లోహియా గురించి ఒక సాయంకాలం

ఇప్పుడు తెలుగులో సమకాలిక రాజకీయ, సామాజిక అంశాల మీద చాలామంది సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో రాస్తూ ఉన్నారు. కాని వాళ్ళల్లో అవధానం రఘుకుమార్ ది ప్రత్యేకమైన గళం అనిపిస్తుంది. ఆయన దృష్టిలో సమగ్రత, సంయమనం కనిపిస్తాయి నాకు. ఆయన పుస్తకం ఒకటి రావెల సోమయ్యగారు కిందటేడాది ఇచ్చి చదవమని చెప్పారు. చదివాను. ఒకసారి వాళ్ళింట్లోనే ఆయన్ని పరిచయం చేసారు. ఆ తర్వాత మేమిద్దరం లోహియా పురాణపాత్రలపైన కొత్త వెలుగు ఆవిష్కరణ సమావేశంలో కలిసి ప్రసంగించాం కూడా.

సోమయ్యగారి స్నేహం వల్ల ఆయన ఈ మధ్య లోహియా పైన కొత్త పుస్తకం ఒకటి వెలువరించారు. Revisiting Rammanohar Lohia: Challenges to the Theory and Practice of Alternative Socialism ( ఆకార్, 2022). ఈ రోజు ఆ పుస్తకం ఆవిష్కరణ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి సమావేశ మందిరంలో జరిగింది. ప్రసిద్ధ చరిత్రకారుడు, సామాజిక విశ్లేషకుడు రామచంద్ర గుహ ఆ పుస్తకం ఆవిష్కరించి ప్రధాన ప్రసంగం చేసారు. కె. రామచంద్రమూర్తిగారితో పాటు, మరొక సుప్రసిద్ధ సోషలిస్టు రామ శంకర్ సింఘ్ గారు కూడా సమావేశంలో ప్రసంగించారు.

సమావేశం మొదట్లో రఘుకుమార్ వక్తల్ని సభకు పరిచయం చేస్తూ తాను లోహియా మీద ఒక పుస్తకం ఎందుకు రాయవలసి వచ్చిందో వివరించారు. ముఖ్యంగా ప్రపంచమంతటా పెట్టుబడిదారీ విధానంతో పాటు మార్క్షిజం కూడా ఒక సంక్షోభానికి లోనవుతూ ఉన్నదనీ, ఈ స్థితిలో ప్రజల, పాలితుల, శ్రామికుల ప్రయోజనాల్ని కాపాడే ఒక సామాజికతాత్త్వికత అవసరం ఉందనీ, కానీ పాశ్చాత్యదేశాలు అటువంటి ప్రత్యామ్నాయ ధోరణులకు అవకాశం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారనీ, కానీ లోహియాని చదివినప్పుడు అటువంటి ప్రత్యామ్నాయాన్ని అన్వేషించవచ్చునని అనిపించిందని అందుకే తాను ఈ పుస్తకం రాసాననీ చెప్పారు.

రామచంద్ర గుహ పుస్తకాలు, ఆయన హిందూ పత్రికలో గాంధీ పైన రాసే వ్యాసాలూ చాలా ఆసక్తితో చదువుతుంటాను కాబట్టి, ప్రధానంగా ఆయన్ని చూడాలనీ, ఆయన మాట్లాడితే వినాలనీ ఈ సభకు వెళ్ళాను.

గుహ నన్ను నిరుత్సాహ పరచలేదు.

ఆయన వృత్తిరీత్యా ప్రొఫెసరు కూడా కాబట్టి చాలా చక్కటి వాచికంతో, చక్కటి హావభావాల్తో, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఎంతో స్పష్టతతో, అంశాల వారీగా వివరించాడు. ముందు లోహియా గురించి, పుస్తకం గురించి స్థూలంగా కొంత చెప్పిన తరువాత, భారతదేశంలో సోషలిస్టు భావజాలం, ఆచరణల చరిత్ర గురించి విపులంగా మాట్లాడేడు. సోషలిస్టులు ఒకవైపు కాంగ్రెసులోని జాతీయవాదులతోనూ, మరొకవైపు తమ కాలం నాటి కమ్యూనిస్టులతోనూ ఏ అంశాల మీద విభేదించారో, అలా విభేదించడం వెనక వారిమీద గాంధీ ప్రభావం ఏ మేరకు ఉందో ఆయన సోదాహరణంగా వివరించారు. భారతదేశంలో కమ్యూనిస్టులకీ, సోషలిస్టులకీ మధ్య విభేదం మూడు అంశాలమీద ఉందని చెప్పాడు. సోషలిస్టులు ప్రధానంగా భారతజాతీయోద్యమానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనీ, సామాజికమైన మార్పు హింసద్వారా కాక, అహింసా పద్ధతులద్వారానే సాధ్యపడుతుందని నమ్మారనీ, ఇక మూడవది, ముఖ్యమైంది, వారు రాజకీయ-ఆర్థిక శక్తి కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకృతం కావాలని భావించారనీ చెప్పాడు.

అసలు భారతీయ సామ్యవాదులు ప్రధానంగా నాలుగు అంశాల మీద జాతి దృష్టిని మళ్ళించడంలో కృతకృత్యులయ్యారని చెప్పారు. మొదటిది, వాళ్లు సోవియెట్, చైనా తరహా కేంద్రీకృత విధానాలకు బదులు ప్రజాస్వామిక వికేంద్రీకృత విధానాల్ని కోరుకున్నారనీ, రెండవది, సాంఘిక-రాజకీయ కార్యాచరణలో స్త్రీలకు సమాన భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నారనీ, మూడవది, భారతీయ సంస్కృతి, కళలు, సాహిత్యం, దేశభాషలు మొదలైనవాటిపట్ల శ్రద్ధ చూపించడమే కాకుండా ఆ రంగాల్లో చెప్పుకోదగ్గ కృషి చేసారనీ చెప్పాడు. ఇక నాలుగవది అంతే ముఖ్యమైన అంశం, వారు తమ విధానాల్లో మొదటినుంచీ ఒక పర్యావరణ స్పృహ కనపరుస్తూ వచ్చారని కూడా చెప్పాడు. ఇరవయ్యవ శతాబ్ది భారతీయ రాజనీతి చింతకుల్లో అంబేద్కర్ లానే లోహియా కూడా కులం గురించి విస్తృతంగా చర్చించాడని కూడా పేర్కొన్నాడు.

ఆయన తర్వాత ప్రసంగించిన రామశంకర్ సింఘ్ నాతో పాటు చాలామంది శ్రోతల్ని నివ్వెరపరిచే ప్రసంగం చేసాడు. లోహియాతోతనకున్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల లోహియాకు సంబంధించిన ఎన్నో విశేషమైన అంశాల్ని ఆయన వివరిస్తుంటే శ్రోతలకు వళ్లు గగుర్పొడించిందని చెప్పడం అతిశయోక్తి కాదనుకుంటాను. ముఖ్యంగా గాంధీతో సహా జాతీయోద్యమ నాయకులంతా ఒక్క సామ్రాజ్యవాద శక్తికి మాత్రమే వ్యతిరేకంగా పోరాడేరనీ, కాని లోహియా మాత్రం బ్రిటిషు, పోర్చుగీసు, నేపాలీ, అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలతో పాటు నెహ్రూవీయ ఆధిపత్య ధోరణులమీద కూడా సత్యాగ్రహం చేసిన వ్యక్తి అని చెప్పాడు. ప్రజాస్వామిక విలువలకు కట్టుబడి ఉండటంలో, భారతదేశం స్వతంత్రం అయ్యాక పదవుల్ని కాక, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉండాలని కోరుకోవడంలో లోహియా చూపించిన వ్యక్తిత్వం ఎంత నిరుపమానమైందో ఆయన చెప్తుంటే వినడం నిజంగా ఒక అనుభవం.

గుహ తన ప్రసంగంలో, కాంగ్రెసు, కమ్యూనిస్టులు, చివరికి ఆర్ ఎస్ ఎస్ కూడా తమదంటూ ఒక చరిత్ర రాసుకోడం మీద దృష్టి పెట్టాయనీ, కాని సోషలిస్టులే తమ చరిత్రను సరిగా డాక్యుమెంటు చేసుకోలేదనీ, ఇప్పటికైనా ముప్పై-నలభయ్యేళ్ళ మధ్య వయసుగల యువతీయువకులెవరైనా నిష్పాక్షికంగా భారతీయ సోషలిస్టు ఉద్యమ చరిత్రను గ్రంథస్థం చెయ్యవలసిన అవసరం ఉందని చెప్పాడు. ప్రొ. రామశంకర్ సింగ్ ప్రసంగం విన్నాక ఆ పని చెయ్యడం ఎంత అత్యవసరమో తెలియవచ్చింది.

ఇంత చక్కటి సమావేశం ఏర్పాటుకి కారణం సోమయ్యగారు. ఆయన సమావేశానికి వచ్చి కూర్చోలేకపోయినా ఆయన మనసంతా ఇక్కడే ఉంటుందని నాకు తెలుసు. ఎనభై ఏడేళ్ళ వయసులో ఒక పుస్తకం రాయించి, దాన్ని ఇలా ఆవిష్కరింపచెయ్యడం మామూలు విషయం కాదు. సోషలిస్టు ఉద్యమం భారతదేశంలో బలహీనపడిందని ఎలా అనగలం? సోమయ్యగారు ఉండగా!

25-2-2023

13 Replies to “లోహియా గురించి ఒక సాయంకాలం”

  1. అద్భుతంగా ఆవిష్కరించారు. చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాను.
    ధన్యవాదాలు.

  2. ప్రసంగాల వివరాలు విన్న తరువాత ప్రస్తుత సమాజానికి లోహియా దృక్పథం ఎంత అవసరమో తెలుస్తున్నది.జరగినదాన్ని మార్చలేకపోయినా జరగబోయేదాన్ని మార్చగల శక్తి మంచి రచనలకున్నది.యువతరం పాశ్చాత్య ప్రలోభాలలోనో , అంతర్దేశీయ సమూహాల ప్రాబల్యంలోనో, పడిపోకుండా లోతుగా ఆలోచించి తమకు తాముగా ఒక సదసద్వివేక నిర్ణయాయత్తులుగా మార్చే దిశలో పుస్తకాలు రావాలి.మాయాజాలపు మీడియా నుండి మాననీయ మీడియా సృష్టించగలిగే స్ఫూర్తి రావాలి.సోమయ్య గారిచ్చిన పుస్తకాలు ర్యాక్ లో ఉన్నా ఆంగ్ల భాష పఠనాభ్యాసం లేక తీయాలంటే
    జంకుతో చదవలేదు కానీ ఇప్పుడు మీ స్ఫూర్తితో చదవాలనిపిస్తుంది.దేవులపల్లి గీతంలోని చరణం
    జయగాయక వైతాళిక …… చర్విస్తూ నమస్సులతో .

  3. పుస్తకం తెప్పిస్తాను. పరిచయానికి ధన్యవాదాలు.

  4. నేను కూడా గుహ అభిమానిని కావడంవల్లనూ సోమయ్య గారిని చూడాలని ఉండడవల్లనూ సభకు వచ్చాను. ఎప్పటిలానే గుహ ఉత్సాహంగా మాట్లాడారు. సోమయ్య గారు రాలేకపోవడం నిరుత్సాహపరచింది. నాకు హిందీ రాకపోవడంవల్ల రామ శంకర్ సింఘ్ ప్రసంగం పూర్తిగా అర్థం కాలేదు.ఆ లోటును మీ పరిచయం పూరించింది. ధన్యవాదాలు.

  5. సభకు మమ్మల్ని తీసుకెళ్లిన అనుభూతి…ధన్యవాదాలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading