వ్యవస్థా వికాసం కూడా అత్యవసరం

తెలుగులో కొద్దిపాటి సాహిత్యం అది కూడా కథ, నవల, కవిత్వం రూపంలో వస్తున్నది, నిజమే, కాని అంతకు మించి తెలుగుభాషలో మనం చెప్పుకోదగ్గ, చదవదగ్గ, గర్వించదగ్గ రచనలేమయినా వస్తున్నాయా? లేదా ఇదే ప్రశ్న మరోలా అడుగుతాను. తెలుగులో సాహిత్యం కాక మరే రచననైనా ఇతర భాషల్లోకి, కనీసం ఇంగ్లిషులోకి అనువదించాలని ఎవరేనా ఉత్సాహపడుతున్నారా? ఏదేనా జీవితచరిత్ర లేదా ఆత్మకథ, ఉదాహరణకి, కలాం లాంటి రచయిత ఎవరేనా తెలుగులో ఉన్నారా?

ఎంత ఆలోచించి చూసినా పొలిటికల్ గాసిప్, సినిమా గాసిప్ తప్ప తెలుగులో సాహిత్యేతరమైన వాజ్ఞ్మయం ఏమీ కనిపించడం లేదు. మన పత్రికలన్నీ పొలిటికల్ గాసిప్ తోనూ, మన టెలివిజన్ ఛానెళ్ళు సినిమా గాసిప్ తోనూ నిండిపోయాయి. ఒకటీ అరా ఏవైనా యూట్యూబ్ ఛానెళ్ళు ఉన్నా వాటిలో కూడా సినిమా కబుర్లే ఉంటాయి.

చూడండి. పదకొండు కోట్ల మంది మాట్లాడే భాష. ప్రపంచంలోని సుమారు ఆరువేల భాషల్లో పదిహేనో స్థానంలో ఉన్న భాష. భారతదేశంలో మూడవ అతి పెద్ద భాష. దక్షిణ భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద భాష. రెండు వేల చరిత్ర ఉన్న భాష. ఈ భాషమాట్లాడేవాళ్ళు ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, మల్టీ నేషనల్ కంపెనీల నిర్వహణలో, వైద్యంలో, సర్జరీలో, క్రీడల్లో, ఒకటి కాదు, ఎన్నో రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. కానీ వారెవరూ తమ భావాలు, అనుభవాలూ, ఆలోచనలూ తెలుగులో ఎందుకని పంచుకోరు? ఈ మధ్యకాలంలో రెండు మూడు పుస్తకాలు- ‘వీరయ్య’, ‘ఒదిగిన కాలం’, ‘జగమునేలిన తెలుగు’ వంటివి తప్ప, ఖండాతరాలకు పయనించిన తెలుగువారి అనుభవాలు నాకు తెలిసి చెప్పుకోదగ్గ పుస్తకాలేవీ రానేలేదు.

అన్నిటికన్నా ముఖ్యం, వ్యవస్థా నిర్వహణ, ఆత్మవికాసం, ప్రభావశీల వ్యక్తిత్వనిర్మాణం లాంటి విషయాల్లో తెలుగువాళ్ళ అనుభవాలు ఎలాంటివి? ఆయా రంగాల్లో ఉన్నతస్థానాలకు చేరుకున్నవారు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు? వాటినెలా దాటగలిగారు? వాళ్ళ అనుభవాల నుంచి యువతరం నేర్చుకోవలసింది ఏమైనా ఉందా? ఉంటే ఏ విషయాల్లో?

వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి తెలుగులో రాస్తున్నవారూ, మాటాడుతున్నవారూ లేకపోలేదు. కాని అవి చాలా ప్రాథమిక స్థాయి రచనలు. పదవ తరగతి పరీక్షలు రాయడం ఎలా లాంటి ప్రశ్నలదగ్గరే ఆగిపోయిన రచనలు. అలాగని అవి ముఖ్యం కావని కాదు. చాలా ముఖ్యం. ఉపాధ్యాయులూ, రచయితలూ మాట్లాడని విషయాలు కనీసం ఈ రచయితలైనా మాట్లాడుతున్నారు. కాని మీరు చెప్పినట్టే ఆ పిల్లవాడు లేదా ఆ బాలిక పదవతరగతి పరీక్షలు బాగా రాసి ఇంటర్మీడియేటులో ఆ తర్వాత ఇంజనీరింగులో, మెడిసిన్ లో చేరారనుకుందాం. ఆ తర్వాత ఉద్యోగంలో చేరారు. ఒక టీమ్ లీడర్ గానో లేదా ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మెడికల్ ఆఫీసరుగానో చేరారు. అప్పుడు తమ బృందంతో ఎలా పనిచేయించుకోవాలి? తమ సంస్థని ఎలా నిర్వహించుకోవాలి? తాము ఉన్న స్థితి నుంచి మరింత ఉన్నతస్థితికి చేరాలంటే ఏమి చెయ్యాలి? ఈ అంశాల మీద వాళ్లకి దారి చూపించగల రచనలు చేసారా?

Jocelyn Davis రాసిన The Art of Quiet Influence (నికొలస్ బ్రియలే, 2022) చదువుతున్నంతసేపూ ఈ ప్రశ్నలే నన్ను చుట్టుముట్టాయి. సంస్థానిర్వహణ అనగానే మనం అదేదో మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే సి.ఇ.ఓ లకు సంబంధించిన విషయం అనుకుంటాం. కాని పీటర్ డ్రక్కర్, పీటర్ సెంజె లాంటి వ్యవస్థానిర్వహణ నిపుణులు రాసిన రచనలు చదువుతుంటే ఆ సూత్రాలు మన చుట్టూ ఉండే ప్రతి సంస్థకీ పనికొచ్చే సూత్రాలే అనిపిస్తాయి. ఒక పాఠశాల, ఒక అంగన్ వాడీ కేంద్రం, ఒక వ్యవసాయ క్షేత్రం, ఒక నాటకబృందం, చివరికి ఒక సినిమా యూనిట్ కి కూడా ఆ సూత్రాలు వర్తిస్తాయి. చేస్తున్న పనిని మరింత ఉత్పాదకంగా ఎలా తీర్చిదిద్దుకోవడం, సంస్థల్లో ఎదురయ్యే మానవసంఘర్షణల్ని ఎలా నిభాయించుకోవడం, చుట్టూ ఉన్న సమాజం మీద మరింత ప్రభావాన్ని ఎలా నెరపడం అనే లక్ష్యాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ ఆ పుస్తకాలు చేయగల మేలు అంతా ఇంతా కాదు.

ఆశ్చర్యమేమిటంటే చాలాసార్లు ఆ వ్యవస్థానిర్వహణ నిపుణులు తమకి స్ఫూర్తినిచ్చే రచనల కోసం తూర్పు దేశాల వైపు చూస్తూ ఉండటం. కన్ ఫ్యూసియస్, ఆర్ట్ ఆఫ్ వార్, డావో డెజింగ్, భగవద్గీత, యోగసూత్రాలు వంటి పుస్తకాలనుంచి వాళ్ళు గ్రహించే స్ఫూర్తి, దాన్ని ఆచరణలోకి తేవడానికి అందించే సూత్రాలు మనల్ని నివ్వెరపరుస్తాయి.

ఉదాహరణకి లెవెల్-5 లీడర్ షిప్ గురించి చెప్తూ వ్యవస్థా నిర్వహణ నిపుణులు ఏమంటారంటే, అటువంటి నాయకులు వ్యవస్థల్ని నిర్మించిన తరువాత వాళ్ళు భౌతికంగా దూరమైనా కూడా ఆ వ్యవస్థలు చెక్కుచెదరకుండా పనిచేసేట్టు చూసుకుంటారు అని. నెల్సన్ మండేలా అటువంటి నాయకుడని చెప్తారు. జోసెలిన్ డేవిస్ ఈ పుస్తకం మొదటిపేజీలోనే లావోత్సే వాక్యమొకటి కోట్ చేసింది. ఆయన ఇలా అన్నాడట:

Of the best leader, when his work is done, the people all say: ‘We did it ourselves’

ఎన్నో ఉద్ర్గంథాలు చెప్పలేని విషయాన్ని ఒక్కవాక్యంలో చెప్పాడు లావోత్సే. ఎంత కనువిప్పు కలిగించే వాక్యం ఇది. ఈ మాట చదవగానే నాకు గాంధీ గుర్తొచ్చాడంటే ఆశ్చర్యం ఏముంది?

వ్యవస్థల్ని నిర్మించేవాళ్లు, నడిపేవాళ్ళూ నిశ్శబ్దంగా తమ ప్రభావశీలత్వాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో జోసిలిన్ డేవిస్ ఈ పుస్తకంలో వివరించింది. కాని అది కాదు, ఇందులో విశేషం. ఇందుకోసం ఆమె పన్నెండు మంది తూర్పుదేశాల ఋషుల్నీ, జ్ఞానుల్నీ, నేతల్నీ ఉదాహరణగా ఎంచుకుంది. వారి రచనల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆచరణాత్మకమైన కొన్ని సూత్రాల్ని, ఇప్పటి భాషలో చెప్పాలంటే, కొన్ని tips మన చేతుల్లో పెట్టింది.

మూడు భాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో మొదటి భాగం వ్యవస్థల్ని నడిపేవాళ్ళు ఆ వ్యవస్థానిర్వహణలో ఎలా పాలుపంచుకోవాలో చెప్పే భాగం. అందులో ఆమె కన్ ఫ్యూసియస్, యోగ వాశిష్టం, జువాంగ్ జి, రూమీల నుంచి ఆచరణాత్మక సూత్రాల్ని సంగ్రహించి మనతో పంచుకుంది. రెండో భాగంలో, వ్యవస్థానిర్వహణ శక్తి ఎక్కణ్ణుంచి వస్తుందో చెప్తూ, మహాభారతంలోని సావిత్రి ఉపాఖ్యానం, ప్రాచీన చీనా చరిత్రకారుడు సీమా కియాన్, గెంజి గాథ నవలా రచయిత్రి మురసకి షికిబు లతో పాటు మహాత్మాగాంధినుంచి కొంత వెలుగు సంగ్రహించి మనకు పంచుతున్నది. మూడవభాగంలో, వ్యవస్థానిర్వహణలో పురోగతి సాధించడానికి అవసరమైన మెలకువల్ని బుద్ధుడు, మెన్షియస్, జెన్ సాధువు డొజెన్, ఇస్లామిక్ తత్త్వవేత్త ఇబన్ తుఫాయిల్ ల రచనలనుంచి సేకరించింది.

ఈ పన్నెండు అధ్యాయాలూ చదవడం గొప్ప స్ఫూర్తిదాయకమైన అనుభవం. ఈ సూత్రాలు మనం అమలు చెయ్యడానికి పెద్ద పెద్ద కార్యాలయాలూ, సంస్థలూ, ఉద్యమాలూ అవసరం లేదు. మన కుటుంబం లేదా మన అపార్ట్ మెంట్ సొసైటీ, లేదా మన చిన్ననాటి మిత్రుల వాట్సప్ గ్రూప్- వీటిని కూడా మనం ఈ సూత్రాలతో తీర్చిదిద్దుకోవచ్చు. గ్రామాల్లో మహిళలు నడుపుకునే పొదుపుసంఘం, ఒక ఉన్నత పాఠశాల, లేదా ఒక సహకార సంఘం లేదా ఒక గ్రామ పంచాయితీ, ఒక మండల ప్రజాపరిషత్తు- వీటిని నిర్వహించే బాధ్యులకి ఇటువంటి వ్యవస్థానిర్వహణ జ్ఞానం తెలుగులో అందుబాటులోకి వస్తే ఆ సంస్థలు మరింత బాగా పనిచెయ్యగలుగుతాయి.

నేను నా ఉద్యోగ జీవితంలో చూసిందేమిటంటే మనుషులు సాధారణంగా తమ ఉద్యోగ క్షేత్రాన్ని ఏదో మొక్కుబడిగా గడిపే చోటుగానూ, దానికి అవతల ఉన్న తమ తీరిక వేళలుమాత్రమే తమ నిజమైన జీవితంగానూ భావిస్తూ ఉండటం. శ్రమలో పరాయీకరణ వల్ల, ప్రభుత్వాల ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే కాదు, అసలు ప్రాయికంగా, మనుషులు తమ పనినీ, తమ కార్యక్షేత్రాన్నీ గౌరవించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంటున్నదని నా అభిప్రాయం.

మనం ఏ కర్మ క్షేత్రంలో ఉన్నా, ఏ వ్యవస్థని నిర్వహిస్తున్నా, దాన్ని మరింత ఫలప్రదంగా, శుభప్రదంగా నడుపు కోవడమెలానో విస్తారంగా పుస్తకాలు, అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకపోతే మన పనివేళలూ, తీరికవేళలూ కూడా పొలిటికల్ గాసిప్ లోనూ, సినిమా గాసిప్ లోనూ గడిచిపోక తప్పదు.

ఈ పుస్తకంలో రచయిత్రి ఒక మల్టీనేషనల్ కంపెనీ సి.ఇ.ఓ కాదు. ఆమె పనిచేసిన సంస్థలో ఆమె ఒక మిడిల్ లెవెల్ మానేజరు. నేను కూడా చాలా ఏళ్ళు మిడిల్ లెవెల్ మానేజరుగా పనిచేసినవాణ్ణే. వ్యవస్థల్ని తీర్చిదిద్దడంలో మిడిల్ లెవెల్ మానేజర్లు అంతిమ నిర్ణాయిక స్థానంలో ఉండరు, నిజమే, కాని ఒక నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయం విజయం పొందుతుందా, విఫలమవుతుందా అన్నది మిడిల్ లెవెల్ మానేజర్ల చేతుల్లోనే చాలావరకూ ఉంటుంది. అందుకనే ప్రభుత్వాలు శిక్షణ కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున నిధులు కర్చుపెడుతుంటాయి. విదేశీ సాయంతో ఏ పథకం మంజూరు అయినా అందులో ఉద్యోగ శిక్షణమీద తప్పకుండా కర్చుపెట్టాలనే షరతులు ఉంటాయి. కాని పరిశోధనలు చెప్పేదేమిటంటే దాదాపుగా 80% శిక్షణాకార్యక్రమాలు నిరుపయోగమనే. ఎందుకని?

ఎందుకంటే, ఆ శిక్షణా కార్యక్రమాల్ని రూపొందించేవారూ, ఆ ట్రైనింగు మాడ్యూళ్ళూ, ఆ శిక్షణ చాలా పేలవంగా, వాస్తవదూరంగా, అన్నిటికన్నా ముఖ్యంగా అత్యంత నిరాసక్తంగా ఉంటాయి. ఉద్యోగ శిక్షణ ప్రభుత్వాల, సంస్థల అవసరం అనుకున్నంతకాలం ఇలానే ఉంటుంది. అది తమ అవసరం అని ఉద్యోగులూ లేదా సంస్థల సభ్యులూ భావించినప్పుడు మాత్రమే ఆ శిక్షణ చాలా ఉత్తేజకారకంగా ఉంటుంది. కావలసిందల్లా ఇదుగో, జోసెలిన్ డేవిస్ వంటి ఆలోచనాపరులూ, రచయితలూ మాత్రమే.

వ్యక్తిత్వ వికాసం మాత్రమే కాదు, వ్యవస్థా వికాసం కూడా అత్యవసరం. వికసించిన వ్యక్తిత్వాలు సంస్థల్ని వికసింపచేస్తాయి. వికసించే సంస్థల్లో పనిచేసే వ్యక్తులు కూడా తప్పకుండా వికసించి తీరుతారు.

26-2-2023

9 Replies to “వ్యవస్థా వికాసం కూడా అత్యవసరం”

  1. నేను ఏమి నేర్చుకున్నా ,నా వృత్తి నిర్వహణ కోసం, అనుభవం ద్వారానే నేర్చుకున్నా .ముక్కు ,మోకాలు దెబ్బతిన్న సందర్భాలెన్నో .చదివిన కాసిన్ని పుస్తకాలు కూడా వాటి అవసరం తీరిపోయాకనే చదివా .
    నేను పాటించిన సూత్రం ఒకటే చేసే పని ఏదైనా శ్రద్ధగా చేయడం .
    మీరన్న ఈమాట చాలా నచ్చింది ,మనలో అత్యధికులు ఉద్యోగం జీవితంలో భాగం అనుకోరు .

  2. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తూంది.ఎక్కి వచ్చిన వెనుక మెట్ల వైపు చూస్తే ఒక్కో మెట్టు దగ్గర ఒక్కో మహానుభావుడు ప్రోత్సాహాన్ని కలుగ జేస్తూ మనది మెట్లవైపు దారిచూపటం. మొన్నెప్పుడో దేవనపల్లి వీణావాణి ధరణీరుహ గురించి నిన్న మొన్న కేరళలోని కవ్యారామము గురించి అంతకు ముందు
    జయతి లోహీల వన్యాశ్రమ జీవన విధానం గురించి
    అలాగా విశ్వ వ్యాపితంగా ఉన్న అనేక విషయాలు సెనెకా ఉత్తరాల వంటివి ఎన్నో మీ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. నా అనుభవంలో సైన్స్ ల్యాబ్‌లో కెమిస్టుగా ఉన్నప్పుడు నన్ను తీర్చిదిద్దిన గురువులు,ఉపాధ్యాయ వృత్తిలో మార్గదర్శనం చేసిన సహోపాధ్యాయులు, నాటకాలకు సంబంధించిన గురువు, సంగీత సంబంధ విషయబోధకులు, చరిత్రకుసంబంఒదించి అవగాహన కలిపించిన వారు, కవిత్వం వైపు నడిపించిన వారు, పుస్తక ప్రచురణ గురించి, అతి చిన్న విషయాల నుండి పెద్ద విషయాల దాకా అనేక మంది తారసిల్లారు.నా కిప్పటికీ 83 నాటి ఒక సంఘటన బాగా గుర్తుంది ఒక గంట క్రితం జరిగినంత నవ్యంగా.
    అప్పుడు నేను ఎసిటిక్ ఏసిడ్ ప్లాంట్ సూపర్వైజర్ను. ఆ రోజు ఉదయం ఆరింటి నుండి రెండు వరకు డ్యూటీ .7.30. కు ప్లాంట్ ఇంచార్జ్ వచ్చేసరికి స్వీపర్ ఊడుస్తున్నది. ఆయన వస్తూనే తన సీట్‌లోకి పోకుండా ఆమె దగ్గరికి వెళ్లి ఆమెకు ఇంకా ఎక్కడ ఎలా సాఫ్ చెయ్యాలో చెప్పి నన్ను పిలిచి you should know each and every work in detail. Unless you have sweeping experience you cannot command a sweeper even. What ever the plant operators do in different stages you must do it personally.
    అని చాలా చెప్పారు. ఆయన పేరు మ్సాథ్యూస్. కేరళైట్. ఇలా అనేక రంగాల్లో అనేకమంది ఇచ్చిన సూచనలన్నీ ఈ ఒక్క వ్యాసం కనుల ముందుకు తెచ్చింది జీవితం నిండా ఎంత మంది తోడ్పడ్డారో గుర్తుకు తెచ్చింది. ఇప్పుడు అలాంటి నిత్య పథదర్శనం చేయిస్తున్న ప్రస్తుత వైతాళికులైన మీకు వందనం.అలాంటి అనుభవాల రచనలకు మీరు కలిగించిన స్ఫూర్తితో సాహిత్యవేత్త విభిన్న జీవన పార్శ్వాల అనుభవాలు రచనలు రావాలని కోరుకుంటున్నాను. సుదీర్ఘ స్పందనకు మన్నించమని అడుగుతున్నాను.

  3. మనుషులు తమ పనినీ, తమ కార్యక్షేత్రాన్నీ గౌరవించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంటున్నదని నా అభిప్రాయం…exactly sir .🙏

  4. మంచి విషయాన్ని ఎత్తుకున్నారు. తెలుగులో మీరు చెప్పిన కొరతలకు కారణాలను అనేక కోణాలనుంచి చూడవలసి ఉంటుంది. వ్యక్తిత్వవికాసం, వ్యవస్థానిర్వహణ సామర్థ్యం మొదలైన వాటిని పాఠశాల స్థాయి నుంచే అలవరచినప్పుడే అది
    వారి నడవడిలో సహజమైన భాగం కలుగుతుంది. ఉద్యోగ దశలో శిక్షణ నిరాసక్తంగానూ, మొక్కుబడిగానూ మారతుంది. అసలు సమస్య, మన సమాజాన్ని వ్యక్తిత్వ, వ్యవస్థా వికాసానికి దోహదపడే జ్ఞానసమాజాన్ని నిర్మించడం, రాజకీయంగా కానీ, ఇతరత్రాగానీ మన ప్రాధాన్యాంశం కాదు.సినిమాల్లానే రాజకీయాల్ని కూడా మనకు వినోదం కలిగించేవి గానే చూస్తాం.

Leave a Reply to Vadrevu Ch VeerabhadruduCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading