గంగా ప్రవాహం

ఫేస్ బుక్ మాధ్యమం నాకు చాలామంది విద్వాంసుల్ని, రచయితల్ని, మంచి పాఠకుల్ని పరిచయం చేసింది. గత పది పన్నెండేళ్ళుగా ఈ మాధ్యమం ద్వారా పరిచయమైన భావుకులూ, ఆలోచనాపరులూ, బ్లాగర్లూ సామాన్యమైనవారు కారు. అంతదాకా ప్రింటు మీడియంలో కొద్దిమంది రచయితలకీ, వాళ్ళ పరిమిత పరిజ్ఞానాలకే పరిమితమై, కూపస్థ మండూకంలాగా ఉన్న నన్ను ఈ కొత్త ప్రపంచం ఎంతో మంది పండితులకి పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మిత్రులు నాకన్నా వైదుష్యంలో, పఠనానుభవంలో, సాహిత్య పరిజ్ఞానంలో ఎన్నో రెట్లు అధికులు. వారిలో కొందరు ఛందస్సులో, కొందరు సంస్కృత కావ్యాల్లో, కొందరు పాశ్చాత్య సాహిత్యంలో, కొందరు తత్త్వశాస్త్రంలో, కొందరు ఫిల్మ్ గీతాల్లో, కొందరు యాత్రానుభవాల్లో చూపించే పరిజ్ఞానం నన్ను నివ్వెరపరుస్తూ ఉంటుంది. అన్నిసార్లూ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకోలేను కాబట్టి ఇలా ఒక నమస్కారం సమర్పించుకుంటున్నాను.

అటువంటి విస్మయకారకమైన వ్యక్తిత్వాల్లో కల్యాణి నీలారంభంగారు ఒకరు. కొన్నేళ్ళ కిందట ఆకెళ్ళ రవిప్రకాశ్ ఆమె తన బంధువు అని చెప్తూ నా రచనలు ఆమెకి ఇష్టమనీ, నా పుస్తకాలు ఆమె చదవనివి ఉంటే ఇమ్మనీ అడిగాడు. అప్పటికే ఆమె ఫేస్ బుక్ లో నా మిత్రురాలిగా ఉన్నారు.

కాని ఈ మధ్య ఆమె విజయవాడ వచ్చినతరువాత, ఆమె, వసుధారాణి, మా అక్కా ఒక చిన్న సాహిత్యబృందంగా కూడుకున్నాక ఆమె ఆలోచనల్నీ, అభిప్రాయాల్నీ మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించింది నాకు. ఇక, మొన్న విజయవాడ నుండి వస్తూ ఉండగా ఆమె అనువాదం చేసిన ‘మాధవి ‘నవల మా అక్క నుంచి తీసుకుని చదివాక ఆమె పట్ల గౌరవం నాకు రెట్టింపైంది.

అనుపమ నిరంజన అనే ఒక కన్నడ రచయిత్రి నలభయ్యేళ్ళ కిందట రాసిన నవల అది. దాన్ని కల్యాణి గారు తెలుగులోకి తెచ్చి కూడా నలభయ్యేళ్ళు దాటింది. కాని పాఠక స్మృతి చాలా చిత్రమైంది. ఒకసారి తనని మురిపింపచేసిన రచనను పాఠకలోకం ఎప్పటికీ మర్చిపోదు అనడానికి ఈ పుస్తకమే ఒక ఉదాహరణ. 1978 లో అనువాదం చేసిన ఆ పుస్తకం అనల్ప ప్రచురణగా 2022 లో మళ్ళా పాఠకుల ముందుకొచ్చింది.

మాధవి మహాభారతంలో ఉద్యోగపర్వంలోని ఒక కథ. అది నారదుడు దుర్యోధనుడికి చెప్పిన కథ. చిత్రమైన కథ. కాని ఆ కథ ఇరవయ్యవశతాబ్ది భారతీయ రచయితలు చాలమందిని ఆకర్షిస్తూనే ఉంది. తెలుగులో తల్లావఝ్ఝుల పతంజలి శాస్త్రి ఆ కథని నాటకంగా కూడా రాసారు.

స్థూలంగా ఆ కథ ఇది: గాలవుడు విశ్వామిత్రుడి శిష్యుడు. గురుదక్షిణగా తాను ఏమివ్వాలో చెప్పమని పట్టుపడతాడు. ఆ మొండిపట్టు చూసి విశ్వామిత్రుడికి ఆగ్రహం వస్తుంది. అతడికి బుద్ధి చెప్పాలనుకుని మొత్తం తెల్లగా ఉండి, చెవులు మాత్రం ఒకవైపు నల్లగా ఉండే ఎనిమిదివందల గుర్రాలు తనకు కానుకగా ఇమ్మంటాడు. గాలవుడు గరుత్మంతుణ్ణి సలహా అడుగుతాడు. అతడు ఎవరేనా రాజుని యాచించమంటాడు. గాలవుడు యయాతి దగ్గరకు వెళ్తాడు. యయాతి తన దగ్గర ఆ గుర్రాలుగానీ లేదా ఆ గుర్రాల్ని కొనడానికి డబ్బుగానీ లేదని చెప్పి, అందుకు బదులుగా తన కూతురిని ఇస్తాననీ ఆమెను ఎవరేనా రాజుకు సమర్పించి శుల్కంగా గుర్రాలుగానీ గుర్రాలు కొనుక్కునే సొమ్ముగానీ సంపాదించుకోమని చెప్తాడు. గాలవుడు ఆ రాకుమార్తెను తీసుకుని ఒకరివెనక ఒకరు ముగ్గురు రాజుల్ని కలుస్తాడు. ఆ ముగ్గురూ ఒక్కొక్కరూ ఒక ఏడాది పాటు ఆమెతో గడిపి ఒక్కొక్కరూ ఒక్కొక్క పుత్రుడి చొప్పున కన్నాక ఆమెను తిరిగి గాలవుడికి అప్పగిస్తారు. వారు ఒక్కొక్కరూ రెండు వందల గుర్రాల చొప్పున మొత్తం ఆరువందల గుర్రాలు గాలవుడికి సమర్పిస్తారు. ఇక మిగిలిన రెండు వందల గుర్రాలూ దొరికే ఆశ లేకపోవడంతో గాలవుడు ఆమెను విశ్వామిత్రుడి దగ్గరకే తీసుకువెళ్ళి ఆమెని అతడికే సమర్పిస్తాడు. విశ్వామిత్రుడు ఆమెని చూసి మోహించి ఈమెను ముందే నా దగ్గరికి తెచ్చి ఉంటే నాలుగేళ్ళు ఈమెతో గడిపి నలుగురు పిల్లల్ని కని ఉండేవాణ్ణి కదా అంటాడు. విశ్వామిత్రుడు కూడా ఆమెతో ఒక పుత్రుణ్ణి కన్నాక గాలవుడు ఆమెను తిరిగి యయాతికే అప్పగిస్తాడు. యయాతి ఆమెకు స్వయంవరం ప్రకటిస్తాడు. కాని మాధవి ఆ స్వయంవరాన్ని నిరాకరించి అడవికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె జింకగా ఆ అడవిలోనే జీవించేది అని మహాభారతం చెప్తుంది.

ఈ కథలో ఒక స్త్రీ కన్నా గుర్రాలు ఎక్కువ విలువైనవి కావడం, ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా వరసగా ముగ్గురు రాజులూ, ఒక ఋషీ ఆమెతో సంసారం చెయ్యడం, ప్రతి సారీ ఆమె ఒక పుత్రుణ్ణి కన్నా కూడా ఆ బిడ్డను తనతో తెచ్చుకునే అవకాశం, అధికారం లేకపోవడం లాంటి అంశాలు సహజంగానే ఆధునిక పాఠకుల్ని కలవరపరుస్తాయి. ఆ కథ విన్నప్పుడు ఆగ్రహం రావడం సహజం. సరిగ్గా ఆ ఆగ్రహంతోనూ, ఒక శిష్యుడు తన గురుదక్షిణ తీర్చడంకోసం ఒక నిరపరాధి అయిన స్త్రీ అంగడిసరుకులాగా రాజునుంచి రాజునుంచి చేతులు మార్చడం పట్ల ఆవేదనతోనూ అనుపమ ఈ నవల రాసారు. ఆమె తన ఆవేదనతో పాఠకులు మమేకం చెందేలాగా తన కథనం నడిపారు.

అయితే ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ రచయిత్రి చెప్పిన కథ ఎంత ఆకర్షించిందో, కల్యాణి గారి అనువాదం కూడా అంతే ఆకర్షించింది. కన్నడ నవలల అనువాదాలు నేను గతంలో కొన్ని చదవకపోలేదు. కాని ఆ అనువాదాల్లో కనిపించే కృతకత్వం ఈ అనువాదంలో ఎక్కడా కనిపించలేదు. నేరుగా తెలుగు నవలనే చదువుతున్నట్టే అనిపించింది.

ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:


రాజు తన చెయ్యి పట్టుకుని నడిపించుకుని వెడుతున్నాడు. ఇతన్ని తాను ప్రేమిస్తోందా అనుకుంది మాధవి. మరుక్షణమే ప్రేమంటే ఏమిటి? అన్న ప్రశ్న వచ్చింది. కష్టసుఖాల్లో ఒకటై వుండటం, ఒకరికోసం ఒకరు త్యాగం చేయటం, తాను ప్రేమించే వ్యక్తి బాగునే కోరుకోవటం, ఒకే ఆశ, ఆకాంక్షలను కలిగి ఉండటం, తమ ప్రేమకు గుర్తుగా ఒక మొలకను పెంచటం. అంటే తాము చనిపోయినా తమ ప్రేమ నాశనం కాకుండా ముందుకు సాగే చిహ్నాలు పెట్టడం..

అక్కడ చూడు మాధవీ..

రెండు కొండల మధ్యనలోతైనలోయ

మాధవి ఉలిక్కిపడింది. తామిద్దరి మధ్యా అలాంటిదే అగాధం వుంది. తామిద్దరి మధ్యా కామం తప్ప మరే సమానధర్మాలు లేవు. అందువల్లే ఇది తెగిపోయే బంధం.

నీళ్ళు హోరుమని దుముకుతున్న శబ్దం దగ్గరపడింది. ఓ మలుపు తిరగగానే తెల్లటినురగ చిమ్ముతూ కన్నుల పండువగా కిందకు ధారగా పడుతున్న జలపాతం కనిపించింది.

అలాంటి మనఃస్థితిలో కూడా మాధవికి ఆ అందాన్ని చూసినప్పుడు ఆనందం కలిగింది. ( పే.149)


ఉదయం హోమం పూర్తయ్యాక అరటిపండ్లు, పాలు ఉపహారం. ఆ తర్వాత అధ్యయన కాలంలో శిష్యులు వేదమంత్రాలను ఉచ్చైస్వరంలో వల్లించనారంభించారు. ఇంకొక గదిలో మరో గుంపు విద్యార్థులు పదక్రమాలతో కూడిన ఋక్కులను పట్థించసాగారు. మరో చోట సుశ్రావ్యమయిన సామగానం, అధర్వవేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదాల పదక్రమ యుక్త సమ్హితను పారాయణం చేస్తున్నారు.

ఆశ్రమ జీవనం మాధవి ఇంతవరకూ చూసినదానికి భిన్నమయిన వాతావరణం. ఇక్కడ శాంతి వుంది. రాజభవనానికుండే గోడలు లేని ఈ ప్రపంచం విముక్తమయినట్టుంది. అంతా బాగుంది. కానీ ఈ విశ్వామిత్రుడొక్కడు లేకపోతే ఎంత బాగుండేది అనుకుంది. అతడు లేకపోతే తానే ఆశ్రమంలో హోమం, యజ్ఞాలు చేయవచ్చా? ఆడదానికి ఆ అధికారం వుందా? ( పే.183)


ఆకాశాన్ని నల్లటి మబ్బులు ఆవరించాయి. మొగలిపూల వాసనతో వీస్తున్న గాలి. నల్లటిమబ్బుల మధ్య బంగారు కొరడాలా మెరిసే మెరుపు. ఆకాశమంతా గుడగుడలాడే ఉరుము. దాని వెనకాలే కురిసిన పెద్ద వాన. వాన తాకిడికి ఆశ్రమం ఆవరణలో నిల్చిన నీరు. బయటికి పోకుండా లోపలే వుండిపోయిన గోవుల అరుపులు. అగ్నిశాలలో ఓ చోటమాత్రమే నిప్పు. మిగిలిన చోటంతా వణికించే చలి.

వాన నిల్చాక మాధవి ఆవరణ అంచుకి వెళ్ళి నిల్చుంది. సరస్వతీ నది వానకి పొంగిపొరలుతోంది. నదీతీరంలో కామోద్రేకంతో ఒకదాన్నొకటి వదలకుండా కూర్చున్నది చక్రవాక మిథునం. నది ఆవలి వైపు కొండలు ముత్యాలతో గుచ్చినట్టున్నాయి. కొండదిగి వచ్చే నీరు గైరికాది ధాతువులతో ఎర్రబడింది. చెట్లనుండి రాలిన సర్జ కదంబాది పుష్పాలతో తెలుపై కొత్త నీటితో కలిసి వేగంగా పారుతోంది. ప్రవాహఘోషలో కలసి వినిపిస్తోంది నెమళ్ళ కేక. మేఘాలపై మోహంతో పైకెగిరే కొంగలబారు అత్యంత మనోహరంగా వుంది.

మాధవి మనస్సు పులకరించింది. అడవి వైపు తిరిగి చూస్తే అక్కడ కదంబ వృక్షాల్లో సమృద్ధిగా వున్న పుష్పాల్లోని మకరందానికై వచ్చిన తుమ్మెదలు వానతాకిడికి తట్టుకోలేక కొమ్మల మధ్య దాక్కున్నాయి. పచ్చటి గడిమీద ముత్యాల్లా పడినాయి ఇంద్రగోపాలనే వానపురుగులు. నేరేడు చెట్ల కొమ్మలనిండా నల్లటి పళ్ళు. విచిత్రమైన రెక్కలున్న చాతకపక్షులు ఆకుల మీద పడ్డ వానచినుకుల్ని అతివేగంతో తాగేస్తున్నాయి.

ఎంత చూసినా తనివి తీరని దృశ్యం.( పే.191)


గంగా ప్రవాహంలాగా సరళంగా ఉండటం మంచి అనువాదం లక్షణం. కల్యాణి గారి ఈ అనువాదం చూసాక ఆమె మరిన్ని రచనలు కన్నడం నుంచీ, ఇంగ్లిషు నుంచీ తెలుగు చేయాలని కోరుకోవడం అత్యాశ అవుతుందా?

Featured image courtesy: https://navbharattimes.indiatimes.com/

27-2-2023

17 Replies to “గంగా ప్రవాహం”

 1. “ మరుక్షణమే ప్రేమంటే ఏమిటి? అన్న ప్రశ్న వచ్చింది. కష్టసుఖాల్లో ఒకటై వుండటం, ఒకరికోసం ఒకరు త్యాగం చేయటం, తాను ప్రేమించే వ్యక్తి బాగునే కోరుకోవటం, ఒకే ఆశ, ఆకాంక్షలను కలిగి ఉండటం, తమ ప్రేమకు గుర్తుగా ఒక మొలకను పెంచటం. అంటే తాము చనిపోయినా తమ ప్రేమ నాశనం కాకుండా ముందుకు సాగే చిహ్నాలు పెట్టడం..”

  నిజానికిది ‘ప్రేమా? వ్యామోహమా’ అంటూ ఆధునికులు వెదజల్లుతున్న ప్రశ్నల పరంపరకు సరైన సమాధానమేమో?

 2. ధన్యవాదాలు సర్ ,మీ కంటపడడం ,మీ చేత ఇన్ని మాటలు చెప్పించడమే మాధవి అదృష్టం .నాకు మాధవి అనువదిస్తున్నప్పుడు కలిగిన దుఃఖం ,ఆనందం మరెప్పుడూ కలగలేదు.

 3. అనువాద శకలాలే అనుపమానంగా ఉన్నాయంటే
  కల్యాణి నీలారంభం గారు అనువదించిన పూర్తి నవల చదివితే ఇంకెంత కావ్యానందం లభిస్తుందో
  తెలుస్తున్నది.
  భారతం లో మాధవి ఉపాఖ్యానం గురించి నా మట్టుకు నాకిప్పుడే తెలిసింది.ఒక అనూహ్య వస్తువు కథాంశంగా ఎన్నుకుని నవలీకరించిన కన్నడ రచయిత్రి అనుపమ గారికి , ఇరు భాషల్లో సమాన సాధికారంతో అనువదించిన కల్యాణి వీలారంభం గారికి వారిరువురిని పరిచయించిన
  మీకు అభినందన శతములు.
  కాశీకి వెళ్లి నపుడు ఏదో ఓ ఘట్టంలో నిలబడి ఆ నిర్మల గంగా ప్రవాహాన్ని చూసి తనిసిపోయాను.
  శివార్చనలో గంగా తరంగ కమనీయ జటాకలాపం అన్నప్పుడు నా కళ్లముందు కాశీతీర గంగాప్రవాహ
  భాగమే కనిపించినా మిగతా గంగా నది ఊహ్యమన్నట్లు,మీరు ఉట్టంకించిన రెండు పేరాగ్రాఫులే మిగతా నవలా శేషాన్ని ఊహా సాదృశ్యం చేస్తున్నాయి.

  సాహిత్యార్ణవమున ఎ
  న్నెన్ని రత్న మాలికలో
  ఈదులాడి వెలికితీయు
  ఘన రచయితలెందరో

  మాతృఋణం పితాృణం
  ఋషిఋణాల తోడుగా
  సాహిత్య ఋణం కూడా
  అనుపమానమైనదెగా

 4. “అంతా బాగుంది.కానీ ఈ విశ్వామిత్రుడొక్కడు లేకుంటే మరింత బాగుండేది”. ఆడవాళ్ళు హోమం చేయవచ్చునా!!?

  స్త్రీ హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు అనుపమ గారు.
  శ్రీమతి కల్యాణి నీలరంభం గారి అనువాదం చాలా సరళంగా ఉంది.
  మీరన్నట్టు కథ చదువుతూ ఉన్నప్పుడు
  ఇవేమి గుర్రాలు బాబూ!
  యాచించడానికి వచ్చిన శిష్యునికి యయాతి తన కూతురును దానంగా ఇవ్వడమే పెద్ద విపరీతం.

  అయినా ఏ కాలానికా ధర్మం!
  ఈ కాలం లో ఉండి సతీ సావిత్రి కాలపు ధర్మం ఊహించుకుంటే కుదిరేది కాదు.

  ఒక పుస్తకం మీ చేతుల్లోకి రావాలంటే ఆ పుస్తకం
  అదృష్టం చేసుకోవాలి.
  ధన్యవాదాలు sir.

 5. మహాభారతంలో ఆసక్తికరమైన కథ ఇది. విలక్షణంగా కనిపించే ఇలాంటి కథలు మహాభారతంలో చాలానే ఉన్నాయి. కల్యాణి నీలారంభం గారి అనువాదం తప్పక చదవాలనిపించింది ఈ పరిచయం చూశాక.

   1. థాంక్స్ వీరభద్రుడు గారూ…అలాగే.

 6. మీ విశ్లేషణ చదివాక ఎప్పుడు చదువుతానా అని ఉంది.ఓ స్త్రీ హృదయావిష్కరణ అద్భుతం.

Leave a Reply

%d bloggers like this: