్ లో సాహిత్యరచనల్ని అనువదించడంలో ఎదురయ్యే సమస్యలు, నేను వెతుక్కున్న పరిష్కారాలు అనే అంశం మీద నేను మాట్లాడేను. సామాజిక శాస్త్ర రచనల్ని అనువదించడంలో ఎదురయ్యే సమ్యస్యలు, పరిష్కారాల మీద ఎన్.వేణుగోపాల్ మాట్లాడేడు. భోజన విరామం తర్వాత అనువాద ప్రక్రియలోని మౌలికమైన అంశాల గురించి డా. ఆదిత్య మరింత లోతైన ప్రసంగం చేసాడు.

నా ప్రసంగంలో మొదట అసలు అంత మంది విద్యార్థులు ఆర్ట్స్, కామర్స్ కోర్సులు చదవుతూ కనబడటం పట్ల నా సంతోషాన్ని వ్యక్తం చేయకుండా ఉండలేకపోయాను. నేను పదవతరగతిలో రాష్ట్ర స్థాయి రాంకు తెచ్చుకున్నందుకు, నాకు నాగార్జున సాగర్ కాలేజిలో ఎంపిసి లేదా బిపిసిలో ఎంట్రన్స్ తో పనిలేకుండానే సీటు ఇస్తానన్నారనీ, కాని నేను సియిసి ఎంపిక చేసుకున్నాననీ, ఆ తర్వాత బి ఏ చదివాననీ చెప్పాను. నేను ఇంజనీరింగ్, మెడిసిన్ చదివి ఉంటే కూడా ఈ ప్రపంచానికి ఏదో ఒకరూపంలో సేవలు అందించగలిగి ఉండేవాణ్ణి గాని, బి ఏ చదివినందువల్ల ప్రజలతో దగ్గరగా పనిచేసే ఉద్యోగావకాశాలు లభించాయనీ, గిరిజన విద్యారంగంలోనూ, పాఠశాల విద్యలోనూ నాదైన కాంట్రిబ్యూషన్ సమాజానికి ఇవ్వగలిగే భాగ్యం లభించిందనీ చెప్పాను. అంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులు బి ఎ, బి కాం లాంటి కోర్సులు తీసుకోవడం నాకు సంతోషాన్ని కలిగిస్తోందనీ, ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం వారినుంచి భవిష్యత్తులో ఎంతో లబ్ధి పొందగలవని ఆశ కలుగుతోందని చెప్పాను.

ఆర్ట్స్ చదవాలనుకోవడం ఒక మంచినిర్ణయం కాగా, సృజనాత్మక రంగం పట్ల ఇష్టం చూపించడం మరొక మంచి నిర్ణయం అని చెప్పాను. చదువులో పైకి రావాలన్నా, సృజనలో పైకి రావాలన్నా కూడా ప్రతిభ, పరిజ్ఞానం, ప్రాక్టీసు-మూడూ తప్పనిసరి అని చెప్పాను. కాని వాటిలో ప్రతిభ పాళ్ళు చాలా తక్కువ, పదిశాతం మించి ఉండదనీ, పరిజ్ఞానం ముప్పై నుంచి నలభై శాతం పాత్రపోషిస్తే, అభ్యాసం లేదా ప్రాక్టీసుకి దాదాపు అరవై శాతం ప్రాముఖ్యత ఉందని చెప్పాను. ఒకవేళ జన్మతః సిద్ధించిన ప్రతిభ లేకపోయినా అధ్యయనం, అభ్యాసం వల్ల కూడా చదువులోనూ, సృజనలోనూ అత్యున్నతమైన ఫలితాలు రాబట్టవచ్చుననీ, అవి రెండూ లేకుండా కేవలం ప్రతిభావంతులైనమాత్రాన వారు సాధించగలిగేది ఏమీ ఉండదని కూడా చెప్పాను.

సాహిత్యం, సంగీతం లాంటి కళల్లో రాణించాలంటే ఒకప్పుడు పూర్వజన్మ సుకృతం లేదా కుటుంబనేపథ్యం, సరూప మనస్కుల సాంగత్యం ఉండాలని చెప్పేవారనీ, కాని ఇవేవీ లేకపోయినా కూడా అచంచలమైన పట్టుదల, నిర్విరామ కృషి ఉంటే మనుషులు కళలోనూ, జీవితంలోనూ కూడా అద్భుతాలు సాధించగలరని చెప్పాను. గాంధీ, కలాం వంటి వారి జీవితాల్లోంచి ఉదాహరణలిచ్చాను. ఆ ఇద్దరు మహనీయులూ కూడా జన్మతః ప్రతిభావంతులని చెప్పలేమనీ, అకడమిక్ గా యావరేజ్ విద్యార్థులనీ, కానీ, తమని తాము నిరంతరం సానబెట్టుకోవడంద్వారా మాత్రమే మలగని దీపాలుగా వెలిగారనీ కూడా చెప్పాను.

అనువాదం ప్రధానంగా ప్రాక్టీసుతో పట్టుబడే విద్య అనీ, రెండు భాషల్లోనూ చాలా మామూలు పరిజ్ఞానం ఉన్నా కూడా నిరంతర అభ్యాసం వల్ల చాలా తొందరలోనే అనువాదకులుగా రాణించడం కష్టమేమీ కాదని చెప్పాను. తెలుగులాంటి సుసంపన్నమైన సాహిత్యభాషకి మనం పుట్టుకతోనే వారసులయ్యామనీ, ఇటువంటి సుసంపన్న వారసత్వం గురించి ప్రపంచానికి మనం చెప్పుకోకపోతే మరెవరు చెప్పుకుంటారని అడిగాను. కేవలం చారిత్రిక, సాంస్కృతిక ఘనత చాటుకోవడం కోసం మాత్రమే అనువాదాలు చెయ్యాలని చెప్పడం లేదనీ, ఈ సమాచార యుగంలో ప్రపంచం ఒక గ్లోబల్ కుగ్రామంగా మారినప్పుడు తక్కిన ప్రపంచం గురించి మనం మరింత తెలుసుకోడానికీ, మన సోదరులకు చెప్పడానికీ అనువాదాలు అత్యంత అవసరం అని చెప్పాను. అనువాదాలే లేకపోతే కేవలం మన పరిసరాలనుంచో, పాఠశాలలనుంచో లభించే పరిజ్ఞానం నుంచో మనం మన జీవితం మీద అధికారం సంపాదించుకోవడం అంత సులభసాధ్యం కాదని కూడా చెప్పాను.

సముద్రాన్ని గుట్టలు పోసినట్టు మనచుట్టూ పోగవుతున్న సాహిత్య, సాహిత్యేతర వాజ్ఞ్మయాన్ని తెలుగుచేయడానికి ఒకరో, ఇద్దరో, పదిమందో అనువాదకులు చాలరనీ, పదివేల మంది సైన్యం కావలసి ఉంటుందనీ కూడా చెప్పాను.

ఒక టెక్స్ట్ ను అనువదించడంలో నాలుగైదు దశలు ఉంటాయని ఒక్కొక్కదశ గురించీ వివరంగా చెప్పాను. మొదటిదశలో మనం ఏ రచనని అనువదించాలి అనుకుంటున్నామో దాన్ని నేరుగా, స్వేచ్ఛగా, తోచింది తోచినట్టుగా తెలుగులోకి (లేదా ఇంగ్లిషులోకి) అనువదించడం. అప్పుడు ఆ అనువాదాన్ని తీసుకుని మూల రచనతో పోల్చి కఠిన పదాలకు సమానార్థకాలు సరిగానే పడ్డాయో లేదో చూసుకోవడం. ఒక పదానికి సమానమైన అర్థాన్నిచ్చే అనేక పదాలు స్ఫురిస్తున్నప్పుడు, ఆ పదం బరువు ఎంత ఉందో చూసుకోవడం, ఆ పదం తక్కిన వాక్యంతో పొసగుతుందో లేదో చూసుకోవడం ముఖ్యమని చెప్పాను. కఠిన పదాలకి సమానమైన పదాలు లభించాక, అప్పుడు ఆ అనువాదంలోని వ్యాకరణాంశాలు, నిర్మాణాంశాల్ని సరిచూసుకోవాలి. ఇంగ్లిషునుంచి తెలుగు చేసినప్పుడు పదజాలాన్ని అనువదించడమే అనువాదం కాదనీ, ఇంగ్లిషు వాక్యనిర్మాణం తెలుగు వాక్యనిర్మాణంగా మారడం చాలా ముఖ్యం అని చెప్పాను. ప్రతి భాషకీ ఒక కాకువు ఉంటుందనీ (దాన్ని వేణుగోపాల్ పలుకుబడి అన్నాడు) దాన్ని పట్టుకోవడం ముఖ్యమనీ చెప్పాను. ఆ చేసిన అనువాదాన్ని ఎవరికి వారు తమలో తాము చదువుకోవాలనీ, అప్పుడు ఆ వాక్యాలు ఎబ్బెట్టుగా లేకుండా తమ సొంత భాషలోనే మాట్లాడుకున్నట్టుగా ఉన్నాయో లేదో చూసుకోవడం మూడవ దశ. అందుకనే అనువాదం చేత్తో చేసేపని కాదు, చెవితో పని చేసే పని అని కూడా చెప్పాను. ఇక చివరగా, ఆ వాక్యాల్లో లేదా ఆ పదజాలంలో ఔనచిత్యాలు ఏవైనా కనిపిస్తే వాటిని పరిహరించడం నాలుగవ దశ.

ప్రతిరోజూ 45 నిమిషాల పాటు ఇటువంటి అభ్యాసం చెయ్యగలిగితే 90 రోజుల తర్వాత నేరుగా ఏదైనా పుస్తకం, ఒక గాంధీనో, టాగోర్ నో అనువదించడం మొదలుపెట్టవచ్చునని కూడా చెప్పాను.

నా తర్వాత మాట్లాడిన వక్తలు కూడా అనువాద ప్రక్రియ గురించి ఎన్నో మౌలికమైన ఆలోచనలు పంచుకున్నారు. మామూలుగా మనం అనువాదం మూలవిధేయంగా ఉండాలని చెప్తుంటాం. నిన్న ఎన్. వేణుగోపాల్ కూడా ఆ మాట చెప్తూ, అనువాదాలు లక్ష్య విధేయంగా కూడా ఉండాలని అన్నాడు. ఇది కొత్త భావన. నిజానికి లక్ష్యవిధేయమే కాకపోతే అనువాదాల అవసరమే లేదు. అలాగే ఆదిత్య తన ప్రసంగంలో అనువాదం అంటే ఒక రచనను తొందరతొందరగా పైపైన చదువుకుంటూ పోవడం కాదనీ, నెమ్మదిగానూ, లోతుగానూ, క్షుణ్ణంగానూ చదివితే తప్ప అనువాదం సాధ్యపడదనీ చెప్పాడు. అంటే deep reading అన్నమాట. అందుకనే అనువాదం మరొకరికోసం చేసే పని కన్నా ముందు ఏ పాఠకుడికి ఆ పాఠకుడు తన అవగాహనకోసం, తన పఠనానుభవం తనకి మరింత స్ఫూర్తిదాయకంగా ఉండటంకోసం చేసే పని అని కూడా చెప్పాడు.

సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. బాల భాస్కర్, ఇంగ్లిషు డిపార్ట్ మెంటు హెడ్ రమేష్ బాబు, అకడమిక్ కో ఆర్డినేటర్ మల్లికార్జున్, గొప్ప వక్త డా.కోయి కోటేశ్వర రావు, తెలుగు హెడ్ డా. నీరజ, కవి కృష్ణచంద్ర కీర్తి, హిష్టరీ లెక్చరర్ డా.దూసి శ్రీనివాసు, సంస్కృత విద్వాంసురాలు డా.రమానీలకంఠం వంటి వారిని కలుసుకోవడం నిన్న మాకు లభించిన అదనపు బహుమానం. సిటీ కాలేజి లెక్చరర్లే కాక నూజివీడునుండి మెదక్ దాకా కూడా మరెన్నో కళాశాలలనుంచి వచ్చిన లెక్చరర్లు కూడా కలిసారు. వారందరిలోనూ అనువాద ప్రక్రియ పట్ల గొప్ప ఉత్సాహం కనిపించడం గొప్ప సంతోషాన్నిచ్చింది.

2-3-2023

13 Replies to “అనువాదం ఒక కెరీర్ కూడా”

 1. చాలా ఆసక్తికరమైన ప్రక్రియ .ఆలిండియా రేడియోలో పని చేసినవారు అనువాదం చేసే తీరు ,వేగం నన్ను ఆశ్చర్యపరిచేది .
  ఒక భాష pulse పట్టుకోవడం అనువాదానికి చాలా ముఖ్యమైన స్కిల్ అనుకుంటాను .అప్పుడు కానీ భావాన్ని సరళంగా ఇంకో భాషలోకి తేలేము .వాక్యనిర్మాణం అప్పుడే సహజంగా ధ్వనిస్తుంది .
  అప్రస్తుతమేమో కానీ ,జోన్స్ ఏర్పడకముందు మాకు కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ,సిటీ కాలేజీలలో పని చేసే అవకాశం రావడం గొప్ప గౌరవం క్రింద భావించేవాళ్ళం.

 2. మంచి ఉపయుక్తమైన సమాచారం.. అందించారు.. సర్

 3. అనుకుంటాం గానీ, ఊహ తెలిసినప్పటి నుండే మనసులో అనువాద ప్రక్రియ మొదలవుతుంది. విన్నదీ కన్నదీ తెలిసిందీ మనసుభాషలోకి అనువదించబడుతుంది. ఇప్పుడు అనువాదమనేది ఒక భాషనుండా మరొక భాషకు అనే పరిమితార్థంలో వాడుకలో ఉన్నా,మనసుకెక్కిన భావం , మరల తనదైన శైలిలో అందంగా, ఆకర్షణీయంగా, వస్తుగతంగా , పునర్వ్యక్తీకరణమే అనువాదం అనిపిస్తూంది నాకు. వస్తువు చూస్తారు , బొమ్మ గీస్తారు. పని చూస్తారు, అనుకరిస్తారు. విస్తృతార్థంలో తెలిసింది తిరిగి చెప్పేదంతా అనువాదమే. ఎంత బాగా అవగాహనకు వస్తే, అంత బాగుంటుంది. ఎంత అనుభవం సంపాదిస్తే అంత వికసిస్తుంది.ఎంత భాషమీద పట్టు ఉంటే అంత పరిమళిస్తుంది. ఇవన్నీ మీకున్నాయి. మీ అనువాదసూచనలు అతి విశిష్టమైనవి.

 4. అనువాదం గురించి అవగాహన కలిగేలా రాశారు సర్! అనువాదంలో నాలుగైదు దశల గురించి మీ వివరణ బాగుంది.

 5. గుడ్ మార్నింగ్ sir ,i am 1st year MA english student,
  We have very glad to meet u in our college (PRINCIPAL GOVERNMENT CITY COLLEGE) sir,& the words /speech which we have heard by you on 01-03-2023 the 1 day of work shop is very useful and guideful to me ,& your life achievements gave us the confident that to never give up .In my point of view in u speech i understand that achieving one aim is not enough but trying to do something new one by one, and again & again is to be inspirational.
  Thanking you very much sir.🙏🙏💐

 6. ధన్యవాదములు సార్! మంచి సమాచారం… ✍️🙏🏻

 7. సమాచార, పౌర సంబంధాల శాఖ లో పని చేసే సిబ్బంది, అధికార్లకు అనువాద ప్రక్రియ లో ప్రవేశమైనా వుండి తీరాలి. ఆ దిశ గానే కొంత పరిశ్రమ చేశాను. కానీ యింకా మెలుకువలు నేర్చుకునే ప్రయత్నంలో నే వున్నాను. ఏమైనా ప్రత్యేక వ్యాసాలుగాని, ప్రచురణలు గాని నాకు తెలిపితే వుపకరిస్తాయి. మీ వ్యాసం నాకు కొన్ని కొత్త సమాచారం అందించింది. ధన్యవాదాలు!

Leave a Reply

%d bloggers like this: