
ఈ సాయంకాలం నునువెచ్చని గాలి నన్ను పులకింపచేస్తోంది. మామూలుగా మాఘమాసపు తొలిసాయంకాలాల్లో పలకరించవలసిన గాలి. ఆలస్యంగానే వచ్చి ఉండవచ్చుగాని, ఆ పలకరింపులో అదే ఆప్యాయత. కొండకింద పల్లెల్లోనో, నది ఒడ్డున పట్టణాల్లోనో సాయంకాలాల్ని సంపద్వంతం చేసే గాలి. నిన్నెవరో ఎక్కడో తలుచుకుంటారని గుర్తు చేసే గాలి.
నిజంగానే విలువైన రోజు. నా బ్లాగుని ఇప్పటికి, ఈ క్షణానికి, 2,00,121 సార్లు చూసారని తెలుస్తోంది. కొత్త సినిమా పాట ఆడియో రిలీజయి వారం తిరక్కుండానే పది లక్షల సార్లు చూసే కాలంలో ఒక బ్లాగుకి అయిదేళ్ళ కాలంలో రెండులక్షల వ్యూస్ రావడం ఏమంత విశేషం కాకపోవచ్చు. కాని, ఈ లెక్కలు మరోలా పోల్చి చూసుకోవాలి. నా ‘పునర్యానం’ కావ్యం ఎమెస్కో సంస్థ 2004 లో అచ్చేసింది. 500 ప్రతులు. ఇరవయ్యేళ్ళ తరువాత కూడా ఇంకా వాళ్లదగ్గర గోడౌన్లో ఒకటో రెండో ప్రతులు ఉండకపోవు. నాలుగేళ్ళ కిందట నేను నా కవిత్వం ‘కొండమీద అతిథి’ పేరు మీద 500 ప్రతులు వేస్తే, 350 ప్రతుల పైగా ఇంకా తనదగ్గరే ఉన్నాయనీ వాటిని వెనక్కి తీసుకువెళ్ళిపొమ్మని అనల్ప బలరాం మొన్న ఫోన్ చేసి చెప్పాడు.
కాని ఈ రెండు లక్షల వ్యూస్ ని అనలైజ్ చేసి చూస్తే లెక్కలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంతవరకూ బ్లాగుని చూసిన రెండు లక్షల వ్యూస్ లోనూ, తొంభై వేల వ్యూస్ హోమ్ పేజీ దగ్గరే ఆగిపోయాయి అనుకుందాం. (అది సాధారణంగా ప్రతి బ్లాగరూ ఎదుర్కునే పరిస్థితినే). ఇంకా ఒక లక్షమంది బ్లాగులో అడుగుపెట్టారు కదా, చదివారు కదా, అది గమనించాలి. ఇప్పటిదాకా ప్రతి ఏటా సగటున పదివేలమంది ఈ బ్లాగు సందర్శిస్తున్నారు. ఈ రెండు నెలల్లోనే 7254 మంది చూసారు. అంటే రోజుకి దాదాపు 120 మంది! ఏ లెక్కన చూసినా ఒక రచయితకి ఇంతకన్నా సంతోషం కలిగించేది మరొకటి ఉండదు.
బ్లాగు చూస్తున్నవారిలో తెలుగు రాష్ట్రాల మిత్రులే కాదు, ప్రపంచవ్యాప్తంగా పాఠకులున్నారని కూడా వెబ్ సైట్ లెక్కలు చెప్తోంది. యునైటెడ్ స్టేట్స్, ఐర్లాండు, కెనడా, ఆస్ట్రేలియా, కువైట్, యుకె, దక్షిణ ఆఫ్రికా, చైనా, జర్మనీ, స్వీడన్, జపాన్, సింగపూర్, ఇటలీ, ఇస్రాయిల్, జమైకా, నైజీరియా వంటి దేశాలనుంచి రోజూ కనీసం ఒక్క సందర్శనేనా ఉంటోందనేది చాలా ఉత్సాహాన్నిచ్చే సంగతి.
ఇప్పటిదాకా పెట్టినవి మొత్తం 1074 పోస్టులు. నేను రాసిన పుస్తకాల్లో దాదాపు ఇరవై పుస్తకాలదాకా ఇక్కడ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడానికి పొందుపరిచాను. నా ప్రసంగాలు నా దగ్గర ఉన్నవన్నీ అందుబాటులో ఉంచాను. గీసిన బొమ్మలు కూడా చాలావరకు గాలరీలో పెట్టాను. వీటిని ఎంతోమంది మిత్రులు ప్రతిరోజూ చూస్తున్నారు, చదువుతున్నారంటే అంతకన్నా సంతోషకరమైన విషయం మరేముంటుంది?
కొందరు మిత్రులు ఆ రోజు పెట్టిన పోస్టు మాత్రమే కాక, అంతకు ముందు పోస్టులు కూడా ఎన్నోకొన్ని ప్రతిరోజూ తిరిగి తిరిగి చూస్తున్నారు. నేను ఫేస్ బుక్ లో నేరుగా పోస్టులు పెట్టకుండా బ్లాగులో పెట్టడానికి కారణం ఇదే. ఇక్కడ మనం చెప్పదలచుకున్న అంశాన్ని reader friendly format లో పంచుకోవచ్చు. అలాగే మిత్రులు ఏవైనా పాత పోస్టులు చదవాలనుకుంటే మెనూలోకి వెళ్ళి చూసుకోవచ్చు. లేదా ఏదైనా కీలక పదం సెర్చ్ బాక్సులో టైపు కొట్టి చూసుకోవచ్చు. ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్, ట్విట్టర్ లాంటి మీడియాలో సాధ్యం కానిది ఇదే.
ఒక ఒడియా స్నేహితురాలు నా పోస్టులు చూస్తున్నట్టు తెలుస్తుంటే ‘అవి తెలుగులో ఉండటం మీకు ఇబ్బందిగా లేదా’ అనడిగాను. ‘లేదు, కింద ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఉంది కదా, అనువాదం చేసుకుని చదువుతున్నాను’ అన్నారామె. ఒక మిత్రుడు నా మోహన రాగం ప్రసంగాలు ఎన్ని సార్లు విన్నానో చెప్పలేననీ, హేమంత ఋతువు మీదా, శరదృతువు మీదా మాట్లాడింది తనకి కంఠస్థమైపోయిందనీ అన్నాడు! ఒకవేళ నేను రాసిన పుస్తకాలన్నీ వాళ్ల అలమారుల్లో ఉన్నా కూడా ఈ సౌకర్యం ఉండదు. డిజిటల్ మాధ్యమం మనకి ఇచ్చిన మహత్తర అవకాశం ఇది.
ఆ మధ్య ఎవరో ‘మీ బ్లాగు టీమ్ కి నా అభినందనలు’ అన్నారు. ‘టీమ్ ఎక్కడ? నేనే నా సైన్యం’ అన్నాను. నాకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో కనీస పరిజ్ఞానం ఉన్నా ఈ బ్లాగుని ఇంతకన్నా సౌకర్యవంతంగా తీర్చిదిద్ది ఉందును. కాని ఈ బ్లాగు ఇలా ఉన్నదంటే అందుకు wordpress.com కే ధన్యవాదాలు చెప్పుకోవాలి.
ఈ బ్లాగు పోస్టులు మీకు నేరుగా ఈ మెయిల్ ద్వారా అందాలంటే మీరు http://www.chinaveerabhadrudu.in కి సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాకాక, మీ మెయిల్ బాక్స్ లో స్పేస్ సమస్య ఉంటే, మీరు చదవగానే ఆ పోస్టు డిలీట్ చేసుకోవచ్చు. లేదా నేరుగా ఫేస్ బుక్ లోంచే (నా వాల్ మీంచి గాని, లేదా నా కుటీరం పేజిలోంచి గాని బ్లాగులోకి ప్రవేశించవచ్చు. (చాలామంది మిత్రులు ఆ పనే చేస్తున్నారు).
మొదట్లో మిత్రులు కామెంట్లు పోస్ట్ చెయ్యడంలో ఇబ్బంది ఎదురయిందని చెప్పారు. వర్డ్ ప్రెస్ హెల్ప్ టీమ్ ఆ సమస్యని పరిష్కరించారు. మీరు ఫేస్ బుక్ లో లానే ఇక్కడ కూడా లైక్ కొట్టవచ్చు. మీ అభిప్రాయాలు ఎప్ప్పటికప్పుడు పంచుకోవచ్చు.
ఇప్పటివరకు ఎక్కువ సాహిత్యప్రశంసకే నా బ్లాగుని వినియోగిస్తూ వచ్చాను. రానున్న రోజుల్లో సృజనాత్మక సాహిత్యాన్ని కూడా ఈ వేదికద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎప్పటిలానే మీరు ఈ బ్లాగుని ఆదరిస్తారని నమ్ముతున్నాను.
ఇంతవివరంగా ఎందుకు రాసానంటే, ‘తెలుగులో చదివేవాళ్ళు లేరు, సాహిత్యం మీద ఆసక్తి సన్నగిల్లుతోంది’ లాంటి మాటలు తరచూ వింటున్నాం. కాని నా వరకూ నా బ్లాగు ఆ అభిప్రాయాలు తప్పని తెలియచేసింది. మానవుడు ఒకప్పుడు తన భావాలు పంచుకోడానికి మట్టి ఇటుకల మీద కూనిఫారం లిపిలో రాసేవాడు. ఆ తర్వాత తాళపత్రాలు. అయిదువందల ఏళ్ళ కిందట ప్రింటింగ్ ప్రెస్సు ప్రవేశించింది. ఇప్పుడు మనం సరికొత్త భావప్రసార మాధ్యమాల కాలంలో ఉన్నాం. ఈ మాధ్యమాల్ని సమర్థవంతంగా వినియోగించడం తెలుసుకోగలిగితే ప్రింటింగ్ ప్రెస్సు ద్వారా కన్నా కూడా ఎక్కువమంది పాఠకులకు అతి తక్కువ సమయంలో చేరువకాగలుతాం. మరింత సమర్థవంతంగా చేరువ కాగలుగుతాం.
నా బ్లాగు ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆదరణ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను.
22-2-2023
బ్లాగు..బాగు
Thank you
కంగ్రాట్స్ సర్
Thank you
గ్రేట్ సర్. శుభోదయం.
Thank you
బాగా చెప్పారు సర్
Thank you
సాహిత్య పఠనా పరంగా మీది “డుగ్గు డుగ్గనీ వచ్చేత్త పా” పాటలాంటిదే.అభినందనలు సర్.
Oh!
చాలా సంతోషం సర్.🙏
ఐదు లక్షలకు చేరుకుంటుంది త్వరలో..🌹❤️
నిజమైన శుభాకాంక్షలు!
మీ వరల్డ్ స్పేస్ రేడియో కాలం నుండి అన్నీ చదివాను..అద్భుతమైన రచనలు..ప్రసంగాలు..అనువాదాలు.. చిత్ర లేఖనం..తెలుగోడి అభిరుచికి శిఖరంలాంటి బ్లాగు.. మా అదృష్టం.. ఇవన్నీ ఉచితం..కృతజ్ఞతలు సర్
హృదయపూర్వక ధన్యవాదాలు!
అక్షరాలకి అందని భావాల్ని కూడా అందంగా అమర్చి అరటిపండు వొలిచి నట్టు అందిస్తుంటే లాప్టాప్ ముందు కూచుని తింటూ . ఆ రుచిని ఆస్వాదిస్తూ మీ మాటల్ని వింటున్న అనుభూతిని అనుభవిస్తున్నాం. అది కూడా లెక్కల్లో లైట్ హౌస్ లా వెలుగుతూందంటే అది మాటకి దక్కిన గౌరవం, మీ భావాలకి పూసిన పూల సౌరభం.
ఎంతో ప్రేమతో రాసిన ఈ మాటలకు హృదయపూర్వక ధన్యవాదాలు.