భీముడి ఆత్మకథ

కేరళ నుంచి రాగానే చేసిన మొదటి పని Bhima పుస్తకం అలమారులో ఎక్కడుందో వెతకడం. ఎం.టి.వాసుదేవన్ నాయర్ రాసిన ‘రండ మూళం’ (రెండవ వంతు,1983) అనే నవలకి ఇంగ్లిషు అనువాదం అది. పదేళ్ళ కిందట ఒక మిత్రురాలు ఆ పుస్తకం కానుక చేసి ‘దీని మీద నీ అభిప్రాయం వినాలని ఉంది’ అంది. నాలుగు వందల పేజీల నవల. ఆ నవల గురించి ఎంతో విన్నాను. ఎం.టి.వాసుదేవన్ నాయర్ కి జ్ఞానపీఠ్ పురస్కారం (1995) రావడానికి ఆ నవల చాలావరకు కారణమని చెప్తారు. ఆయన రాసిన తొమ్మిది నవలలు, పందొమ్మిది కథాసంపుటాలు, నాటకాలు, సాహిత్య విమర్శ, యాత్రాకథనాలూ అన్నింటిలోనూ ఈ నవల సర్వోత్కృష్టమని చెప్పడం విన్నాను. ఆయన తొలిసారిగా రాసి, దర్శకత్వం వహించిన ‘నిర్మాల్యం’ సినిమాకు జాతీయ స్థాయి ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకత్వం పురస్కారాలు లభించాయి. కాని, ఇప్పటికీ, ఎం.టి అంటే ‘రండమూళం’ నవలనే గుర్తుచేసుకుంటారు ఆయన అభిమానులు.

నేను ఆయన రచనల్లో ఇప్పటిదాకా చదివింది, ఆయన మొదటినవల, ఆయనకు సాహిత్యలోకంలో గుర్తింపు తెచ్చిన ‘నాలుక్కెట్టు’ (1958). దాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ‘సమష్టి కుటుంబం’ పేరు మీద తెలుగులోకి తెచ్చారు. ఆ ఒక్క నవలతోనే ఆయన్ని నేను ఎన్నదగ్గ రచయితల్లో ఒకడని గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు ఈ Bhima, Lone Warrior (2013) ఆయన రచనల్లో నేను చదివిన రెండవ నవల. చదవడం ఇన్నేళ్ళుగా వాయిదా వేస్తూ వచ్చిన ఈ పుస్తకం తీరా చేతుల్లోకి తీసుకోగానే రెండు రోజుల్లోనే పూర్తిచేసేగలిగాను. కాబట్టి అన్నిటికన్నా ముందు ఈ రచన తాలూకు పఠనీయత అత్యంత ప్రశస్తమని చెప్పగలను.

Bhima, Lone Warrior భీముడి దృక్కోణంలో చెప్పిన మహాభారత కథ. మహాభారతం అంటే మొత్తం ఇతిహాసాన్ని అంతటినీ నాయర్ తిరిగిచెప్పాలనుకోలేదు. ప్రధానంగా కురుపాండవ వైరం, యుద్ధం, యుద్ధానంతర శూన్యం- వీటి చుట్టూతానే ఆయన కథ నడిపాడు. ఈ ఇంగ్లిషు అనువాదం చివర ఒక ఎపిలోగ్ ఉంది. అందులో ఆయన ఈ నవల తాను ఎందుకు రాసిందీ, ఎలా రాసిందీ, దీన్ని రాయడంలో తాను ఏ వ్యూహాలు అనుసరించిందీ వివరంగా రాసుకొచ్చాడు. ఆయన చెప్పినదాని ప్రకారం అన్నిటికన్నా ముందు ఆయన మూల మహాభారతాన్ని క్షుణ్ణంగా మళయాళం అనువాదాల్లోనూ, కిసారి మోహన్ గంగూలి ఇంగ్లిషు అనువాదంలోనూ చదివాడు. ఇవి కాక మహాభారతం కాలం నాటి సాంఘిక, రాజకీయ పరిస్థితుల గురించి, వైదిక సంస్కృతి గురించి ఇంగ్లిషులో లభ్యమవుతున్న గొప్ప గ్రంథాలు, మేగ్డొనాల్డ్, కీత్, గ్రిఫిత్ వంటి వారి రచనలతో పాటు శతపథ బ్రాహ్మణానికి ఎగెరిలింగ్ అనువాదం కూడా చదివానని చెప్పుకున్నాడు. 1977 లో తనకి మహాభారతాన్ని భీముడి దృక్కోణం నుంచి చెప్పాలనే తలపు కలిగిందనీ, దాన్ని 1983 నాటికి పుస్తకరూపంలోకి తీసుకురాగలిగాననీ చెప్పాడు.

మహాభారతం గత రెండు వేల ఏళ్ళుగా భారతీయ భాషల్లో ఏ విధంగా పునఃసృజనకు లోనవుతూ వచ్చిందో చూడటం ఆసక్తి కలిగించే అంశం. కాని అంతకన్నా ఆసక్తి కలిగించే అంశం, 20-21 శతాబ్దాల్లో నవల, నాటకం, కవిత్వం, సినిమా రూపాల్లో మహాభారతం లోనవుతూ వస్తున్న పునఃసృజన మరింత ఆసక్తికరం. ఆ ఇతిహాసంలోంచి ఒక చిన్నభాగాన్ని ఎంచుకున్న ప్రతి ఒక్క రచయితా తన రచనని ఎంతో ప్రశస్త రచనగా మార్చుకోగలిగాడు. సావిత్రిని ఒక ఆధ్యాత్మిక ఇతిహాసంగా మార్చిన అరవిందులు, కుంతి-కర్ణ సంవాదాన్ని రాసిన టాగోర్, పాంచాలీ శపథం రాసిన సుబ్రహ్మణ్య భారతి, పాండవోద్యోగ విజయాలు రాసిన తిరుపతి వెంకట కవుల్ని అలా ఉంచండి, దిన కర్, ఖాండే కర్, ప్రతిభా రాయి, భైరప్ప వంటి రచయితలకి మహాభారతమే జ్ఞానపీఠ్ పురస్కారాన్ని సముపార్జించిందని చెప్పినా అతిశయోక్తి కాదు. వీరిలో ప్రతి ఒక్కరూ ఒక పార్శ్వాన్ని తీసుకున్నారు. ఆ కిటికీ లోంచి మహాభారతమనే విస్తారమైన ప్రపంచాన్ని చూడడానికీ, మనకి చూపించడానికీ ప్రయత్నించారు. వాసుదేవన్ నాయర్ కూడా ఈ కోవలోకే వస్తాడు. అయితే అతడు ఎంచుకున్నది భీముణ్ణి. అతడి అనుభవాలమీంచి మహాభారతకథని మనకి చెప్పడాన్ని.

ఒక పాత్ర దృక్కోణం నుంచి ఇక ఇతిహాసాన్ని తిరిగి చెప్పడంలో, వ్యాఖ్యానించడంలో చాలా సమస్యలు ఉన్నాయి. పాఠకులూ, పండితులూ కూడా అంగీకరించలేని విషయాలు ఎన్నో ఉంటాయి. లక్ష శ్లోకాల మహాభారతాన్ని నాలుగువందల పేజీల నవలగా కుదించినప్పుడు చాలా పాత్రలకి న్యాయం జరగలేదనిపిస్తుంది. చాలా పాత్రలు తమకి లభించవలసినదానికన్నా ఎక్కువ ప్రాముఖ్యాన్ని పొందాయనిపిస్తుంది. కాని ఒక పాత్ర దృక్కోణం నుంచి చెప్పే కథలో మనం పట్టించుకోవలసింది వాటిని కాదు. రచయిత తాను ఎంచుకున్న దృష్టికోణానికి న్యాయం చేసాడా లేదా, తాను నిలబడ్డ చోటనుంచి కథ చెప్తున్నప్పుడు పాఠకుడిలో గంభీరమైన, ఉదాత్తమైన పర్యావలోకనాన్నీ, రసానుభూతినీ కలిగించగలిగాడా లేదా- అది మాత్రమే చూడాలి. అలా చూసినప్పుడు నాయర్ రాసిన ఈ మహాభారత కథని చదవడం పాఠకుడికి ఎంతో విలువైన అనుభవం అని చెప్పగలను.

ఈ నవల ఆయన ఒక రచయితగానో, కవిగానో, నాటకకర్తగానో కాక, ఒక చలనచిత్రనైపుణ్యంతో రాసాడని చెప్పవచ్చు. యాభైకి పైగా స్క్రీన్ ప్లేలు రాసినవాడు, రాసినవాటిలో ఇరవైరెండింటికి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాల్నీ, ఆరింటికి జాతీయ స్థాయి పురస్కారాలు పొందినవాడు ఒక కథని ఎలా చెప్పాలో, సన్నివేశాలు ఎలా కల్పించాలో, ఎక్కడ ఎడిట్ చేయాలో, ఎక్కడ విస్తరించాలో తెలిసినవాడు రాసిన నవల ఇది. అందుకనే పుస్తకం చేతుల్లోకి తీసుకోడం దాకానే మనం చెయ్యవలసింది. ఆ తర్వాత ఆయన కథనమే మనల్ని ముందుకు తీసుకుపోతుంది.

‘మహాభారతంలో మనుషులు ఎదుర్కొన్న కొన్ని సంక్షోభాలే’ తన నవలకి ఇతివృత్తమని నాయర్ చెప్పుకున్నాడు. అంత విస్తారమైన గ్రంథంలో కూడా కృష్ణద్వైపాయన వ్యాసుడు మౌనం వహించిన కొన్ని తావుల్ని తాను పట్టుకున్నాననీ, ఆ తావుల్ని తనకు విడిచిపెట్టినందుకు వ్యాసుడికి ప్రణమిల్లుతున్నాననీ కూడా రాసుకున్నాడు.

దుర్బలమైన కుటుంబ సంబంధాలు, వాటిలో చిక్కుకుపోయిన మనుషులూ- ఈ ఇతివృత్తాల్ని తన స్వగ్రామం తనకు సమకూరుస్తూ వచ్చిందనీ, కాగా ఈ కుటుంబకథ కూడా అదే కథ గానీ, సుదూర కాలానికి చెందింది కావడమొక్కటే తేడా అని కూడా రాసాడు. ఒక గ్రామంలో పుట్టిపెరగడం, చిన్నప్పణ్ణుంచీ ఇతిహాసాలూ, చరిత్రలూ వింటూ పెరగడమే తనకి ఈ గ్రంథం రాయగల ఆత్మబలాన్నిచ్చిందని కూడా చెప్పుకున్నాడు.

ఈ సందర్భంగా ఇంగ్లిషు అనువాదకురాలు గీతా కృష్ణకుట్టి ని కూడా అభినందించాలి. పుస్తకంలో ఆమె కనబడదు, నాయర్ కనబడడు, భీముడు మాత్రమే మనపక్కన నిలబడి కొన్నిసార్లు తనలోతాను, కొన్నిసార్లు మనతోనూ మాట్లాడుతుంటాడు.

ఇది విమర్శించవలసిన గ్రంథం కాదు, ఆస్వాదించవలసిన రససృష్టి. ఆ రసానుభూతి ఎలా ఉంటుందో రుచి చూపటానికి, నవలలోంచి రెండు సన్నివేశాలు మీకోసం తెలుగు చేస్తున్నాను.


1

కృష్ణుడు తిరిగి వచ్చేంతవరకూ మేమంతా కూడా కొంత అస్తిమితంగానే ఉన్నాం. వాళ్ళకి ఎవరూ ఏమీ చెప్పకపోయినప్పటికీ సైన్యంలో ఉత్సాహం కొద్దిగా తడబడుతోందని తెలుస్తూనే ఉంది. ఆయుధకర్మాగారాల్లో పని వేగం మందగించింది. ఇప్పటిదాకా యుద్ధవాసన పసిగట్టిన విరాట సైన్యంలోని యువకులు ఇప్పుడు నిరుత్సాహానికి లోనయ్యారు. ఇరుపక్షాల మధ్య సంధి ఏదన్నా కుదురుకుందా అని నన్ను చాలామంది వచ్చి నన్నడిగారు కూడా. వాళ్ళందరికీ నేను చెప్పింది ఒకటే జవాబు: కృష్ణుడు రానివ్వండి, అప్పుడు నిర్ణయిస్తాం.

కృష్ణుడు వచ్చాడు. అతడి ముఖంలో తృప్తి గోచరిస్తోంది. అది చూసి అర్థరాజ్యం ఇవ్వడానికి దుర్యోధనుడు అంగీకరించి ఉంటాడని అనుకున్నాం. అతణ్ణి దారిలోనే ఆపి ఆత్రుతగా వివరాలు అడిగాను. కృష్ణుడు ఏమీ స్పష్టంగా చెప్పలేదు.

‘రాజ్యవ్యవహారాలు సభాసదులమధ్యలో చర్చించవలసినవి’ అన్నాడు అతడు నా ప్రశ్నలు దాటేస్తూ.

ద్రుపడు, విరాటుడు, విరాటుడి కొడుకు ఉత్తరుడు అందరూ సభామందిరంలో ఉన్నారు. మేము కూడా మళ్ళీ అక్కడికి చేరుకున్నాం. సాత్యకి ముగ్గురు సేనానాయకులకీ కూడా కబురు పంపించాడు. ఒకవేళ యుద్ధంతో పనిలేకపోతే ఆ మాట వాళ్ళకి యుధిష్ఠిరుడే స్వయంగా చెప్పవచ్చునని అతడి ఆలోచన.

తాను చెప్పాలనుకున్న విషయం కృష్ణుడు మరీ సాగదియ్యలేదు. ఇంతకుముందు బ్రాహ్మణ దూతలాగా సంజయుడిలాగా అతడు నీళ్ళు నమల్లేదు.

‘మీకు అర్థరాజ్యం ఇవ్వడానికి దుర్యోధనుడు సిద్ధంగా లేడు. అయిదూళ్ళు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. అతనేమన్నాడో అతడి మాటలే వినాలనుకుంటున్నారా? అయితే వినండి, సూదిమొన మోపినంత రాజ్యం కూడా పాండవులకి ఇవ్వబోను’ అని చెప్పేసాడు.

మరి అమ్మ ఏమంది? ఆ ప్రశ్న ప్రతి ఒక్కరికీ పెదాల దాకా వచ్చింది. నువ్వు వెళ్ళి తనని కలిసినప్పుడు మా అమ్మ నీతో ఏమంది?

‘ఆమె చెప్పిన మాటలు మీరు వినాలనే మిమ్మల్నందరినీ ఈ సభామందిరానికి పిలిపించాను. ఆమె నాతో ఇలా చెప్పింది: నా పిల్లలు రాజ్యం పోగొట్టుకున్న విషయం నేను మర్చిపోగలను. అడవుల్లో అష్టకష్టాలూ పడ్డ సంగతి కూడా మర్చిపోగలను. కానీ ఆ రోజు జూదమందిరంలో నా కోడలు రక్తమలిన వస్త్రంతో ఒక అనాథలాగా వేదనతో ఆక్రోశించిన దృశ్యం మాత్రం మర్చిపోలేకపోతున్నాను. నా పిల్లలకి విదుల కథ గుర్తు చెయ్యి. వాళ్ళకి తెలియకపోతే చెప్పు.’

కృష్ణుడు తన మాటలు ఆపి ద్రౌపది కేసి చూసాడు. ఆమె తనకళ్ళల్లో చిందిన సంతోషబాష్పాల్ని తుడుచుకుంటున్నది.

అప్పుడు అతడు ఆ కథ తన మాటల్లో చెప్పాడు: విదుల ఒక క్షత్రియ స్త్రీ. తన కొడుకుని యుద్ధానికి పంపించింది. కాని ఆ పిల్లవాడు యుద్ధభయంతో పారిపోయి వచ్చి దాక్కోబోయాడు. అప్ప్పుడామె తన కొడుకుతో ఏం చెప్పిందో తెలుసా? ఏదో ఒక ఉద్దేశ్యంగాని, లేదా సాహసంగాని లేని ప్రేమ ఆడగాడిద ప్రేమలాంటిది అని చెప్పింది.

మేము మా తల్లి గురించే ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాం. యుధిష్ఠిరుడు ఏమి చెప్పబోతాడా అన్న ఉత్కంఠతో ప్రతి ఒక్కరూ ఊపిరి ఉగ్గబట్టారు.

కృష్ణుడు తన మాటలు కొనసాగించాడు: ఇక ఆమె మీకు చెప్పమన్న మాటలు మీకు చెప్పడమే నేను చెయ్యవలసిన పని. ఆమె మీకు పంపిన సందేశం ఇది: తమ రాజ్యాన్నీ, తమ ప్రజల్నీ రక్షించుకోవడం చాతకాని రాజులకి లభించేది వీరస్వర్గం కాదు, నరకమే.

యుధిష్ఠిరుడు ఆలోచనలో కూరుకుపోయాడు. సాత్యకి, దృష్టద్యుమ్నుడూ లేచి అటూ ఇటూ పచార్లు చేయడం మొదలుపెట్టారు. ద్రుపదుడు, విరాటుడు రెప్పవాల్చకుండా యుధిష్ఠిరుణ్ణే చూస్తూ ఉన్నారు.

ఆ మందిరంలో అలముకున్న నిశ్శబ్దాన్ని చెదరగొట్టిన చప్పుడంటూ ఏదన్నా ఉంటే అది ద్రౌపది కదిలినప్పుడు ఆమె చరణకంకణనిక్వణం మాత్రమే.

యుధిష్ఠిరుడు నిట్టూర్చి ‘మరి అభిమన్యుడి పెళ్ళి సంగతి..’ అంటో ఏదో అన్నాడు.

కృష్ణుడు ఆ ప్రశ్న విననట్టే నటించాడు. నిశ్శబ్దం మరికొంత సేపు రాజ్యం చేసింది.తన సహనం పూర్తిగా అంతరించాక కృష్ణుడు అడిగాడు: ‘ఇంతకీ నీ నిశ్చయం ఏమిటి? ఏం చెయ్యాలంటావు?’

యుధిష్ఠిరుడు తలపైకెత్తి మాకేసి చూసాడు. అపారమైన అంతరంగ ప్రశాంతతతో, అతడు ఒకేఒక్క మాటతో జవాబిచ్చాడు.

‘యుద్ధమే!’

(పే.271-273)

2

నా చిన్నప్పుడు ఒక పిల్లవాడిగా ఈ నది ఒడ్డున సాయంసంధ్యవేళల్లో నిలబడి నేనెట్లా ప్రార్థించేవాణ్ణో గుర్తుచేసుకున్నాను. ఈ స్నానఘట్టాల దగ్గర వాయుదేవుడి సందేశం కోసం ఎట్లా వేచి ఉండేవాణ్ణో తలుచుకున్నాను. మహాబలశాలి కావాలని కలలుగన్న ఆనాటి పసివాణ్ణి గుర్తుతెచ్చుకున్నాను. సుదూరగతంలో అతణ్ణిప్పటికీ చూడగలుగుతున్నాను, ఆడుతూ గెంతులేస్తూ తిరుగుతున్న ఆ వృకోదరుణ్ణి.

ఇప్పుడతడు నిజంగానే మహాబలశాలి అయ్యాడు. ఒక యుద్ధంలో జయించాడు.

నా చిట్టచివరి శత్రువు ఇప్పుడు శమంతకపంచకంలో కొనశ్వాసతో పడి వున్నాడు. చేసిన శపథాలన్నీ నెరవేర్చుకున్న క్షత్రియుణ్ణి నేనిప్పుడు.

మహాబలశాలి భీముణ్ణి. అడవుల్లో పోరాడేను. రాజప్రాంగాణాల్లో తలపడ్డాను. చివరికి ఇక్కడ కురుక్షేత్రంలో నా శత్రువుల్ని మట్టికరిపించాను. చాలా మామూలు మనిషిని. నన్ను నిజంగా మహాబలశాలిని చేసింది నా సొంత బలం కాదు. నేను యుద్ధనినాదం చేసినప్పుడు నా గళానికి ఆ శక్తిని వేరెవరో అందించారు. అలిసిపోయినప్పుడు నా బాహువులకి వేరెవరో జవసత్త్వాలు సమకూర్చారు. విజయం సాధించిన ఈ క్షణాల్లో నేను అహంకారపూరితుడిగా ఉండకూడదు. వినయంతో నా శిరసు వంచక తప్పదు.

ఓ దేవా, తుపానుల్ని కట్టడి చేసే నువ్వు, మేఘమండల ఉపరితలంలో వేటాడే నువ్వు, నా తండ్రీ, నీకు నేను ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఈ గండశిలల్ని నీ పాదాలుగా భావిస్తూ వాటి మీద నా శిరసు వాలుస్తున్నాను.

ఆ ప్రార్థన తర్వాత నా మనసు తేలికపడ్డట్టు అనిపించింది. నిర్మానుష యుద్ధక్షేత్రంలోకి మళ్ళా వెళ్ళాలనిపించలేదు. యుద్ధ శిబిరాలు అంధకారంలో నిద్రిస్తున్నాయి. స్కంధావారాల్లో వంధిమాగధుల జయగీతాలు సద్దుమణిగాయి. మా అన్నదమ్ములు మాత్రమే ఎక్కడో మేలుకుని ఉన్నారు, పండగ చేసుకుంటూ.

ఆ స్నానఘట్టం మెట్ల మీద మరికొంతసేపు కూచున్నాను.

రాత్రి గడిచింది. వేగుచుక్క పొడిచింది. సూర్యుడు ఉదయించే శిఖరం మీంచి రక్తారుణ రేఖలు పరుచుకున్నాయి. నేను వెనుదిరిగాను.

దృషద్వతీ సంగమం దగ్గర స్మశానం మీంచి పొగ రేగుతున్నది.

సాధారణంగా ప్రభాతవేళల్లో ఆలపించే కైశికీ రాగం బదులు నిర్జన కురుక్షేత్రమైదానం మీంచి దీర్ఘవిలాపం ఒకటి వినబడింది. జనసందోహం కట్టగట్టి పెద్దగా ఏడుస్తున్నారు. నాకు ఒళ్ళు జలదరించింది.

విశోకుడు నా దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ, పొరలిపొరలి వస్తున్న ఏడుపు మధ్య ‘అశ్వత్థామా, అతడి మనుషులూ రాత్రి మన శిబిరానికి నిప్పు పెట్టారు’ అని చెప్పాడు.

ఇంతలో నకులుడు, సహదేవుడు కూడా అక్కడికి చేరుకున్నారు. ‘రాత్రి నిద్రపోతున్నవాళ్లని నిద్రపోతున్నట్టే వాళ్ళు ఊచకోత కోసేసారు. పారిపోడానికీ, తప్పించుకోడానికీ ఒక్కరు కూడా మిగల్లేదు.’

స్మశానం నుంచి రేగుతున్న పొగ అని నేను అనుకున్నది శిబిరాలు దగ్ధమైన పొగ అన్నమాట.

నా పెదాల మీద ఒక ప్రశ్న పదాల కోసం వెతుక్కుంటోంది. ఎవరు వాళ్లంతా? ఎవరు?

నిద్రాసుఖాన్ని ఆస్వాదిస్తున్న దృష్టద్యుమ్నుడు, పాంచాలి పుత్రులు అయిదుగురూ- ప్రతివింద్యుడు, సుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతకర్ముడు, వాళ్లతో పాటే నిద్రిస్తున్న సర్వదుడు కూడా.

అశ్వత్థామ వాళ్లందరినీ చంపేసాడు.

అతడితో పాటు కృపాచార్యుడూ, కృతవర్మా కూడా వచ్చారు. ఏ ఒక్కరూ పారిపోకుండా డేరాలకి అడ్డంగా నిలబడ్డారు. తప్పించుకోవాలని ప్రయత్నించిన సేవకుల్నీ, సైనికుల్నీ, ఏ ఒక్కరూ మిగలకుండా అశ్వత్థామ వారిని చంపటానికి సాయంగా నిలబడ్డారు.

యుద్ధరంగం మీద కొత్త రక్తం ఇంకా ప్రవహిస్తున్నది. ఆ భీకర సన్నివేశాన్ని వర్ణిస్తున్న సూతుడొకడు ఇలా చెప్తున్నాడు: ‘వాళ్ళు ఎలాంటి అత్యాచారం చేసారో మీరు మీ కళ్లతో చూస్తే తప్ప నమ్మరు.’

నాకు వాళ్ళని చూడాలనిపించలేదు.

దుర్యోధనుడు మరణించేముందు అశ్వత్థామని సేనాధిపతిని చేసాడని విన్నప్పుడు మేము నవ్వుకున్నాం. సైన్యం లేని సేనాధిపతి అనుకున్నాం.

ఆ భయానకమైన కాళరాత్రి గురించిన వర్ణనలే నా చుట్టూ వినబడుతున్నాయి. రుద్రుడు ప్రసాదించిన ఖడ్గం అశ్వత్థామ దగ్గర ఉంది. దాంతోనే అతడు ఈ సంహారం కావించాడు. ఆ రాత్రి ఆ స్కంధావారం ఎదట సాక్షాత్తూ రుద్రుడే నిలబడ్డాడట. మా పిల్లలు ఆ సాయంకాలం ప్రార్థనలు చేసినప్పుడు ప్రార్థించిన నలుగురు దేవతల్లోనూ రుద్రుడు కూడా ఒకడై ఉండవచ్చు. ఇప్పుడు ఆ రుద్రుడి ఖడ్గమే వాళ్లమీద విరుచుకుపడింది.

ఇక ఈ వర్ణనలు చాలనిపించింది నాకు. నేను అర్థం చేసుకోలేకపోయినవి చాలానే ఉన్నాయనిపించింది. కాని ఒక్కటి మాత్రం అర్థమయింది, రేప్పొద్దున మా అంత్యక్రియలు, శ్రాద్ధకర్మలు జరిపించడానికి నా పిల్లలూ, పాండవుల పిల్లలూ మాత్రం జీవించి లేరు. అదొక్కటీ బాగా అర్థమయింది.

శత్రువు మరణించలేదు. మరణించడు కూడా.

(పే.331-333)

Featured photo courtesy: Wikimedia Commons

24-2-2023

18 Replies to “భీముడి ఆత్మకథ”

  1. యుధిష్ఠిరుడు తలపైకెత్తి మాకేసి చూసాడు. అపారమైన అంతరంగ ప్రశాంతతతో, అతడు ఒకేఒక్క మాటతో జవాబిచ్చాడు.

    ‘యుద్ధమే!’

    Haven’t read a drama so impactfully staged. Thank you sir.

  2. శత్రువు మరణించలేదు. మరణించడు కూడా.

    నిజమే ప్రాణాలు విడిచే వరకు శత్రువు ఏదో ఒక రూపంలో పొంచే ఉంటాడు .జీవిత సత్యం .

  3. మీ అనువాద ఖండికలు రెండు చదివేనే ఇంత ఉత్తేజకరంగా ఉంది.ఒకవైపు ఆవేశం మరోవైపు అదుపు.రెంటి మధ్యనలిగే క్షత్రియుని అంతర్గత సంఘర్షణ బహశః నవలలో ఉండి యుండవచ్చు.
    తనను అవమానానికి గురిచేసిన కౌరవాగ్రజునిపై ప్రతీకారం తీర్చిన పతిపై ద్రుపదరాజతనయ చూపిన ఒకింత అనురాగాన్ని సైతం రచయిత విడిచిపెడతాడనుకోను.ఒక్కసారిగా రణభేరి నిజోరు అంటూ ప్రతినబూనిన భీముని రూపం, దుస్సస్నుని వక్షస్థాలాన్ని చీల్చి చెండాడిన భీముని ఉక్రోషాన్ని, లాక్షాగృహం నుండి తనవాళ్లను తప్పించిన భీముని బలోద్ధతిని,జరాసంధుని రెండుగా చీల్చిన వృకోదరుని, బకాసురుని జంపిన
    బ్రాహ్మణరూప బాహుబలుని ఊహలోకి తెచ్చారు
    హిమగిరి సొగసులు అన్న వాయుసుతుని ప్రేమతత్త్వం కూడ కనుల ముందుకు తెచ్చారు. ఇది మొత్తం మీ చేతుల మీదుగా అనువదించబడితే బాగుండు అనిపించింది.
    మీరూ రోజూ ఒక కొత్త విషయం చెప్పటం చూస్తుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.ఊరికే సాహిత్యం చదవటం లేదని చేసే గగ్గోలుకంటే చదివింపజేసే విధంగా రచనలు రావడం లేదని ఇలా చెప్పేవారు లేకపోవడం వల్లనే సాహిత్యం అనాదరణకు గురవుతుందనీ జనాలకు ఎలా తెలుస్తుంది.

    1. ఆ నవల ప్రధానంగా భీముడి వైపు నుంచి రాసిన నవల. మహాభారతంలో మీరు చెప్పినట్లుగా భీముడు చాలా ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ఎందుకనో మనం ముందు అర్జునుడి మీద, తర్వాత ధర్మరాజు మీద ఎక్కువమొగ్గు చూపిస్తాం గానీ భీముని దాటుకుంటూ వెళ్ళిపోతాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని భీముడు అలరించినంతగా పెద్దయ్యాక అలరించడం మానేస్తాడు. సరిగ్గా ఆ విషయం నుంచే ఈ నవల రూపొందింది.

  4. బైరప్ప గారి ‘parva’ గుర్తుకు వచ్చింది సార్.అందులో కూడా ఇలాగే పాత్రల వైపు నుండి కథ నడుస్తుంది. అలాగే NBT వాళ్ళది ‘యయాతి’కూడా. చదివిన చాలా రోజుల వరకు మనసులో అవే పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇతిహాసాలను అర్థం చేసుకోవడం, వాటిని పాత్ర పరంగా విశ్లేషణాత్మకంగా రాయడం (భావం చెడిపోకుండా) నిజం గా గొప్ప విషయం.

  5. “దిన కర్, ఖాండే కర్, ప్రతిభా రాయి, భైరప్ప వంటి రచయితలకి మహాభారతమే జ్ఞానపీఠ్ పురస్కారాన్ని సముపార్జించిందని చెప్పినా అతిశయోక్తి కాదు.”

    భైరప్పకు జ్ఞానపీఠం రాలేదు కదా?

  6. నిన్నటి మీ పోస్ట్ గురుస్థానం లో భీష్ముడి మాటలను ఉటంకించారు.
    “కఠినమైన సమయాలలో మౌనం ఒక ఆభరణం కాదు నిజం. భీముని లో నిజమైన విప్లవ కారున్ని పట్టుకోగలిగారు”.
    ఈ వాక్యాల దగ్గరే ఆగిపోయాను. భీముడి ప్రస్తావన ఇంతటితో ముగిసి పోలేదని అనిపించింది.
    ఎన్నో విధాలుగా కట్టడి చేసి సరియైన సమయంలో సరియైన విధంగా ఉపయోగించుకున్న చతురత శ్రీ కృష్ణ స్వామి కి కొంత చెందితే ,ధర్మజుని పాలు మరికొంత.

    టర్కీయులను ఆపత్సమయం లో ఆదుకున్న భారత ప్రభుత్వ ధీరోదాత్తత వెనుక సనాతనధర్మం విశిష్టత ఎంతో తెలిస్తే ఈ సూడో లౌకిక వాదుల ఆరోపణల్లో ని డొల్లతనం బయటపడు తుంది..

    ఏదైనా తగిన సమయం వచ్చినప్పుడే బయట పడుతుంది.

    ధన్యవాదాలు sir, వైవిధ్యభరిత భరితమైన సాహిత్యాన్ని పరిచయం చేస్తూ మాతో చదివిస్తున్నారు.

  7. 90 లలో ‘సెకండ్ టర్న్’ పేరుతో వచ్చినప్పుడు ఈ నవల చదివాను. దానికే భీమ అనే పేరు కూడా ఉంచారేమో గుర్తులేదు. శత్రుశేషం ఉంచకూడదన్న సిధ్ధాంతం మీద ఈ నవల సాగుతుంది. మీరు అనువదించిన భాగాలు బాగున్నాయి. మహాభారత ఇతివృత్తంతో వచ్చిన మంచి నవలల్లో ఇది ఒకటి.

    1. అదే ఇది మీరు సరిగానే పట్టుకున్నారు. శత్రుశేషం ఉండకూడదనే ఒక ఆటవిక న్యాయాన్ని భీముడు ఈ నవల పొడుగుతా ప్రస్తావిస్తాడు. ఆచరిస్తాడు.

  8. మహాభారతం మనల్ని ఎప్పటికీ వదలని చరిత్ర .ఈనాటి చరిత్రను అర్థం చేసుకోవాలన్నా మహాభారతంలో వెతుక్కోవాల్సిందే .
    సరైన భాగాలనే ఎన్నుకున్నారు మాకు రుచి చూపించడానికి .
    భైరప్ప కూడా భీముని వ్యక్తిత్వాన్ని చాలా నైపుణ్యంతో మలిచారు అనుకున్నా పర్వంలో.
    ధన్యవాదాలు సర్

  9. చాలా ఆసక్తిదాయకంగా వుంది..మీ అనువాదం చూశాక ఇది పదుగురికి మీ ద్వారా చెరవలసి వుంది అని అభిలాష గురువుగారు..

Leave a Reply

%d bloggers like this: