ఒక చరిత్రకారుడి ప్రయాణం

ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారి అనుభవ కథనం నన్ను నడిపించిన చరిత్ర (2022) నాకు కిందటేడాదే పంపించారుగాని ఇన్నాళ్ళకు చదవగలిగాను.  చాలా విలువైన పుస్తకం అది. పూర్వపు నెల్లూరు జిల్లాలో పొతకమూరు అనే కుగ్రామంలో ఒక బీద అర్చక కుటుంబంలో పుట్టి, అంతర్జాతీయ స్థాయి చరిత్రకారుడిగా, సామాజిక విశ్లేషకుడిగా, విద్యావేత్తగా ఆయన ఎదిగిన క్రమం, 1938 నుండి ఇప్పటిదాకా ఆయన అనుభవకథనం ఒక చరిత్రకారుడి ప్రయాణంగా అభివర్ణించవచ్చు.

ప్రొ. రామకృష్ణ గారిని 95 లోనో 96 లోనో హైదరాబాదులో ఏదో సాహిత్య సభలో మొదటిసారి చూసాను. నిండైన విగ్రహం, సౌమ్య భాషణ, ప్రసన్నమందహాసం- ఆయన అప్పుడు సెంట్రల్ యూనివెర్సిటీలో పనిచేస్తున్నట్టున్నారు. ఆయన్ని వెళ్లి పలకరించాలనుకున్నానుగాని, ధైర్యం చాలలేదు. అంత పెద్ద ప్రొఫెసరుతో నేనేమి మాట్లాడగలన్న బెరుకు నన్ను ఆపేసింది.

2000 లో నేను మళ్ళా హైదరాబాదు వచ్చి గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో చేరాక ఒకరోజు ప్రొ. వకుళాభరణం లలిత గారు మా ఆఫీసుకి వచ్చారు. 2003-04 లో అనుకుంటాను. తాను డీనోటిఫైడ్ ట్రైబ్స్ మీదా, క్రిమినల్ ట్రైబ్స్ చట్టం కింద హింసకు గురైన ట్రైబ్స్ మీదా పరిశోధన చేసానని చెప్పారు. బ్రిటిష్ పాలనాకాలంలో అటువంటి ట్రైబ్స్ కోసం ఏర్పాటు చేసిన సెటిల్ మెంట్లకి వెళ్ళి ఆ ట్రైబ్స్ ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ సామాజిక స్థితిగతులమీద సమగ్రంగా ఒక అధ్యయనం చేసానని చెప్పారు. నేను కర్నూల్లో పనిచేసినప్పుడు అప్పటి జిల్లా కలెక్టరు కోరినందువల్ల సిద్ధాపురం సెటిల్ మెంటు మీద చిన్న స్టడీ చేసాను. ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలంలో లింగాల సెటిల్ మెంటు చాలాసార్లు సందర్శించాను. అప్పటికి స్టువర్ట్ పురం, బిట్రగుంట, కప్పట్రాళ్ళ తిప్ప వంటి సెటిల్ మెంట్ల గురించి వినడమే తప్ప చూడలేదు. కాని ఆమె ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఓపిగ్గా వాళ్ళమీద అధ్యయనం చేసానని చెప్పగానే నాకు ఆమె పట్ల గొప్ప గౌరవం కలిగింది.

ఆమె ఆచార్య జొన్నలగడ్డ అనూరాధగారితో కలిసి సెంట్రల్ యూనివెర్సిటీ విద్యార్థుల ద్వారా గిరిజన నృత్యాల మీద మోనోగ్రాఫులు రూపొందించారు. అప్పుడు మాకు ప్రేమ్ చంద్రా రెడ్డి డైరక్టరుగా ఉన్నారు. ఆ పుస్తకాల్ని గిరిజన సాంస్కృతిక సంస్థ తరఫున ప్రచురిద్దామని ప్రతిపాదిస్తే ఆయన అంగీకరించారు. ఫైలు మీద ఆర్డర్సు కూడా వేసారు. కాని అప్పట్లో ఆ సంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఆ పుస్తకాలు ప్రచురణకు వెళ్ళలేదు. అది మా దురదృష్టం.

ఆ రెండు పరిశోధనలూ చూసిన తరువాత ఆమె ఎప్పుడు ట్రైబల్ ఏరియా కి వెళ్తానని చెప్పినా నా పరిథిలో నేనేమి సహాయం చెయ్యగలనా అని ఆలోచించేవాణ్ణి. ఆమె ఆ వయసులో స్వచ్ఛందంగా తిరుగుతున్నన్ని గిరిజన ప్రాంతాలు మా శాఖలో ఉన్నతోద్యోగులం ఎవ్వరం కూడా తిరగట్లేదనిపించేది.

ఆమె నా గురించి చెప్పిన మంచి మాటల వల్ల నాకు ప్రొ. రామకృష్ణ గారి పరిచయం, స్నేహం (అంత పెద్ద మాట వాడవచ్చునో లేదో తెలీదు కాబట్టి ఆదరణ అంటాను) లభించాయి. వారు చాలాకాలం నేనుంటున్న నవోదయ కాలనీ దగ్గరలో ఉన్న అపార్ట్ మెంటులో ఉండేవారు. రోజూ తెల్లవారుజామునే ఆయనా, వారి కొలీగ్ ప్రొ. లక్ష్మీనారాయణా ఆ కాలనీలో మార్నింగ్ వాక్ కి వచ్చేవారు. వారిద్దరూ ఏదో ఒక గంభీర విషయం మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నంతసేపూ మా కాలనీ వీథులు ఏథెన్సు వీథుల్లాగా అనిపించేవి.

అలా ఏర్పడ్డ చనువుతో ఆయన్ని నా పుస్తకం ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు’ (2011) ఆవిష్కరణ సభకి అధ్యక్షులుగా ఉండమని అడిగాను. నా జీవితంలో నాకు లభించిన భాగ్యాల్లో ఆ రోజు ఆయన అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభ కూడా ఒకటి.

ప్రొ. లలితగారు ఈ లోకం నుంచి సెలవుతీసుకున్నాక ప్రొ. రామకృష్ణ గారు వాళ్ళబ్బాయితో కలిసి ఉండటానికి మాదాపూర్ వైపు వెళ్ళిపోవడం, నేను మధ్యలో విజయవాడలో ఉండవలసి రావడం వంటి కారణాల వల్ల రోజూ ఆయన్ని చూసే అవకాశం లేకపోయింది. కాని ఆయన మేలు తలపుల్లో నాక్కూడా చోటు ఉందని మాత్రం తెలుస్తూనే ఉంటుంది. లలిత గారు వెన్నెలకంటి రాఘవయ్యగారి పైన రాసిన పుస్తకాన్ని గుంటూరులో నాతో ఆవిష్కరింపచేయడానికి కారణం అదే అనుకుంటాను.

2

కాని ఈ పుస్తకం చదివాకనే ఆయన ఎంత పొడగరినో నాకు నిజంగా అర్థమయింది. కాలేజిలో, యూనివెర్సిటీలో చదువుకుంటున్నప్పుడు విశ్వనాథ, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి వారి సాన్నిహిత్యం, జె ఎన్ యు లో ప్రొ. సర్వేపల్లి గోపాల్, ప్రొ. బిపన్ చంద్ర, ప్రొ. రొమిలా థాపర్ వంటి వారి మార్గదర్శకత్వం, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ గా నిర్వహించిన బాధ్యతలు, ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ తరఫున చరిత్రయుగ ప్రారంభం నుండి నేటిదాకా ఆంధ్రుల చరిత్ర మీద వెలువరించిన ఎనిమిది బృహత్సంపుటాలు, వాటితో పాటు తెలుగు వారి చరిత్ర, సంస్కృతుల గురించిన ఆధారాల సూచికగా వెలువరించిన మరొక బృహత్సంపుటం ఆయన జీవితానుభవాలు ఎంత అమూల్యాలో చెప్తాయి. ఎనిమిదిన్నర దశాబ్దాలుగా తెలుగు నేల చరిత్రకు ఆయన ప్రత్యక్ష సాక్షి మాత్రమే కాదు, విశ్లేషకుడు కూడా. తెలుగు నేల మీద వామపక్ష ఉద్యమాలకీ, పోరాటాలకీ ఆయన పూర్తిగా సమకాలికుడు. కాబట్టే పురోగామి శక్తులతో కలిసి నడుస్తూ వచ్చాడు. కవులకీ, రచయితలకీ, విద్యార్థులకీ, సహోద్యోగులకీ నిజమైన స్నేహితుడిగా, గురువుగా, మార్గదర్శకుడిగా ఉంటూ వచ్చాడు.

ఈ అనుభవాలు చదువుతున్నంతసేపూ మన కళ్ళముందు ఒక చరిత్రకారుడికన్నా కూడా ఒక మానవతావాది ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఒక జిజ్ఞాసి. తపనశీలి. మరింత చదువుకోవాలనీ, మరింత తెలుసుకోవాలనీ, తన పరిజ్ఞానాన్నీ తన చుట్టూ ఉన్న సమాజానికి అందించాలనీ కోరుకున్న ఒక తపస్వి కనిపిస్తాడు.

తన 29 ఏళ్ల వయసులో ఆయన మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడి విశ్వవిద్యాలయాల్నీ, ఆ డిసిప్లిన్ నీ, ఆ విద్యాసంస్కృతినీ చూసినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు తనకై తాను ఒక ప్రవర్తనానియమావళిని నిర్ణయించుకున్నారట. అందులో ఆయన పెట్టుకున్న సూత్రాలు:

  • అధికారం, ఖ్యాతి- వీటికొరకు దేవుళ్ళాడవద్దు.
    • వీలున్నంత తక్కువగా మాట్లాడు.
    • ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
    • కష్టపడి పనిచేసుకో.
    • సహనం కోల్పోయి కోప్పడ వద్దు, ఎవర్ని గూర్చి కఠినంగా, తక్కువచేసి మాట్లాడవద్దు.

అప్పణ్ణుంచీ ఈ యాభై ఏళ్ళకు పైగా ఆయన ఈ పంచశీలను రాజీలేకుండా అనుష్ఠిస్తూ ఉన్నట్టే కనిపిస్తుంది. రామకృష్ణ గారితో నాకున్న కొద్ది పరిచయంలోనూ ఆయనలో నన్ను ఆకర్షించిన విషయాలు కూడా ఇవే అని ఇప్పుడు తెలుస్తోంది. బహుశా పుట్టుకతోనే ఆయనలో సౌమ్యత ఒక సంస్కారంగా ఉందనుకుంటాను. దాన్ని ఆయన నిలబెట్టుకోగలిగారు. అది ఆయనకు అపారమైన వినయాన్ని కూడా అలవరించింది. అందుకనే అంత మంది ప్రతిభావంతులతో, మేధావులతో, ప్రభావశీల వ్యక్తిత్వాలతో కలిసి నడిచిన తరువాత కూడా ఆయన నాలాంటి వాడిని కూడా అంతగా ఆదరించగలిగారనుకుంటాను.

నువ్వు ఒక మనిషితో మాట్లాడినప్పుడు నీ మాటలు, నీ ప్రవర్తన ఆ మనిషికి తన పట్ల తనకి గౌరవం, ప్రాముఖ్యత కలిగించే విధంగా ఉన్నాయనుకో, ఆ మనిషి నిన్ను చాలా గౌరవిస్తాడు, ప్రముఖంగా గుర్తుపెట్టుకుంటాడు. రామకృష్ణగారి స్వభావంలో ఈ లక్షణం ఉంది. ఆయన జీవితంలో అతి నిరుపేద స్థాయినుంచి పైకి రావడం వల్లా, తన పరిమితుల గురించి మొదటినుంచీ తనకి ఒక మెలకువ ఉన్నందువల్లా, తాను ఈ స్థాయికి రావడానికి ఎందరో అడుగడుగునా తనకు దారి చూపించినందువల్లా అనే స్పృహ వల్ల ఆ లక్షణం మరింత మెరుగుపడింది.

3

చరిత్ర కోసమో, లేదా తన సమకాలికంగా ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లో జరిగిన చారిత్రిక పరిణామాల్ని అర్థం చేసుకోవడానికో ఈ పుస్తకం చదవక్కర్లేదు. అదంతా ఆయన ఇప్పటికే ముందే చెప్పినట్టు ఎనిమిది బృహత్సంపుటాలుగా వెలువరించి ఉన్నారు. కాని అంత గణనీయమైన కృషి చెయ్యడానికి ఆయన్ని నడిపించిన శక్తులేమిటో తెలుసుకోడానికి మాత్రం ఈ పుస్తకం చదవాలి.

చరిత్ర అంటే శీలనిర్మాణం, చరిత అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ‘నన్ను నడిపించిన చరిత్ర ‘ అంటే హిస్టరీ అన్న అర్థం కన్నా కూడా తనలోని మానవీయ గుణాలూ, అవి తనని ఒక సాధారణ స్థాయి విద్యార్థినుంచి అత్యున్నతస్థాయి ఆచార్యుడిగా ఎలా తీర్చిదిద్దాయో వాటి గురించిన తలపోతగా ఈ పుస్తకం కనిపించింది నాకు.

డిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివెర్సిటీలో పరిశోధక విద్యార్థిగా తన అనుభవాల గురించి రాస్తూ రాసిన ఈ వాక్యాలు చూడండి:

నాకిదంతా ఒక learning process. అధ్యయన అంశాల్లో కొత్తదనం, ప్రయోగాత్మకంగా చరిత్ర రచన, పఠనం, వివరించే తీరుల్లో పూర్తి సంతృప్తి వుండేది. యూనివెర్సిటీ క్యాంపస్ లో ఎక్కడ చూసినా చర్చలు, రాత్రిపొద్దుపోయేదాకా, ‘జుగ్గీ’ల దగ్గర కూర్చొని టీలు, సిగరెట్లు తాగుతూ అదొక విద్యాకేంద్రం. ఒకే ఒక్క మినహాయింపు, తిండి సమస్య. దక్షిణాదినుండి వెళ్ళినవారికి అదే సమస్య. కొంతమంది తమిళ విద్యార్థులు నా దగ్గరకొచ్చి, సౌత్ ఇండియన్ మెస్ కోసం వార్డెన్ దగ్గరికి వెళ్ళాలన్నారు. నేను వద్దని వారించాను. కష్టమో, నష్టమో మనం సర్దుకుని, ఒక మెస్ లో వుండాలనీ, లేకుంటే ప్రాంతీయ తత్త్వం పెరగవచ్చుననీ, దేశానికంతకూ ఆదర్శవంతమైన విశ్వవిద్యాలయంలో వేర్వేరు కుంపట్లు పెట్టుకోవడం మంచిది కాదంటే వాళ్ళు అంగీకరించారు.

ఆయన వ్యక్తిత్వానికీ, ఆదర్శాలకీ ఇదొక మచ్చుతునక. తన సుఖంకన్నా ముందు జ్ఞానార్జన ముఖ్యం అనుకోవడం, తన బాగు చూసుకోవడం కన్నా విలువలకి కట్టుబడి ఉండటం ముఖ్యం అనుకోవడం ఆయన జీవితానుభవాలనుంచి మనం నేర్చుకోదగ్గ పాఠం.

విజయం సాధించిన ప్రతి పురుషుడి వెనకా ఒక స్త్రీ ఉంటుందనేది నానుడి. రామకృష్ణ గారి జీవితంలో ఆ నానుడి ఎంత నిజమో, తన సహచరి విజయం వెనక ఆయనున్నారనేది కూడా అంతే నిజం. లలితగారు ఉన్నతవిద్యావంతురాలు కావడానికీ, సమాజంలో అణగారిన సమూహాలు- గిరిజనులు, డి ఎన్ టిలు, జోగినులు మొదలైన వారికోసం అపారమైన కృషి చెయ్యడానికీ, పిల్లల్ని తీర్చిదిద్దుకోవడానికీ రామకృష్ణగారు ఎంత ప్రోత్సాహం ఇచ్చి ఉంటారో ఈ పుస్తకం చెప్పకనే చెప్తుంది.

రామకృష్ణ గారు ఎం.ఫిల్ చెయ్యాలనుకున్నప్పుడు వీరేశలింగం గారి సంస్కరణను పరిశోధనాంశంగా తీసుకున్నప్పుడు ప్రొ. సర్వేపల్లి గోపాల్ అన్నారట: ‘ఆయన జీవితకథ, సంస్కరణలు ఏకరువు పెట్టడం కాదు, Focus on how he purified public life of his times’ అని. ఆ మాటలు విన్నాక తన ఆలోచనల్లో విద్యుత్ వెలిగినట్టయిందని రామకృష్ణ గారు రాసుకున్నారు. ఈ పుస్తకం చదివాక నాకు అనిపించింది కూడా ఇదే: రామకృష్ణ గారు చదువుకున్న ప్రతిచోటా, పనిచేసిన ప్రతి చోటా తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని purify చేస్తూ వచ్చారనే.

తన అనుభవాలు, జ్ఞాపకాలూ రాయమని తన శ్రీమతి అడిగినందుకు తాను ఈ పుస్తకం ఈ రాస్తున్నానని రామకృష్ణగారు రాసుకున్నారు. లలిత గారు జీవించిఉండగా తన సహచరుడిలోని best బయటికి తీసుకురావాలని ఎంతగా తపించారో ఇప్పుడు భౌతికంగా లేకపోయినప్పుడు కూడా అంతే ప్రయత్నిస్తున్నారని ఈ పుస్తకం చదివితే స్ఫురిస్తుంది. వాళ్ళిద్దర్నీ కన్న తల్లిదండ్రులు ధన్యులు.

నన్ను నడిపించిన చరిత్ర, వకుళాభరణం రామకృష్ణ, ఎమెస్కో ప్రచురణ, వెల రు.150/- అన్ని ప్రధాన పుస్తక విక్రయకేంద్రాల్లోనూ లభిస్తుంది లేదా emescovija@gmail.com, sahithi.vija@gmail.com ను సంప్రదించవచ్చు.

1-3-2023

14 Replies to “ఒక చరిత్రకారుడి ప్రయాణం”

  1. ఎందరో మహానుభావులు .మహానుభావుల చరిత్రలే భావితరాలకు మార్గదర్శకాలు. అమెరికానుండి తిరిగి వస్తూ ఆచార్య వకుళాభరణం గారు ఏర్పరచుకున్న స్వయం నియంత్రణ నియమాలు ఆలోచనీయాలు. అవి ఒకరకంగా ‘కర్మణ్యేవాధికారస్తే …..’ శ్లోకార్థానుసరణమే.అంత గొప్ప వ్యక్తి గురించి మీరు పరిచయం చేసేదాకా అంతగా తెలియలేదండి ఆయనెంతటి నిశ్శబ్ద పథగామియో తెలుస్తున్నది.ఈ దంపతుల గురించి మీరు రాసింది చదివిన తరువాత హైమన్ డార్ఫ్ దంపతులు గుర్తుకు వచ్చారు.
    ప్రతి రోజూ సూర్యోదయం చూడకున్నా మీ కుటీరంనుండి ఉదయించే జ్ఞానార్కదర్శనం చైతన్యకారకం.ఆచార్య వకుళాభరణం వారికి నమోవాకములు.

  2. ఈ పుస్తకం చదివాను నేను. మీ అభిప్రాయాలన్నిటితో ఏకీభవిస్తాను.

  3. Sir వామపక్ష సిధ్ధాంతాన్ని నిష్పాక్షికంగా అర్థం చేసుకోవాలంటే ఏ పుస్తకం చదవాలి sir

  4. “వారిద్దరూ ఏదో ఒక గంభీర విషయం మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నంతసేపూ మా కాలనీ వీథులు ఏథెన్సు వీథుల్లాగా అనిపించేవి” వకుళాభరణం రామకృష్ణగారి చరిత్రా, సమాజాధ్యయన మూర్తిమత్వాన్ని కళ్ళకు కట్టించడానికి ఈ ఒక్క వాక్యమే చాలు. ఒక గొప్ప వ్యక్తికి, ఉత్తమదంపతులకు అన్నివిధాలా తగిన పరిచయోదాత్తవాక్యాలు మీవి. రామకృష్ణగారు నాకు కూడా పరిచితులు. నా పుస్తకం ఒకదాని ఆవిష్కరణకు వారు వచ్చి ప్రసంగించారు. ఎప్పుడు కనిపించినా ఆదరపూర్వకమైన అదే చిరునవ్వు, మనసులోతుల్ని పట్టి చూపే మాట పొదుపు…రామకృష్ణ గారు.

  5. ఆచరించిన ఆచార్యులు వారు. ఆదర్శ దంపతులు. 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  6. ఒక గొప్ప చరిత్రకారుడు పరిచయమయ్యాడు నాకు, మీ రివ్యూ చదివిన తర్వాత ….ధన్యవాదాలు .
    రావిళ్ల నాగయ్య ,
    విశ్రాంత బ్యాంక్ అధికారి,
    కర్నూలు.

  7. నువ్వు ఒక మనిషితో మాట్లాడినప్పుడు నీ మాటలు, నీ ప్రవర్తన ఆ మనిషికి తన పట్ల తనకి గౌరవం, ప్రాముఖ్యత కలిగించే విధంగా ఉన్నాయనుకో, ఆ మనిషి నిన్ను చాలా గౌరవిస్తాడు.nice words sir ..
    will try to follow .

Leave a Reply to కల్లూరి భాస్కరంCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading